జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, October 30, 2015

లవ్... కొలంబస్ ( మూవీ రివ్యూ - కొలంబస్)

లవ్... కొలంబస్

కెమేరా: భాస్కర్ సామల, నిర్మాతలు: అశ్వనీకుమార్ సహదేవ్,
ఎస్.సి.కపాడియా, దర్శకత్వం: ఆర్.సామల


కొలంబస్... ఈ పేరు చెప్పగానే కొత్త ప్రదేశం కనిపెట్టిన నౌకాయాత్రికుడు గుర్తొస్తాడు. 
కాకపోతే, కొలంబస్ కనిపెట్టాలనుకున్నది వేరు. కనుక్కున్నది వేరు. ఇండియాను
 కనిపెట్టేందుకు ప్రయాణం మొదలుపెట్టి, చివరకు అమెరికాను కనుక్కున్నాడు. 
దీన్నే ప్రేమకు అన్వయిస్తూ అల్లుకున్న కథ - ఈ ‘కొలంబస్’ సినిమా. ఒకరి ప్రేమను 
గెల్చుకోవడానికి ప్రయత్నించిన హీరో ఆ ‘డిస్కవరింగ్ లవ్...’ జర్నీలో ఎక్కడకు 
చేరాడన్నది స్టోరీ.

కథ ఏమిటంటే... అశ్విన్ (సుమంత్ అశ్విన్) రెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. 
ఇందు (మిస్తీ చక్రవర్తి) అనే ప్రేమికురాలి పేరునూ, ఆమెతో ప్రేమనూ కలవరిస్తూ, 
పలవరిస్తుంటాడు. గమ్మత్తేమిటంటే, అసలు అతను జైలులో పడడానికే కారణం -
 ఆ ప్రేమికురాలు. జైలు నుంచి బయటికొచ్చిన హీరో తన స్నేహితులెవరూ 
తెలియదని చెప్పినా, కనిపించని హీరోయిన్ అడ్రస్, ఫోన్‌ల కోసం అన్వేషణ 
సాగిస్తుంటాడు. ఆ క్రమంలో అతనికి మరో హీరోయిన్‌తో పరిచయమవుతుంది.
 పేరు- నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్). తగాదాగా మొదలైన ఆ
పరిచయం క్రమంగా స్నేహంగా మారుతుంది. ప్రేమికురాలికి మళ్ళీ 
దగ్గరవడానికి హీరో, నీరూ సాయం తీసుకుంటాడు.
 ఫ్లాష్‌బ్యాక్‌లో ఇందుతో హీరో ప్రేమ ఒకప్పుడు దెబ్బతినడానికి 
కారణం మాజీ క్లాస్‌మేట్ వంశీ (రోషన్). ఆ కథ అంతా విన్న నీరూ, 
హీరో ప్రేమ గెలవడానికి స్నేహం కొద్దీ సాయపడడం మొదలుపెడుతుంది.
 ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. వంశీ మీద 
ఇందుకు అనుమానం కలిగేందుకు సినిమా హాలులో బాత్రూమ్ 
దగ్గర సన్నిహితంగా మెలగడం దగ్గర నుంచి అన్నీ చేస్తుంది.
 ఫలితంగా వంశీ మీద అనుమానం పెరిగి, హీరోతో పెళ్ళికి 
ప్రేమికురాలు ఇందు సిద్ధపడుతుంది. కానీ, అక్కడే మరో ట్విస్ట్. 
అదేమిటి, స్నేహం కోసం హారతి కర్పూరంగా మారిన నీరూ కథ
 ఏమైందన్నది మిగతా సినిమా.

 రెండు గంటల చిల్లర నిడివే... ఉన్న చిన్న సినిమా ఇది. కాకపోతే,
 సినిమా నిండా సీన్లు, ఎపిసోడ్లు అనేకం. ఫస్టాఫ్ అంతా హీరో 
మొదలు అన్ని పాత్రల పరిచయం, దూరమైన ప్రేమికురాలు 
ఇందు ఆచూకీ కనుక్కోవడానికి అతను చేసే ప్రయత్నాల చుట్టూరానే
 తిరుగుతుంది. అసలు కథ సెకండాఫ్. హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలిశాక హీరోకు 
సాయపడేందుకు నీరూ త్యాగాల పరంపర మొదలయ్యాక విషయం 
చిక్కబడుతుంది. ప్రేక్షకులకు కూడా అక్కడ నుంచే రెండో హీరోయిన్ 
క్యారెక్టర్ మీద సానుభూతి మొదలవుతుంది. ఆ పైన హీరో తన అసలు
 సిసలు ప్రేమను ఎవరి దగ్గర పొందాడన్నది ఓపెన్‌మైండ్‌తో చూడాల్సిన 
మిగతాకథ.

 ప్రేమ, కాస్తంత హీరోయిజమ్, కావాల్సినంత చలాకీదనం నిండిన పాత్ర 
సుమంత్ అశ్విన్ చేశారు. ‘చిన్నదాన నీ కోసం’ ఫేమ్ మిస్తీ చేసిన ఇందు 
పాత్ర మందు, చిందు తరహా వేషం. ‘నేను సక్సెస్‌ఫుల్ వ్యక్తిని
 ప్రేమించాలనుకున్నానే కానీ, ప్రేమను సక్సెస్ చేసుకోవాలనుకోలేదు’
 అని వాపోయే డైలాగే ఆమె క్యారెక్టరైజేషన్‌కూ, కథకూ కీలకం. కథ 
సాగుతున్న కొద్దీ స్క్రిప్ట్‌లో, యాక్షన్‌లో ముఖ్యమైనది నీరూ పాత్ర.
 ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్‌తో దాన్ని బాగా చేయించారు. చివరలో 
ఎయిర్‌పోర్ట్ సీన్ ఆ క్యారెక్టరైజేషన్‌కు ఎమోషనల్ క్లైమాక్స్.
 నవ యువ రక్తం వైపే... సంగీతం, ఆర్ట్, కెమేరా వర్క్ - ఇలా ముఖ్య 
విభాగాలన్నిటిలో మొగ్గుచూపారు. ఆ సంగతి తెరపై కనిపిస్తుంది. 
మాటల రచన, దర్శకత్వ బాధ్యత చేపట్టిన ఆర్. సామలకు ఇది తొలి 
డెరైక్షన్ చాన్స్. బాక్సాఫీస్ లవ్‌స్టోరీలెన్నో అందించిన ఎం.ఎస్. రాజు ఆ 
ప్యాట్రన్‌లో, చాలారోజులకు ఇప్పుడు కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సూపర్‌విజన్‌లతో 
అందించిన ఫిల్మ్ ఇది. ‘ఒక్కడు’లో మహేశ్ తరహాలో ఈ ఫిల్మ్‌లోనూ హీరోతో
 సెంటిమెంటల్ గా కబడ్డీ ఆటగాడిగా తెరపై కూత పెట్టించారు. ఇలాంటి సక్సెస్‌ఫుల్ 
ఫార్ములా సెంటిమెంట్లన్నీ బాక్సాఫీస్ వద్ద కొలంబస్ లవ్ జర్నీకి కలిసొస్తాయేమో చూడాలి.

-  రెంటాల జయదేవ
.....................................................
- షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే. 
- మొత్తం వర్కింగ్ డేస్ 55 రోజులు.
- ఇలియానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు డబ్బింగ్ చెప్పే హరిత ఇందులో సీరత్ కపూర్‌కు గళమిచ్చారు. 
మిస్తీ చక్రవర్తికి గాయని శ్రావణ భార్గవి చెప్పారు. 
- కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సూపర్‌విజన్ చేసిన ఎమ్మెస్ రాజు చివరలో తెరపై మెరుస్తారు.
....................................................
(Published in 'Sakshi' daily, 24th Oct 2015, Saturday)
.....................................

0 వ్యాఖ్యలు: