జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, July 30, 2010

రావోయీ అనుకోని అతిథి

పుణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో....
(ఎడమ నుంచి కుడికి)

నిల్చున్నవారు - తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, సురేశ్, అక్కిరాజు భట్టిప్రోలు, దాసరి అమరేంద్ర, లెనిన్ ధనిశెట్టి, గోపిని కరుణాకర్.

కూర్చున్నవారు - విజయలక్ష్మి, అమరేంద్ర గారి అక్కయ్య, అమరేంద్ర గారి అమ్మ గారు నంబూరి పరిపూర్ణ, పసుపులేటి గీత, మహమ్మద్ ఖదీర్ బాబు, సురేశ్ వాళ్ళ అబ్బాయితో రెంటాల జయదేవ, గొరుసు జగదీశ్వరరెడ్డి, వి. ప్రతిమ, కూతురితో సురేశ్ గారి భార్య పద్మావతి,అక్బర్.
* * * * * * * *

ఊరు కాని ఊళ్ళో, మన భాష వాళ్ళు కనిపించడమే అరుదు అనుకుంటున్నప్పు డు ఊహించని రీతిలో మన అనుకొనే మిత్రులు ఎదురైతే ఎలా ఉంటుంది..... అదీ సాహిత్య జీవులైతే..... అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. ఈ మధ్య పుణేలో నాకు అలాంటి అనుభవమే కలిగింది.

మద్రాసులో ఉండే ఇతనికి పుణేలో పనేంటా అనుకుంటున్నారా.... ఆఁ.... ఆఁ... సరిగ్గా అక్కడికే వస్తున్నా. యాభయ్యేళ్ళ చరిత్ర ఉన్న పుణే ఫిలిం ఇన్స్టిట్యూటులో ఫిలిం ఎప్రీసియేషను కోర్సు చేద్దామని వెళ్ళా. పుణే లోని నేషనలు ఫిలిం ఆర్కైవ్సు వారి నేతృత్వంలో ఏటా ఒకసారి మాత్రమే వేసవిలో నిర్వహించే కోర్సు అది. సీట్లు పరిమితం... బోలెడంత పోటీ మధ్య సెలక్షనులో నెగ్గాలి.

ఎన్నో ఏళ్ళుగా చేద్దామనుకుంటున్నా ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది... అసలు అప్లయ్ చేయడం కూడా ఎప్పుడూ కుదరలేదు. ఈసారి ఎలాగైనా అప్లయ్ చేయాలనుకున్నా. ప్రకటన కోసం కాచుకు కూర్చున్నా. అప్లయ్ చేయడం, సెలక్ట్ కావడం... అదో పెద్ద కథ (ఆ పాతిక రీళ్ళ సినిమా మరోసారి తీరిగ్గా చెబుతా...).

ఎలాగైతేనేం పుణే చేరా. అసలే వేసవి.... అందులోనూ నెల రోజుల కోర్సు.... ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో ముగ్గురంటే ముగ్గురే తెలుగు విద్యార్థులు ఎదురయ్యారు. వాళ్ళూ వాళ్ళ షూటింగులు, చదువులతో బిజీ... పది రోజులయ్యేసరికి నాకు నీరసం వచ్చేసింది. మన తరహా తిండీ తిప్పలు లేకపోయినా సర్దుకుంటాం. మన భాష కాని వాడితో, రాని వాడితో కూడా స్నేహం చేస్తాం. కానీ, పది రోజులుగా మనదైన భాషలో మనసారా మాట్లాడుకోలేకపోతే మజా ఏముంటుంది....

ఆ నీరసానికి తోడు ఆ రోజు ఉదయం 9.30కు మొదలైన క్లాసులు సాయంత్రం 5 దాటినా భారంగా సాగుతున్నాయి. క్లాసురూమ్ థియేటర్లో తెర మీది సినిమా మరీ బాదేస్తోంది. దానికి తోడు తలనొప్పి బాధ. తలనొప్పికి మందు టీ ఉండనే ఉందిగా. క్లాసు బయటే రోజూ ఆ టైమికిచ్చే టీ కోసం వచ్చా. టీ తాగుతుంటే, జయదేవ్ జయదేవ్... అంటూ పిలుపు. ఎవరా అని చూస్తే,... ఎలా ఉన్నావంటూ అదే గొంతులో పలకరింపు... నేను ఖదీర్ ను... అన్న వివరణ.

ఒక్క క్షణం ఆశ్చర్యపోయా. హైదరాబాద్ సాక్షిలో ఉన్న ఖదీర్ ఉరుము లేని పిడుగులా ఈ ఊళ్ళో ఊడిపడ్డాడేమిటి చెప్మా అనుకున్నా. కొన్నేళ్ళ తరువాత కలిసినా, ఠక్కున నన్ను గుర్తు పట్టి పలకరించిన మహమ్మద్ ఖదీర్ బాబు జ్ఞాపకశక్తికి నిజంగానే ఆశ్చర్యపోయా. పెళ్ళికి ముందు సన్నగా ఉండే ఖదీర్ ఇప్పుడు బాగానే బొద్దు చేశాడు. నా కన్నా ముందు తనే గుర్తు పట్టాడు. చూద్దును కదా... ఖదీర్ పక్కనే నడుచుకుంటూ వస్తూ... తెలుగు కథా లోకంలో, పత్రికా లోకంలో ప్రసిద్ధులైన రచయితలు, రచయిత్రుల బృందం. వారికి కొద్దిగా ముందుగా నడుస్తూ రచయిత దాసరి అమరేంద్ర..

పుణేలో నువ్వెందుకు ఉన్నావంటే, నువ్వెందుకు ఉన్నావంటూ వెంటనే ప్రశ్నలు.... ఫిల్మ్ ఎప్రీసియేషన్ కోర్సు కథ నేను చెప్పుకొచ్చా. తరచూ కలుసుకొని, అభిప్రాయాలు కలబోసుకొనే ప్రయత్నంలో భాగంగా తెలుగు రచయితలలో కొందరు ఈసారి పుణే వచ్చారట. ఆ ఉదయమే ఊళ్లోకి దిగి, లోకల్ సైట్ సీయింగ్ కి బయలుదేరారట. అందులో భాగంగా ఒకప్పుడు వి. శాంతారామ్ ప్రభృతుల ప్రభాత్ స్టూడియో ప్రాంగణమైన ప్రతిష్ఠాత్మక ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ కి వచ్చారు. ఆదూర్ గోపాలకృష్ణన్ మొదలు ఇవాళ్టి ఆశుతోష్ గోవారీకర్ వరకు ఎందరో ప్రముఖులను అందించిన ఇన్ స్టిట్యూట్ లోని పరిసరాలు, ప్రభాత్ మ్యూజియం తప్పకుండా చూడదగ్గవి.

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి (గోదావరిఖని) గారు లాంటి సీనియర్ల మొదలు ఆర్టిస్టు అక్బర్ (హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి), గొరుసు జగదీశ్వర రెడ్డి (హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి),, గోపిని కరుణాకర్ (హైదరాబాద్), లెనిన్ ధనిశెట్టి (గూడూరు), వి. ప్రతిమ (నెల్లూరు), పసుపులేటి గీత (హైదరాబాద్), భట్టిప్రోలు అక్కిరాజు (హైదరాబాద్), సురేశ్ - పద్మావతి దంపతులు - వాళ్ళ పిల్లలు (హైదరాబాద్), విజయలక్ష్మి (హైదరాబాద్) ---- అంతా ఆ బృందంలో ఉన్నారు. దాసరి అమరేంద్ర గారి అమ్మ గారు (నంబూరి పరిపూర్ణ), అక్కయ్య కూడా వెంటే ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన అమరేంద్ర ఇప్పుడు పుణేలోనే ఉంటున్నట్లు నాకు అప్పుడే తెలిసింది. రచయితల ఆతిథ్యం వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు.

మనవాళ్ళందరినీ చూసే సరికి నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. అయిపోవచ్చిన క్లాసుకు అంతటితో మంగళం పాడేసి, వాళ్ళ వెంటే నేనూ తిరుగుతూ పుణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ పరిసరాలు చూపించసాగాను. ఆ వారం పది రోజుల్లో నేను తెలుసుకున్న అక్కడి ఘనతలు వివరించసాగాను. అందులో చాలామంది సాహిత్యంతో నాకు దీర్ఘ పరిచయం ఉన్నా, వారితో ప్రత్యక్షంగా నాకదే తొలి పరిచయం. కానీ కొద్ది సేపటికే చిరకాల మిత్రులుగా మారిపోయాం. ఊరు కాని ఊళ్ళో మన అనుకొనే వాళ్ళు కనిపిస్తే కలిగే కలివిడితనం అదే... ఆ తీపి జ్ఞాపకానికి గుర్తుగా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లోనే అందరికీ కలిపి నా కెమేరాలో ఫోటో తీశా. నేనూ వాళ్ళతో కలసి ఫోటో దిగా (పైన ఉన్న ఫోటో ఆ తీపి గుర్తే....)

వాళ్ళ వెంటే నన్నూ అమరేంద్ర గారి ఇంటికి వచ్చి, ఆ సాయంకాలం సాహితీ చర్చల్లో పాల్గొనాల్సిందిగా మిత్రులు కోరారు. సాహితీ విందుకు ఆహ్వానిస్తే వద్దనడం ఎవరి తరం. కోర్సులో భాగంగా రోజూ సాయంత్రం, రాత్రి చూపెట్టే సినిమాలను కూడా ఆ రోజుకు ఎగ్గొట్టి, వాళ్ళ వెంట బయలు దేరా... పది రోజుల ఇంటి బెంగ తీర్చుకోవడానికి..... అమరేంద్ర గారి ఇంటిలో జరిగిన ఆ చల్లటి సాయంత్రం జరిగిన పసందైన సాహిత్య విందు వివరాలు, విశేషాలు మరోసారి...

Tuesday, July 27, 2010

కాలక్షేపం రామన్న!

(మర్యాద రామన్నలో అపర్ణగా సలోనీ, రాముగా సునీల్)

ఊళ్ళోకి తెలుగు సినిమా వచ్చిందంటే వదిలిపెట్టడం మన వల్ల కాదు... కొద్ది రోజులుగా ఆ వ్రతానికి భంగం జరిగిందేమో, ఇక లాభం లేదని మాంఛి గురుపూర్ణిమ సుమూహర్తంలో మళ్ళీ ఆ వ్రతం విజయవంతంగా మొదలుపెట్టా --- మర్యాద రామన్నతో... హాస్యనటుడిగా పేరున్న సునీల్ ను హీరోగా చూపెట్టి తాజా చిత్రమిది. దానికి తోడు వరుస విజయాల జోరు మీదున్న ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం. రాజమౌళి సినిమాలన్నిటి లానే దీనికీ రాజమౌళి అన్నయ్య (పెదనాన్న కుమారుడైన) ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. అయితే, ఈ సారి కథ, మాటలు మాత్రం రాజమౌళి నాన్న గారి బృందం (విజయేంద్ర ప్రసాద్, ఆయన టీమ్ మెంబర్ ఎం. రత్నం) అందించలేదు. రాజమౌళికి సోదరుడి వరసయ్యే ఎస్.ఎస్. కాంచీ ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఈ చిత్ర కథలో కొత్తదనం ఏమిటంటే, కష్టమే. ఒక్కముక్కలో కథంటే, తనను చంపాలనుకొనే విలన్ను తప్పించుకొని, అతని కూతురినే పెళ్ళాడే ఓ సీమ బ్యాక్ గ్రౌండ్ హీరో ప్రేమ కథ. కానీ, దీన్ని నడిపించిన విధానంలోనే రాజమౌళి తెలివి చూపించారు. మామూలు ఫ్యాక్షనిస్టు కథగా కాకుండా, రాయలసీమలో కక్షలే కాదు మర్యాదలూ ఉంటాయనీ,అతిథులను ఆదరించే సంప్రదాయమూ ఎక్కువేననీ కథలో జొప్పించారు.

రాయలసీమ నేపథ్యం... అందులో పగ, ప్రతీకారాలతో రగిలిపోయే ఓ పెద్ద మనిషి.... అతనికి ఓ కూతురు... సొంత పని మీద ఆ ఊరికి వచ్చి, అనుకోకుండా ఆమెకు దగ్గరయ్యే హీరో.... కుటుంబాల మధ్య పాత పగతో అతణ్ణి చంపాలనుకొనే హీరోయిన్ తండ్రి, అన్నలు. ఇంట్లో రక్తం చిందరాదంటూ వారికి ఉన్న ఆచారాన్ని ఆసరాగా తీసుకొని, గుమ్మం దాటకుండా ఇంట్లోనే తిరుగుతూ హీరో జాగ్రత్త పడుతుంటాడు. అతను తన కోసమే ఇంట్లోనే ఉంటున్నాడనుకొనే హీరోయిన్ ప్రేమను ఆఖరు క్షణంలో గుర్తించి, ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడతాడు. చివరకు పగ మీద ప్రేమే జయించడంతో కథ కంచికి...

స్వయానా దర్శకుడూ, రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికంలో రాజమౌళికి సీనియరూ, మిత్రుడూ అయిన వర ముళ్ళపూడి ఈ చిత్ర మూల కథకు వీలైనంత సాయం పట్టారు. ఆ సంగతి సినిమా టైటిల్సులో కృతజ్ఞతా పూర్వకంగా దర్శక - నిర్మాతలు ప్రకటించారు. అర్క మీడియా బ్యానర్ మీద దేవినేని ప్రసాద్, యార్లగడ్డ శోభు పేరిట ఈ సినిమా తీసిన డి.ఎస్.ఎస్. ప్రసాద్, వై.ఎన్. శోభనాద్రి ఇద్దరూ రాఘవేంద్రరావుకు అతి సమీప బంధువులే.

రాయలసీమ పాత కక్షల సంగతి తెలియకుండా ఎక్కడో పెరిగి, అనుకోకుండా వాటి మధ్యకు వచ్చిన రాము పాత్రలో సునీల్ అమాయకత్వాన్నీ, భయాన్నీ, సందర్భపరంగా వచ్చే హాస్యాన్నీ పండించారు. చిత్రలేఖనం చేసే నాయిక అపర్ణ పాత్రలో సలోనీ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటన తరహాలో తెల్లగా, నవ్వుతూ కనిపిస్తుంది. నాయిక తండ్రి పాత్రలో నాగినీడు బాగున్నారు, పాత్రను బాగా చేశారు. రావు రమేశ్ చిన్న పాత్రలో కనిపిస్తారు. రైలులోని కామెడీ సన్నివేశంలో ఈ చిత్ర రచయిత కాంచీ కనిపిస్తారు. ఆ ఘట్టం ప్రధానంగా ఆ పాత్ర చుట్టూరానే తిరుగుతుంది.

గతంలో నృత్య దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఉన్న సునీల్ డ్యాన్సులు బాగా చేశారు. చిరంజీవి తరహా స్టెప్పులతో హాలులో ప్రేక్షకులు కేకలు పెట్టేలా అలరించారు. మునుపు అందాల రాముడులోనూ హీరో పాత్ర పోషించి, డ్యాన్సుల్లో మెప్పించిన సునీల్ కు ఇది మరో కిరీటం. తనకు తగ్గ పాత్రలూ, వినోదం పంచే కథలూ ఎంచుకుంటే, సునీల్ మరికొన్ని చిత్రాల్లో చులాగ్గా హీరో ఇన్నింగ్స్ ఆడేస్తారు.
ఈ మధ్య ప్రతి సినిమాలో సినిమా మొదట్లో కథాంశాన్ని చెప్పడానికో, పాత్రల పరిచయానికో ఆ సినిమాలో నటించని ఎవరో ఒక పెద్ద హీరో గొంతు అరువివ్వడం ఓ ట్రెండ్. (పవన్ కల్యాణ్ -జల్సా-లో మహేశ్ బాబు గొంతు, అల్లు అర్జున్ -వరుడు-లో చిరంజీవి గొంతు గుర్తున్నాయిగా...). ఈ సినిమాలో మరో అడుగు ముందుకు వేసి, సినిమాలో అంతర్భాగమైన ఓ పాత్రలా కనిపించే ఓ డొక్కు సైకిల్ కు ఆద్యంతం హీరో రవితేజతో చెప్పించారు. ఇలా ఓ వస్తువుకో, జంతువుకో మానవ చైతన్యాన్ని ఆరోపించి, కథలో భాగం చేయడమనేది గతంలో దర్శకుడు శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో ఇలాంటిదే చూశాం. అందులో కుక్కపిల్లను పాత్రను చేసి, శేఖర్ కమ్ములే గొంతిచ్చారు. పేరుకు ఇది సీమ సినిమా అయినా,డైలాగులు మాత్రం అన్నీ అక్కడి మాండలికానికి తగ్గట్లు ఉండవు. అది గతంలో వచ్చిన సినిమాల్లోనూ ఉన్న లోపమేగా అనచ్చు. కానీ, ఈ సినిమాలో కొన్ని సీమ పాత్రలు కాసేపు ఆ మాండలికంలోనూ, ఆ వెనువెంటనే సినిమాల్లో వచ్చే కోస్తా తరహా భాషలోనూ మాట్లాడడమే చీకాకు అనిపిస్తుంది.

సింహాద్రిలోని చిత్రమైన గొడ్డలి మొదలు సినిమాకొక కొత్త ఆయుధాన్ని సృష్టించి, జనం మీదకు వదిలే రాజమౌళి ఈ సారి ఆ పని చేయలేదు. అదో రిలీఫ్. ఈ సీమ ఫ్యాక్షన్ సినిమాలో రోకళ్ళు, కత్తులు, గొడ్డళ్ళతోనే సరిపుచ్చుకున్నారు. అలాగే, రాజమౌళి సినిమా అంటే, ఎంతో కొంత సభ్యత పరిధులు దాటిన మాటలు, చేష్టలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఒకటి రెండు సన్నివేశాలు అందుకే ప్రత్యేకిస్తారు. ఎందుకో ఈసారి దానికీ కామా పెట్టారు. ఇది మరో సంతోషం. సింహాద్రి సినిమాలో చిన్న ఎన్టీయార్, పెద్ద రమ్యకృష్ణల ...చిన్నదమ్మే చీకులు కావాలా.... పాట మొదలు దాదాపు ప్రతి సినిమాలో ఏదో ఒక ఐటమ్ సాంగో, హీరోయిన్తో అయినా సరే ఓ మాస్ మసాలా గీతమో పెట్టడం రాజమౌళి దర్శకత్వ మార్కు. ఈసారీ ఆయన ఆ ముద్రను వదిలిపెట్టలేదు. హీరో, హీరోయిన్లు సునీల్, సలోనీల మధ్యే ....రాయె రాయె రాయె రాయె... రాయె సలోనీ జాము రాతిరేళ సందు చూసి జంపు జిలానీ.... అని ఓ మసాలా పాట పెట్టారు.

ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన సంగీతం కథనానికి తోడ్పడింది. రీరికార్డింగులో, సౌండ్ ఎఫెక్టుల్లో చూపిన శ్రద్ధ సన్నివేశాలలోని టెంపోను నిలపడంలో, పెంచడంలో బాగా ఉపకరించింది. పాటల రచనలో, పాడడంలో కూడా కీరవాణి తనదైన శైలిలో చేయి, గొంతు చేసుకున్నారు. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది... పాట, ఆ శైలి కీరవాణే గతంలో అమ్మ చెప్పింది చిత్రంలో అనుసరించిన ధోరణిని గుర్తుకుతెస్తాయి. అలాగే, తెలుగమ్మాయి.... పాట బాగుంటే, పదే పదే నేపథ్యంలో వినిపించే ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.... అన్న గీత ఖండిక సందర్భం, సన్నివేశాలలోని గాఢతను పెంచింది. సి. రామ్ ప్రసాద్ కెమేరా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా మామూలు కథను వేగంగా చెప్పడంలో తోడ్పడ్డాయి.

మొత్తం మీద రెండే రెండు గంటలున్న ఈ 14 రీళ్ళ సినిమా సమయం తెలియనివ్వకుండా గడిచిపోతుంది. అటు బూతులూ, ఇటు నీతులూ లేకుండా సరదా కాలక్షేపానికి సరిపోతుంది. ఇవాళ చాలా మంది కోరుకుంటున్న వినోదం అదే కాబట్టి, ప్రేక్షకుడికి కాలం గడిచిపోతుంది. సినిమా నడిచిపోతుంది. రాజమౌళికి వరుస విజయాల జాబితాలో మరో అంకె పెరిగిపోతుంది.

తండ్రి పై తనయుడి పిహెచ్.డి. - వార్తలో వార్త


రెంటాల సాహితీ సౌరభం

తండ్రిపై తనయుడి పిహెచ్.డి.

చెన్నై, జూలై 19, ప్రభాతవార్త

ప్రముఖ కవి, పాత్రికేయుడు, సమాజాభ్యుదయ రచయిత స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణపై ఆయన తనయుడు, సినిమా పాత్రికేయుడు రెంటాల జయదేవ సిద్ధాంత వ్యాసాన్ని (పిహెచ్.డి) రాసి, మద్రాసు యూనివర్సిటీకి సమర్పించారు. ఈ సందర్భంగా చెన్నై, మెరీనా క్యాంపస్ లోని మద్రాసు యూనివర్సిటీ జూబిలీ హాల్లో సోమవారం మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ విచ్చేశారు. సిద్ధాంత వ్యాసానికి మౌఖిక పరీక్షకర్తగా ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ అనిందిత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రెంటాల జయదేవ తను వ్రాసిన సిద్ధాంత వ్యాసంలోని అధ్యాయాలను సదస్యులకు వివరించారు.

ఈ సందర్భంగా రెంటాల గోపాలకృష్ణ రాసిన సంఘర్షణ, సర్పయాగం, శివధనువు రచనల్లోని విశేషాంశాలను తెలిపారు. గేయం, గీతం, కథ, నవల, నాటకం - ఇలా అన్ని సాహితీ ప్రక్రియల్లోను ఆయన దాదాపు 200 పుస్తకాలు రాశారనీ, ఏది రాసినా ఆయన బాణీ, శైలి ప్రస్ఫుటంగా ఉంటాయనీ తెలిపారు. ఆయన ఆకాశవాణిలో ఎన్నో ప్రసంగాలు చేశారనీ, అనేక చర్చలలో పాల్గొనడమే కాకుండా సమీక్షలు చేశారనీ, శ్రోతలకు శ్రవ్య నాటికలు అందించారనీ తెలిపారు.

జీవితంలో రాజీ పడవచ్చు గానీ, కళ, సాహిత్యంలో రాజీ పడకూడదని ఆయన తరచూ చెబుతుండేవారనీ, భౌతికంగా ఆయన మరణించి 15 సంవత్సరాలు అయినా, ఆయన వర్ధంతి సమయంలో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడం ఆనందదాయకంగా ఉందనీ తెలిపారు. ఈ సిద్ధాంత వ్యాసంలో ఆయన రాసిన అన్ని అంశాల మీద పరిశోధన చేయడం జరిగిందని తెలిపారు.

రెంటాల పాత్రికేయ జీవితం 1950ల ప్రాంతంలో దేశాభిమాని పత్రికలో ప్రారంభమైందనీ, ఆంధ్రప్రభలోని చిత్రప్రభ సినిమా శీర్షికను ఆయన నిర్వహించారనీ, జ్యోతిషం మీద కూడా ఆయన వ్యాసాలు రాయడం జరిగిందనీ, దాదాపు అందరు ఎడిటర్లూ ఆయన చేత సంపాదకీయాలు రాయించుకున్నారనీ తెలిపారు. ఆయన రాసిన కవితలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదం చేయబడ్డాయని తెలిపారు. కవి పాత్రికేయుడైతే విషయాన్ని అందంగా చెప్పగలడనీ, ప్రాథమికంగా ఆయన కవి అనీ, సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకున్నారనీ, అభ్యుదయ కవిత్వాన్ని రాశారనీ తెలిపారు. వాత్స్యాయన కామసూత్రాలను సరళమైన తెలుగు వచనంలో అనువదించిన ఘనత ఆయనదేనని తెలిపారు.

ఎంతో కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతో మంది దగ్గర విషయ సేకరణ చేసి, రాసి, సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి మద్రాసు యూనివర్సిటీ డాక్టరేట్ అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రధానంగా మా తండ్రి గారైన రెంటాల గోపాలకృష్ణ గారికి వచ్చిన డాక్టరేట్ గా భావిస్తున్నాననీ, మద్రాసు యూనివర్సిటీ ప్రదానం చేయబోయే డాక్టరేట్ ను మా తల్లి గారైన రెంటాల పర్వతవర్ధనికి అంకితం ఇస్తున్నట్లుగా ఆహూతుల చప్పట్ల మధ్య అభిమానంతో తెలిపారు.

సిద్ధాంత వ్యాసం రాయడానికి ఎల్లవేళలా సహకారం అందించిన డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ కీ, తదితర పెద్దలకూ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. మౌఖిక పరీక్ష కర్తగా వ్యవహరించిన ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ అనిందిత, ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, సదస్యులు సిద్ధాంత వ్యాసంపై అడిగిన సందేహాలకూ, ప్రశ్నలకూ సవివరంగా, సవినయంగా జయదేవ సమాధానాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, మదరాసు తెలుగు అభ్యుదయ సమాజం ప్రధాన కార్యదర్శి లయన్ డి. నాగరాజు, తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నాగేశ్వరరావు, కందనూరు మధు, భమిడిపాటి సుబ్రమణ్యం, కార్టూనిస్టు నర్సిమ్, నిర్మాత మురారి, సీనియర్ పాత్రికేయుడు జొన్నలగడ్డ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

(వార్త దినపత్రిక, చెన్నైలో 2010 జూలై 20, మంగళవారం నాడు ప్రచురితం)

Sunday, July 25, 2010

జర్నలిజం బాధ్యతాయుతమైంది --సాక్షి లో నా ఇంటర్వ్యూ !


జర్నలిజం బాధ్యతాయుతమైంది

అంబత్తూరు, తమిళనాడు, న్యూస్‌లైన్‌:

జర్నలిజం కేవలం ఉద్యోగం కాదు సమాజం పట్ల బాధ్యత అంటారు రెంటాల జయదేవ. ఆయన పాత్రికేయ రంగం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఈయన తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రవేసిన రెంటాల గోపాలకృష్ణ వారసుడు. తండ్రిక తగ్గ తనయుడు. రచయితగా, సమీక్షుకుడిగా, వ్యాసకర్తగా, విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా, పరిశోధకుడిగా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 'విస్తృత పరిజ్ఞానం కోసం నిత్యం అన్వేషించడం నాకిష్టం' అంటున్న జయదేవతో 'న్యూస్‌లైన్‌' ముఖాముఖి.

ప్రశ్న : తండ్రి కవిత్వంపై పరిశోధనలు చేయడంపై మీ అనుభూతి ?
జ: ఆయనను నా తండ్రిగా కంటే ఓ కవిగా, రచయితగానే నే ను గుర్తిస్తాను. శ్రీశ్రీ, ఆరుద్ర సమకాలికులుగా ఆధునిక కవిత్వాన్ని శాసించిన గోపాలకృష్ణ పీడిత ప్రజల పక్షాన చివరివరకు నిలిచారన్న విషయం మిగతా వారికంటే ఆయన కొడుకుగా నాకు బాగా తెలుసు. అందుకే ఆయన కవిత్వంపై పరిశోధన చేసేందుకు పూనుకున్నాను. తండ్రి కవిత్వంపై పరిశోధన చేసే అవకాశం రావడం మరుపురాని అనుభూతి. అందుకే నాకు వచ్చిన డాక్టరేట్‌ మా నాన్న గారికే అంకితం చేశాను.

ప్రశ్న : పాత్రికేయులై న మీరు పరిశోధన చేయడం గురించి ? పరిశోధన వివరాల గురించి?
జ: పాత్రికేయుడికంటే ముందు నేనొక రచయితను, వ్యాసకర్తను. 15 ఏళ్ల వయసులోనే మా నాన్నగారి రచనలకు అక్షరదోష పరిష్కర్తగా వ్యవహరించిన అనుభవం ఉంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి రచనలపై అవగాహన వచ్చిందనుకుంటున్నా. ఆ రకంగా నాన్నగారి రచనలపై పరిశోధన చేయడం నాకు పెద్ద కష్టమనిపించలేదు. పరిశోధనకు నా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం మరవలేనిది. 'రెంటాల గోపాలకృష్ణ కవిత్వం, సామాజిక దృక్పథం' పేరుతో చేసిన పరిశోధన సంపుటి నా జీవితంలో మరువలేనిది.
ప్రశ్న : పాత్రికేయులుగా మీ ప్రస్థానం గురించి?
జ: జర్నలిజంపై ఉన్న ఆసక్తితో డిగ్రీ పూర్తి కాగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజమ్‌, మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో ఎంఏ చేశాను. అలాగే పుణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్ ఆఫ్‌ ఇండియా సంయుక్త నిర్వహణలో చలనచిత్ర రసాస్వాదన (ఫిల్మ్‌ ఎప్రీసియేషన్‌ ) డిప్లొమో కోర్సు చేశాను. ఎన్ని చేసినా పాత్రికేయ రంగంలో ఏదో సాధించాలన్న తపన మాత్రం తగ్గడంలేదు. కొత్త విషయాలను నేర్చుకోవాలి. బాధ్యతాయుతమైన పాత్రికేయుడిగా నా కంటూ ఓ గుర్తిం పును తెచ్చుకోవాలని ముందుకు సాగుతున్నాను.

ప్రశ్న : ప్రస్తుత పత్రికా వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ: పార దర్శకత లోపిస్తుంది. సమాజం పట్ల పాఠకుడికి అవగాహన కల్గించడంతో పాటు వాళ్లను జాగృతులను చేయాల్సిన బాధ్యత పత్రికలకు ఉందనే నిజాన్ని మరవకూడదు. ఎప్పుడైతే వ్యాపారధోరణిలో ఆలోచిస్తామో అప్పుడే పాత్రికేయులుగా మనం వెనకబడిన వారమవుతాం. ఆ విధానానికి స్వస్తి పలికి నిజాలు రాసినప్పుడే మన కలానికి పదును తగ్గే అవకాశం ఉండదు.
ప్రశ్న : తెలుగు పత్రికల్లో ఆంగ్లభాష ప్రభావం గురించి?
జ: అది మన స్వయంకృతమేనని నా భావన. మన చుట్టూ ఏదైతే భాషను వాడుతున్నారో అదే భాషను పత్రికల్లో వాడుతున్నారు. ఈ పద్ధతి మారాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పులు రావాలి. వారు నేర్పించే భాషనే పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు. మనం తెలుగులో మాట్లాడితేనే కదా మన పిల్లలు తెలుగులో మాట్లాడుతారు.

ప్రశ్న : ఈ విధానం మారే అవకాశం లేదా?
జ: సాధ్యమైనంత వరకు తెలుగు పదాలను విని యోగించడం అలవర్చుకోవాలి. ఎక్కువగా తెలుగులో మాట్లాడడం చేయాలి. కచ్చితంగా మార్పు వస్తుంది. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగును చదవాలి, రాయాలి, మాట్లాడాలి. మనకు అందుబాటు లో ఉన్న తెలుగు పదాలను వినియోగిస్తే చాలు మన తెలుగును మనం కాపాడుకున్నట్లే.

ప్రశ్న : మీరు చేసిన రచనలు, వ్యాసాలు, పొందిన అవార్డు గురించి?
జ: వ్యాసాలు, అనువాదాలు ఎక్కువగా చేశానని చెప్పాలి. ధారావాహిక సంచిక రూపంలో చాలా వరకు వ్యాసాలు అందించాను. శ్రీరామకృష్ణ ప్రభ లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యాసాలు చాలా రాశా ను. అలాగే కైలాస- మానస సరోవర యాత్ర వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించాను. స్వామి పురుషోత్తమానంద రచించిన సీక్రెట్‌ ఆఫ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌, లెటర్‌ టు ఏ స్టూడెంట్‌ పుస్తకాలను 'ధ్యాన మార్గదర్శి' పేరుతో అనువదించాను. గ్రేట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా అనే ఐదు భాగాల పుస్తకాన్ని 'ఆదర్శ నారీ మణిదీపాలు' పేరిట ధారావాహికగా అందించాను. ప్రస్తుతం శ్రీరామకృష్ణ ప్రభలో ఆచార వ్యవహారాలు - అంతరార్థాలు పేరిట ధారావాహికను అందిస్తున్నాను. ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు ఇంటూరి వెంకటేశ్వర రావు గారి పేరుమీద ఏర్పాటు చేసిన మెమోరియల్‌ ట్రస్టు 'ఉత్తమ పాత్రికేయుడు' అవార్డుతో సత్కరించింది.
( సాక్షి తమిళనాడు లో 2010 జూలై 25, ఆదివారం నాడు ప్రచురితమైన నా ఇంటర్వ్యూ)

ఇదే నా మొదటి ప్రేమలేఖ

అందరికీ నమస్కారం.
రచన కొత్త కాకపోయినా బ్లాగ్ రచనలో నాకు ఇదే అన్నప్రాసన.
విశ్వాంతర వేదికపై కిటికీల ప్రపంచంలో నా అక్షరాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.
ఇది వ్యక్తావ్యక్త అనుభూతుల ఆలాపన.
అంతరంగ ప్రేరణల ప్రేలాపన.
కొంచెం కారంగా, కొంత గారంగా, కావాల్సినంత తీయగా అన్నింటి కలబోత.
ఈ తిరగమోత సరిపోయిందో, చెడిపోయిందో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండే!!
ఇష్టపదిలోకి మీకు సాదర ఆహ్వానం.
అనుభూతులు కలబోసుకొని దూరంలోనూ దగ్గర అవుదాం.
మీ
రెంటాల జయదేవ