జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, March 10, 2015

స్కూళ్లలో బోధించాలి! - కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్ (ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు)

కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్

ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

స్కూళ్లలో బోధించాలి!

మంచి బొమ్మలతో పాటు రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తలమానికం వంటి ఆలోచనలతో ఎక్కడా వన్నె తగ్గకుండా, ప్రజాదరణ కోల్పోకుండా, తేలిపోని చిత్రాలు వేసినవారు ఆంగ్లపత్రికా రంగంలో ఇద్దరే ఇద్దరు. వారు ఇద్దరూ ‘ఆకుంచె శ్రీమంతులు’. బంగారు కుంచెతో పుట్టినవారి క్రింద లెక్క. వారు - శంకర్, ఆర్.కె. లక్ష్మణ్. అతి తక్కువ లైన్లతో రంగులు పూసిన గీతల క్యారికేచర్లు అనే పోలికల హెచ్చుతగ్గుల ఆలోచనాత్మకమైన ముఖ కవళికల రూపురేఖలు దిద్దగల్గిన దిగ్దంతులు వాళ్లిద్దరే. మరొకరు జన్మించరేమో!

 లక్ష్మణ్ ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’లో అతి తక్కువ గీతలతో గీసిన రంగు బొమ్మలను కాపీ చేస్తూ నా మిత్రుడూ, నేనూ 1965లో సెలవులు గడుపుతుండేవాళ్ళం. మొహంలో కండలు నిర్ణయించే గీతలు, వ్యక్తి పోలికలకు పారా కాసే రేఖలు పట్టుకోవడానికి తంటాలుపడుతూ ఉండేవాళ్ళం. పెద్ద కుర్చీలో కూర్చున్న చిన్న లాల్‌బహదూర్ శాస్త్రి బొమ్మను కాపీ చేయడం దగ్గర నుండి ఆరంభమయిన నా యాత్ర త్వరగానే ముగిసింది కానీ, ఆ బొమ్మలు గీసిన మహానుభావుణ్ణి చూడాలన్న కోరిక మాత్రం నాలుగు దశాబ్దాలకు గానీ తీరలేదు. అదీ నాటకీయంగా కుదిరింది.

 ఆమధ్య ‘విజయవాడ పుస్తక ప్రదర్శన’కు అతిథిగా వచ్చిన ఆర్.కె. లక్ష్మణ్ గారిని దుర్గ గుడికి తీసుకెళ్లడం నా పని. ఆయనకు దేవాలయ సందర్శనం అప్పుడు చేయడం ఇష్టం లేదు. శ్రీమతి కమలా లక్ష్మణ్ తప్పదన్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో ఆవిడ ముందు వరుసకు పదోన్నతి పొందారు. లక్ష్మణ్‌గారు వెనుకబడ్డారు. క్యూలో చాలాసేపు పట్టింది. ‘మీకూ తప్పలేదు చూశారా’ అని నేను నవ్వాను. ‘ఇదే మనకు ఆహారం’ అన్నారాయన. నెత్తి మీద అక్కడే కోతి కిచకిచలు. ‘‘హనుమంతుడు కూడా నిరసన తెలియజెబుతున్నాడు చూశావా’’ అన్నారు. ప్రక్కనే ఎవరి చంకలోనో ఉన్న పిల్లాడు ఆయనకు ముద్దు వచ్చాడు. ఆయన ఆ పిల్లవాడి బుగ్గ మీద చిటికేశారు. తండ్రికి కోపం లాంటి విసుగొచ్చింది.  రెండేళ్ళు నిండని తన పసిపిల్లాణ్ణి తాకిన పరాయివాడంటే సద్భావం కలగలేదు. ఆయనకు ‘‘మనం ఆమోదయోగ్యులం కాదు కదా! నాకు తెలుసు’’ అన్నారు ఆర్.కె. లక్ష్మణ్. కమలగారు దర్శనం చేసుకున్నారు. ఈయన ఆనందంగా బయటకు వచ్చారు.

 ఈ నేపథ్యంలో నేను ఆయన్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. ఆయనకు చెప్పలేదు ఇంటర్వ్యూ అని! ఆయన కాదంటే మొదటికే మోసం వస్తుంది. ‘‘మీకు దండలు వేయడానికి అక్కడ ఒకాయన చాలాసేపు నుంచి వెయిటింగ్. సాధారణ మనిషి ఒకరు ఎదురుచూస్తున్నా’’రని చెప్పి రేడియో స్టేషనుకి తీసుకెళ్ళాను. సంతోషించారు. నాలుగు మాటలు... మీ అభిమానులు సంతోషిస్తారని మైకు ముందు మొదలుపెట్టాను. చివరన ‘‘అభిమాని మంచి ప్రశ్నలు వేశాడే’’ అని నవ్వారు. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీషులో సాగింది.

అందులోని కొన్ని భాగాలు:

  ప్రశ్న: మీలాటి గొప్ప కార్టూనిస్టులు అరుదుగా కనబడతారు ఏ దేశంలోనైనా! కోపం వస్తే నివారించుకోవడానికి కార్టూన్లను వేసుకుంటూ ఉంటారా? నిజం చెప్పండి.

 ఆర్.కె. లక్ష్మణ్: కోపం అని అనుకోను, వంగ్య వ్యాఖ్య అంటాను. ప్రజల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మూర్ఖత్వం మీద, నాయకులం అనుకుని దేశాన్ని నడిపించే నాయకుల మీద! నాయకులే కాదు, మామూలు ప్రజలు కూడా! తప్పని తెలిసే రోడ్లను ఆక్రమించేవారు, మార్గమధ్యంలో నించునేవారు, లారీలు వస్తున్నా రోడ్లు దాటేవారు, ఎర్రదీపాన్ని ధిక్కరించేవారు - అందరూ నాకు కార్టూనుకు పనికొచ్చే సంగతులే.

ఇది వేయాలన్న ఆలోచన తటాలున వస్తుందా?

ఆర్.కె: లేదు. గంటలకొద్దీ మథనపడితే కానీ రాదు. అది కాదని, ఇది కాదని, చివరికి ఎంపిక చేసుకుని రేపటికి పనికివస్తుందో రాదో చూసుకునీ - చాలా తంటాలుపడాలి.

చాలా అలసిపోయాననిపిస్తుందా?
 

ఆర్.కె: నిజమే. అయిదారు గంటలు శ్రమపడితే కానీ కార్టూన్ గీయడానికి ఆ రోజుకు ఆలోచన రాదు. అదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ కూర్చున్నా అదే ధ్యాస. బుర్రలో కదలాడుతూ ఉంటుంది. కానీ గీతల్లో గ్రాఫిక్‌గా రిజిస్టర్ కాదు. అక్కడ సంఘటనలో ఏదో వ్యంగ్యం తారాడుతూనే ఉంటుంది.

తరచూ, రోజుకో ఆలోచనను ఎలా దింపగల్గుతున్నారు?

ఆర్.కె: నాకు భోజనం పెట్టేదే అది. చేయక తప్పదు. కార్టూనిస్టును కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇంజనీరుగా ఇళ్లు కడుతూ ఉండేవాడినేమో!

మంచి కార్టూన్ కాకపోయినా ప్రచురించి, పాఠకులు పొగిడితే, బాగుందంటే - మీరు వాళ్ళను చూసి నవ్వుకున్న సందర్భాలున్నాయా?

ఆర్.కె: బాగుండని కార్టూనే ప్రతిరోజూ వేస్తున్నాను. వేసినందుకు విచారిస్తాను. రేపు మంచిది వేద్దామని ఆశపడతాను.

నా కార్టూను విజయానికి వీళ్ళు కారకులు అని ఎవరినైనా చెప్తారా?


ఆర్.కె: నా దేశం, నా ప్రజాప్రతినిధులు. వీళ్లు తెంపు లేకుండా నా జీవితంలో ప్రతిరోజూ ఆలోచనలు సరఫరా చేస్తున్నవారు. వీళ్ళే కారకులు నా విజయానికి!
     
ఇక కార్టూను గీసే యంత్రాంగంలో ఏయే నాయకులు సదుపాయంగా, గీతలకు ఆదర్శవంతంగా కనబడతారు?

 ఆర్.కె: దీనికి సమాధానం కష్టం. క్యారికేచర్ కళాకారుడికి నెహ్రూ బొమ్మ గీయడం కష్టంగా ఉంటుంది. అయితే గాంధీ దేశానికి సేవ చేయడానికే జన్మించలేదు, కార్టూనిస్టులకీ సదుపాయం కల్గించాడు. ఆయన రూపం అలాంటిది. బట్టతల, పెద్ద చెవులు, చట్టిముక్కు, ముఖంమీద ఎప్పుడూ నవ్వు, దుస్తులు, ధోతీ, కండువా, నడుము వద్ద వేలాడుతున్న జేబు గడియారం - అన్నీ క్యారికేచర్ వేసేవాళ్ళ కోసమా అన్నట్లుంటాయి.

కార్టూన్లకు పనికి వచ్చే వస్తువులకు వస్తే నెహ్రూ గారి యుగం బాగా ఉత్సాహం కలిగించేదిగా చెప్పుకోవచ్చా?

ఆర్.కె: అబ్బే! అన్ని కాలాలూ ప్రోత్సాహజనకాలే. నెహ్రూ యుగమనేమీ లేదు. ఆ మాటకొస్తే మీ తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన పి.వి. నరసింహారావు నా కార్టూన్ల అయిడియాలకి చాలా ఉపయోగపడ్డారు.

రాజకీయ వ్యంగ్య చిత్రాలనే మా మీద బలంగా రుద్దుతున్నారెందుకు? సాంఘిక పరిస్థితుల మీద, కుటుంబ విషయాల మీద కార్టూన్లకు ప్రాముఖ్యం లేదేం?

ఆర్.కె: ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న నీకు తోచినదనుకోవడం లేదు. మన దేశంలో రాజకీయాలు లేకుండా సాంఘిక జీవనం లేదు. సోషల్ లైఫ్ లేకుండా రాజకీయాలు లేవు. గుడికెళ్ళు. ఇవాళ వెళ్ళాం కదా! ఇద్దరు ఎంపిలు, ఎమ్మెల్యేలు వచ్చి గర్భగుడిలోకి సామాన్య ప్రజలను వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు కదా! దేవాలయం పవిత్రమైన స్థలం. అందరూ సమానమే. కానీ రాజకీయ నాయకులొచ్చి - రేపు మళ్ళీ ఈ పదవుల్లో ఉంటారో ఉండరో తెలియని రాజకీయ నాయకులు వచ్చి - దర్శనాన్ని రాజకీయం చేశారు. పుస్తక ప్రదర్శన ఆరంభించడానికి రాజకీయ నాయకుడు కావాలి. మీ ఇంటికి నీరు సరఫరా కావాలంటే స్థానిక ఎం.పి. సాయపడాలి. సాంఘిక విషయాల కంటే మనం రాజకీయాలే ఎక్కువ చర్చిస్తాం. అందుకని మన దేశంలో రాజకీయ జీవితం, సాంఘిక జీవితం అని విడివిడిగా లేవు.
     
ఇక్కడ ఒకే పాత్రల వరుస వ్యంగ్య చిత్రాలు - స్ట్రిప్ కార్టూన్లు - వృద్ధి చెందలేదేం?

ఆర్.కె: ఇంగ్లండ్‌లోనూ పెంపొందలేదు. అమెరికా వారు వీటిని ముందు ఆరంభించారు. వారే కొనసాగించారు. మన దేశంలో ఇది నడిచే వ్యవహారం కాదు.
    
ఏం ఎక్కువ చిత్రాలు వరుసగా ఏక్షన్‌తో వేయాల్సి ఉండడం వల్లనా?


ఆర్.కె: అలాగని కాదు. దాంట్లో సృజనాత్మకత ఉండదు. అంతేకాకుండా కార్టూనిస్టు అనేవాడు బొమ్మగీయడం అనే ఆలోచనలో నుంచి జన్మిస్తాడు. కార్టూన్లు గీయడం పాఠశాలలో బోధించడం లేదు. బోధించాలి.రచయితలకు ముందు తరం వారి రచనలు ఆదర్శంగా ఉంటాయి. ఎక్కడ నుంచి ఆలోచన తోస్తుందో వారి రచనలు చెప్పి, సాయపడతాయి.

 ఆర్.కె: కాదు. చిత్రకారుడికీ, రచయితకీ చాలా భేదాలున్నాయి. రచయితకి దృశ్యం సాక్షాత్కరించే గుణం ఉండదు. ఉదాహరణకు బేట్‌మాన్, ఫాంటమ్ పాత్రలు ఆకాశహర్మ్యాల నుండి వీధిలోకి ఎగురుతూ రావడం, దాన్ని చూపటం - ఒక దర్శనీయ అనుభవం. రచయిత రచించగలడు, కాని ఎలా ఎగురుతుందో చూపించే విధంగా ఊహించలేడు. ఆ రెండూ రాయడం, ఊహించగలగడం కలిసి రావాలి.
   
బొమ్మలు వేయడం, వాటిని కార్టూన్లుగా మలచడంలో మీ మీద ఇతర వ్యంగ్య చిత్రకారుని ప్రభావం ఎవరిది ఉంది?


 ఆర్.కె: నా మీద డేవిడ్‌లో అనే వ్యంగ్య చిత్రకారుడి ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు ఆయనను ఎవరూ గుర్తుంచుకోరు. చాలా గొప్ప కార్టూనిస్టు... ఇంగ్లండులో. తరువాత ‘సర్’ బిరుదు పొందాడు. సరే ఇంగ్లండులోనే కార్టూన్ కళ ఆరంభమైంది. యూరప్‌లో ప్రారంభం కాలేదు. చిన్నప్పటి నుండీ నా మీద అమిత ప్రభావం చూపాడు ఆయన. అతని ఆలోచనలు నాకు అప్పుడు అర్థమయ్యేవి కావు. ఐర్లండ్ విప్లవం మీద ఉండేవి. డ్రాయింగ్‌లు మాత్రం బలమైన ప్రభావం చూపాయి. డ్రాయింగ్‌లో పనితనాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. ఒక పద్ధతిలో మనిషి కార్టూనులో నిలబడినా, చేతులు పెట్టుకొని ఒక విదంగా నిద్రపోతున్నా - ఉదాహరణకి ‘గౌడా’లా -ఆ పోజు ఎలా వస్తుంది? నువ్వు మంచి డ్రాయింగ్ వేసే కళాకారుడివి కాగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ముందు డ్రాయింగ్ చిత్రకారుడు, తరువాత కార్టూనిస్టు, తర్వాతే వ్యంగ్యం చూపగల సెటైరిస్టు కాగలరు.

వ్యంగ్య రచయితలకీ, కార్టూనిస్టులకీ మధ్య కామిక్ ఊహాశక్తి సంబంధమైన పోలికలున్నాయా?

 ఆర్.కె: నేను వ్యంగ్య రచనలు చేపట్టలేదు. మనం చూసేవాటిలో ప్రతిదాన్లోనూ ఒక వ్యంగ్య దృష్టి ఉంటుంది. ప్రతివాడి అనుభవాన్నీ వ్యంగ్యాత్మకంగా మలచవచ్చు. వ్యంగ్యం రాసేవారికీ, వ్యంగ్య రచయితలైన వోలటైర్, షాలాంటి వాళ్లకీ మధ్యన; వ్యంగ్య రచయితలైన వారికీ కార్టూనిస్టులకీ మధ్య బంధం ఒకటి ఉంది.

మంచి డ్రాయింగులు కాకుల మూకనీ, జంతువులనీ వాష్ డ్రాయింగ్‌లో చాలా బలంగా, అందంగా చిత్రిస్తూ బొమ్మలు వేశారు కదా!
 ఆర్.కె: నా చిన్నతనం నుండి నాకు కాకులంటే ఎంతో అభిమానం. మన దేశంలో ప్రతి పిల్లవాడూ కిటికీలో నుంచి మొదట చూసేది కాకిని. పచ్చటి చెట్టు వెనుక ఉంటే కాకి కనబడుతుంది. ముందు కాకి, వెనుక నీలాకాశం ఉంటుంది. ఎక్కడైనా అది సిద్ధంగా అందరికీ కనబడుతుంది. నెమలి అనే అంద వికారమైన పక్షినీ, పావురాన్నీ ఎవరూ గమనించకపోవచ్చు. అందుకే, నేను ఈ కాకి అనే పక్షినే చిత్రిస్తూ ఆనందించాను.

హైందవ చిత్రకళ, వాస్తుకళ, శిల్పాలు మిమ్మల్ని అబ్బురపరచలేదా?

ఆర్.కె: లేదు. దానికి కారణం ఉంది. భారతీయ వాస్తు శిల్పకళలు పరిణతి చెందిన శైలితో విలసిల్లుతూ ఉంటాయి. దుర్గామాత చాలా ఎత్తుగా కనబడుతుంది. ఎంత ఎత్తు అంటే ముందు నిల్చున్న అర్చకుడు చాలా చిన్నవాడుగా ఉంటాడు. వాస్తు శిల్పాలలో భాగాల విభజన వాస్తుకళను గమనించేవారికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది, మురిపిస్తుంది.

పురాణ పాత్రల నుండి కార్టూనిస్టులు చాలా విషయాలు గీయగలరేమో?

అసంఖ్యాకమైన ఆలోచనలు పుడతాయి - పురాణాల నుండి! కానీ నేను పూర్తిగా వద్దనుకున్నాను.
     
మతపరమైనవి కదా అని మానివేశారా?

ఆర్.కె: అలాగని కాదు. అవి సందర్భాలను చిన్నగా చిత్రింప చేస్తాయి. విపులంగా తెలివిగా చెప్పనీయవు. రావణుడికి పదితలలు కదా అని ఒక తల బీదరికం, మరొకటి అజ్ఞానం, అనారోగ్యం... అలా చిత్రిస్తూపోవడం గొప్పకాదు.

కార్టూన్ అంటేనే సూక్ష్మీకరించి చెప్పడం కూడా కదా?

ఆర్.కె: కాదు కాదు. కార్టూన్లో వ్యంగ్యం ఉంటుంది. దెప్పిపొడుస్తున్న వ్యాఖ్యానం ఇస్తూ, నువ్వు అర్థం చేసుకునేలా గీయడం ఉంటుంది. అలా సూక్ష్మంగా చేస్తే కార్టూన్ కాదు. విపులీకరించే చిత్రం మాత్రం కాగలదు.
     
ఈ దేశంలో కార్టూనిస్టులకు గౌరవం ఇస్తున్నారా?

ఆర్.కె: సారీ! ఇస్తున్నారు అనే అంటాను. నేను ఇందిరాగాంధీని ప్రతిరోజూ దాడి చేస్తూనే వచ్చాను. ‘పద్మభూషణ్’ గౌరవం ఇచ్చారు. మర్యాద చేసినట్లే కదా! ఎన్నో బహుమతులు, గౌరవాలు నాకు లభించాయి. నేను వారి పట్ల మర్యాదగా ఉన్నందుకు కాదు... వాళ్లను గౌరవించనందుకు లభించాయి.

మీ కార్టూన్ బాగులేదని తోచి మీకు మీరే మీ కార్టూన్ బయటకు రాకుండా చూసుకున్నారా?

ఆర్.కె: నాకో చిత్రమైన పని చేసే పద్ధతి ఉంది. ఆఫీసుకెళ్లి రెండు మూడు గంటలు పేపర్లు చదువుతాను. ప్రతీదీ విశ్లేషిస్తాను. ఆలోచన వచ్చేదాకా సతమతమవుతాను. అయిడియా కుదిరాక ఫ్రేములో ఎలా దృశ్యంగా దాన్ని మలచడం అనే బాధ మొదలవుతుంది. అంటే ఆ ఆరాటం సినిమా దర్శకుడి చిత్రీకరణ లాంటిది. సీతారామ్ కేసరిని ఇక్కడ నిలబెట్టాలా, లేక లాలూప్రసాద్‌ని మరోచోట ఉంచాలా, లేదా లాలూని శిఖరాగ్రం మీద పెట్టి, కేసరి శిఖరం మీదకు పరిగెడ్తూ ఇద్దరూ పడిపోతారా - ఇలా సినీ దర్శకుడిలా ఆలోచిస్తాను. చివరికి ఓ ఏర్పాటు చేస్తా. ఒక చోట కేసరి, ఒక చోట రబ్రీదేవి, మరొక చోట లాలూప్రసాద్‌ని పెట్టి - అప్పుడు నేపథ్యం వగైరాలు చిత్రిస్తాను. తర్వాత వ్యాఖ్యానం తయారవుతుంది. ఎవరు ఏమంటారు అనే విషయం... అటువంటివి. మొన్న ఒక కార్టూన్ వేశాను. కేసరిగారి గదిలో కాంగ్రెస్ నాయకులు బయటకు పోదామని చూస్తూ ఉంటారు. గది తలుపు సగం తెరచి ఉంటుంది. తలుపు మీద ‘కేసరి’గారి పేరు. పైన మామూలు మనిషి పత్రిక చదువుతూ నిలబడి ఉంటాడు. ఆ పత్రిక మీద ‘కాంగ్రెస్ నుండి వలసలు’ అని రాసి ఉంటుంది. తలుపు నుండి బయటకు మహాత్మాగాంధీ లాంటివాడు బయటకు వస్తూంటాడు. తలుపులో నుండి ఒక గొంతు వినబడుతుంది. ‘బెంగపడకండి... చాలామంది గతంలో కాంగ్రెస్ నుండి వెళ్లిపోయారు’ అని! ఇలా కార్టూన్‌ను చిత్రించడానికి చాలా సమయం పడుతుంది. వ్యంగ్యంతో ఏమీ చేయలేము అని భావంతో నిండి ఉంటుంది. నా మెదడులో పూర్తిగా ఈ ఆలోచన చిత్రరూపం పొందేవరకు పెన్సిల్, కాగితం చేత పట్టను. అప్పుడే కార్టూన్ గీయడం ఆరంభిస్తాను. అంతవరకూ చేయను. ఆలోచన ఒకటి నడవకపోతే, ఇంకొకటి ఆలోచిస్తాను. అలా అశాంతితో ఉంటాను.

మీరు అందర్నీ కార్టూన్ల ద్వారానే వేళాకోళం చేస్తారు, విమర్శిస్తారు. మరి మీలోని కార్టూనిస్టు మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించాడా?
 ఆర్.కె: ప్రతిదాన్నీ, ప్రతివాడినీ నేను విమర్శిస్తాను - నన్ను తప్ప.
   
మీ కార్టూనుని, మీ సంపాదకుడు ఎప్పుడైనా కాదన్నాడా? తిరస్కరించాడా?


ఆర్.కె: ఎవడూ, నా కార్టూన్‌ని ఎడిట్ చేయడు. నాకు ఎడిటర్ లేడు. నేను చిత్రించిన కార్టూన్‌ని మొదట చూసేవాడు నా దగ్గర పనిచేసే వ్యక్తి. నేను ఇచ్చింది తీసుకొని ముద్రణశాఖకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ కార్టూన్ పదకొండు కేంద్రాలకు వెళుతుంది. ఎడిటర్లు, మిగతావాళ్లు తరువాత ప్రింట్‌లో చూస్తారు. అంతే! అమ్మయ్యో! ఎవరో నా కార్టూన్‌ను కాదనడమే!!

(Published in 'Sakshi' daily, 26th Jan 20015, Monday)
......................................

0 వ్యాఖ్యలు: