జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 31, 2015

రాజు గారి గది... లోపల ఏముంది? (రివ్యూ - రాజు గారి గది)

రాజు గారి గది... లోపల ఏముంది?
చిత్రం: రాజు గారి గది
తారాగణం: అశ్విన్, ‘షకలక’ శంకర్, ధన్‌రాజ్, సప్తగిరి
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కెమేరా: ఎస్. జ్ఞానమ్
సంగీతం: సాయికార్తీక్
నిర్మాత: ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఓంకార్
 

గతంలో ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేసిన ఓంకార్ 
ఈసారి లో-బడ్జెట్‌లో చేసిన హార్రర్ - కామెడీ -క్రైమ్ సినిమా ‘రాజు గారి గది’. 
అనగనగా నందిగామ అనే ఊరు. అక్కడ ఓ పాడుబడిన మహల్... దానిలోకి 
వెళ్ళినవాళ్ళంతా చనిపోతుంటారు. ఆ మహల్‌లో దయ్యం ఉందని ఊరంతా పుకారు. 
ఆ బంగళాలో ఉన్నదేమిటో నిజం నిరూపించడానికి కొందరు బయలుదేరతారు.
 తీరా ఆ ముగ్గురూ కూడా చనిపోతారు.

అలా అప్పటికి 34 మంది బలైపోయిన ఆ రాజమహల్ రహస్యం ఛేదించడానికి 
అన్నట్లుగా ఒక టీవీ చానల్ ఒక షో పెడుతుంది. దానిలో పాల్గొనడానికి ఏడుగురు 
సెలక్ట్ అవుతారు. ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళి, ఆ మహల్‌లో ఏడు రోజుల 
పాటు ఉండి, దయ్యాలున్నాయా, లేదా అన్నది కనిపెట్టాలన్నది గేమ్. అలా
 ఏడు రోజులూ అక్కడే గడిపి, గెలిచినవాళ్ళకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ. 
అందుకు ఒప్పుకొని, ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందన్నది సినిమా.

వెళ్ళిన ఏడుగురిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అశ్విన్ (అశ్విన్)కు ఓ ఫ్లాష్‌బ్యాక్ 
ఉంటుంది. అతని అన్నయ్య డాక్టర్ (రాజీవ్ కనకాల). ఆర్గాన్ డొనేషన్ గురించి 
జనంలో చైతన్యం తెచ్చే ఆ డాక్టర్ కూడా అనుమానాస్పదంగా ఆ మహల్‌లోని 
పాడుబడ్డ బావిలో మరణిస్తాడు. ఆ కథకూ, ఈ మహల్‌లో పెళ్ళి కాకుండా 
తిరుగుతున్న బొమ్మాళి (పూర్ణ) దయ్యానికీ ఉన్న సంబంధం ఏమిటి? 
ఇంతకీ ఆ మహల్‌లో దయ్యాలున్నాయా? ఎందుకవి అందరినీ 
చంపుతున్నాయన్నది మిగతా కథ.

ఓంకార్ తన తమ్ముడు అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, డెరైక్షన్ చేసిన
 సినిమా ఇది. చూడడానికి అన్న పోలికలు పుష్కలంగా ఉన్న అశ్విన్‌ది 
ప్రధాన పాత్ర. డాక్టర్ నందన్‌గా చేతన్ చీను వినూత్నంగా కనిపిస్తారు. 
బాలా త్రిపురసుందరి అలియాస్ బాలాగా ధన్యా బాలకృష్ణన్ తెలంగాణ 
మాండలికంలో, గుంటూరు జిల్లా యాసలో శివుడుగా ధన్‌రాజ్, క్రైస్తవ మత 
ప్రబోధకుడి కుమారుడిగా ఎం.వై. దానం అలియాస్ మైదానంగా ‘షకలక’ శంకర్, 
బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖా రామన్ - ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రకం
 డైలాగ్ డెలివరీ. స్క్రిప్టుకు తగ్గట్లే అందరూ నవ్వించడానికి ప్రయత్నించారు.

ఈ సినిమాకు ప్రధాన బలం - ‘షకలక’ శంకర్ చేసిన కామెడీ, చూపిన
 హావభావాలు. క్షణాల్లో రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ, ఆయన పండించిన 
సన్నివేశాలు ఆడియన్స్‌కు నచ్చుతాయి. మరిన్ని ఛాన్స్‌లు తెచ్చిపెడతాయి. 
ధన్‌రాజ్‌తో కాంబినేషన్ సీన్లు పండాయి. సెకండాఫ్‌లో సప్తగిరి చేసే ‘కచ్చేరీ’ 
లాంటి కామెడీ మాస్‌ను ఉద్దేశించినదనుకోవాలి.

పాటలు ఎక్స్‌పెక్ట్ చేయలేని హార్రర్ సినిమాకు... తగ్గట్లుగా బాగా కుదిరినవి - 
కెమేరా వర్క్, రీరికార్డింగ్. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల్ని ఉద్విగ్నతకు గురి చేస్తారు. 
నిడివి పరంగా కేవలం రెండు గంటల చిల్లరే ఉన్న ఈ సినిమాకు ఎడిటింగ్‌లో 
షాట్స్ ఎంపిక, వాటి ప్లేస్‌మెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే, 
హార్రర్ ఎఫెక్ట్ పెరిగేదనిపిస్తుంది.

అలవాటైన టీవీ చానల్ గేమ్‌షో కాన్సెప్ట్‌నే... ఈ సినిమాకూ తీసుకున్నారు
 యాంకర్ ఓంకార్. ఇవాళ టీవీల్లో ఫేమస్ అయిన ‘బిగ్ బాస్’ తరహా గేమ్‌షోను 
ఆశ్రయించారు. అక్కడ బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో అభ్యర్థులందరూ
 ఉండడమనే కాన్సెప్ట్‌కు ఇక్కడ దయ్యాలున్న రాజమహల్‌ను పెట్టుకున్నారు.
 పేరుకిది హార్రర్ జానర్ సినిమా అయినా, దానికి సోషల్ క్రైమ్ జత చేసి,
 సందేశం ఇవ్వాలని చూశారు. ఆ మధ్య వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ 
దగ్గర నుంచి జనరంజక ఫార్ములా అయిన హార్రర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ 
మిళాయింపు పద్ధతినీ పాటించారు.

ఇలా అది కొంత, ఇది కొంత - అంటూ విజయసూత్రాలన్నీ వాడుకోవాలని 
చూశారు. ఫస్టాఫ్ అంతా హార్రర్ ధోరణిలో ఆసక్తిగా నడిచిపోతుంది. నిజానికి, 
ఈ సినిమాకు ‘రాజు గారి గది’ అని పేరు పెట్టారు కానీ, మొత్తం మహల్‌కే 
తప్ప, ప్రత్యేకంగా ఆ గదికి సినిమాలో ఇచ్చిన ఇంపార్టెన్స్ తక్కువే. క్రైమ్ 
సీరియల్‌గా బాగా నప్పే కాన్సెప్ట్‌ను ఒక చిన్న సినిమాగా తీశారు. మొత్తానికి,
 రాజు గారి గదిలో ఏముందా అని అతిగా ఊహించుకోకుండా కాసేపు 
కాలక్షేపానికి వెళితే, ఆశాభంగం తప్పుతుంది. టాయిలెట్ కామెడీల 
లాంటి జుగుప్సను పక్కన పెడితే, రీరికార్డింగ్ ఎఫెక్ట్‌లు, ‘షకలక’ 
శంకర్ కామెడీలతో సర్దుకుపోవచ్చనిపిస్తుంది.

-  రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 24th Oct 2015, Saturday)
...................................

Friday, October 30, 2015

లవ్... కొలంబస్ ( మూవీ రివ్యూ - కొలంబస్)

లవ్... కొలంబస్

కెమేరా: భాస్కర్ సామల, నిర్మాతలు: అశ్వనీకుమార్ సహదేవ్,
ఎస్.సి.కపాడియా, దర్శకత్వం: ఆర్.సామల


కొలంబస్... ఈ పేరు చెప్పగానే కొత్త ప్రదేశం కనిపెట్టిన నౌకాయాత్రికుడు గుర్తొస్తాడు. 
కాకపోతే, కొలంబస్ కనిపెట్టాలనుకున్నది వేరు. కనుక్కున్నది వేరు. ఇండియాను
 కనిపెట్టేందుకు ప్రయాణం మొదలుపెట్టి, చివరకు అమెరికాను కనుక్కున్నాడు. 
దీన్నే ప్రేమకు అన్వయిస్తూ అల్లుకున్న కథ - ఈ ‘కొలంబస్’ సినిమా. ఒకరి ప్రేమను 
గెల్చుకోవడానికి ప్రయత్నించిన హీరో ఆ ‘డిస్కవరింగ్ లవ్...’ జర్నీలో ఎక్కడకు 
చేరాడన్నది స్టోరీ.

కథ ఏమిటంటే... అశ్విన్ (సుమంత్ అశ్విన్) రెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. 
ఇందు (మిస్తీ చక్రవర్తి) అనే ప్రేమికురాలి పేరునూ, ఆమెతో ప్రేమనూ కలవరిస్తూ, 
పలవరిస్తుంటాడు. గమ్మత్తేమిటంటే, అసలు అతను జైలులో పడడానికే కారణం -
 ఆ ప్రేమికురాలు. జైలు నుంచి బయటికొచ్చిన హీరో తన స్నేహితులెవరూ 
తెలియదని చెప్పినా, కనిపించని హీరోయిన్ అడ్రస్, ఫోన్‌ల కోసం అన్వేషణ 
సాగిస్తుంటాడు. ఆ క్రమంలో అతనికి మరో హీరోయిన్‌తో పరిచయమవుతుంది.
 పేరు- నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్). తగాదాగా మొదలైన ఆ
పరిచయం క్రమంగా స్నేహంగా మారుతుంది. ప్రేమికురాలికి మళ్ళీ 
దగ్గరవడానికి హీరో, నీరూ సాయం తీసుకుంటాడు.
 ఫ్లాష్‌బ్యాక్‌లో ఇందుతో హీరో ప్రేమ ఒకప్పుడు దెబ్బతినడానికి 
కారణం మాజీ క్లాస్‌మేట్ వంశీ (రోషన్). ఆ కథ అంతా విన్న నీరూ, 
హీరో ప్రేమ గెలవడానికి స్నేహం కొద్దీ సాయపడడం మొదలుపెడుతుంది.
 ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. వంశీ మీద 
ఇందుకు అనుమానం కలిగేందుకు సినిమా హాలులో బాత్రూమ్ 
దగ్గర సన్నిహితంగా మెలగడం దగ్గర నుంచి అన్నీ చేస్తుంది.
 ఫలితంగా వంశీ మీద అనుమానం పెరిగి, హీరోతో పెళ్ళికి 
ప్రేమికురాలు ఇందు సిద్ధపడుతుంది. కానీ, అక్కడే మరో ట్విస్ట్. 
అదేమిటి, స్నేహం కోసం హారతి కర్పూరంగా మారిన నీరూ కథ
 ఏమైందన్నది మిగతా సినిమా.

 రెండు గంటల చిల్లర నిడివే... ఉన్న చిన్న సినిమా ఇది. కాకపోతే,
 సినిమా నిండా సీన్లు, ఎపిసోడ్లు అనేకం. ఫస్టాఫ్ అంతా హీరో 
మొదలు అన్ని పాత్రల పరిచయం, దూరమైన ప్రేమికురాలు 
ఇందు ఆచూకీ కనుక్కోవడానికి అతను చేసే ప్రయత్నాల చుట్టూరానే
 తిరుగుతుంది. అసలు కథ సెకండాఫ్. హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలిశాక హీరోకు 
సాయపడేందుకు నీరూ త్యాగాల పరంపర మొదలయ్యాక విషయం 
చిక్కబడుతుంది. ప్రేక్షకులకు కూడా అక్కడ నుంచే రెండో హీరోయిన్ 
క్యారెక్టర్ మీద సానుభూతి మొదలవుతుంది. ఆ పైన హీరో తన అసలు
 సిసలు ప్రేమను ఎవరి దగ్గర పొందాడన్నది ఓపెన్‌మైండ్‌తో చూడాల్సిన 
మిగతాకథ.

 ప్రేమ, కాస్తంత హీరోయిజమ్, కావాల్సినంత చలాకీదనం నిండిన పాత్ర 
సుమంత్ అశ్విన్ చేశారు. ‘చిన్నదాన నీ కోసం’ ఫేమ్ మిస్తీ చేసిన ఇందు 
పాత్ర మందు, చిందు తరహా వేషం. ‘నేను సక్సెస్‌ఫుల్ వ్యక్తిని
 ప్రేమించాలనుకున్నానే కానీ, ప్రేమను సక్సెస్ చేసుకోవాలనుకోలేదు’
 అని వాపోయే డైలాగే ఆమె క్యారెక్టరైజేషన్‌కూ, కథకూ కీలకం. కథ 
సాగుతున్న కొద్దీ స్క్రిప్ట్‌లో, యాక్షన్‌లో ముఖ్యమైనది నీరూ పాత్ర.
 ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్‌తో దాన్ని బాగా చేయించారు. చివరలో 
ఎయిర్‌పోర్ట్ సీన్ ఆ క్యారెక్టరైజేషన్‌కు ఎమోషనల్ క్లైమాక్స్.
 నవ యువ రక్తం వైపే... సంగీతం, ఆర్ట్, కెమేరా వర్క్ - ఇలా ముఖ్య 
విభాగాలన్నిటిలో మొగ్గుచూపారు. ఆ సంగతి తెరపై కనిపిస్తుంది. 
మాటల రచన, దర్శకత్వ బాధ్యత చేపట్టిన ఆర్. సామలకు ఇది తొలి 
డెరైక్షన్ చాన్స్. బాక్సాఫీస్ లవ్‌స్టోరీలెన్నో అందించిన ఎం.ఎస్. రాజు ఆ 
ప్యాట్రన్‌లో, చాలారోజులకు ఇప్పుడు కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సూపర్‌విజన్‌లతో 
అందించిన ఫిల్మ్ ఇది. ‘ఒక్కడు’లో మహేశ్ తరహాలో ఈ ఫిల్మ్‌లోనూ హీరోతో
 సెంటిమెంటల్ గా కబడ్డీ ఆటగాడిగా తెరపై కూత పెట్టించారు. ఇలాంటి సక్సెస్‌ఫుల్ 
ఫార్ములా సెంటిమెంట్లన్నీ బాక్సాఫీస్ వద్ద కొలంబస్ లవ్ జర్నీకి కలిసొస్తాయేమో చూడాలి.

-  రెంటాల జయదేవ
.....................................................
- షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే. 
- మొత్తం వర్కింగ్ డేస్ 55 రోజులు.
- ఇలియానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు డబ్బింగ్ చెప్పే హరిత ఇందులో సీరత్ కపూర్‌కు గళమిచ్చారు. 
మిస్తీ చక్రవర్తికి గాయని శ్రావణ భార్గవి చెప్పారు. 
- కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సూపర్‌విజన్ చేసిన ఎమ్మెస్ రాజు చివరలో తెరపై మెరుస్తారు.
....................................................
(Published in 'Sakshi' daily, 24th Oct 2015, Saturday)
.....................................

Tuesday, October 27, 2015

ప్రేమ... ‘కంచె’ ('కంచె' మూవీ రివ్యూ)


ప్రేమ... ‘కంచె’

పాటలు: సీతారామశాస్త్రి
కెమేరా: జ్ఞానశేఖర్
నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి, సాయిబాబు
రచన - దర్శకత్వం: క్రిష్


‘కంచె’లో... మనసు లేని ముష్కరులు కొందరు జాత్యహంకారంతో ఒక
 పసికందునూ, జాతి సంకరం చేసిన కుటుంబాన్నీ చంపబోతారు. ఆ
 కుటుంబం కోసం వాళ్ళ భాషయినా తెలియని మరో దేశపు సైనికుడు
 ప్రాణాలకు తెగిస్తాడు. నిజానికి, వాళ్ళు అతనికి ‘సోకాల్డ్’ శత్రుదేశీయులు. 
అయినా, ఎందుకు తన మిషన్‌ను పక్కనపెట్టి మరీ, వాళ్ళను కాపాడినట్లు?
 సరిహద్దనేది మనం పెట్టుకున్న కంచె. శత్రుత్వమనేది ఎవరెవరివో, ఏవేవో
 ప్రయోజనాల కోసం మనం వేసుకున్న కంచె. మానవత్వాన్ని మర్చిపోవడం
 కోసం కాదు... రేపటి ఆశను ఇవాళ బతికించుకోవడం కోసం చేయాలి
 యుద్ధం అని ఆ సంఘటన చెబుతుంది. ‘కంచె’ చిత్రంలోని
 ఉదాత్తమైన సన్నివేశాల్లో ఇది ఒకటి.

మనుషుల మధ్య, మనసుల మధ్య - కులాలు, మతాలు, డబ్బు, 
అధికారం, జాత్యహంకారం - ఇలా కనపడని కంచెలు ఎన్నెన్నో! 
విద్వేషం నిండిన సమాజంలో, మనుషుల్ని మనుషులు చంపుకొనే
 విచిత్ర రాక్షస ప్రవృత్తిలో - దేశాల మధ్యే కాదు, మన మధ్య కూడా 
ఈ కంచెల్ని కూల్చడం ఎలా? ప్రేమ ఒక్కటే దానికి పరిష్కారమని 
‘కంచె’ గుర్తు చేస్తుంది. ఇలాంటి గొప్ప సందేశం ఇచ్చింది ఏ 
ఇరానియన్ సినిమానో, ఇటాలియన్ సినిమానో అయితే, దాని గురించి
 గొప్పగా చెప్పుకొంటాం. అలాంటి సినిమాలు తీయని ‘మనవాళ్ళు వట్టి
 వెధవాయిలోయ్’ అంటాం. మరి, మన సోకాల్డ్ కమర్షియల్ సినిమా 
లెక్కలు చూసుకోకుండా, ఇలాంటి సినిమా తీసిన భావుక దర్శకుడు
 క్రిష్‌ను ఇప్పుడు ఏమనాలి?

కథగా చెప్పాలంటే... రెండో ప్రపంచ యుద్ధకాలం... తెలుగు గడ్డ మీది
 ఒక పల్లెటూరు. కోటలోని జమీందార్ గారి మనవరాలు సీత (ప్రజ్ఞా జైస్వాల్).
 పేటలో కులవృత్తిని నమ్ముకున్న కొండయ్య (గొల్లపూడి మారుతిరావు) 
మనవడు దూపాటి హరిబాబు (వరుణ్‌తేజ్). చెన్నపట్నంలో వాళ్ళిద్దరి 
స్నేహం ప్రేమ అవుతుంది. ఊరికొచ్చాక వాళ్ళ ప్రేమకు కులం, 
అంతస్థుల కంచె అడ్డమవుతుంది. సీత అన్న ఈశ్వర్ (‘చెన్నైఎక్స్‌ప్రెస్’లో
 తంగబలి పాత్రధారి నికితిన్‌ధీర్) వారి పెళ్ళికి అడ్డం తిరుగుతాడు.

కథలో ఆ తరువాత హీరోయిన్ అన్నయ్య లానే హీరో కూడా మిలటరీలో 
చేరతాడు. రెండో ప్రపంచ యుద్ధం (1939 - ’45)లో అప్పటి బ్రిటీషు 
పాలనలోని భారతీయులు జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ సైన్యంలో
 భాగమై యుద్ధం చేశారు. ఆ యుద్ధ సమయంలో హీరో యిన్ 
అన్నయ్య సహా బ్రిటన్ సైన్యంలోని ప్రధాన సైనిక ప్రధానాధికారులు
 కొందరు జర్మన్ సైనికుల చేతిలో బందీలవుతారు. మిగిలిన కొందరితో
 కలసి వాళ్ళను రక్షించడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే 
హిట్లర్ నేతృత్వంలో జర్మనీలో యూదులకూ, జర్మన్లకూ మధ్య వేసిన
 జాత్యంహకారపు కంచె హీరోకు అర్థమవుతుంది. మానవత్వానికి 
ఈ కంచెలు అడ్డు కాకూడదని హీరో అక్కడ వీరోచిత పోరాటమే
 చేస్తాడు. హీరోయిన్ అన్ననూ కాపాడతాడు. విదేశంలో సరే... 
మరి స్వదేశంలో సీతతో హీరో ప్రేమ ఏమైంది? ఊళ్ళోని జనాల్ని
 విభజిస్తున్న కంచెలు ఏమయ్యాయి? ఇదంతా తెరపై చూడాల్సిన కథ.

నటీనటుల సంగతికొస్తే... హరిబాబు పాత్రలో నాగబాబు కుమారుడైన
 హీరో వరుణ్‌తేజ్ శ్రమించారు. పాత్రలో పర కాయ ప్రవేశానికి అతను 
చేసిన కృషి, దర్శకుడి విజన్ తెలుస్తాయి. ‘మిర్చి లాంటి కుర్రాడు’లో
 పలకరించిన ప్రజ్ఞా జైస్వాల్ జమీందారీ పిల్ల సీతగా నిండుగా ఉన్నారు. 
అలాగే, ఆమె అన్న పాత్రధారి కూడా! కొండయ్యగా గొల్ల పూడి, 
బామ్మగా ‘షావుకారు’ జానకి లాంటి సీనియర్లకున్నవి కీలకంగా
 ఒకటి రెండు సీన్లయినా, అవి పండడా నికి వారి అనుభవం 
ఆలంబనయింది.

ఒకరు కాదు ముగ్గురు హీరోలు... ఈ సినిమాకు. రెండో సినిమాకే 
ఇలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకున్న కథానాయక పాత్రధారి వరుణ్‌తేజ్ 
కచ్చితంగా హీరోనే! మిగిలిన ఇద్దరూ ఎవరంటే - ఒకరు సహజంగానే 
ఈ కాన్సెప్ట్‌ను అనుకొని, భుజానికెత్తుకున్న దర్శక - నిర్మాత క్రిష్. 
మరొకరు - ఆ భావానికి భావోద్వేగభరిత గీతాల రూపమిచ్చిన 
రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘గ్యాప్ ఫిల్లర్స్’లానో,
 ఫస్టాఫ్ మూడు - సెకండాఫ్ మూడు అనే బాక్సాఫీస్ లెక్కలతో
 కాకుండా, సిచ్యుయేషన్ సాంగ్స్‌గా చిరకాలం వినిపించే లక్షణం
 ‘కంచె’ పాటలది. వాటిలోని ఆయన భావావేశానికి తడిసి ముద్దవని
 పాటల ప్రియులుండరు. ‘‘విద్వేషం పాలించే దేశం ఉంటుందా’’ లాంటి
 ఆయన ప్రశ్నలకు సమాధానం ఆలోచిస్తే, కళ్ళకు నీటి పొర, మాటకు
 గొంతు జీర అడ్డం పడతాయి. హిందీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్
 అందించిన బాణీలు, పాటల్లో ఆలాప్‌లు, ఇంటర్‌ల్యూడ్స్‌లోని 
బీజియమ్‌లు, వాద్యగోష్ఠి ప్రత్యేకంగా ధ్వనిస్తాయి. సాఫ్ట్ మెలొడీ
 ‘నిజమేననీ నమ్మనీ’ (గానం శ్రేయాఘోశల్) అందుకో ఉదాహరణ.  

సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు సినిమాలో చాలా ఘట్టాల్ని
 మామూలు కన్నా పెయైత్తున నిలబెట్టాయి. దాసు పాత్రధారి 
అవసరాల శ్రీనివాస్ ప్రస్తావించే శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
 కవితలు, పలకించిన కామెడీ ఈ సీరియస్ ఫిల్మ్‌లో కొంత రిలీఫ్. 
ఇక, తలదాచుకున్న సైనికుల్ని కాపాడే టైమ్‌లో బేకరీ తాత
 మనవరాలు చూపే త్యాగం, ఆడవాళ్ళ గర్భాన్నే వాడుకొంటున్న
 సంస్కృతి పట్ల హీరోయిన్ బామ్మ (‘షావుకారు’ జానకి) 
ఆవేదన, క్లైమాక్స్ మనసుల్ని కుదిపేస్తాయి.

మనసు పెట్టి చూడాల్సిన సినిమా ... ఇది. అందుకే, సగటు
 సినిమాల్లో ఉండే మూస ఎంటర్‌టైన్‌మెంట్‌నే వెతుక్కుంటే 
ఈ సెల్యులాయిడ్ హ్యుమానిటీ డాక్యుమెంట్‌లో అది దొరకదు.
 తీసుకున్న నేపథ్యానికి బోలెడంత రీసెర్చ్ చేసి, వార్ సీన్‌‌సను
 కూడా వీలైనంత ప్రామాణికంగా తీసేందుకు దర్శక, నిర్మాతలు
 సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది.  

‘‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే
 ఉంటుంది’’ అని ‘కంచె’లో ఒక డైలాగ్. నిజమే... సినిమా మీద 
ప్రేమ - బాక్సాఫీస్ యుద్ధంలోనూ ఉంటుంది. కోట్లఖర్చుతో చేసే
 సాహసం కాబట్టి, అది అక్షరాలా యుద్ధంలానే ఉంటుంది. 
సెకండ్ వరల్డ్‌వార్ నేపథ్యంలో క్రిష్ ఇప్పుడా యుద్ధం చేశారు. 
సినిమాపై ప్రేమ ఉన్న సగటు ప్రేక్షకులు ఈ సృజనాత్మక దర్శకుడి
 భావావేశాన్ని బాక్సాఫీస్ కంచె దాటిస్తారా?

 -  రెంటాల జయదేవ
 ...........................................
- జార్జియాలో వార్ సీన్స్ తీశారు. 
- హీరోయిన్ గెటప్‌కి రాణి గాయత్రీ దేవిని రిఫరెన్స్‌గా తీసుకున్నారు. 
- క్రిష్ హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చేసినప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ 
ఆడి షన్స్‌కెళ్లారు. ఇప్పుడీ పాత్ర దక్కింది. 
{పీ ప్రొడక్షన్‌కి 6 నెలలు శ్రమించారు.  షూటింగ్ డేస్ మాత్రం 55 రోజులే. 
-   సినిమా బడ్జెట్ దాదాపు 19 కోట్లు
.............................................................
(Published in 'Sakshi' daily, 24th Oct 2015, Saturday)

...................................

Tuesday, October 20, 2015

Why 'Indra... The Tiger' is a permanent fixture on Indian television

  • Saudamini Jain, Hindustan Times
  •  |  
  • Updated: Mar 07, 2015 18:08 IST



http://www.hindustantimes.com/Images/popup/2015/3/0803brpg6a.jpg



The film opens with death and unrest. A village in Andhra Pradesh 
is caught in turmoil caused by its two feuding families. They 
decide to end war with a wedding.



A red wedding: the bride poisons the groom on their first night 
together; her father murders all the men in his family. Indrasen 
must take over as head of this unfortunate family: the young 
schoolboy with a fierce temper is now the village headman.


How many times have you watched Indra The Tiger? For a 
decade now, the Telugu blockbuster Indra dubbed in Hindi as Indra 
The Tiger seems to have become a permanent fixture on TV. 


It was, we always assumed, a blip. Some sadist schedulers playing a joke on national audiences. Because Indra seemed to be on TV on some channel or the other at any given point in time. Saturday night, Sunday afternoon, you name it, there it was: a Telugu action film we never watched. 



So here’s something you may not know: when it was released in 2002, Indra the Tiger grossed more on the box office than any Telegu film before it. "It was about Rs 40-45 crore, almost twice as much as any other hit film usually made," says C Ashwini Dutt, the film’s producer. In the same year in Bollywood, Devdas, the top grosser, made just Rs 34 crore (though figures vary between Rs 24 crore and Rs 34 crore) in comparison. 



In Telugu cinema, it resurrected actor Chiranjeevi, whose career had started to wobble by the late 1990s. "He had quite a bit of competition from Junior NTR, the grandson of great NTR," says film journalist Rentala Jayadeva, referring to Telugu cinema legend and former chief minister of Andhra Pradesh, NT Rama Rao and his grandson. 



"Factionism is a hit formula in Telugu cinema, particularly with Rayalseema as a backdrop. And Chiranjeevi attempted this formula to catapult his career," he says. 



"Rayalseema is an arid area, with high water scarcity. The plot revolved around people praying for more water. And here is Chiranjeevi, for the first time enacting the leader of a faction. He’s all for people and against bloodshed. The film was bound to be a hit."



It has all the masala: the hero with superhero abilities, a cause, lots of action, many, many songs, and a Bollywood actress (Sonali Bendre) for glamour. And it is partly set in Varanasi. 



http://www.hindustantimes.com/Images/popup/2015/3/0803brpg8b.jpg

Ladies’ man: Chiranjeevi with Aarthi Agarwal in Indra

It is, if you set your pretentions aside, a rather enjoyable film. And if you don’t, the dubbed version has gems such as these: (the other female lead, Aarthi Agarwal, to Chiranjeevi):

Tumhaari nazrein mujhe bohot pasand aayien.

Greek shilp mein jaise banaaya ye figure pasand aaya.

Teri chaal mein ek style hai.

Aur kya boloon?

Totally teri body mein jo kuch hai, sab mujhe pasand aaya.
"When I was heading Sahara One (in 2010-11)," says TV and film writer Mushtaq Sheikh, "we had these perpetual, evergreen films: whenever you needed ratings, you could close your eyes and screen them. Indra was one of them."



Other films give channels high ratings too: the YRF films, the Karan Johar films, the SRK films. But if you watch a film repeatedly, you will know its scenes by heart. 



So, "the time spent by the audience on these movies is diminishing over the years," says Sheikh. "But this logic escapes Indra. This movie is so engaging and so bizarre… it still gives you numbers. How can something break all rules? Movie making is uncertain, but Indra The Tiger is not. It is the answer to everything." The beginningFor years, south Indian movies (mostly Tamil hits) dubbed in Hindi had been successful in theatres. Roja (1992) and Bombay (1995) did very well at the box office. 



"But this hadn’t been attempted on TV. We started the trend," says Udayan Shukla, the programming head at Sony Max. "These films work with all kinds of audiences. [National] audiences relate to them – we’ve had a history of south Indian producers making blockbuster Hindi hits in the ’80s: Himmatwala, Sooryavansham…" 



Sooryavansham is the Amitabh Bachchan film that could give stiff competition to Indra for being aired the most. The other is Nayak, the one where Anil Kapoor plays an aam addmi chief minister. It was a bizarre film, more so since it came a decade before Arvind Kejriwal appeared on the scene to play it out in real life. 



http://www.hindustantimes.com/Images/popup/2015/3/0803brpg8c.jpg

On loop: Sooryavansham is the Amitabh Bachchan film that could give stiff competition to Indra for being aired the most. The other is Nayak, where Anil Kapoor plays an aam addmi chief minister 

“We have a large library – of 1,500 films, but only 250-400 films resonate with the audiences,” says Shukla. This arrangement worked out fine when there were three Hindi movie channels, but now there are about a dozen and all play the same films.

It would still work out if you weren’t subjected to them on Saturday evenings when you have absolutely no plans, but, says Mushtaq Sheikh, the best films are reserved for, say, January 26 and Diwali and Holi... you still have a lot of primetime slots to fill. And to push numbers, “you have to show the films that you know will do well,” he says.

We’re surpised when the film is not playing on television.

The strange thing is that both Set Max and Star Gold claimed to have not shown the film since 2011. Yet, we remember watching it after 2011 on the two channels – in the last year too. Twitter is full of jokes about the film being every movie channel’s favourite film, because “Indra the Tiger is no longer a movie. It’s a channel.”

Now though, you will find it playing on Sahara One and Filmy: both, however, declined to comment on the film.
A remake?This makes one wonder why the film hasn’t been remade in Hindi. In 2012, there were rumours that Sanjay Leela Bhansali had acquired the rights and was going to make it with Akshay Kumar in the lead. But as it turns out, Bhansali and Kumar were actually working on the remake of the Tamil film Ramana, to be released this year.

Ashwini Dutt, Indra’s producer (he also produced Jaani Dost, the hit 1980s film starring Dharmendra, Jeetendra, Parveen Babi and Sridevi) has been constantly trying to make it in Hindi. “I offered Prabhudeva the direction also,” he says.

“I keep telling dad, it’s high time we made it in Hindi,” says Dutt’s daughter, Swapna. “There have been a lot of calls from Bollywood, but each person wants to make the film on their own, whereas we want to co-produce it. So that’s where it’s got stuck,” she says. “And we need a big hero. I want Salman Khan!”

Is Salman listening?

Follow @SaudaminiJain on twitter

From HT Brunch, March 8
Follow us on twitter.com/HTBrunch
Connect with us on facebook.com/hindustantimesbrunch

Friday, October 16, 2015

ఫ్యామిలీ సెంటిమెంట్‌కీ... మాస్ యాక్షన్‌కీ... మధ్య ఊగిసలాట (సినిమా రివ్యూ - బ్రూస్‌లీ... ది ఫైటర్)

 .............................................
 చిత్రం - బ్రూస్‌లీ... ది ఫైటర్, తారాగణం - రామ్‌చరణ్, చిరంజీవి (అతిథి పాత్ర), రకుల్‌ప్రీత్ సింగ్, కృతీ కర్బందా, రావు రమేశ్, ‘మిర్చి’ సంపత్, నదియా, బ్రహ్మానందం, టిస్కా చోప్రా, మాటలు - కోన వెంకట్ - గోపీమోహన్, పాటలు - రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, సంగీతం - ఎస్.ఎస్. తమన్, కెమేరా - మనోజ్ పరమహంస, ఆర్ట్ - నారాయణరెడ్డి, ఫైట్స్ - అనల్ అరసు, రామ్-లక్ష్మణ్, విజయ్,ఎడిటింగ్ - ఎం.ఆర్. వర్మ, నిర్మాత - డి.వి.వి. దానయ్య, ఒరిజినల్ స్టోరీ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - శ్రీను వైట్ల
 .............................................

 విషయంతో సంబంధం లేకుండా వినోదంతో మెప్పించే ప్రతిభావంతుడనే పేరున్న దర్శకుడు - శ్రీను వైట్ల. ఫైట్లు, డ్యాన్స్‌లు చితగ్గొట్టేసి, ఫ్యాన్స్‌తో ఈలలేసి, గోల చేయించే హీరో - రామ్‌చరణ్. ఈ కాంబినేషన్‌కు బోలెడంతమంది కమెడియన్లు, సవాలక్ష విలన్లు, సుపరిచితులైన పెద్ద ఆర్టిస్టులు - ఇలా చాలామంది తెరపై కలిస్తే? అలుపెరుగని షూటింగ్‌తో ఆరు నెలల్లో భారీ ఖర్చుతో ఒక సినిమాను సిద్ధం చేస్తే? అందులోనూ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఉన్న కథంటే? రామ్‌చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’ సినిమా గురించి ఇవన్నీ విన్నప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమనే అందరూ అంచనాలు పెట్టుకొంటే తప్పు లేదు.

 మాస్ యాక్షన్‌తో... అక్కా తమ్ముళ్ళ అనుబంధం
  కథగా చెప్పాలంటే - రామచంద్రరావు (రావు రమేశ్, పవిత్రా లోకేశ్) దంపతులది మధ్యతరగతి కుటుంబం. వసుంధరా ల్యాబ్స్‌లో పనిచేస్తున్న రామచంద్రరావు తాను కాలేకపోయినా, కనీసం తన పిల్లాడైనా ఐ.ఏ.ఎస్. అవ్వాలనుకుంటాడు. కొడుకు కోసం కూతురి చదువును కూడా అశ్రద్ధ చేయబోతాడు. కానీ, అక్కకు చదువు మీద ఉన్న ఆరాటం చూసి, తమ్ముడు త్యాగం చేస్తాడు. అలా తమ్ముడు కార్తీక్ (రామ్‌చరణ్) సినిమాల్లో స్టంట్ మ్యాన్‌గా మారి, అక్క కావ్య (కృతీ కర్బందా) ఐ.ఏ.ఎస్. అవడానికి అన్ని విధాలుగా సహకరిస్తుంటాడు. అయితే, తాను చేస్తున్న సాయం కూడా తండ్రికి తెలియకుండా చేస్తుంటాడు. గేమింగ్ డెవలపర్ అయిన హీరోయిన్ రియా (రకుల్‌ప్రీత్ సింగ్) హీరోను చూసి, పోలీసనుకొని ప్రేమిస్తుంది. హీరో కూడా ఆమె ప్రేమలో పడతాడు. మరోపక్క హీరో తండ్రి పని చేసే సంస్థ ఓనర్ ‘పద్మశ్రీ’ జయరాజ్ (‘మిర్చి’ సంపత్), ఆయన భార్య వసుంధరా దేవి (నదియా) తమ కొడుకును హీరో అక్కకిచ్చి పెళ్ళి చేయాలని భావిస్తారు. అనుకోకుండా ఒక డ్రగ్ మాఫియా వ్యవహారంలో దీపక్‌రాజ్ (అరుణ్ విజయ్) మోసానికి అక్క గురైనట్లు హీరోకు తెలుస్తుంది. దాంతో, అతణ్ణి ఢీ కొంటాడు హీరో. చిత్తుగా కొట్టి, కోమాలో పడేటట్లు చేస్తాడు.
  సెకండాఫ్ మొదలయ్యాక, ఈ దీపక్‌రాజ్ అసలు కథ బయటకొస్తుంది. జయరాజ్ ఒక మేక వన్నె పులి అనీ, అతనికి అంతకు ముందే మాలిని (టిస్కా చోప్రా) అనే మరొకరితో పెళ్ళి అయిందనీ, వాళ్ళకు పుట్టిన బిడ్డ దీపక్‌రాజ్ అనీ, ఆస్తి కోసం అతను వసుంధర భర్తగా ఉన్నాడనీ బయటపడుతుంది. ఆ తరువాత హీరో తెలివిగా ఆ సంగతి వసుంధరకు తెలిసేలా చేయడం, విలన్ ఆట కట్టించడం ఓపికగా చూడాల్సిన మిగతా సినిమా.
  
 తెర నిండా తారలే!
  కార్తీక్ పాత్రలో రామ్ చరణ్ ఎప్పటి లానే తన డ్యాన్సులు, ఫైట్లతో అలరించారు. ఆంగికం, వాచికాల్లో కూడా సినిమా సినిమాకూ తనను తాను మెరుగుపరుచుకుంటున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం యువతరంలో క్రేజున్న కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఇందులో సిన్సియర్ పోలీసంటే పడి చచ్చే గేమింగ్ డెవలపర్ రియా పాత్రలో కనిపించారు. ఆమె అభినయం కన్నా అందానికి పెద్ద పీట వేసిన సినిమా ఇది. హీరో అక్కగా కృతీ కర్బందా పోషించిన పాత్ర కథాపరంగా మంచిదైనా, కథనంలో దాన్ని ఉపయోగించుకున్న సీన్లు చాలా తక్కువ. దాంతో, ప్రస్తుతం కన్నడంలో పేరున్న హీరోయిన్ అయిన కృతి యాక్టింగ్ టాలెంట్ పెద్దగా బయటపడలేదు. ఇక, హీరో తండ్రిగా రావు రమేశ్, ఇంకా నదియా, ‘మిర్చి’ సంపత్, ముఖేశ్ ఋషి, శాయాజీ షిండే - ఇలా ఎటుచూసినా తెర నిండా తారలున్నారు. వాళ్ళవన్నీ స్క్రిప్ట్‌కు లోబడిన పరిమిత పాత్రచిత్రణలే అయినా, కథకు వెన్నుదన్నుగా ప్యాడింగ్‌కు ఉపయోగపడ్డారు.
  సినిమాలో వినోదం కోసం హీరో పక్కనే సప్తగిరి, జయప్రకాశ్‌రెడ్డి, సినిమాలో వచ్చే సినిమా హీరోగా బ్లాక్‌బస్టర్ బ్రహ్మాజీ పాత్రలో బ్రహ్మాజీ, విలన్ పక్కనే ‘వెన్నెల’ కిశోర్, థర్టీ ఇయర్స్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి - ఇలా బోలెడంత మంది ఉన్నారు. వీళ్ళందరికి తోడు సెకండాఫ్‌లో వచ్చే సుజుకీ సుబ్రహ్మణ్యం అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం నవ్విస్తారు. ఒకే ఒక్క సీన్‌లో వచ్చే ఆమిర్‌ఖాన్ ‘పీకే’ తరహా పాత్రలో అలీ కనిపిస్తారు. అయితే, వీళ్ళందరూ కాలక్షేపానికి పనికొచ్చిన కరివేపాకులే.

 చిరు... పాత్ర! భారీ సందడి!!
  చాలా కాలం విరామం తరువాత చిరంజీవి తెరపై కనిపించిన సినిమా ఇది. కెరీర్‌లో ఇప్పటి దాకా ఆయన తెరపై కనిపించిన సినిమాలన్నీ లెక్కేసుకుంటే, వరుసలో ఇదే 150వ సినిమా. కొత్త సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్న సినిమా హీరో చిరంజీవిగా నిజజీవిత పాత్రలోనే ఆయన కనిపించారు. ఈ స్పెషల్ గెస్ట్ అప్పీయరెన్స్‌తోనే 150వ సినిమా మైలురాయి చేరుకున్నారు. క్లైమాక్స్‌లో హఠాత్తుగా ఆకాశంలో నుంచి హెలికాప్టర్‌లో దిగే చిరు కనిపించేది మూడు, నాలుగు నిమిషాలే అయినా అభిమానులకు అది పండగే. సొగసుగా నాలుగైదు పంచ్‌లు విసిరి, రౌడీలను చితగ్గొట్టి, హీరోయిన్‌కు కన్నుగీటి, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారంటూ గుర్రపుస్వారీ చేస్తూ వెళ్ళిపోయే క్షణాలు కడుపు నింపకపోయినా, కనువిందు చేస్తాయి. ‘లాస్ట్ మినిట్‌లో వచ్చి కాపాడారు’ అంటూ చిరును ఉద్దేశించి హీరో చెప్పే డైలాగ్ అర్థవంతమైనదనిపిస్తుంది. ఈ ఫైట్‌తో పాటు చిరంజీవి డ్యాన్స్ కూడా చేసేస్తే, అభిమానుల ఆకలి, బాక్సాఫీస్ కోరిక తీరేదేమో! కానీ, దాని కోసం చిరు పూర్తిస్థాయి వేషం వేసే 151వ సినిమా దాకా ఆగాల్సిందే!

 టెక్నీషియన్ల వర్క్ పుష్కలం
  నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్న ‘బ్రూస్‌లీ’లో పాటలు, ఫైట్ల కోసం చాలానే ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తూనే ఉంటుంది. ఇక, తమన్ తనదైన పద్ధతిలో బీట్ ప్రధానంగా కట్టిన బాణీల్లో మాటలెలా ఉన్నా, వాద్యాల మోత భేషుగ్గా వినిపిస్తూ ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే ‘లే చలో...’, మాస్ బీట్‌లో ఐటమ్ సాంగ్‌ను తలపించే టైటిల్‌సాంగ్ ‘బ్రూస్‌లీ...’ లాంటి ఒకటి రెండు మాస్‌ను ఆకట్టుకోవచ్చు. ‘ఏం మాయ చేశావే’తో మొదలుపెట్టి ‘రేసుగుర్రం’, ‘కిక్-2’ మీదుగా ఇప్పుడీ చిత్రానికి ఛాయాగ్రహణం వహించిన మనోజ్ పరమహంస రాను రానూ కాస్ట్‌లీ కెమేరామన్ అయ్యాడనిపిస్తుంది. తెరపై సీనిక్ బ్యూటీ కోసం బోలెడంత లైటింగ్ వాడిన ఆయన ఆ హడావిడిలో పడి, ప్రధాన పాత్రధారుల ఏ క్లోజప్, ఏ ప్రొఫైల్ అందంగా ఉంటుందో గుర్తించి, బాగా వాడడం మర్చిపోయినట్లున్నారు. సినిమాలో హీరో స్టంట్‌మ్యాన్ కావడంతో ఒకరికి నలుగురు ఫైట్ మాస్టర్లతో ఫైట్స్ కంపోజ్ చేయించారు. ప్రీ - ఇంటర్వెల్, ప్రీ - క్లైమాక్స్ ఫైట్స్ లాంటివి మాస్‌ను మెప్పిస్తాయి.

 ఎలా ఉందంటే...
  కథ, పాత్రల్ని బట్టి చూస్తే ఇది ఫ్యామిలీ సినిమానే! పిల్లల్ని ఐ.ఏ.ఎస్.లను చేయాలనుకొనే తండ్రి... ఇంట్లో ఒకరినే మంచి చదువు చదివించే స్థోమతే తండ్రికి ఉందని చిన్నతనంలోనే అర్థం చేసుకున్న కొడుకు... అక్క మీద ప్రేమతో ఆమెను ఐ.ఏ.ఎస్. చేయడానికి, చిన్నప్పుడే తన చదువును త్యాగం చేసే తమ్ముడు... డబ్బు కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం ఎంతకైనా తెగించే ఒక యజమాని... ఇలాంటి పాత్రలు చాలా ఉన్నాయి. కానీ, అక్కాతమ్ముళ్ళ అనుబంధం, తండ్రీ బిడ్డల ప్రేమ లాంటి సెంటిమెంటల్ అంశాల మీద మరికొంత శ్రద్ధ పెడితే, కథ మరోలా ఉండేది. కానీ, ఎందుకనో ఆ పార్ట్‌ను అర్ధంతరంగా వదిలేసి, మాస్ యాక్షన్ వైపు దర్శక, రచయితలు మొగ్గారు.
  ఫస్టాఫ్‌లో కాసేపటికే క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ అయిపోయినా, హీరో పోలీసని హీరోయిన్ భ్రమపడే సీన్ల హంగామాతోనే చాలాసేపు గడిచిపోతుంది. తీరా ఇంటర్వెల్‌కు ముందు క్లైమాక్స్ అంత ఫైట్‌తో విలన్ విషయం బయటకొస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే చెట్టంత కొడుకు (రవిప్రకాశ్) కనిపించకుండా పోయి, వారాలు గడుస్తున్నా హీరో పెదనాన్న పాత్ర (తనికెళ్ళ భరణి) కానీ, ఇతర పాత్రలు కానీ దాని గురించి పెద్దగా చింత పడినట్లు కనిపించదు. హీరో చెల్లెలి పెళ్ళి పనుల హడావిడిలో ఉన్నారనుకోవాలి. సినిమాలో ఒక హీరోను ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా కన్‌ఫ్యూజ్ అవడం, ఒకే పోలికలతో ఒకరికి ఇద్దరు జయప్రకాశ్‌రెడ్లు (ఒకరు ఫైట్ మాస్టర్ డేవిడ్‌గా, మరొకరు ఇన్‌స్పెక్టర్ రామ్‌జీగా) ఉండడం - లాంటి పాత కమర్షియల్ ఫార్ములా అంశాలూ ఉన్నాయి.
  సెకండాఫ్ మొదలైన కాసేపటికే విలన్ ఎవరు, ఏమిటన్న వ్యవహారమంతా అటు హీరోకూ, ఇటు ప్రేక్షకులకూ తెలిసిపోతుంది. ఇక, మిగిలినదంతా విలన్ ఆట హీరో ఎలా కట్టించాడన్నదే! కానీ, కీలకమైన ఆ భాగాన్ని ఆసక్తిగా నడపడంలో దర్శక, రచయితలు తడబడ్డారనిపిస్తుంది. విలన్, ప్రపంచానికి తెలియని విలన్ అసలు కొడుకు (దీపక్ రాజ్ పాత్రలో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయకుమార్ కుమారుడు అరుణ్ విజయ్), విలన్ అసలు భార్య (బాలీవుడ్ నటి టిస్కా చోప్రా)ల మధ్య వ్యవహారం కలగాపులగంగా మారింది. అంతకు ముందు దాకా మంచివాడని చూపించిన జయరాజ్ (‘మిర్చి’ సంపత్) పాత్రను విలన్‌గా మార్చినప్పుడు ఒక క్షణం షాకింగ్‌గా అనిపించినా, అతని ప్రవర్తనకు రీజనింగ్ బలంగా నాటుకోదు. అలాగే, డ్రగ్ మాఫియా, కుటుంబంలో నమ్మకద్రోహం, అంతర్జాతీయ టైస్ట్ ముఠా - ఇలా రకరకాల అంశాలు కలపడంతో విలన్ గురించి క్లారిటీ కొరవడింది. మొత్తం మీద బ్రూస్‌లీ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన రీజనేమిటో బలంగా చెప్పని ఈ సినిమా కథ, కథనం పండగ పూట పెట్టిన పచ్చడి మెతుకులే తప్ప, పలావ్ భోజనం కాలేకపోయాయి.

- రెంటాల జయదేవ 
 ...............................................

 తెర వెనుక కబుర్లు 

 - ఈ సినిమాకు మొదట్లో ‘మై నేమ్ ఈజ్ రాజు...’, ‘ది సౌండ్’ లాంటి టైటిల్స్ కూడా అనుకున్నారు. చివరకు ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’ అని ఖరారు చేశారు.
 - స్క్రిప్ట్‌లో సెకండాఫ్ చివరలో వచ్చే కీలకమైన అతిథి పాత్రకు చిరంజీవిని అడగాలనే నిర్ణయం దర్శకుడు శ్రీను వైట్లది. ఆ సంగతి
 - ‘బ్రూస్‌లీ’కి ముందు చేసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లేవు. కానీ, ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా, ఫైట్ మాస్టర్ పాత్ర చుట్టూ తిరుగుతుంది కాబట్టి, రామ్‌చరణ్ ప్రత్యేకంగా బ్యాంకాక్‌కు వెళ్ళి, నెలన్నర పాటు ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్’లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
 - ‘బ్రూస్‌లీ’ కోసం రామ్‌చరణ్ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేశారు. ఫలితంగా, ఒంటి నిండా గాయాలే!
 - సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్‌ను కూడా ముందుగా ప్రకటించేసింది - చిత్ర యూనిట్. ఇటీవలి కాలంలో ఒక పెద్ద హీరో చేసిన భారీ చిత్రానికి ఇలాంటి వ్యూహం అనుసరించడం ఇదే తొలిసారి. చెప్పిన డేట్‌కు సినిమాను సిద్ధం చేసి, రిలీజ్ చేయడానికి అందరూ శ్రమించారు. హీరో రామ్‌చరణ్ ఒక రోజు ఏకంగా 24 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొన్నారు.
 ...............................................

Wednesday, October 14, 2015

‘రుద్రమదేవి’కి సీక్వెల్!

‘రుద్రమదేవి’కి సీక్వెల్!










గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాలో ప్రధానంగా రుద్రమదేవి కథ వరకే 
చెప్పారు. అదీ ఆమె పట్టాభిషేకం వరకే సాగింది. రుద్రమదేవి జీవితంలోని
అనేక ఇతర ప్రధాన ఘట్టాలు, ఆమె తరువాత కాకతీయ సామ్రాజ్యాన్ని
 పాలించిన మహావీరుడు, ఆమె మనుమడు ప్రతాపరుద్రుడి జీవితం 
చరిత్రలో మరో పెద్ద అధ్యాయం.

చరిత్ర ప్రకారం రుద్రమదేవికి కూడా ముగ్గురూ కుమార్తెలే. మూడో 
కుమార్తె ముమ్మిడమ్మకూ, మహదేవరాజుకూ కలిగిన బిడ్డ - ప్రతాపరుద్రుడు.
ఆ బాలుణ్ణి రుద్రమదేవి దత్తత తీసుకుంది. ఆమె అనంతరం యువరాజు 
ప్రతాపరుద్రుడే రాజయ్యాడు. అతని పాలనలో కాకతీయ రాజ్యం ఉన్నత
 స్థితికి చేరింది. ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ వంశం అంతరించింది.

అన్నీ కుదిరితే... ‘ప్రతాపరుద్రుడు... ది లాస్ట్ ఎంపరర్’ పేరిట ‘రుద్రమదేవి’ 
చిత్రానికి సీక్వెల్ తీయాలని గుణశేఖర్ సంకల్పం. అందుకు తగ్గట్లే,
 ‘రుద్రమదేవి’ సినిమాను ప్రతాపరుద్రుడి ప్రస్తావనతో, ‘ప్రతాపరుద్రుడు... 
ది లాస్ట్ ఎంపరర్’ అనే టైటిల్‌ను చూపించి, ముగించడం విశేషం. దాదాపు
 80 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమా తీసిన గుణశేఖర్ ఆ సీక్వెల్ 
కూడా తీస్తే... తెలుగుజాతి చరిత్రలో కాకతీయ సామ్రాజ్య ఘట్టం మొత్తాన్నీ
 తెర కెక్కించిన ఫిల్మ్ మేకర్ అవుతారు. అదంతా, ఈ ‘రుద్రమదేవి’కి
 ప్రేక్షకాదరణను బట్టే ఉంటుంది.

........................................

Monday, October 12, 2015

చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’ కథ

చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’కథ










మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. 
తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పాలించిన ఆమె గురించి
 చరిత్రలో చాలా వివరాలున్నాయి. దర్శక - నిర్మాత గుణశేఖర్ తన రీసెర్చ్ 
బృందం సాయంతో, చరిత్రను జాగ్రత్తగా పరిశీలించి ‘రుద్రమదేవి’ సినిమా
 తీశారు. ప్రముఖ చారిత్రక పరిశోధకులు - పండితులు ముదిగొండ
శివప్రసాద్, రచయితలు విపంచి (తోట ప్రసాద్), ఎమ్బీయస్ ప్రసాద్, 
మధుబాబు తదితరులు పురాతన గ్రంథాలు, శాసనాల
 ఆధారంగా స్క్రిప్టు రచనకు సహకరించారు. అక్కడక్కడా
 సినిమాకు కావాల్సిన స్వాతంత్య్రం తీసుకున్నా... ప్రధానంగా
 చరిత్రకు కట్టుబడే ఈ సినిమాను తీసినట్లు గుణశేఖర్ ప్రకటించారు.

ఇంతకీ  చరిత్రలో ఏముందంటే...
తెలుగుదేశ చరిత్రలోనే కాదు... యావత్ దక్షిణదేశ చరిత్రలోనే
 ఒక ప్రముఖ ఘట్టం - కాకతీయ యుగం. మన తెలుగు జాతి 
చరిత్రను గమనిస్తే - కాకతీయ సామ్రాజ్యం, కాకతీయుల పాలన
 ఒక స్వర్ణయుగం. శాతవాహనుల తరువాత తెలుగు దేశాన్నీ, 
జాతినీ ఒక్క తాటి మీదకు తెచ్చిన రాజవంశీయులు కాకతీయులు. 
సుమారు మూడు శతాబ్దాలు వారు తెలుగునాడు మొత్తాన్నీ ఒకే 
పరిపాలన కిందకు తెచ్చి, పటిష్ఠమైన పాలన అందించి, ప్రాంతీయ,
 రాజకీయ అభిమానాల్ని తొలగించారు.

ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల లాగా, దక్షిణ భారతంలో
 హైందవ సంస్కృతీ పరిరక్షణకు ప్రాణాలొడ్డింది వారే. తమ
 తరువాత వచ్చిన రెడ్డి రాజులకూ, విజయనగర పాలకులకూ
 వారే మార్గదర్శకులు. అప్పట్లో ‘ఆంధ్రనగరి’గా పేరొందిన
 ఓరుగల్లు (ఇప్పటి వరంగల్) రాజధానిగా ఒరిస్సా నుంచి 
కర్ణాటక, తమిళనాడు, కేరళ దాకా కాకతీయుల పాలన
 విస్తరించింది. అలాంటి కాకతీయ సామ్రాజ్యంలో పేరున్న
 పరిపాలకురాలు - రుద్రమదేవి.

రుద్రమదేవికి ముందు...
రుద్రమదేవికి ముందు ప్రసిద్ధులైన కాకతీయుల్లో 
మహాప్రరాక్రమశాలి, రాజనీతిజ్ఞుడు రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 1195)
 మొదటివాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని నిజంగా స్థాపించింది 
ఆయనే. పల్నాటి యుద్ధంలో నలగామునికి సాయం చేసింది
 ఈ కాకతి రుద్రుడే. ఆయన విజయయాత్రల వల్లే మొత్తం 
తెలంగాణ, కోస్తా ఆంధ్ర దేశమంతా కాకతీయుల వశమైంది. 
రుద్రదేవుడికి పిల్లలు లేకపోవడం వల్ల సోదరుడు 
మహదేవుడు రాజయ్యాడు. కానీ, నాలుగేళ్ళకే మరణించాడు. 
అటు తరువాత మహదేవుడి కుమారుడు 
గణపతి దేవుడు (క్రీ.శ. 1199 - 1262) రాజయ్యాడు.

విపత్కర పరిస్థితుల్లో రాజ్యాధికారం సంక్రమించిన 
గణపతిదేవుడు మహావీరుడు, రాజనీతిపరుడు. దాయాదుల
 దండయాత్రతో అధికారం కోల్పోయిన నెల్లూరు తెలుగు 
చోడరాజ్యాధిపతి మనుమసిద్ధి అప్పట్లో గణపతిదేవుని 
సాయం కోరాడు. ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజిని 
రాయబారిగా పంపాడు. అప్పుడు గణపతిదేవుడే స్వయంగా
 సైన్యంతో వెళ్ళి, శత్రువుల్ని ఓడించి, మనుమసిద్ధిని
 సింహాసనం ఎక్కించాడు.

అధికారం చేపట్టిన తొలి మహిళ
తెలుగు రాజ్య సమైక్యతను సాధించిన గణపతిదేవుడికి 
కుమారులు లేరు. దాంతో, రెండో కూతురైన రుద్రమదేవికి
 వీరోచిత విద్యలు నేర్పి, వారసురాలిగా ప్రకటించాడు. ఆ
 ఏర్పాటు రాజవంశీకులకు నచ్చలేదు. వాళ్ళు
తిరుగుబాటు చేశారు. అయినా, రుద్రమదేవి రాజ్యాధికారం
 స్వీకరించింది.

మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. 
ఆమె కష్టాలకు అదే కారణమైంది. ఈ ఆధునిక 21వ శతాబ్దంలోనే
 మహిళలకు రాజ్యాధికారం ఇవ్వడానికీ, ‘మహిళా రిజర్వేషన్
 బిల్లు’కు దిక్కూ దివాణం లేకపోతే, దాదాపు 750 ఏళ్ళ క్రితం
 పురుషాధిక్యతకు ఎదురే లేని ఆ కాలంలో ఆమె ఎన్ని కష్టాలు
 ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె
 పాలనా కాలమంతా ప్రధానంగా యుద్ధాలతో గడిచిపోయింది. 
పలువురు సామంతులు తిరుగుబాటు చేసి, స్వాతంత్య్రం 
ప్రకటించుకున్నారు.

రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడాన్ని దాయాదులైన హరహర,
 మురారిదేవులు ప్రతిఘటించారు. తిరుగుబాటు చేశారు. కానీ,
 విశ్వాసపాత్రులైన రేచర్ల ప్రసాదిత్యుడు, కాయస్థ జన్నిగదేవుడు,
 గోన గన్నారెడ్డి మొదలైన సేనానుల సాయంతో తిరుగుబాటును 
ఆమె అణచివేసింది. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు 
(ఆనాటి నిరవద్యప్రోలు) పాలకుడైన చాళుక్య వీరభద్రుడికీ,
 రుద్రమదేవికీ వివాహం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

విదేశీయులూ మెచ్చిన పాలన!
నిరంతరం యుద్ధాల్లో మునిగితేలినా, పరిపాలనను రుద్రమదేవి
 నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లును శత్రు దుర్భేద్యం చేయడానికి 
మట్టి కోటకు కందకాలు, బురుజులు నిర్మించింది. రాతికోటను
 పటిష్ఠం చేసింది. ఇటలీ దేశ నౌకా యాత్రికుడైన మార్కోపోలో 
ఆమె పాలనా కాలంలోనే తెలుగునాడును సందర్శించాడు. 
దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందనీ, పరిశ్రమలు - వాణిజ్యం 
ఉన్నత స్థితిలో ఉన్నాయనీ, దేశం సుభిక్షంగా ఉందని చెప్పాడు. 
అంతేకాకుండా, రుద్రమదేవిని గొప్ప వ్యక్తిగా కీర్తించాడు. మహమ్మదీయ
 చరిత్రకారులైన అమీర్ ఖుస్రూ, బర్నీ రచనలు కూడా కాకతీయుల 
కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తాయి.

రుద్రమదేవి తరువాత...
రుద్రమదేవికి కూడా ముగ్గురూ కుమార్తెలే. మూడో కుమార్తె
 ముమ్మిడమ్మకూ, మహదేవరాజుకూ కలిగిన బిడ్డ - ప్రతాపరుద్రుడు.
 ఆ బాలుణ్ణి రుద్రమదేవి దత్తత తీసుకుంది. ఆమె అనంతరం 
యువరాజు ప్రతాపరుద్రుడే రాజయ్యాడు. అతని పాలనలో 
కాకతీయ రాజ్యం ఉన్నత స్థితికి చేరింది. ప్రతాపరుద్రుని తరువాత
 కాకతీయ వంశం అంతరించింది. తెలుగునేల తురుష్కుల
 పాలనలోకి వచ్చింది. ‘ఆంధ్రనగరి’గా పేరున్న ఓరుగల్లు 
కాస్తా సుల్తాన్‌పూర్‌గా మారింది.

ప్రసిద్ధ నిర్మాణాలు...  ప్రముఖమైన రచనలు...
రాయచూరు, రాచకొండ, గోల్కొండ, దేవరకొండ దుర్గాలు, మూడు
 రక్షణ శ్రేణులతో కూడిన ఓరుగల్లు కోట కాకతీయుల నిర్మాణ 
కౌశలానికి నిదర్శనం. హనుమకొండలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు,
 సూర్యుడు ప్రతిష్ఠితులై, త్రికూటాలయంగా విలసిల్లిన వేయిస్తంభాల
 గుడి, వివిధ శిల్పాలతో అలంకరించిన స్తంభాలు, (కాకతీయుల)
 తోరణ స్తంభాలు వారు కట్టించినవే. రామప్ప చెరువుతో సహా
 వాళ్ళు తవ్వించిన తటాకాలు ఎన్నో.

అలాగే, విజయనగర రాజుల కాలం నాటి తెలుగు సాహిత్య 
స్వర్ణయుగానికి కాకతీయుల కాలంలోనే పునాది పడింది. 
మొదట జైన మతం, ఆ తరువాత వీరశైవం, వైష్ణవమతం 
అభివృద్ధి చెందిన ఆ రోజుల్లోనే శైవ కవులైన పండితారాధ్యుడు, 
పాల్కురికి సోమన తెలుగులో రచనలు చేశారు. కేతన రాసిన 
తెలుగు వ్యాకరణ గ్రంథం ‘ఆంధ్ర భాషా భూషణం’, బద్దెన రాసిన
 సుమతీ శతకం, తిక్కన మహాభారత అనువాదం, వినుకొండ
 వల్లభరాయుడి ‘క్రీడాభిరామం’ లాంటివన్నీ అప్పుడు వచ్చిన 
రచనలే. అలా తెలుగుభాషాభివృద్ధికి కాకతీయులు చేసిన సేవ 
విశిష్టమైనది.

-  రెంటాల జయదేవ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,