జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, March 7, 2015

కాన్సెప్ట్‌ను మింగేసిన కథన లోపాలు (సినిమా రివ్యూ - సూర్య వర్సెస్ సూర్య)

సినిమా రివ్యూ - సూర్య వర్సెస్ సూర్య
చిత్రం - సూర్య వర్సెస్ సూర్య, తారాగణం - నిఖిల్, త్రిధా చౌధరీ, మధుబాల, తనికెళ్ళ భరణి, మాటలు - చందు మొండేటి, సంగీతం - సత్య మహావీర, కూర్పు - గౌతమ్ నెరుసు, నిర్మాత - మల్కాపురం శివకుమార్, రచన - ఛాయాగ్రహణం, దర్శకత్వం - కార్తీక్ ఘట్టమనేని
....................................
కొత్త రకం కథలు రావడం లేదనేది ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు చేసే ఫిర్యాదు. అయితే, ఎంచుకున్న ఇతివృత్తం, తీసుకున్న కథ కొత్తగా ఉంటే చాలా? వాటికి న్యాయం చేకూర్చేలా స్క్రిప్టును తీర్చిదిద్దుకొని, కథనాన్ని నడిపించకపోతే? అప్పుడూ మళ్ళీ నిరాశ తప్పదు. మరి, రొడ్డకొట్టుడు సినిమాలు ఎక్కువగా వస్తున్న సమయంలో ఆ మూసను బద్దలుకొట్టుకొని, ఒక చిన్న వెరైటీ పాయింట్‌తో వచ్చిన సినిమా - ‘సూర్య వర్సెస్ సూర్య’. సూర్యరశ్మి పడని ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందీ చిత్రకథ.

 కథ ఏమిటంటే...
అనగనగా ఓ యువకుడు. పేరు సూర్య (నిఖిల్). కానీ, అతనికో విచిత్రమైన జబ్బు. సూర్యరశ్మి కాసేపు తగిలినా అతని ఒళ్ళు కాలిపోతుంది. ప్రాణాంతకమవుతుంది. శాస్త్రీయంగా ఆ జబ్బు పేరు మాటెలా ఉన్నా, అతని చిన్నప్పుడే ఆ సంగతి డాక్టర్ (రావు రమేశ్) ద్వారా తెలుసుకుంటుంది ధనికురాలైన అతని తల్లి (మణిరత్నం ‘రోజా’ ఫేమ్ మధుబాల). అప్పటి నుంచి పగటి పూట అతణ్ణి బయటకు పంపకుండా, ఇంట్లోనే పెంచుతుంది. సూర్యుణ్ణి చూడకుండా పెరిగే సూర్య జీవితమంతా సాయంత్రం 6.30 గంటల నుంచి తెల్లవారే ముందు దాకానే! అలాంటి సూర్య కాస్తా చదువు కోసం ఒక రాత్రిపూట కళాశాలలో చేరతాడు.
లేటు వయసులో చదువు కోసం కాలేజీలో చేరిన కిరాణాషాపు యజమాని ఎర్రిసామి అలియాస్ ఎర్‌శామ్ (తనికెళ్ళ భరణి), ఆటో డ్రైవర్ అరుణ్‌సాయి (సత్య అక్కల) అక్కడ హీరోకు పరిచయమవుతారు. వాళ్ళతో స్నేహం పెరిగిన హీరో, రెండేళ్ళుగా తాను ప్రేమిస్తున్న టీవీ యాంకర్ సంజన (త్రిధా చౌధరీ) ప్రేమ గెలుచుకోవడానికి వాళ్ళ సాయం తీసుకుంటాడు. తన జబ్బు సంగతి మిత్రుల ద్వారానే ఆమెకు తెలియజేస్తాడు. దాంతో, ఆమె, జర్నలిస్టయిన ఆమె తండ్రి (సాయాజీ షిండే) కోపగిస్తారు. హీరోను దూరం పెడతారు. ఆ పరిస్థితుల్లో ప్రేమను గెలుచుకోవడానికి సూర్య ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా కథ.

 ఎలా చేశారంటే...
గతంలో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి విజయవంతమైన చిత్రాల రూపకల్పనకు కలసి కృషి చేసిన యువ బృందం మరోసారి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఆ రెండు వరుస హిట్ల తరువాత ఇందులో సూర్య పాత్రలో నిఖిల్ ఎండ వేడిమికి తట్టుకోలేని వ్యాధి తాలూకు బాధను వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. తరచూ హుషారు పాత్రల్లోనే చూసే అతణ్ణి ఇలా చూడడం ప్రేక్షకులకు వెంటనే జీర్ణం కాదు. కథానాయికగా విభా నుంచి అందం, అభినయాలు ఆశించలేం.
తల్లి పాత్రధారిణి మధుబాల మంచి నటి అయినా, అతిగా సన్నబడి, హీరో పాత్రకు కాదు... తల్లి పాత్రకే అనారోగ్యమేమో అనిపించేలా ఉండడం మైనస్. ఆ బలహీనతకు సన్నివేశాల్లోని బలహీనత తోడైంది. చాలాకాలం తరువాత తనికెళ్ళ భరణి ఒక పూర్తి నిడివి పాత్రలో సినిమా అంతా కనిపించారు. కొన్నిచోట్ల నటనలో తనదైన చమక్కులు చూపించారు. ఆటో డ్రైవర్ పాత్రధారి కూడా కాసేపు నవ్వించారు.
   
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, ఛాయాగ్రహణం నుంచి దర్శకత్వానికి ఓ మెట్టు ఎదిగిన కార్తీక్ ఘట్టమనేని తన మునుపటి చిత్రాల కెమేరా వర్క్‌కు తక్కువ కాకుండా ఈ సినిమాను నడిపించారు. దృశ్యపరమైన అందం, లైటింగ్ తెలుస్తూ ఉంటాయి. అది సినిమాకు కొంత ప్లస్ పాయింట్. పాటలు, సంగీతం ఫరవాలేదనిపిస్తాయి. కాకపోతే, పదే పదే వినడానికీ, ప్రేక్షకులను రప్పించడానికీ దోహదపడతాయా అన్నది సందేహం. ఫస్టాఫ్‌లో వచ్చే ‘హృదయం పరిగెడుతోందే...’ అనే గజల్ తరహా గీతంలో హార్మోనియమ్ ముందేసుకొని, పాట పాడుతూ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి క్షణకాలం తళుక్కుమంటారు. సన్నివేశాలు, సంభాషణల రచనలో లేని పదునును ఎడిటింగ్ దగ్గర ఆశించలేం.

ఎలా ఉందంటే...
నటీనటులు తక్కువే అయినా, నైట్ ఎఫెక్ట్‌ల మధ్య నిర్మాణ విలువలు బాగానే అనిపించే సినిమా ఇది. ఎటొచ్చీ స్క్రిప్టును అల్లుకున్న తీరులో, కథను నడిపించిన తీరులో తడబాట్లు ఉన్నాయి. దర్శకుడు కొత్తవాడు కావడమూ కొంత కారణమేమో అనిపిస్తుంది. నిజానికి, ఫస్టాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో తన ప్రేమ, ఆ ప్రేమను పొందడానికి పడే తపనతో సరిపోతుంది. ఎండ ఉండగా బయటకు రాలేని హీరో, ఆ సంగతి బయటపెట్టకుండానే, కష్టంలో ఉన్న హీరోయిన్‌ను కాపాడే సీన్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
ఫస్టాఫ్ కాస్తంత అటూ ఇటూగా ఉన్నా, బలమైన ఇంటర్వెల్ ఘట్టం లాంటివి తోడై ఫరవాలేదనిపిస్తుంది. తీరా సెకండాఫ్‌లో హీరోయిన్‌కు ఆ విషయాన్ని ఎలా తెలియజేశాడు, వాళ్ళకు ఎలాంటి కష్టాలు వచ్చాయి లాంటివి ఏమైనా చూపిస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తాం. కానీ, కథ అక్కడ గాడి తప్పినట్లనిపిస్తుంది. మామూలు ప్రేమ కథలాగే కొనసాగుతుంది. హీరోయిన్, ఆమె తండ్రి కలసి హీరోను ఎందుకు కాదన్నారు, చివరకు ఎందుకు సరే అన్నారన్నదానికీ బలమైన కారణం కనిపించదు.
జనం లేని దీవి లాంటి చోట హీరో కథ, అక్కడ పడవ దొరకడం, టీవీ చానల్‌లో హీరో బృందం ప్రత్యక్ష ప్రసారం లాంటివన్నీ కథను ముందుకు నడపడం కోసం సినిమాటిక్‌గా బలవంతాన అల్లుకున్నట్లనిపిస్తాయి. అలా కాకుండా, కథలో సహజమైన పురోగతి ఉండేలా చూసుకుంటే బాగుండేది.

నిజానికి, తల్లీ కొడుకుల అనుబంధం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు అతని జబ్బు అనుకోని ఇబ్బందులు తేవడం, పగటి వేళ తప్పనిసరైన బయటకు రావాల్సి వచ్చిన హీరో దాన్ని తెలివిగా తప్పించుకొనే వైనం - ఇలా ఎన్నెన్నో అంశాలతో ఈ కాన్సెప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దుకొనే అవకాశం ఉంది. కానీ, దర్శక, రచయిత ఎందుకనో బంగారం లాంటి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. బలహీనమైన సన్నివేశాలు, అనాసక్తికరమైన స్క్రీన్‌ప్లేతోనే సినిమా అయిందనిపించారు. వెరసి ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న చిత్రంగా గుర్తున్నా... చివరకు మంచి కాన్సెప్ట్ వర్సెస్ బలహీనమైన కథాకథనంగానే మిగిలిపోతుంది.

 - రెంటాల జయదేవ

..................................

0 వ్యాఖ్యలు: