జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, October 5, 2015

శివమెత్తించే... ప్రేమ (కొత్త సినిమా గురూ! - శివమ్)

శివమెత్తించే... ప్రేమ
తారాగణం: రామ్, రాశీఖన్నా, అభిమన్యు సింగ్, వినీత్‌కుమార్, బ్రహ్మానందం, 
పాటలు: భాస్కరభట్ల, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాత:
 ‘స్రవంతి’ రవికిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి, నిడివి: 
168  నిమిషాలు, రిలీజ్: అక్టోబర్ 2
 .................................

లవ్‌స్టోరీ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘శివమ్’తో దర్శకుడైన శ్రీనివాసరెడ్డి గతంలో
 సురేందర్ రెడ్డి దగ్గర ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాలకు పనిచేశారు.  దాదాపు
34 మంది ఆర్టిస్టులున్న ఈ సినిమాకైన బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లు 
మొత్తం వర్కింగ్ డేస్ 87. ఊటీ, హైదరాబాద్, నార్వే, స్వీడన్‌లలో షూటింగ్.
నార్వే, స్వీడన్‌లలో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే. అక్కడ డ్రోన్
కెమేరాలు వాడారు.
..............................................

సినిమా రచనలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కథ అనుకొని దానికి తగ్గట్లు సీన్లు
రాసుకోవడం సంప్రదాయంగా అందరూ అనుసరించే విధానం. అయితే, ఒక్కోసారి
ప్రేక్షక జనాన్ని మెప్పించే తపనలో, సీన్లు అనుకొని కథలు కూడా వండుకోవడమూ
 సహజం. అలాంటి ఆసక్తికరమైన సీన్లు, ఎపిసోడ్లన్నీ కలసి తెరపై సినిమాగా
పరిణమిస్తే, కొన్నిసార్లు కథ కన్నా సీన్లదే ఎక్కువ ప్రాధాన్యమ వుతుంది. చిత్ర
నిర్మాణంలో ముప్ఫయ్యో ఏట అడుగుపెట్టిన ‘శ్రీస్రవంతీ మూవీస్’ సంస్థ నుంచి
 మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘శివమ్’ సినిమా చూసినప్పుడు ఈ
 ఆలోచనలన్నీ మెదులుతాయి.

కథ ఏమిటంటే...: 

ఇది శివ (రావ్‌ు) అనే కుర్రాడి కథ. అతనిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల
 పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు... నేరుగా
 తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో ఫైట్లు చేసి మరీ, ప్రేమికుల జంటను
 కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించాడా కుర్రాడు.
ఆ క్రమంలో జడ్చర్ల పట్నాన్ని గడగడలాడించే భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే
విలన్ మనుషుల్ని కొట్టి, వాళ్ళకు శత్రువవుతాడు. అలాంటి కుర్రాడు రైలులో
 వెళుతూ, ఒకమ్మాయి ఏదో షూటింగ్ కోసం అన్న ‘ఐ లవ్ యూ’ అన్న
 మాటను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రేమనూ
 వెతుక్కుంటూ వెళతాడు. అదే టైవ్‌ులో పోయిన పరువును తిరిగి
తెచ్చుకోవడం కోసం భోజిరెడ్డి మనుషులు హీరో కోసం వెతుకుతుంటారు.
 మరోపక్క అభిమన్యు సింగ్ అనే మరో విలన్ కూడా హీరో కోసం
వెతుకుతుంటాడు. అతనెందుకు వెతుకుతున్నాడన్నది కాసేపు సస్పెన్‌‌స.
తీరా హీరో కనిపించినప్పుడు అతణ్ణి వదిలేసి, హీరోయిన్‌ను కిడ్నాప్ చేసుకొని
వెళతాడతను. అక్కడికి ఇంటర్వెల్. విలన్ దగ్గర నుంచి ఆమెను హీరో
రక్షించడం, హీరో పనిపట్టడం కోసం ఇద్దరు విలన్ల మధ్య ఒప్పందం కుదరడం
 లాంటివన్నీ తర్వాతి కథ. ఒక దశలో హీరోయిన్‌తో ప్రేమ కన్నా, ప్రేమించినవాళ్ళను
ఏకం చేయడం వైపే హీరో మొగ్గుతాడు. అలా ఎందుకన్నది ఫ్లాష్ బ్యాక్. అదేమిటి,
 హీరో అసలు ‘శివ’ అని పేరు పెట్టుకోవడానికీ, తాను పెళ్ళి చేసిన ప్రేమికుల
 మొదటి బిడ్డకు ‘శివ’ అని వచ్చేలా పేరు పెట్టమనడానికీ కారణం ఏమిటి,
ప్రేమ అనే విషయం వచ్చేసరికి అతనెందుకు శివమెత్తుతాడు, చివరకు విలన్ల
కథెలా కంచికి చేరిందన్నది మిగతా సినిమా.

తెర నిండా యాక్టర్లే...:

 ‘ఎనర్జిటిక్ స్టార్’ బిరుదాంకితుడైన యువ హీరో రామ్ఆ పేరుకు తగ్గట్లు
 నటించారు. మొదటి నుంచి చివరి దాకా హుషారుగా, ఎందరినైనా కొట్టి,
 ఏదైనా సాధ్యం చేయగల వీరాధివీరుడి తరహా పాత్రలో కనిపిస్తారు. ఇక,
 క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఘట్టంలో పొడవాటి జుట్టున్న విగ్‌లో
 విభిన్నంగా, విచిత్రంగా ఉన్నారు. ప్రేమిస్తున్నాననే విషయాన్ని కూడా
నేరుగా చెప్పడంలో కూడా ‘ఇగో’ ఫీల్ అయ్యే కథానాయిక తనూజగా హీరోయిన్
 రాశీఖన్నాది విగ్రహపుష్టి. ఈ చిత్రంలో విలన్లు ఒకరు కాదు - ఇద్దరు.
ఒకరు అభిమన్యు సింగ్, రెండో వ్యక్తి వినీత్ కుమార్. కానీ, చిత్రంగా ఈ
ప్రతినాయక పాత్రల్లో ఏదీ బలంగా కనిపించదు. విలన్లు కూడా కామెడీ
చేయడమనే కాన్సెప్ట్‌తో కథను తీర్చిదిద్దుకోవడం అందుకు ఒక కారణం.
 బలమైన విలన్లు, సన్నివేశాలు, సందర్భాలు లేనప్పుడు హీరోనెంత గొప్పగా
 చూపినా, హీరోయిజవ్‌ు ఎంతవరకు ఎలివేటవుతుందన్నది ప్రశ్న.

వీళ్ళు కాక - కామెడీ కోసం బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి
నుంచి సప్తగిరి, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్.... ఇలా లెక్కేసుకుంటూ
పోతే, ఆ పేర్ల జాబితానే కొండవీటి చాంతాడు. ఇటీవలి కాలంలో తన అమాయకపు
 డైలాగుల చిన్న చిన్న పాత్రలతోనే అలరిస్తున్న ‘ఫిష్’ వెంకట్ కూడా ఉన్నారు.
కనిపించే కొద్ది సీన్లలో ఎవరికి వారు తమ వంతు నవ్వించడానికి ప్రయత్నించారు. 
ఇక, హీరో తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరోయిన్ తండ్రి పాత్రలో
 గాయకుడు మనో లాంటి పేరున్న తారలూ కనిపిస్తారు. అప్పటికే సినిమా
 నిడివి 2 గంటల 48 నిమిషాలు కావడం వల్ల కావచ్చు... వారిని ఇంకా
 వినియోగించుకొనే సీన్లకు అవకాశం కష్టమైనట్లుంది. అలాగే, తండ్రి
పోసాని పాత్ర గన్ను పుచ్చుకొని మరీ హీరోను కనిపిస్తే... కాల్చేస్తానంటూ
తిరగడం వెనుక కారణం ఏమిటన్నది చెప్పడం మర్చిపోయినట్లున్నారు.

అనుభవం నిండిన టెక్నీషియన్‌‌ వర్క్:
     
                     శ్రీనివాసరెడ్డికి దర్శకుడిగా ఇది తొలిసినిమా. కథ కూడా
ఆయన రాసుకున్నదే. పాత్రల పరిచయం, కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌తోనే సినిమా
 ఫస్టాఫ్ అంతా గడిచిపోతుంది. దానికి మూడు పాటలు, కొన్ని ఫైట్లు అదనం.
 చిన్న ట్విస్ట్ దగ్గర ఫస్టాఫ్ ఆగినా, సెకండాఫ్ మొదట్లోనే ఆ ట్విస్ట్‌ను బయటపెట్టేస్తారు.
ఇక, ఆ తరువాత అంతా టావ్‌ు అండ్ జెర్రీ తరహాలో హీరోకూ, విలన్లకూ మధ్య
జరిగే కథ. హీరో స్వభావానికీ కారణం తెలిపే ఫ్లాష్‌బ్యాక్ కథ చివరాఖరుకు వస్తుంది.
అప్పటి దాకా ఆసక్తినీ, సహనాన్నీ కోల్పోకుండా నిలుపుకోవాలి. మాటల రచయిత
కిశోర్ తిరుమల ఉన్నా, ఆ క్రెడిట్‌నూ దర్శకుడు కూడా పంచుకున్న ఈ సినిమాలో,
 ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డైలాగ్‌‌స కొంత బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో
‘నా కోసం నువ్వేమీ ప్రేమించక్కర్లేదు...’ లాంటి 2-3 పాటలు బాగున్నాయి.
 నార్వే, స్వీడన్ లాంటి చోట్ల అందమైన లొకేషన్లను కెమేరాలో బంధించిన తీరూ
 బాగుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ సరేసరి. ఇలాంటి అనుభవజ్ఞులైన నిపుణులతో
 పాటు నిర్మాణ విలువలూ పుష్కలమే. ఇన్ని సమకూరిన సినిమాలో సీన్లు,
 పాటలు, ఫైట్లూ ఉన్నాక... ఇంకా కథ గురించి ఆలోచించడం ఎందుకు?

.......................................

0 వ్యాఖ్యలు: