- 'ప్రజాశక్తి'తో అక్కినేని ఆఖరి ఇంటర్వ్యూ
ఉదయం 11 గంటల వేళ. చిరుజల్లులతో చలి పుడుతూ, వాతావరణం గిలిగింతలు పెడుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గరలోని 'అన్నపూర్ణ' నివాసంలో మరికొద్ది నెలల్లో 90వ పడిలోకి అడుగు పెట్టనున్న ఎవర్‌గ్రీన్ హీరో 'పద్మవిభూషణ్' అక్కినేని నాగేశ్వరరావు తన ట్రేడ్ మార్కు తెల్లప్యాంటు, బంగారు రంగు చొక్కాలో చిరునవ్వుతో సాదరంగా స్వాగతించారు. 'దేవదాసు', 'బాటసారి'గా, 'విప్రనారాయ'ణుడిగా, 'దసరా బుల్లోడు'గా తెలుగు ప్రేక్షకులకు 'ప్రేమాభిషేకం' చేసిన ఈ 'బహుదూరపు బాటసారి' ప్రజాశక్తితో అనేక సంగతులను పంచుకున్నారు. ముఖ్యాంశాలు:
తొంభయ్యో ఏట అడుగుపెడుతున్నా, చురుగ్గా నడుస్తున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే, ఎవరైనా సరే ఏదో ఒక పని, వ్యాపకం పెట్టుకోవాలి. నా యాభయ్యో ఏట 1974 నుంచి రోజూ ముప్పావు గంట సేపు నడుస్తున్నా. గతంలో జూబ్లీహిల్స్‌లోని పార్కులో నడిచేవాణ్ణి. అయితే, అక్కడ వాకింగ్‌కు వస్తూ, ఎదురుపడేవాళ్ళు పోచికోలు కబుర్లతో ఏవో నెగటివ్ మాటలు, ఆలోచనలు ప్రస్తావిస్తుండడంతో క్రమంగా అక్కడకు వెళ్ళడం మానేశా. అలాంటివి మనలో ఉత్సాహాన్ని చంపేస్తాయి. ఇప్పుడు ఇంట్లోనే పెరట్లో మూడడుగుల వెడల్పు ట్రాక్ ఒకటి సిద్ధం చేసుకొని, నడుస్తున్నా. చెట్లతో, చెట్టు కొమ్మల్లోని పిట్టలతో ఊసులాడుతూ, మనస్సును ఉత్సాహంగా ఉంచుకుంటున్నా.
అభిమానుల పట్ల మీరెంతో ప్రేమ, గౌరవం చూపిస్తుంటారే!
అవును. నేను వాళ్ళకు ఎంతో ఋణపడి ఉన్నాను. వ్యక్తిగతంగా నేను 'స్వచ్ఛమైన మనస్సు'ను నమ్ముతాను. అందుకే, అలాంటి స్వచ్ఛమైన మనస్సుండే అభిమానులంటే నాకెంతో గౌరవం. వాళ్ళు నా దగ్గర నుంచి ఏమీ ఆశించరు - కేవలం నా సినిమాలు, పాత్రల అభినయం ద్వారా నేను అందించే అపురూపమైన ఆనందాన్ని తప్ప! ఏ రకమైన స్వార్థ చింతన లేకుండా మన దగ్గరకు వస్తారు కాబట్టే, వాళ్ళను నేను దేవుళ్ళంటాను. వాళ్ళ ఆశీస్సుల వల్లే మేమంతా ఇంత ఎదిగాం. గుండె ఆపరేషన్లను కూడా తట్టుకొని, ఇంతకాలంగా నేను ఆరోగ్యంగా ఉన్నా.
మీ వీరాభిమానుల్ని చూసి, మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా?
చాలానే ఉన్నాయి. అయితే, ఆ మధ్య జరిగిన ఓ సంఘటన చెబుతాను. ఒక ముసలి సనాతన వితంతువు ఒకావిడ వచ్చి, నన్ను కలిసింది. పక్కన మనుమడు ఉండి, తీసుకొస్తే ఆమె వచ్చింది. 1940ల నాటి 'బాలరాజు' రోజుల నుంచి నన్ను చూడాలని ఆమె కోరిక అట! అప్పుడు అది తీరలేదు. ఈ ముసలి వయస్సులో వచ్చి, నన్ను చూసి వెళ్ళి ంది. ఇలాంటి సంఘటనలు చూస్తే, వాళ్ళు మన మీద ఎంత ప్రేమ, అభిమానం పెట్టుకున్నారో కదా అనిపిస్తుంది. అందుకే, నాకు దేవుళ్ళు ఎక్కడో లేరు! ప్రేక్షకుల్లోనే ఉన్నారు. కాబట్టే, ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఉంటాను.
మీ కుటుంబంలోని మూడు తరాలూ నటిస్తున్న 'మనం' గురించి...
జూన్ 7 నుంచి షూటింగ్ జరుగుతోంది. మా ఇంట్లోని మూడు తరాల హీరోలం నటిస్తున్నాం కాబట్టి, అంచనాలు ఎక్కువే ఉంటాయి. మీ సమాచార ప్రసార సాధనాల వాళ్ళ రాతలు, మాటలతో అది మరింత పెరుగుతుంది. ఏమైనా, చాలా జాగ్రత్తగా చేస్తున్నాం.
మీ మరో మనుమడు అఖిల్ రంగప్రవేశానికి కూడా రంగ సిద్ధమైంది. వారసుల గురించి ఏమంటారు?
మా ఇంట్లో నేను, నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య - ఇప్పటికే అయిదుగురు హీరోలం ఉన్నాం. రానున్న అఖిల్‌తో ఆరుగురు హీరోల కుటుంబం అవుతుంది మాది. అయితే, ఇది పరిచయానికి పనికొస్తుందే తప్ప, ఎవరికి వాళ్ళు తమ ప్రతిభ ద్వారా పైకి రావాల్సిందే! అఖిల్ ఇప్పటికే థాయిలాండ్‌లో ఫైటింగులు నేర్చుకున్నాడు. నటనలో క్రాష్‌కోర్స్ చేశాడు. మా ఎవరి ప్రమేయం లేకుండా తాను ఎలా ఉండాలో, తానే తీర్చిదిద్దుకుంటున్నాడు.
పెద్దగా చదువుకోని మీకెవరు ఉపాధ్యాయులు?
నేను పోషించిన పాత్రలే నాకు ఉపాధ్యాయులు. నిష్ఠాగరిష్ఠుడు సైతం చంచల స్వభావంతో ఎలా దెబ్బ తింటాడనే పాఠం 'విప్రనారాయణ' నుంచి నేర్చుకున్నా. అది నాకు ఓ పిహెచ్.డి. అలాగే, 'దేవదాసు', 'బాటసారి', 'మూగమనసులు', 'ధర్మదాత' లాంటి ఎన్నో చిత్రాలు నాకెన్నో పాఠాలు నేర్పాయి. నన్ను మనిషిగా తీర్చిదిద్దాయి. ఈ నటన వల్లే జ్ఞానం, పేరు, డబ్బు, ప్రజల ఆశీర్వాదం లభించాయి.
సినిమాల్లో ధ్రువతారవుతానని ఊహించారా?
నేనెప్పుడూ ఏదీ ఊహించలేదు. ఊహించని విధంగా నాకివన్నీ సమకూరాయి. ఇదంతా యాదృచ్ఛికం. అయితే, వచ్చిన అవకాశాలన్నీ నేను చక్కగా ఉపయోగించుకున్నా. వృత్తినే దైవంగా భావించా.
కెరీర్‌లో ఉత్కృష్ట పాత్ర అయిన 'దేవదాసు'తో మీ తొలి పరిచయం ఎలా జరిగింది? మీ మీద శరత్ సాహిత్య ప్రభావమెంత?
ఈ సినిమాలో నటించడానికి ముందే శరత్ బెంగాలీ నవల 'దేవదాసు' నవల నాకు సుపరి చితం. అప్పట్లో రచయిత సముద్రాల రాఘవా చార్యులుగారు 123 రూపాయలకు చక్రపాణి అనువాదం చేసిన శరత్ సాహిత్యం మొత్తం నాకు తెచ్చి ఇచ్చారు. 'మంచి సాహిత్యం. బ్రహ్మ సమాజ భావాలతో ఆధునికంగా ఉంటుంది. సాంఘిక చిత్రాల్లో నటిస్తున్నప్పుడు పాత్రల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి ఇవి ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి. వీటిని చదువుతూ ఉండు' అంటూ నాకు ఇచ్చారు. అలా శరత్ 'దేవదాసు' నేను ఎన్నోసార్లు చదివాను. స్కూలు చదువు కూడా చదవని, ఓ పల్లెటూరి రైతు కుటుంబంలో నుంచి వచ్చినవాణ్ణి నేను. కాబట్టి, ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రల మానసిక సంఘర్షణ, ప్రవర్తన లాంటి వాటి గురించి ఏవైనా సందేహాలు వస్తే, షూటింగ్‌కు ముందే రచయిత - నిర్మాత చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళి, ఆయనతో పాత్ర స్వభావం, వగైరా చర్చిస్తుండేవాణ్ణి. ఆయన నాకు విడమరిచి చెప్పేవారు. ఆ మాటలు, సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. ఆ తరువాత కూడా బెంగాలీ నవలలు, శరత్ రచనల ఆధారంగా చిత్రాల్లో నటించాను. అలా సహజంగానే నా మీద శరత్ సాహిత్య ప్రభావం బానే ఉంది. నమస్కారం పెట్టాలని కూడా తెలియని పల్లెటూరి బైతు అయిన ఏయన్నార్ అనే మట్టిముద్దను వెన్నముద్దగా మార్చింది - ఈ సినీ రంగం, ఇక్కడి అనుభవాలే!
అసలు 'దేవదాసు' తీయాలనే ఆలోచన ఎవరిది?
ఆ ఆలోచన నిర్మాత డి.ఎల్. (ద్రోణావఝల లక్ష్మీ) నారాయణదే! ఆయన భరణీ పిక్చర్స్‌లో మేడమ్ (భానుమతి) దగ్గర ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా చేసేవారు. గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర సినిమాల్లో చేస్తున్నప్పుడు భరణీ' వారి తరఫున వచ్చి, గూడవల్లి గారితో మాట్లాడి, 'రత్నమాల' చిత్రానికి నన్ను తీసుకువెళ్ళింది ఆయనే! అందరూ వద్దన్నా, ఆయన మొండిగా ఈ చిత్రం తీశారు.
'దేవదాసు' ఇంత చిరస్మరణీయం అవుతుందని మీరు ఊహించారా?
(గట్టిగా నవ్వుతూ...) అందరూ మమ్మల్ని విమర్శిస్తూ, నిరుత్సాహపరుస్తున్న సమయంలో సినిమా తీస్తున్న మేము జాగ్రత్తగా బయటపడితే చాలు అనుకున్నాం తప్ప, సినిమా ఇలా చిరస్మరణీయమవుతుందని ఊహించనే లేదు. అయితే, సినిమా తీస్తున్నంత కాలం మేమందరం ఎంతో శ్రద్ధాసక్తులతో శ్రమించాం. ఓ కసితో పని చేశాం. ఆ శ్రమ ఫలించింది.
'దేవదాస్' తమిళంలో మిమ్మల్ని ఆరాధ్యనీయుడిగా నిలిపినట్లుంది!
నిజానికి, తొలి రిలీజ్‌లో 'దేవదాసు' తెలుగులో కన్నా, తమిళంలో బ్రహ్మాండంగా ఆడింది. 'ఉలగే మాయం... వాళ్వే మాయ...' (జగమే మాయ బతుకే మాయ) లాంటి పాటలు అక్కడ ఆల్‌టైమ్ హిట్లు. మదురైలో నాకు ఓ సంస్థ వారు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా ఇచ్చారు. తెలుగులో తొలి రిలీజ్‌లో 7 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. నిజం చెప్పాలంటే, అందులో 3 చోట్లే సినిమా సరిగ్గా ఆడింది. మిగిలిన 4 చోట్ల 10వ వారం తరువాత, 'డిస్ట్రిబ్యూటర్ వాటా పోగా, మిగిలినది మీరే తీసేసుకోండ'ని నిర్మాత డి.ఎల్. నారాయణ చెప్పడంతో ఆ హాళ్ళ వాళ్ళు అలా 100 రోజులు ఆడించారు. గమ్మత్తేమిటంటే, తెలుగులో కాలగతిలో క్రమ క్రమంగా ఈ సినిమా ఓ కళాఖండంగా నిలిచిపోయింది.
మీ తరువాత 21 ఏళ్ళకు హీరో కృష్ణ కలర్‌లో 'దేవదాసు' (1974) తీశారు. ఆ 'దేవదాసు'కు పోటీగా మీ 'దేవదాసు' విడుదల అప్పట్లో పెను దుమారం రేపింది. ఆ సినిమా చూశారా!
(వెంటనే అందుకుంటూ...) ఆ సినిమా నేను చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఓ మాట చెబుతున్నాను. ఆ సినిమా మీద పోటీగా నా సినిమాను నేను విడుదల చేయలేదు. ఎవరో అమ్ముతుంటే, మా 'దేవదాస్'కు నిజామ్ స్టేట్ వరకు నెగటివ్ రైట్లు నేను కొనేశాను. అప్పటికి సరిగ్గా నాకు 50 ఏళ్ళు. గుండె జబ్బుకు అమెరికాలో బైపాస్ చేయాలన్నారు. 1974 అక్టోబర్ 18న ఆపరేషన్. ఇక్కడ నుంచి 3 వేల డాలర్లు తీసుకువెళ్ళడానికీ, నా భార్యను వెంటనే అమెరికాకు పంపడానికీ వీలుగా అప్పటి మంత్రి బ్రహ్మానందరెడ్డి, రెవెన్యూ మంత్రి చెన్నారెడ్డి గార్లను నేను అభ్యర్థించాను. నేనసలు బతుకుతానో, లేదో కూడా తెలియదు. డబ్బులు కావాలి. ఆ పరిస్థితుల్లో కలర్ 'దేవదాసు' వస్తోంది. అది రిలీజైతే, బ్లాక్ అండ్ వైట్‌కు డబ్బులొస్తాయో, లేదో అని నా 'దేవదాసు' విడుదల చేసేయమని చెప్పాను. అంతే! దీనికి పత్రికలు, సినిమా వాళ్ళు ఏవేవో అనుకున్నారు, రాశారు. అవేమీ లేదు. ఆ తరువాత కృష్ణ - విజయనిర్మల తీసిన 'హేమాహేమీలు'లో కూడా నేను నటించాను.
'దేవదాసు' ప్రభావంతో తర్వాత చాలా పాత్రలు చేసినట్లున్నారు.
ఓ ఇతివృత్తాన్ని, ఓ పాత్రను విజయవంతం చేసినప్పుడు, అలాంటి పాత్రల బరువు సదరు నటుడి మీద మోపవచ్చనే నమ్మకం పెట్టుబడి పెట్టే నిర్మాతకు వస్తుంది. సినిమాల్లో అంతే! ఎన్టీయార్ కృష్ణుడిగా బాగున్నాడు అంటే, ఆయనతో ఆ పాత్రతోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. నాకు విషాద పాత్రలు, 'బాటసారి', 'మూగ మనసులు' ల్లోని మనస్తత్త్వ చిత్రణతో కూడిన పాత్రలు, 'మిస్సమ్మ', 'చక్రపాణి', 'ప్రేమించి చూడు'ల్లోని వ్యంగ్యంతో కూడిన వినోదాత్మక పాత్రలు, 'చెంచులక్ష్మి', 'మాయా బజార్'లలోని పౌరాణిక పాత్రలు - ఇలా అన్నీ వచ్చాయి. అన్ని పార్శ్వాలూ స్పృశించాను కాబట్టే, ఒక నటుడిగా ఇంతకాలం జనం మెచ్చేలా నిలిచాను. మన దగ్గర ఏమీ లేకపోతే, జనం మెచ్చుకోరు కదా!
దేవదాసు సినిమా, పాత్రల ప్రభావం మీ మీద ఉందా?
(తల అడ్డంగా ఊపుతూ) నో...నో... ఆ ప్రభావమే లేదు. సినిమాల్లో నటులుగా మేము ఆ పాత్రల్ని అభినయిస్తున్నామే తప్ప, అదే మేము కాదనే స్పృహ నాకు ఉంది. అందుకే, ఏ పాత్ర పోషించినా అది అయిపోగానే దాన్ని అక్కడే వదిలేయాలి. అలాగే వదిలేసేవాణ్ణి. నేను పోషించిన ఏ పాత్ర అయినా, అది ఒక తొడుగు. దాన్ని అక్కడే తీసి పడేయాలి. వాటిలా మారిపోతే, సినిమాకు ఓ రకంగా మార్పు చెంది, (నవ్వుతూ...) అంతమంది హీరోయిన్లతో తిరగాలి. అది సాధ్యమా?
కానీ, దేవదాసు పాత్ర పోషణను ఓ సవాలుగా తీసుకొని, మీరెంతో హోమ్‌వర్క్ చేశారు కదా! అది మీ మీద ప్రభావం చూపలేదా?
ఒక్క దేవదాసు పాత్రకనే కాదు. ఏ సినిమాలో ఏ పాత్ర చేస్తున్నా సరే దానికి తగ్గట్లుగా కృషీ, ప్రయత్నమూ ఉంటాయి. ఇప్పుడీ చిత్రం గురించి మాట్లాడుతు న్నాం కాబట్టి, దీని గురించి చెబుతున్నాం. అంతే! అయితే, వృత్తి జీవితపు తొలినాళ్ళలో తీసిన సినిమా కాబట్టి, సినీ రంగంలో ఎంతోమంది నిరుత్సాహ పరుస్తున్నా, ఏటికి ఎదురీది తీసిన సినిమా కాబట్టి, 'దేవదాసు' పాత్ర పోషణకు నేను కష్టపడాల్సి వచ్చింది. చాలా హోమ్‌వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ, కెరీర్‌లో ఆ తరువాతి రోజుల్లో ఆ ఛాయలతో వచ్చిన 'ప్రేమ్‌నగర్', 'ప్రేమాభిషేకం' చిత్రాలకు ఇంత కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. నాకు తొలిసారి గుండె ఆపరేషన్ జరిగిన 1974 అక్టోబర్ దాకా నాకు మద్యం అలవాటు కూడా లేదు. అయితే, మా భాగస్వామి - సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్ సహా, సినీ రంగంలోని పలువురి తాగుడు అలవాట్లను చూసినవాణ్ణి కాబట్టి, 'దేవదాసు'లో తాగుబోతులా చేశాను.
'దేవదాసు'తో సహా ఆనాటి కళాఖండాల నెగటివ్‌లు, ప్రింట్లు ఇప్పుడు లేవు. వాటిని పరిరక్షించి, భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అగ్ర హీరోలు, వారి సంతానం కూడా తీసుకోవడం లేదేం?
మీరన్నది నిజమే! మన కళాఖండాలను మనం భద్రపరుచుకోవాలి. నా తొలినాళ్ళ చిత్రాలైన 'శ్రీసీతారామ జననము', 'మాయలోకం' లాంటి కొన్ని చిత్రాలు ఒక్క రీలు ముక్క కూడా లేవు. కానీ, నాతో ఇతరులు నిర్మించిన చిత్రాలకు నేనేం చేయగలను! ఆ నిర్మాతల్లో చాలా మంది లేరు. వాళ్ళ వారసులు ఎక్కడున్నారో తెలియదు. అయితే, నేను నటించిన చిత్రాల తాలూకు వీడియోలను మాత్రం సేకరించి, భద్రపరుస్తున్నా. 'ఈ' టి.వి. రామోజీరావు గారు కూడా నేను ఉత్తరం రాస్తే, నా అభ్యర్థనను మన్నించి, ఆయన దగ్గరున్న నా చిత్రాల వీడియోలను పైసా తీసుకోకుండా కాపీ చేయించి ఇచ్చారు. అసలు మన సినీ పరిశ్రమకే ఒక లైబ్రరీ కావాలి. అందులో మన క్లాసిక్ చిత్రాల కాపీలన్నిటినీ భద్రపరచాలి. ఆ కృషి ప్రభుత్వం, సినిమా రంగం చేయాలి. పుణేలోని ఆర్కైవ్స్‌లో ఆ ప్రయత్నం కొంత జరుగుతున్నా, అది సరిపోదు.
శ్రీమతి అన్నపూర్ణతో మీది సుదీర్ఘ కాల అనుబంధం. ఆ వియోగాన్ని ఎలా భరిస్తున్నారు?
కష్టమే. కానీ తప్పదు. నిజం చెప్పాలంటే, మంచాన పడి, రోజూ యాతన అనుభవిస్తున్నప్పుడు అప్పట్లో మా అమ్మ కానీ, ఆ మధ్య నా శ్రీమతి కానీ చనిపోతేనే బాగుంటుందని కోరుకున్నా. ఇది చాలా మందికి కటువుగా కనిపించవచ్చు. కానీ, సత్యప్రమాణకంగా నేను అలా అనుకున్నాను. కిడ్నీలు పాడైపోయి, నా శ్రీమతి దాదాపు ఏణ్ణర్ధం పాటు ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటూ, చక్రాల కుర్చీలో కూర్చొని, శరీరంలోని భాగాలపై నియంత్రణ లేక నానా అగచాట్లూ పడిన వైనం నేను కళ్ళారా చూశాను. ఒంటి మీద అదుపు పోయినందుకు ఆమె తనను తాను తిట్టుకుంటూ, విచారపడడం చూశాను. ఆ యాతన నుంచి ఆమె ఎంత త్వరగా విముక్తి అయితే, అంత బాగుండని అనుకున్నా. అది ప్రాక్టికల్ ఆలోచన. అంతే కాదు! ఎక్కువ కాలం బతకవన్న సంగతి ఆమెకు కూడా చెప్పి, ఆ లోపల తన చివరి కోరికలు తీర్చేందుకు ప్రయత్నించాను. తన ఆస్తిపాస్తులను ఎవరికి ఎలా ఇవ్వాలనుకుంటోందో తెలుసుకొని, వివరాలన్నీ కాగితం మీద రాయించుకొని, ఆమె మరణించగానే ఆ వివరాలు అందరి ఎదుటా పెట్టాను. అలాగే, అన్నీ పంచాను. నా శ్రీమతికి కూడా తాను చనిపోతానని ముందే తెలుసు. అందుకే, 'నా టైమ్ అయిపోయింది. ఆసుపత్రిలో ఉండను. ఇంటికి పంపెయ్య'మని డాక్టర్‌ను అడిగింది. అలాగే, ఇంటికొచ్చిన మరునాడే ఆమె కన్నుమూసింది. నాకూ, ఆమెకూ మధ్య ఏనాడూ అరమరికలు లేవు. ఒకటి రెండు రోజులకు మించి నేను ఎక్కడకైనా వెళుతుంటే, చాలామంది నటులకు భిన్నంగా నేను నా శ్రీమతిని వెంట తీసుకువెళ్ళేవాణ్ణి. అలా ప్రపంచమంతా తిరిగాం. ఎప్పుడైనా, ఎక్కడైనా నేను జారిపోతానేమో అన్న భయం కూడా ఆమెను నా వెంటే ఉంచుకొనేలా చేసింది. ఆమె నా పక్కనే ఉండడం కూడా నాకు తెలియకుండానే నన్ను నేను నియంత్రించు కోవడానికి ఉపకరించింది. అలాగే, నేను జీవితంలో ఒకటీ, అరా తప్పులు చేస్తే, అవి కూడా ఆమెకు తెలుసు. ఆమెకు తెలియకుండా నా జీవితంలో ఏమీ లేవు. మా దాంపత్యం అలాంటిది. నా మనస్సులో ఉన్నది నేనెప్పుడూ ధైర్యంగా చెబుతాను. నటనే నా వృత్తి కాబట్టి, కెమేరా ముందు జీవితమంతా అబద్ధమే. కెమేరా వెనుక నా నిజజీవితంలో మాత్రం నేనెన్నడూ యాక్ట్ చేయను.
ఈ సుదీర్ఘ పయనంలో నటనపై విసుగెత్తలేదా?
లేదు. నేను ఆస్తికుణ్ణి కాదు. అయితే, ప్రకృతికి భక్తుణ్ణి. పని చేయడం వల్ల ఓ తృప్తి లభిస్తుంది. అలా తృప్తిగా ఓ పని చేయడం వల్ల శక్తిని కోల్పోము, పుంజుకుంటాం.
ఎన్టీయార్‌లో ఆవేశం ఎక్కువైతే, మీరు ఆలోచన నిండిన వ్యూహచతురులనే ఓ విమర్శ ఉంది!
అందులో విమర్శేముంది! నన్ను ఆలోచనాపరుడంటే అది పొగడ్తేగా!
ఇన్నేళ్ళలో మన సినిమాల్లో గమనించిన ముఖ్య మార్పు చెబుతారా?
- సినిమా పరిశ్రమలో ఓ పొరపాటు జరుగుతోంది. అప్పట్లో కథాబలం ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడది తగ్గింది. అప్పట్లో, సాంఘికం, జానపదం, పౌరాణికం - ఇలా అన్ని తరహా చిత్రాలూ చేసేవాళ్ళం. పైగా గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే 'మాయలోకం', 'కీలుగుఱ్ఱం' లాంటి వాటితో మెప్పించాం. కానీ, ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చాక అతి పెరిగింది. అవే కథను కమ్మేస్తున్నాయి. మనం నగలు పెట్టేది అమ్మాయి అందాన్ని పెంచడానికే కానీ, కమ్మేయడానికి కాకూడదు కదా! ఇలాంటి లోపాల వల్లే మన సినిమాల్లో వైఫల్యాల రేటు పెరుగుతోంది. అప్పట్లో సినిమాలు చాలా అరుదుగానే విఫలమ య్యేవి. కానీ, ఇప్పుడు మాత్రం చాలా అరుదుగా సక్సెస్ అవుతు న్నాయి. పాటలు, డ్యాన్సులు శరీరాన్ని తాకుతున్నాయి కానీ, మనస్సునూ, గుండెనూ తాకడం లేదు. పాటల్లో బీట్ ఎక్కువై, మెలొడీ తగ్గింది. మళ్ళీ మార్పు రావాలి. తప్పనిసరిగా వస్తుందనీ, అదీ త్వరలోనే వస్తుందని నాకు ఆశ, నమ్మకం. ఎందుకంటే, కాలంతో పాటు మార్పు తప్పదు కదా!
- ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Page No.8)
.........................................................................