జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, October 9, 2015

నాకు నేను... ‘సో క్యూట్’ అనుకున్నా! - అనుష్క (ప్రత్యేక ఇంటర్వ్యూ)అనుష్క... తెర మీద సూపర్‌స్టార్. తెర వెనుక ముద్దుగా... ‘స్వీటీ’.
 మాట తీరులో, మనిషి నడతలో ఎక్కడా సగటు సినిమా స్టార్‌ల తాలూకు 
హిపోక్రసీ లేని అసలు సిసలు స్వీటీ. అక్టోబర్ 9 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 3డీలో అలరించనున్న అభినవ 
‘రుద్రమదేవి’. ఆ చిత్ర ప్రమోషన్‌కి చెన్నై, బొంబాయిల మధ్య టూర్స్‌తో ఆమె
 బిజీ బిజీ. ఆ క్రమంలో హఠాత్తుగా జూబ్లీహిల్స్ ‘యునెటైడ్ కిచెన్‌‌స ఆఫ్ ఇండియా’లో 
తారసపడ్డారు. అందమంటే, మానసిక - శారీరక ఆరోగ్యాలు రెండూ అనే ఈ మాజీ 
యోగా టీచర్ అచ్చమైన గోలీ సోడాను ఆస్వాదిస్తూ మామూలు మధ్యతరగతి 
అమ్మాయిలా కనిపించారు. ‘సైజ్ జీరో’ కోసం పెరిగిన బరువును ఇప్పుడు తగ్గించుకొనే 
పనిలో ఉన్నా, చిన్నప్పటి గోలీ సోడా ఆనందాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక, 
ఆరెంజ్ రంగు గోలీసోడా రెండోది లాగిస్తూ, రీల్ లైఫ్ ‘రుద్రమదేవి’ నుంచి తన 
రియల్ లైఫ్ ఫిలాసఫీ దాకా అనేక విషయాలు మనసు విప్పి పంచుకున్న 
ఈ బెంగళూరు భామతో  ‘సాక్షి’ ప్రత్యేక భేటీ...


‘బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’ - వరుసగా మూడు విలక్షణప్రాజెక్ట్‌లు 
చేస్తున్న హీరోయిన్ మీరే!
 (నవ్వుతూ...) థ్యాంక్స్. ఒకేసారి ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ రావడం నా అదృష్టం.

  మేకర్స్ గుణశేఖర్, రాజమౌళితో ఒకేసారి వర్‌‌క చేయడం...?
 ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ వేర్వేరు స్కూల్స్. కానీ, ఇద్దరికీ పని మీదే ఏకాగ్రదృష్టి.
సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా ఇద్దరూ చాలా మంచి టెక్నీషియన్స్. ఒకేసారి
 ఇద్దరితో కలసి పనిచేయడం బాగుంది.

  ముందుగా ఏ సినిమా ఆఫర్ వచ్చింది?
 సరిగ్గా గుర్తులేదు. ‘రుద్రమదేవి’ అనుకుంటా. దాదాపు అప్పుడే ‘బాహుబలి’
ఆఫర్. రెండూ ఒప్పుకున్నా.

  ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారడం కష్టమనిపించలేదా?
 బేసిక్‌గా అయామ్ ఎ డెరైక్టర్స్ యాక్టర్. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని
చేస్తుంటాను. సెట్స్‌కు వెళ్ళగానే ఐ విల్ స్విచ్చాన్ విత్ డెరైక్టర్. స్విచ్చాఫ్
 విత్ డెరైక్టర్. నిజానికి, ఇప్పటికీ నేను నటన నేర్చుకొంటున్నా.

  నిజంగానే అంటున్నారా? పదేళ్ళు అయిపోయిందిగా?
 నిజమే. నాగార్జున ‘సూపర్’తో నటిగా నా జర్నీ మొదలుపెట్టి,
ఇప్పటికి పదేళ్ళయింది. ‘సూపర్’ నాటికి అసలు నటనంటే ఏమిటని
కూడా తెలీదు. నాగ్, పూరీ జగన్నాథ్ చాలా ప్రోత్సహించారు. మేకప్,
డ్యాన్స్, యాక్టింగ్ - ఇలా అన్నీ పూరీ దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి
నుంచి ఒక్కో సినిమాకు, ఒక్కో డెరైక్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నా.

  తొలి రోజుల్లో ఈ రంగం వదిలిపోదామనుకొని, చివరకింత స్టారయ్యారే!
 (ఆలోచనలోకెళుతూ...) మొదట ఏడాదిన్నర పాటు అయితే, వెళ్ళిపోవాలనే
అనుకున్నా. తరువాత కుదురుకున్నా. ఇప్పటికీ నాకు స్టిల్ కెమేరాలంటే
కూడా అయామ్ వెరీ షై. ఇప్పుడిప్పుడే ఆ సిగ్గు వదిలించుకోగలుగుతున్నా.
ఈ పదేళ్ళ సినీ అనుభవంతో నటిగానే కాదు, వ్యక్తిగానూ ఎదిగా. ఈ
రంగాన్ని వదిలేసి, పారిపోయి ఉంటే చాలా బాధపడి ఉండేదాన్ని.

  ఈ ప్రయాణంలో వ్యక్తిగా మీలో వచ్చిన మార్పు, పరిణతి ఏమిటి?
 చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో అర్థమవుతుంటుంది. ఎంత
ఎదిగినా, కాళ్ళు నేల మీదే ఉండాలనే భావన మరీ దృఢమైంది. నాతో
నేను దగ్గరగా ఉంటున్నా. నా స్నేహితులు, నా యోగా గురువు భరత్
ఠాకూర్ లాంటి నా వాళ్ళకు దగ్గరయ్యా.

  ఇక్కడకు వచ్చాక మీరు మార్చుకున్న గుణం?
 నాకో చెడ్డ అలవాటుండేది. ఫోన్ సెలైంట్ మోడ్‌లో ఉంచేదాన్ని.
ఫోన్‌కాల్స్ వచ్చినా, తీసి మాట్లాడేదాన్ని కాదు. ఏదో పని చూసుకొంటూ
ఉండేదాన్ని. దాని వల్ల నాకు ఏమైందో, ఏమిటోనని అవతలివాళ్ళు
కంగారుపడేవాళ్ళు. ఆ అలవాటు మార్చుకున్నా.

  ఫోన్లు కూడా తీయనంటున్నారు. ఎమోషనల్‌గా మీరు ఎవరి 
మీదా ఆధారపడరేమో?
 అదేమీ లేదు. ఎమోషనల్‌గా ఇతరుల మీద చాలా ఆధారపడుతుంటా.
చెన్నైలో నా మేకప్ ఉమన్ భాను, అక్కడి ఫ్రెండ్స్, నా యోగా ఫ్రెండ్స్ -
ఇలా పెద్ద లిస్టే ఉంది.

  మీకు మీరు నచ్చని సందర్భాలు ఉంటాయా?
 అయామ్ నాట్ వెరీగుడ్ ఎట్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనిపిస్తుంటుంది.
 మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు నా గురించి అన్నీ తెలుసు.
వాళ్ళతో అన్నీ పంచుకుంటా. వాళ్ళందరూ తమ కష్టాలు నాతో
చెప్పుకుంటారు. వాళ్ళ ఒత్తిడి నాకూ ఉంటుంది.

  ఒకప్పుడు యోగా టీచరైన మీకు మానసిక ఒత్తిడా?
 నేనూ మనిషినేగా! ఒత్తిడి ఉంటుంది. అయితే, విందులు,
వినోదాలు, పార్టీలకు వెళ్ళను. ఇంట్లోనే ఉంటా. నా యోగా
 ఫ్రెండ్స్ దుబాయ్, మలేసియా - ఇలా రకరకాల చోట్ల ఉన్నారు.
 టైమ్ దొరికితే, వాళ్ళను కలుస్తా.

  ‘రుద్రమదేవి’ లాంటి పాత్రలకు చాలా శారీరక శ్రమ చేస్తారు.
 షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక ఎలా ఉంటుంది?
 శారీరక శ్రమ వల్ల ఒంటి నిండా నొప్పులు, గాయాలే. షూటింగై
ఇంటికి వచ్చాక, అలసటతో పాటు, వెర్రెత్తిపోయుంటాం. అలాంటప్పుడు
నా సహాయకులతో ‘మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేద’ని కాస్తంత
మారాం చేస్తా. అలుగుతా. అలాంటప్పుడు వాళ్ళు గారం చేసి,
బుజ్జగించాలనుకుంటా. ఇంట్లో ప్రతి ఒక్కరి అటెన్షన్ నా మీదే
ఉండాలని పిచ్చిగా కోరుకుంటా. ఇప్పటికీ బెంగళూరులో మా
ఇంటికి వెళితే, అన్నయ్య రూమ్‌లో హాయిగా పడుకుంటా.
కొన్నిసార్లు ఎవరితోనూ పెద్దగా మాట్లాడను కూడా మాట్లాడను.
అయితే, నా చుట్టూ మనుషులుండాలి. వాళ్ళు మాట్లాడుకుంటూ
 ఉండాలి. అలా ఉంటే నా కిష్టం.

  చాలామందిలా మీ అమ్మ, నాన్న మీ వెంట కనిపించరే!
 వాళ్ళ జీవితం వదిలేసి, రాత్రింబగళ్ళు నా వెంటే సెట్స్‌లో ఉండి
 టైమ్ వేస్ట్ చేసుకోవడమెందుకు? పైగా, వాళ్ళుంటే వాళ్ళ
బాగోగుల మీదే నా ఫోకస్ ఉంటుందని సినిమా ఫంక్షన్లకు
 కూడా రానివ్వను. చూడాలనిపిస్తే వాళ్ళు రావడమో, నేను వెళ్ళడమో చేస్తాం.

  వరంగల్‌లో వేలమంది మధ్య ‘రుద్రమ..’ ఆడియోకు 
తొలిసారి వచ్చినట్లున్నారు!
 అది ఏదో అనుకొని కావాలని చేసింది కాదు. గుణశేఖర్ భార్య
రాగిణి గారితో సాన్నిహిత్యంతో అలా కుదిరింది. గుణశేఖర్ గారు
ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడిన ఆ ఆడియో ఫంక్షన్‌లో వేలాది జనం
 మధ్య మా అమ్మా నాన్న గురించి నేను కొంచెం ఆందోళన పడ్డాను.
 కానీ, వాళ్ళు మాత్రం ‘రుద్రమదేవి’ పాత్ర నేను పోషించినందుకు
చాలా సంతోషించారు. వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలని
ఎదురుచూస్తున్నారు.

తొలిసారిగా రుద్రమదేవి గెటప్‌లో అద్దంలో చూసుకున్నప్పుడూ,
 ట్రైలర్ ఆవిష్కరణలో ‘ఐమ్యాక్స్’ తెరపై చూసుకున్నప్పుడూ
 మీ మనసులో కలిగిన భావం?
 షూటింగ్‌లో 3 - 4 కేజీల బంగారు నగలు వేసుకున్నా. బరువైన
 కాస్ట్యూమ్స్ కూడా ధరించా. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు
నేను ‘సో క్యూట్’ అనుకున్నా. ఇక, అంత మంది ముందు, ఐమ్యాక్స్
 తెరపై చూసుకొనే ముందు కొద్దిగా టెన్షన్ ఫీలయ్యా. అలాంటి చోట్ల
ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలీదు. అందుకే, నా పక్కనే
కూర్చొన్న నా సన్నిహితుల బుర్ర తినేస్తుంటా. అందరూ
బాగుందనడంతో టెన్షన్ తీరింది.

  మీరు దేవుణ్ణి నమ్ముతారా?
 కచ్చితంగా. బేసిక్‌గా నేను గాడ్ లవింగ్ తప్ప గాడ్
 ఫియరింగ్ కాదు. గుడి, దర్గా, చర్చి - అన్నిటికీ వెళతా.
దేవుళ్ళందరిలోకీ నాకు శివుడంటే ఇష్టం. అలాగే, షిర్డీ సాయి,
 దుర్గాదేవి అంటే కూడా ఇష్టం. అయితే, పూజలు, వ్రతాలు లాంటివి
అలవాటు లేదు. అవి చేయను, తెలియదు కూడా! నాకు అనిపించినట్లు
చేస్తానే తప్ప, ఫలానాగా చేయాలని ఎవరైనా చెప్పడం నాకు ఇష్టం
ఉండదు. ఎవరైనా ఫలానా లాగా చేయాలని బలవంతపెడితే, నాలో
 ప్రతిఘటన మొదలైపోతుంది. కానీ, నేను బేసిక్‌గా ప్రకృతిని ఆరాధిస్తా.
ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేస్తా. అలాగే,
నీళ్ళు, పువ్వులు పెడతా. ఇలా గాలి, నీరు, నిప్పు లాంటి పంచభూతాలు
 మనసుకు ఆహ్లాదమిస్తాయి.

  డిఫరెంట్, సీరియస్ పాత్రల్లో ఇమిడిపోయారు. మళ్ళీ గ్లామర్
 హీరోయిన్‌గా ఎప్పుడు?
 (నవ్వేస్తూ) నాకూ ఇప్పుడలాంటి పాత్ర చేయాలని ఉంది. సీరియస్,
 గ్లామర్ పాత్రలు - రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం నాకిష్టం.
వేర్వేరు తరహా చిత్రాలు, పాత్రలు చేయాల నుంది. కానీ ముందుగా
 ప్లాన్ చేసుకోను. ఎందుకంటే, అది నాకు సూట్ కాదు. దానంతట
అది జరగాలంతే!

  అంటే, మీరు విధి మీద వదిలేస్తారన్న మాట!
 విధిని నమ్ముతాను, కానీ డెస్టినీకి వదిలేయకూడదు. మన బెస్ట్
ఇవ్వాలి. చివరకేం జరిగితే అది డెస్టినీ.

  ‘సైజ్‌జీరో’ను కూడా పోటీగా ఈ 9వ తేదీనే రిలీజ్ చేయాలని 
ఆ మధ్య కొందరు ఆలోచన చేసినట్లున్నారే?
 లేదు. ఎప్పుడూ రెండూ ఒకేరోజు రిలీజ్ అనుకో లేదు. ఒకవేళ
ఒక సినిమా రిలీజ్ కాకపోతే, రెండోదనే అనుకున్నారు. ‘సైజ్‌జీరో’ను
లేట్‌గా రిలీజ్ చేస్తారు.

  మరి సినిమాల రిలీజ్ ముందురోజు ఎలా ఉంటారు?
 నేను నటించిన ఏ సినిమాకూ ఎవరికీ నష్టం రాకూడదనుకుంటా.
రిలీజ్ ముందు రోజు చాలా నెర్వస్‌గా ఉంటుంది. ఎలా రియాక్టవాలో
 తెలీదు. స్ట్రెస్ భరించలేక అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కూర్చొని రాత్రి
మాట్లాడుతూంటా. రిలీజయ్యాక జనం మధ్య సినిమా చూస్తా.

  లేడీ ఓరియంటెడ్ ‘రుద్రమదేవి’కి రూ. 70 కోట్ల బడ్జెటని మన 
హీరోలు ఉడుక్కోరూ?
 అలా ఏమీ లేదు. రానా, ప్రభాస్, అల్లు అర్జున్ అంతా ఎంకరేజ్ చేశారు.

  రుద్రమదేవి, దేవసేన లాంటి పాత్రల్లో మీరు కాకుంటే, మరెవరిని
మీరు ఊహిస్తారు?
 నన్ను ఇలాంటి సినిమాల్లో, పాత్రల్లో ఊహించుకొని, ‘అరుంధతి’ ఛాన్స్
 ఇచ్చిన నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారికి థ్యాంక్స్. ఆయన లేకపోతే
 ఇవాళ నాకీ పాత్రలు లేవు. ఇప్పటి హీరోయిన్స్‌లో ఇలాంటి రాజసిక
పాత్రలకు నయనతార ఫేస్ సూట్ అవుతుంది.

  ‘రుద్రమదేవి’ సినిమా, పాత్ర... ఒక నటిగా సరే, ఒక వ్యక్తిగా మీకు 
ఇచ్చిందేమిటి?  
 ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. నేను చూస్తుండగానే, గుణశేఖర్ గారి
పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. పెద్దమ్మాయి నీలిమ నాకు అన్న,
 చిన్నమ్మాయి యుక్త నా తమ్ముడు.

  ‘రుద్రమదేవి’ లాంటి ఛాన్‌‌స మీకు మళ్ళీ వస్తే?
 తప్పకుండా చేస్తా! గుణశేఖర్ లాంటి క్రియేటర్స్ దగ్గర ఛాన్సొస్తే కాదంటామా!

  ‘రుద్రమదేవి’కి సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు’ తీస్తారని టాక్
 అది నాకు తెలీదు కానీ, నేను చేసిన ఏ ప్రాజెక్ట్‌కైనా సీక్వెల్ చేయమంటే,
ఆలోచించకుండా అంగీకరిస్తా. ఇలాంటి అవకాశాలు  అందరికీ రావు కదా!

  ‘రుద్రమదేవి’పై ఇప్పుడు మీ మనసులోని ఆలోచన?
 ‘రుద్రమదేవి’ కథే తప్ప, వేషభాషల లాంటి రిఫరెన్స్‌లేమీ హిస్టరీలో లేవు. పాత్రల ‘లుక్’ నుంచి అన్నీ దర్శక - నిర్మాత గుణశేఖర్ చాలా కష్టపడి రీ-క్రియేట్ చేశారు. చరిత్రను డాక్యుమెంటరీలా కాక, మంచి ఎమోషనల్ స్టోరీగా, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీశారు. చాలా ఏళ్ళుగా ఆయన కంటున్న కల ఇది. దాన్ని నిజం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి, మూడేళ్ళు శ్రమపడ్డారు. ఆయన భార్య, పిల్లలిద్దరూ కష్టపడ్డారు. ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. వాళ్ళ సపోర్ట్, చూపిన దీక్ష మర్చిపోలేను. టెక్నీషియన్లు ప్రాణం పెట్టి, నిజాయతీగా పనిచేస్తే, మరెన్నో కుటుంబాలు ఆధారపడ్డ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. తెలుగువారి చరిత్రను ప్రపంచానికి చాటిన వెండితెర కృషిగా చరిత్ర సృష్టించాలి. సినీచరిత్రలో ప్రత్యేకంగా నిలవాలి.

  - రెంటాల జయదేవ

.......................................................

0 వ్యాఖ్యలు: