జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 27, 2015

ప్రేమ... ‘కంచె’ ('కంచె' మూవీ రివ్యూ)


ప్రేమ... ‘కంచె’

పాటలు: సీతారామశాస్త్రి
కెమేరా: జ్ఞానశేఖర్
నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి, సాయిబాబు
రచన - దర్శకత్వం: క్రిష్


‘కంచె’లో... మనసు లేని ముష్కరులు కొందరు జాత్యహంకారంతో ఒక
 పసికందునూ, జాతి సంకరం చేసిన కుటుంబాన్నీ చంపబోతారు. ఆ
 కుటుంబం కోసం వాళ్ళ భాషయినా తెలియని మరో దేశపు సైనికుడు
 ప్రాణాలకు తెగిస్తాడు. నిజానికి, వాళ్ళు అతనికి ‘సోకాల్డ్’ శత్రుదేశీయులు. 
అయినా, ఎందుకు తన మిషన్‌ను పక్కనపెట్టి మరీ, వాళ్ళను కాపాడినట్లు?
 సరిహద్దనేది మనం పెట్టుకున్న కంచె. శత్రుత్వమనేది ఎవరెవరివో, ఏవేవో
 ప్రయోజనాల కోసం మనం వేసుకున్న కంచె. మానవత్వాన్ని మర్చిపోవడం
 కోసం కాదు... రేపటి ఆశను ఇవాళ బతికించుకోవడం కోసం చేయాలి
 యుద్ధం అని ఆ సంఘటన చెబుతుంది. ‘కంచె’ చిత్రంలోని
 ఉదాత్తమైన సన్నివేశాల్లో ఇది ఒకటి.

మనుషుల మధ్య, మనసుల మధ్య - కులాలు, మతాలు, డబ్బు, 
అధికారం, జాత్యహంకారం - ఇలా కనపడని కంచెలు ఎన్నెన్నో! 
విద్వేషం నిండిన సమాజంలో, మనుషుల్ని మనుషులు చంపుకొనే
 విచిత్ర రాక్షస ప్రవృత్తిలో - దేశాల మధ్యే కాదు, మన మధ్య కూడా 
ఈ కంచెల్ని కూల్చడం ఎలా? ప్రేమ ఒక్కటే దానికి పరిష్కారమని 
‘కంచె’ గుర్తు చేస్తుంది. ఇలాంటి గొప్ప సందేశం ఇచ్చింది ఏ 
ఇరానియన్ సినిమానో, ఇటాలియన్ సినిమానో అయితే, దాని గురించి
 గొప్పగా చెప్పుకొంటాం. అలాంటి సినిమాలు తీయని ‘మనవాళ్ళు వట్టి
 వెధవాయిలోయ్’ అంటాం. మరి, మన సోకాల్డ్ కమర్షియల్ సినిమా 
లెక్కలు చూసుకోకుండా, ఇలాంటి సినిమా తీసిన భావుక దర్శకుడు
 క్రిష్‌ను ఇప్పుడు ఏమనాలి?

కథగా చెప్పాలంటే... రెండో ప్రపంచ యుద్ధకాలం... తెలుగు గడ్డ మీది
 ఒక పల్లెటూరు. కోటలోని జమీందార్ గారి మనవరాలు సీత (ప్రజ్ఞా జైస్వాల్).
 పేటలో కులవృత్తిని నమ్ముకున్న కొండయ్య (గొల్లపూడి మారుతిరావు) 
మనవడు దూపాటి హరిబాబు (వరుణ్‌తేజ్). చెన్నపట్నంలో వాళ్ళిద్దరి 
స్నేహం ప్రేమ అవుతుంది. ఊరికొచ్చాక వాళ్ళ ప్రేమకు కులం, 
అంతస్థుల కంచె అడ్డమవుతుంది. సీత అన్న ఈశ్వర్ (‘చెన్నైఎక్స్‌ప్రెస్’లో
 తంగబలి పాత్రధారి నికితిన్‌ధీర్) వారి పెళ్ళికి అడ్డం తిరుగుతాడు.

కథలో ఆ తరువాత హీరోయిన్ అన్నయ్య లానే హీరో కూడా మిలటరీలో 
చేరతాడు. రెండో ప్రపంచ యుద్ధం (1939 - ’45)లో అప్పటి బ్రిటీషు 
పాలనలోని భారతీయులు జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ సైన్యంలో
 భాగమై యుద్ధం చేశారు. ఆ యుద్ధ సమయంలో హీరో యిన్ 
అన్నయ్య సహా బ్రిటన్ సైన్యంలోని ప్రధాన సైనిక ప్రధానాధికారులు
 కొందరు జర్మన్ సైనికుల చేతిలో బందీలవుతారు. మిగిలిన కొందరితో
 కలసి వాళ్ళను రక్షించడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే 
హిట్లర్ నేతృత్వంలో జర్మనీలో యూదులకూ, జర్మన్లకూ మధ్య వేసిన
 జాత్యంహకారపు కంచె హీరోకు అర్థమవుతుంది. మానవత్వానికి 
ఈ కంచెలు అడ్డు కాకూడదని హీరో అక్కడ వీరోచిత పోరాటమే
 చేస్తాడు. హీరోయిన్ అన్ననూ కాపాడతాడు. విదేశంలో సరే... 
మరి స్వదేశంలో సీతతో హీరో ప్రేమ ఏమైంది? ఊళ్ళోని జనాల్ని
 విభజిస్తున్న కంచెలు ఏమయ్యాయి? ఇదంతా తెరపై చూడాల్సిన కథ.

నటీనటుల సంగతికొస్తే... హరిబాబు పాత్రలో నాగబాబు కుమారుడైన
 హీరో వరుణ్‌తేజ్ శ్రమించారు. పాత్రలో పర కాయ ప్రవేశానికి అతను 
చేసిన కృషి, దర్శకుడి విజన్ తెలుస్తాయి. ‘మిర్చి లాంటి కుర్రాడు’లో
 పలకరించిన ప్రజ్ఞా జైస్వాల్ జమీందారీ పిల్ల సీతగా నిండుగా ఉన్నారు. 
అలాగే, ఆమె అన్న పాత్రధారి కూడా! కొండయ్యగా గొల్ల పూడి, 
బామ్మగా ‘షావుకారు’ జానకి లాంటి సీనియర్లకున్నవి కీలకంగా
 ఒకటి రెండు సీన్లయినా, అవి పండడా నికి వారి అనుభవం 
ఆలంబనయింది.

ఒకరు కాదు ముగ్గురు హీరోలు... ఈ సినిమాకు. రెండో సినిమాకే 
ఇలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకున్న కథానాయక పాత్రధారి వరుణ్‌తేజ్ 
కచ్చితంగా హీరోనే! మిగిలిన ఇద్దరూ ఎవరంటే - ఒకరు సహజంగానే 
ఈ కాన్సెప్ట్‌ను అనుకొని, భుజానికెత్తుకున్న దర్శక - నిర్మాత క్రిష్. 
మరొకరు - ఆ భావానికి భావోద్వేగభరిత గీతాల రూపమిచ్చిన 
రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘గ్యాప్ ఫిల్లర్స్’లానో,
 ఫస్టాఫ్ మూడు - సెకండాఫ్ మూడు అనే బాక్సాఫీస్ లెక్కలతో
 కాకుండా, సిచ్యుయేషన్ సాంగ్స్‌గా చిరకాలం వినిపించే లక్షణం
 ‘కంచె’ పాటలది. వాటిలోని ఆయన భావావేశానికి తడిసి ముద్దవని
 పాటల ప్రియులుండరు. ‘‘విద్వేషం పాలించే దేశం ఉంటుందా’’ లాంటి
 ఆయన ప్రశ్నలకు సమాధానం ఆలోచిస్తే, కళ్ళకు నీటి పొర, మాటకు
 గొంతు జీర అడ్డం పడతాయి. హిందీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్
 అందించిన బాణీలు, పాటల్లో ఆలాప్‌లు, ఇంటర్‌ల్యూడ్స్‌లోని 
బీజియమ్‌లు, వాద్యగోష్ఠి ప్రత్యేకంగా ధ్వనిస్తాయి. సాఫ్ట్ మెలొడీ
 ‘నిజమేననీ నమ్మనీ’ (గానం శ్రేయాఘోశల్) అందుకో ఉదాహరణ.  

సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు సినిమాలో చాలా ఘట్టాల్ని
 మామూలు కన్నా పెయైత్తున నిలబెట్టాయి. దాసు పాత్రధారి 
అవసరాల శ్రీనివాస్ ప్రస్తావించే శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
 కవితలు, పలకించిన కామెడీ ఈ సీరియస్ ఫిల్మ్‌లో కొంత రిలీఫ్. 
ఇక, తలదాచుకున్న సైనికుల్ని కాపాడే టైమ్‌లో బేకరీ తాత
 మనవరాలు చూపే త్యాగం, ఆడవాళ్ళ గర్భాన్నే వాడుకొంటున్న
 సంస్కృతి పట్ల హీరోయిన్ బామ్మ (‘షావుకారు’ జానకి) 
ఆవేదన, క్లైమాక్స్ మనసుల్ని కుదిపేస్తాయి.

మనసు పెట్టి చూడాల్సిన సినిమా ... ఇది. అందుకే, సగటు
 సినిమాల్లో ఉండే మూస ఎంటర్‌టైన్‌మెంట్‌నే వెతుక్కుంటే 
ఈ సెల్యులాయిడ్ హ్యుమానిటీ డాక్యుమెంట్‌లో అది దొరకదు.
 తీసుకున్న నేపథ్యానికి బోలెడంత రీసెర్చ్ చేసి, వార్ సీన్‌‌సను
 కూడా వీలైనంత ప్రామాణికంగా తీసేందుకు దర్శక, నిర్మాతలు
 సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది.  

‘‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే
 ఉంటుంది’’ అని ‘కంచె’లో ఒక డైలాగ్. నిజమే... సినిమా మీద 
ప్రేమ - బాక్సాఫీస్ యుద్ధంలోనూ ఉంటుంది. కోట్లఖర్చుతో చేసే
 సాహసం కాబట్టి, అది అక్షరాలా యుద్ధంలానే ఉంటుంది. 
సెకండ్ వరల్డ్‌వార్ నేపథ్యంలో క్రిష్ ఇప్పుడా యుద్ధం చేశారు. 
సినిమాపై ప్రేమ ఉన్న సగటు ప్రేక్షకులు ఈ సృజనాత్మక దర్శకుడి
 భావావేశాన్ని బాక్సాఫీస్ కంచె దాటిస్తారా?

 -  రెంటాల జయదేవ
 ...........................................
- జార్జియాలో వార్ సీన్స్ తీశారు. 
- హీరోయిన్ గెటప్‌కి రాణి గాయత్రీ దేవిని రిఫరెన్స్‌గా తీసుకున్నారు. 
- క్రిష్ హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చేసినప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ 
ఆడి షన్స్‌కెళ్లారు. ఇప్పుడీ పాత్ర దక్కింది. 
{పీ ప్రొడక్షన్‌కి 6 నెలలు శ్రమించారు.  షూటింగ్ డేస్ మాత్రం 55 రోజులే. 
-   సినిమా బడ్జెట్ దాదాపు 19 కోట్లు
.............................................................
(Published in 'Sakshi' daily, 24th Oct 2015, Saturday)

...................................

0 వ్యాఖ్యలు: