జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, July 19, 2011

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"



(మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది. దాన్ని పక్కన ఇమేజ్ రూపంలో చూడగలరు. వ్యాసం పూర్తి పాఠం ఈ కింద ఉంది).

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే!

ఆ గది లో ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , 'బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.

ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది.

గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడకు వచ్చేశారు. 'పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట 'రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.

నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--'ఎర్ర జెండాల' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో 'ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న 'జయంతి పబ్లికేషన్స్' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండలు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశంలో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమగా కొనసాగిన కాలంలో ఆయనకు సహచరులు, సహవ్రతులు.

నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గంలో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే 'సినిమా పేజీ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం. ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు.(రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు).

'పంచకళ్యాణి- దొంగలరాణి', 'కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లలాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే -- సాయంత్రం సినిమా సభలో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన 'దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు.

చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్షను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు 'బాలజ్యోతి' మాస పత్రికలో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడిగా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్య రెంటాల సత్యనారాయణనూ, మా అక్కయ్య కల్పనా రెంటాలనూ, నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.

నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ, పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు -- ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, 'రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, 'అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు.

ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గదిలో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజంలోకి తలుపులు తెరిచాయి.

గమ్మత్తేమిటంటే, నరసరావు పేటలో 'నవ్య కళా పరిషత్' వారి 'నయాగరా' (అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన 'కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన 'సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన 'సర్పయాగం' కవితా సంపుటాలు, 'శిక్ష', 'ఇన్స్పెక్టర్ జనరల్', 'అంతా పెద్దలే' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు.

"అమ్మా! ఉమా! రుమా! హీరోషిమా! విలపించకు పలపించకు..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవితను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.

అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి 'అరసం' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, 'నవభారతి' పత్రికకు 'మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వనాథను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు 'ఆంధ్రప్రభ' దినపత్రికలో 'వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు.

ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారంలోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యంలో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకి వెళ్ళిపోయారు.

నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాథమ్ సంపాదకత్వంలో గుంటూరు నుంచి వచ్చిన 'దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య 'నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వంలో 'ఆంధ్రప్రభ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు.

సమాజాన్ని సరైన దోవలో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి -- ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, 'స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా 'ఆంధ్ర ప్రభ', 'స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.

నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం 'శివధనువు' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18న కీర్తి శేషులయ్యారు. ఆ పైన 'శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.

'అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకంలో మేము 'నవగ్రహాలు' అన్న మాట! (చిన్నతనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యంలో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.

నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ -- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ -- ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.

అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్ గానే, 'ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. 'ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పన కవితలో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ