వయసు పెరిగే కొద్దీ గొంతు మారడం ప్రకృతి సహజం. కానీ, ఆ వయోధర్మాన్ని కూడా ఒడుపుగా మలుచుకొని, అన్ని రకాల పాటలూ పాడడమంటే... కచ్చితంగా విశేషమే. అందులోనూ నలభై ఎనిమిదేళ్ళుగా ఆ అరుదైన విన్యాసాన్ని కొనసాగించడమంటే, అది తిరుగులేని రికార్డు. మరి, ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినీ నేపథ్య గాయకుడు మన తెలుగువాడు కావడం... మన తెలుగు నేల చేసుకున్న మహాదృష్టం. ఆ అదృష్టాన్ని మనకందించిన స్వరఝరి - ఎస్పీబీగా అందరూ పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబర్ 15న తొలిపాట రికార్డింగ్ జరిపినప్పటి నుంచి నేటి వరకూ ఆయన ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 16 భాషల్లో పాడారు. అల్లూరి సీతారామరాజుకు పాడిన ఆ గొంతు అల్లు రామలింగయ్యను అనుకరించగలదు. అల్లరి పాటలతో తుంటరి మాటలు పలికిన గళం అన్నమయ్య గొంతుగా ఆర్తినీ పలికించగలదు. శాస్త్రీయతను ధ్వనిస్తూ సినీ సంగీత సరస్వతికి శంకరాభరణాలు తొడిగిన ఆ గళానికేనా ఇన్ని స్వరాలు అని ఆశ్చర్యపోనివారు ఉండరు. ఇక, పాటల సంఖ్య అంటారా? వేలల్లోకి చేరి, లెక్కపెట్టడానికి కూడా వీలు లేని స్థాయికి చేరిపోయింది. పాటలొక్కటే పాడి, గాయకుడిగా మిగిలిపోతే బాలూ అందరిలో ఒకరయ్యేవారు.
కానీ, ఆయన పాడడమే కాదు... పాటలకు బాణీలు కట్టారు, పాత్రలకు డబ్బింగ్ చెప్పారు, కెమేరా ముందుకొచ్చి నటిం చారు, మంచి కథలకు నిర్మాతగా మేడ కట్టారు, ప్రతిభావంతులైన నవతరం గాయనీ గాయకులను వెలికితీసి, సానపట్టే పనిని చేపట్టారు. అందుకే, భారతీయ సినీ నేపథ్య గాయకుల్లో బాలూది ఓ ప్రత్యేక చరిత్ర. అంతటి బహుముఖీన ప్రతిభాశాలి కాబట్టే, ఆయన గానానికి అరడజను జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వ సత్కారాలు, విశ్వవిద్యాలయ గౌరవాలు చెన్నైలోని కామదార్‌నగర్ నివాసానికి నడిచొచ్చాయి. వెరసి, ఒకప్పటి నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట (ఇప్పుడిది తమిళనాడులో భాగమైంది) గ్రామంలో పుట్టిన ఈ గాన తపస్వి ఇవాళ అందరివాడయ్యాడు.
తెలుగువాళ్ళకు ఆయన ‘మా బాలు’.. తమిళులకు ‘నమ్మ ఎస్పీబీ’.. మలయాళీలకు ‘నమ్ముడె ఎస్పీబీ’.. కన్నడిగులకు ‘నమ్మవరు ఎస్పీబీ’.. హిందీ వాళ్ళకు ‘హమారా ఎస్పీబీ’.. ఇన్ని ప్రాంతాల, ఇన్ని కోట్ల మందిని అలరించి, ఎవరికి వారే తమ వాడనుకొనేలా ఎదగడం, పాడిన ప్రతి చోటా ఒదగడం ఒక అరుదైన విన్యాసం. ఎస్పీబీ మాత్రమే చేసిన గళేంద్రజాలం. ఇవాళ్టితో 68 ఏళ్ళు నిండి 69వ ఏట అడుగిడుతున్న ఈ గాన గంధర్వుడికి శ్రీరస్తు, శుభమస్తు. చిరకాలం మరిన్ని మంచి పాటల విందు చేయాలని కోరుతున్న అశేష అభిమానుల ఆశీస్సులు అండగా చిరాయురస్తు!
(Published in 'Sakshi' daily, 4th June 2014, Wednesday)
......................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment