జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, January 24, 2014

బాటసారి తుది మజిలీ



-    మంగళవారం అర్ధరాత్రి అక్కినేని ఆఖరి శ్వాస 
-    ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-    విషాదంలో సినీ పరిశ్రమ 
-    అశేషజనం అశ్రునివాళి

      తెలుగు సినీ కళామతల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని హిమాలయ పర్వతమంత స్థాయికి తీసుకువెళ్ళిన నట శిఖరం ఒరిగిపోయింది. ఏడు దశాబ్దాల పాటు కథానాయక పాత్రలతో అందరినీ అలరించి 'ఎవర్‌గ్రీన్‌' తారగా వెలిగిన నట సమ్రాట్‌ 'టాటా వీడుకోలు... ఇంక సెలవు...' అంటూ అభిమానులకు వీడ్కోలు చెబుతూ తుది శ్వాస విడిచారు. అభిమానుల శుభాకాంక్షలతో క్యాన్సర్‌ను సైతం జయించి వస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆ వాగ్దానం మాత్రం నెరవేర్చకుండానే జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రియులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. శాసనసభ, మండలి సంతాపం ప్రకటించాయి. 
   తెలుగు సినీ రంగానికి రెండు కళ్ళలో ఒకటిగా అందరూ ప్రస్తావించే 'పద్మవిభూషణ్‌' అక్కినేని నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లో తన స్వగృహంలో కన్నుమూశారు. గడచిన సెప్టెంబర్‌ 20న తొంభయ్యో ఏట అడుగుపెట్టిన ఆయన కొద్ది నెలలుగా జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గడచిన అక్టోబర్‌ నెలలో ఆ వ్యాధి బయటపడడంతో రాష్ట్ర రాజధానిలోని 'కిమ్స్‌' ఆసుపత్రిలో శస్త్రచికిత్స కూడా జరిపారు. క్యాన్సర్‌కు గురైన పేగు భాగాన్ని తొలగించి, కొన్ని వారాలుగా కెమోథెరపీతో వైద్యం అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కూడా కుటుంబ సభ్యులతో మామూలుగా మాట్లాడిన ఏయన్నార్‌ ఆరోగ్యం రాత్రి భోజనం తరువాత క్రమంగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్న అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళి, తుది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
  ఏయన్నార్‌ మరణంతో తెలుగు చిత్రసీమను ఏలిన తొలినాళ్ళ హీరోల్లో ఆఖరి నట దిగ్గజం నిష్క్రమించినట్లయింది. మంగళవారం సాయంత్రం కూడా అక్కినేని చివరిసారిగా కుటుంబసభ్యులందరితో ఎంతో సంతోషంగా మాట్లాడారని నాగార్జున తెలిపారు. ఏయన్నార్‌ మరణ సమయంలో ఆయన కుమార్తె నాగసుశీల, మనుమడు - యువ హీరో సుశాంత్‌ పక్కనే ఉన్నారు. తెల్లవారుజామున అక్కినేని భౌతిక కాయాన్ని కేర్‌ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు. ఉదయం కొద్దిసేపు ఇంట్లో ఉంచిన తరువాత ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు, అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు తరలించారు.

   స్టూడియోలో అక్కినేని అత్యంత ఇష్టమైన 'క్రిటిక్స్‌ గ్రోవ్‌' ప్రాంతంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని అక్కినేని కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ అరుదైన నట విశారదుడి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కె. అరుణ వెల్లడించారు. 

  తమ అభిమాన నటుణ్ణి ఆఖరుసారిగా చూసుకోవడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి, దేశవిదేశాల నుంచి సినీప్రియులు పెద్దయెత్తున తరలివస్తున్నారు. జనం పోటెత్తడంతో అన్నపూర్ణా స్టూడియోస్‌ ప్రాంగణం క్రిక్కిరిసి కనిపించింది. చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా ఎంతో మంది సుదీర్ఘమైన క్యూలో నిల్చొని, అక్కినేని కడసారి చూపు కోసం నిరీక్షిస్తూ వచ్చారు. సినీ నటులు కృష్ణ, చిరంజీవి మొదలు పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌, అలీ, సీనియర్‌ నటుడు కాకరాల దాకా, నిర్మాతలు డి. రామానాయుడు, ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేశ్‌ప్రసాద్‌, దర్శకులు కె. రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లాణి శ్రీధర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఇంకా ఎంతో మంది రాజకీయ, సామాజిక ప్రముఖులు అక్కినేని భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలోనూ, అన్నపూర్ణా స్టూడియోలోనూ దర్శించి, నివాళులు అర్పించారు.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Thurs day, Page 1 and Page 4)
........................................................

0 వ్యాఖ్యలు: