కథ కోసం త్రీడీనా? లేక త్రీడీకై కథ ఎంచుకున్నారా?
మీరే ఒక్క మాట చెప్పండి! మనం కథ డిమాండ్ చేసిందని కలర్‌కూ, సిక్స్ ట్రాక్ స్టీరియోకూ, డాల్బీకీ వెళ్ళామా? లేదుగా! మామూలు 2డి సినిమాను చూసినట్లు కాకుండా, నిజ జీవితంలో మన ఎదురుగా జరుగుతున్న ఘటనను రెండు కళ్ళతో చూస్తున్న అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించాలంటే 3డి అవసరం. 'ఓం - 3డి' సినిమాలో కూడా యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. త్రీడీ ద్వారా ఆ అంశాలను మరింత కనువిందుగా చూపే వీలు కలుగుతుంది. పైగా, భారత దేశంలో ఇప్పటి వరకు ఫ్యాంటసీలు, 'హాంటెడ్' లాంటి హారర్ చిత్రాలు వచ్చాయి. అయితే, చాలా సినిమాలను 2డిలోనే తీసి, 3డి ఫార్ముట్‌లోకి మార్చడం జరుగుతోంది. కానీ, 'ఓం' అలా కాదు. పూర్తిగా 3డి కెమేరాలోనే చిత్రీకరించిన సినిమా. భారతదేశంలోనే మొట్టమొదటి యాక్షన్ 3డి చిత్రమూ ఇదే!
కానీ, ఇటీవల సినిమాలను 2డిలో తీసి, 3డిలోకి మార్చేసి, 3డిలో తీశామని మభ్యపెట్టడం జరుగుతోంది!
అలాగని ఏ సినిమానూ నిందించలేం. ఇవాళ 3డి కెమేరా అంటేనే, ఎత్తు, వెడల్పుతో దాదాపు 50 కిలోల బరువుండే భోషాణం పెట్టె అంత ఉంటుంది. ఓ చిన్న కారులోనో, బాత్‌రూమ్‌లోనో ఒక షాట్ తీయాంటే, అంత పెద్ద కెమేరా అక్కడ పట్టను కూడా పట్టదు. కాబట్టి, ఆచరణాత్మక దృక్పథంతో, అలాంటి సందర్భాలలోని దృశ్యాలను 2డిలో చిత్రించి, ఆ పైన 3డి ఫార్మట్‌లోకి మార్చుకోక తప్పదు. కాబట్టి, 90 శాతం సినిమా 3డిలో తీసి, మిగిలిన దాన్ని 2డిలో తీసి, 3డిగా మార్చితే తప్పు లేదు. కానీ, 10 శాతమే 3డిలో తీసి, దాన్ని 3డి సినిమాగా ప్రచారం చేసుకోవడమే తప్పు.
జనాన్ని అంతగా ఆకర్షించే అంశాలు ఇందులో ఏమున్నాయి?
ఈ చిత్ర కథే ఓ హైలైట్. సినిమాలో ప్రతి పాత్రా బాగుంటుంది. ప్రతి పాత్రకూ కథలో ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో కార్తీక్, సురేశ్, సితార, సంపత్‌రాజ్, రావు రమేశ్ - ఇలా ప్రతి ఒక్కరూ కథ ముందుకు వెళ్ళడానికి ఉపకరించే పాత్రలను ధరించినవాళ్ళే. సాంకేతిక విభాగాల్లో అజయన్ విన్సెంట్ ఛాయాగ్రహణం, సునీల్‌రెడ్డి దర్శకత్వం, ఫైట్లు - అన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. ఈ చిత్రానికి, సాయికార్తీక్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. అతని పనితనం తెలుసుకుందామని ఒక థీమ్ సాంగ్ కొట్టివ్వమని అడిగాను. అది ఎంతో బాగుండడంతో, అబ్బురపడి, అతణ్ణే సంగీతానికి తీసుకున్నాం. మా ఆఫీసులోనే అన్ని ఏర్పాట్లూ పెట్టించి, దాదాపు రెండున్నర నెలల పాటు రీ-రికార్డింగ్ చేశాం. ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది - ఈ చిత్ర శబ్దగ్రహణం గురించి! గతంలో శంకర్ చిత్రాలు 'కాదలన్' (తెలుగులో 'ప్రేమికుడు'), 'కన్నత్తిల్ ముత్తమిట్టాల్' (తెలుగులో 'అమృత')కు జాతీయ అవార్డులు అందుకున్న చెన్నైలోని ఆడియోగ్రాఫర్ ఏ.ఎస్. లక్ష్మీనారాయణ దగ్గరకు సినిమా తీసుకువెళ్ళాం. 'శివాజీ', 'రంగం', 'తుపాకీ' తదితర చిత్రాలెన్నిటికో పని చేసిన దేశంలోని అత్యుత్తమ ఆడియోగ్రాఫర్లలో ఆయన ఒకరు. ఆయన సినిమా చూసి, ''దృశ్యపరంగా ఇంత బాగున్న ఈ అద్భుతమైన సినిమా''ను అత్యుత్తమ ఎక్విప్‌మెంట్ ఉన్న ఏ.ఆర్. రెహమాన్ స్టూడియోలో చేద్దామన్నారు. అక్కడే క్వాలిటీకి రాజీ పడకుండా 35 రోజులు మిక్సింగ్ చేశారు. మనవాళ్ళెవరి దగ్గరా లేని, అద్భుతమైన టెక్నిక్ ఆయన దగ్గర ఉందని తుది రూపం చూశాక నాకు అర్థమైంది. ఇలాంటి అత్యుత్తమ దృశ్య, సాంకేతిక నైపుణ్యాలెన్నో ఉన్న సినిమా 'ఓం'. మూడు ముక్కల్లో చెప్పాలంటే - ఇది ఎంతో ఎమోషనల్ చిత్రం, థ్రిల్‌కు గురి చేసే చిత్రం, విజువల్‌గా అద్భుతంగా ఉండే చిత్రం. ఆధునిక కాలానికి తగ్గట్లు ట్రెండీగా ఉండే సినిమా. కథను తరువాతి దశకు తీసుకువెళ్ళేందుకు, పాటలోనే కథ చెప్పే మూడు గీతాలు తప్ప, ఇందులో డ్రీమ్ సాంగ్స్ లాంటివి ఏమీ ఉండవు. చకచకా సాగిపోతూ, సరిగ్గా రెండు గంటల పాటు ఉత్కంఠగా సాగుతుంది.
ఇంత పెద్ద ప్రయత్నానికి మీకు ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉన్నదెవరు? నిరుత్సాహం కలిగినప్పుడల్లా మీకు దాన్ని దూరం చేసిందెవరు?
మా యూనిట్, నా కుటుంబం నా వెంట నిలిచారు. విందులు, వినోదాలంటూ నేను ఎక్కడికీ బయట తిరిగే రకం కాదు. భార్య, పిల్లలు, కుటుంబంతో నాకు ప్రగాఢమైన అనుబంధం. మా పిల్లలతో ఆడుకుంటే చాలు! ఎంతటి ఒత్తిడి అయినా నాకు దూరమవుతుంది. కానీ, 2, 3 నెలలుగా వాళ్ళతో ఆడుకోవడానికి కూడా కుదరడం లేదు. డిజిటల్ ఇంటర్మీడియట్ (డి.ఐ), డి.టి.ఎస్. లాంటి పనులతో నెలన్నర పైగా చెన్నైలోనే ఉన్నా. సినిమా రిలీజ్ కాగానే, మళ్ళీ పిల్లలతో గడపాలి.
అన్నట్లు ఈ సినిమాకు మీ అమ్మాయి నందమూరి తారక అద్విత పేరు నిర్మాతగా వేస్తున్నట్లున్నారు. కారణం?
ఎందుకో నాకు అదో సెంటిమెంట్ అనిపించింది. మా నందమూరి కుటుంబంలో తాతగారి తర్వాత దాదాపు 54 మంది పుట్టారు. కానీ, సరిగ్గా ఆయన పుట్టిన మే 28వ తేదీన ఎవరూ పుట్టలేదు. మా అమ్మాయి అద్విత 2010 మే 28న జన్మించింది. అందుకే, మా తాత గారి పేరు మీద ఉన్న మా సంస్థ నిర్మిస్తున్న ఈ పదో సినిమాకు ఆయన రూపంగా పుట్టిన మా అమ్మాయి పేరు వేస్తున్నా.
అయితే, ఇక మీ అబ్బాయి శౌర్యరామ్‌ను సినిమా హీరోను చేస్తారా?
వాడికిప్పుడు అయిదేళ్ళు. పెద్దయ్యాక ఏమవుతాడో ఏం చెప్పగలం. నవ తరం పిల్లలకు తమ జీవితం గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. నన్ను నటుణ్ణి కావాల్సిందని ఎవరూ చెప్పలేదు. మా వాళ్ళెవరూ నన్ను ప్రభావితం చేయలేదు. నా ఇష్టంతో నేను వచ్చాను. ఏ పని చేసినా, మనకు తృప్తినివ్వడం ముఖ్యం!
3డి సినిమాలకు ప్రేక్షకులున్నారు సరే! అన్ని థియేటర్లు లేవు కదా!
'ఓం' నిర్మాణ ఆరంభ సమయం నాటికి రాష్ట్రంలో దాదాపు 20కి మించి త్రీడీ థియేటర్లు లేవు. కానీ, అదృష్టవశాత్తూ ఇవాళ వాటి సంఖ్య దాదాపు 65కు పెరిగింది. మా సినిమా రిలీజ్ లోపు మరో 5 హాళ్ళు త్రీడీ ప్రదర్శనకు అనువుగా మారే అవకాశముంది. త్రీడీ ప్రొజెక్టర్లు నెలకు రూ. 45 వేలకు అద్దెకు దొరుకుతున్నాయి. అలా నేను ఓ 35 హాళ్ళకు త్రీడీ పెట్టించాలని ప్లాన్ కూడా చేశాను. అయితే, ఈ త్రీడీ చిత్రాల ప్రొజెక్షన్‌కు 'సిల్వర్ స్క్రీన్' కావాలి. ఒక్కో స్క్రీన్ 6 నుంచి 7 లక్షలు అవుతుంది. అవి అద్దెకు లేవు. లేదంటే, బ్రహ్మాండంగా మరిన్ని హాళ్ళలో త్రీడీ పెట్టేవాణ్ణి. ఏమైనా, మిగతా చోట్ల 2డి వెర్షన్ రిలీజ్ చేస్తాం.
ఈ 'ఓం' చిత్ర నిర్మాణానికి చాలా కాలమే పట్టినట్లుందే!

2010 డిసెంబర్ నుంచి 2011 నవంబర్ దాకా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశాం. త్రీడీ కెమేరాలు ఎక్కడెక్కడ, ఏమేమి ఉన్నాయి, మనకు ఏది పనికొస్తుంది లాంటివన్నీ దాదాపు రిసెర్చ్ చేశాం. అవన్నీ ముగించుకొన్నాక అప్పుడు సెట్స్ మీదకు వెళ్ళాం. మొత్తం 120 రోజులు షూటింగ్ చేశాం. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు చాలా నెలలు పట్టింది. అలా దాదాపు రెండున్నరేళ్ళ శ్రమ - ఈ చిత్రం వెనుక ఉంది. కొత్త టెక్నాలజీతో, క్వాలిటీగా సినిమా అందించాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. సినిమా హాలుకు వచ్చినవారి నెవరినీ 'ఓం' నిరాశపరచదు. మళ్ళీ చెబుతున్నా! హాలీవుడ్ స్థాయిలో ఉండే సినిమా ఇది. అందుకు నేను హామీ! సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ సినిమా చూసి, మెచ్చుకున్నారు.
తమిళంలో ధనుష్‌తో తీయడానికి చర్చలు చేస్తున్నారట!
(నవ్వేస్తూ...) రజనీకాంత్ గారు ఈ సినిమా చూశారు. ''టెక్నికల్‌గా ఓ అద్భుతం ఈ సినిమా. ఈ సినిమాతో తెలుగువాళ్ళు గర్వించేలా చేస్తావు!'' అని ఆయన అన్నారు. మాతో దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు. అంత పెద్ద సూపర్‌స్టార్ అలా అనడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక, తమిళంలో రీమేక్ సంగతంటారా... ఇప్పుడే ఏమీ చెప్పలేను. గాలిలో మేడలు కట్టడం నా లక్షణం కాదు. చూద్దాం! ఏం జరుగుతుందో! నిర్ణయమయ్యాక తప్పకుండా చెబుతాను.
'ఓం' తరువాత మీ తదుపరి ప్రణాళికల మాటేమిటి?
నాకే తెలియదు. అంతా 19న 'ఓం' విడుదల తరువాతే!
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 15 జూలై 2013)
...............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment