జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, January 5, 2014

చతికిలబడ్డ నిధి అన్వేషణ (క్షత్రియ - సినిమా రివ్యూ)

(ఇది 10 టి.వి.లో ప్రసారమైన సమీక్ష) 
గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ హీరో శ్రీకాంత్. ఆయన రీసెంట్ గా వెంకీతో 'షాడో' సినిమాలో నటించినా.. అది భారీ ఫ్లాప్ అయ్యింది. దీంతో శ్రీకాంత్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈనేపథ్యంలో తను ప్రతిష్టాత్మకంగా 'క్షత్రియ' సినిమా చేశాడు. కె.విజయ్ చందు డైరెక్షన్ లో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. 2014తొలిరోజే విడుదలయిన ఈమూవీ అటు టాలీవుడ్ కు ఇటు శ్రీకాంత్ కు సక్సెస్ ను ఇచ్చిందా..? లేదా..? అనేది చూద్దాం..

       కథ విషయానికి వస్తే:.. మనీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ శ్రీకాంత్ నటించాడు. అయితే తాను చేసే పనికి కరెక్ట్ రీజన్ ఉండాలనుకుంటాడు. ఆ క్రమంలో ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయికి సంబంధించి వివరాలు కనుక్కోమని లోకల్ డాన్ చెబుతాడు. దీనికి అంగీకరించిన శ్రీకాంత్ ఆమెను గమనించే క్రమంలో లవ్ లో పడతాడు. ఇక ఓ పెద్ద బంగళాలో ఉన్న ఆ అమ్మాయిపై కొందరు చేతబడి ప్రయోగించడం, రోజూ రాత్రిళ్లు ఆ ఇంట్లో భయానక సంఘటనలు, హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. అసలు క్షత్రియ అంటే ఎవరు..? వారంతా హీరోయిన్ నే ఎందుకు టార్గెట్ చేశారు..? ఆ ప్రమాదాల నుంచి హీరో ఆమెను కాపాడతాడా..? లేదా ..? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:..
        
ఇండస్ట్రీలో కథల కొరత ఏ రేంజ్ లో ఉందో మనకు ఈ సినిమా చూస్తే అర్థమవుతోంది. కథకు తగ్గ కథనం లేకపోవడం వల్ల, దర్శకుడి అనుభవరాహిత్యం వల్ల ఈ సినిమా రక్తి కట్టించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. నిజానికి ఇలాంటి సినిమాను ఓ అనుభవం ఉన్న దర్శకుడు తీస్తే బాగా వచ్చేదేమో గానీ.. అనుభవం లేని విజయ్ చందు చేయడం వల్ల హార్రర్ మిక్స్ చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాస్తా ఎటూ కాకుండా పోయింది. నిజానికి ఇది ఓ నిధికి సంబంధించిన అన్వేషణ. దానికి సైకలాజికల్ ఎలిమెంట్స్ కలిపి మంచి కథ అనిపించుకున్న దర్శకుడు దాన్ని తెరకెక్కించడంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.


           నిజానికి ఈ కథ చాలా క్లిష్టంగా ఉంది. దాన్ని దర్శకుడి అనుభవరాహిత్యంతో మరింత సంక్లిష్టంగా తెరకెక్కించనట్టు కనిపిస్తుంది. ఇందులో దెయ్యాలకు సంబంధించిన సీన్స్ చూస్తే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. అదే సమయంలో దెయ్యాలు లేవనే విషయాన్ని సైంటిఫిక్ ప్రూవ్ చేయడం దర్శకుడి తెలివికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే కథన లోపం ఉన్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ నటుడిగా బాగా చేసినా అతని పాత్ర ఆకట్టుకునేలా లేదు. ఓ చిన్న రౌడీ అవసరమైతే సైకియాట్రిస్ట్ గా, ఫిజిక్స్ తెలిసినవాడుగా, చరిత్రకారుడిగా, సడెన్ గా కంప్యూటర్ లో తలపండినవాడిగా మారినట్టు చూపించడం దర్శకుడి అవగాహన లేమికి నిదర్శనం అని చెప్పవచ్చు. అయితే దీనిలో అందరు సీనియర్ నటులు నటించడం ఓ విశేషం. వారు తమ మార్కు నటనతో పర్వాలేదనిపించారు. ఇక హీరోయిన్ 'కుంకుమ' మైనస్ అని చెప్పవచ్చు. ఏమాత్రం నటనలోగాని, అందంతోగాని ఆకట్టుకోలేకపోయింది.

        ఇక ఇలాంటి సినిమాలకు టెక్నికల్ యాస్పెక్ట్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలోనూ క్షత్రియ విఫలమయ్యింది. నేపథ్య సంగీతం యావరేజ్ గా ఉండటం ప్రధాన లోపమైతే.. ఎడిటింగ్ లో కట్ చేయాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. చీకటి, పగలు సీన్లతో ఫస్టాఫ్ నిండిన ఈ సినిమా సెకండాఫ్ లో అక్కడక్కడా ఆకట్టుకున్నా.. మొత్తంగా క్షత్రియ నిరాశపరుస్తుంది. ఫోటోగ్రఫీ యావరేజ్ గా..ఉన్న ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ప్లస్ లు: కథ, ఆర్టిస్టులు.
మైనస్ లు: దర్శకుడు, స్ర్కీన్ ప్లే, ఎడిటింగ్, హీరోయిన్, మాటలు.

        
ఇక2014 న్యూ ఇయర్ మొదటి రోజునే కొత్తదనం ఉన్న కథతో వచ్చిన 'క్షత్రియ' కథనలోపంతో వైఫల్యమైన సినిమాగానే చెప్పాలి. అంటే ఈ ఏడాది టాలీవుడ్ ఫ్లాప్ సినిమాతోనే ప్రారంభమైందనుకోవచ్చు. మంచి నటన చూపిన శ్రీకాంత్ కు క్షత్రియ మరోసారి నిరాశనే మిగిల్చింది. 
ఇక ఈసినిమాకు '10టివి' ఇచ్చే రేటింగ్-1.5/5.

0 వ్యాఖ్యలు: