జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, February 11, 2016

అందుకే ఇన్నాళ్లు గుర్తింపుతో ఉన్నాం - సీనియర్‌ నటి జమున




‘‘గడిచిన రోజులు ఎంతో మంచివి. హెచ.ఎమ్‌. రెడ్డి, బి.ఎన,రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి దర్శకులు నాలాంటి వారిని నాయికలుగా తీర్చిదిద్ది, వైవిధ్యమైన పాత్రలిచ్చి ప్రొత్సహించారు కాబట్టే తెలుగు పరిశ్రమలో ఇన్నాళ్లు మంచి గుర్తింపుతో ఉండగలిగాం. అలనాటి దర్శకులను స్ఫూర్తిగా తీసుకుంటే ఇప్పుడొస్తున్న యువ దర్శకులు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు’’ అని సీనియర్‌ నటి జమున అన్నారు.

 తెలుగు సినిమా పుట్టినరోజు వేడుక కళామంజూష కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ నటీమణులు కృష్ణవేణి, జమున, గీతాంజలి, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె. రాఘవ, గాయని రావు బాలసరస్వతి, రావి కొండలరావు, కాకరాల వెంకట సత్యనారాయణ, రెంటాల జయదేవలను జ్ఞాపికలతో సత్కరించారు. 

‘‘1935లో ‘సతీ అనసూయ’తో నన్ను బాలనటిగా పరిచయం చేసిన సి.పులయ్యగారిని ఎప్పటికీ మరువలేను. నటిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో నాకెన్నో మంచి అనుభవాలున్నాయి’’ అంటూ కృష్ణవేణి అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘చాలామంది మన సినిమా పుట్టినరోజును మరచిపోయాం అనుకుంటారు. పరిశ్రమకు చెందిన ఎవరొకరి జన్మదిన వేడుక ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అలా చూస్తే నిత్యం తెలుగు పరిశ్రమ పుట్టినరోజు వేడుక జరుపుకుంటునట్లే’’ అని కోడి రామకృష్ణ అన్నారు. 

‘‘తెలుగు పరిశ్రమ స్థాయి ఎంతో పెరిగింది. మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’’ అని కె. రాఘవ తెలిపారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి,, కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, బాబ్జీ, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





















(Published in 'Andhra Jyothy' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
.................................

0 వ్యాఖ్యలు: