జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, April 13, 2011

విశిష్ట వాచికమే వశీకరణ మంత్రం



నటులు చాలా మంది ఉంటారు. కానీ, ఆంగికం, వాచికం, ఆహార్యం - మూడింటితో మెప్పించే అభినయవిదులు మాత్రం కొందరే ఉంటారు. 1970లలో తెలుగు చిత్రసీమలో ప్రవేశించిన నటులలో ఈ మూడింటిలోనూ దిట్టగా కనిపించిన కొద్దిమందిలో ఒకరిగా నూతన్‌ ప్రసాద్‌ ఓ చిరకాల జ్ఞాపకం. కథానాయక పాత్రల దగ్గర నుంచి కామెడీ పాత్రలు, క్యారెక్టర్‌ పాత్రల వరకు ఏ వేషం కట్టినా, దాన్ని తనదిగా చేసుకొని సొంత ముద్ర వేయడం, మనిషి చూపులో, మాట విరుపులో విలక్షణత చూపడం 'నూతన్‌ ప్రసాద్‌'గా స్థిరపడ్డ తాడినాడ వరప్రసాద్‌లోని విశిష్టత. అనారోగ్యంతో గతనెల 30 వ తేదీన నూతన్‌ ప్రసాద్‌ కన్నుమూయడంతో తెలుగు సినీ రంగంలోని గుణచిత్ర నటుల చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది.

నిజానికి, నూతన్‌ ప్రసాద్‌ పెద్ద ఇంట్లో పుట్టి, వెనుక ఉన్న అండదండలతో సినీ రంగంలోకి నడిచొచ్చిన వాడు కాదు. ఆ మాటకొస్తే నటన కూడా ఆయనకు యాదృచ్ఛికంగా ఒంటబట్టినదే! చిన్నతనంలో బడికి వెళుతున్నప్పుడు ఊళ్ళో ఓ పౌరాణిక నాటక సమాజం వారి రిహార్సల్సు చూసీ చూసీ, పద్యాలు వినీ వినీ అనుకోకుండా అర్జునుడి పాత్ర పోషించడంతో ఆయన రంగస్థల జీవితం ఆరంభమైంది.

నూతన్‌ ప్రసాద్‌ అసలు పేరు - దుర్గా సత్యవరప్రసాద్‌. స్వస్థలం - కృష్ణాజిల్లా కైకలూరు. తాడినాడ సుబ్బారావు, శ్యామలాంబ దంపతులకు 1945 డిసెంబర్‌ 12న జన్మించిన వరప్రసాద్‌ చదువుకున్నది కూడా అంతంత మాత్రమే. ఐ.టి.ఐ. పూర్తి చేసినా, నాటకాల మీద ఆసక్తితో అటువైపు నడిచారాయన. ఆయన తండ్రి కైకలూరులోని సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారట! ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో తల్లి నిత్యం కుట్టుమిషన్‌ మీద పనిచేస్తూ, దుస్తులు కుడుతూ కుటుంబ భారాన్ని మోసేవారు. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకు కైకలూరులో చదివి, 1965లో మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో ఐ.టి.ఐ. పూర్తి చేశారు.

నాటకాల నుంచి సినిమాల్లోకి...

1966లో పి.డబ్ల్యు.డి.లో చిరుద్యోగిగా మొదలైన వరప్రసాద్‌ ఆ తరువాత హైదరాబాద్‌లోని 'హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌' (హెచ్‌.ఏ.ఎల్‌)లో చేరారు. అక్కడ సహోద్యోగి, ప్రముఖ రంగస్థల నటుడు భానుప్రకాశ్‌ నిర్వహిస్తున్న 'కళారాధన' నాటక సంస్థలో చేరి, ఎన్నో నాటకాలు వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలిచ్చి, ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకున్నారు. 'రాగరాగిణి', 'గాలివాన', ఏ.ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి 'మాలపల్లి' నవల నాటకరూపం - ఇలా ఎన్నో నాటకాల్లో ఆయన పాత్రపోషణ అందరినీ ఆకట్టుకుంది. ''పాతికేళ్ళ వయస్సులో 'గాలివాన' నాటకంలో 65 ఏళ్ళ వృద్ధుడి పాత్ర పోషించి ఉత్తమ నటుడి అవార్డు పొందిన ప్రతిభ ఆయన సొంతం'' అని రంగస్థల ప్రదర్శనలతోనే సినీ నటుడిగా ఎదిగిన ప్రముఖ నట - నిర్మాత మురళీమోహన్‌ గుర్తు చేసుకున్నారు.

రాళ్ళపల్లి, పరుచూరి బ్రదర్స్‌, కోట శ్రీనివాసరావు లాంటి నాటి రంగస్థల, నేటి సినీ రంగ ప్రముఖులకు ఆ నాటకాల రోజుల నుంచే వరప్రసాద్‌ సుపరిచితుడు. 1971 ప్రాంతంలో విజయవాడలోని నాటకపోటీల్లో ఏకకాలంలో అటు గంభీరమైన 'గాలివాన' నాటకంలోనూ, ఇటు 'పైడిరాజు' అనే హాస్య నాటికలోనూ పరస్పర విభిన్నమైన పాత్రల్లో వరప్రసాద్‌ చూపిన ఉత్తమ నటనకు ఆకర్షితులైన రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి ఆయనను తెలుగు సినీ రంగంలోని తెలిసినవారికి పరిచయం చేశారు.

కొత్తవాళ్ళతో నిర్మిస్తున్న 'నీడలేని ఆడది' (1974)తో ఆయన కెమేరా ముందుకు వచ్చారు. అయితే, దాని కన్నా ముందే బాపు - రమణల 'అందాల రాముడు' (1973) ఆయనను సినీ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. వెండితెరపై వరప్రసాద్‌ ఆవిర్భావం జరిగింది. ఆ తరువాత 'ముత్యాల ముగ్గు' (1975)లో నిత్య పెళ్ళికొడుకు పాత్రతో మెప్పించారు. 'కల్పన', 'ఊరుమ్మడి బ్రతుకులు' చిత్రాల్లో నటించారు. అయితే, ప్రతిభకు తగ్గట్లుగా ఆశించినన్ని సినిమా అవకాశాలు రాని పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు ఆయన మద్యానికి బానిసగా మిగిలిపోయారు. ఆనక, తల్లి, భార్య తదితరుల అనునయంతో, ఆ అలవాటు నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే కొద్ది రోజులకే వచ్చిన 'చలిచీమలు' (1978) అవకాశంతో సరికొత్త నటుడిగా, 'నూతన్‌ ప్రసాద్‌' అనే కొత్త పేరుతో తిరిగి విజృంభించారు.

నిత్య నూతన వాచికాభినయ వరప్రసాద్‌

'ప్రెసిడెంట్‌ పేరమ్మ' (1979), 'తాతయ్య ప్రేమలీలలు' (1980), 'అమ్మ మనసు' లాంటి చిత్రాల్లో నాయక పాత్రధారిగా అలరించిన నూతన్‌ ప్రసాద్‌ది విశిష్టమైన వాచికం. మాటలోని స్పష్టత, స్వచ్ఛత, డైలాగును చెబుతున్నట్లుగా కాకుండా ఆ పాత్రే ప్రవర్తిస్తున్నట్లుగా విరుపులతో కొత్త అందం తీసుకురావడం, వ్యంగ్యం మిళాయించిన విలనీ ఆయనను విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. 'చలిచీమలు' చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ రాసిన ''నూటొక్క జిల్లాలకు అందగాణ్ణి'' అనే డైలాగు నూతన్‌ నోట తెలుగు నాట చిరంజీవిగా మారిపోయింది. ఆ చిత్రంతో వచ్చిన గుర్తింపు ఆయనను వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం లేకుండా చేసింది. ప్రాథమికంగా రంగస్థలం మీద నుంచి కెమేరా ముందుకు రావడం వల్ల నూతన్‌ ప్రసాద్‌ ఎంత నిడివి గల సంభాషణలనైనా, అలవోకగా గుర్తుంచుకొని, సింగిల్‌ టేక్‌లో షాట్‌ ఓ.కె. చేసేవారు.

మహాభారత పౌరాణిక గాథను నేటి ఎన్నికల భారతావనికి వర్తింపజేస్తూ రూపొందిన 'కలియుగ మహాభారతం' (1979) చిత్రంలో రారాజు పాత్రలో నూతన్‌ ప్రసాద్‌ మెప్పించారు. ఆ పాత్రకు ఆయన చెప్పిన డైలాగుల గురించి జనం అప్పట్లో చెప్పుకున్నారు. చిత్రం నిడివిని పెంచడం కోసం ఆ పాత్రకు ఆఖరి నిమిషంలో రాసిన సుదీర్ఘమైన సంభాషణల్ని ఆయన అద్భుతంగా పండించారు. 'కుడి ఎడమైతే?' (1979) చిత్రంలో 450 అడుగుల షాట్‌ను ఆయన సింగిల్‌ టేక్‌లో చేసేశారనీ, అలాగే 'షోకిల్లా రాయుడు' సినిమాలో 786 అడుగుల షాట్‌ కూడా ఆయన అలా సింగిల్‌ టేక్‌లో చేసినదేననీ ఆ నాటి సినిమా సంగతులు తెలిసినవారు చెప్పేమాట.

'రాజాధిరాజు' (1980) చిత్రంలో సైతాను వేషంలో ఆయన ఆహార్యం, ఆంగికం, ''శిశువా!'' అంటూ ప్రత్యేక తరహా వాచికం ఆ పాత్రను చిరస్మరణీయంగా మార్చాయి. ఆ సినిమాలో ''కొత్తా దేవుడండీ! కొంగొత్తా దేవుడండీ! ఇతడే దిక్కని మొక్కనివారికి దిక్కూ మొక్కూ లేదండండీ! రాండి! రాండి! శిశువా!...'' అంటూ నూతన్‌ ప్రసాద్‌ ధరించిన సైతాను పాత్రపై వచ్చే పాట అప్పట్లో సామాన్య జనంలో కూడా ప్రాచుర్యం పొందింది. ఇక, 'పట్నం వచ్చిన పతివ్రతలు' (1982) చిత్రంలో నూతన్‌ పలికిన ''దేశం చాలా క్లి...ష్ట పరిస్థితుల్లో ఉంది'' డైలాగు ఆ నాటి నుంచి ఈనాటి వరకూ నిత్యనూతనమే.

తెలిసిన మనిషిలో తెలియని సంగతులు

చాలామందికి తెలియనిదేమిటంటే - 'ఈలపాట'లో వరప్రసాద్‌ సిద్ధహస్తుడు. హైదరాబాద్‌, తదితర ప్రాంతాల్లో ఆయన దాదాపు 50 పై చిలుకు సార్లు 'ఈలపాట' ప్రదర్శనలిచ్చారు. అలాగే, సినిమాల్లోకి వచ్చాక నూతన్‌ ప్రసాద్‌ ప్రభ వెలిగిపోతున్న సందర్భాన్నే సర్వసాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, కెమేరా ముందు ఆ స్థాయి నటన చూపడానికి మునుపే, రంగస్థలంపై ఆయన ఎంతటి విశ్వరూపం దాల్చేవారో, ఎన్ని వందల ప్రదర్శనల్లో నటుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారో ఈ తరంలో కొద్దిమందికే తెలుసు. మంచి సినిమాల పట్ల అభిరుచి ఉన్న నూతన్‌ ప్రసాద్‌ చిత్ర నిర్మాణంలోనూ దాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నించారు. 'పవన్‌ ఇంటర్నేషనల్‌' పతాకంపై ఆయన సమర్పకుడిగా వచ్చిన 'ఓ అమ్మ కథ' (1981) వాణిజ్య విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలను అందుకొంది. 'మృణాల్‌సేన్‌' తదితర ప్రసిద్ధ వాస్తవిక చిత్ర దర్శకుల ఫక్కీలో ఆ సినిమాకు దర్శకుడు పేరాల సుబ్రహ్మణ్యం పేరును 'వసంత్‌ సేన్‌'గా మార్చడం ఓ గమ్మత్తు!

ఏ వేషం కట్టినా, దాన్ని తెర మీది కథలోని పాత్రగా కాక, వాస్తవ జీవితంలో నుంచి నడిచొచ్చిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నూతన్‌ ప్రసాద్‌ తపించేవారు. అందుకే, ఆయన ఏ పాత్ర వేసినా దానిలో సమాజంలోని ఆ యా వర్గాల వ్యక్తుల ప్రవర్తన, చిత్రమైన మ్యానరిజమ్‌లను కలగలిపేవారు. ఆ మేరకు సాధ్యమైనంత వరకు ఆ పాత్రలో వాస్తవికతను రంగరించేవారు. ''పదిమందిని ఏడిపించడం కన్నా, పదిమందినీ నవ్వించడం మంచిది కదా!'' అని చెబుతూ వచ్చిన నూతన్‌ ప్రసాద్‌ విలనీలో కూడా తనదైన శైలిలో వ్యంగ్యాన్ని దట్టించేవారు. సంభాషణల ఉచ్ఛారణలో తనకున్న అపారమైన బలంతో ఏ పాత్రకైనా కొత్త రంగు, రుచి, వాసన అద్దేవారు. తల్లి ఎంతో కష్టపడి తమను పోషించిన తీరు ఆయనకు ఎప్పటికీ గుర్తే. ''ఆ కుట్టు మిషన్‌ శబ్దాలు నేనెప్పటికీ మర్చిపోలేను'' అనేవారాయన. నటుడిగా స్థిరపడ్డాక తల్లిని మరింత సుఖంగా, ప్రాణప్రదంగా చూసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన మనస్సులోని సెంటిమెంట్‌కు నిదర్శనం.

ఒకసారి మనస్సుకు దగ్గరై, తనకు ప్రేమ పాత్రుడైన వ్యక్తిని చిరకాలం ప్రేమించడం కూడా నూతన్‌ ప్రసాద్‌ లక్షణం. 'చలిచీమలు' తరువాత వేషాల కోసం మద్రాసులో తిరుగుతూ, లాడ్జీలో అవస్థలు పడుతున్నప్పుడు బాపు - రమణలు ఏడాది పాటు తమ ఆఫీసులో ఆశ్రయం ఇచ్చిన సంగతిని ఆయన ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా చెబుతుండేవారు. అలాగే, నటుడిగా సక్సెసయ్యాక తాను కూడా రచయితలు పరుచూరి బ్రదర్స్‌కు అలాంటి అండదండలే ఇచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ళు తమ ఇంటి మేడ మీద స్థానం కల్పించారు.

ఆత్మవిశ్వాసానికి అసలైన ప్రతీక

బామ్మ మాట - బంగారు బాట' (1989) చిత్రం షూటింగ్‌లో ప్రమాదానికి గురై, నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైనా, ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పరుచూరి బ్రదర్స్‌ లాంటి రచయితలు తన కోసం ప్రత్యేకంగా రాసిన న్యాయమూర్తి, దెబ్బతిన్న సైనికాధికారి లాంటి పాత్రలను కేవలం వాచికంతో, ముఖకవళికలతో మెప్పించారు. వాచికంలోని తన విశిష్టతను టీవీ కార్యక్రమాల వ్యాఖ్యానానికి వినియోగించారు. ఉపగ్రహ తెలుగు టి.వి. చానల్‌ 'ఈ' టి.వి.తో మొదటి నుంచి అనుబంధం ఉన్న నూతన్‌ ప్రసాద్‌ మహామహుల నటనా వైదుష్యాన్ని విశ్లేషించే 'హ్యాట్సాఫ్‌' కార్యక్రమంతో సహా కొన్ని టీవీ షోలకు యాంకర్‌గానూ వ్యవహరించారు. 'నేరాలు - ఘోరాలు' లాంటి కార్యక్రమాలకు ఆయన మాట ఊపిరి అయింది.

నిజానికి, సినిమాల్లోకి రాకముందే ఆయన టీవీలో నటించారు. అప్పట్లో దూరదర్శన్‌లో ప్రసారమైన 'పండగొచ్చింది' నాటికలో ఇంటల్లుడి పాత్ర పోషించారని కొద్దిమందికే తెలుసు. హీరో కృష్ణ రూపొందించిన 'సింహాసనం' (1986) చిత్రం తెలుగు రూపంలో హిందీ నటుడు అమ్జాద్‌ ఖాన్‌కు గళదానం చేసిన నూతన్‌ ప్రసాద్‌, 'ఆయనకు ఇద్దరు' చిత్రంలో గుమ్మడికీ డబ్బింగ్‌ చెప్పారు. దాదాపు 475 చిత్రాల్లో నటించిన నూతన్‌ ప్రసాద్‌ అనేక అవార్డులు అందుకున్నారు. 'సుందరి - సుబ్బారావు' (1984)లో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు పొందారు. 'ప్రజాస్వామ్యం' (1987), 'నవభారతం' (1988), 'వసుంధర' చిత్రాల్లోని నటన కూడా ఆయన ఇంటికి 'నందు'లను నడిపించుకొచ్చింది. అలాగే, 'గాజుపూలు' టీవీ సీరియల్‌కు సైతం ఆయన 'నంది' అవార్డు అందుకున్నారు. 2000లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

ఆఖరి వరకు అలుపెరుగని కళాసేవ

చివరి రోజుల వరకు తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికే నూతన్‌ ప్రసాద్‌ ప్రయత్నించారు. ''మేము నాటకం వేస్తున్నామని తెలిస్తే చాలు, ఇవాళ్టికీ చక్రాల కుర్చీలో సభకు వచ్చి, ప్రదర్శన చూసి, అభినందించే అరుదైన నాటక ప్రియుడు ఆయన'' అని రంగస్థల ప్రదర్శనలతోనే సినీ రంగానికి ఎదిగిన మరో సీనియర్‌ నటుడు రాళ్ళపల్లి గద్గదస్వరంతో నూతన్‌ ప్రసాద్‌ను గుర్తు చేసుకున్నారు. 'తెలుగుదేశం పార్టీ'కి సన్నిహితంగా మెలిగిన నూతన్‌ప్రసాద్‌ శారీరక వైకల్యం వచ్చి పడ్డ తరువాతి కాలంలోనే హైదరాబాద్‌లోని రంగస్థల వేదిక 'రవీంద్రభారతి'కి కార్యదర్శిగా ప్రభుత్వ పక్షాన నియమితులయ్యారు. ఆ హోదాలోనూ తనదైన కళాసేవను కొనసాగించారు.

ప్రముఖ చిత్రకారుడు - దర్శకుడు బాపు చేత శృంగార, హాస్య, కరుణాది నవరసాలకూ వర్ణచిత్రాలు వేయించి, ఆ నవరసాల చిత్ర మాలికను రవీంద్రభారతిలో పెట్టించారు. ఇవాళ ఆ నవరసాల చిత్రమాలిక రాష్ట్రంలోని అనేక ప్రాంగణాల్లో వెలసి, కళాప్రియులను అలరిస్తోందంటే దానికి నూతన్‌ ప్రసాద్‌ ప్రయత్నమే కారణమని చెప్పక తప్పదు. అలాగే, భారతీయ శాస్త్రీయ నృత్య రీతులను పరిచయం చేసే వర్ణచిత్రాలను గీయించి, 1973 జూన్‌ 10న ప్రమీలతో వివాహమైన నూతన్‌ ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వాళ్ళబ్బాయి నూతన్‌ కుమార్‌ అనే పేరుతో వెండితెరకు పరిచయమై, 'సాంబ', 'సోగ్గాడు' లాంటి చిత్రాల్లో నటించారు. అబ్బాయిని మంచి నటుడిగా చూడాలని నూతన్‌ ప్రసాద్‌ కలలు కన్నారు. ఆ కలలు పూర్తిగా ఫలించకుండానే కన్నుమూశారు.

చాలాకాలంగా, పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించకపోయినా, ఇవాళ్టికీ ప్రేక్షకులకు నూతన్‌ ప్రసాద్‌ గుర్తుండిపోవడం ఆయన మునుపు పోషించిన పాత్రల చిరస్మరణీయతకు చిహ్నం. సినిమా నటుడిగా ఆయన ప్రభ వెలిగింది గట్టిగా ఓ దశాబ్దమే అయినా, ఆయన గురించి జనం చెప్పుకోవడానికి ఆ పాత్రలే కారణం. అందుకే, 1960ల చివర నుంచీ నూతన్‌ ప్రసాద్‌తో స్నేహం ఉన్న మరో నటుడు కోట శ్రీనివాసరావు చెప్పినట్లు, 'తనకంటూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకొని, తనదైన ఓ దశాబ్దాన్ని లిఖించుకున్న నటుడు - నూతన్‌ ప్రసాద్‌'. 1970ల ద్వితీయార్ధం నుంచి 1980ల చివరి వరకు తెలుగు సినిమా చరిత్ర రాస్తే - ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన విశిష్ట నటుడిగా నూతన్‌ ప్రసాద్‌ది నిత్య నూతన చరిత్ర. నటన పట్ల అంకితభావం, నిజాయతీ ఉన్న ఆయనకు కళాంజలి!

Sunday, April 3, 2011

సెంటిమెంట్ నిలిచింది... నమ్మకం గెలిచింది... వరల్డ్ కప్ నా వల్లే వచ్చింది...





బహుశా భారతదేశంలో 121 కోట్లమందికే కాదు, ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భారతీయ సంతతికి కూడా ఇది ఓ ఆనందభరిత క్షణం. దాదాపు 28 ఏళ్ళ తరువాత దేశ ప్రజల కల, దాదాపు 21 ఏళ్ళుగా సచిన్ టెండూల్కర్ స్వప్నం నిజమైన క్షణం. విశ్వవిజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచిన క్షణం. 2011 ఐ.సి.సి. వరల్డ్ క్రికెట్ కప్ ను మన జట్టు గెలుచుకున్న గర్వకారణమైన క్షణం. 1983 నాటికి ఊహ తెలియకపోయినా, ఆ తరువాత బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్, షార్జా కప్, ఆసియా కప్ ల మీదుగా భారత క్రికెట్ ను ఆసక్తిగా చూస్తూ వస్తున్న నాకు ఇవాళ ఓ ఉద్విగ్నపరిస్థితి. అయితే, కలసికట్టుగా కష్టపడితే ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా ఎలా బయటపడవచ్చో ఇవాళ మన జట్టు మరోసారి నిరూపించింది.


ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు దేశంలోని కొన్ని కోట్ల మంది భారతీయ క్రీడాభిమానుల లాగానే నేను కూడా మునుపెన్నడూ లేనంత ఉద్విగ్నతకు గురయ్యాను. నిజం చెప్పద్దూ.... ఒకానొక దశలో టెన్షన్ భరించలేక టీవీ కాసేపు ఆపేశా. కాసేపైన తరువాత మనవాళ్ళు పరుగుల లక్ష్య సాధనలో మరికొంత ముందుకు వెళ్ళాక అప్పుడు టీవీ పెట్టి చూడవచ్చులే అనుకున్నా. అలాగే చేశా, చూశా. నేను అనుకున్నట్లుగానే వికెట్లు పడడం ఆగి, మనవాళ్ళు లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళడం జరిగింది. దాంతో, అదో సెంటిమెంట్ గా మారి, మ్యాచ్ అంతా అదే పద్ధతిలో టీవీ కాసేపు ఆపడం, మళ్ళీ పెట్టడం అనే కలిసొచ్చిన సెంటిమెంట్ పద్ధతిలోనే చూశాను. చివరకు మనం గెలిచాం. భారత జట్టు సమష్టి కృషే కాదు, ధోనీ కెప్టెన్సీయే కాదు, నా లాంటి కోట్లాది అభిమానులు పాటించిన ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఇవాళ మన జట్టు గెలవడానికి కారణం. ఈ మాటను చాలా మంది కొట్టిపారేయవచ్చు. కానీ, అంతకంతమందికి నా లాంటి సెంటిమెంట్లు ఉంటాయనీ, వాటిని పాటించడం వల్లే మనం కప్పు గెలిచామని వారు ఏకీభవిస్తారనీ అనడంలో నాకు సందేహం లేదు. ఇది పిచ్చి వాదనే కావచ్చు, తర్కానికి నిలవకపోవచ్చు. కానీ, నమ్మకాన్ని మించినది లేదు కదా.

శ్రీలంక బ్యాటింగ్ ముగిసి, 275 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన తరువాత, మన వాళ్ళు బ్యాటింగ్ కు దిగే లోపల ఓ మిత్రుడు కమ్ జర్నలిస్టు నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని అడిగాడు. ఇంట్లో టీవీలో మ్యాచ్ చూస్తున్నానని చెప్పా. ఏం రెండో లడ్డూ తినాలని అత్యాశగా ఉందా అన్నాడు. అదేమిటన్నా. పాక్ తో మనవాళ్ళు అనూహ్యంగా గెల్చి, మనతో ఓ లడ్డు తినిపించారు. మళ్లీ ఈ రోజు ఈ 275 పరుగుల లక్ష్యం ఛేదించి, గెలుస్తారని కల కనకు. అన్ని సార్లూ అద్భుతాలు జరగవు అన్నాడు. అసలే శ్రీలంక ఆఖరి 5 ఓవర్ల పవర్ ప్లేలో చేసిన బ్యాటింగ్ దాడి చూసి, బిత్తరపోయి ఉన్న నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రెట్టించి అతను అడిగేసరికి, ఏమనాలో తెలియక - ఏమో గుర్రం ఎగరావచ్చు - అని అపనమ్మకం నిండిన స్వరంతో నమ్మకాన్ని ధ్వనించా. ఆఖరికి నేను అన్నట్లే జరిగింది. సెహ్వాగ్, సచిన్లు బ్యాటింగ్లో విఫలమైనా, గంభీర్, ధోనీల సమయోచిత బ్యాటింగ్తో చివరకు మన జట్టు గెలిచింది. అవును. గుర్రం ఎగిరింది.

కప్పు గెలవగానే నేను వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న మా అమ్మతో, మా అన్నయ్యతో అందరితో ఎస్టీడీలు చేసి మరీ ఆనందం పంచుకున్నా. మా ఇంట్లో టీవీ వాల్యూమ్ గట్టిగా పెట్టి, పిల్లలతో కలసి డ్యాన్సులు చేశా. మేడ మీది నుంచి వీధిలోకి చూస్తూ అరిచా. ప్రపంచంలోని శతాధిక భారతీయులతో నేనూ గొంతు కలిపా. ఈ ప్రపంచ కప్ తో భారతదేశంలోని సమస్యలేవీ తీరకపోవచ్చు. మన జీవితం ఒక్క కప్పుతో మారకపోవచ్చు. కానీ, జాతి మొత్తం జయహో అనే క్షణాలు చాలా కొద్దిగా వస్తాయి. రకరకాల విభేదాలు, అంతరాలు, కుమ్ములాటలతో కుంగిపోతున్న నవ భారతావనికి ఇప్పుడు సరికొత్త స్ఫూర్తిప్రదాతలు దొరికారు. క్రీడల్లోనే కాదు, జీవితంలోనూ ఇవాళ మనకు ఇలాంటి స్ఫూర్తిదాతలు, గర్వకారకులు ఎంతైనా అవసరం. అందుకే, ఈ మన విజయం జీవిత కాలంలో ఓ చిరస్మరణీయ జ్ఞాపకం. భారత జట్టుకే కాదు, మనం గెలవాలనీ, గెలుస్తామనీ నమ్మిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.


(బ్లాగు మిత్రులందరికీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వేజనా : సుఖినో భవన్తు... సమస్త సన్మంగళాని భవన్తు).