– వల్లీశ్వర్‌కు గోరాశాస్త్రి
అవార్డు అందించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- జర్నలిస్ట్‌గా, వై.ఎస్.కు ఛీఫ్ పీఆర్వోగా వల్లీశ్వర్ సేవల్ని స్మరించిన అతిథులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో
ప్రపంచం మారింది. ప్రజల ఆలోచన, ఆచరణ కూడా మారింది. విలువలూ మారిపోతున్నాయి. అయితే,
ఏ విషయంపైనా ఆసక్తి, శ్రద్ధ నిమిషమైనా నిలపలేని స్పీడు యుగంలోకి వచ్చిపడ్డప్పటికీ...
నేటికీ నాణ్యమైన, నిఖార్సయిన మనుషులు, రచనలకే అసలు సిసలు విలువ. జీవితంలోనూ,
పత్రికారచన వృత్తిలోనూ అలాంటి విలువలకు కట్టుబడి, ప్రమాణాలు పాటించినందుకే... ఆనాటి
పాత్రికేయ శిఖరం గోరాశాస్త్రి లాంటి వారిని ఇవాళ్టికీ గుర్తు చేసుకుంటున్నామని
గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రదానోత్సవం మరోసారి నిరూపించింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్
కల్చరల్ సెంటర్‌లో మే 23 సాయంత్రం దాదాపు నాలుగు గంటల పైగా సుదీర్ఘంగా సాగిన ఈ
కార్యక్రమంలో అతిథులందరూ సృజనాత్మక రచయితగా, పత్రికా రచయితగా గోరా శాస్త్రి విశిష్టతను
పునఃస్మరణ చేశారు. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ఉద్రిక్తతలు నెలకొన్న నేటి
పరిస్థితుల్లో పత్రికా రచన మరింత బృహత్తరమైన బాధ్యత అన్న సంగతి గుర్తు చేశారు.
దాదాపు అయిదున్నర దశాబ్దాల
సుదీర్ఘ పత్రికా రచనానుభవమున్నఏడున్నర పదులు పైబడిన అవిశ్రాంత పాత్రికేయుడు గుండు
వల్లీశ్వర్‌కు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఉత్తమ జర్నలిస్ట్
అవార్డును అందించారు. వల్లీశ్వర్, లలితకుమారి దంపతులను ఆత్మీయంగా సత్కరించారు.
ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, సినీ గీత రచయిత సుద్దాల అశోక్
తేజ, ‘ఎమెస్కో’ ప్రచురణల అధినేత విజయకుమార్,
‘సాక్షి’ జర్నలిజం స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ గోవిందరాజు
చక్రధర్, వరంగల్ దగ్గరి చండీపరమేశ్వరీ
పీఠాధిపతి అవసరాల ప్రసాదశర్మ సిద్ధాంతి తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
సత్యానికి
దగ్గరగా... సంచలనానికి దూరంగా...
“శాసన, న్యాయ, పరిపాలక వ్యవస్థలు మూడింటిలో ఏది దారి తప్పినా... వాటిని సరైన మార్గంలో పెట్టాల్సింది మీడియా. అందుకే, ‘ఫోర్త్ ఎస్టేట్’గా పేరుతెచ్చుకొని ప్రజాస్వామ్యానికి అది నాలుగో స్తంభమైంది. ప్రమాణాలు, విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, శివలెంక శంభుప్రసాద్, నీలంరాజు వెంకట శేషయ్య, గోరాశాస్త్రి లాంటి ఆ తరం పాత్రికేయ దిగ్గజాల గురించి అందరూ తప్పనిసరిగా చదవాలి. నిక్కచ్చిగా, నిర్భయంగా వ్యవహరించిన వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ మేళవించిన గోరాశాస్త్రి రచనలు చాలా ప్రసిద్ధి. ఆ రోజుల్లో ఆయన సంపాదకీయాలంటే జనం చెవికోసుకొనేవారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ అధినేత రామనాథ్ గోయెంకా, ‘స్టేట్స్‌మన్’ పత్రిక ఎడిటర్ -ఇన్-ఛీఫ్ సి.ఆర్. ఇరానీ పాలకుల దౌర్జన్య విధానాలకు వ్యతిరేకంగా దృఢంగా ఎదురు నిలిచారు. మన దగ్గర గోరాశాస్త్రి సంపాదకీయాలు ఓ సంచలనం. అప్పటికి యువ రాజకీయనేతలమైన ఎస్. జైపాల్ రెడ్డి గారు, నేను, ఇతరులం గోరాశాస్త్రి సంపాదకీయాలను చదివి, మార్గదర్శనం పొందేవాళ్ళం” అని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.
“ప్రమాణాలు (వాగ్దానాలు) చేయడం కాదు... ప్రమాణాలను (స్టాండర్డ్స్‌ను) పాటించడం ప్రస్తుత అవసరం అన్న మాజీ ఉపరాష్ట్రపతి, “జర్నలిస్టులు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తూ, ఇవాళ అందుకు పూర్తి వ్యతిరేకంగా... సత్యానికి దూరంగా, సంచలనానికి దగ్గరగా మీడియా ఉంటోంది. ఈ పరిస్థితులు మారాలి. అందుకు పాత తరం గొప్ప జర్నలిస్టుల జీవితం, ఆచరణలే మార్గదర్శి” అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ‘ఎమెస్కో’ ప్రచురణలకు కంటెంట్ హెడ్‌గా వ్యవహరిస్తున్న వల్లీశ్వర్‌తో తన చిరకాల పరిచయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, “ఇవాళ అరుదైపోతున్న నిబద్ధత, నాణ్యత, ప్రతిభ, విలువలు... అన్నీ ఉన్న జర్నలిస్టు వల్లీశ్వర్. అనువాదంలో అందె వేసిన చేయి. జాతీయవాద భావాలున్న వ్యక్తి. మానవ సంబంధాల విలువ తెలిసిన మనిషి. ఆయనకు గోరాశాస్త్రి అవార్డు ఇవ్వడం సముచితం” అని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఛీఫ్ పీఆర్వోగా... ఆయన మెప్పు పొంది...
సాంస్కృతిక సంస్థ ‘నవసాహితీ ఇంటర్నేషనల్’, ‘వర్కింగ్ జర్నలిస్ట్స్
ఆఫ్ ఇండియా’ (తెలంగాణ) వారితో కలసి ఈ
గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార ప్రదానోత్సవం జరిపింది. గోరాశాస్త్రి
కుమార్తె – అల్లుడి కుటుంబం ప్రాయోజకత్వంలో దాదాపు ఏటా ఓ ఉత్తమ జర్నలిస్టును
ఎంచుకొని, ఈ పురస్కార ప్రదానం చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రదానోత్సవం ఆ వరుసలో
మూడోది. ముందుగా ఔత్సాహిక గాయనుల పాటకచ్చేరీ, ఆ తర్వాత పురస్కార ప్రదాన సభ జరిగాయి.
రిటైర్డ్ ఐ.ఏ.ఎస్.
అధికారి, సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలకు ఆత్మబంధువైన డాక్టర్ కె.వి. రమణాచారి
అధ్యక్షోపన్యాసం చేస్తూ, “నిస్వార్థంగా,
నిరాడంబరంగా జీవితం గడిపే వ్యక్తుల్ని, జర్నలిస్టుల్ని సమాజం గుర్తుంచుకోవాలి.
గౌరవించుకోవాలి. అందులో భాగమే ఈ సన్మానం. ‘ఉంటే ఇలా ఉండాలి’ అనేలా అర్థవంతంగా, నిరాడంబరమైన జీవితం గడిపిన వ్యక్తి గోరాశాస్త్రి. ఆయన
మార్గంలోనే జిజ్ఞాస, జ్ఞానసముపార్జనతో నియమబద్ధంగా జీవితం సాగిస్తూ వచ్చారు
వల్లీశ్వర్” అని పేర్కొన్నారు.
“ఒక జర్నలిస్టుగా రిపోర్టింగ్‌లోని గ్లామర్, గ్రామర్... రెండూ సీనియర్
జర్నలిస్ట్ వల్లీశ్వర్‌కు తెలుసు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కూడా బాగా
తెలిసినవాడు. 2004లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.
రాజశేఖరరెడ్డికి ఛీఫ్ పీఆర్వోగా ఆయన పనిచేసినప్పుడు, నేను సమాచార, పౌరసంబంధాల శాఖ
కమిషనర్‌ని. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ హైదరాబాద్‌లో పర్యటించేలా
చూడడంలో, అలాగే మొదట వీలుకాదన్న ‘బిట్స్ – పిలానీ’ సంస్థ సైతం చివరకు మనసు
మార్చుకొని ‘బిట్స్ – హైదరాబాద్’ శాఖను భాగ్యనగరంలో
ఏర్పాటు చేసేలా చూడడంలో వై.ఎస్. వెంటే నిలిచి, వల్లీశ్వర్ ముఖ్యపాత్ర పోషించారు.
అలాగే, “సర్కార్ పత్రిక” అయిన రాష్ట్రప్రభుత్వ
మాసపత్రిక ‘ఆంధ్రప్రదేశ్’ను అందరూ చూసేలా, చదివేలా
ఓ “సాహిత్య పత్రిక”గా తీర్చిదిద్ది, దాదాపు
40 వేల కాపీల సర్క్యులేషన్‌కు తీసుకువెళ్ళారు. ఆ పత్రికలో ఆయన ప్రచురించిన వై.ఎస్.
రాజశేఖరరెడ్డి జీవితకథ ఓ సంచలన ప్రయోగం. ఆ జీవితకథను స్వయంగా వై.ఎస్. చదివి,
అభినందిన సందర్భానికి నేను ప్రత్యక్ష సాక్షిని” అని రమణాచారి వివరించారు.
“భవిష్యత్తులో దొరకడం కష్టమే!”: ‘ఎమెస్కో’ విజయకుమార్
‘ఎమెస్కో బుక్స్’ అధినేత దూపాటి
విజయకుమార్ మాట్లాడుతూ, “ఈ వేదికపై ఉన్న అందరూ మా
ఎమెస్కో ప్రచురణ సంస్థ రచయితలే! వారి పుస్తకాలను మేము ప్రచురించడం మాకు సంతోషం కలిగించిన విషయం.
కీర్తిశేషులైన ఐ.ఏ.ఎస్. అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్ వల్ల వల్లీశ్వర్‌తో నాకు
పరిచయం. ఎప్పుడో ‘న్యూస్ టైమ్’ ఆంగ్ల పత్రికలో ఉండగానే
వల్లీశ్వర్ గారిని మా సంస్థ సంపాదక మండలిలో భాగం కావాల్సిందిగా కోరాను. అంతలో ఆయన
ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి సీపీఆర్వో అయ్యారు. ఆ బృహత్తర బాధ్యతలు నిర్వహించిన చాలా కాలం తర్వాత ఆయన అప్పటి ఆ మాట
నిలబెట్టుకొని, మా సంస్థలో భాగమయ్యారు” అని గుర్తు చేసుకున్నారు. “అద్భుత రసాన్ని అపూర్వంగా ఆవిష్కరించడంలో వల్లీశ్వర్ ప్రముఖుడు.
గోరాశాస్త్రి పేరిట ఇస్తున్న ఈ అవార్డుకు, వారి మార్గంలోనే తెలుగు, ఇంగ్లీషుల్లో
ద్విభాషా జర్నలిస్టుగా రాణించిన వల్లీశ్వర్ అన్ని విధాలా అర్హుడు” అని పేర్కొన్నారు.
అదే సమయంలో, “గోరాశాస్త్రి తరం నెలకొల్పిన విలువలకు ప్రతీకగా నిలిచే
జర్నలిస్టులను ఈ అవార్డులకు ఎంచుకోవాలంటే రానురానూ క్లిష్టతరం కావచ్చు. ఉత్తమ
జర్నలిస్టు అవార్డు అందుకోదగ్గ నిఖార్సైన జర్నలిస్టులు మున్ముందు దొరక్కపోవచ్చు.
అలాంటి జర్నలిస్టులు మరో ఇద్దరు, ముగ్గురికి మించి లేరేమో అనిపిస్తోంది. సమాజంలో,
పత్రికా రచనలో పెద్దమనుషుల తరం అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితులపై
జర్నలిస్టులు ఆలోచించాలి” అని ‘ఎమెస్కో’ విజయకుమార్ సమకాలీన
పరిస్థితులను కుండబద్దలు కొట్టడం గమనార్హం.
“మీరు ఆశుకవులు... మేము ఆలస్య కవులం!”: సుద్దాల
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ విశిష్ట
అతిథిగా పాల్గొంటూ, “సంభాషణాత్మక సంపాదకీయాలు రాసిన విశిష్టులు గోరాశాస్త్రి. ఆయనలోని
ప్రత్యేకత... ఎవరికీ, దేనికీ లొంగని స్వతంత్రత. ఒకసారి సంప్రదాయవాదిగా, మరోసారి
సంప్రదాయ విరోధిగా కనిపించే ఆయన ఏ ఒరలోనూ ఇమడని ఖడ్గం. ఒక్క ముక్కలో ‘హీ ఈజ్ యాంటీ ఫర్ యాంటీ’. అందుకే, ఆయనను “తెలుగు ‘స్వతంత్రు’డు గోరాశాస్త్రి” అన్నారు అని గుర్తు
చేశారు. ‘ప్రాస ప్రవాహోపన్యాస
విన్యాసం వెంకయ్య నాయుడు’ గారు అయితే, ‘పాత్రికేయ అక్షర
కల్పవల్లీశ్వరుడు... మన వల్లీశ్వరుడు’ అంటూ పదప్రయోగంతో సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. “పత్రికా రచయితలు
ఆశుకవులు, మేము (సినీ కవులం) ఆలస్య కవులం” అని సినీ గేయరచనలో జాతీయ అవార్డు అందుకున్న సుద్దాల చమత్కరించారు.
సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా... గోరాశాస్త్రి!
‘సాక్షి’ జర్నలిజమ్ స్కూల్, ‘రచన’ జర్నలిజమ్ కాలేజీల మాజీ
ప్రిన్సిపాల్ - సీనియర్ జర్నలిస్టు – గోరాశాస్త్రిపై కేంద్ర సాహిత్య అకాడెమీకి
మోనోగ్రాఫ్ రాసిన రచయిత అయిన గోవిందరాజు చక్రధర్ మరో విశిష్ట అతిథిగా
ఉపన్యసించారు. “జర్నలిస్టుగా ఉంటూనే
సృజనాత్మక రచయిత కావడం చాలా కొద్దిమందిలోనే చూస్తాం. స్థిరమైన రైల్వే ఉద్యోగం
వదిలి, ఇంగ్లీషు ‘స్వతంత్ర’ పత్రిక సంపాదకులైన ఖాసా
సుబ్బారావు ప్రేరణతో కాకతాళీయంగా జర్నలిజంలోకి వచ్చారు గోరాశాస్త్రి. అయితేనేం, ఇటు
సంపాదకుడిగా, అటు ‘వినాయకుడి వీణ’ కాలమిస్టుగా,
శ్రవ్యనాటికల రచయితగా వైభవోజ్జ్వలమైన జీవితాన్నీ, వృత్తి జీవితాన్నీ గడిపారు. రచనా
మార్గంలో తాను నడుస్తూ, తోటి వారిని సైతం ప్రోత్సహిస్తూ, కె. రామలక్ష్మి (ఆరుద్ర), వి. రమాదేవి లాంటి పలువురిని కాలమిస్టులుగా, రచయితలుగా తీర్చిదిద్దిన అరుదైన
వ్యక్తి ఆయన. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి సినిమా రచనలో
సహకారం అందించిన గోరాశాస్త్రి, మరో నాలుగైదు సినిమాలకు తెర వెనుక అజ్ఞాత రచయితగా
కూడా పనిచేశారు” అని చక్రధర్ వివరించారు.
“అప్పట్లో సికింద్రాబాద్ నుంచి ఆరంభమై, ఇక్కడ నుంచే వెలువడుతూ వచ్చిన ‘ఆంధ్రభూమి’ డైలీకి తెలుగులో, దాని
మాతృసంస్థ ‘దక్కన్ క్రానికల్’ డైలీకి ఇంగ్లీషులో...
ఇలా రెండు వేర్వేరు భాషల్లో, రెండు విభిన్నమైన అంశాలపై... ఒకే రోజున ఒకే మనిషి సంపాదకీయాలు
రాయడం గోరాశాస్త్రికే చెల్లింది” అన్నారు. ఆయన సంపాదకీయాలు, కాలమ్స్‌లోని వైవిధ్యమైన ఇతివృత్తాలు, వ్యంగ్య
శైలీ విన్యాసం సహా పలు అంశాలను సోదాహరణంగా వివరించారు. “ద్విభాషా జర్నలిస్టుగా, సృజనాత్మక రచయితగా గోరాశాస్త్రికీ, వల్లీశ్వర్‌కూ
కొన్ని సారూప్యాలు ఉన్నాయి. గోరాశాస్త్రి ‘భాణాలు’ అనే సాహిత్య రూపక
ప్రక్రియలో రచనలు చేస్తే, వల్లీశ్వర్ ‘99 సెకన్ల కథలు’ అంటూ వినూత్నంగా
చిట్టిపొట్టి కథలు అందించారు. నిజానికి, వల్లీశ్వర్‌లో ‘గుడ్ స్టోరీ టెల్లర్’ ఉన్నాడు. అందుకే, ఆయనను ‘కథల కన్నయ్య’ అనాలంటాను” అని చక్రధర్
వ్యాఖ్యానించారు.
మాటల దౌత్యం... “యూ ఆర్ రైట్! బట్ హి ఈజ్ నాట్ రాంగ్!!”
ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగించి, ఇటీవలి వరకు ఇరాన్‌లో దౌత్యవేత్తగా పనిచేసిన యువకుడు జి. రాజా కార్తికేయ మాట్లాడుతూ, తనపై తన తండ్రి వల్లీశ్వర్ ప్రభావాన్ని ఆసక్తిగా చెబుతూ, సభికుల ప్రశంసలు అందుకున్నారు. “జీవితంలోనైనా, వృత్తి జీవితంలోనైనా పైకి రావాలంటే ఓర్పు, నేర్పు... అనే రెండు ప్రధాన లక్షణాలు కీలకం. ఆ సంగతి మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఇరుపక్షాలకు వారధిగా వ్యవహరిస్తూ, ‘యూ ఆర్ రైట్! బట్ హి ఈజ్ నాట్ రాంగ్!!’ అంటూ తరచూ ఆయన ఉటంకించే మాట నాకు దౌత్యరంగంలో ఎంతో ఉపకరించింది. అలాగే, ‘హెచ్.ఆర్.’ అంటే కేవలం ‘హ్యూమన్ రిసోర్సెస్’ (మానవ వనరులు) కాదు... ‘హ్యూమన్ రిలేషన్స్’ (మానవ సంబంధాలు) అనేదీ ఆయన నేర్పిన పాఠమే! అలాగే, ఆఫ్ఘనిస్తాన్‌లో లొంగిపోయిన తీవ్రవాదుల పునరావాస ఉపాధి నిధులు స్వాహా అయినప్పుడు, దానిపై నేను పోరాడేందుకు స్వాతంత్ర్య సమరంలో మా తాత గారు, 1971-72లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఏలూరులో పోలీసు కాల్పుల వేళ జర్నలిస్టుగా మా నాన్న గారు ప్రవర్తించిన తీరే మార్గదర్శకమయ్యాయి. వృత్తి ధర్మం, వ్యక్తి ధర్మం... రెండూ వేర్వేరు కాదు అన్నది వారు చెప్పకనే చెప్పిన పాఠం” అని రాజా కార్తికేయ ఆ అనుభవాలు పంచుకున్నారు.
సభారంభంలో... సాంస్కృతిక సంస్థ ‘నవసాహితీ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపక అధ్యక్షుడు – సీనియర్ జర్నలిస్టు ఎస్.వి. సూర్యప్రకాశరావు అతిథులను
ప్రశంసలతో ముంచెత్తుతూ, సాదర స్వాగతోపన్యాసం చేశారు. “పత్రికా రచన వృత్తిలో విలువలను నిలబెట్టిన గోరాశాస్త్రిని స్మరించుకొని, ఆ
మహోన్నత వ్యక్తి పేరిట అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంగా ఇది జర్నలిస్టులు
ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రోజు” అని పేర్కొన్నారు. ‘ప్రస్తుత పత్రికారంగంలోని పరిణామాలు, విలువలపై ఒకసారి ఎవరికి వారం పరిశీలన
చేసుకోవాల’ని అభ్యర్థించారు.
గోరాశాస్త్రి అల్లుడు – బెంగుళూరులో ఇంగ్లీష్ ఉపన్యాసకులుగా
పనిచేసి, ఈ మధ్యే హైదరాబాద్‌కు మకాం మార్చిన శ్రీనివాస్ వాసుదేవ్ సభలో
గోరాశాస్త్రి రచనా జీవిత విశేషాలు, అవార్డు గ్రహీత వల్లీశ్వర్ వృత్తి విశేషాలను
చదివి వినిపించారు. ఇదే వేదికపై శ్రీనివాస్ వాసుదేవ్ రాసిన కవితా సంపుటి ‘జాతర’ను భారత మాజీ ఉప
రాష్ట్రపతి ఆవిష్కరించారు. సభలో రాజకీయ – సామాజిక విశ్లేషకుడు చలసాని
శ్రీనివాసరావు, వ్యవసాయ కూలీ నుంచి ఐటీ పరిశ్రమ స్థాపకురాలిగా ఎదిగిన భారతీయ –
అమెరికన్ పారిశ్రామికవేత్త డి. జ్యోతిరెడ్డి, అవిశ్రాంత పాత్రికేయులు టి.
ఉడయవర్లు, ‘విశాలాంధ్ర’ లక్ష్మణరావు, నందిరాజు
రాధాకృష్ణ, ‘జాగృతి’ వారపత్రిక మాజీ ఎడిటర్
వడ్డి విజయసారథి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సి. కేశవులు, సీనియర్ జర్నలిస్టులు ‘మా’ శర్మ, దోర్బల
బాలశేఖరశర్మ, మహమ్మద్ రఫీ, కోవెల సంతోష్ కుమార్, వడ్డి ఓం ప్రకాశ్, ‘వ్యూస్’ ఛానల్ సుబ్రహ్మణ్యం -
పురాణపండ వైజయంతి దంపతులు సహా వివిధ రంగాలకు చెందిన
పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
2017లో ఏర్పాటై, 16 రాష్ట్రాల్లో విస్తరించి, మూడేళ్ళుగా
తెలంగాణలోని 12 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జాతీయవాద భావ జర్నలిస్టుల
సమూహం ‘వర్కింగ్ జర్నలిస్ట్స్
ఆఫ్ ఇండియా’ (తెలంగాణ) కార్యవర్గ
సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ సారథ్యంలో ఈ అవార్డు
ప్రదానోత్సవంలో కీలక భూమిక పోషించారు. ‘నవసాహితి’ పక్షాన జాతీయ కన్వీనర్
ఝాన్సీ రాపర్తి, శిరీషా శ్రీనివాస్, రజని, పాత తరం ప్రముఖ రాజకీయవాది తెన్నేటి
విశ్వనాథం గారి మనుమడు తెన్నేటి మూర్తి, తదితరులు సభా నిర్వహణకు సహకరించారు.
తొలి గురువు మాటలే... తారకమంత్రంగా!
“ఈ సత్కారం నా పూర్వజన్మ సుకృతం, తల్లితండ్రులు – గురువుల ఆశీఃఫలం” అంటూ పురస్కార గ్రహీత
వల్లీశ్వర్ తన స్పందన తెలియజేశారు. “సాక్షాత్తూ గాంధీ మహాత్ముడు 1930లలో ఏలూరులో
పర్యటించినప్పుడు విలేఖరిగా వార్తలు సేకరించిన మంగళంపల్లి చంద్రశేఖరం గారు నాకు
జర్నలిజంలో తొలి గురువు. రాష్ట్ర జర్నలిస్టుల సంఘం
స్థాపకాధ్యక్షులాయన. ఇక, కోస్తా జిల్లాలన్నిటికీ ‘ది హిందూ’ ఇంగ్లీష్ డైలీ సంచార
ప్రతినిధిగా (రోవింగ్ కరస్పాండెంట్)గా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు సిహెచ్.ఎస్.
మాధవరావు గారికీ, వారి వార్తాకథన శైలికీ నేను ఏకలవ్య శిష్యుణ్ణి. విద్యార్థి
నాయకుడి కాలం నుంచి వెంకయ్య ప్రసంగశైలికి అభిమానిని. ఈ ముగ్గురూ నాకు
మార్గదర్శకులు” అని చెప్పుకొచ్చారు.
“పీటీఐతో పాటు ‘ది మెయిల్’, ‘ఆంధ్రపత్రిక’ దినపత్రికలకు పశ్చిమగోదావరి
జిల్లా ఏలూరు విలేఖరిగా పనిచేసిన చంద్రశేఖరం గారు... ‘ఒక జడ్జి, ఒక టీచర్, ఒక అర్చకుడు... ఇలాంటి వాళ్ళు ఎంత స్వచ్ఛంగా, ఎంత
నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఉండాలని ఆశిస్తామో... జర్నలిస్టు కూడా అలాగే ఉండాలి’ అని తొలిరోజుల్లో నాకు
చెప్పారు. అలాగే, నాటి నుంచి నేటి దాకా పక్షపాతాలు లేకుండా, ప్రలోభాలు, పరువు
నష్టం కేసులకు లొంగకుండా నియమబద్ధమైన పత్రికా రచనే సాగించాను” అంటూ వల్లీశ్వర్
భావోద్వేగానికి గురయ్యారు.
సమయాతీతమై, రాత్రి పొద్దుపోతున్నా... వల్లీశ్వర్ ఆప్తులు, మిత్రులు, బంధువులతో సభాంగణం కళకళలాడింది. వృత్తికే అంకితమై, భార్యాబిడ్డల బాగోగులు పట్టకుండా తిరుగుతూ, జీవితంలో చల్లని సాయంత్రాలకు నోచుకోని శాపోపహతులైన జర్నలిస్టుల కష్టాల గురించి వల్లీశ్వర్ మాటల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు వల్లీశ్వర్ సతీమణి లలిత కుమారి 1980లలో తమ తిరుపతి కొత్త కాపురం నాటి సంగతులను ఆత్మీయంగా పంచుకున్నారు. అమాయకంగా, అదే సమయంలో అంతే నిజాయతీగా, నిష్కల్మషంగా ఆమె ప్రస్తావించిన అప్పటి జ్ఞాపకాలు సభా ప్రాంగణంలో నవ్వులు విరబూయించాయి. గోరాశాస్త్రి విలువలు, ఒకప్పటి జర్నలిస్టుల జీవితంలోని కష్టనష్టాల పురాస్మృతుల స్మరణతో ఆ సాయంత్రం ఆహ్లాదంగా గడిచింది.
https://www.sakshi.com/telugu-news/family/gora-sastry-best-journalist-award-presented-gundu-valliswar-2797206
(Published in Sakshi daily website, on 2026 May 25th, Monday)








0 వ్యాఖ్యలు:
Post a Comment