సుప్రసిద్ధ సినీ నటి సుచిత్రా సేన్ కన్నుమూశారు. ఆమె వయసు 82 ఏళ్ళు. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌కు గురై కొద్దికాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఈ అలనాటి అందాల తార కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హౌమ్‌లో గురువారం ఉదయం 8.25 గంటలకు తీవ్రమైన గుండెపోటుకు గురై, తుదిశ్వాస విడిచారు. గడచిన డిసెంబర్ 24వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆమె గడచిన మూడు వారాలుగా 'లైఫ్ సపోర్ట్ సిస్టమ్' మీద ఉంటూ, అనారోగ్యంతో పోరాడి, ఆఖరుకు జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించడంతో సినీ పరిశ్రమ వర్గీయులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. బెంగాల్‌కు చెందిన సుచిత్రా సేన్ మరణంతో కోల్‌కతాలోని బెంగాలీయులు కడసారి చూపు కోసం ఆమె చికిత్స పొందిన నర్సింగ్ హౌమ్‌కు పెద్దయెత్తున తరలిరావడం విశేషం. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
అలనాటి ఆరాధ్య దేవత
బెంగాలీయులు 'మహానాయిక' (గొప్ప హీరోయిన్ అని అర్థం)గా పేర్కొనే సుచిత్రా సేన్ ఆ రోజుల్లో ఎంతోమందికి ఆరాధ్యదేవతగా వెలిగారు. 'దేవ్‌దాస్', 'ఆంధీ' లాంటి హిందీ చిత్రాల్లో ఆమె నటన ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టింది. బెంగాలీలో కూడా 'సప్తపది' (1961), 'దీప్ జ్వెలే జారు' లాంటి పలుచిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి. ముఖ్యంగా 'దీప్ జ్వెలే జారు' (1959)లో ఆసుపత్రి నర్సు రాధగా, 'ఉత్తర్ ఫల్గుణి' (1963)లో దేవదాసిగా - ఆమె కుమార్తెగా చేసిన ద్విపాత్రాభినయం ఇవాళ్టికీ బెంగాలీ సినీ ప్రియులకు మరపురానివే! ఓ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డు పొందిన తొలి భారతీయ నటి ఆమే! యాభై ఏళ్ళ క్రితం 1963లో మాస్కో చలనచిత్రోత్సవంలో 'సాత్ పాకే బాంధా' చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటిగా వెండి బహుమతిని ఆమె అందుకున్నారు. అలాగే, 1972లో భారత ప్రభుత్వం ఆమెకు 'పద్మశ్రీ' పురస్కారాన్నిచ్చింది.
సుచిత్రాసేన్ అసలు పేరు రమా దాస్‌గుప్తా. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931 ఏప్రిల్ 6న బెంగాల్‌లోని పబ్నా గ్రామం (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భాగం)లో ఆమె జన్మించారు. ఆమె తండ్రి కరుణామరు దాస్‌గుప్తా స్థానిక పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేసేవారు. తల్లి ఇందిరా దేవి సాధారణ గృహిణి. వారి అయిదో సంతానం సుచిత్ర. బెంగాలీ ధనిక పారిశ్రామికవేత్త కుమారుడైన దీపానాథ్ సేన్‌తో 1947లో ఆమె వివాహం జరిగింది. వారి సంతానమే - తరువాతి రోజుల్లో నటిగా పేరు తెచ్చుకున్న మూన్ మూన్ సేన్. కె. విశ్వనాథ్ దర్శకత్వంలోని 'సిరివెన్నెల'లో కూడా మూన్ మూన్ సేన్ నటించారు.
కాలం చెరపని తీపి జ్ఞాపకం
బెంగాలీ చిత్రాల్లో స్త్రీత్వానికి ప్రతిరూపంగా సుచిత్రా సేన్ పేరు తెచ్చుకున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది. సంప్రదాయానికి కట్టుబడి ఉంటూనే, ఆదర్శాల విషయంలో పక్కకు బెసగడానికి ఒప్పుకోని దృఢమైన స్త్రీ పాత్రలకు ఆమె జీవం పోశారు. నిజానికి, ఆమె నటించిన తొలి చిత్రం 'శేష్ కొఠారు' (1952) విడుదల కానే లేదు. ఆ మరుసటి ఏడాది నటుడు ఉత్తమ్‌కుమార్ సరసన ఆమె నటించిన 'షారే చౌత్తోర్' చిత్రం బాక్సాఫీస్ హిట్టవడంతో, ఆమె దశ మారిపోయింది. బెంగాలీ సినీ రంగంలో ఉత్తమ్‌కుమార్, సుచిత్రలది సూపర్‌హిట్ జంటగా పేరు తెచ్చుకుంది. దాదాపుగా రెండు దశాబ్దాల పైచిలుకు ఆ ప్రభంజనం కొనసాగింది. బెంగాలీ ప్రేమకథా చిత్రాలకూ, మెలోడ్రామా చిత్రాలకూ చెరగని చిరునామాగా నిలిచిన ఆమె ఒకటి, రెండు తరాల ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశారు. 1960లు, '70లలో ఆమె నటించిన చిత్రాల ఘన విజయాలతో అత్యంత పాపులర్ బెంగాలీ తారగా అవతరించారు.
హిందీ చిత్ర రంగంలో కూడా సుచిత్రాసేన్ మరిచిపోలేని పాత్రలు పోషించారు. బిమల్ రారు రూపొందించిన హిందీ 'దేవ్‌దాస్' (1955)లో దిలీప్‌కుమార్ సరసన పార్వతి పాత్రలో ఆమె చూపిన అభినయం ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. ఆ తొలి హిందీ చిత్రంతోనే ఆమె దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాగే, తరువాతి రోజుల్లో ఆమె నటించిన మరో హిందీ చిత్రం 'ఆంధీ' (1975), అందులో ఆమె పోషించిన రాజకీయ నాయకురాలు ఆర్తీదేవి పాత్ర సంచలనమయ్యాయి. భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆ సినిమా కథ అల్లుకోవడం చర్చనీయాంశమైంది. ఆ చిత్రంలో సంజీవ్ కుమార్‌తో కలసి ఆమె కనిపించే 'తేరే బినా మేరే జిందగీ సే...' అన్న పాట, అందులో ఆమె హావభావాలు ఆల్ టైమ్ హిట్టే! దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ సినిమా కూడా నిషేధానికి గురైంది. హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలోని 'ముసాఫిర్' కూడా ఎంతో పేరు తెచ్చింది.
తీరని సత్యజిత్ రే, రాజ్‌కపూర్‌ల కోరిక
వెండితెరపై బలమైన, భిన్నమైన స్త్రీ పాత్రలకు పేరు తెచ్చుకున్న ఆమె నిజజీవితంలోనూ తాను నమ్మిన రీతిలో దృఢమైన నిర్ణయాలు తీసుకొనేవారు. సుచిత్రా సేన్‌తో 'దేవి చౌధురాణి' పేరిట ఓ చిత్రం తీయాలని సత్యజిత్ రే భావించారు. కానీ డేట్ల సమస్యతో ఆమె తోసిపుచ్చారు. అలాగే, దర్శక - నటుడు రాజ్‌కపూర్ ఇచ్చిన సినిమా ఆఫర్‌ను కూడా ఆమె కాదన్నారు. దిలీప్ కుమార్ ఆమెకు మంచి మిత్రుడు. అలాగే, దేవానంద్‌తో కూడా 'సర్హద్' (1960), 'బొంబయి కా బాబు' (1960) లాంటి చిత్రాల్లో నటించారు. భారీ బడ్జెట్ చిత్రాలకు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలు, దర్శకులతో సినీ జీవిత పయనానికి ఆమె మొగ్గుచూపడం విశేషం. దాదాపు పాతికేళ్ళ పాటు అపరిమిత ప్రభావం చూపిన ఆమె1978లో సినీ రంగానికి గుడ్‌బై చెప్పేశారు. జనజీవితానికి దూరంగా ఉండిపోయారు. రామకృష్ణ మిషన్ భావాలకు ఆకర్షితురాలై, వారి సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు.
దశాబ్దాలుగా... జనం దృష్టికి దూరంగా...
సినిమాల నుంచి పక్కకు తప్పుకున్న తరువాత దాదాపు మూడు దశాబ్దాల పైగా ఆమె జనానికీ, ప్రచారానికీ దూరంగా ఉంటూ వచ్చారు. కోల్‌కతా దక్షిణ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జనం కంటికి దూరంగా కాలం గడుపుతూ వచ్చారు. నిజానికి, 2005లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నివ్వాలని భావించింది. అయితే, అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వ్యక్తిగతంగా వచ్చి జనం దృష్టిలో పడడం ఇష్టం లేని సుచిత్రాసేన్ సినీ రంగంలో ప్రభుత్వమిచ్చే ఆ అత్యున్నత పురస్కారాన్ని సైతం తిరస్కరించడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామిచ్చే అత్యున్నత పురస్కారమైన 'వంగ విభూషణ్' పురస్కారాన్ని 2012లో ఆమెకు ప్రకటించారు.
ఎవరి కంటా పడకుండా అనారోగ్యంతో కాలం గడుపుతున్న ఆమెను రహస్యంగా కెమేరాలో చిత్రీకరించడం కోసం ఓ ప్రముఖ బెంగాలీ వార్తా చానల్ కొన్నేళ్ళ క్రితం ఓ జర్నలిస్టును ఆసుపత్రి సిబ్బంది వేషంలో ఆమె ఇంటికి కూడా పంపింది. వ్యక్తిగత గోప్యతను గౌరవించని ఈ రహస్య ఆపరేషన్ నైతికత మాటెలా ఉన్నా, సుచిత్రా సేన్ అంటే బెంగాలీయులకు ఉన్న ఆరాధన, ఎలాగైనా ఆమెను చూడాలన్న కోరికకు ఆ ఉదంతం ఓ మచ్చుతునక. నటుడు, దర్శక - నిర్మాత దేవానంద్ ఓ సందర్భంలో చెప్పినట్లు, ''సుచిత్రా సేన్‌ను కేవలం అందగత్తె అని చెప్పి ఊరుకోలేం. అందం కన్నా, ఆమె వ్యక్తిత్వం ఇంకా గొప్పది. అందుకే ఆమె దృఢనిశ్చయంతో ఉన్న వ్యక్తిగా, వీడని ఓ చిక్కుముడిగా అందరినీ ఆకర్షించారు.'' ఆ ఆకర్షణ, ఆ మార్మికతల్ని బెంగాలీ, హిందీ సినీ ప్రియులు ఎన్నటికీ మర్చిపోలేరు.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 18th Jan 2014, Saturday, Page No.8)
...............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment