జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, January 14, 2014

వానపాటకు యాభై ఏళ్ళు! ('ఆత్మబలం' 50 ఏళ్ళు పూర్తి)

'చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే...' - ఈ పాట తెలియని పాత తరం సినీ ప్రేక్షకులు ఎవరూ ఉండరు. తెలుగు తెరపై వానపాటలకు ఓ ఊపునిచ్చిన ఈ తొలినాళ్ళ వర్ష గీతం ఇప్పటికీ ఆల్‌టైమ్‌ సూపర్‌హిట్టే! ఆ పాటకు దృశ్య రూపమిచ్చిన ఆనాటి సక్సెస్‌ఫుల్‌ సినిమా ఏయన్నార్‌ 'ఆత్మబలం'. 1964 జనవరి 9న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఇవాళ్టితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ సినిమా సంగతుల్లో కొన్ని...

అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి జంటగా నటించిన సినిమా ఇది. జగ్గయ్య మరో ముఖ్య పాత్ర పోషించారు. జగపతి పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయవంతమైన చిత్రాల దర్శకుడైన వి. మధుసూదనరావు దర్శకులు. నిజానికి, ఈ సినిమాకు 'అగ్ని సంస్కార' అనే ఓ బెంగాలీ చిత్రం ఆధారం. ఆ బెంగాలీ చిత్రానికి ఓ బెంగాలీ నవల మాతృక. అక్కడ విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా దర్శక, నిర్మాతలు మార్పులు చేసుకున్నారు. 


పాట ఎలా పుట్టిందంటే...
మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ అందించారు. కె.వి. మహదేవన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వానపాట 'చిటపట చినుకులు...' ఇవాళ్టికీ ఓ రొమాంటిక్‌ ఫీలింగే! అదొక్కటే కాదు... ఇంకా 'పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు...', 'గిల్లి కజ్జాలు పెట్టుకొనే...', 'ఎక్కడికి పోతావు చిన్నదానా...' లాంటి గీతాలన్నీ ఇవాళ్టికీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినీ గీత ప్రియుల నాలుకలపై నర్తిస్తున్నవే. 


అసలు ఈ చిత్రంలోని 'చిటపట చినుకుల...' పాట రచయిత మదిలో పుట్టడం వెనుక కూడా ఓ కథ ఉంది. ఈ సినిమాకు పాటలు రాయడం కోసం ఆత్రేయ ఇంకా తాత్సారం చేస్తున్నారట! హీరో, హీరోయిన్ల మధ్య యుగళ గీతానికి సరైన పల్లవి తట్టకపోవడంతో  కారులో షికారు చేస్తున్నారట! ఇంతలో వాన మొదలైంది. ఆ పరిస్థితుల్లో ఓ జంట ఆ కారుకు అడ్డం పడి పరిగెడుతూ, ఓ చెట్టు నీడకు పరిగెట్టారు. దాంతో, చటుక్కున ఆత్రేయకు పాట పల్లవి మదిలో మెరిసింది. అలా 'చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టాపట్టగా చేతులు పట్టి, చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి...' అంటూ చకచకా పల్లవి రాసేశారట! 

కొత్త ఫ్యాషన్‌కు శ్రీకారం


ఇక, అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవిపై చిత్రీకరించిన ఈ పాట షూటింగ్‌కు సంబంధించి మరో కథ ఉంది. ''వానలోని దృశ్యాలు చిత్రీకరించే సమయానికి ఓ హిందీ సినిమా షూటింగ్‌లో సరోజాదేవి తలకు గాయమైంది. దాంతో, వాన దృశ్యాల కోసం ఆమె తలకు స్కార్ఫ్‌ కట్టేశాం. అలా ఆపద్ధర్మంగా కట్టిన తలకు గుడ్డ కాస్తా ఆ తరువాత రోజుల్లో ఓ ఫ్యాషన్‌గా మారింది'' అని చిత్ర నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ ఆ సంగతులను గుర్తు చేసుకున్నారు. ఫస్ట్‌ రిలీజ్‌లో సక్సెస్‌! రీ రిలీజుల్లో హిట్‌!

చిత్రం ఏమిటంటే, ఇవాళ ఇంతగా చెప్పుకొంటున్న 'ఆత్మబలం' ఆ రోజుల్లో మరీ సూపర్‌హిట్టేమీ కాదు. కథాబలం, వానపాట లాంటి కమర్షియల్‌ హంగులు, మరెన్నో పాపులర్‌ పాటలు ఉన్నా, ఈ సినిమా తొలి రోజుల్లో సక్సెస్‌ఫుల్‌ సినిమాగా మాత్రమే నిలిచింది. అందుకు కారణాలు అనేకం. నిజానికి, 1964 జనవరిలో అక్కినేని నటించిన చిత్రాలు ఒకటీ, రెండు కాదు... ఏకంగా మూడు రిలీజయ్యాయి. జనవరి 1న బి.ఎన్‌.రెడ్డి 'పూజాఫలం', జనవరి 9న 'ఆత్మబలం', అదే నెల 31న ఆదుర్తి సుబ్బారావు 'మూగ మనసులు' జనం ముందుకు వచ్చాయి. 


'పూజాఫలం' ఫ్లాపైతే, బాగానే నడుస్తున్న 'ఆత్మబలం'కి మూడు వారాల తరువాత అక్కినేని చిత్రమే అయిన 'మూగ మనసులు' పోటీ అయింది. సావిత్రి, ఏయన్నార్‌, జమునల 'మూగ మనసులు' ప్రభంజనం ముందు 'ఆత్మబలం' కళ తప్పింది. ఒక హీరో సినిమాకు అతనిదే మరో సినిమా పోటీగా మారి, సక్సెస్‌ను ప్రభావితం చేయడం విచిత్రమే. అయితే, ఆ పోటీ, పోలిక లేకపోవడంతో, తరువాతి రిలీజుల్లో 'ఆత్మబలం' బాగా ఆడి, కాసులు కురిపించింది. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. 'ఆత్మబలం' గురించి, అందులోని 'చిటపట చినుకుల...' పాట గురించి ఇవాళ్టికీ చెప్పుకొనేలా చేసింది. 


మొత్తానికి, ఈ సూపర్‌ హిట్‌ వాన పాట తెలుగు తెరపై ఆ తరువాత మరెన్నో రెయిన్‌ సాంగ్స్‌కు దోవ చూపిందని చెప్పకతప్పదు. అప్పట్లో ఈ పాటలో కథానాయికను తడిసిన దుస్తుల్లో చూపించడం, ఆమె కొద్దిగా చీర కుచ్చిళ్ళు పైకెత్తి నడవడం లాంటివి ఎంతో అసభ్యంగా ఉన్నాయనీ విమర్శించిన వాళ్ళూ లేకపోలేదు. ఇవాళ్టి వానపాటలు చూశాక, ఇప్పుడు ఆ సంగతి చెబితే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఏమైనా, వానపాటలకు జెండా ఎగరేసిన తెలుగు సినిమాగా 'ఆత్మబలం' మరిన్ని రోజులు గుర్తుండక మానదు. 

- రెంటాల జయదేవ


(Published in Praja Sakti daily, 9th Jan 2014, Thursday, Page No.8)
..........................................

0 వ్యాఖ్యలు: