(
మన భారతీయ టాకీకి ఇవాళ్టితో 80 ఏళ్ళు - పార్ట్ 2)
తొలి భారతీయ టాకీ ఆలమ్ ఆరా చిత్ర కథ కూడా రంగస్థలం మీద నుంచి వెండితెరకు నడిచి వచ్చినదే! పార్శీ ఇంపీరియల్ థియేటరికల్ కంపెనీకు చెందిన నాటక రచయిత జోసెఫ్ డేవిడ్ రాసిన 'ఆలమ్ ఆరా' నాటకం అప్పట్లో రంగస్థలంపై విజయవంతమైంది.
నాటకం నుంచి సినిమాగా 'ఆలమ్ ఆరా'అందులో కథ ఏమిటంటే - కుమార్‌పూర్ రాజు గారికి ఇద్దరు భార్యలు. ఆ రాణులిద్దరికీ పిల్లలు లేరు. ఓ ఫకీరు చెప్పిన జోస్యం ప్రకారం వారిద్దరిలో సుగుణశీలి అయిన రాణి నవ్‌బహార్‌కు ఓ కొడుకు పుడతాడు. దాంతో, దుష్ట రాణి దిల్‌బహార్‌కు విపరీతమైన అసూయ కలుగుతుంది. మరోపక్క, సైన్యాధ్యక్షుడైన అదిల్ మీద దిల్‌బహార్ మనసు పడుతుంది. కానీ, అతనేమో ఆమె కోరికను తోసిపుచ్చుతాడు. ప్రతీకారంతో ఆమె అతణ్ణి ఖైదు చేయిస్తుంది. అదిల్ భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోతుంది. ఆ ఆడపిల్లే - ఆలమ్ ఆరా (నటి జుబేదా). కోయగూడెంలో ఆ అమ్మాయి పెరుగుతుంది. ఖైదులో ఉన్న తండ్రిని చూడడం కోసం ఒకసారి ఆ అమ్మాయి రాజప్రాసాదానికి వస్తుంది. మెడలోని హారం వల్ల ఆమె ఎవరన్నదీ తెలుస్తుంది. అక్కడ ఆమె, యువరాజు (నటుడు మాస్టర్ విఠల్)ను కలుస్తుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. చివరకొచ్చేసరికి - అదిల్ ఖైదు నుంచి విడుదలవుతాడు. దుష్టరాణి దిల్‌బహార్‌కు శిక్ష పడుతుంది. యువరాజు, ఆలమ్ ఆరాల పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
సంచలనాత్మక ఆదరణఅనేకానేక పాటలు, నృత్యాలను గుదిగుచ్చి అందించడానికి ఈ సాదాసీదా ఇతివృత్తం తోడ్పడింది. అయితేనేం, కథ ఏమిటని కాక, తెర మీద కదిలే బొమ్మలను చూడడమే కాక మాటలూ వినవచ్చని జనం వేలంవెర్రిగా థియేటర్లకు తరలివచ్చారు. 'ఆలమ్ ఆరా' విడుదల రోజున తెల్లవారుజాము నుంచే జనం బొంబాయిలోని మెజెస్టిక్ సినిమా దగ్గరకు గుంపులు గుంపులుగా చేరడం మొదలైంది. ''ఎంతో కష్టం మీద గానీ మేము కూడా థియేటర్‌లోకి ప్రవేశించలేకపోయాం'' అని అర్దేషిర్ ఇరానీ భాగస్వామి అబ్దులాలీ యూసూఫాలీ తెలిపారు.
''అప్పట్లో 'వరుస'లో నిల్చొని, టికెట్లు తీసుకొనే పద్ధతి కూడా ప్రేక్షకులకు తెలియదు. దాంతో, జనం టికెట్ బుకింగ్ ఆఫీసు మీదకు గుంపుగా వచ్చి పడ్డారు. తమకు అర్ధమైన భాషలో మాట్లాడే సినిమాను చూడడానికి, ఎలాగోలా టికెట్ సంపాదించాలని తాపత్రయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరకు జనాన్ని అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది... వారాల తరబడి టికెట్లు అమ్ముడైపోయాయి. ఎక్కువ రేటుకు బ్లాకులో టికెట్లు అమ్మేవాళ్ళు యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు'' అని ఆనాటి అనుభవాలను ఆయన గతంలో వెల్లడించారు.
సినిమా కష్టాలు'ఆలమ్ ఆరా' తీయడానికి పడ్డ కష్టాలను ఆయన వివరిస్తూ, ''అప్పట్లో సౌండ్-ప్రూఫ్ స్టేజీలు లేవు. దాంతో మేము స్టూడియో లోపల, అదీ రాత్రి వేళ చిత్రీకరణ జరపడానికి మొగ్గు చూపేవాళ్ళం. మా స్టూడియో పక్కనే రైలు మార్గం ఉండేది. ఫలితంగా, ఆ శబ్దం రికార్డు కాకుండా ఉండడం కోసం, రైళ్ళు రాకపోకలు లేని సమయంలోనే షూటింగ్ జరపాల్సి వచ్చేది. పైగా, ఒకే సిస్టమ్‌తో కూడిన టానర్ రికార్డింగ్ సామగ్రితోనే శబ్దగ్రహణం చేయాల్సి వచ్చింది... అలాగే, నటీనటులు నటిస్తూ పలికే మాటలు, పాటలు రికార్డింగ్ చేయడానికి బూమ్‌లు (దూరంగా ఉంచి రికార్డు చేసే మైకులు) కూడా లేవు. కెమేరా కన్నులో పడకుండా మైక్రోఫోన్లను ఎక్కడెక్కడో రహస్యంగా ఉంచి, మాట, పాట రికార్డు చేయాల్సి వచ్చింది'' అని ఇరానీ చెప్పారు. కఠినమైన రికార్డింగ్ పరిస్థితుల కారణంగా 'ఆలమ్ ఆరా' రూపకల్పనకు నెలలకొద్దీ సమయం పట్టింది. పైగా, ప్రత్యర్థి సినిమా సంస్థల నుంచి పోటీని నివారించడం కోసం అంతా గుట్టుచప్పుడు కాకుండా చేయాల్సి వచ్చింది.
భారతీయ తొలి టాకీ 'ఆలమ్ ఆరా'లో సాంకేతిక, కళాత్మక విలువలు స్వల్పమే! అయినప్పటికీ, తొలి ప్రయత్నంగా అందరూ దాన్ని ఆదరించారు. 'ఆలమ్ ఆరా' అఖండ విజయంతో 'పాత్రలన్నీ మాట్లాడుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేసే' చిత్రాలు చకచకా తయారయ్యాయి. గళం ప్రధానం కావడంతో రంగస్థల నటీనటుల్ని దర్శక - నిర్మాతలు తీసుకోసాగారు. 'ఆలమ్ ఆరా' విడుదలైన సరిగ్గా మూడు వారాల కల్లా తొలి బెంగాలీ టాకీ 'జమాయ సష్టి'ని మదన్ థియేటర్స్ విడుదల చేసింది. ఆ వెంటనే 'షిరీన్ ఫర్హాద్' అనే మరో భారతీయ టాకీని రూపొందించింది.
'షిరీన్ ఫర్హాద్' చిత్రాన్ని 22 సార్లు చూడడం కోసం లాహోర్‌లో టాంగా తోలే ఓ పంజాబీ ఏకంగా తన గుర్రాన్నే కుదవపెట్టాడట! ఆ ఊపులో ఒక్క 1931లోనే 8 టాకీ చిత్రాలనూ, 1932లో 16 టాకీలనూ మదన్ థియేటర్స్ రూపొందించింది.
భారతీయ టాకీలు తెచ్చిన మార్పులుటాకీల ప్రవేశంతో సౌండ్ ప్రక్రియకు మారే స్థోమత లేక చాలా స్టూడియోలు మూతపడ్డాయి. అలాగే, అప్పటి దాకా మూకీల్లో ప్రసిద్ధ తారలుగా వెలిగిన ఆంగ్లో - ఇండియన్ నటీమణులు సైతం ధారాళంగా హిందీ, ఉర్దూ మాట్లాడలేక, తెర మరుగయ్యారు. పాటలు పాడుకోవడం రాని వారు కూడా నటనకు దూరం కావాల్సి వచ్చింది. శబ్దగ్రహణంలోని ఇబ్బందుల రీత్యా నటీనటులంతా మైకును దృష్టిలో పెట్టుకొని, దాని మీద ధ్యాసతో నటించాల్సి వచ్చేది. పాటలన్నీ ఒకే షాట్‌లో చిత్రీకరించేవారు. ఎవరికీ నైపుణ్యం లేదు గనక, ప్రయోగాలు చేస్తూ చిత్రీకరణ జరపడంతో బోలెడంత ముడి ఫిల్ము వృథా అయ్యేది. అయితేనేం, కొత్త ఒక వింతగా జనం విపరీతంగా వచ్చి, ఈ చిత్రాలు చూసేవారు. ఈ బాక్సాఫీస్ వసూళ్ళతో చాలా సినిమా హాళ్ళు, సంస్థలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా మూతబడ్డ హాళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి.
దాదాపు 16 ప్రధాన భాషలు, కొన్ని వందల మాండలికాలకు నెలవైన భారతదేశంలో వివిధ భాషల్లో టాకీ చిత్రాలు తయారవడం మొదలైంది. మొదట్లో అన్ని ప్రాంతాల వారికీ అర్ధమయ్యేలా, హిందీ, ఉర్దూ కలగలిసిన హిందుస్థానీలో తొలి భారతీయ శబ్ద చిత్రాలు తయారయ్యేవి. ఆ తరువాత బెంగాలీలో 'జమాయ సష్టి' (1931), తమిళంలో 'కాళిదాస్' (1931- ఇందులో తెలుగు డైలాగులు, త్యాగరాజ కీర్తనలు ఉండడంతో, దీన్ని తొలి తమిళ, తెలుగు టాకీ అనేవారూ ఉన్నారు), తెలుగులో 'భక్త ప్రహ్లాద', మరాఠీలో 'అయోధ్యా చే రాజా' (1932), గుజరాతీలో 'నరసింహ మెహతా' (1932), కన్నడంలో 'సతీ సులోచన' (1934) చిత్రాలు ఆ యా భాషల్లో తొలి టాకీలుగా విడుదలయ్యాయి. 1931లో హిందీ, బెంగాలీ, తమిళ, తెలుగు టాకీలు తయారు కావడంతో, ఈ ఏడాది ఈ చిత్ర పరిశ్రమలన్నీ ఎనభై వసంతాలు జరుపుకొంటున్నాయి.
(తొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా'కు ఇవాళ్టితో ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా...)