జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, January 27, 2014

భరించలేం... బంగారం! ('లవ్ యూ బంగారం' సినిమా రివ్యూ)




  ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి తారాపథానికి దూసుకువచ్చిన దర్శక - నిర్మాత మారుతి. ఆయన సమర్పణలో, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మించిన సినిమా 'లవ్‌ యు బంగారం'. గతంలో వచ్చిన 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్‌', నిరుటి 'రొమాన్స్' లాగానే మారుతి ఈ సారి కూడా తనకు అలవాటైన అసభ్య, అశ్లీల పద్ధతిలోనే తీసిన సినిమా ఇది. యూత్‌ను ఆకట్టుకోవాలనే దుగ్ధతో బూతు చిత్రాలు తీస్తున్న ఇటీవలి కుక్కమూతి పిందెల ధోరణికి ఈ సినిమా మరో తాజా ఉదాహరణ. 

     సర్వసాధారణంగా కాలేజీ ప్రేమ కథలను తీసుకొనే మారుతి ఈసారి భార్యాభర్తల మధ్య ప్రేమనూ, వారి మధ్య శృంగారాన్నీ ఎంచుకున్నాడు. విశాఖపట్నంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు హీరో ఆకాశ్‌ (శేఖర్‌ కమ్ముల తీసిన 'హ్యాపీ డేస్‌' ఫేమ్‌). నిదానంగా సాగే ఈ కుర్రాడు, వేగంగా సాగే మీనాక్షి ('ఆర్య'లో బాల నటిగా మెరిసి ఇప్పుడు హీరోయిన్‌ అయిన శ్రావ్య) ప్రేమలో పడతారు. తల్లితండ్రుల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకుంటారు. ఆపైన హైదరాబాద్‌కు మకాం మారుస్తారు. 
కొన్నాళ్ళు ఆనందంగా జీవితం గడిచాక, ఇంట్లో విసుగు పుడుతోంది కాబట్టి, ఉద్యోగం చేస్తానంటుంది హీరోయిన్‌. అందుకు సరేనంటాడు హీరో. ఆమె ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరుతుంది. కానీ, అభద్రతా భావం, భార్య పట్ల అనుమానం అతని బలహీనతలు. అదే సమయంలో ఆమె చిన్ననాటి బారుఫ్రెండ్‌ ఒకరు కథలోకి వస్తారు. ఆ క్రమంలో ఆమె ప్రవర్తన భర్తకు అనుమానాస్పదంగా మారుతుంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోంది? అసలు ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? భర్త అనుమానం నిజమైందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా. 
భార్యను భర్త అనుమానించడం అనే అంశం చుట్టూ అల్లుకున్న ఈ సినిమా అసలు కథలోకి ద్వితీయార్ధంలో గానీ రాదు. ప్రథమార్ధంలో, అందులోనూ సినిమా మొదట్లో చాలాసేపు అసలు ఇతివృత్తానికి సంబంధం లేని ప్రేమ కథగా నడుస్తుంది. హీరో, హీరోయిన్ల తండ్రులను రాజకీయ నాయకులుగా చూపిస్తూ, అడ్డమైన కామెంట్లూ చేశారు - దర్శక- రచయిత, సమర్పకుడు. ద్వితీయార్ధమంతా భార్యను అనుమానించే భర్త అనే కాన్సెప్ట్‌లో వెళ్ళే ఈ కథకు కీలక పాత్రధారి మాత్రం సినిమా మరో పావుగంటలో ముగిసిపోతుందనగా కనిపిస్తాడు. అదీ అమితమైన ఓవర్‌ యాక్షన్‌తో! ఫస్టాఫ్‌లోనే చాలా సార్లు సహనం చచ్చిపోయిన ప్రేక్షకుడు, అప్పటికి పూర్తిగా విసిగిపోయి ఉంటాడు. అవి చాలదన్నట్లు, సినిమా అయిపోతుండగా రోలింగ్‌ టైటిల్స్‌లో సమర్పకుడు మారుతి కనిపించి, మరేదో మహత్తర కామెడీ సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. 

సినిమాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మీరా పాత్ర తాను తన భర్తకు దూరంగా బతకడానికి కారణాన్ని వివరిస్తుంది. తీరా దానికీ, సినిమా చివరలో విలన్‌ ద్వారా చెప్పించిన విషయానికీ పొంతన లేదు. అలాగే, విలన్‌ బెదిరింపులతో హీరోయిన్‌ ప్రవర్తించిన తీరుకూ ఓ లాజిక్‌ లేదు. హీరో పాత్ర ప్రవర్తనకూ ఓ స్థిరమైన నడక లేదు. 
మారుతి మార్గదర్శకత్వంలో దర్శకుడు ఈ సినిమాలో కాలేజీ కుర్రకారు ప్రేమల కన్నా మరీ అన్యాయంగా, భార్యాభర్తల మధ్య శృంగారాన్ని చూపించారు. దుస్తుల దుకాణంలోని ట్రయల్‌ రూమ్‌లో, బయట పార్కుల్లో ఇలా ఎక్కడబడితే అక్కడ వారు ప్రణయం సాగించినట్లు చూపించారు. సినిమాలో బెడ్‌ రూమ్‌ దృశ్యాలకూ, మసాలా పాటల చిత్రీకరణకూ లెక్క లేదు. కథలో కానీ, కథనంలో కానీ ఆసక్తిగా సాగే సన్నివేశాలు తక్కువ కావడంతో, సినిమాను పాటలతో నింపేశారు. ఫస్టాఫ్‌లోనే నాలుగు పాటలు వచ్చేస్తే, ద్వితీయార్ధంలో మరో నాలుగు దాకా పాటలు వినిపిస్తాయి. భార్య పుట్టినరోజు కానుకగా భర్త ఓ ఐటమ్‌ సాంగ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు చూపడం దర్శక, రచయితల మానసిక పరిస్థితికి పరాకాష్ఠ. 

సినిమా నిండా అశ్లీల దృశ్యాలతో పాటు, అసభ్య సంభాషణలే. 'సీల్‌ ఓపెన్‌ చేయడంలో నా అంత ఎక్స్‌పీరియన్స్‌ ఎవరికీ లేదు' (ఓ అమ్మాయితో అబ్బాయి), 'తొక్కడం కొత్తనుకుంటానే వీడికి' (ఓ అబ్బాయి గురించి స్నేహితురాళ్ళతో ఓ అమ్మాయి), డబుల్‌ మీనింగ్‌ డైలాగులకు లెక్కే లేదు. మహిత్‌ నారాయణ్‌ సంగీతంలో ఒకటి, రెండు పాటల బాణీలు మాత్రం బాగున్నాయి. అయితే, పాటల సాహిత్యంలోనూ బూతు బాటను దర్శకుడు వదలలేదు. 

ఈ సినిమాకు హీరో రాహుల్‌ ఓ పెద్ద మైనస్‌. అతనికి డైలాగ్‌ డెలివరీ కానీ, అభినయం కానీ పూజ్యం. అస్పష్టమైన మాటలు, అభినయ శూన్యత తెర మీద వెక్కిరిస్తూ కనిపిస్తాయి. కథానాయికగా తొలి పరిచయమైన శ్రావ్య చూడడానికి బాగానే ఉన్నట్లు అనిపించినా, ఆమె అందాలు ఆరబోసే ఆకర్షణీయ పాత్రలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఇక, సినిమాలో తెలిసిన నటీనటులెవరూ పెద్దగా కనిపించరు. అందరూ జూనియర్‌ నటీనటులే! హైదరాబాద్‌, వైజాగ్‌లలో పరిమిత బడ్జెట్‌లో తీసిన ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సిన ఇతర సాంకేతిక విభాగాలేమీ లేవు. 

ఉద్యమ పార్టీల మీద, సినీ విమర్శకుల మీద, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల మీద ఇటు అవగాహన కానీ, అటు బాధ్యత కానీ - రెండూ లేకుండా నోటికి వచ్చినట్టలా వ్యాఖ్యలు రాసి, అవన్నీ పాత్రలతో అనిపించేశారు. ఈ సినిమా చూశాక పదే పదే ప్రస్తావనకు గురయ్యే ఓ హీరో అభిమానుల మొదలు గుడిలో పూజారులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దాకా అందరికీ దర్శక, రచయితలు బాగానే చిర్రెత్తిస్తారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగమంటే, వరుస వావీ లేని వ్యక్తుల సమూహాలు చేసే కాలక్షేపం అన్నట్లు చూపెట్టారు. అలాగే, అమ్మాయిల మీద ఏ మాత్రం గౌరవం లేకుండా, వాళ్ళనూ, వాళ్ళ వ్యక్తిత్వాలనూ చాలా చౌకబారు అభిప్రాయంతో చిత్రీకరించిన తీరు సినిమా అంతటా కనిపిస్తుంది. కొన్ని మాటలు, దృశ్యాలు చూశాక అసలు ఈ సినిమాకు సెన్సార్‌ వాళ్ళు ఎలా అనుమతినిచ్చారా అన్న సందేహమూ కలుగుతుంది. 
గతంలో 'అభిలాష', 'ఛాలెంజ్‌', 'చంటి' లాంటి ఉత్తమ చిత్రాలను అందించిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ, క్రమంగా తన వారసుడు వల్లభను నిర్మాతగా పైకి తేవాలని చూస్తున్న ఆ సంస్థ అధినేత కె.ఎస్‌. రామారావు ఎందుకు ఈ సినిమా నిర్మించారో అర్థం కాదు. వాణిజ్య విజయం కోసం ఇంత దిగజారుడు సినిమా తీయడం వల్ల ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ తాత్కాలికంగా నాలుగు డబ్బులు రావచ్చేమే కానీ, శాశ్వతంగా మాత్రం గతంలో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు మసకబారిపోతాయి. ఆ సంగతి గ్రహించడం మంచిది. అన్నట్లు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ కూడా ఇప్పుడు మారుతితో సినిమా తీస్తోంది. మరి, వాళ్ళు ఏమవుతారో చూడాలి. 

కొసమెరుపు : ఏతావతా ఒకప్పటి 'బి' గ్రేడ్‌, 'సి' గ్రేడ్‌ మలయాళ బూతు సినిమాల తెలుగు వెర్షన్‌ లాగా ఈ సినిమా అనిపిస్తుంది. అలాంటి సినిమాను 70 ఎం.ఎం.లో, తెలుగు తారలు, తెలుగు డైలాగులతో చూడాలనుకొనే వారికి మాత్రమే ఇది 'లవ్‌ యు బంగారం'. మిగతా ప్రేక్షకులందరికీ ఇది 'హేట్‌ యు బంగార'మే! హాలులో ఈ రెండున్నర గంటల హింసను భరించి, బయటకొస్తూ ఓ నవ యువకుడు అన్న మాటల్లో చెప్పాలంటే, ఇది ''భరించలేం... బంగారం!''
- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 25th Jan 2014, Saturday, Page No.8)
............................................................

0 వ్యాఖ్యలు: