జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, June 30, 2014

ఈ అబ్బాయి నాకు దేవుడిచ్చిన బిడ్డ: షకీలా


నేనెప్పుడూ ఒంటరిగా లేను. నాకు భయం. ఎప్పుడూ మా అమ్మ నా పక్కనే ఉండేది. ఆమెకు ఒంట్లో బాగా లేనప్పుడు కూడా ఆమె మంచం పక్కనే పడుకొనేదాన్ని. అలాంటిది మా అమ్మ చనిపోయాక ఒంటరి నయ్యా. చుట్టాలు కూడా మొహం చాటేశారు. ‘జియారత్’ (సమాధిపై పూలు చల్లుతూ నివాళి ఇవ్వడం) చేసే దాకా కూడా ఎవరూ లేరు. మమ్మీ పోయాక కనీసం ఇంట్లో వంటైనా చేయలేదు. తినీ తినకుండా ఉండి పోయేదాన్ని. అలాంటి స్థితిలో తంగం అనే ఈ అబ్బాయి దేవుడు పంపినట్లుగా నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నాకు అచ్చం మా అమ్మలా వంట చేసేది, మందులు ఇచ్చేది వీడే. నన్ను మమ్మీ అనే పిలుస్తాడు. వాళ్ళ ఊరు వెళ్ళినా, అనుక్షణం నా బాగోగుల గురించి ఫోన్‌లో అడుగుతూనే ఉంటాడు. రెండు రోజులకని వెళ్ళినవాడు కూడా రెండు గంటల్లోనే వెనక్కి వచ్చేస్తాడు. అల్లా మీద ఒట్టు... వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఇప్పుడు వీడే నాకు దిక్కు. 


 షకీలా

(Published in 'Sakshi' daily, 29th June 2014, Sunday)
..................................

Sunday, June 29, 2014

చాలామంది బయటకు చెప్పరు... నేను చెబుతున్నాను! - ‘సెక్సీ క్వీన్’ షకీలా


 కొవ్వొత్తి ... తాను కరుగుతూ... చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తుంది.

 షకీలా కూడా అంతే.


 తన కోసం కన్నా...
 తనను నమ్ముకున్నవారి కోసమే అష్టకష్టాలు పడింది.


 పైకి సీతాకోక చిలుకలా కనిపించే ఈ గొంగళి పురుగు లాంటి
 గ్లామర్ ప్రపంచంతో ఇరవై ఏళ్ళుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది.


 ఫైనల్‌గా తనకు మిగిలింది... ‘సెక్సీ క్వీన్’ అనే బిరుదు మాత్రమే.
 సెంటు స్థలం లేదు... సొంత ఇల్లు కూడా లేదు...
 నమ్మినవాళ్ళే నట్టేట ముంచారు...


 ఒంటరిగా వచ్చింది.. ఒంటరిగా మిగిలింది...


 అందరికీ ఆమె ఎద ఒంపులే కనిపిస్తాయి.
 కానీ, ఆ గుండెల మాటున గడ్డకట్టిన కన్నీటి సంద్రం ఎవరికీ కనిపించదు..


 ‘ఎ’ సర్టిఫికెట్ తార అనిపించుకున్న షకీలా
 తన లైఫ్‌ను ‘ఎ’ టూ ‘జెడ్’ ఆవిష్కరించింది.





చాలా రోజుల తరువాత మళ్ళీ తెర మీదకొచ్చారు. ఇంత గ్యాప్ ఎందుకని?


షకీలా: (ఠక్కున అందుకుంటూ...) నిజంగానే గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇప్పటికి అయిదేళ్ళ పైగా నాకు తెలుగు సినిమాల ఆఫర్లు లేవు. అయితే, తమిళ, మలయాళ, కన్నడాల్లో చేస్తున్నా. నాలుగేళ్ళుగా కన్నడంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. తెలుగులో లాగా ఏదో కామెడీ కోసమని పెట్టే పాత్రలు కాక, పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషిస్తున్నా. ఇతర భాషల్లో ఇన్ని పాత్రలు చేస్తున్నప్పటికీ, తెలుగులో నన్నెందుకు పిలవడం లేదో తెలియదు.
     
అసలు ఇప్పటి దాకా ఏయే భాషల్లో సినిమాలు చేశారు?


షకీలా: తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో చేశా. హిందీలో ‘హత్యారా’ అని ఒకే సినిమాలో నటించా.  
     
ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు?


షకీలా: ఎవరైనా ఎల్.కె.జి తరువాత యు.కె.జి. చదువుతారు కదా! అలాగే, నేను కూడా ఆర్టిస్టు నుంచి దర్శకురాలినయ్యా. ఆర్టిస్టుగా మొదలైన నేను అక్కడే ఎందుకు ఆగిపోవాలి. నా ఈ 20 ఏళ్ళ నట జీవితంలో ఎంతోమంది దర్శకులనూ, వాళ్ళు పనిచేసే విధానాన్నీ దగ్గర నుంచి గమనించా. ‘నేనెందుకు దర్శకత్వం వహించకూడద’ని పదేళ్ళుగా నా మనసులో ఉంది. నిజం చెప్పాలంటే, అప్పటి నుంచి అవకాశం రాలేదు. ఏవో ప్రయత్నాలు చేయడం, అవి మొదట్లోనే ఆగిపోవడం జరిగింది.
     
మరి ఒకేసారి తెలుగు - హిందీల్లో ఇప్పుడు మాత్రం ఛాన్సెలా వచ్చింది?


షకీలా: నిర్మాతలనుసమన్వయం చేసుకొని, సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళడం నాకు మొదట్లో తెలియదు. తీరా ఇప్పుడు సీనియర్ దర్శకుడు స్వర్గీయ కట్టా సుబ్బారావు కుమారుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ వల్ల ఈ ప్రాజెక్ట్ కుదిరింది. చెన్నైలో మా ఇంటి మేడ మీద కట్టా సుబ్బారావు గారు వాళ్ళ ఆఫీస్ ఉండేది. ఆయన, మా నాన్న గారు మంచి మిత్రులు. వాళ్ళ ఇల్లు కూడా కోడంబాక్కమ్‌లోని డెరైక్టర్స్ కాలనీలోనే! అప్పటి నుంచి మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము రాజోలులో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, వస్తుండేవాళ్ళం. అలా మేము చాలా క్లోజ్. నేను చెప్పిన కథ విని, ఈ సినిమాను ఆర్గనైజ్ చేసింది ఆయనే. అలా నా దర్శకత్వంలో తొలి చిత్రం మొదలైంది.
     
కానీ, మునుపే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొచ్చాయే!


షకీలా: అవును. గత ఏడాది ‘నీలకురింజి పూత్తు’ అనే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నా. ఆ కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది. నిజజీవితంలో నా లాగా చాలా సాహసోపేతంగా ఉండాలి. ఆ పాత్రకు రంజిత లాంటి పలువురు నటీమణులను అనుకున్నా. కానీ, ఆ పాత్రను నేనే పోషించాలని నిర్మాత పట్టుబట్టాడు. నేనేమో వేరే వాళ్ళను పెడదామన్నా. అలా అభిప్రాయభేదాల వల్ల ఆ సినిమా ఎనౌన్స్‌మెంట్‌కే పరిమితమైంది. మొదలు కాకుండానే, ఆగిపోయింది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తానన్న సంగతి తెలిసి, కట్టా శ్రీకర్ ప్రసాద్ సోదరుడు కణ్ణా నాకు ఎంతో సాయపడ్డాడు. నాకు ఒక ట్యూటర్ లాగా అన్నీ చెప్పింది ఆయనే.
     
మీ దర్శకత్వంలోని ఈ తొలి సినిమాకు ‘పార్ట్ వన్’ అని పేరు పెట్టారట?


షకీలా: లేదు.. లేదు... అలాగని మొదట అనుకున్నాం. కానీ, ఆ పేరు పెడితే, అదేదో నా ఆత్మకథ ఆధారంగా తీస్తున్న సినిమా అనుకొనే ప్రమాదం ఉందని భావించాం. అందుకే, సరైన టైటిల్ చూసి, త్వరలోనే ప్రకటిస్తా.
     
నిజానికి, గత ఏడాది చివరలోనే ‘షకీలా ఆత్మకథ’ అంటూ మలయాళంలో మీ ఆత్మకథ పుస్తకంగా వచ్చింది కదా! ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది?


షకీలా: తేజ దర్శకత్వంలో ‘కేక’ చిత్రానికి పనిచేసినప్పుడు కెమేరామన్ పి.సి. శ్రీరామ్ గారు నాతో మాట్లాడుతూ, ‘నీ లాంటి అమ్మాయి నీ కథ ఏమిటన్నది రాయాలి. అది అందరికీ తెలియాలి. దాని ద్వారా నలుగురికీ ఉపయోగం’ అన్నారు. అప్పటి నుంచి నా బుర్రలో ఆ ఆలోచన తిరుగుతూ ఉంది. కానీ, నాదేమీ మహాత్మా గాంధీ జీవితం కాదు, మదర్ థెరెసా జీవితం కాదు. ప్రతి నటి జీవితంలో ఉన్నవే నా జీవితంలోనూ ఉన్నాయి, జరిగాయి. అయితే, ఒక మనిషిగా... ఆ తరువాత నటిగా నాకు ఎదురైన అనుభవాలు చెప్పడం వల్ల కొందరికైనా ఉపయోగపడతాయన్నందు వల్లే నా కథకు పుస్తక రూపమిచ్చా. కేరళలోని క్యాలికట్‌కు చెందిన అషాద్ బతేరీ అనే మంచి కవి, రచయిత నా ఆత్మకథ రాస్తానంటూ వచ్చారు. నా కథ మొత్తం ఆయనే మలయాళంలో రాశారు. నాకు మలయాళం చదవడం రాదు. అందుకే, అందులో ఏముందో నాకే తెలీదు (నవ్వులు). కానీ చదివినవాళ్ళంతా బాగుందన్నారు.  
     
మరి, మీ ఆత్మకథను తెలుగుతో పాటు, ఇతర భాషల్లో తెచ్చే ఆలోచన ఏదీ లేదా?


షకీలా: నిజం చెప్పాలంటే, ఆ మలయాళ పుస్తకం అధికారిక ఆవిష్కరణ కూడా ఇప్పటి దాకా జరగలేదు. అయినా, ఇప్పటికే 5 వేల కాపీలు అమ్ముడైపోయింది. ఆ విషయంలో రచయితతో నేను దెబ్బలాడాను కూడా. దుబాయ్‌లో బుక్‌ఫెస్టివల్‌లో బాగుంటుందని పెట్టామనీ, అలా ఆవిష్కరణ జరగకుండానే జనంలోకి వెళ్ళిపోయిందనీ వివరణ ఇచ్చాడు. ఇప్పుడీ పుస్తకాన్ని తెలుగు, కన్నడంలో కూడా అనువదిద్దామని ప్రచురణకర్తలు అడుగుతున్నారు. మాట్లాడుకొని, ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
     
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు - ఇన్ని భాషలు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అసలింతకీ మీది ఏ ఊరు?


షకీలా: (నవ్వేస్తూ...) ఒక్క కన్నడం తప్ప ఈ భాషలన్నీ అచ్చంగా ఆ మాతృభాషీయులు మాట్లాడినట్లే మాట్లాడగలను. మద్రాసులో పుట్టి పెరిగా కాబట్టి తమిళం కొట్టినపిండి. మలయాళంలో నటించా... అదీ బాగా వచ్చు. ఇంగ్లీషు మీడియమ్‌లో చదివా కాబట్టి, ఇంగ్లీషు సరేసరి. ముస్లిమ్ అమ్మాయిని కాబట్టి, ఆటోమేటిగ్గా హిందీ వచ్చు. ఇక, తెలుగంటారా? అది నా మాతృభాష. మా అమ్మ చాంద్ బేగమ్‌ది నెల్లూరు. తెలుగు మాట్లాడేది. మా నాన్న చాంద్ బాషాది తమిళనాడు. ఆయనకు ఉర్దూ, తమిళమే వచ్చు. వీటి వల్ల, నాకిన్ని భాషలొచ్చు. ఇన్ని భాషా చిత్రాలతో జనానికి దగ్గరయ్యా.
     
మీ అసలు పేరే షకీలానా? పేరు చివర ‘జాన్’ అని ఉందేమిటి?


షకీలా: అవును. ఆ పేరు వెనక కూడా పెద్ద కథే ఉంది. మా అమ్మానాన్నకు మేము ఏడుగురు సంతానం. నేను అయిదోదాన్ని. నా పూర్తి పేరు ముస్లిమ్ పద్ధతిలో - షకీలా జాన్. అక్కకీ, చెల్లెలికీ మంచి పేరు పెట్టారనీ, నా పేరు నాకు నచ్చలేదనీ నాన్నతో గొడవపడేదాన్ని. అప్పుడాయన అసలు విషయం చెప్పారు. ఆయన వయసులో ఉండగా, సుశీల అనే అమ్మాయిని ప్రేమించారట. ఆ ప్రేమ సక్సెస్ కాలేదు. ఆ అమ్మాయికి గుర్తుగా, ఆ పేరు ధ్వనించేలా షకీలా అని పెట్టారట. అయితే, షకీలా జాన్ అనే ముస్లిమ్ పేరును స్కూల్ రికార్డుల్లో రాస్తున్నప్పుడు, క్రైస్తవ పద్ధతిలో జె.ఓ.హెచ్.ఎన్. - జాన్ అనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాశారు. నా సర్టిఫికెట్లలో, చివరకు నా పాస్‌పోర్ట్‌లో కూడా అదే ఉంది. దాంతో, అదేమిటని చాలామంది పొరపడుతుంటారు.
     
ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు?


షకీలా: మా నాన్న మద్రాసులో ‘కలై సెల్వి రిక్రియేషన్ క్లబ్’ నడుపుతుండేవారు. అందులో ఆయనకు నష్టం వచ్చింది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. అప్పటికి నేను ఎనిమిదో తరగతి తప్పాను. సరిగ్గా చదవడం లేదని మా నాన్న ఇంటి బయట నన్ను కొడుతుండడం చూసి, ఎదురింట్లో ఉన్న సినిమా ఆఫీసులోని మేకప్‌మ్యాన్ ఆపాడు. సినిమాల్లో నన్ను నటించమంటే, మా నాన్న సరే అన్నారు. ఆయన తీసుకువెళ్లి, చిత్ర దర్శకుడికి పరిచయం చేశారు. ఆ సినిమాలో సిల్క్ స్మితకు చెల్లెలి పాత్రతో సినిమా రంగ ప్రవేశం చేశా.



   


మీతో లాభం పొంది, ఇంట్లోవాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని విన్నాం. నిజమా?

షకీలా: అవును నిజమే. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే, మా అక్క పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ వచ్చా. వాళ్లను నేను పెంచలేదు కానీ, చిన్నప్పుడు నేను ఎలాగూ బాగా బతకలేదని, వాళ్లయినా దర్జాగా ఉండాలని వాళ్ల కోసం ఎంతో ఖర్చు చేశా. కానీ, మా అక్క నాకంటూ ఏదీ కొననివ్వ లేదు. ఎప్పుడూ ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. అలా నేను సంపాదించినదంతా వాళ్ళకే ఖర్చు పెట్టా. నా వాళ్ళను నమ్మా. నా సంపాదనంతా పోగొట్టుకున్నా. నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మా నాన్న సహా మా కుటుంబమంతా మద్రాసులో ఏ ఇంట్లో అద్దెకు దిగిందో ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నా. నాకంటూ ఇవాళ్టికీ సొంత ఇల్లు, స్థలం - ఏదీ లేదు.
     
కానీ, ఒకానొక దశలో మీకు భారీ పారితోషికం ఇచ్చినట్లున్నారు!


షకీలా: అవును. తొలి చిత్రం ‘ప్లే గర్ల్స్’కు నా రెమ్యూనరేషన్ రూ. 2 వేలే. కాస్తంత పేరొచ్చాక, పరిశ్రమను ఊపేసిన నా సూపర్‌హిట్ మలయాళ చిత్రం ‘కిన్నార తుంబిగళ్’ (తెలుగులో ‘కామేశ్వరి’గా అనువాదమైంది) చిత్రానికి అయిదు రోజులకు 20 వేలు. తీరా పొగమంచు తదితర కారణాల వల్ల ఆ సినిమా త్రివేండ్రం దగ్గర పొన్ముడిలో 21 రోజులు షూటింగ్ చేశారు. అలా మొదలై, నటిగా రోజుకు రూ. 2 లక్షలు, 3 లక్షల దశ దాకా ఎదిగా. కోట్లు సంపాదించా. ఇక్కడే పోగొట్టుకున్నా.
     
అంత సంపాదన పోగొట్టుకున్నానని బాధపడుతున్నారా?


షకీలా: డబ్బు పోయింది నిజమే. కానీ, నేను ఎవరికిచ్చా...? మా అక్కకు, నా రక్త సంబంధీకులకే కదా! కాబట్టి, నేను వేరెవరినో నిందించడానికి వీల్లేదు. నా అనుకొని నమ్మినవాళ్ళే ఇవాళ నన్ను పిల్లలకు దూరంగా పెట్టడం, నాతో మాట్లాడవద్దనడం బాధించింది. నా వాళ్ళను నమ్మాను. మోసపోయాను. (చేతిని గుండెల మీద ఆనిస్తూ) అదే నాకు నొప్పిగా ఉంది. అందుకే, నా దృష్టిలో మా అక్క చచ్చిపోయింది. ఏమైనా, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నాది మంచి మనసు. నేనెప్పుడూ అవతలివాళ్ళకు మేలే చేశా. ఎవరినీ ఏమార్చలేదు. కాబట్టి, ఆ అల్లా నాకు మంచే చేస్తాడు. అదే నా నమ్మకం.
     
మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా?


షకీలా: బాగా నమ్ముతా. నేను లావుగా, నల్లగా ఉంటా. అతిలోక సౌందర్యరాశినేమీ కాదు. అయినా సరే, ఇవాళ ఇన్ని లక్షల మంది అభిమానం సంపాదించి, ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆ దేవుడిచ్చిన వరమే. నేను ఇస్లామ్‌ను నమ్ముతా. ఈ మధ్యే షిర్డీకి వెళ్ళొచ్చా. పదేళ్ళ వయసులో అనుకుంటా, ఓసారి తిరుపతి వెళ్ళా. మళ్ళీ ఎన్నో ఏళ్ళుగా తిరుపతి వెళ్ళాలని కోరిక. ఈ మధ్యే తమ్ముడితో కలసి, తృప్తిగా దర్శనం చేసుకొచ్చా. అయితే, దేవుడి దగ్గరకెళితే, ఫలానాది కావాలని అడగను... అడగలేను. అడగకుండానే అన్నిటిలో ఆయన ఆశీస్సులిచ్చాడు. ఇంకేం కావాలి! అయితే, ఇవేవీ తెలియని చిన్న వయసులో తిరుపతికెళ్ళినప్పుడు దేవుడి వైభోగం చూసి, ‘నిన్నే పెళ్ళి చేసుకుంటా’ అన్నాను. (నవ్వులు...)
     
తరువాత దేవుడు కాకపోయినా... దేవుడు లాంటి భర్త కావాలని మీరెప్పుడూ ఆలోచించలేదా?


షకీలా: (వెంటనే అందుకుంటూ... బాధగా...) నేనూ ఆడపిల్లనేనండీ! నాకూ మనసుంటుంది! ఇప్పటి దాకా చేసుకోలేదంటే, నాకు పెళ్ళి అవసరం లేక కాదు. నన్ను నన్నుగా ప్రేమించేవాడు రాక!
     
ఇప్పటి దాకా మీరు ఎవరినీ ప్రేమించలేదా? మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా?


షకీలా: ఎందుకు ప్రేమించలేదు. ఆ జాబితా చాలా పెద్దదే. నేను సిన్సియర్‌గా ప్రేమించినా, వాళ్ళు మాత్రం ప్రేమిస్తున్నామంటూనే, నా ఫ్యామిలీ వద్దని దూరం పెడుతున్నారు. వాళ్ళు నన్నే గనక నిజంగా ప్రేమిస్తే, నా కుటుంబాన్ని కూడా అక్కున చేర్చుకోవాలి కదా! అంటే, వాళ్ళు నన్ను కాదు... నా దగ్గర ఉన్న వేరే దేనినో ప్రేమిస్తున్నారన్న మాట! ఆ మోసం తట్టుకోలేక, వాళ్ళనే వదులుకున్నా.
     
ఇంతమంది దగ్గర మోసపోయిన మీకు కోపం, ద్వేషం లేవా?


షకీలా: చూడండి. ఇలాంటివన్నీ ఈ సినిమా రంగంలో జరిగేవే. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడమూ మామూలే. సినిమాల్లోనూ చూపించారు. అందరికీ జరిగేదే నాకూ జరిగింది. కాకపోతే, చాలామంది బయటకు చెప్పరు, నేను చెబుతున్నాను. అంతే తేడా!
     
మీ ఆత్మకథలో కూడా ఇవన్నీ చెప్పారా?


షకీలా: అఫ్‌కోర్స్ చెప్పా! నేను అబద్ధాలు చెప్పలేదు, రాయలేదు. కాకపోతే, నన్ను మోసం చేసిన వాళ్ళ పేర్లేవీ బయటపెట్టలేదు. ఎందుకంటే, నేనివాళ పది మందికి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగానూ అంటే అది నా రెక్కల కష్టంతో సాధించిన విషయం. అలాంటి నేను ఇలాంటి కొందరి పేర్లు చెప్పి, నా ద్వారా వాళ్ళనెందుకు ఫేమస్ చేయాలి? అందుకే, పేర్లు చెప్పలేదు. అయితే... ఒక్క మాట. నాకు వాళ్ళు మీద కక్ష లేదు. ఎదురై పలకరిస్తే, మామూలుగానే మాట్లాడుతున్నా.
     
చిన్నప్పుడు స్కూల్‌లో ఎదురైన ‘చైల్డ్ ఎబ్యూజ్’ గురించీ ఆత్మకథలో రాశారట...


షకీలా: అవును రాశాను. మద్రాసులో నేను సరస్వతీ విద్యాలయ, జవహర్ విద్యాలయ - ఇలా రకరకాల స్కూల్స్‌లో చదివాను. అప్పట్లో కొందరు మాస్టర్లు క్లాసులో పనిష్‌మెంట్ ఇచ్చే మిషతో నాతో అసభ్యంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి. ఆ వయసులో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక నేను పెదవి విప్పలేదు. ఎవరితోనూ ఫిర్యాదు పూర్వకంగా ప్రస్తావించ లేదు. ఇప్పటికీ అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే, నాలా నోరు విప్పకపోతే కష్టమని చెప్పడం కోసం ఆ సంగతులు ప్రస్తావించాను. అయితే, ఎన్నో ఏళ్ళ క్రితం సంగతులు కాబట్టి ఇప్పుడెందుకు లెమ్మని ఇక్కడ కూడా పేర్లు బయటపెట్టలేదు.
     
మీ సినిమా రిలీజంటే మలయాళ స్టార్ల చిత్రాల్ని వాయిదా వేసుకున్నారంటారు...


షకీలా: అలా జరిగిందని పత్రికల వాళ్ళే రాశారు. నాకు నిజానిజాలు తెలియవు. ‘షకీలా సినిమా’ అని ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే, ‘ఆండవన్’ (తమిళంలో దేవుడు అని అర్థం) కరుణ. అప్పుడూ, ఇప్పుడూ నేను ఒకే వ్యక్తిని.
 
మరి, మీకు స్టార్ల నుంచి బెదిరింపులు రాలేదా?


షకీలా: అలాంటివి ఎప్పుడూ రాలేదు. పైగా, నాకు వాళ్ళందరితో సత్సంబంధాలుఉన్నాయి. వాళ్ళ సినిమాల్లో కూడా నటించాను. మోహన్‌లాల్‌తో ‘ఛోటా ముంబయ్’లో నటించా. నేనంటే పడకపోతే, గొడవ ఉంటే... వాళ్ళ సినిమాల్లో నన్ను నటించనివ్వరుగా! (నవ్వు...)
 
‘షకీలా చిత్రాలు’గా పేరుపడ్డ ‘అలాంటి’ సినిమాల్లో నటించాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడలేదా? మీ కుటుంబ సభ్యులు ఎవరూ ఏమీ అనేవారు కాదా?




షకీలా: నేనెప్పుడూ బాధ పడలేదు. మా నాన్న ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు, ఎనిమిదో తరగతి తప్పిన నేను సినీ రంగంలోకి వచ్చాను. ‘నా కుటుంబం కష్టాల్లో ఉంది. వాళ్ళను గట్టెక్కించాలి. నేను అనుకున్న మంచి జీవితం వాళ్ళకివ్వాలి’ - అప్పట్లో అదే నా ఆలోచనంతా. 1994లో సినీ రంగానికి వచ్చా. 1996 - 97లో అనుకుంటా... మా నాన్న చనిపోతూ మా అమ్మ చేయి పట్టుకొని, అమ్మనూ, తమ్ముడు సలీమ్‌నూ నాకు చూపిస్తూ, ‘వాళ్ళ బాధ్యత చూసుకోమన్నట్లు’గా సైగ చేస్తూనే, కన్నుమూశారు. వినడానికి సినిమా కథలా అనిపించినా, ఇది వాస్తవం. నా మీద ఆధారపడిన వీళ్ళకు ఏదో చేయాలనే నా తపన అంతా. అందుకే, నాకు వచ్చిన సినిమాలన్నిటిలో నటించాను. ఆ సంగతీ మా వాళ్ళకూ తెలుసు. అలా కష్టపడి సంపాదించి, మా అక్క, అన్న, వాళ్ళ పిల్లలు - అందరినీ నిలబెట్టేందుకు శ్రమించా. ‘అవసరంలో ఉన్నా’మంటూ అడిగితే చాలు... లేదనకుండా డబ్బులిచ్చా. దానధర్మాలు చేశా. కిడ్నీలు చెడిపోవడంతో మా అమ్మకు లక్షలు ఖర్చు పెట్టి, వైద్యం చేయించా. (కొంచెం బాధగా) అయినా అమ్మను దక్కించుకోలేకపోయా.
     
కానీ, మీ మీద ‘అశ్లీల చిత్ర తార’ అనే విమర్శలొచ్చాయి. సినీ రంగంలో కూడా చాలామంది మిమ్మల్ని లోకువగా చూశారు...


షకీలా: ఐ డోంట్ కేర్! నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడ్డా. ఎవరేమనుకుంటే నాకేంటి? ఇప్పుడు నేను క్యారెక్టర్ పాత్రలు వేస్తున్నా. అయినా సరే, ఇప్పటికీ నన్ను ఏ సినీ ఫంక్షన్లకూ పిలవరెందుకో అర్థం కాదు.
     
2001లో మలయాళంలో 97 చిత్రాలొస్తే, అందులో 30 మీవే. అలా హవా నడుస్తున్న రోజుల్లోనే ఉన్నట్టుండి ‘ఆ చిత్రాల’ నుంచి తప్పుకోవడానికి కారణం?


షకీలా: నిజం చెప్పాలంటే, రకరకాల గెటప్‌లతో కూడిన భిన్నమైన పాత్రలు నాకు ఇచ్చేవారు. వారు చెప్పినట్లు నటించేదాన్ని. అయితే, రిలీజయ్యాక హాలులో వాటిని చూసే తీరిక ఉండేది కాదు. ఒకసారి ఇలాగే ఓ మంచి గెటప్‌తో, ఓ సినిమాలో నటించాను. నా మీద చక్కటి సన్నివేశాలు చిత్రీకరించారు. తీరా రిలీజయ్యాక, నా మేకప్ మ్యాన్ రవి ఆ సినిమా చూసి వచ్చాడు. సినిమా, నా పాత్ర ఎలా ఉన్నాయని అడిగితే, ‘అందులో ఎంతసేపటికీ చిన్న తువ్వాలు కట్టుకొని తిరిగే దృశ్యాలు తప్ప ఇంకేమీ లేవన్నాడు. దాంతో, నేను చాలా ఫీలయ్యాను. ఇక అప్పటికప్పుడు మద్రాసులో తమిళ జర్నలిస్టులందరినీ పిలిచి, ‘ఆ తరహా’ సినిమాల్లో నటించనంటూ ప్రకటించాను. ఇదంతా జరిగింది 2001 చివరలో! అప్పటికే నేను తీసుకున్న 23 సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశాను. అలా ఆ అధ్యాయం ముగిసింది.
     
‘ఆ పాత్రల’ నుంచి క్యారెక్టర్ నటిగా ఎలా మారారు? కష్టం కాలేదా?


షకీలా: హ్యాట్సాఫ్ టు డెరైక్టర్ తేజ. ‘జయం’ (2002)లో లెక్చరర్ పాత్ర ఇచ్చి, కెరీర్‌కు కొత్త మార్గం చూపెట్టారు. ఆ విషయంలో ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! ఆయన నాకు పెద్దన్న లాంటివాడు. అప్పటి నుంచి గత పన్నెండేళ్ళుగా మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో క్యారెక్టర్లు వేస్తున్నా.
     
స్తవ సన్న్యాసినిగా నటించాలని కోరిక అని గతంలో చెప్పేవారు...


షకీలా: ఆ కోరిక తీరింది. మలయాళంలో ఏడేళ్ళ క్రితం రూపొందించిన ఓ చిత్రంలో అలాంటి పాత్ర చేశా. కానీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సినీ నటి సంఘవి నటించిన ‘నాన్సీ’ అనే తమిళ సీరియల్‌లో కూడా అలాంటి వేషం వేశా. అది వీక్షకుల ముందుకు వచ్చింది.
     
దక్షిణాది భాషలన్నీ మాట్లాడే మీరు డబ్బింగ్ చెప్పుకొనే ప్రయత్నం చేయలేదేం?


షకీలా: చూడండి. మన పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆ డబ్బింగ్ కళాకారులకు కూడా రెండొందలో, మూడొందలో వస్తాయి. కుటుంబం గడుస్తుంది. వాళ్ళ కడుపెందుకు కొట్టడం? (నవ్వుతూ...) ఇప్పుడు నేను చేసే మహత్తరమైన పాత్రలకు నాకు నేనే డబ్బింగ్ చెప్పుకొంటే, నాకేమైనా జాతీయ అవార్డులొస్తాయా ఏమిటి?
 
జీవితం, గడచిన కాలం, కెరీర్ పట్ల ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా?


షకీలా: నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్ళాను. భగవంతుడు నాకంటూ ఈ దోవ ఇచ్చాడు. ఇందులో ముందుకు వెళ్ళాను. ఎప్పుడైనా, నాకు వచ్చిన పనిని నిజాయతీగా చేశాను. ఎవరినీ మోసం చేయలేదు. నావి సెక్స్ సినిమాలనీ, సాఫ్ట్ పోర్ట్ సినిమాలనీ అన్నవాళ్ళు ఇవాళ సన్నీ లియోన్ లాంటి తారలను అంగీకరిస్తున్నారు కదా! ఏమైనా, మన దక్షిణాదిలో సిల్క్ స్మిత తరువాత మళ్ళీ అంతటి సుదీర్ఘ కాలం అందరి దృష్టినీ ఆకర్షించి, వార్తల్లో వ్యక్తిగా నిలిచింది నేనే. అయామ్ హ్యాపీ.
 
మళ్ళీ జన్మంటూ ఉంటే...


షకీలా: షకీలా గానే పుడతాను. ఇప్పటి లానే మంచిగా జీవిస్తూ, పదిమందికీ చేతనైన మంచి చేస్తాను.


- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 29th June 2014, Family Page)
...............................................................

Thursday, June 26, 2014

చిన్న సినిమా..! అబ్బో చిరాకు బాబూ..!!

టాలీవుడ్ లో ఈ ఏడాదిలో భారీ బడ్జెట్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. వన్, ఎవడు, లెజెండ్, రేసుగుర్రం, రౌడీ, మనం, విక్రమసింహ ఇలా ఓ ఐదారు తప్పితే అన్నీ చిన్న చిత్రాలే. అయితే పెద్ద సినిమాలు రాకపోవడానికి ఎలక్షన్లు ఓ కారణమైతే.. షూటింగ్ పూర్తి కాకపోవడం మరో కారణం. దీంతో ఈ గ్యాప్ లో చిన్న చిత్రాలు తమ పంజా విప్పాయి. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో విడుదలయ్యాయి. కానీ వీటిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు మాత్రం చాలా తక్కువే. కనీసం పది శాతం కూడా చిన్న సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి.

వల్గారిటీతో వచ్చే సినిమాలే ఎక్కువ..

  
చిన్న సినిమాలు ఎక్కువగా యూత్ ను బేస్ చేసుకొని వస్తున్నాయి. కానీ ఈ దర్శకులు యూత్ పేరుతో బూతు సినిమాలు తీస్తున్నారు. విపరీతమైన అడల్ట్ కామెడీతో ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నారు. సినిమాలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నారు. 'చిన్న సినిమానా.. అబ్బో చిరాకు బాబూ..' అనేలా చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50వరకు చిత్రాలు విడుదలయ్యాయి. కానీ వీటిలో ఫ్లాప్ అయిన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. కనీసం పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కిరాని పరిస్థితిలో ఇప్పటి చిన్న సినిమాలున్నాయని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు అంటున్నారు. ఇక మారుతి లాంటి దర్శకులైతే.. అడల్ట్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి మూవీస్ ఫ్లాప్ అయినా.. తన మార్కు పైత్యం వదలడం లేదు ఈ క్రియేటివ్ డైరెక్టర్. బస్టాప్, లవ్ యూ బంగారమ్ లాంటి సినిమాలు ఈ కోవలోకి చెందినవే..

'శాటిలైట్' కూ పలకడం లేదు..

   
సాధారణంగా.. గతంలో చిన్న సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా.. టివిలల్లో ఆడేవి. టివి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలుండేవి. కానీ ఇప్పుడు వల్గారిటీతో నిండిన సినిమాలు ఎక్కువగా ఉండడంతో శాటిటైల్ మార్కెట్ కూడా తగ్గిపోయింది. ఇలాంటి సినిమాలను కొనడానికి టివి వారు ముందుకు రావడం లేదు. కేవలం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలనే సెలక్టివ్ గా కొంటున్నారు. దీంతో శాటిలైట్ మార్కెట్ తగ్గిపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

డిజిటల్ రివల్యూషన్ ఓ కారణం..

   
టెక్నాలజీ పెరిగిపోవడం.. డిజిటల్ రివల్యూషన్ కారణంగా.. మాములు యూత్, కుర్రకారు కూడా సినిమాలపై మోజుపడుతున్నారు. తాము డైరెక్టర్, హీరోకావాలని యావలో.. ఇష్టారాజ్యంగా సినిమాలు తీస్తున్నారు. స్టోరీలో కంటెంట్, సినిమా విలువలతో, సహిత్యంతో సంబంధం లేకుండా సినిమాలు తీసి ప్రేక్షకుల మీదికి వదులుతున్నారని నిర్మాత కెఎస్ రామారావు అభిప్రాయపడ్డారు. సినిమాకు ఉండాల్సిన, పాటించాల్సిన విలువు ఏవీ పట్టకుండా నేటి చిన్న చిత్రాల దర్శకులు తమకు నచ్చినట్లుగా కుప్పలు కుప్పలుగా సినిమాలు తీస్తున్నారని రామారావు విమర్శిస్తున్నారు. ప్రపంచ సినిమా పరిశీలన, సహిత్యం, విలువలు, పక్క ఇండస్ట్రీల సినిమాలు ఎలా ఉన్నాయి అనే వాటిపై దర్శకులకు పట్టు ఉండడం లేదన్నారు. దీని వల్లే ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో కంటెంట్ ఉండడం లేదని.. వల్గారిటీ ఎక్కువగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.



మూసదోరణిలో..టాలీవుడ్ : రెంటాల జయదేవ్

  
ప్రస్తుతం వస్తున్న పెద్ద సినిమాలే కాకుండా చిన్న చిత్రాలు కూడా మూసదోరణిలోనే ఉంటున్నాయని ప్రముఖ సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ్ అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్ చిత్రాలు ప్రయోగాలు చేస్తే వికటించే అవకాశం ఉండడంతో వారు రొటీన్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. కానీ తక్కువ బడ్జెట్ చిత్రాలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నా.. ఆ దిశగా దర్శకనిర్మాతలు ఆలోచించడం లేదని ఆయన విమర్శిస్తున్నారు. ఇలా మూసదోరణిలో వెళ్లడం వల్లే టాలీవుడ్ లో క్రియేటివి, దమ్మున్న సినిమాలు తక్కువగా వస్తున్నాయని, చిన్నసినిమాలు తీసే దర్శకులు ప్రయోగాలు చేసే దిశగా అడుగులు వేయాలని జయదేవ్ అంటున్నారు. కేవలం డబ్బులు సంపాదించడం కోసం, పాపులర్ కావడం కోసం మాత్రమే సినిమాలు తీసే ట్రెండ్ నడుస్తుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



సక్సెస్ తక్కువ..ఫ్లాప్స్ ఎక్కువగా..

  
ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యాభైకి పైగా చిన్న చిత్రాలు విడుదల కాగా.. చందమామ కథలు, కమలతో నా ప్రయాణం, చందమామలో అమృతం, మిణుగురులు, తాజాగా ఊహలు గుసగుసలాడే, మైనే ప్యార్ కియా లాంటి చిత్రాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఇవి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా వచ్చాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయాయి. మంచి కంటెంట్ ఉన్నా.., ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు కమర్షియల్ గా హిట్ చేయలేకపోతున్నారడానికి ఇదో ఉదాహరణ. అయితే.. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. బర్నింగ్ స్టార్ గురించి. సోషల్ మీడియా సంచలనం సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన 'హృదయ కాలేయం'.. రావడమే ఓ క్రేజీ ప్రాజెక్టుగా ఎంటర్ అయ్యింది. అంతేకాదు ఇది.. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూలు చేసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక మన స్ట్రైయిట్ చిత్రాలు ఘోరంగా విఫలం కాగా.. ఆ మధ్య వచ్చిన డబ్బింగ్ చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. రాజారాణి, వీరుడొక్కడే, ట్రాఫిక్ లాంటి చిత్రాలు ఆడియెన్స్ ను ఫిదా చేశాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ మూవీస్ కమర్షియల్ గానూ సక్సెస్ సాధించాయి.

క్రియేటివ్ సినిమాలు రావాలి...సక్సెస్ రేట్ పెంచాలి..

  
ఇక రానున్న రోజుల్లో చాలా వరకు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రిన్స్ 'ఆగడు', ఎన్టీఆర్ 'రభస', చరణ్ 'గోవిందుడు అందరివాడేలే', పవన్, వెంకీల 'గోపాలగోపాల' లాంటి భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఇందులో భాగంగానే కార్తీకేయ, మాయ లాంటి చిన్న చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. మరి పెద్ద సినిమాల దాటికి ఈ చిన్న చిత్రాలు తట్టుకొని ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతాయా.. ? లేక మళ్లీ రొటీన్ ఫార్ములాతోనే వస్తాయా.. ? వీటిలో నిలబడే సినిమాలేన్ని..? అనేది చూడాలి. ఏదేమైనా.. చిన్న సినిమా అనేది ప్రయోగాత్మకంగా మంచి సినిమాగా.. విలువలతో కూడిన చిత్రంగా ఉండాలి. ఇలా క్రియేటివ్ డైరెక్టర్ ఇండస్ట్రీలోకి వస్తూ.. టాలీవుడ్ సక్సెస్ రేట్ ను పెంచాలని కోరుకుందాం.. 

(Telecasted in 10tv, 22nd June 2014, Sunday)
.........................

Tuesday, June 10, 2014

గుర్తింపునకు నోచుకోని హీరో 'చంద్రమోహన్'..!


సినిమా ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే ఉండిపోయింది. నిజమైన కళాకరుడికి ఎప్పుడు అన్యాయమే జరుగుతోంది. అవార్డులు, పురస్కారాలు బ్యాగ్ గ్రౌండ్ ఉన్నవాళ్లనే వరిస్తున్నాయి. నిజాయితీగా, కళను నమ్ముకొని సినిమా పరిశ్రమకు సేవ చేసిన వారు తెలుగు పరిశ్రమలో వివక్షకు గురవుతున్నారు. నిజం చెప్పాలంటే కళకు ఎల్లలు లేవు. కళాకారుడికి హద్దులూ లేవు. కానీ.. ఆ కళాకారుడికి వచ్చే గుర్తింపులో అనేక లొసుగులు ఉన్నాయి. నిజమైన కళాకారులను నిలువునా ముంచేస్తున్నారు కొందరు స్వార్థపరులు. ఈ దోపిడీ ప్రపంచంలో కళాకారులూ మినహాయింపు కాదు. కానీ నిజమైన కళాకారులెవరూ గుర్తింపు కోసం పాకులాడరు.. నటనే ప్రాణంగా, ధ్యేయంగా సాగుతూ ఉంటారు. అలా నటనైక జీవనమే బెటర్ అనుకుంటూ ఎన్నో పాత్రలు పోషించినా.. అన్ని రకాల గుర్తింపుల్లో వివక్షకు గురైన లెజెండరీ నటుడు చంద్రమోహన్. ఆయనే ఇవాల్టి మన లెజెండ్..

శ్రీదేవి తొలి సినిమా చంద్రమోహన్ తోనే...


     
1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు చంద్రమోహన్. తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సహాయ పాత్రల్లో కనిపించాడు. చూడగానే ఆకట్టుకునే రూపం కావడంతో చాలా తక్కువ టైమ్ లోనే చంద్రమోహన్ చాలామందికి చేరువయ్యాడు. సన్నగా రివాటలా చాలా అందంగా ఉండేవాడు. సహాయ పాత్రల నుంచి ప్రధాన పాత్రలకు వచ్చిన తర్వాత చంద్రమోహన్ లక్కీ స్టార్ గా మారిపోయాడు. అతని పక్కన నటించిన చాలామంది బామలు స్టార్ హీరోయిన్లయ్యారు. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న ప్రతి హీరోయిన్ కల.. ఒక్కసారైనా చంద్రమోహన్ సరసన నటించాలని. అలా 'సిరిసిరిమువ్వ'తో జయప్రద, 'పదహారేళ్ల వయసు'తో శ్రీదేవి చంద్రమోహన్ తోనే హీరోయిన్లుగా పరిచయమయ్యారు.
      చంద్రమోహన్ కృష్ణాజిల్లాలో 1947 సెప్టెంబర్ 15న జన్మించాడు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఆయనకు దూరపు చుట్టం అని చెబుతారు. ఆ పరిచయంతోనే సినిమాల్లోకి వచ్చారట. ఏదైతేనేం.. తర్వాత తన సొంత ప్రతిభతోనే నిలదొక్కుకున్నారు. ఆ రోజుల్లో ఆయన ఎన్ని సినిమాలు చేసినా పాత్ర పాత్రకి వైవిధ్యం చూపుతూ రాణించాడు. ఈ విషయంలో చంద్రమోహన్ కి సాటి ఎవ్వరూ లేరని ప్రముఖ సినీ పెద్దలు రేలంగి నరసింహారావు అంటున్నారు. పాత్రకు తగ్గ ఆహార్యం, వాచకంపై స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే, ఎన్నో సినిమాల్లో చంద్రమోహన్ అద్భుతమైన అభినయం చూపించాడని ఆయన అభిప్రాయపడుతున్నారు. నేటి తరానికి చంద్రమోహన్ కామెడీ ఫాదర్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మాత్రమే తెలుసు. కానీ అతను ‘‘ఒక్క అడుగు పొడుగు ఎక్కువగా ఉండి ఉంటే’’ ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయేవాడని అప్పట్లో చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలే కితాబునిచ్చేవారట. నిజమే.. అతని హైట్ చాలా వరకూ మైనస్ గా మారింది. అయితేనేం నటుడిగా ఎవరికీ తీసిపోనంత వెయిట్ అతని సొంతం.


టాప్ హీరోయిన్లందరితో నటించాడు..


     
చంద్రమోహన్ ఆ టైమ్ లో స్టార్ హీరో అనే చెప్పాలి. అతనికి ఉన్న లక్కీ హ్యాండ్ ఇమేజ్ తో ఎంతో మంది అప్ కమింగ్ హీరోయిన్లు అతనితో నటించేవారు. అలాంటి వారిలో జయప్రద, శ్రీదేవి, మంజుల, తాళ్లూరి రామేశ్వరి, రాధిక, జయసుధ, ప్రభ, విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వీరంతా చంద్రమోహన్ తో నటించిన తర్వాతే స్టార్ హీరోయిన్లయ్యారు. ఓ రకంగా ఇలాంటి క్రెడిట్ తెలుగు సినిమా హిస్టరీలో మరే హీరోకూ లేదేమో..! తర్వాత కామెడీ హీరోగానూ మారాడు. హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు కూడా చంద్రమోహన్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో పాతిక సినిమాల వరకూ వచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు.


అన్ని విషయాల్లోనూ వివక్షకు గురయ్యాడు..




     
'నటుడిగా వందల చిత్రాల్లో నటించాడు. హీరోగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. కామెడీ హీరోగానూ రాణించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు రీ ప్లేస్ మెంట్ లేదనీ నిరూపించుకున్నాడు. మరి ఇన్ని రకాలుగా ప్రతిభ చూపిన చంద్రమోహన్ కు సరైన గుర్తింపే రాలేదు. ప్రభుత్వాలెలాగూ పైరవీలకే పట్టం కడతాయి. కానీ చంద్రమోహన్ ప్రతిభను దగ్గరుండి చూసిన పరిశ్రమలో కూడా ఎందుకో ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని చెబుతున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు రెంటాల జయదే.


     వ్యక్తిగతంగా చాలామందిలో లోపాలుంటాయి. కానీ వృత్తిపరంగా వాళ్లు అత్యంత ప్రతిభావంతులైనా కూడా గుర్తింపునకు నోచుకోలేదంటే నిజంగా బాధాకరమైన విషయమే. మరో రెండేళ్లలో చంద్రమోహన్ పరిశ్రమకు వచ్చి 60 యేళ్లు పూర్తి కాబోతోంది.ఈ సందర్భంలో నైనా ప్రభుత్వాలు, పరిశ్రమ స్పం మరి దించి చంద్రమోహన్ ప్రతిభను గుర్తించాలంటున్నారు ఆయన అభిమానులు.. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని ఈ 'లెజెండరీ ఆర్టిస్ట్'కు తగిన గుర్తింపు రావాలని మనమూ కోరుకుందాం..


(Telecasted in '10tv' news channel on 7th June 2014)
.......................................

Friday, June 6, 2014

'ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కాదు' - మహేష్ బాబు

'ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్.. ఎలపరం వచ్చేస్తోంది' అంటూ 'ఆగడు'లో ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగులపై పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాపై ఘాటుగా స్సందించారు. మా హీరోపై సెటైర్లు వేస్తారా అంటూ నిష్టూరమాడారు. దాంతో తాను చెప్పిన డైలాగులపై మహేష్ బాబు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ డైలాగులు చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు ఎవరినీ ఉద్దేశించి ఈ డైలాగులు రాయలేదని చెప్పారు. పాత్ర స్వభావానికి అనుగుణంగా డైలాగులున్నాయని వివరించారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో 'సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా' అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ బాగా పాపులరైన సంగతి తెలిసిందే.

ఇక '1.. నేనొక్కడినే' సినిమా పోస్టర్ వివాదంపైనా మహేష్ స్సందించారు. అది వివాదాస్పదంగా ఎలా మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘వన్’ సినిమా పరాజయం తన ఆలోచనా ధోరణిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అది ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ అలాంటి ప్రయోగాలు చేస్తుంటానని తెలిపారు.

తన కుమారుడు గౌతమ్‌తో కలిసి మరోసారి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. ఆగడు తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో సినిమా చేయనున్నట్టు చెప్పారు. దర్శకుడు మణిరత్నంతో తన సినిమా ఇంకా చర్చల దశలో ఉందన్నారు.


(Published in 'Sakshi' daily, 6th May 2014, Fri)
...................................................

ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!: - కళాదర్శకుడు తోట తరణి

ఇంటర్వ్యూ:  కళాదర్శకుడు తోట తరణి

  ఒత్తుగా పెరిగిన రింగు రింగుల జుట్టు... చుట్టుపక్కల వాతావరణాన్ని నిశితంగా గమనించే లోతైన కళ్ళు... మాటల కన్నా చేతిలోనే కుంచెతోనే ఎక్కువగా భావ వ్యక్తీకరణ చేస్తూ, ఎప్పుడూ దీక్షగా పనిలో మునిగిపోయి కనిపించే కళా దర్శకుడు తోట తరణిని చూస్తే, అచ్చంగా దీక్ష పట్టిన మహర్షిలాగానే ఉంటారు. బహుశా అందుకే కామోసు.. అరవై నాలుగేళ్ళ ఆయనతో  ఇప్పుడు ఓ డాక్యుమెంటరీలో స్వామీజీ పాత్ర పోషింపజేస్తున్నారు.

చిన్మయ మిషన్ సంస్థాపకులూ, భగవద్గీత, ఉపనిషత్తులపై ఉపన్యాసాలతో ప్రపంచ ప్రసిద్ధులైన ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానందగా ‘పద్మశ్రీ’ తోట తరణి ఇప్పుడు తెర మీద కనిపించనున్నారు. చిన్మయానంద జీవితం మీద ఇంగ్లీషులో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ‘ది క్వెస్ట్’ కోసం కెమేరా ముందుకు వచ్చారు. చెన్నైలో రకరకాల పనులతో తీరిక లేకుండా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణి ‘సాక్షి’తో పంచుకున్న భావాలు...

 
ఉన్నట్టుండి మీకు నటన మీద ఆసక్తి కలిగిందేమిటి?
(పెద్దగా నవ్వేస్తూ...) అదేమీ లేదు. కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చింది. ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానంద మీద డాక్యుమెంటరీ తీస్తూ, అందులో స్వామీజీ ముసలివారైన తరువాతి ఘట్టానికి నేనైతే సరిగ్గా సరిపోతానని నన్ను అడిగారు. కెమేరా వెనుక నా పనేదో చేసుకుంటూ హాయిగా ఉన్న నాకు ఏం చేయాలో తెలియలేదు. ముందు తటపటాయించాను. కానీ, చిత్ర రూపకర్తలు నచ్చజెప్పడంతో, చివరకు సరే అన్నాను. అలా కెమేరా ముందుకు వచ్చాను. అదీ కొద్దిసేపు కనిపిస్తాను.
 
 ఇంతకీ ఈ డాక్యుమెంటరీ రూపకర్త ఎవరు?
తమిళ చిత్రం ‘కల్యాణ సమయల్ సాదమ్’ (తెలుగులో వివాహ భోజనం అని అర్థం) ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. గతంలోనూ నన్ను కొందరు నటించమని అడిగినా, ప్రత్యేకించి ఇది ఆధ్యాత్మిక కథాంశం కావడంతో, నేను కూడా ఆకర్షితుణ్ణయ్యా. పైగా, చాలా మంది నాకూ, స్వామి చిన్మయానందకూ పోలికలున్నాయంటూ ఉంటారు. దాంతో, ఈ పాత్రలో కనిపించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.

ఎలా ఉంది నటనానుభవం?
కెమేరా ముందు, అందరూ చూస్తుండగా నటించడం ఓ పెద్ద సవాలే. అయితే, నాదేమీ పూర్తి స్థాయి పాత్ర కాదు. అంతా కేవలం ఓ పాసింగ్ షో. (మళ్ళీ నవ్వేస్తూ...) అయినా, నేనేమన్నా అక్కినేని నాగేశ్వరరావునా, చిరంజీవినా... అద్భుతమైన నటన చూపడానికి! గడ్డం లేకపోయినా, చూడడానికి చిన్మయానంద గారి పోలికలున్నాయని వాళ్ళు అడగడంతో, ‘మీరు అలా అనుకొంటే, ఓ.కె’ అన్నాను. అంతే. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా స్వామి మధ్యవయస్కుడిగా కనిపించే ఘట్టాలతో నడుస్తుంది. ముసలితనం మీద పడ్డాక క్లైమాక్స్ దగ్గర నేను కనిపిస్తాను. అది రేపు తెర మీద ఎన్ని నిమిషాలు ఉంటుందో నాకే తెలీదు.
 

 మరి, డాక్యుమెంటరీ తీసినవాళ్ళు ఏమన్నారు?
 నా మటుకు నాకు తెలియడం లేదు కానీ, స్వామీజీ వాళ్ళు మాత్రం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. బయటికొచ్చాక తెర మీద చూడాలి. అయినా... నేను పని చేస్తున్న సినిమాల గురించి కానీ, నా ఆర్ట్ డెరైక్షన్ గురించి కానీ ‘అద్భుతం... చాలా బాగుంది’ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడూ చెప్పను. తెర మీద చూశాక, ఆ మాట జనం చెప్పాల్సిందే (నవ్వులు...).
 
గతంలో కూడా మీరు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘శివాజీ’లో కెమేరా ముందుకొచ్చారు కదూ!
అవును. ఆ సినిమాలోని ‘బల్లేలక్కా...’ పాటలో అందరితో పాటు కలిసి, జల్సాగా నిలుచున్నా. తెర మీద అలా తళుక్కున మెరిశాను. కాకపోతే, అదేదో సరదాగా చేసిన వ్యవహారం. కానీ, ఈ డాక్యుమెంటరీ అలా కాదు.. గంభీరమైన ఓ స్వామీజీ పాత్రలో కనిపించడం. ఇది తమాషాగా తీసుకోదగ్గ ఆషామాషీ పని కాదు. అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశా.
 
మీ నాన్న గారు తోట వెంకటేశ్వరరావుకి కూడా నటనానుభవం ఉన్నట్లుంది?
అవును. చిత్రసీమలో కళాదర్శకుడిగా స్థిరపడక ముందు ఆయన టీనేజ్‌లో నాటకాలు ఆడేవారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రంగస్థల ప్రసిద్ధులు డి.వి. సుబ్బారావు గారితో కలసి, వారి నాటక బృందంలో మా నాన్నగారు వేషాలు వేసేవారు. అవన్నీ 1940ల నాటి సంగతులు. అప్పట్లో నటనలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు కూడా! (నవ్వేస్తూ...) నాకూ, ఆయనకూ పోలికే లేదు. నక్కకూ, నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఏమైనా, రేపు డాక్యుమెంటరీ బయటకు వచ్చాక, మీ లాంటి వారందరూ చూసి ఎలా ఉందో చెప్పాలి.


 - రెంటాల జయదేవ


...............................................................

Wednesday, June 4, 2014

వయసెరుగని స్వర సుర ఝరి - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

యసు పెరిగే కొద్దీ గొంతు మారడం ప్రకృతి సహజం. కానీ, ఆ వయోధర్మాన్ని కూడా ఒడుపుగా మలుచుకొని, అన్ని రకాల పాటలూ పాడడమంటే... కచ్చితంగా విశేషమే. అందులోనూ నలభై ఎనిమిదేళ్ళుగా ఆ అరుదైన విన్యాసాన్ని కొనసాగించడమంటే, అది తిరుగులేని రికార్డు. మరి, ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినీ నేపథ్య గాయకుడు మన తెలుగువాడు కావడం... మన తెలుగు నేల చేసుకున్న మహాదృష్టం. ఆ అదృష్టాన్ని మనకందించిన స్వరఝరి - ఎస్పీబీగా అందరూ పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
 
 ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబర్ 15న తొలిపాట రికార్డింగ్ జరిపినప్పటి నుంచి నేటి వరకూ ఆయన ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 16 భాషల్లో పాడారు. అల్లూరి సీతారామరాజుకు పాడిన ఆ గొంతు అల్లు రామలింగయ్యను అనుకరించగలదు. అల్లరి పాటలతో తుంటరి మాటలు పలికిన గళం అన్నమయ్య గొంతుగా ఆర్తినీ పలికించగలదు. శాస్త్రీయతను ధ్వనిస్తూ సినీ సంగీత సరస్వతికి శంకరాభరణాలు తొడిగిన ఆ గళానికేనా ఇన్ని స్వరాలు అని ఆశ్చర్యపోనివారు ఉండరు. ఇక, పాటల సంఖ్య అంటారా? వేలల్లోకి చేరి, లెక్కపెట్టడానికి కూడా వీలు లేని స్థాయికి చేరిపోయింది. పాటలొక్కటే పాడి, గాయకుడిగా మిగిలిపోతే బాలూ అందరిలో ఒకరయ్యేవారు.
 
  కానీ, ఆయన పాడడమే కాదు... పాటలకు బాణీలు కట్టారు, పాత్రలకు డబ్బింగ్ చెప్పారు, కెమేరా ముందుకొచ్చి నటిం చారు, మంచి కథలకు నిర్మాతగా మేడ కట్టారు, ప్రతిభావంతులైన నవతరం గాయనీ గాయకులను వెలికితీసి, సానపట్టే పనిని చేపట్టారు. అందుకే, భారతీయ సినీ నేపథ్య గాయకుల్లో బాలూది ఓ ప్రత్యేక చరిత్ర. అంతటి బహుముఖీన ప్రతిభాశాలి కాబట్టే, ఆయన గానానికి అరడజను జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వ సత్కారాలు, విశ్వవిద్యాలయ గౌరవాలు చెన్నైలోని కామదార్‌నగర్ నివాసానికి నడిచొచ్చాయి. వెరసి, ఒకప్పటి నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట (ఇప్పుడిది తమిళనాడులో భాగమైంది) గ్రామంలో పుట్టిన ఈ గాన తపస్వి ఇవాళ అందరివాడయ్యాడు.



 తెలుగువాళ్ళకు ఆయన ‘మా బాలు’.. తమిళులకు ‘నమ్మ ఎస్పీబీ’.. మలయాళీలకు ‘నమ్ముడె ఎస్పీబీ’.. కన్నడిగులకు ‘నమ్మవరు ఎస్పీబీ’.. హిందీ వాళ్ళకు ‘హమారా ఎస్పీబీ’.. ఇన్ని ప్రాంతాల, ఇన్ని కోట్ల మందిని అలరించి, ఎవరికి వారే తమ వాడనుకొనేలా ఎదగడం, పాడిన ప్రతి చోటా ఒదగడం ఒక అరుదైన విన్యాసం. ఎస్పీబీ మాత్రమే చేసిన గళేంద్రజాలం. ఇవాళ్టితో 68 ఏళ్ళు నిండి 69వ ఏట అడుగిడుతున్న ఈ గాన గంధర్వుడికి శ్రీరస్తు, శుభమస్తు. చిరకాలం మరిన్ని మంచి పాటల విందు చేయాలని కోరుతున్న అశేష అభిమానుల ఆశీస్సులు అండగా చిరాయురస్తు!

(Published in 'Sakshi' daily, 4th June 2014, Wednesday)
......................................

తెరపై బ్యాడ్మింటన్ స్టార్ కథ

పేరొందిన నిజజీవిత వ్యక్తుల కథలు ఎప్పుడూ ఆసక్తికరమే. అందులోనూ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులకు లోనై, కష్టపడి పైకొచ్చి, తరువాతి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన క్రీడాజ్యోతుల విషయమైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి కథలను కమర్షియల్‌గా అందించడానికి వెండితెర ఎప్పుడూ ఉత్సాహం చూపుతుంటుంది. ‘ఫ్లయింగ్ సిక్కు’గా పేరొందిన భారతీయ పరుగుల వీరుడు మిల్ఖాసింగ్ మీద ఆ మధ్య వచ్చిన హిందీ హిట్ ‘భాగ్ మిల్ఖా భాగ్’ అందుకు తాజా ఉదాహరణ. భారతీయ సైన్యంలో పనిచేసి, భారతీయ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం కూడా సాధించిన పాన్ సింగ్ తోమర్ జీవితంపై ఆయన పేరు మీదే సినిమా వచ్చి, అవార్డులు అందుకొంది. అయిదుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన మణిపూర్ క్రీడాకారిణి మేరీ కోమ్ జీవితం ఆధారంగా ప్రియాంకా చోప్రా నటిస్తున్న సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
 
 ఈ స్ఫూర్తితో ఇప్పుడు తెలుగులో కూడా ఓ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా సినిమా రూపకల్పనకు సన్నాహాలు సాగుతున్నాయి. సాక్షాత్తూ గోపీచంద్ శిష్యుడైన యువ హీరో సుధీర్‌బాబు ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు భోగట్టా. కాగా, పలువురు బ్యాడ్మింటన్ తారలను  దేశానికి అందించిన గోపీచంద్ సైతం తన కథతో సినిమా తీయడానికి అంగీకరించారు. ఇటీవలే ‘చందమామ కథలు’ చిత్రం ద్వారా అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ క్రీడా నేపథ్య చిత్రానికి దర్శకత్వం వహిస్తారని విశ్వనీసయ వర్గాల కథనం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.
 
 ‘భాగ్ మిల్ఖా భాగ్’ లాగా ఆసక్తికరంగా స్క్రిప్టును తీర్చిదిద్దడానికి ప్రవీణ్ శ్రమిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, స్క్రిప్టు పని పూర్తవగానే మరికొద్ది నెలల్లో సినిమా సెట్స్‌పైకి వస్తుంది. పరుగుల రాణి అశ్వినీ నాచప్ప జీవిత కథను కొంత ఆధారంగా చేసుకొని, చాలా ఏళ్ళ క్రితం తెలుగులో ‘అశ్విని’ సినిమా వచ్చింది. అప్పట్లో స్వయంగా అశ్వినీ నాచప్పే ఆ పాత్రను పోషించడం దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. మరి, ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాగే సంచలనమవుతుందా? స్వయంగా నటించకపోయినా పుల్లెల గోపీచంద్ కూడా తళుక్కున తెరపై మెరుస్తారా? చూడాలి. ఆల్ ది బెస్ట్ టు డెరైక్టర్ ప్రవీణ్ సత్తారు, హీరో సుధీర్‌బాబు అండ్ టీమ్.


(Published in 'Sakshi' daily, 3rd May 2014, Tuesday)
..............................................

మళ్ళీ సీక్వెల్ కూడానా?


జనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’కు సీక్వెల్ వస్తోందా? ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. త్రీడీ మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్‌కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో ‘కోచ్చడయాన్’కు ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. ‘‘పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్‌లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా.
 
  ఏమైనా, దీనికి సీక్వెల్‌లో మరింత కష్టపడి, బాగా తీస్తాం’’ అని మురళీ మనోహర్ అన్నారు. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం ఏమిటంటే, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా, ఈ సహ నిర్మాత మాత్రం ఘన విజయం సాధించిందంటూ డబ్బా కొట్టుకున్నారు.  అనుకున్న దాని కన్నా ఆలస్యమైనా, హిందీలో కూడా ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కబుర్లు విని, సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవును మరి... మొదటి సినిమాకే దిక్కు లేదంటూ ఉంటే, దీనికి సీక్వెల్ కూడానా అని పెదవి విరుస్తున్నారు.


(Published in 'Sakshi' daily, 3rd May 2014, Tuesday)
............................................................................

Sunday, June 1, 2014

లెజెండ్ 'రమాప్రభ'కు గుర్తింపేది.. ?


ప్రతిభకు పట్టం కట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఆ ప్రతిభావంతులకు కనీస గుర్తింపు ఇస్తే చాలు వారి ఆనందానికి హద్దే ఉండదు. కానీ ఆ చిన్న ఆనందానికి నోచుకోని దిగ్గజ నటీనటులు చాలామందే ఉన్నారు.. అలాంటి వారి గురించి తెలిపే మన 'లెజెండ్స్' లో గత శనివారం కైకాల సత్యనారాయణ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ వారం మన లెజెండ్.. 'రమాప్రభ'. 1400ల సినిమాలు, దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించినా ఇంత వరకూ ఆ ఉత్తమ నటికి ప్రభుత్వ పరంగా వచ్చిన గుర్తింపేమీ లేదు. అంతే కాదు. పరిశ్రమ కూడా ఇలాంటి వారి పట్ల చిన్న చూపుగానే ఉంది.

గుర్తింపులో వెనుకపడిన రమాప్రభ..
   
ప్రతిభకు పట్టం కట్టే రోజులు కావివి. పైరవీలకు అవార్డులు కట్టబెట్టే రోజులు. ఎవరినైనా ప్రతిభ ను చూసి రావాల్సి పదవులు.. గులాంగిరీ చేసేవారికి వస్తున్నాయి. నటనా రంగంలో డబ్బులిచ్చో, పలుకుబడితోనో డాక్టరేట్లు కొనుక్కునేవాళ్లూ. పదవులు పొందేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఇలాంటి వేటికీ నోచుకోక, అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమ గుర్తింపులోనూ వెనకబడే ఉంది మేటి నటి రమాప్రభ. 1400సినిమాలు చేసిన నటి మరొకరు లేరేమో. నిజంగా ఇన్నేళ్లలో అన్ని దక్షిణాది భాషల్లో కలిపి కానీ ఈ విషయంలో కూడా కనీస గుర్తింపుకు నోచుకోలేదు రమాప్రభ. ప్రస్తుతం వయసు మీదపడుతోంది. దీనితో సినిమాల్లో అవకాశాలు లేక, వచ్చినా చేసే ఓపిక లేక మదనపల్లిలో తన సొంత ఇంట్లో ఉంటోందని చెబుతున్నారు.


జీవిత విశేషాలు..
  
1946 అక్టోబర్ 5న అనంతపురం జిల్లా కదిరిలో జన్మించింది. చిన్న వయసులోనే అనేక కష్టాలు ఎదుర్కొన్న ఆమె, తర్వాత మద్రాస్ వెళ్లి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంది. సినిమా రంగంలోకి రావడానికి ముందే తమిళ నాటకరంగంలో నాలుగు వేలకు పైగా నాటక ప్రదర్శనలిచ్చిన ప్రతిభాశాలి రమాప్రభ. ఎన్నో సినిమాల్లో అన్ని తరాల నటులతోనూ రమాప్రభ నటించడం విశేషం. రాజబాబు, అల్లు రామలింగయ్యలకు అద్భుతమైన జోడీగా ఎన్నో చిత్రాల్లో హాస్యాన్ని పండించింది. హాస్య నటిగా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమాప్రభ ప్రతిభ తెలియని వారు లేరు. కడుపుబ్బా నవ్వించడంలో ఎంత ప్రతిభ చూపుతుందో కన్నీళ్లు పెట్టించడంలోనూ అంతే ప్రతిభ చూపుతుంది. పాత్రకు తగ్గట్గుగా ఆహార్యాన్ని మార్చుకోవడంలో కూడా రమాప్రభ ప్రత్యేకత కనిపిస్తుంది.



ఆమె ఉంటేనే సినిమాకు ప్లస్...
  
రాజబాబు, అల్లు రామలింగయ్య లతో నటించిన ఆమె పాత్రలు సినిమాకే ప్లస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1970- 80దశకాల్లో రమాప్రభ లేని సినిమా లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె ప్రతిభ ఏ పాటిదో. ఆమె ఉండటం కూడా తమ సినిమాలకు ప్లస్ పాయింట్స్ గా భావించే దర్శకులు చాలామందే ఉన్నారు.


ఆసరాగా ఎవరూ లేరు..
  
నటుడు శరత్ బాబును పెళ్లి చేసుకుని అన్ని విధాలుగా నష్టపోయానని చెప్పుకునే ఆమెకు ఆసరాగా ఇప్పుడెవరూ లేరు. ఈ మధ్య కాలంలో కూడా ఈ తరం వారి మనసు దోచిన బామ్మగా నటించింది. ముఖ్యంగా దేశముదురు, అదుర్స్ లాంటి సినిమాలు చూస్తే నేటి తరానికి కూడా ఆమెలోని నటి తెలుస్తుంది. మరి ఇలాంటి నటిని అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమ పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమైన విషయం.


చేయూతనిస్తున్న నాగ్...
   
ప్రభుత్వ, పరిశ్రమ గుర్తింపు కు దూరంగా ఉన్న రమాప్రభకు, హీరో నాగార్జున ఆర్థిక సాయం చేస్తూ ఆమెకు నెలనెలా జీవన భృతి పంపుతున్నాడు. ఈ విషయంలో నాగార్జునను మనస్ఫూర్తిగా మెచ్చుకోకుండా ఉండలేం. అయితే ఇన్ని సినిమాలు చేసిన ఆమెకు ప్రభుత్వ పరంగా ఇప్పటికైనా ఓ గుర్తింపు వస్తే చాలా ఆనందిస్తుంది. ఈ విషయంలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులూ కోరుతున్నారు.


(This is a story on Actress Ramaprabha telecasted in 10tv News channel on 31st May 2014, Saturday)

 ........................................