జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, November 1, 2010

కనిపించని హింసతో కుటుంబ కథ - ‘బావ’మునుపటి టపా ‘భయపెడుతున్న బావ’లో ముందుగానే చెప్పినట్లు - ఏ మాత్రం వీలున్నా కొత్త తెలుగు సినిమాకు వెళ్ళిపోవడం నా బలహీనత. ఈ మధ్య కాలంలో ఈ బలహీనత మీద మరీ గట్టిగా దెబ్బ కొట్టిన చిత్రం - కచ్చితంగా ‘బావ’.

ఒకటి కాదు, రెండు కాదు - ఏకంగా పదుల కొద్దీ సినిమాల నుంచి వేర్వేరు దృశ్యాలు, ఘట్టాలు, పాటలు, ప్రహసనాలు అడ్డంగా, అడ్డదిడ్డంగా వాడేసుకొని, దానికి మళ్ళీ కొత్త సినిమా అనే కలర్ ఇచ్చుకొని వచ్చిన సినిమా ఇది. దీనికి పల్లెటూరి నేపథ్యం అదనం. మనం చాలా సినిమాల్లో చూసినట్లే, ఇందులోనూ కథానాయకుడు వీరబాబు (సిద్ధార్థ), తన మిత్రులతో కలసి పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. తింగరి వేషాలు వేస్తూ, ఊళ్ళో జనంతో ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉంటాడు. గారాబంగా చూసుకొనే తండ్రి (రాజేంద్రప్రసాద్), తల్లి - అతని సొంతం. ఓ పెద్ద కుటుంబానికి అల్లుడుగా తన కొడుకు వెళ్ళాలని తండ్రి ఆశ. షరా మామూలుగా కొడుకు, పక్క ఊళ్ళోని ఓ పే....ద్ద ఇంటి పిల్లను ప్రేమిస్తాడు.

ఓ రెండు పాటలు, అరగంట సినిమా గడిచాక వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. చిన్నప్పుడు ఒకే స్కూలులో చదువుకొన్న బాల్యమిత్రులమన్న సంగతి హీరో, ఆ అమ్మాయికి గుర్తు చేయడంతో ఈ ప్రేమ పురాణానికి గట్టి పునాది అవుతుంది.

చిక్కేమిటంటే - హీరో వాళ్ళ ఊరికీ, హీరోయిన్ వాళ్ళ ఊరికీ మధ్య గొడవలుంటాయి. గ్రామాల విభజనలో గుడిని కూడా విభజించుకొని, రాముడు ఒకవైపు, సీత మరొకవైపు ఉండిపోయి, 14 ఏళ్ళుగా కల్యాణం కూడా జరపని గ్రామాలవి. హోదా, స్థాయి కోరుకునే తండ్రి, మరో వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడుతున్నట్లు హీరోయిన్ భయపడుతుంది. దాంతో, హీరోయిన్ మెడలో గుళ్ళో అమ్మవారి తాళి కట్టేసి, తమ ఇంటికి తెచ్చేస్తాడు.

తీరా అందుకు హీరో తండ్రి అభ్యంతరం చెబుతాడు. అయినవాళ్ళందరినీ ఒప్పించి, ఆ ఇంటికి అల్లుడు కావాలని హీరోకు చెబుతాడు. అతను అలా అనడానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, ఆ తరువాత హీరో - హీరోయిన్లు చేసిందేమిటి, హీరోయిన్ ఇంటి వాళ్ళను హీరో ఎలా ఒప్పించాడన్నది ఇంకా సహనం మిగిలిన వాళ్ళే చూడగల మిగతా సినిమా.

ఈ అతుకుల బొంత కథలో అనేక సందేహాలు తలెత్తుతాయి. వాటిలో కొన్ని -
1. చిన్నప్పుడు కలిసి చదువుకొన్న హీరో, హీరోయిన్లకు తాము బావా మరదళ్ళమన్న సంగతి తెలీదా?
2. గుళ్ళో స్తంభానికి కట్టి ఉంచిన అమ్మవారి తాళిబొట్టును హీరోయిన్ మెడలో హీరో కట్టేశాడు. కల్యాణం జరగలేదని ఏళ్ళుగా బాధపడుతున్న జనానికి ఆ తాళిబొట్టు ఏమైందన్న ఆరా రాదా, ఆ అక్కర లేదా?
3. చిన్నప్పటి బాబు జ్ఞాపకాలను తనతోనే దాచుకొని, బొమ్మల పెళ్ళి లక్కపిడతల్ని కూడా దాచుకున్న హీరోయిన్ ఆ తరువాత దాని గురించి పట్టించుకోకుండా, ‘హేయ్... రమణ బావ’ అంటూ మరొకరితో పెళ్ళికి ఇష్టం అన్నంతగా చనువుగా ఉంటుందేం?

రెండు ఊళ్ళ గొడవలతో 14 ఏళ్ళపాటు గుళ్ళో దేవుళ్ళకు కల్యాణం జరగకపోవడం, హీరో - విలన్ల మధ్య సైకిల్ పందెం - ఇలా అన్నీ మనకు పాత సినిమాలను పదే పదే జ్ఞాపకం చేస్తుంటాయి. ఈ కాపీలు చాలవన్నట్లు - హీరోయిన్ పరిచయానికి ఆర్య -2 చిత్రంలోని రింగ రింగా... పాటను పూర్తిగా వాడుకున్నారు. అలాగే, అతకని బ్రహ్మానందం పెళ్ళి హాస్య ఘట్టం కోసం అల్లు అర్జునే నటించిన ఇటీవలి వరుడు చిత్రాన్ని వ్యంగ్యంగా వాడారు.

నటనలో ఈజ్ కనబరిచే హీరో సిద్ధార్థ సైతం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో దారుణమనిస్తారు. కావాలంటే, హీరోయిన్ తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవపడుతూ, ఏడ్చే సందర్భాన్ని (చూడగలిగితే) చూడండి. హీరోయిన్ ప్రణీత తెరపై సుద్దబొమ్మలా తప్ప ప్రాణం ఉన్న మనిషిలా అనిపించకపోవడానికి కథాకథన లోపాలు కూడా యథోచితంగా తోడ్పడ్డాయి. రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర కూడా అసలు ఘట్టాల దగ్గరకు వచ్చేసరికి చేసిందేమీ లేదు. సినిమా నిండా పాత్రలున్నా - వాటి మధ్య అనుబంధాలు కానీ, భావోద్వేగాలు కానీ కృత్రిమంగానే అనిపిస్తాయి. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా చూస్తున్నవారికి (దర్శక - నిర్మాతలు ఆశించిన) అనుభూతిని అందించవు.

సినిమాలో సంగీతం, ఒకదాని వెంట మరొకటిగా వచ్చిపడే పాటలు - అంతా గందరగోళమే. అన్నట్లు ఓ విషాద గీతంలో సిద్ధార్థ గొంతులో వినిపించిందండోయ్. సినిమాలో బాగున్నదల్లా - పచ్చని ప్రకృతి దృశ్యాలు. వాటిని తెర కెక్కించడానికి ఛాయాగ్రాహకుడు చూపిన పనితనం మెచ్చుకోవాల్సిందే. ఫస్టాఫ్ కాస్తంత జోకులతో నడిచినా, సెకండాఫ్ కు వచ్చేసరికి, ఇంతటి యు సర్టిఫికెట్ కుటుంబ కథ సినిమా కూడా ప్రేక్షకుల పాలిట హింసాత్మకంగా పరిణమిస్తుంది. కథలో హింస లేదన్న మాటే కానీ, సినిమా మాత్రం ఓ పెద్ద హింసాత్మక అనుభవం. ‘బావ’ అంటే భయపడుతున్నది అందుకే.