జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, March 28, 2015

అవకతవకలు అనేకం: సి.వి.ఎల్. నరసింహారావు ఆరోపణ

 ఇది ఇలా ఉండగా, వీధికెక్కిన ‘మా’ వ్యవహారం, తాజా ఎన్నికల గురించి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కళాకారులంతా కలసికట్టుగా ఉండకపోతే, పోయేది మన పరువే’నని వారు అభిప్రాయపడ్డారు. ‘రోషం’ బాలు, దర్శక - నటుడు డాక్టర్ ఎల్. శ్రీనాథ్, ‘మా’లో కూడా సభ్యులైన సీనియర్ నటుడు - వకీలు సి.వి.ఎల్. నరసింహారావు, ప్రదీప్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు.  ‘మా’లో జీవిత సభ్యుడే కాక, గతంలో న్యాయ సలహాదారుగా కూడా పనిచేసిన నటుడు సి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ, ‘మా’లో అనేక అవకతవకలు అధికారికంగానే చాలాకాలంగా సాగుతున్నాయనీ, అదంతా ఇప్పుడు బయటపడుతోందని ఆరోపించారు.

 మరణించిన తరువాత మౌనం పాటించడం కాకుండా, ఉండగానే అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. కేవలం సొసైటీస్ చట్టం కింద రిజిస్టరైన ‘మా’లో తీరా ఇప్పుడు యూనియన్ వర్కర్‌‌స తరహాలో లబ్ధి తెస్తామని మురళీ మోహన్ తదితరులు చేస్తున్న వాదన సాధ్యం కానిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కుబుసం’ చిత్ర దర్శకుడు శ్రీనాధ్ మాట్లాడుతూ, ‘మా’లో సభ్యత్వం కేవలం కొందరి దయాధర్మంగా మారిందని ఆరోపించారు. ‘మా’ను సమూలంగా ప్రక్షాళన చేయాలనీ, సభ్యులకు సానుకూలంగా ఉండేలా మార్చాలనీ ఆయన అన్నారు.

(Published in 'Sakshi' daily, 28th March 2015, Saturday)
..........................................

ఎన్నికల వేళ...పేలుతున్న మాటల తూటాలు

ఎన్నికల వేళ...పేలుతున్న మాటల తూటాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సిన ఆదివారం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎన్నికలు నిలిపి వేయాలంటూ నటుడు ఒ. కల్యాణ్ గురువారం కోర్టులో వేసిన పిటిషన్, దానిపై విచారణ జరిపి, ‘ఎన్నికలు జరపండి. కానీ, ఫలితాలు వెల్లడించవద్దు’ అంటూ కోర్టు శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. మరోపక్క నటుడు నాగబాబు, తదితరుల మద్దతున్న రాజేంద్రప్రసాద్ వర్గానికీ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతున్న జయసుధ వర్గానికీ మధ్య సాగుతున్న ఎన్నికల పోరులో మాటల తూటాలు శుక్రవారం కూడా పేలాయి.
 
 సాధారణ ఎన్నికలను తలపిస్తూ, వాగ్ధానాల వర్షం కురిసింది. అధ్యక్షపదవికి పోటీపడుతున్న జయసుధ, ఆమె ప్యానెల్‌లోని ఇతర పోటీదారులు శుక్రవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈసారి తమ ప్యానెల్‌ను గెలిపిస్తే, సభ్యులకు తాము చేయదలుచుకున్న పనుల గురించి చెప్పడానికి జయసుధ, బృందం ప్రయత్నించారు. అలాగే, బుధవారం నాటి మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ వర్గం చేసిన ఆరోపణలకు, వ్యాఖ్య లకు దీటుగా ఎదురు బాణాలు సంధించారు. తానెవరికీ డమ్మీని కాదని జయసుధ ఘాటుగా చెప్పారు.  
 
 ‘‘కార్పస్ ఫండ్ కోసం ప్రత్యర్థి వర్గం హామీ ఇస్తున్నట్లు ఎవరి దగ్గర నుంచో డబ్బులు తేవడం కాకుండా, ముందుగా మా ప్యానెల్ సభ్యులమే విరాళాలిస్తాం. అలాగే, ఆరు నెలలకొకసారైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు నటీనటులం వెళ్ళి, వినోద కార్యక్రమాలు చేసి, నిధులు సేకరిస్తాం’’ అని జయసుధ పేర్కొన్నారు. సేకరించగల నిధి, లబ్ధిదారుల సంఖ్యను స్పష్టంగా పేర్కొనడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు. కేవలం కొద్దిమందికి కాకుండా, ప్రత్యేక సర్వే చేసి, అర్హులైన అందరికీ వైద్యబీమా, పెన్షన్ ఇస్తామంటూ జయసుధ తమ ప్యానెల్ వాగ్దానాలను వివరించారు. అలాగే, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న కళాకారులకు అవకాశాలు వచ్చేలా సాయపడతామనీ హామీ ఇచ్చారు. కళాకారుల కష్ఠనష్టాలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక గ్రీవెన్‌‌స సెల్ పెడతామన్నారు. పేద కళాకారుల ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకు సాయం చేసేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారు.
 
 ఇది ఇలా ఉండగా, ‘‘నాలుగైదు రోజులుగా ఈ ఎన్నికల వ్యవహారం పెద్ద వినోదంగా, టీవీ చానల్స్‌లో చర్చలతో టి.ఆర్.పి. రేటింగులు పెరిగేలా తయారయ్యాయ’’ని జయసుధ వ్యాఖ్యానించడం విశేషం. బయట రాజకీయాల కన్నా ఈ ‘మా’ ఎన్నికల వేళ ఇక్కడ రాజకీయాలు దారుణంగా ఉన్నాయనీ, ఒకరిపై మరొకరం బురద జల్లుకోవడం ఇష్టం లేకనే దీనిపై ఏ టీవీ చానల్స్‌లోనూ చర్చలకు వెళ్ళడం లేదనీ ఆమె పేర్కొన్నారు. ‘‘మొన్న వాళ్ళు (రాజేంద్రప్రసాద్ వర్గం) నా గురించి ఎగతాళిగా మాట్లాడారు. అది చూసి, నా శ్రేయోభిలాషులు కూడా ‘నీకీ ఎన్నికలు, పోటీ అవసరమా?’ అని అడిగారు. కానీ, నేను మాత్రం ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొన దలిచా’’ అని ఆమె అన్నారు.
 
  జయసుధ ప్యానెల్ పక్షాన కోశాధికారి పదవికి పోటీ చేస్తున్న పరుచూరి వెంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న సీనియర్ నరేశ్, నటి హేమ, ఉపాధ్యక్షుడిగా ఇప్పటికే పోటీ లేకుండా ఎన్నికైన పి.శివకృష్ణ తదితరులు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘ఓడిపోతామనే భయంతో కొందరు కోర్టును ఆశ్రయించినా, ఎన్నికలు జరపాల్సిందేనంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు క్షుద్రశక్తులకు గొడ్డలిపెట్టు’’ అని నరేశ్ వ్యాఖ్యానించారు. అలాగే, టీవీ చానల్‌లో మాట్లాడుతూ నాగబాబు పేర్కొన్న కొన్ని అంశాలను ఆయన తప్పుపట్టారు. కాగా, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నవారు సైతం కావాలని పింఛన్లకు వస్తుండడంతో, అసలైన అర్హులకే వాటిని పరిమితం చేయాలని గతంలో ప్రయత్నించామనీ, అందుకే వారి సంఖ్య తక్కువగా ఉందనీ మునుపటి కార్యవర్గాల్లో పనిచేసిన శివకృష్ణ వివరించారు.
 
(Published in 'Sakshi' daily, 28th March 2015, Saturday)
..................................................

Friday, March 27, 2015

‘మా’ ఇంట ఎన్నికల మంట!

  • ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో వివాదం
  • రాజేంద్రప్రసాద్, జయసుధ ప్యానెళ్ల మధ్య ఢీ అంటే ఢీ

సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నటీనటులకు ప్రాతినిధ్యం వహించే ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో వివాదం చెలరేగింది. దీంతో ఈ నెలాఖరున జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు రసకందాయంగా మారింది. ఈ పదవి కోసం బరిలోకి దిగిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, ఆయన కన్నా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పరస్పరం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందునుంచీ రాజేంద్రప్రసాద్ వెంట ఉంటూ వచ్చి, ఆయన ప్యానెల్ తరఫున పోటీకి దిగిన నటులు శివాజీరాజా, ఉత్తేజ్.. తాము పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇక రాజేంద్రప్రసాద్‌కే మద్దతిస్తానని, ఆయనపై పోటీ చేసేది లేదని హీరో మంచు విష్ణు గతంలో ట్విట్టర్‌లో ప్రకటించగా, మరోపక్క ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు మాత్రం జయసుధకు మద్దతుగా బుధవారం ప్రకటన చేశారు. దీంతో రెండేళ్లకోసారి జరిగే ‘మా’ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠగా మారింది. చిత్ర పరిశ్రమలో ఎవరిని కదిలించినా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
 
హఠాత్తుగా నామినేషన్ల ఉపసంహరణ

ప్రస్తుతం ‘మా’ కోశాధికారిగా ఉన్న శివాజీరాజా ఈసారి ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేస్తే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నటుడు ఉత్తేజ్ ఇప్పుడు జాయింట్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగారు. తీరా ఇప్పుడు విచిత్రంగా ‘వ్యక్తిగత కారణాల రీత్యా’ అంటూ ఉత్తేజ్ పక్కకు తప్పుకొన్నారు. కాగా, ఏకాభిప్రాయంతో ఎవరో ఒక్కరే పోటీలో ఉంటారంటేనే నామినేషన్ వేశానని, ఇప్పుడు మాట మార్చి, అవతలి వైపు నుంచి నటుడు అలీని ప్రత్యర్థిగా నిలబెట్టారని శివాజీరాజా పేర్కొన్నారు. ఈ రాజకీయం నచ్చకనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజేంద్రప్రసాద్ వర్గం బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు ఆయన ప్యానెల్‌లోని నటులు కాదంబరి కిరణ్, వింజమూరి మధు, వారికి మద్దతు ప్రకటించిన నాగబాబు తదితరులు ఇందులో పాల్గొని మాట్లాడారు.

చెప్పిందొకటి.. జరిగిందొకటా?


నిజానికి ఆరేడేళ్ల క్రితమే రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్ష పదవికి మురళీమోహన్‌పైనే పోటీకి దిగి, కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి మురళీమోహన్ సహా పలువురు సినీ పెద్దలు ముందుగా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవమవుతుందని ఆయన భావించారు. అయితే, ఆఖరు క్షణంలో పోటీ అనివార్యమైంది. ఈ పరిణామానికి విస్తుపోయిన రాజేంద్రప్రసాద్ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ‘నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ జయసుధకు రాజకీయ నేతలతో చెప్పించామని, బెదిరించామని చేస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధం. ఆమె, ఆమె వెనుక ఉన్న వ్యక్తి రాజకీయాల నుంచి వచ్చారు. కానీ నేను రాజకీయాల్లో నుంచి రాలేదు’ అని ఆయన అన్నారు. ‘మేం చేస్తున్నది ధర్మయుద్ధం. అవతల మాకు ప్రత్యర్థులుగా నిలిచిందీ మా వాళ్ళే! అయితే, ముందుగా నన్ను నిలబడమని చెప్పి, అన్నిటికీ ఒప్పుకొన్న మహా పెద్దలే ఆఖరు క్షణంలో ఎందుకు మాట మార్చి, వేరొకరిని పోటీకి పెట్టారో తెలియదు. నన్ను ఎన్నుకుంటే రూ. 5 కోట్లు సేకరించి నిధి ఏర్పాటు చేస్తా. పేద కళాకారులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, అర్హులందరికీ పెన్షన్ అందేలా చూస్తా. దేశంలో మరే అసోసియేషన్‌కూ లేనంత అందమైన భవనం కట్టిస్తా’’ అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఓటర్లకు సెల్‌ఫోన్లు పంచుతున్నామంటూ స్థాయి మరిచి, అసత్య ఆరోపణలు చేయడం బాధించినట్లు చెప్పారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్నికల ఆఫీసర్‌గా చేస్తున్నది మురళీమోహన్ వ్యక్తిగత లాయరేననీ, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా వారికే సన్నిహితుడైన ‘మా’ సభ్యుడని రాజేంద్రప్రసాద్ వర్గం పేర్కొంది. మరోైవె పు గతంలో ‘మా’లో ఏం జరిగిందన్నది తనకు తెలియదని, ఈసారి తమ ప్యానల్‌ను ఎన్నుకుంటే కళాకారులందరికీ మంచి చేస్తామని జయసుధ పేర్కొన్నారు. కాగా, ఇంత జరుగుతున్నా సినీ పరిశ్రమలో విభేదాలనే మాటను మురళీమోహన్ అంగీకరించడంలేదు. ‘పరిశ్రమలో వర్గ విభేదాలు, ప్రాంతీయ విభేదాలు ఎప్పుడూ లేవు. ఏదైనా విషయంలో ఎదురెదురు నిలబడినా, అది అయిపోయాక అందరం కలిసిపోతాం’ అని ఆయన అన్నారు.
 .......................................................

ఆరోపణలు, ప్రత్యారోపణలు..  

‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ అండతో బరిలోకి దిగిన జయసుధ వర్గం మంగళవారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై రాజేంద్రప్రసాద్ వర్గం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికి ఆరు పర్యాయాలు అంటే 12 ఏళ్ల పాటు ‘మా’ అధ్యక్ష పదవిని మురళీమోహన్ నిర్వహించారనీ, ఆయన పోటీ చేయబోనని చెప్పడంతోనే  కొందరు మిత్రుల కోరిక మేరకు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చారని, పెద్దలందరినీ కలసి మద్దతు తీసుకున్నారని నాగబాబు వివరించారు. నామినేషన్లు ముగిసేరోజున.. జయసుధ తదితరుల నామినేషన్లు వచ్చినట్లు ఆరోపించారు. పోటీ చేయబోనని చెప్పిన మురళీమోహన్... రాజేంద్రప్రసాద్ పోటీకి దిగిన తర్వాత ‘ఆ పదవికి తగ్గ స్థాయి రాజేంద్రప్రసాద్‌కు లేద’ని తనతో వ్యాఖ్యానించినట్లు నాగబాబు చెప్పారు. అలాగే, గతంలో ఉన్న ‘అసోసియేట్ మెంబర్‌షిప్’ను తొలగించి వర్ధమాన కళాకారులకు అసోసియేషన్‌ను దూరం చేశారని మురళీమోహన్‌పై మండిపడ్డారు. ‘నాగబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 38 మంది పేద కళాకారులకు నెలకు రూ.1,000 ఇచ్చేవాళ్లం. ఇప్పుడవన్నీ తీసేసి, ఒక్కరికే ఇస్తున్నారు. కోట్ల నిధి ఉన్న ‘మా’కు ఇదేం కర్మ? అదేమంటే, అవన్నీ తీసేశామని మా లాంటి చిన్నవాళ్ల మీద కన్నెర్ర చేస్తున్నారు’ అని కాదంబరి కిరణ్ వాపోయారు.

(Published in 'Sakshi' daily, 26th March 2014, Thursday- in Main Page)
.................................................

Thursday, March 26, 2015

‘సాక్షి’ ‘ఫ్యామిలీ’కి అనుభూతులు అనేకానేకం

సంగీతం, సాహిత్యం, సినిమా, ఆధ్యాత్మికం - ఏ రంగం తీసుకున్నా అందులోని వారంతా ఏడేళ్ళుగా ‘సాక్షి’కి ‘ఫ్యామిలీ’ మెంబర్లే! వార్తల్లోని వ్యక్తులపైనే కాక వార్తలకు అవతలే మిగిలినవారి‘అదర్‌సైడ్’ను ఆవిష్కరించి... అటు వారినీ, ఇటు పాఠకులనూ ‘రీచార్జ్’ చేయడం ‘సాక్షి’కే సాధ్యమైన ‘డబుల్ ధమాకా’!   ‘సాక్షి’తో కలసి నడుస్తున్న క్రమంలో ఎన్నో జ్ఞాపకాలు... వైయక్తికంగానూ, వ్యవస్థాగతంగానూ రసభరితమే. సంప్రదాయ సంగీత దిగ్గజం మంగ ళంపల్లితో ఒక సాయంత్రం... ‘జ్ఞానపీఠి’కా పురాధిష్ఠితులైన సి.నారాయణరెడ్డితో ఒక ఉదయం... ఆధ్యాత్మిక రంగంలో సేవలందిస్తున్న స్వామి సుఖబోధానంద, ‘రామకృష్ణ మఠం’ స్వామి జ్ఞానదానందలతో గడిపిన గంటలు... ఆధునికాంధ్ర వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు శతమానోత్సవ శుభవేళ పేజీలకందని ప్రత్యేక అనుబంధం... కుంచె కన్నీరు పెట్టిన బాపు వియోగ వేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల కన్నీటిలో తడిసిముద్దయిన ఆ అకాల తుపాను రాత్రి... అందాల ఆడబొమ్మగానే ప్రపంచం చూసే షకీలా అంతరంగంలో పేలుతున్న అగ్నిపర్వతపు లావాలో స్థాణువైపోయిన ఆ సాయంసంధ్య... ఒకటా, రెండా! పేజీలలో పొదిగిన అక్షరాల వెనుక ఒదిగిన అనుభవాలు, అనుభూతులు అనేకానేకం!!

 - డాక్టర్ రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 22nd March 2015, Sunday)
......................................

Monday, March 23, 2015

ఎల్లలు దాటిన బాక్సాఫీస్ విజయం - ‘శంకరాభరణం’

⇒తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ సినిమాలు అయిదింటి (‘లవకుశ’, ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘వేటగాడు’) తరువాత రూ. కోటి వసూళ్ళు సాధించిన తొలి సినిమా ‘శంకరాభరణ’మే!

⇒తెలుగు నాట 4 (విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్) కేంద్రాల్లో నేరుగా రజతోత్సవం జరుపు కొంది. మరో 5 కేంద్రాల్లో నూన్‌షోలతో పాతికవారాల పండుగ చేసుకుంది. విజయవాడ ‘అప్సర’లో 181 రోజులు, హైదరాబాద్‌లో షిఫ్టులతో 350 రోజులాడింది.

⇒హీరోల సినిమాలుగా తెలుగు, తమిళాల్లో వర్గీకరణ వచ్చాక మన సినిమాలు తమిళనాట ఆడడం పెద్ద విశేషం. కమలహాసన్ నటించిన కె. బాలచందర్ చిత్రం ‘మరో చరిత్ర’ (1978) మద్రాస్‌లో ఒకే థియేటర్ (సఫైర్)లో, ఉదయం ఆటలతో  596 రోజులు ఆడి, చెరగని రికార్డ్‌గా నిలిచింది. ఆ తరువాత ‘శంకరాభరణం’ (1980) ఒక్క మద్రాస్‌లోనే కాక, తమిళనాడు అంతటా బాగా ఆడింది.


 
⇒ కన్నడ సీమలో బెంగుళూరులోనే ఏకంగా 6 థియేటర్లలో తెలుగు ‘శంకరాభరణం’ శతదినోత్సవం జరుపుకొంది. ఇప్పటికీ మరే తెలుగు సినిమాకూ దక్కని రికార్డు.

⇒ అప్పట్లో తమిళనాడు, కేరళ హక్కుల్ని తమిళ నటులు మనోరమ, మేజర్ సౌందరరాజన్ కొన్నారు. ‘ఏ.వి.ఎం’ చెట్టియార్‌కు సమీప బంధువైన ఒక డిస్ట్రిబ్యూటర్ కేరళ వరకు హక్కుల్ని మనోరమ వాళ్ళ నుంచి కొన్ని వేలకు కొనుగోలు చేశారు. మలయాళ డైలాగులు, తెలుగు పాటలతో రిలీజై కోట్లలో లాభం తెచ్చింది. ఇవాళ్టికీ, శబరిమల వెళుతుంటే మలయాళ సీమలో ‘శంకరాభరణం’ ఆడియో, వీడియోలు పలకరిస్తూనే ఉంటాయి.


(Published in 'Sakshi' daily, 15th March 2015, Sunday)
..........................

దొరకునా... ఇటువంటి సినిమా !

ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర వయసు అరవైకి దగ్గర! సినిమాలో డ్యూయెట్లు లేవు... ఫైట్లూ లేవు. అంతా సంగీతం... అదీ సంప్రదాయ సంగీతం! కానీ, ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా... భాషల ఎల్లలు దాటి 35 ఏళ్ళ క్రితమే దేశాన్ని జయించింది. ప్రపంచాన్ని ముక్కున వేలేసుకొనేలా చేసింది. ఎందరెందరో కళా ఋషుల తపఃఫలమైన ‘శంకరాభరణం’ ఇన్నేళ్ళ తరువాత తమిళంలోకి

డబ్ అయి, మొన్న శుక్రవారమే జనం ముందుకొచ్చింది. మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత ఒక భాష నుంచి మరో భాషలోకి డబ్బింగైన తెలుగు సినీ స్వర్ణాభరణంగా ఇప్పుడు మళ్ళీ చరిత్రకెక్కింది.

- డాక్టర్ రెంటాల జయదేవ

అది 1980... మద్రాసు (ఇప్పటి చెన్నై) మౌంట్ రోడ్ అణ్ణా ఫ్లై ఓవర్‌కు సమీపంలోని సత్యం సినీ కాంప్లెక్స్... అప్పటికి 20 వారాలుగా అందులో ఒక సినిమా విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. అయినా సరే  కొత్త రిలీజ్‌లా తమిళ ప్రేక్షకులు ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. అదేమీ ఏ తమిళ సూపర్ స్టార్ సినిమానో కాదు. ఆ మాట కొస్తే అసలు తమిళ సినిమానే కాదు. పదహారణాల తెలుగు సినిమా. మాటలూ, పాటలూ కూడా తమిళంలోకి అనువాదం చేయని పక్కా తెలుగు సినిమా. అయితేనేం... ఉత్తమ కళా సృజనకూ, ఉత్తమ సంగీతానికీ భాష, ప్రాంతం అడ్డుగోడలు కావని మరోసారి నిరూపితమైంది. తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్న ఆ సినిమా... ప్రపంచ మంతటా తెలుగువారు ఇవాళ్టికీ శిరసెత్తి సగర్వంగా చెప్పుకొనే సినీ చిరునామా... జాతీయ అవార్డుల్లో ‘స్వర్ణ కమలం’ (ప్రత్యేక విభాగంలో) అందుకున్న ఒకే ఒక్క తెలుగు సినీ ఆణిముత్యం.... పేరు - ‘శంకరాభరణం’.

అప్పట్లో మద్రాసులో 20 వారాలు ఆడిన ఆ తెలుగు కళాఖండం మదురై, సేలమ్ లాంటిచోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది. మాటలు మాత్రం మలయాళంలోకి డబ్బింగ్ చేసి, పాటలు అలాగే తెలుగులోనే ఉంచేసి, రిలీజ్ చేస్తే కేరళలో 25 వారాలు ఆడింది. లక్షల్లో లాభాలు తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లో కనీవినీ ఎరుగని ఘట్టంగా చరిత్రకెక్కింది.
   
మూడున్నర దశాబ్దాల తరువాత... మళ్ళీ అదే మద్రాసు. మొన్న శుక్రవారం మార్చి 13న మన ‘శంకరాభరణం’ మరోసారి విడుదలైంది. అయితే, ఈసారి నవతరం తమిళులకు కూడా దగ్గరయ్యేలా పూర్తిగా తమిళంలో..! తెలుగు నుంచి అనువాదమైన తమిళ మాటలు, పాటలతో!! ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని, కలర్ కరెక్షన్లన్నీ చేసుకొని, సంగీతాన్ని డిజిటల్ మాస్టరింగ్ చేసుకొని సరికొత్త హంగులతో..!!  

నిజానికి, 1979లో రికార్డింగ్, షూటింగ్ జరుపుకొని, అదే ఏడాది సెన్సారై, కొనుగోలుదార్ల కోసం వారాల కొద్దీ వేచిచూసి, చివరకు 1980 ఫిబ్రవరిలో విడుదలయ్యాక సంచలనం రేపిన కళాఖండమిది. ‘‘అలాంటి క్లాసిక్ ఇన్ని దశాబ్దాల తర్వాత... మరో భాషలోకి అనువాదం కావడం విశేషం. అదీ మాతృక రిలీజై విజయం సాధించేసిన చోటకే మళ్ళీ డబ్బింగై, రిలీజవడం మరీ విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా ఇలా జరగలేదు’’ అని ప్రముఖ సినీ, సంగీత, కళా విమర్శకుడు వి.ఏ.కె. రంగారావు అన్నారు.

మొన్న మార్చి 13న ఏకంగా ఏడు తమిళ చిత్రాలు, 4 ఇంగ్లీష్ సినిమాల కొత్త రిలీజులతో పోటీ మధ్య వచ్చిందీ తమిళ ‘శంకరాభరణం’. ప్రస్తుతం తమిళనాట చెన్నైతో పాటు మదురై, కోయంబత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో, 18 థియేటర్లలో ఈ తమిళ ‘శంకరాభరణం’ అభిరుచి గల ప్రేక్షకుల ఆదరణతో ఆడుతోంది. మరో విశేషమేమిటంటే, ఇప్పుడు చెన్నైలో తమిళంతో పాటు కొన్ని థియేటర్లలో తెలుగు వెర్షన్‌నూ విడుదల చేశారు. ఈ కొత్త రిలీజ్‌ను కళ్ళారా చూస్తున్న ఎనిమిది పదుల తమిళ సినీ చరిత్ర కారుడు ‘ఫిల్మ్‌న్యూస్’ ఆనందన్‌కు మూడున్నర దశాబ్దాల క్రితం ‘శంకరాభరణం’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ గుర్తే. ‘‘అప్పట్లో ఈ చిత్రానికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసేందుకు సినీ, రాజకీయ, కళా రంగాల ప్రముఖులు ఉవ్విళ్ళూరారు.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంగం)లో ప్రత్యేకంగా ఒక ప్రింటే ఉంచేశారు. దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ప్రముఖుల కోసం అక్కడ చిత్ర ప్రత్యేక ప్రదర్శన జరిగేదంటే, అప్పట్లో ఆ చిత్రం అందుకున్న గౌరవాన్ని అర్థం చేసుకో వచ్చ’’ని అప్పట్లో ఆ చిత్రానికి తమిళ పత్రికా సంబంధాలు చూసిన ఆనందన్ అన్నారు. భాషాభేదం లేకుండా ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించడా నికి విభిన్నమైన కథ, దర్శకత్వ ప్రతిభ, కట్టిపడేసే సంప్రదాయ సంగీతం, పాటలు - ఇలా అనేక కారణాలు కనిపిస్తాయి. అప్పుడందరూ కూనిరాగం తీసిన ఓంకార నాదాను సంధానమౌ గానమే... అన్న తెలుగు పాట ఇప్పుడు తాజా డబ్బింగ్ వెర్షన్‌లో ‘ఓంకార నాదంగళ్...’ అంటూ అదే గాయకుడు ఎస్పీబీ నోట తమిళంలో వినిపిస్తోంది. ఇంతకీ, ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాను ఎందుకు డబ్ చేసినట్లు?
   
 ఈ తమిళ అనువాదం వెనుక అప్పటి తెలుగు చిత్ర ప్రదర్శన తాలూకు తీపి జ్ఞాపకాలెన్నో చోదకశక్తిగా పనిచేశాయి. చెన్నైలో బి.ఏ (తమిళ సాహిత్యం) చదువుకున్న నేటి తమిళ నిర్మాత ఎన్. రత్నంకి అప్పట్లో తమ తమిళ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ ‘సత్యం’ థియేటర్‌కు తీసుకెళ్ళి తెలుగు ‘శంకరాభరణం’ చూపించిన రోజులు ఈ 54 ఏళ్ళ వయసులోనూ గుర్తే. ‘‘అప్పటి నుంచి ఈ చిత్రానికీ, దర్శకులు విశ్వనాథ్ గారికీ నేను వీరాభిమానిని. ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చి, రెండు చిత్రాలకు దర్శకత్వం వహించా. ఆ పైన ఇంగ్లీషు చిత్రాల దిగుమతితో మొదలుపెట్టి, దాదాపు వెయ్యి దక్షిణ భార తీయ భాషా చిత్రాలను హిందీలోకి అనువదించా. డబ్బు సంపాదించా. అయితే, ఆత్మతృప్తి కోసం ‘శంకరాభరణం’ డబ్బింగ్ చేశా’’ అని ఈ తాజా తమిళ డబ్బింగ్ చిత్ర సారథి - నిర్మాత ఎన్. రత్నం ‘సాక్షి’కి వివరించారు.

నిజానికి, అప్పటి ఈ చిత్రానికి ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ నెగటివ్ దొరకలేదు. సౌండ్ నెగటివూ పాడై పోయింది. కానీ, రత్నం - తమిళ డబ్బింగ్ ‘శంకరాభరణం’లో ఆయనకు భాగస్వాములైన ఇతర మిత్రులు పట్టుదలగా ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రింట్‌ను తీసుకొన్నారు. దాన్ని డిజిటైజ్ చేశారు. కొత్త నెగటివ్‌ను సిద్ధం చేశారు. పాడైపోయిన సౌండ్ నెగటివ్‌నూ పునరుద్ధరించారు. ‘‘అప్పట్లో ఈ సినిమాను ప్రదర్శించిన ఢిల్లీ తమిళ సంఘం దగ్గర ఈ సినిమా ప్రింట్ ఉంది. ఒకే ఒక్క ప్రదర్శన తరువాత ఆ ప్రింట్ అక్కడే భద్రంగా ఉండిపోయింది. ఆర్కైవ్స్‌లోని ఆ ప్రింట్‌ను తీసుకొని, కొత్తగా డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడి యట్) చేసి, కలర్ కరెక్షన్ జరిపాం. తమిళంలో పాటలు రాయించి, రికార్డింగ్ చేశాం’’ అని రత్నం వివరించారు.   

తెలుగు మాతృకలో పాడిన ఎస్పీబీ, ఎస్. జానకి, వాణీ జయరామ్‌లతోనే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అవే పాత్రలకు తమిళంలోనూ పాటలు పాడించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ మీద గౌరవంతో ఆ ఉద్దండు లందరూ దాదాపు పారితోషికం తీసుకోకుండానే పాడడం మరో విశేషం. ‘ఏ తీరుగ ననుదయ చూచెదవో’, ‘మానస సంచరరే’ లాంటి సంప్ర దాయ కీర్తనల్ని అలాగే ఉంచేసి, తెలుగులో వేటూరి రాసిన మిగిలిన పాటలన్నీ తమిళంలో కొత్తగా రాయించుకొన్నారు (రచన: రాజేశ్ మలర్ వణ్ణన్, డాక్టర్ నావేంద్రన్). ఓ సంగీత దర్శకుడి (రాఘవ్) సారథ్యంలో కొత్తగా రికార్డింగ్ చేశారు. రత్నం మాటల్లో చెప్పాలంటే, ‘‘దాదాపు 30 రోజుల డబ్బింగ్, డి.టి.ఎస్‌లో రీరికార్డింగ్ - ఇలా అన్ని చేసేసరికి ఒక కమర్షియల్ సినిమాకయ్యే ఖర్చు అయింది.

అయితేనేం, తమిళ (డైలాగ్స్: రామకృష్ణన్) ‘శంకరా భరణం’ ఈ తరంవారికి కొత్త తమిళ సినిమా చూస్తున్న అనుభూతినిస్తుంది.’’ ‘పి.ఎక్స్.డి’ లాంటి ఆధునిక డిజిటల్ ప్రదర్శన విధానంతో ప్రింట్ల ఖర్చు లేకపోవడం, వారు కూడా ఈ కళాఖండాన్ని తక్కువ రుసుముకే డిజి టల్‌గా చూపడం కలిసి వస్తున్నాయి. వెరసి కాసుల కోసం కాక కళ కోసం చేసిన ఈ డబ్బింగ్ విదేశాలకూ వెళుతోంది.

భాష తెలియకపోయినా, తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ చిత్రానికి అప్పట్లో జరిగిన అభినందన సభలో సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస య్యర్ మాట్లాడుతూ, ‘‘కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించ డానికి నూరేళ్ళలో మా మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ చేయలేని పనిని ఒక్క ‘శంకరాభరణం’ చేసింది’’ అని ప్రశంసించారు. అందుకే, సినీ చరిత్రలోనే ‘శంకరా భరణం’ ఒక చరిత్ర. ఆ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో రావడం మరో కొత్త చరిత్ర. ఈ కొత్త చరిత్రకు దోహదపడ్డ తమిళ నిర్మాత రత్నం అన్నట్లు, ‘‘కావ్యాలూ, ఇతిహాసాలూ ఎన్నేళ్ళయినా నిత్యనూతనం. వెండితెర కావ్యం ‘శంకరాభరణం’ సరిగ్గా అలాంటిదే!’’
 అందుకే, దొరకునా... ఇటువంటి...సినిమా!    
 .............................................................

‘‘అప్పట్లో ‘శంకరాభరణం’ చిత్రం ఇంత గొప్పగా రావడానికి ఎంతోమంది కారణం. ఈ సినిమా కోసం అందరూ ఓ కుటుంబంలా కష్టపడి పనిచేశారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయలేం. మళ్ళీ నన్నే ఈ సినిమా తీయమన్నా ఇంత అద్భుతంగా వస్తుందా అన్నది సందేహమే. మనకున్న ఘన సంగీత వారసత్వం గురించి ఈ తరానికి తెలియజెప్పడానికే ఈ చిత్రం తీశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా చాలామంది ‘శంకరాభరణం’కి ముందు, ‘శంకరా భరణం’కి తర్వాత అంటారు. ఇప్పుడు ‘శంకరాభరణం’ తమిళ రూపం చూస్తుంటే, మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఈ సినిమా గురించి మాట్లాడడానికి, చెప్పడానికి ఎన్నెన్నో విషయాలున్నాయి.’’
- ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్, ‘శంకరాభరణం’ చిత్ర దర్శకుడు

‘‘ఆ రోజుల్లో అందరూ నిరుత్సాహపరిచినా మా ప్రయత్నం తెలుగు రూపంలోనే తమిళ నాటా అద్భుత ఆదరణ పొందింది. ఉత్తమ చిత్రం, సంగీతం, గాయనీ, గాయకుల (మహదేవన్, వాణీ జయరామ్, ఎస్పీబీ) విభాగాల్లో జాతీయ అవార్డులందుకున్నాం. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ మాటలు, పాటలతో చూసి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.’’  
 - ఏడిద నాగేశ్వరరావు, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత  

‘ముప్ఫై అయిదేళ్ళ క్రితం ‘శంకరాభరణం’ తెలుగు చిత్రానికి మద్రాసులో రికార్డింగ్ ఎక్కడ జరిపామో (అప్పట్లో విజయా డీలక్స్. ఇప్పటి పేరు ఆర్.కె.వి. స్టూడియో), సరిగ్గా అక్కడే ఇప్పుడీ తమిళ డబ్బింగ్ వెర్షన్ పాటలు విడుదలయ్యాయి. నేను 33 ఏళ్ళ వయసులో ఉండగా, తెలుగులో ఈ పాటలు పాడి, రికార్డ్ చేశా. సుమారు ముప్ఫై అయిదేళ్ళ విరామం తరువాత 68 ఏళ్ళ వయసులో ఇప్పుడీ తమిళ గీతాలు ఆలపించా. ముప్ఫై అయిదేళ్ళ నాటి సినిమా ఇప్పుడు డబ్బింగ్ చేయడమే ఒక విశేషమైతే, అప్పుడు పాడిన నేనే మళ్ళీ ఇప్పుడివీ పాడడం మరో విశేషం. ఇలాంటి భాగ్యం ప్రపంచంలో నా ఒక్కడికే దక్కిందనుకుంటా. అన్నీ అనుకొని చేసేవి కాదు. ‘శంకరాభరణం’ లాంటి కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి... అంతే!’’
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ‘శంకరాభరణం’ చిత్రానికి జాతీయ అవార్డందుకున్న నేపథ్య గాయకుడు

(Published in 'Sakshi' daily, 15th March 2015, Sunday)
.....................................

Monday, March 16, 2015

నా బోధనకు... నేనూ శిష్యుణ్ణే! - స్వామి సుఖబోధానంద (ఇంటర్వ్యూ)

నా బోధనకు...  నేనూ శిష్యుణ్ణే!
ఆయన కాషాయం ధరిస్తారు...
కానీ, ఆధునిక కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెబుతారు!


ఆయన చదివింది - భగవద్గీత, వేద వేదాంతాలు, ఉపనిషత్తులు...
కానీ, ఆయన బోధించే అంశాల్లో ‘మనీ మేనేజ్‌మెంట్’ ఒకటి!


ఆయన స్వతహాగా కన్నడిగుడు...
కానీ, సంస్కృత శ్లోకాలను ప్రస్తావిస్తూ,
ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ, కన్నడాల్లో ఒక భాష నుంచి
మరో భాషలోకి సునాయాసంగా మారుతూ, అనర్గళంగా మాట్లాడేస్తారు!


ఆయన కాలేజీ చదువు కేవలం బి.కామే...
కానీ, ఆయన రాసిన ‘మనసా! రిలాక్స్ ప్లీజ్’ సహా నూటికి పైగా పుస్తకాలు
లక్షల్లో అమ్ముడవుతున్నాయి. కోట్లమంది చదువుతున్నారు!


ఒత్తిడి నిండిన ఆధునిక జీవితంలో...
అలసిన మనసులకు... ఆధ్యాత్మిక సూత్రాలను బోధిస్తూ...
జీవన సుఖాన్ని అందిస్తున్న ఆధునిక గురువు - స్వామి సుఖబోధానంద.


హీరో చిరంజీవి నుంచి పారిశ్రామికవేత్త జి.ఎం.ఆర్. దాకా ఎందరెందరినో
తన బోధనలతో ఆకట్టుకున్న ఘనత - ఈ మోడ్రన్ స్వామీజీది!


‘లైఫ్’ మేనేజ్‌మెంట్ నుంచి మనీ మేనేజ్‌మెంట్ దాకా గడచిన మూడున్నర
దశాబ్దాలుగా కొన్ని వేల వర్క్‌షాపులు నిర్వహించడం ఆయన ప్రత్యేకత.


బెంగుళూరులో ‘ప్రసన్న ట్రస్ట్’ ద్వారా విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో
కృషి సాగిస్తూ, ఇటు ఆధ్యాత్మికత, అటు ఆధునికతల సమ్మేళనమైన
ఈ ఆధ్యాత్మిక, ‘కార్పొరేట్ గురు’ అంతరంగ ఆవిష్కరణ...


ఈ కార్తిక మాసపు ఆదివారం ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు ప్రత్యేకం.

 
 
 నమస్కారం స్వామీజీ! మీ పేరే - ‘సుఖబోధానంద’. కానీ, నిజానికి సుఖమనేది ఒక మానసిక స్థితే కదా. మరి, అది ఇతరులకు చెప్పి, చేయించగలిగిదేనంటారా? 


సన్న్యాసదీక్షలో మా గురువిచ్చిన నామమిది. మన సంప్రదాయంలో పెద్దలు పేరుపెట్టేది - దాని అంతరార్థాన్ని గ్రహించి, స్వయంగా ఆచరణలో పెట్టడం కోసం! ‘సుఖేన బోధయతి చ అసౌ ఆనందః - సుఖబోధానంద’. అంటే ఆనందమనే అంశాన్ని అనాయాసంగా (సుఖంగా) బోధించేవాడు. ఆ లక్ష్యాన్ని నాకు నిర్దేశిస్తూ, ఆ పేరు పెట్టారన్న మాట.

నవ్వుతూ నవ్విస్తూ.. మీ బోధన విధానం కూడా గమ్మత్తుగా ఉందే?

బోధన మూడు రకాలు - నారికేళ ఫలం (కొబ్బరికాయ), కదళీ ఫలం (అరటిపండు), ద్రాక్షా ఫలం. కొందరి బోధనలు కొబ్బరికాయలా పగలగొట్టి, కష్టపడితే కానీ లోపలి కొబ్బరి గుజ్జు లభించదు. మరికొందరి బోధనలు అరటిపండులా  పై తొక్కను వలిచితే, లోపలి పండు సులభంగా తినవచ్చు. ద్రాక్షా ఫలమనేది నోట్లో వేసుకుంటే చాలు, రుచి తెలుస్తుంది. నేను ఆ విధానాన్ని అనుసరించా. ద్రాక్షపండు పెడదామన్నా కొందరు సులభంగా నోరు తెరవరు. అందుకే, హాస్యరసాన్ని వినియోగిస్తుంటా. వినోదం మధ్య అసలు బోధనను జొప్పిస్తుంటా. జీవితాన్ని సుఖవంతం చేసుకొనే విధానాన్ని చెబుతుంటా. అందుకేనేమో, నన్ను ‘మోడ్రన్ స్వామీజీ’ అంటారు.
     
అసలు ఈ బోధనల వైపు ఎందుకొచ్చారు?  

చిన్నప్పటి నుంచి అధ్యాపక లక్షణాలు నాకెక్కువ. అందుకే, గురువులు అటువైపు ప్రోత్సహించారు. మొదట్లో భగవద్గీత, ఉపనిషత్తుల గురించే బోధించేవాణ్ణి. అప్పట్లో 45 ఏళ్ళ పై వయసు వాళ్ళే ఎక్కువ వచ్చేవారు. దాంతో, యువతరం ఎందుకు రావడం లేదని ఆలోచనలో పడ్డా. అవతలివాళ్ళు చెబుతున్నది వినడమనే దానిపై కాక, ఒకరితో మరొకరు మాట్లాడుకోవడమనే ‘డైలాగ్’ మీద యువతరానికి ఆసక్తి అని గ్రహించా. అలా ప్రవచన విధానం నుంచి పరస్పర సంభాషణ విధానంలోకి మారా. భగవద్గీతను ఆధునిక జీవితానికి అనుసంధానిస్తూ, వర్క్‌షాపులు చేస్తున్నా. ఆలోచించడా లనికి ప్రేరేపిస్తున్నా. ఒక్క మాటలో... ‘థాట్’(విచార్ - ఆలోచన) చలనం లేనిది. కానీ, ‘థింకింగ్’ (సోచ్‌నా -ఆలోచించడం) గతిశీలం. జీవితం కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ గతిశీలమైంది కాబట్టి, ‘థింకింగ్’ అవసరం.
 
ఆధ్యాత్మిక బోధనతో చాలా దేశాలే తిరిగినట్లున్నారు.


అవును. 25వ ఏట మొదలెట్టి ఇప్పటి దాకా బ్రిటన్, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, జర్మనీ - ఇలా ఎన్నో దేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించా.
     
మరి, మీరు నడిపే ప్రసన్న ట్రస్టు ఏమిటి?

1982లో ‘ప్రసన్న ట్రస్ట్’ ప్రారంభించాం. ‘ప్రసన్న’ అంటే ఆనందంగా ఉండడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘...ప్రసన్న చేతసా...’ అంటాడు. శారీరకంగా, మానసికంగా మాత్రమే కాదు... ఆత్మస్థితిలో ఆనందంగా ఉంటే, జీవితంలోని సమస్యలన్నీ దూదిపింజలైపోతాయి. మన భగవద్గీతనూ, అదే సమయంలో మహమ్మదీయ, క్రైస్తవ, బౌద్ధ, జైన తాత్త్వికతలను ప్రస్తావిస్తూ ఈ జీవన రహస్య బోధన మా ‘ప్రసన్న ట్రస్ట్’ మొదటి పని. అనాథాశ్రమ నిర్వహణ, వికలాంగులకు కృత్రిమ అవయవాలు సమకూర్చడం, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ - పునరావాస చర్యలు చేపట్టడం ట్రస్ట్ చేస్తున్న రెండో పని. మతాలకు అతీతంగా కార్పొరేట్ ప్రపంచంలో ఆధ్యాత్మికత వికాసానికి కృషి చేయడం మూడో పని. నేనెప్పుడూ ఆర్థిక వ్యవహారాలు చదివినవాణ్ణి కాదు, తెలిసినవాణ్ణి కాదు. కానీ, ‘బిర్లా సన్‌లైఫ్’ లాంటి వాళ్ళకు ‘ఆధ్యాత్మిక దృష్టితో ఆర్థికనిర్వహణ’ లాంటి అంశాలపై అనేక వర్క్‌షాపులు చేశా. డబ్బు విషయంలో ఆధ్యాత్మిక దృష్టేమిటి? ఎలా వ్యవహరించాలనేది చెప్పా. ఇలా 35 ఏళ్ళుగా లక్షలమందికి సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించా.

చాలా భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీ పూర్వాశ్రమ వివరాలేంటి?

మాది కర్ణాటక. పూర్వాశ్రమంలో నా పేరు ద్వారకానాథ్. మాది కలిగిన కుటుంబం. బెంగుళూరులోని అప్పటి ప్రసిద్ధ పాఠశాలల్లో చదువుకున్నా. సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో బి.కామ్ చదివాను. ఇప్పటి డిస్కో సెషన్స్ లాగా 1970లలో ‘జామ్’ సెషన్స్ అని జరిగేవి. కళాశాలలో చదువుతుండగా నా తోటి స్నేహితుల్లో చాలామంది మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్లు గ్రహించా. జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళంతా ఆనందంగా ఉండాలనుకుంటున్నారే తప్ప, నిజంగా ఆనందంగా లేరని నాకు అర్థమైంది. ఆనందం ఎక్కడ ఉందనే అన్వేషణ మొదలుపెట్టా. అప్పుడే బెంగళూరులో స్వామి చిన్మయానంద రెండో జాతీయ గీతాయజ్ఞం చేస్తున్నారు. అక్కడకు వెళ్ళి ఆయన ప్రవచనం వినడంతో నా జీవితం మారింది. ఆనందం లభిస్తుందని భ్రమపడుతున్నవాటిలో నిజమైన ఆనందం లేదని అర్థమైంది.

 ‘ఆత్మలో ఎవరు ఆనందాన్ని చూస్తారో, వారు విజయులవుతార’ని భగవద్గీతలో చెప్పిన బోధ విన్నా. సుఖం, ఆనందం అనేవి ఈ భౌతికమైన పదార్థంలో లేదు. మనస్సులోనే ఉందని క్రమంగా గ్రహించా. అలా 19వ ఏట నా ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. చిన్మయా మిషన్‌లో చేరి, ఆశ్రమవాసిగా ఉత్తర కాశీలో, బొంబాయిలోని ‘పొవై’లో శంకర భాష్యంతో గీత, ఉపనిషత్తులు చదివా. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశా. అది కేవలం డిగ్రీ చదువు కాదు, నా జీవితపథాన్ని మార్చేసిన అధ్యయనం.

కానీ ఈ స్థాయికి చేరాలంటే చిన్నప్పుడే బీజాలు పడి ఉండాలే?

అవును. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ, మా అమ్మ చెప్పిన మాటల ప్రభావం నాపై ఎక్కువ. మా అమ్మమ్మ చెప్పిన నీతికథలు నాకిప్పటికీ గుర్తే. భారతంలో యుధిష్ఠిరుడంతటి వాడు ఎంతో ధర్మజ్ఞుడు అయినప్పటికీ, కేవలం జూదమాడడమనే బలహీనత వల్ల ఎంత దురవస్థ పాలయ్యాడో చెప్పేది. మనమెంత గొప్పవాళ్ళం, మంచివాళ్ళమైనా, ఒక్క బలహీనతతో పతనమవుతామని మాట ఇవాళ్టికీ మర్చిపోలేదు.

మరి మీ సన్న్యాసాశ్రమ స్వీకరణ గురించి...

స్వామి చిన్మయానంద నాకు బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించారు. బ్రహ్మచారి నిత్యచైతన్య అని దీక్షానామమిచ్చారు. వేదాధ్యయనమయ్యాక, నా పద్ధతి, ఆలోచన గమనించి స్వామి దయానంద నాకు సన్న్యాస దీక్షనిచ్చారు. అప్పుడు గురువులిచ్చిన పేరే - ఈ ‘సుఖబోధానంద’.‘కామి గానివాడు మోక్షగామి కాడు’ అంటారు. మరి, మీ లాంటివారేమో బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్న్యాసం స్వీకరించడం...    (మధ్యలోనే అందుకుంటూ...) బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించి, ఆ తరువాత సన్న్యాసాశ్రమంలోకి వెళ్ళడం ఒక పద్ధతి. అలా కాక, నేరుగా బ్రహ్మచర్యం నుంచే సన్న్యాసం తీసుకోవడమనే విధానానికి ఆది శంకరాచార్యులు బాట వేశారు. నాతో పాటు వేద, వేదాంత అధ్యయనం చేసినవారిలో సగం మందే ఇలా సన్న్యాసాశ్రమం స్వీకరించారు. మిగతా సగంమంది గృహస్థాశ్రమంలోకి వెళ్ళారు. అయినా, గృహస్థాశ్రమంలోని బాదరబందీలన్నీ అనుభవంలోకి వచ్చాకే సన్న్యాసం స్వీకరించాలనీ, అప్పుడే అందరికీ బోధించాలనీ అనుకుంటే తప్పు. పైల్స్‌తో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేయడానికి అనుభవం కోసం డాక్టర్ కూడా పైల్స్ రప్పించుకోనక్కర లేదు. డ్రగ్‌‌సకు బానిసలైనవారిని సరైన దోవలో పెట్టేలా బోధించడానికి డ్రగ్స్ వాడిన అనుభవం మనకు ఉండాల్సిన పని లేదు. ఇదీ అంతే!
     
ఇన్నేళ్ళుగా ఇంతమందికి బోధిస్తున్న మీ మీద ఎవరి ప్రభావం ఉంది? మీ బోధనలకు వేల సంఖ్యలో జనం రావడానికి కారణం?
 
స్వామి చిన్మయానంద, స్వామి దయానంద ప్రభావం ఎక్కువ. అప్పట్లో మా గురువులు చేసిన గీతా యజ్ఞాలకూ, ప్రవచనాలకూ పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారు. దానికి నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పుడింకా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. నెలకు దాదాపు 4.5 లక్షల మంది మా వెబ్‌సైట్‌ను వీక్షిస్తూ, ఈ బోధనలతో సాంత్వన పొందుతున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జీవితంలో ఒత్తిడి స్థాయి పెరిగింది. అలాగే, సరికొత్త వ్యామోహాలు, మనిషిని మోహంలో పడేసే వలలు - ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీటన్నిటికీ తోడు మీడియా, టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అందుకే, ఇప్పుడు గతంలో కన్నా ఎక్కువ మంది ఆధ్యాత్మికత వైపు వస్తున్నారు. అయితే, చాలామంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికంటూ రకరకాల వినోదాల వైపు మొగ్గుతున్నారు. అలా పలాయనం ద్వారా ఆ క్షణానికి ఒత్తిడికి దూరమైనా, మళ్ళీ ఒత్తిడిలోనే పడుతున్నారు. ఇలా పలాయనంతో కాక, మన లోపలి ఖాళీని చూడడం అవసరం. దాన్ని అన్వేషిస్తే, ఒత్తిడి దూరమై, ఆనందం లభిస్తుంది.

ఆధునిక కాలంలో, ఇప్పటి జీవనంలో భగవద్గీత ప్రాముఖ్యం?

భగవద్గీత లాంటి ఉత్తమ గ్రంథం ప్రపంచంలో మరొకటి  లేదంటా. మతోన్మాదంతో చెబుతున్న మాట కాదిది. వివిధ మత గ్రంథాలు చదివి, వాటిలోని మంచిని వర్క్‌షాపుల్లో ప్రస్తావించే వ్యక్తిగా అంటున్న మాట. కానీ, వేలమంది గోపికలతో తిరుగుతూ, యుద్ధతంత్రాలు నడిపి, మామూలు వ్యక్తిలా జీవించిన శ్రీకృష్ణుడు దేవుడేమిటనేవాళ్ళున్నారు. దేవుడంటే, సరైన మనిషి అంటే ఫలానాలా ఉండాలని మీకు మీరు అనుకొని, ఆ పరిధిలోకి శ్రీకృష్ణుణ్ణి ఇరికించాలని ప్రయత్నించకండి. పారమార్థిక సత్తా (యాబ్‌సొల్యూట్ రియాలిటీ), వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా (సబ్జెక్టివ్ రియాలిటీ)- ఈ మూడూ ఉన్నాయి ఆయనలో. ఆయన చేసినదంతా ధర్మం ప్రాతిపదికన చేసిందే తప్ప, మరొకటి కాదు.

కురుక్షేత్రంలో కురు - పాండవ సేనల మధ్య శ్రీకృష్ణుడు అంతసేపు ‘గీత’ చెప్పడం సాధ్యమా అనేవాళ్ళూ ఉన్నారు...

చూడండి. కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు బహుశా అర్జునుణ్ణి యుద్ధవిముఖుణ్ణి చేయడానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడేమో అని కౌరవులు అనుకొని ఉండవచ్చు. పాండవులేమో, అర్జునుడికి కృష్ణుడు శస్త్రాస్త్రాలు బోధిస్తున్నాడేమో అనుకొని ఉండవచ్చు కదా! తార్కికంగా చెప్పాలంటే అలా చెప్పవచ్చు. నిజానికి, కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగింది ఇన్‌ట్యూటివ్ డైలాగ్. స్వప్నం లాంటిది. మూడు నిమిషాల కలలోనే మనకు ఒక జీవితమంతా కనిపిస్తున్నప్పుడు, ఆ టైమ్‌స్కేల్‌తో చూసినప్పుడు యుద్ధక్షేత్రంలో భగవద్గీత ఎందుకు జరగదు!

మరణంపై మీరేమంటారు? పునర్జన్మలున్నాయా?

మరణమనేది జీవితానికి శత్రువు కాదు. మరణమనేది జీవితంలో జరిగే ఓ ఘటన. అది మన జీవితమనే యాత్రను మరో విధంగా పొడిగిస్తుంది. అది తెలియక మృత్యువంటే భయపడుతూ ఉంటాం. జీవితాన్ని సరిగ్గా జీవించకపోవడంతో వచ్చిన తంటా ఇది. సరిగ్గా జీవించినవారికి మృత్యువంటే భయం ఉండదు. పునర్జన్మ అంశానికి ప్రాధాన్యమివ్వను. ఎప్పుడో వచ్చే జన్మ కన్నా, ఇప్పుడున్న జన్మలో చేయాల్సిన మంచి పనులపై దృష్టిపెట్టడం ముఖ్యం.

మరి, విగ్రహారాధన గురించి ఏమంటారు?

విగ్రహారాధనలో తప్పేమీ లేదు. దాన్ని ఒక మతానికి ఆపాదిస్తూ, అపార్థం చేసుకోవడం తప్పు. సామాన్యులకు అర్థమయ్యేలా విగ్రహారాధనతో మొదలుపెట్టి, క్రమంగా నిరాకార బ్రహ్మను ఆరాధించే స్థితికి తీసుకురావాలి. బెంగుళూరులో ‘నిర్గుణ్ మందిర్’ నిర్మించాం. అక్కడ మంత్రోచ్చాటన ద్వారా అన్నింటా దేవుణ్ణి చూడడం సాధన చేయవచ్చు.

సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యా ధోరణికి మీ పరిష్కారం?

జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం మన మంచికే అనుకోవాలి. అలా అనుకోనివారు, వాటి నుంచి లబ్ధి పొందడం తెలియనివారే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ప్రతి అనుభవాన్నీ మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి వినియోగిస్తే ఇబ్బంది ఉండదు.
     
కానీ, ఇవాళ ఉద్యోగ బంధాలూ క్లిష్టమయ్యాయి?

పై అధికారి ఎప్పుడూ తన కింది ఉద్యోగికి ప్రేరణనందించాలి. సమర్థంగా పనిచేయడానికి అవసరమైన విద్య, నైపుణ్యమివ్వాలి. ప్రోత్సహిస్తూనే, అవసరమైతే దండనకు వెనుకాడకుండా ఉండాలి. దీని వల్ల ఎవరైనా సరే చక్కటి పై అధికారి అవుతారు. ఇక, కింది ఉద్యోగులకు తమ పై అధికారితో స్నేహ సంబంధాలుండాలి. కలసికట్టుగా పనిచేయడం అలవరచుకోవాలి. చెప్పినపని చేయడానికి సిద్ధమన్నట్లుండాలి. అప్పుడు సంబంధాలు బాగుంటాయి.

మనీ మేనేజ్‌మెంట్ విషయంలో మీరిచ్చే సలహా?

మనం డబ్బును నిర్వచించాలే తప్ప, మనల్ని డబ్బు నిర్వచించకూడదు. అది కీలకం.‘మనీ మేనేజ్‌మెంట్’లో ప్రధానమైనది - రిస్క్ మేనేజ్‌మెంట్ తెలియడం. ఒకే వ్యూహానికి పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ వ్యూహం కూడా ఉండాలి. అలాగే, మరో ముఖ్య విషయం - డబ్బును ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి. దురాశ ఉండకూడదు. ఏం కావాలన్నది స్పష్టత ఉండాలి. సౌకర్యంగా జీవించడానికి తగినంత సంపాదించడం తప్పు కాదు కానీ, ఎంత సంపాదించినా ఇంకా కావాలని దురాశ పడితే, అది దుఃఖహేతువు.

సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి, విజయాలు సాధించినవారు కూడా అసంతృప్తితోనే బతుకుతున్నారు. ఎందుకలా?

సఫలత (సక్సెస్) అనేది అంతిమం కాదు. అది వచ్చినంత మాత్రాన పరిపూర్ణత వచ్చినట్లు కాదు. ఎన్నెన్నో విజయాలు సాధించిన ప్రసిద్ధ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మొదలు ఇవాళ్టి వాళ్ళ దాకా ఎంతమంది పరిపూర్ణత లేక జీవితాలను అంతం చేసుకున్నారో మనందరం చూశాం. అందుకే,  జీవితంలో పరిపూర్ణత కోసం ప్రయత్నించాలి. సజ్జన, సాధు సాంగత్యంలో ఆ దిశగా పయనించాలి.
   
కానీ, ఆధ్యాత్మికత ముసుగులో దొంగ స్వాములూ వచ్చేశారే...


(చటుక్కున అందుకుంటూ...) ఒక్క హిందూ మతాన్నే లక్ష్యంగా చేసుకొని విమర్శించడం తగదు. ప్రతి మతంలోనూ ఈ దొంగస్వాముల ధోరణి వచ్చింది. కలియుగంలో అన్ని రంగాల్లో బూటకపు వ్యక్తులొచ్చేశారు. ఇవాళ సరైన గురువు దొరకాలని చూస్తున్నవారందరూ, ముందుగా తాము సరైన శిష్యులుగా ఉండాలి. మీరు సరైన శిష్యులైతే, సరైన గురువు లభిస్తారు. పైగా, గురువు అంటే మానవ రూపంలోని వ్యక్తే కానవసరం లేదు. దత్తాత్రేయుల వారు ఆకాశం, వాయువు, కుక్క, కోడి - ఇలా 24 మంది గురువులన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నానన్నారు. కాబట్టి, సమస్త జీవకోటినీ గురువులుగా భావిస్తే, ఎంతో నేర్చుకోవచ్చు.

గురువులు ముందుగా ఆచరించి, శిష్యులకు చెప్పాలంటారు. అలా ముందుగా మీరు చేసి, ఆ పైనే శిష్యులకు బోధించినవి?

శ్రీకృష్ణుడే ‘అభ్యాసేన తు కౌంతేయ’ అన్నాడు. అభ్యాసం ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధిస్తాయి. సంగీతమైనా సాధన చేస్తే కదా పట్టుబడేది. అయితే, ఒకటి పూర్తిగా ఆచరించి, ఆ తరువాతే ఇతరులకు బోధించాలనే సిద్ధాంతాన్ని నమ్మను. ఇతరులకు బోధిస్తున్న సమయంలో నా బోధనకు నేనూ శిష్యుణ్ణే. ఆ అవగాహన, వినమ్రత ఉంటే మనల్ని మనం మెరుగుపరుచుకుంటాం.
     
చుట్టుపక్కలవేవీ అంటకుండా జీవితం కుదిరేనా?

నీటిలోని తామరాకును చూడండి. నీటిలోనే ఉంటుంది. కానీ, నీళ్ళంటవు. అలా తామరాకు మీద నీటిబొట్టులా గడపాలి. ఆఫీసులో పార్టీకి వెళ్ళాల్సొచ్చిందనుకుందాం. వెళ్ళండి. తప్పు లేదు. కానీ, అక్కడ మనుషులతో గడపాలి కానీ, దురభ్యాసాలతో కాదు. వర్తమాన వ్యవహారంలో ఉండాలి కానీ, దాన్ని మనసుకు ఎక్కించుకోకూడదు.

50వ పడిలో మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారట. ఎందుకలా?

మార్షల్ ఆర్ట్ అంటే, ధ్యానానికి అవసరమైన ఏకాగ్రతను అలవరచుకొనే యోగం. బౌద్ధ సన్న్యాసులు దీన్ని అనుసరిస్తుంటారు. పాము, కొంగలను చూసి, ‘తాయ్-చీ’ని కనిపెట్టారు. విల్లంబుల సూత్రాన్ని అనుసరించి మరో విద్య కనుగొన్నారు. నేను కూడా ‘అకీ -జు-జుత్సు’ అనే మార్షల్ ఆర్ట్‌ను బౌద్ధ భిక్షువుల నుంచే నేర్చుకున్నా.

{పస్తుతం మీ దృష్టి ప్రధానంగా దేని మీద ఉంది?

వీలైనంత ఎక్కువ మందికి బోధనల ద్వారా సాంత్వన కలిగించడం మీదే నా దృష్టి అంతా! ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ మా ప్రసన్న ట్రస్ట్ కార్యక్రమాలు విస్తరిస్తున్నాం. నా దగ్గర శిక్షణ పొందినవారు అక్కడ అవసరమున్నవారికి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. దాదాపు నూటికి పైగా పుస్తకాలు రాశా. సరళంగా సాగే ‘మనసా! రిలాక్స్ ప్లీజ్!’ లాంటి నా రచనలు అనేక భాషల్లో లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి.

హీరో చిరంజీవి సహా ప్రముఖులు మీ శిష్యులట!

(నవ్వేస్తూ...) నా బోధనలు, జీవితసారాన్ని చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పే తీరు నచ్చి నన్ను కలిసేవారిలో హీరో చిరంజీవి, జి.ఎం.ఆర్. సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు లాంటి వారు చాలామందున్నారు.

భౌతిక ప్రపంచంలో మీ ఆధ్యాత్మికసామ్రాజ్య విలువ?

(గంభీరంగా...) ఆధ్యాత్మికతను మేము వ్యాపారం చేయలేదు. దానితో కోట్లు సంపాదించి, ఆస్తులు కూడబెట్టుకొనే ప్రయత్నమూ చేయలేదు. ఏ పని చేసినా స్వచ్ఛంగా, నిజాయతీగా చేయడం, ఆర్థిక విషయాల్లో అత్యంత పారదర్శకంగా ఉండడాన్ని నేను నమ్ముతాను. మాకు రాజకీయ పార్టీలు, నేతలెవరితోనూ సంబంధాలు లేవు. ట్రస్టు తరఫున చేస్తున్న సేవ, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కావల్సిన సొమ్ము భక్తుల నుంచే వస్తోంది. తిరిగి సామాన్యుల సంక్షేమానికే వినియోగిస్తున్నాం.

ఇంత పేరుప్రతిష్ఠలున్నవారెందరికో వందల కోట్లున్నాయి.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారి ‘స్పీకింగ్ ట్రీ’ ఇప్పుడు దేశంలోని అగ్రశ్రేణి ఆధ్యాత్మిక బోధకులలో నేను నాలుగోవాడినని పేర్కొంది. మొదటి ముగ్గురినీ, నన్నూ పోల్చి చూస్తే నా దగ్గరున్న మొత్తం అతి స్వల్పం. మాకున్నది బెంగుళూరులోని ఒకే ఒక్క ఆశ్రమం. డబ్బులో మునిగి తేలడం లేదు, అలాగని సాధారణ అవసరాలకు డబ్బు కొరత లేదు. అది చాలు ఆధ్యాత్మిక ఉద్యమంలో నేను ముందుకు నడవడానికి!
     
మీ మీద మీ అమ్మ గారి ప్రభావం చాలా ఎక్కువటగా?

మా అమ్మ రుక్మిణి చాలా తెలివైనది. ఆమెకి ఇప్పుడు 81 ఏళ్ళు. జీవితంలో నాకు ప్రాక్టికల్ గురువు ఆవిడే. ‘‘అడవి పువ్వులా ఉండాలి. పరిమళం కొంచెమైనా, దాన్ని అందరికీ పంచుతుంది’’ లాంటి ఆమె మాటలు మర్చిపోలేను.
     
ఇటీవలి కాలంలో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం?

ఇటీవల లక్నోలో అక్కడి రామకృష్ణా మిషన్ శాఖ పెద్ద స్వామి ముక్తినాథానందను కలిశా. ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మికతను జనంలోకి చొచ్చుకొనిపోయేలా కృషి చేస్తున్నందుకు అభినందించారు. ‘ఆధునిక వివేకానందుడి’గా నన్ను అభివర్ణించారు. ఆ వ్యాఖ్య ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఆఖరుగా సామాన్యుల సుఖానికి మీరు చెప్పే ‘జీవన మంత్ర’?

సాక్షాత్తూ సూర్యుడు చేయలేని పనిని, ఒక చిన్న దీపం చేయగలదు. నిశిరాత్రిలో వెలుగులు విరజిమ్మగలదు. ఆ చిరుదీపమే - ఆత్మవిశ్వాసం. జీవితంలో ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. శ్రద్ధతో, నమ్మకంతో అడుగు వేయాలి. అప్పుడు విజయం వరిస్తుంది.
 

 - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ

.......................................
Box1 

 ఎంతోమందికి మానసిక ప్రశాంతతను అందించడానికి వర్క్‌షాపులు చేస్తున్నారు. మీ అనుభవంలో జనం ఎదుర్కొంటున్న అయిదు ప్రధాన సమస్యలేంటి?

 మానసిక ఒత్తిడి, ఇతరులతో బంధాలు, మందు లేని మానసిక గాయాలు, స్వప్నం సాకారం కాకపోవడం, ఎదుటివాళ్ళేమనుకుంటున్నారోనన్న బెంగ - ముఖ్య సమస్యలు.


మరి వీటికి మీరిచ్చే విరుగుడు?


మానసిక ఒత్తిడి సంగతే తీసుకుంటే, పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడి కలగడం లేదు. కేవలం మనఃస్థితి వల్ల ఒత్తిడి ఫీలవుతున్నాం. దాన్ని అర్థం చేసుకుంటే, మనఃస్థితిని నియంత్రణలో పెట్టుకుంటే చాలు. ఇక, ఇతరులతో అనుబంధాల మాటకొస్తే, ఎదుటివాళ్ళు మనకు ఎలా ఉపయోగపడతారా అని ఆలోచిస్తున్నాం. భార్య - భర్త, తండ్రీ బిడ్డ... ఇలా అన్ని అనుబంధాల్లోనూ అదే సమస్య. కాబట్టి, అవతలివారిని ఉపయోగించుకోవాలని చూడకుండా, చేతనైనంతలో వారికి మనమే ఇవ్వడం, సాయపడడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇక, మానసిక గాయం విషయానికి వస్తే, జరిగిన సంఘటన కన్నా, మనసులోని ఆలోచన మనల్ని బాగా గాయపరుస్తుంది. ద్రౌపది నవ్వినందు కన్నా, ఆమె నవ్వింది, అవమానించిందన్న ఆలోచనే దుర్యోధనుణ్ణి బాధించింది. నాలుగోది - ఫలానాది కావాలంటూ కలగనడం ఒక రకంగా భవిష్యత్తు తాలూకు భావన. వర్తమానాన్ని వదిలేసి, భవిష్యత్తు మీదే దృష్టి పెట్టడం తప్పు. అయిదో అంశం - మనకు మనం ఆనందంగా, హాయిగా ఉండకుండా ఎంతసేపటికీ అవతలివాళ్ళ దృష్టిలో బాగుండాలని కోరుకుంటాం. అలా మన టీవీ రిమోట్ కంట్రోల్ ఎదుటి వ్యక్తి చేతిలో పెడతాం. అది తప్పు.
 ................................................


Box 2 

 ఇటీవల చదివిన పుస్తకాలు?

గతంలో బాగా చదివేవాణ్ణి. కానీ, ఇటీవల పుస్తకాలు చదవడం తగ్గింది. సామాన్యులు తమ జీవితాన్ని సరళం చేసుకొనేందుకు వీలుగా అందరికీ అర్థమయ్యేలా నా నిరంతర వ్యక్తిగత పరిశోధన నుంచి నేనే స్వయంగా పుస్తకాలు రాస్తున్నాను.

 మీరు సినిమాలు చూస్తారట. బాగా నచ్చిన సినిమా?

(నవ్వేస్తూ...) సినిమా చూడడం తప్పు కాదు. దేని కోసం చూస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నామన్నది ముఖ్యం. ఇటీవల ‘బ్లేమ్ ఇట్ ఆన్ ది స్టార్స్’ చూశా. బహుశా ఈ కథ తెలుగులో కూడా తీశారనుకుంటా. ఒక క్యాన్సర్ పేషెంట్‌కీ, కుడి కాలు లేని మరో వ్యక్తికీ మధ్య జరిగే కథ. వాళ్ళ ప్రేమ, జీవితానికున్న తాత్త్విక నిర్వచనం - ఇవన్నీ ఉన్న సినిమా అది.

సన్న్యాసులైన మీరు ప్రేమ కథలు చూడడమా?

(అందుకుంటూ...) ప్రేమ అనగానే తప్పుడు అర్థం తీసుకోకండి. ఒక తల్లికీ, బిడ్డకూ మధ్య ప్రేమ ఉంటుంది. ఒక గురువుకీ, శిష్యుడికీ మధ్య ప్రేమ ఉంటుంది. ప్రేమ, కరుణ లేకపోతే ఈ ప్రపంచం, ప్రాణి కోటే లేవు. ఆ దృష్టిలో మనం చూడాలి. ప్రేమ భావన అనంతం. దాన్ని కొలవలేం.

అంతర్జాతీయ వేదికలపైనా మీరు ఆధ్యాత్మికవేత్తగా ప్రాతినిధ్యం వహించినట్లున్నారు?

2005లో అనుకుంటా. దావోస్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో ప్రపంచం మొత్తం మీద నుంచి వంద మంది ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భారత్ తరఫున ఆధ్యాత్మిక రంగం నుంచి హాజరయ్యా. అలాగే, ఐక్యరాజ్య సమితిలో జరిగిన సదస్సులోనూ హిందూధర్మ ప్రతినిధిగా పాల్గొన్నాను. అప్పుడే తొలిసారిగా నరేంద్ర మోడీ, నేను కలిశాం. మాట్లాడుకున్నాం. ఇటీవల కలిసినప్పుడు అవి గుర్తు చేసుకున్నాం.

‘కార్పొరేట్ గురు’ అని పేరు తెచ్చుకోవడం ఏమనిపించింది?

 (నవ్వేస్తూ...) అది నేను పెట్టుకున్నది కాదు. మీ లాంటి వాళ్ళు పెట్టినపేరు. కార్పొరేట్ ఉద్యోగుల నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరికీ వర్క్‌షాపులు పెట్టి, సరళమైన జీవన సూత్రాలను బోధిస్తుండడంతో పత్రికల వాళ్ళు అలా రాశారు. అప్పటి నుంచి అదే పాపులరైపోయింది.
  
మీ మార్గంలో అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు?

ఇప్పటికీ దేశంలోని అజ్ఞానం, అవిద్య లాంటివన్నీ చూసినప్పుడు, సంతృప్తి కన్నా అసంతృప్తినిచ్చిన క్షణాలే ఎక్కువ. కాకపోతే, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమనే ఈ ప్రయాణం తృప్తినిస్తోంది.
 
ఇన్నేళ్ళుగా బోధిస్తున్న మీకే అంతుచిక్కని సంగతి?

 ఎందరో ఆధ్యాత్మిక బోధకులు, గురువులు చెవినిల్లు కట్టుకొని చెబుతున్నా, ఇప్పటికీ కొందరు మారకపోవడం! సందేహిస్తూ ఉండడం! జీవితమంతా సంపాదన, శరీర సుఖాల పైనే దృష్టి పెడుతుండడం!
 
 - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 9th Nov 2014, Sunday)
.........................................

Thursday, March 12, 2015

ఆ ఫొటోలు నావి కావు! - నటి రాధికా ఆప్టే

 రాధికా ఆప్టే... తెలుగు సినిమాల్లో చేస్తున్న తెలుగు 
తెలియని మరాఠీ నటి... రంగస్థలం నుంచి 
కళాత్మక సినిమా మీదుగా, కమర్షియల్ సినిమాలోనూ
 చకచకా అడుగులు వేస్తున్న నవతరం నాయిక.
 మొన్న రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘రక్తచరిత్ర’...
 నిన్న బాలకృష్ణ సరసన ‘లెజెండ్’... ప్రస్తుతం మళ్ళీ 
బాలకృష్ణ పక్కనే త్వరలో జనం ముందుకు రానున్న ‘
లయన్’. ఇటీవలే వచ్చిన హిందీ చిత్రం ‘బద్లాపూర్’తో 
మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారామె. మరాఠీ,
 హిందీ, తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూ 
పుణే, బొంబాయి, హైదరాబాద్, చెన్నైల మధ్య 
తిరుగుతున్న 29 ఏళ్ళ ఈ కథా నాయికతో ‘సాక్షి’ 
జరిపిన ప్రత్యేక భేటీ...

ఆ ఫొటోలు నావి కావు!
  తెలుగు సినిమాల్లో నటించడం ఎలా ఉంది?
 మొన్న మొన్నటి వరకు నాకు హిందీ, మరాఠీ చిత్రాలతో, కొద్దిగా తమిళ
చిత్రాలతో పరిచయం. కానీ, ‘రక్తచరిత్ర’ దగ్గర నుంచి అడపాదడపా
తెలుగు చిత్రాల్లో నటించడం నాకు ఒక కొత్త అనుభవం. హిందీ,
మరాఠీ సినిమాలతో పోలిస్తే, తెలుగు చిత్రాలు పూర్తిగా భిన్నంగా
ఉంటాయి. ఇక్కడి భాష, సంస్కృతి వేరు. అంతేకాకుండా, తెలుగులో
నేను నటించిన ‘లెజండ్’, తాజా ‘లయన్’ లాంటివి ప్రధానంగా భారీ
బడ్జెట్ చిత్రాలు. నేనేమో ఎక్కువగా సమాంతర చిత్రాలలో నటిస్తుంటా.
 కాబట్టి, కొత్త సంగతులు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం.
ఇక్కడ పాత్రలను ఎలా తీర్చిదిద్దుతారు, ఈ సంస్కృతిలో ఏవి
పాపులర్, ఏవి పాపులర్ కావు అని తెలుసుకుంటున్నా. పైగా,
రంగస్థలం నుంచి వచ్చిన నటిగా సంస్కృతి అనేది సినిమానూ,
సినిమా అనేది మన సంస్కృతినీ ఎంతగా ప్రభావితం చేస్తుందనేది
అధ్యయనం చేయడానికి కూడా ఇది ఉపకరిస్తోంది.

 అసలింతకీ మీకు తెలుగులో తొలి అవకాశం ఎలా వచ్చింది?
 నిజానికి, మాది సినిమాలతో సంబంధం లేని కుటుంబం.
మా నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు...
మహారాష్ట్ర అంతటా పేరున్న న్యూరోసర్జన్. మా అమ్మ జయశ్రీ
ఆప్టే పేరున్న ఎనస్థీషియన్. నేను, ఇద్దరు తమ్ముళ్ళు -
మొత్తం ముగ్గురం. లండన్‌లో నృత్యం కూడా నేర్చుకున్న
నేను రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ
రంగానికీ, హిందీ సినీ రంగానికీ వెళ్ళాను. నా సినిమాలు
చూసి, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సహాయకులెవరో
చెప్పడంతో, ఆయన నన్ను ‘రక్తచరిత్ర’ సినిమాకు
ఆడిషనింగ్‌కు పిలిచారు. అక్కడ ఎంపికవడంతో, తెలుగులోకి
వచ్చా. ‘రంగీలా’, ‘సత్య’ లాంటి హిందీ చిత్రాల వల్ల ఆయనకు
నేను పెద్ద అభిమానిని. ఆయన దర్శకత్వంలో నటించడం
 మంచి అనుభవం.

  ముఠా కక్షల నేపథ్యంలోని ‘రక్త చరిత్ర’ నిజజీవిత 
వ్యక్తులు, ఘటనల ఆధారంగా తీసిన సినిమా కదా! 
మరి, మీకు ఏ విధమైన బెదిరింపులూ....!
 (చటుక్కున అందుకుంటూ...) అలాంటివేమీ నా వరకు
 రాలేదు. అయితే, ఆ చిత్ర కథ గురించి రామూ సార్
నాకు ముందుగానే వివరంగా చెప్పారు.

  మరి, హీరో బాలకృష్ణతో నటించడం ఎలా ఉంది?
 (మెరుస్తున్న కళ్ళతో...) ఆయనతో ఇది నా రెండో సినిమా.
 ‘రక్తచరిత్ర’ చూసిన ప్రకాశ్‌రాజ్ తమిళ - తెలుగు భాషల్లో
‘ధోనీ’ తీస్తూ నాకు అవకాశమిచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ
 ‘లెజెండ్’లో పాత్ర దక్కింది. ఆయన చాలా పెద్ద స్టార్.
పెద్ద హీరో కుమారుడు. అయినప్పటికీ ఆయన
తోటి నటీనటులతో కలసిపోయి, బాగా సహకరిస్తుంటారు.
మా కాంబినేషన్‌లోని ‘లెజండ్’ సినిమా సూపర్‌హిట్టయింది.
 రానున్న ‘లయన్’ కూడా అంతే! ముఖ్యంగా ప్రతి డైలాగ్‌నూ
ఎలా పలకాలో ఆయన స్పష్టంగా మనకు చెబుతారు. దీనివల్ల
 నేను డైలాగ్‌ను సరిగ్గా పలుకుతున్నా, అర్థం చేసుకుంటున్నా.

  మీకు తెలుగు రాదు కదా! మరి డైలాగులు చెప్పడం...?
 ప్రాథమికంగా నేను రంగస్థలం నుంచి వచ్చినదాన్ని కాబట్టి,
నా తెలుగు డైలాగులన్నీ ముందుగానే దేవనాగరి లిపిలో
రాసుకొని, కంఠస్థం చేస్తాను. వాటిని ఎలా పలకాలనే విషయంలో
బాలకృష్ణ గారి సాయం చాలా ఉంది. అందుకే, వన్... టు... త్రీ...
 అని నంబర్లు చెబుతూ నటించడం కాకుండా, కష్టమైనా సరే
 ఒరిజినల్ డైలాగులు చెబుతూనే, నటిస్తున్నా. నా రంగస్థల
అనుభవం కూడా అందుకు బాగా ఉపకరిస్తోంది.

  ఇంతకీ, ‘లయన్’లో మీ పాత్ర విశేషాలేమిటి?
 (నవ్వేస్తూ...) ఈ సినిమా ఒక థ్రిల్లర్, యాక్షన్ చిత్రం.
అందరినీ ఆకట్టుకొనేలా ఉండే స్వీట్ అండ్ లవ్లీ పాత్ర నాది.
 పెపైచ్చు, కథలో కూడా కీలకమైన పాత్ర. ఊహించని మలుపులతో
సాగుతుంది. అందుకే, ప్రస్తుతానికి నా పాత్ర వివరాలు సస్పెన్స్.
రేపు తెర మీద చూస్తే, మీకే అర్థమవుతుంది.

  ప్రతి సినిమాలో ఇద్దరేసి నాయికల్లో ఒకరుగా నటిస్తున్నారే?
 ‘లెజండ్’లో నాకూ, మరో హీరోయిన్ సోనాలీ చౌహాన్‌కూ
మధ్య కాంబినేషన్ సీన్లు లేవు. ‘లయన్’లో మాత్రం నేను, నటి త్రిష
 కలసి ఒక సీన్‌లో నటించాం. అలాగే, మేమిద్దరం కలసి
ఒక పాటలో నర్తిస్తాం. నా పాత్రకున్న ప్రాముఖ్యం కీలకం కానీ,
సినిమాలో ఇద్దరు హీరోయిన్లం ఉంటే నాకేంటి! పైగా, సెట్స్‌పై
మాటలు కలబోసుకోవడానికి మరో నటి ఉండడం మరీ హ్యాపీ కదా!

 రంగస్థలం మీద మీకు చాలా అనుభవమే ఉన్నట్లుంది!

 ఇప్పటికి 13 - 14 ఏళ్ళుగా రంగస్థలంతో నాకు అనుబంధం.
 మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించా.
 మా ఊరు పుణేలో చాలా నాటక సంస్థలతో కలసి పనిచేశా.
 ముఖ్యంగా ‘ఆసక్త’ అనే రంగస్థల బృందంతో ఎక్కువగా
పనిచేశాను. పుణేలోని ‘బాల గంధర్వ’ లాంటి ప్రసిద్ధ వేదికలపై
ప్రదర్శనలిచ్చా.  ఇప్పటికీ రంగస్థలమంటే నాకు ప్రేమ. అలాగే,
సమాంతర చిత్రాల్లో నటించడం కూడా! తమిళంలో ‘ధోనీ’,
 ‘ఆల్ ఇన్ ఆల్ అళగురాజా’, ‘వెట్రిసెల్వన్’, ’ఊలా’ మొదలైన
 సినిమాల్లో చేశా.

  దర్శకుడు ప్రకాశ్‌రాజ్‌తో తమిళంలో పనిచేయడం గురించి?
 ప్రకాశ్‌రాజ్ మంచి నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా.
 అందరూ అనుకుంటున్నట్లు ఆయన మరీ కఠినమేమీ కాదు.
ఆయనతో పనిచేయడంలో చాలా ఫన్ ఉంది. కాకపోతే, ‘ధోనీ’
చిత్రాన్ని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో తీయడంతో, వెంట వెంటనే
రెండు భాషల్లో డైలాగులు చెబుతూ, నటించడం కొద్దిగా శ్రమ
అనిపించింది. అయితేనేం, ఆయన భార్య పోనీ, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.

  నట - దర్శకుడు అమోల్ పాలేకర్ సినిమాలో నటించిన అనుభవం మాటేమిటి?
 ఆయనను మంచి స్నేహితుడిగా భావిస్తా. మధ్యతరగతి
మనస్తత్వాల్ని ప్రతిబింబిస్తూ ఆయన నటించిన ‘చిత్‌చోర్’
లాంటి అనేక సినిమాలన్నా, ఆయన అన్నా నాకు
పిచ్చి ఇష్టం. రంగస్థలంపై కూడా ఆయన కృషి చాలా ఉంది.
 నాటకరంగంలో ఆయన మాకు ఎంతో అండగా నిలిచారు.
పుణేలో రంగస్థల ఉత్సవం కూడా చేశారు. ఆయన తీసిన
‘సమాంతర్’ సినిమా నా కెరీర్‌లో ఒక మరపురాని అనుభవం.

  మీ తాజా హిందీ చిత్రం ‘బద్లాపూర్’కు మంచి పేరు వచ్చినట్లుంది!
 అవును. శ్రీరామ్ రాఘవన్ అద్భుతమైన దర్శకుడు.
వాస్తవికతను ప్రతిబింబించేలా చాలా మంచి సినిమా తీశారు.
దాదాపు రెండేళ్ళు నేను విరామం తీసుకున్న తరువాత,
చేసిన ఈ సినిమా మళ్ళీ నాకు అందరిలో మళ్ళీ గుర్తింపు తెచ్చింది.

  ఆ సినిమాలో డైలాగులు, సన్నివేశాల మీద, సెన్సార్ మీద విమర్శలూ వచ్చాయి!
 నేను ఆ విమర్శల్ని అంగీకరించను. అంతెందుకు! చుట్టూ ఉన్న
 సమాజాన్ని పట్టించుకోకుండా, కొన్ని మాటలను సినిమా
 డైలాగుల్లో నుంచి నిషేధించాలంటూ ఇటీవలే కొత్త కేంద్ర సెన్సార్
 బోర్డ్ చేసిన ప్రయత్నం చాలా హాస్యాస్పదం. వాళ్ళంతా పాత
రాతియుగంలో ఉన్నట్లనిపిస్తోంది. మారుతున్న సమాజం,
 పరిస్థితుల్ని పట్టించుకోని మన సెన్సార్ వ్యవస్థ తిరోగమన
దృక్పథంతో వ్యవహరిస్తోంది.

  ఈ నేపథ్యంలో నిర్భయ కేసులోని నేరస్థుడి 
ఇంటర్వ్యూతో వచ్చిన ‘ఇండియాస్ డాటర్’
 డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
 నేను ఆ డాక్యుమెంటరీ మొత్తం చూశాను. అందులో మనకు
తెలియనిదీ, మన సమాజంలో లేనిదీ - ఏదీ అందులో
లేదు. అన్నీ అందరికీ తెలిసినవే, చూస్తున్నవే. అయినప్పటికీ,
దాన్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించడమెందుకో నాకు
అర్థం కాదు. దేశంలో ఉన్న జనాభా సమస్య, నిరుద్యోగం,
నిరక్షరాస్యత, స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం లాంటి
 సమస్యల పరిష్కారం ఆలోచించకుండా, వాస్తవాన్ని
ఎత్తిచూపిన డాక్యుమెంటరీని నిషేధించడంలో విజ్ఞత ఏముంది!

  స్త్రీ పురుష అసమానత్వం సినీ రంగంలోనూ ఉందిగా!
 (కాస్త ఆవేశంగా) పారితోషికం, పాత్రచిత్రణ ఇలా అన్నింటిలో
ఇక్కడ హీరోకు ఉన్న ప్రాధాన్యం హీరోయిన్‌కు ఎక్కడ ఉంటుంది!
 ఆ మాటకొస్తే,.. అసమానత్వం లేనిదెక్కడ! రంగస్థలం... సినిమా...
 చివరకు జర్నలిజమ్‌లో కూడా ఉంది. పురుషాధిపత్యం
ఎక్కువగా ఉన్న మసాలా సినిమాల కన్నా ప్రత్యామ్నాయ
 సినిమాల్లో నేను ఎక్కువగా నటించేది అందుకే! కాకపోతే,
పాటలు, ఫైట్లతో ఆడవాళ్ళను అందంగా, సంప్రదాయానికి
 కట్టుబడినట్లు చూపించే మాస్ సినిమాలు చేస్తే నటిగా
కమర్షియల్ వ్యాల్యూ వస్తుంది. దాని వల్ల మనం
 ప్రత్యామ్నాయ సినిమాలు నటించినప్పుడు, అవి ఎక్కువ
మందికి చేరతాయి.

  ఆ మధ్య మీ ఫోటోలంటూ... నగ్నంగా ఉన్న
 స్వీయచిత్రాలు (సెల్ఫీలు) కొన్ని నెట్‌లోకి వచ్చిన వివాదం గురించి...!
 (మధ్యలోనే అందుకుంటూ...) చూడండి. ఆ ఫోటోలు నావి
అని మీరనుకుంటున్నారా? నావి కావు. ఇవాళ ఎవరి
ఫోటోలైనా మార్ఫింగ్ చేసి పెట్టేస్తున్నారు. (కాస్త కోపంగా...)
 అయినా ఆ పెట్టినవాణ్ణి వెళ్ళి అడగండి. ఇలాంటి చౌకబారు
 ప్రయత్నాల గురించి పట్టించుకోకుండా వదిలేయాలే తప్ప,
 వాటి గురించి మాట్లాడి నా సమయం వృథా చేసుకోను.

  ఇలాంటి వార్తలొచ్చినప్పుడు సున్నిత హృదయులెవరైనా
 బాధపడతారు కదా!
 అలా బాధపడడం వల్ల ఉపయోగం లేదు. అయినా,
నేనే కాదు... తెలివైనవాళ్ళెవరూ అవాస్తవ ప్రచారం గురించి
బాధపడరు, పడకూడదు.

  బ్రిటీష్ -ఇండియా కో-ప్రొడక్షన్ సినిమాలో పాత్ర మీకొచ్చినట్లుంది!
 అవును. పేరు - ‘బొంబేరియా’. ఏప్రిల్ నుంచి బొంబాయిలో
షూటింగ్ మొదలవుతుంది. అలాగే, మరో రెండు చిత్రాలు హిందీలో
 ఒప్పుకున్నా. వాటి వివరాలు మార్చి చివరలో చెబుతా.

 మీకు పెళ్ళయిపోయిందని విన్నాం!
 అవును. (అప్పుడే అక్కడకు వచ్చిన భర్త బెనెడిక్ట్ టేలర్‌ను
పరిచయం చేస్తూ...) ఈయనే! మంచి మ్యుజీషియన్,
 మ్యూజిక్ డెరైక్టర్ కూడా! బొంబాయిలో, ప్రధానంగా లండన్‌లో
ఎక్కువగా పనిచేస్తుంటారు. మా ప్రేమ, పెళ్ళి కథ చాలా పెద్దది.
అది మరోసారి పాఠకులతో పంచుకుంటా!

 - రెంటాల జయదేవ

.......................................................

Tuesday, March 10, 2015

దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు! - కొసరాజు రాఘవయ్య చౌదరి కుమారుడు - సినీ నిర్మాత కొసరాజు భానుప్రసాద్

దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు!
తెలుగు సినిమా పాటకు జానపద సొబగులు అద్దిన రచయిత అంటే - కొసరాజు రాఘవయ్య చౌదరే గుర్తుకు వస్తారు. ‘ఏరువాకా సాగారో...’ (‘రోజులు మారాయి’) అని రైతు జీవితం వర్ణించినా, ‘సరదా సరదా సిగరెట్టు...’ (‘రాముడు - భీముడు’) అని గిలిగింతలు పెట్టినా... ఆ పాటలు అప్పుడూ ఇప్పుడూ ఎవర్‌గ్రీన్. సినీ గీత రచనలో ఆద్యంతం తనదైన ముద్రను కొనసాగించిన ఈ ‘జానపద కవిసార్వభౌము’డి వర్ధంతి నేడు. అచ్చతెలుగు పల్లెటూరి జీవితాన్ని ప్రేమించి, ఆఖరు దాకా వేషభాషల్లో, రచనల్లో అలాగే జీవించిన ఈ ‘కవిరత్న’ జీవిత విశేషాల్లో కొన్ని ఆయన ఏకైక కుమారుడు - సినీ నిర్మాత 80 ఏళ్ళ కొసరాజు భానుప్రసాద్ మాటల్లో...

 ఇద్దరన్నదమ్ముల్లో పెద్దవాడు - మా నాన్న కొసరాజు గారు. మాది రైతు కుటుంబం. మా స్వగ్రామం - గుంటూరు జిల్లా అప్పికట్ల. ఆరేడేళ్ళ చిన్నవయసులోనే ఆయన పద్యాలు రాసేవారట, కవిత్వం చెప్పేవారట. అందుకని అప్పట్లో ఆయనను ‘బాలకవి’ అని పిలిచేవారట. గురువు గారు కొండముది నరసింహం పంతులు ప్రభావంతో రాయడం, పాడడం నేర్చుకున్న నాన్న గారికి ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి బాబాయ్ వరుస అవుతారు.

 వరించి వచ్చిన సినిమా ఛాన్సులు
 గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ (’39)లో నాన్నగారు అనుకోకుండా రచన చేశారు. నటించారు. అప్పుడు నాకు అయిదేళ్ళు. ఆయనకు అసలు ఎప్పుడూ మద్రాసులో సినీ రంగంలో స్థిరపడిపోవాలని ఉండేది కాదు. కొన్నేళ్ళ తర్వాత ‘పెద్దమనుషులు’ (’54), ఆ వెంటనే బి.ఏ. సుబ్బారావు ‘రాజు - పేద’ (’54), ‘రోజులు మారాయి’ (’55)తో దశ తిరిగింది. మద్రాసు వదిలేసి, సొంత ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడల్లా సినిమా ఛాన్‌‌స రావడం, పాటల విజయవంతం కావడం జరిగేది.  చివరకు ‘రోజులు మారాయి’తో ఆయన మద్రాసులోనే రచయితగా స్థిరపడ్డారు.

 ఆయనకున్నది ఆ ఒక్క వ్యసనమే!
 ఒక రకంగా చెప్పాలంటే, నాన్న గారు కులాసా పురుషుడు. హాయిగా, ప్రశాంతంగా జీవించడం, దేనికీ చింతపడకుండా కాలం గడిపేయడం ఆయన లక్షణం. గమ్మత్తేమిటంటే, ధూమపానం మీద (‘సరదా సరదా సిగరెట్టు...’), మద్యపానం మీద  (‘ఏసుకుందాం బుడ్డోడా...’), పేకాట మీద (‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...’) - ఇలా దురలవాట్ల మీద ఆయన చాలా పాటలు రాశారు. అవన్నీ ఇవాళ్టికీ సూపర్‌హిట్లే. ఆయనకు మాత్రం ఆ అలవాట్లేమీ లేవు. ఉన్న ఒకే ఒక్క వ్యసనం- పదే పదే కాఫీ తాగడం!

 చిత్ర నిర్మాణంలో...
 మా అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం. బహుశా అందుకే కావచ్చు, గారాబం చేశారు. ఎకనామిక్స్‌లో నేను ఎం.ఏ చేశా. ఆ తరువాత మద్రాసు లా కాలేజ్‌లో బి.ఎల్. చదివా. కానీ, నాన్న గారి ప్రభావం వల్ల ఇరవై ఆరేళ్ళ వయసులోనే చిత్ర నిర్మాణంలోకి వచ్చా. పూర్తిస్థాయి నిర్మాతగా మారాక, యేడెనిమిది చిత్రాలు చేశా. ‘కవిరత్నా మూవీస్’ పతాకంపై తీసిన 3 చిత్రాలను (ఎన్టీఆర్‌తో ‘విశ్వరూపం’ (’81) వగైరా) నాన్న గారే సమర్పించారు. స్క్రిప్టు విని తన అభిప్రాయాలు చెప్పేవారు.

 పాటలన్నీ... జేబులో స్లిప్పుల్లో!
 ఆయన పాటలు రాసే విధానం గమ్మత్తుగా ఉండేది. ఆయన ఎక్కువగా నడిచేవారు. ‘ఈ కాస్త దూరానికి కారెందుకు?’ అంటూ, దర్శక - నిర్మాతల దగ్గరకు నడిచి వస్తానని అనేవారు. నడక ఆరోగ్యానికి మంచిదనేవారు. ఆయన జేబుల్లో ఎప్పుడూ స్లిప్పులు ఉండేవి. రోడ్డు మీద వెళుతున్నప్పుడైనా సరే ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, గబగబా వాటిలో రాసేసుకొనేవారు. అయిదొందలు, వెయ్యి రూపాయల పారితోషికంతో అంత అద్భుతమైన పాటలు రాశారంటే, ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. చరమాంకంలో ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ వచ్చింది.

 జరగాల్సిన దాని మీదే దృష్టి!
 నాన్న గారి నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే - మంచే కాదు, చెడు జరిగినా సరే దాని గురించే ఆలోచిస్తూ గడిపేవారు కాదు. ‘తరువాత ఏంటి? ఏం చేద్దాం?’ అనేవాళ్ళు. సినిమాలు తీస్తున్నప్పుడు నష్టాలే ఎక్కువసార్లు వచ్చినా, తరువాతి ప్రాజెక్ట్ గురించే ఆలోచించేవారు. ఆయనకు అంత తేలిగ్గా కోపం రాదు. మంచిగా చెప్పడమే కానీ, ఎవరినీ కోప్పడేవారు కాదు. పిల్లల పెంపకంలో కూడా ఆ రోజుల్లో ఆయనది చాలా చిత్రమైన పద్ధతి. ఎప్పుడూ క్రమశిక్షణ, కట్టుదిట్టమైన నియమ నిబంధనల లాంటివి లేవు. నన్నెప్పుడూ స్నేహితుడి లాగానే చూసేవారు. మా అబ్బాయి రంజన్‌కు కూడా చదువు విషయం బుజ్జగిస్తూ, చెబుతుండేవారు. సినిమాల కోసం నాన్న గారు దాదాపు వెయ్యి పాటలు రాశారనుకుంటా. వాటిలో ఇప్పటికి 800 దాకా పాటలు సేకరించగలిగాం. వచ్చే జూన్‌లో నాన్న గారి పుట్టినరోజు నాటికి, పుస్తకంగా తీసుకురావాలని మా ప్రయత్నం.

 ‘‘నాన్న గారెప్పుడూ చాలా సాదాసీదాగా, ధోవతి - లాల్చీ, పైన కండువాతో అచ్చ తెలుగు వేషధారణలో సామాన్యరైతులా ఉండేవారు. ఇంటి బయట వరండాలో అరుగు మీద బనీనైనా లేకుండా కూర్చొని హాయిగా పల్లెటూరి పద్ధతిలో ముచ్చట్లాడడం ఆయన అలవాటు.’’

 సంభాషణ:: రెంటాల జయదేవ

............................................