జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, May 25, 2026

ఏ ఒరలోనూ ఇమడని కలం ఖడ్గం... గోరాశాస్త్రి!

 – వల్లీశ్వర్‌కు గోరాశాస్త్రి అవార్డు అందించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

-      జర్నలిస్ట్‌గా, వై.ఎస్.కు ఛీఫ్ పీఆర్వోగా వల్లీశ్వర్ సేవల్ని స్మరించిన అతిథులు



ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం మారింది. ప్రజల ఆలోచన, ఆచరణ కూడా మారింది. విలువలూ మారిపోతున్నాయి. అయితే, ఏ విషయంపైనా ఆసక్తి, శ్రద్ధ నిమిషమైనా నిలపలేని స్పీడు యుగంలోకి వచ్చిపడ్డప్పటికీ... నేటికీ నాణ్యమైన, నిఖార్సయిన మనుషులు, రచనలకే అసలు సిసలు విలువ. జీవితంలోనూ, పత్రికారచన వృత్తిలోనూ అలాంటి విలువలకు కట్టుబడి, ప్రమాణాలు పాటించినందుకే... ఆనాటి పాత్రికేయ శిఖరం గోరాశాస్త్రి లాంటి వారిని ఇవాళ్టికీ గుర్తు చేసుకుంటున్నామని గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రదానోత్సవం మరోసారి నిరూపించింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మే 23 సాయంత్రం దాదాపు నాలుగు గంటల పైగా సుదీర్ఘంగా సాగిన ఈ కార్యక్రమంలో అతిథులందరూ సృజనాత్మక రచయితగా, పత్రికా రచయితగా గోరా శాస్త్రి విశిష్టతను పునఃస్మరణ చేశారు. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ఉద్రిక్తతలు నెలకొన్న నేటి పరిస్థితుల్లో పత్రికా రచన మరింత బృహత్తరమైన బాధ్యత అన్న సంగతి గుర్తు చేశారు.

 

దాదాపు అయిదున్నర దశాబ్దాల సుదీర్ఘ పత్రికా రచనానుభవమున్నఏడున్నర పదులు పైబడిన అవిశ్రాంత పాత్రికేయుడు గుండు వల్లీశ్వర్‌కు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందించారు. వల్లీశ్వర్, లలితకుమారి దంపతులను ఆత్మీయంగా సత్కరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ఎమెస్కో ప్రచురణల అధినేత విజయకుమార్, సాక్షి జర్నలిజం స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ గోవిందరాజు చక్రధర్, వరంగల్ దగ్గరి చండీపరమేశ్వరీ పీఠాధిపతి అవసరాల ప్రసాదశర్మ సిద్ధాంతి తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

 

సత్యానికి దగ్గరగా... సంచలనానికి దూరంగా...

శాసన, న్యాయ, పరిపాలక వ్యవస్థలు మూడింటిలో ఏది దారి తప్పినా... వాటిని సరైన మార్గంలో పెట్టాల్సింది మీడియా. అందుకే, ఫోర్త్ ఎస్టేట్‌గా పేరుతెచ్చుకొని ప్రజాస్వామ్యానికి అది నాలుగో స్తంభమైంది. ప్రమాణాలు, విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, శివలెంక శంభుప్రసాద్, నీలంరాజు వెంకట శేషయ్య, గోరాశాస్త్రి లాంటి ఆ తరం పాత్రికేయ దిగ్గజాల గురించి అందరూ తప్పనిసరిగా చదవాలి. నిక్కచ్చిగా, నిర్భయంగా వ్యవహరించిన వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ మేళవించిన గోరాశాస్త్రి రచనలు చాలా ప్రసిద్ధి. ఆ రోజుల్లో ఆయన సంపాదకీయాలంటే జనం చెవికోసుకొనేవారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాథ్ గోయెంకా, స్టేట్స్‌మన్ పత్రిక ఎడిటర్ -ఇన్-ఛీఫ్ సి.ఆర్. ఇరానీ పాలకుల దౌర్జన్య విధానాలకు వ్యతిరేకంగా దృఢంగా ఎదురు నిలిచారు. మన దగ్గర గోరాశాస్త్రి సంపాదకీయాలు ఓ సంచలనం. అప్పటికి యువ రాజకీయనేతలమైన ఎస్. జైపాల్ రెడ్డి గారు, నేను, ఇతరులం గోరాశాస్త్రి సంపాదకీయాలను చదివి, మార్గదర్శనం పొందేవాళ్ళం అని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.



 


ప్రమాణాలు (వాగ్దానాలు) చేయడం కాదు... ప్రమాణాలను (స్టాండర్డ్స్‌ను) పాటించడం ప్రస్తుత అవసరం అన్న మాజీ ఉపరాష్ట్రపతి, జర్నలిస్టులు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తూ, ఇవాళ అందుకు పూర్తి వ్యతిరేకంగా... సత్యానికి దూరంగా, సంచలనానికి దగ్గరగా మీడియా ఉంటోంది. ఈ పరిస్థితులు మారాలి. అందుకు పాత తరం గొప్ప జర్నలిస్టుల జీవితం, ఆచరణలే మార్గదర్శి అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణలకు కంటెంట్ హెడ్‌గా వ్యవహరిస్తున్న వల్లీశ్వర్‌తో తన చిరకాల పరిచయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, ఇవాళ అరుదైపోతున్న నిబద్ధత, నాణ్యత, ప్రతిభ, విలువలు... అన్నీ ఉన్న జర్నలిస్టు వల్లీశ్వర్. అనువాదంలో అందె వేసిన చేయి. జాతీయవాద భావాలున్న వ్యక్తి. మానవ సంబంధాల విలువ తెలిసిన మనిషి. ఆయనకు గోరాశాస్త్రి అవార్డు ఇవ్వడం సముచితం అని ప్రశంసించారు.

 

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఛీఫ్ పీఆర్వోగా... ఆయన మెప్పు పొంది...

 

సాంస్కృతిక సంస్థ నవసాహితీ ఇంటర్నేషనల్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (తెలంగాణ) వారితో కలసి ఈ గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార ప్రదానోత్సవం జరిపింది. గోరాశాస్త్రి కుమార్తె – అల్లుడి కుటుంబం ప్రాయోజకత్వంలో దాదాపు ఏటా ఓ ఉత్తమ జర్నలిస్టును ఎంచుకొని, ఈ పురస్కార ప్రదానం చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రదానోత్సవం ఆ వరుసలో మూడోది. ముందుగా ఔత్సాహిక గాయనుల పాటకచ్చేరీ, ఆ తర్వాత పురస్కార ప్రదాన సభ జరిగాయి.

 

          రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి, సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలకు ఆత్మబంధువైన డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ, నిస్వార్థంగా, నిరాడంబరంగా జీవితం గడిపే వ్యక్తుల్ని, జర్నలిస్టుల్ని సమాజం గుర్తుంచుకోవాలి. గౌరవించుకోవాలి. అందులో భాగమే ఈ సన్మానం. ఉంటే ఇలా ఉండాలి అనేలా అర్థవంతంగా, నిరాడంబరమైన జీవితం గడిపిన వ్యక్తి గోరాశాస్త్రి. ఆయన మార్గంలోనే జిజ్ఞాస, జ్ఞానసముపార్జనతో నియమబద్ధంగా జీవితం సాగిస్తూ వచ్చారు వల్లీశ్వర్ అని పేర్కొన్నారు.

 

ఒక జర్నలిస్టుగా రిపోర్టింగ్‌లోని గ్లామర్, గ్రామర్... రెండూ సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్‌కు తెలుసు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసినవాడు. 2004లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి ఛీఫ్ పీఆర్వోగా ఆయన పనిచేసినప్పుడు, నేను సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ని. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ హైదరాబాద్‌లో పర్యటించేలా చూడడంలో, అలాగే మొదట వీలుకాదన్న బిట్స్ – పిలానీ సంస్థ సైతం చివరకు మనసు మార్చుకొని బిట్స్ – హైదరాబాద్ శాఖను భాగ్యనగరంలో ఏర్పాటు చేసేలా చూడడంలో వై.ఎస్. వెంటే నిలిచి, వల్లీశ్వర్ ముఖ్యపాత్ర పోషించారు. అలాగే, సర్కార్ పత్రిక అయిన రాష్ట్రప్రభుత్వ మాసపత్రిక ఆంధ్రప్రదేశ్‌ను అందరూ చూసేలా, చదివేలా ఓ సాహిత్య పత్రికగా తీర్చిదిద్ది, దాదాపు 40 వేల కాపీల సర్క్యులేషన్‌కు తీసుకువెళ్ళారు. ఆ పత్రికలో ఆయన ప్రచురించిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితకథ ఓ సంచలన ప్రయోగం. ఆ జీవితకథను స్వయంగా వై.ఎస్. చదివి, అభినందిన సందర్భానికి నేను ప్రత్యక్ష సాక్షిని అని రమణాచారి వివరించారు.  

 

భవిష్యత్తులో దొరకడం కష్టమే!: ‘ఎమెస్కో విజయకుమార్

 

ఎమెస్కో బుక్స్ అధినేత దూపాటి విజయకుమార్ మాట్లాడుతూ, ఈ వేదికపై ఉన్న అందరూ మా ఎమెస్కో ప్రచురణ సంస్థ రచయితలే! వారి పుస్తకాలను మేము ప్రచురించడం మాకు సంతోషం కలిగించిన విషయం. కీర్తిశేషులైన ఐ.ఏ.ఎస్. అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్ వల్ల వల్లీశ్వర్‌తో నాకు పరిచయం. ఎప్పుడో న్యూస్ టైమ్ ఆంగ్ల పత్రికలో ఉండగానే వల్లీశ్వర్ గారిని మా సంస్థ సంపాదక మండలిలో భాగం కావాల్సిందిగా కోరాను. అంతలో ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి సీపీఆర్వో అయ్యారు. ఆ బృహత్తర బాధ్యతలు నిర్వహించిన చాలా కాలం తర్వాత ఆయన అప్పటి ఆ మాట నిలబెట్టుకొని, మా సంస్థలో భాగమయ్యారు అని గుర్తు చేసుకున్నారు. అద్భుత రసాన్ని అపూర్వంగా ఆవిష్కరించడంలో వల్లీశ్వర్ ప్రముఖుడు. గోరాశాస్త్రి పేరిట ఇస్తున్న ఈ అవార్డుకు, వారి మార్గంలోనే తెలుగు, ఇంగ్లీషుల్లో ద్విభాషా జర్నలిస్టుగా రాణించిన వల్లీశ్వర్ అన్ని విధాలా అర్హుడు అని పేర్కొన్నారు.

 

అదే సమయంలో, గోరాశాస్త్రి తరం నెలకొల్పిన విలువలకు ప్రతీకగా నిలిచే జర్నలిస్టులను ఈ అవార్డులకు ఎంచుకోవాలంటే రానురానూ క్లిష్టతరం కావచ్చు. ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకోదగ్గ నిఖార్సైన జర్నలిస్టులు మున్ముందు దొరక్కపోవచ్చు. అలాంటి జర్నలిస్టులు మరో ఇద్దరు, ముగ్గురికి మించి లేరేమో అనిపిస్తోంది. సమాజంలో, పత్రికా రచనలో పెద్దమనుషుల తరం అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితులపై జర్నలిస్టులు ఆలోచించాలి అని ఎమెస్కో విజయకుమార్ సమకాలీన పరిస్థితులను కుండబద్దలు కొట్టడం గమనార్హం.  

 

మీరు ఆశుకవులు... మేము ఆలస్య కవులం!: సుద్దాల

 

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ విశిష్ట అతిథిగా పాల్గొంటూ, సంభాషణాత్మక సంపాదకీయాలు రాసిన విశిష్టులు గోరాశాస్త్రి. ఆయనలోని ప్రత్యేకత... ఎవరికీ, దేనికీ లొంగని స్వతంత్రత. ఒకసారి సంప్రదాయవాదిగా, మరోసారి సంప్రదాయ విరోధిగా కనిపించే ఆయన ఏ ఒరలోనూ ఇమడని ఖడ్గం. ఒక్క ముక్కలో హీ ఈజ్ యాంటీ ఫర్ యాంటీ. అందుకే, ఆయనను తెలుగు స్వతంత్రుడు గోరాశాస్త్రి అన్నారు అని గుర్తు చేశారు. ప్రాస ప్రవాహోపన్యాస విన్యాసం వెంకయ్య నాయుడు గారు అయితే, పాత్రికేయ అక్షర కల్పవల్లీశ్వరుడు... మన వల్లీశ్వరుడు అంటూ పదప్రయోగంతో సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. పత్రికా రచయితలు ఆశుకవులు, మేము (సినీ కవులం) ఆలస్య కవులం అని సినీ గేయరచనలో జాతీయ అవార్డు అందుకున్న సుద్దాల చమత్కరించారు.  

 

సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా... గోరాశాస్త్రి!

 

సాక్షి జర్నలిజమ్ స్కూల్, రచన జర్నలిజమ్ కాలేజీల మాజీ ప్రిన్సిపాల్ - సీనియర్ జర్నలిస్టు – గోరాశాస్త్రిపై కేంద్ర సాహిత్య అకాడెమీకి మోనోగ్రాఫ్ రాసిన రచయిత అయిన గోవిందరాజు చక్రధర్ మరో విశిష్ట అతిథిగా ఉపన్యసించారు. జర్నలిస్టుగా ఉంటూనే సృజనాత్మక రచయిత కావడం చాలా కొద్దిమందిలోనే చూస్తాం. స్థిరమైన రైల్వే ఉద్యోగం వదిలి, ఇంగ్లీషు స్వతంత్ర పత్రిక సంపాదకులైన ఖాసా సుబ్బారావు ప్రేరణతో కాకతాళీయంగా జర్నలిజంలోకి వచ్చారు గోరాశాస్త్రి. అయితేనేం, ఇటు సంపాదకుడిగా, అటు వినాయకుడి వీణ కాలమిస్టుగా, శ్రవ్యనాటికల రచయితగా వైభవోజ్జ్వలమైన జీవితాన్నీ, వృత్తి జీవితాన్నీ గడిపారు. రచనా మార్గంలో తాను నడుస్తూ, తోటి వారిని సైతం ప్రోత్సహిస్తూ, కె. రామలక్ష్మి (ఆరుద్ర), వి. రమాదేవి లాంటి పలువురిని కాలమిస్టులుగా, రచయితలుగా తీర్చిదిద్దిన అరుదైన వ్యక్తి ఆయన. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఇద్దరు మిత్రులు చిత్రానికి సినిమా రచనలో సహకారం అందించిన గోరాశాస్త్రి, మరో నాలుగైదు సినిమాలకు తెర వెనుక అజ్ఞాత రచయితగా కూడా పనిచేశారు అని చక్రధర్ వివరించారు.

 

అప్పట్లో సికింద్రాబాద్ నుంచి ఆరంభమై, ఇక్కడ నుంచే వెలువడుతూ వచ్చిన ఆంధ్రభూమి డైలీకి తెలుగులో, దాని మాతృసంస్థ దక్కన్ క్రానికల్ డైలీకి ఇంగ్లీషులో... ఇలా రెండు వేర్వేరు భాషల్లో, రెండు విభిన్నమైన అంశాలపై... ఒకే రోజున ఒకే మనిషి సంపాదకీయాలు రాయడం గోరాశాస్త్రికే చెల్లింది అన్నారు. ఆయన సంపాదకీయాలు, కాలమ్స్‌లోని వైవిధ్యమైన ఇతివృత్తాలు, వ్యంగ్య శైలీ విన్యాసం సహా పలు అంశాలను సోదాహరణంగా వివరించారు. ద్విభాషా జర్నలిస్టుగా, సృజనాత్మక రచయితగా గోరాశాస్త్రికీ, వల్లీశ్వర్‌కూ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. గోరాశాస్త్రి భాణాలు అనే సాహిత్య రూపక ప్రక్రియలో రచనలు చేస్తే, వల్లీశ్వర్ 99 సెకన్ల కథలు అంటూ వినూత్నంగా చిట్టిపొట్టి కథలు అందించారు. నిజానికి, వల్లీశ్వర్‌లో గుడ్ స్టోరీ టెల్లర్ ఉన్నాడు. అందుకే, ఆయనను కథల కన్నయ్య అనాలంటాను అని చక్రధర్ వ్యాఖ్యానించారు. 

 

మాటల దౌత్యం... యూ ఆర్ రైట్! బట్ హి ఈజ్ నాట్ రాంగ్!!


 ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగించి, ఇటీవలి వరకు ఇరాన్‌లో దౌత్యవేత్తగా పనిచేసిన యువకుడు జి. రాజా కార్తికేయ మాట్లాడుతూ, తనపై తన తండ్రి వల్లీశ్వర్ ప్రభావాన్ని ఆసక్తిగా చెబుతూ, సభికుల ప్రశంసలు అందుకున్నారు. జీవితంలోనైనా, వృత్తి జీవితంలోనైనా పైకి రావాలంటే ఓర్పు, నేర్పు... అనే రెండు ప్రధాన లక్షణాలు కీలకం. ఆ సంగతి మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఇరుపక్షాలకు వారధిగా వ్యవహరిస్తూ, యూ ఆర్ రైట్! బట్ హి ఈజ్ నాట్ రాంగ్!!’ అంటూ తరచూ ఆయన ఉటంకించే మాట నాకు దౌత్యరంగంలో ఎంతో ఉపకరించింది. అలాగే, హెచ్.ఆర్. అంటే కేవలం హ్యూమన్ రిసోర్సెస్ (మానవ వనరులు) కాదు... హ్యూమన్ రిలేషన్స్ (మానవ సంబంధాలు) అనేదీ ఆయన నేర్పిన పాఠమే! అలాగే, ఆఫ్ఘనిస్తాన్‌లో లొంగిపోయిన తీవ్రవాదుల పునరావాస ఉపాధి నిధులు స్వాహా అయినప్పుడు, దానిపై నేను పోరాడేందుకు స్వాతంత్ర్య సమరంలో మా తాత గారు, 1971-72లో జై ఆంధ్రా ఉద్యమ సమయంలో ఏలూరులో పోలీసు కాల్పుల వేళ జర్నలిస్టుగా మా నాన్న గారు ప్రవర్తించిన తీరే మార్గదర్శకమయ్యాయి. వృత్తి ధర్మం, వ్యక్తి ధర్మం... రెండూ వేర్వేరు కాదు అన్నది వారు చెప్పకనే చెప్పిన పాఠం అని రాజా కార్తికేయ ఆ అనుభవాలు పంచుకున్నారు.

 

సభారంభంలో... సాంస్కృతిక సంస్థ నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు – సీనియర్ జర్నలిస్టు ఎస్.వి. సూర్యప్రకాశరావు అతిథులను ప్రశంసలతో ముంచెత్తుతూ, సాదర స్వాగతోపన్యాసం చేశారు. పత్రికా రచన వృత్తిలో విలువలను నిలబెట్టిన గోరాశాస్త్రిని స్మరించుకొని, ఆ మహోన్నత వ్యక్తి పేరిట అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంగా ఇది జర్నలిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రోజు అని పేర్కొన్నారు. ప్రస్తుత పత్రికారంగంలోని పరిణామాలు, విలువలపై ఒకసారి ఎవరికి వారం పరిశీలన చేసుకోవాలని అభ్యర్థించారు.

 

గోరాశాస్త్రి అల్లుడు – బెంగుళూరులో ఇంగ్లీష్ ఉపన్యాసకులుగా పనిచేసి, ఈ మధ్యే హైదరాబాద్‌కు మకాం మార్చిన శ్రీనివాస్ వాసుదేవ్ సభలో గోరాశాస్త్రి రచనా జీవిత విశేషాలు, అవార్డు గ్రహీత వల్లీశ్వర్ వృత్తి విశేషాలను చదివి వినిపించారు. ఇదే వేదికపై శ్రీనివాస్ వాసుదేవ్ రాసిన కవితా సంపుటి జాతరను భారత మాజీ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. సభలో రాజకీయ – సామాజిక విశ్లేషకుడు చలసాని శ్రీనివాసరావు, వ్యవసాయ కూలీ నుంచి ఐటీ పరిశ్రమ స్థాపకురాలిగా ఎదిగిన భారతీయ – అమెరికన్ పారిశ్రామికవేత్త డి. జ్యోతిరెడ్డి, అవిశ్రాంత పాత్రికేయులు టి. ఉడయవర్లు, విశాలాంధ్ర లక్ష్మణరావు, నందిరాజు రాధాకృష్ణ, జాగృతి వారపత్రిక మాజీ ఎడిటర్ వడ్డి విజయసారథి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సి. కేశవులు, సీనియర్ జర్నలిస్టులు మా శర్మ, దోర్బల బాలశేఖరశర్మ, మహమ్మద్ రఫీ, కోవెల సంతోష్ కుమార్, వడ్డి ఓం ప్రకాశ్, వ్యూస్ ఛానల్ సుబ్రహ్మణ్యం - పురాణపండ వైజయంతి దంపతులు సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

2017లో ఏర్పాటై, 16 రాష్ట్రాల్లో విస్తరించి, మూడేళ్ళుగా తెలంగాణలోని 12 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జాతీయవాద భావ జర్నలిస్టుల సమూహం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (తెలంగాణ) కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ సారథ్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవంలో కీలక భూమిక పోషించారు. నవసాహితి పక్షాన జాతీయ కన్వీనర్ ఝాన్సీ రాపర్తి, శిరీషా శ్రీనివాస్, రజని, పాత తరం ప్రముఖ రాజకీయవాది తెన్నేటి విశ్వనాథం గారి మనుమడు తెన్నేటి మూర్తి, తదితరులు సభా నిర్వహణకు సహకరించారు.

 

తొలి గురువు మాటలే... తారకమంత్రంగా!

 

ఈ సత్కారం నా పూర్వజన్మ సుకృతం, తల్లితండ్రులు – గురువుల ఆశీఃఫలం అంటూ పురస్కార గ్రహీత వల్లీశ్వర్ తన స్పందన తెలియజేశారు. సాక్షాత్తూ గాంధీ మహాత్ముడు 1930లలో ఏలూరులో పర్యటించినప్పుడు విలేఖరిగా వార్తలు సేకరించిన మంగళంపల్లి చంద్రశేఖరం గారు నాకు జర్నలిజంలో తొలి గురువు. రాష్ట్ర జర్నలిస్టుల సంఘం స్థాపకాధ్యక్షులాయన. ఇక, కోస్తా జిల్లాలన్నిటికీ ది హిందూ ఇంగ్లీష్ డైలీ సంచార ప్రతినిధిగా (రోవింగ్ కరస్పాండెంట్‌)గా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు సిహెచ్.ఎస్. మాధవరావు గారికీ, వారి వార్తాకథన శైలికీ నేను ఏకలవ్య శిష్యుణ్ణి. విద్యార్థి నాయకుడి కాలం నుంచి వెంకయ్య ప్రసంగశైలికి అభిమానిని. ఈ ముగ్గురూ నాకు మార్గదర్శకులు అని చెప్పుకొచ్చారు.

పీటీఐతో పాటు ది మెయిల్, ఆంధ్రపత్రిక దినపత్రికలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు విలేఖరిగా పనిచేసిన చంద్రశేఖరం గారు... ఒక జడ్జి, ఒక టీచర్, ఒక అర్చకుడు... ఇలాంటి వాళ్ళు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఉండాలని ఆశిస్తామో... జర్నలిస్టు కూడా అలాగే ఉండాలి అని తొలిరోజుల్లో నాకు చెప్పారు. అలాగే, నాటి నుంచి నేటి దాకా పక్షపాతాలు లేకుండా, ప్రలోభాలు, పరువు నష్టం కేసులకు లొంగకుండా నియమబద్ధమైన పత్రికా రచనే సాగించాను అంటూ వల్లీశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు.


 సమయాతీతమై, రాత్రి పొద్దుపోతున్నా... వల్లీశ్వర్ ఆప్తులు, మిత్రులు, బంధువులతో సభాంగణం కళకళలాడింది. వృత్తికే అంకితమై, భార్యాబిడ్డల బాగోగులు పట్టకుండా తిరుగుతూ, జీవితంలో చల్లని సాయంత్రాలకు నోచుకోని శాపోపహతులైన జర్నలిస్టుల కష్టాల గురించి వల్లీశ్వర్ మాటల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు వల్లీశ్వర్ సతీమణి లలిత కుమారి 1980లలో తమ తిరుపతి కొత్త కాపురం నాటి సంగతులను ఆత్మీయంగా పంచుకున్నారు. అమాయకంగా, అదే సమయంలో అంతే నిజాయతీగా, నిష్కల్మషంగా ఆమె ప్రస్తావించిన అప్పటి జ్ఞాపకాలు సభా ప్రాంగణంలో నవ్వులు విరబూయించాయి. గోరాశాస్త్రి విలువలు, ఒకప్పటి జర్నలిస్టుల జీవితంలోని కష్టనష్టాల పురాస్మృతుల స్మరణతో ఆ సాయంత్రం ఆహ్లాదంగా గడిచింది.

 -      రెంటాల జయదేవ


https://www.sakshi.com/telugu-news/family/gora-sastry-best-journalist-award-presented-gundu-valliswar-2797206


(Published in Sakshi daily website, on 2026 May 25th, Monday)

Monday, May 18, 2026

సారస్వత పరిషత్‌లో... అరుదైన సాహితీ సంస్మరణ!

 

   -    తెలుగువారి చరిత్ర - సంస్కరణోద్యమాలుపై వకుళాభరణం ప్రసంగం

   -      ఆలోచన రేపిన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పుస్తకావిష్కణ


అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ఆంధ్ర సారస్వత పరిషత్  ప్రధానాచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).

 

సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.

 

ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.

 

అరుదైన చారిత్రక విమర్శకుడు కె.కె.ఆర్: ఆచార్య చంద్రశేఖరరెడ్డి


 

ప్రధాన ప్రసంగానికి ముందు ఎమెస్కో బుక్స్ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన చారిత్రక విమర్శకుడిగా గణిస్తున్నాం. అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.

 

అలాగే, కె.కె.ఆర్. వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తూ, సమాజంలోని సమకాలీన సంఘటనలపై ఆయన స్పందించేవారు. సర్వసాధారణంగా ఆయన ఎంత సంయమనం పాటిస్తారో, ప్రపంచంలో దుర్మార్గాన్ని చూస్తున్నప్పుడు అంత అసహనం వ్యక్తం చేసేవారు. వాటి గురించి రాయకున్నా, ఉపన్యసించకున్నా... మిత్రులతో తన బాధ, ఆవేదన, ఆవేశం పంచుకొనేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని మంచిని ఎంతగా అభిమానిస్తామో... చెడును అంత తీవ్రంగా ఖండించడమన్నది శిష్యులందరూ ఆయనను చూసి నేర్చుకున్నదే. అందుకే, ఒక్కమాటలో కె.కె.ఆర్. సంఘ సంస్కరణవాది కూడా అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు. అందుకు తగ్గట్టే తెలుగు వారి చరిత్ర – సంఘ సంస్కరణోద్యమాలు అంశంపై  ప్రధాన ప్రసంగకర్త వకుళాభరణం రామకృష్ణ సైతం భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడైన ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ వద్ద పరిశోధన సాగించిన ఉద్దండులంటూ ఆయన కృషిని స్థూలంగా పరిచయం చేశారు.

 

ఆ సమగ్ర స్వరూపమే తెలుగువారి చరిత్ర: వకుళాభరణం

 

వకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేస్తూ, ఢిల్లీలోని జె.ఎన్.యు.లో సాగిన తన చరిత్ర పరిశోధన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకులైన రొమిల్లా థాపర్, సర్వేపల్లి గోపాల్ తదితరులతో జరిగిన సంగతులు పంచుకున్నారు. తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణలకు దీపధారి లాంటి కందుకూరి వీరేశలింగం మీద రిసెర్చ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పినప్పుడు మా గైడ్ సర్వేపల్లి గోపాల్ అన్న ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తు. పరిశోధనంటే - వీరేశలింగం వితంతు వివాహాలు జరిపాడు, బాలికా విద్యను ప్రోత్సహించాడు లాంటివి కాదు రాయాల్సింది. హౌ బి శానిటైజ్డ్ ది సొసైటీ (తెలుగు సమాజాన్ని ఆయన ఎలా శుభ్రపరిచాడు) అన్నది చెప్పాలి, రాయాలి అన్నారాయన. అది నా మనసులో నాటుకొని, పరిశోధనకు మార్గదర్శకమైంది. కష్టపడి ఆయన దగ్గరే ఎం.ఫిల్, ఆ తర్వాత పీహెచ్డీ చేశాను అని తెలిపారు.

 

ఒకసారి యునెస్కో ఆహ్వానంపై సర్వేపల్లి గోపాల్ గారు ప్యారిస్‌కు వెళ్ళినప్పుడు, ఆయన స్థానంలో నన్ను పెడితే, నేను పాఠాలు చెప్పడం ఓ అపూర్వ గౌరవం. ఆఖరి టాపిక్ మిగిలిస్తే, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత నేనే ఆ పాఠం చెబుతానని వెళ్ళే ముందు గోపాల్ అన్నారు. తీరా, పర్యటన నుంచి తిరిగొచ్చాక విద్యార్థులకు ఆ పాఠం కూడా నన్నే చెప్పమనేశారు. నేను ఆ పాఠం చెబుతుంటే, ఆయన కూడా ఆ క్లాసులో కూర్చొని విన్న క్షణాలు మర్చిపోలేను అని వకుళాభరణం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.

 


ఈ మే 15 నాడే 88 వసంతాలు పూర్తి చేసుకొని, 89వ ఏట అడుగిడిన వకుళాభరణం దాదాపు నలభై నిమిషాల తన ప్రసంగంలో, ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో జరిగిన ప్రధానమైన మార్పులను ఓపికగా ప్రస్తావించారు. బ్రిటీషు వారి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదలైన ఉద్యమం, 1913 నాటి బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ నుంచి ఆంధ్ర రాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు, చివరకు 2013 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాల క్రమాన్ని ఆయన స్థూలంగా వివరించారు.

 

కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రవేశం తర్వాత నడచిన సంస్కరణోద్యమాల తీరుతెన్నుల గురించి సోషల్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే తన సిద్ధాంత గ్రంథంలో విపులంగా చర్చించిన వకుళాభరణం రామకృష్ణ, గురజాడ, గిడుగు, కందుకూరి... ఈ ముగ్గురూ తెలుగు నేలకు వేగుచుక్కల త్రయం. వారిలో మొదటి ఇద్దరు సాహితీస్రష్టలూ విజయనగరం వారే కావడం విశేషం. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చినవారిలో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు... ఈ ముగ్గురి పేర్లూ చెప్పుకొని తీరాలి అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటిని ఆయన తన ప్రసంగంలో చూచాయగా ప్రస్తావించారు. రాజకీయంగా, సామాజికంగా, కళాత్మకంగా, సాంస్కృతికంగా తెలుగు నేలపై వచ్చిన మార్పుల్ని లోతుగా చూసినప్పుడే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర – దాని పరిణామాలు – పర్యవసాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో సారస్వత పరిషత్ గ్రంథాలయాన్ని తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్న వకుళాభరణం, చారిత్రక విమర్శ దృక్పథంతో కె.కె.ఆర్. చేసిన సాహిత్య కృషిని ప్రశంసించారు.  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, కె.కె.ఆర్.తో సాగిన స్నేహాన్ని స్మరించుకున్నారు.

 

అయిదేళ్ళుగా... ప్రతి ఏటా... అదే వేదికపై!

 

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యత్వం వహిస్తున్న డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ఈ మొత్తం సభా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. ఉత్తమ ఆచార్యుడిగా, లోతైన సాహితీ విమర్శకుడిగా పేరున్న కె.కె.ఆర్. మరణానంతరం ఆయన శిష్య మిత్ర బృందం ఆచార్య చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో ఏటా ఒక ప్రత్యేక సాహితీ కార్యక్రమం చేస్తోంది. తొలి ఏడాది కె.కె.ఆర్. సంస్మరణ పేరిట ఆయన సంస్మరణ సంచిక తీసుకువచ్చారు. రెండో ఏడాది ఆయన బహుముఖీన వ్యక్తిత్వంపై కె.కె.ఆర్. సాహిత్య వ్యక్తిత్వం పేరిట పలువురు సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం వెలువరించారు. ఆ తర్వాత నుంచి మూడేళ్ళుగా ఏటా ఒక సుప్రసిద్ధుడితో సంస్మరణ ప్రసంగాలు చేయిస్తున్నారు. తత్త్వశాస్త్ర ఆచార్యులు డాక్టర్ అడ్లూరి రఘురామరాజు, సాహితీ విమర్శకుడు డాక్టర్ బి. తిరుపతిరావుల అనంతరం ఈసారి మూడో సంస్మరణ ప్రసంగం – చరిత్ర పరిశోధకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారిది అంటూ లక్ష్మణ చక్రవర్తి అయిదేళ్ళ ప్రస్థానాన్ని అద్దంలో చూపారు. అలాగే, తాజా సభలో విడుదలైన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగ పుస్తకాలు రెంటికీ లక్ష్మణ చక్రవర్తే సంపాదకత్వ బాధ్యతలు వహించడం విశేషం. 

 

పిల్లలకు ప్రేమ పంచి... ఆచరణలో గౌరవం చూపి...

 

ప్రధాన ప్రసంగానికి ముందు సభలో కె.కె.ఆర్. శిష్యమిత్రులు పలువురు మాట్లాడుతూ, మాస్టారితో తమ అనుబంధాన్నీ, వారి జ్ఞాపకాలనూ పంచుకున్నారు. కె.కె.ఆర్. వద్ద చదువుకున్న 73 ఏళ్ళ అధ్యాపకుడు డాక్టర్ డి. నరసయ్య అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, విద్యార్థులను సైతం గౌరవించడాన్ని ఆచరణలో చూపిన అరుదైన టీచర్ ఆయన. ఆ విశిష్ట గుణం ఆయన దగ్గరే చూశాను. విద్యార్థులతో అంత్యాక్షరి పద్యపఠనంతో పాటు స్లో సైక్లింగ్ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ, పిల్లలతో అంతగా మమేకమైన టీచర్‌గా కె.కె.ఆర్. సార్‌ను మర్చిపోలేము అన్నారు.

 




జర్నలిస్ట్ రవీంద్రబాబు మాట్లాడుతూ, ఎం.ఏ, ఎంఫిల్ కె.కె.ఆర్ గారి దగ్గరే చేశా. ఆధునిక కవిత్వం, స్ట్రక్చర్ ఆఫ్ మోడరన్ తెలుగు, సంస్కృతంలోని కాళిదాసు మేఘసందేశం... ఇలా ఏ సబ్జెక్ట్‌నైనా ఆయన బోధించేవారు. తాను చెప్పిన అంశం మీద కాకుండా, అప్పట్లో కొత్తగా వచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ హో కవితా సంపుటి మీద నేను పరిశోధన చేస్తానంటే ఆయన అభ్యంతర పెట్టలేదు. ముందుగా తానే ఆ పుస్తకం తెప్పించుకొని, చదివి, పరిశోధక విద్యార్థినైన నాకు సరైన మార్గనిర్దేశనం చేసిన అరుదైన గైడ్ ఆయన అని వివరించారు.

 

అరుదైన అధ్యయనశీలి ఆఖరి కోరిక!

 

తెలుగు అకాడెమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రచయిత, భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్య మాట్లాడుతూ, విద్యార్థులు, పరిశోధకులపై కె.కె.ఆర్. ఆప్యాయత అపారం. ఏదైనా తనకు తప్పు అనిపిస్తే మాత్రం... మిత్రధర్మం, శిష్యధర్మం ఎంత ఉన్నా సరే వెరవకుండా, వాటిని పక్కనబెట్టి మరీ నిక్కచ్చిగా ఆయన తన అభిప్రాయం చెప్పేవారు. కె.కె.ఆర్. తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవిత కాలంలోని సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలోని చైతన్యశీలత, మార్పులను చెబుతూ జీవిత కథనం రాయాలని భావించారు. తీరని ఆయన కోరికను ఇప్పటికైనా మిత్రులెవరైనా పూనుకొని తీరిస్తే బాగుంటుంది అని సూచన చేశారు. సారస్వత పరిషత్‌లో చదువుకొని సినీ, టీవీ నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న మానిక్ అప్పటి తన అనుభవాలు పంచుకున్నారు.

 

కుటుంబంతో కాదు... సాహితీ కుటుంబంతో!

 

ఈ కార్యక్రమానికి కె.కె.ఆర్. సతీమణి ఊర్మిళ, కుమారుడు సుమన్, మనుమడు స్వభావ్‌తో సహా కె.కె.ఆర్. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులమే కాకుండా, సాహితీ బంధువులందరితో కలసి ఏటా కె.కె.ఆర్.ను స్మరించుకోవడం కోసం అయిదేళ్ళుగా ఇలా సాహితీ ప్రసంగాల సభ జరుపుతున్నాం. గతంలో కె.కె.ఆర్. ఇలాంటి ప్రసంగాల సారస్వత వేదికను దాదాపు పదేళ్ళ పాటు నిర్వహించారు. దాని ఫలితంగానే, సాహిత్య చరిత్ర వ్యాసాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిన తెలుగు సాహిత్యం - మరోచూపు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ లాంటి లాంటి పుస్తకాల రూపంలో ఆ ప్రసంగాలు మిగిలాయి. ఆ ఫక్కీలోనే ఇప్పుడీ వార్షిక ప్రసంగాలు చేయిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతరంతోనూ, ఆధునిక వక్తలతోనూ ఇలాంటి ఆలోచనాత్మక సంస్మరణ ప్రసంగాలు ఇప్పించాలని భావిస్తున్నాం అని ఊర్మిళ సభాముఖంగా ప్రకటించారు. అతిథులకు తమ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, కవి నాళేశ్వరం శంకరం, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, తెలుగు అకాడెమీ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ఆకాశవాణి వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.

 

దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు సారస్వత వేదిక పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో!

 -      రెంటాల జయదేవ


https://www.sakshi.com/telugu-news/family/acharya-k-k-ranganathacharyulu-remembrance-day-2789913

(This item was published in 'Sakshi' website on 17th May 2026, Sunday)