జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, March 5, 2015

ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము (బాలాంత్రపు రజనీకాంతరావు)

ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము

బాలాంత్రపు రజనీకాంతరావుఎవరో యీ తరం వారికి తెలియకపోవచ్చును. అది వారి లేమి. పాఠ్యగ్రంథాలలో ఏవి ఉండాలో నిర్ణయించేవారి దృష్టిలోపం. ఆయన తెలుగు సంగీత సాహిత్యాలకూ, వెండితెరకూ, ఆకాశవాణికీ చేసిన సేవ, వేసిన కొత్తబాట గత నూరేళ్లలో మరొకరు చేయలేదు. సుమారు 65 ఏళ్ల క్రితం మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రతిరోజూ ‘భక్తిరంజని’ కార్యక్రమం తెలుగులో వినవచ్చేది. కాస్త లలితమైన సంగీత సాహిత్యాలంటే అభిరుచి ఉన్నవారందరూ దినం తప్పక విన్న కార్యక్రమం అది. అందులో శాస్త్రీయ సంగీతం కాక పామరులకూ అందుబాటులో ఉండే లలిత సంగీత శైలిలో పొదగబడిన భక్తిమణులందు వినవచ్చేవి.

 నన్ను ఆకర్షించినవి రెండు పాటలు - ‘విన్నపాలు వినవలె వింత వింతలు’, ‘తందనాన భళా తందనాన’ అన్నవి. రెండోది కీర్తిశేషులు మల్లిక్ వరసా, గాత్రమూ అయితే, మొదటిది రజని వరస చేసి, భానుమతి చేత పాడించినది. నాకు యీ రెండు పాటల ద్వారానే రజని, మల్లిక్‌ల పేర్లు తెలియడం. అంతేకాదు. వీటి రచయిత అన్నమయ్య అన్న విషయమూ.  నాలో పెరిగిన అన్నమయ్య కల్పవృక్షానికి బీజం యివయితే, దాన్ని ప్రోది చేసి పెంచి, పూవులు పూయించి, పిందెలు, కాయలు, పళ్లు కాయించినది శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి కథలు రెండూ వనమాలలే.

 ఆకాశవాణిని గీర్వాణివాణిగా, సంగీత సాహిత్యాభినయాల త్రివేణీ సంగమంగా వెలార్చినవి ఎన్నో సంగీత రూపకాలు. ‘దేవదాస్’, ‘బేహుల’, ‘లైలా మజ్ను’, ‘ధర్మచక్ర’, ‘ఉమర్ ఖైయామ్’ -- యివన్నీ రజనీ కృతులే. కేవలం శ్రవ్యమే అయినట్టి రేడియో ప్రసారాలలో అభినయం ఉండే అవకాశమేదీ అంటారా?‘పూలతీవ పొదరిళ్ల మాటుగా పొంచి చూచు శిఖిపింఛమదే’ అంటేనూ, ‘రాధా మాధవ ప్రేమారామము బృందావనము, రాసక్రీడా మనోజ్ఞధామము బృందావనము’ వింటేనూ, ‘ఊరకే మాధురులూరిపోతున్నాయి’ చదివితేనూ అందులో అభినయం అర్థం కాదా, వినబడదా, బుర్రకెక్కదా!

 రజనీ సాహిత్యపు సొంపులు, పాడించిన తీరులో యింపులు, స్వర సమ్మేళనలలో రకరకాల మేళవింపులూ తమ ప్రభావాన్ని తదుపరి వారిపై చూపాయి. రజని స్వర సాహిత్యాల సౌందర్యాన్ని తమకే చేతనైన ఒదుగుల పౌడరద్ది, తమరమర్చిన వాద్యగోష్ఠి అత్తరు పూసి పేరుగొన్న వారెందరో! వారిలో సీతా, అనసూయలు ప్రథములు (వలపులో, జాబిల్లి వస్తున్నాడు, ఊరకే మాధురులు). ఆ తరువాత ఎస్.రాజేశ్వరరావు, ఆయన దాపున ఆర్.బాలసరస్వతీదేవి (ఆలయమున, చల్లగాలిలో, కోపమేల రాధా), ఘంటసాల (మజ్నూ విలాపం, లైలా విశ్వరూపం).

 ఇక సూర్యకుమారి ప్రాణప్రతిష్ఠ చేసిన రజని శిల్పాలు ఎన్నని! ‘శతపత్ర సుందరి’, ‘ఇదె జోత’, ‘మాదీ స్వతంత్ర దేశం’, ‘స్వప్నజగతిలో’, ‘చిన్నదోయి నా హృదయనావ’. భానుమతి, రజని కలసి ‘పసిడి మెఱుంగుల తళతళలూ’ రికార్డిచ్చారు (రెండవ ప్రక్క బంకించంద్రుని ‘వందే మాతరం’). రజని అరుదుగా యితరుల రచనలకూ స్వరకల్పన చేశారు. బసవరాజు అప్పారావు గారి ‘యశోధరా విలాపం’ (లేపనైనా లేపలేదే-టి. సూర్యకుమారి) వాటిలో కౌస్తుభం. ఈ పాటకే మద్రాసు విద్వత్సభలో శ్రీమతి బ్రగా బెస్సెల్ భరతనాట్యాభినయం చూపగా ప్రభావితులై ప్రసిద్ధ తమిళ కవి వైరముత్తు అప్పటికప్పుడా వస్తువుపై ఒక పాట వ్రాశారు.

 ఇప్పటివారు ‘అరేబియన్ సంగీతం’ సినిమాలకు మొదటిమారుగా తెచ్చిన ఘనత ఏ.ఆర్. రహమాన్‌ది అంటారు. ప్రప్రథమంగా భారతీయ సంగీతానికి ఆస్కార్ గుర్తింపు తెచ్చిన ఘనత అతనిది. అరేబియా సంగీతం మనకు దింపినది రజనీది. రేడియోలో ‘ఉమర్ ఖైయామ్’ యీనాడు వినే యోగం లేదు. కాని రజని సంగీతం చేసిన ‘గృహప్రవేశం’ చిత్రంలో ‘కనవోహో కనవోహో’ వినండి. ఆ తరువాత ‘రత్నమాల’ చిత్రంలో చిలకపాట వినండి. రెండూ భానుమతి కంఠంలో వెలిగిన ఖర్జూరాలే. ఆ ‘గృహప్రవేశం’కి సహాయ సంగీత దర్శకునిగా పని చేసిన పెండ్యాల ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’లో ‘నా మనసెంతో నాజూకు’, సత్యం ‘భూలోకంలో యమలోకం’ చిత్రంలో ‘ఏదో ఏదో వింత పులకింత’ వినండి. రజనీ ప్రభావం ఘనత తెలియండి.

  ‘విప్రనారాయణ’లో రాజేశ్వరరావు ‘ఎందుకోయీ తోటమాలి’లోను యీ శైలి తెలుస్తుంది.మరొక విషయం - ‘స్వర్గసీమ’కు చూడామణిగా అలరిన ‘ఓహో పావురమా’ పాట గురించి నిర్మాత - దర్శకుడు బి.ఎన్. రెడ్డి, వాగ్గేయకారుడు రజని, పాడిన భానుమతి ఒక కాశీమజిలీ కథ చెబుతూ వచ్చారు నలభై ఏళ్లుగా. ‘బ్లడ్ అండ్ శాండ్’ సినిమాలో నటి రీటా హేవర్త్ పాడిన పాటకది అనుసరణ అని. శుద్ధ అబద్ధం. వారి ఉద్దేశమదైతే కావచ్చు. కానీ, ఆ పాటకూ, దీనికీ పోలికే లేదు. అది శ్పానిష్ పద్ధతి. ఇది అరేబియన్ శైలి. అరుదైన యీ ఖండికను సాంకేతిక నిపుణుడు విజయవర్ధన్ నాకు చూపించారు. రజని చేసిన యితర సినిమాలు - ‘లక్ష్మమ్మ’ (ఒక తిల్లానా, ఒక జావళి వినా అవి రికార్డింగ్‌కి సంగీతం సిద్ధం చేసిన ఘంటసాల ఎన్నికలు, పూర్వపు రచనలు), ‘పేరంటాలు’. అలాగే, ‘మానవతి’ చిత్రంలో కొన్ని పాటలు.

 మలయమారుత రాగం సినిమా కోసం పెండ్యాల గొప్పగా మలిచినది ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది’ అంటారు. నిజం. అయితే అంతకు ఏళ్లముందు అశరీరవాణి కోసం తయారు చేసి ‘మానవతి’ సినిమాలో యీ రాగంలోనే వినిపించిన ‘ఓ మలయ పవనమా!’ (ఎం.ఎస్.రామారావు, బాలసరస్వతీ దేవి) రజని సృష్టి. త్యాగరాజు సృష్టించిన అపూర్వ రాగాలలో ఒకటి రసాళి, ‘అపరాధములనోర్వ’ అన్న కీర్తనకు. సినిమా పేరుబట్టి మొదట మానవతి రాగంలోనే రజని ఒక పాట చేయాలనుకొన్నారట. కాని ఆ రాగం అతి పరిమితమైనది కావడం చేత ఆ ప్రయత్నం మాని దగ్గరి మేళకర్తయిన నాటకప్రియ రాగజన్యమైన రసాళిలో చేశానని వారే చెప్పారు.

 ఈ గానలహరి కథలో ఒక పిట్ట కథ. పి.మంగాపతి గ్రామఫోన్ కంపెనీలో రికార్డింగ్ ఆఫీసరుగా ఉన్నప్పుడు, ఒక ఎల్.పి. కోసం నన్ను ఆర్. బాలసరస్వతి, ఎస్. రాజేశ్వరరావు సంకలనం - నా దగ్గరున్న బొక్కిసమాధారంగా - చేయమని అడిగారు. అందులో యీ రసాళి రాగచిత్ర (మానవతి) గీతం ‘తన పంతమే తానిడువడు’ పెట్టాను. ఆ సంకలనంలో ఆ పాట ఉండకూడదని బాలసరస్వతి పట్టుపట్టారు. (తిథి అమావాస్యో, పౌర్ణమో అయివుంటుంది). ఆ పాట లేకపోతే నేను చేయను అన్నాను. అప్పుడు ఆ ప్రయత్నం ఆగిపోయింది.

  ఆ తరువాత మరొకతను హెచ్.ఎం.వి. గద్దెనెక్కి, నాకు సంపూర్ణ స్వాతంత్య్రం యిచ్చిన తరువాత ‘అలనాటి అందాలై’ పూచింది. ఇక రజని పుస్తకాలు - ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ (1958). దీనితో ఆంధ్రుల సంగీత సాహిత్యాల చరిత్రావగాహన 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి వచ్చింది. ఇప్పటికీ అందులో ఉన్న విషయాలు త్రోసిరాజన్న రచనలు రాలేదు.రజని గేయాలు ‘శతపత్ర సుందరి’ అన్న పేరుతో 1953లో వచ్చాయి. ఖరీదు- మూడు రూపాయలు. అప్పుడూ యిప్పుడూ వెలకట్టే స్తోమత ఉన్న వారి దృష్టిలో దాని విలువ ఒక అలీబాబా గుహ.

 మరొక పుస్తకం గురించి చెప్పి దీన్ని ముగిస్తాను. నూట యాభై క్షేత్రయ్య పదాలను ఆంగ్లీకరించి ‘మువ్వగోపాల పదావళి’ అన్న పేరుతో, ‘ఆమోర్స్ ఆఫ్ ది డివైన్ కౌహర్డ్ విత్ జింగ్లింగ్ బెల్స్’ అన్న ఉపనామంతో రజని (బి.వి.ఎస్.ఎస్ మణి వదాన్యంతో) 1994లో ప్రచురించారు. ఆ పుస్తకం నాకు ముందుగా పంపి, మద్రాసులో పుస్తకావిష్కరణ సభలో దాని గురించి ప్రసంగించమని ఆదేశించారు రజని. చిన్ననాటి నుంచి దక్షిణదేశపు సానులు సేలం అమ్మాకణ్ణు, ధనకోటి, కోయంబత్తూరు తాయి, తిరువిడైమరుదూర్ భవాని యిచ్చిన రికార్డుల వలన, చిన్నతనాననే ఎదురుగా పాడిన బెంగుళూరు నాగరత్నం, ఆడిన గడ్డిభుక్త సీతారామ్ వలన యివి నాకు ఎరుకే, అభిమానమే, గౌరవమే.

 అందులో కొన్ని తప్పులు నాకు కనబడ్డాయి. అవన్నీ సభలో ఏకరవు పెట్టాను. ఒక చదువుల పెద్ద నాతో గుసరుసలాడేడు ‘శుభం పలకరాజేజమ్మా అంటే..’ అని. రజని ఏం చేశారో తెలుసా? నా ప్రసంగం అయిన వెంటనే ఆయనంతట ఆయనే మైకు దగ్గరకు వచ్చి ‘రంగారావు చెప్పిన వాటిలో మూడు నా తప్పే. తక్కినవి పరిశీలించాలి’ అన్నారు. సభ చివరలో మళ్లీ పిలవకుండానే మైకు చేత పుచ్చుకొని ‘మరి రెండూ నా తప్పులే’ అన్నారు. నా చేత ఉతికింపించుకొన్న చదువుకొన్న వారు, పేర్ల ముందు పొడి అక్షరాలు తగిలించుకొన్న వారు ఎందరో! అందులో ఎందరిలా ఒప్పుకొనగల ధీరులు! అలా బహిరంగంగా చెప్పుకొని ఒప్పిన మహనీయుడు రజని! ప్రణమామ్యహం! ఆయన పాటలు, సంగీత రూపకాలు కొత్త వారిచే మథింపజేసి, అమృతం పుట్టించే బాధ్యత ఆకాశవాణిది, లలిత సంగీత ప్రియులది, మీదీ, నాదీ! 

వి.ఎ.కె. రంగారావు , ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు

......................................

0 వ్యాఖ్యలు: