జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, January 24, 2014

అలుపెరుగని సినీ బాటసారి అక్కినేని   రంగస్థలం మీద నుంచి సినీ రంగానికి వచ్చిన తొలి తరం తారల్లో అక్కినేని ఒకరు. పి. పుల్లయ్య దర్శకత్వంలోని 'ధర్మపత్ని' (విడుదల: 1941 జనవరి 10న)లో ఓ చిన్న పాత్రతో ఆయన సినీ జీవిత ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి చనిపోవడానికి కొద్ది నెలల ముందు షూటింగ్‌లో పాల్గొన్న సొంత చిత్రం 'మనం' (ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది) దాకా ఆయన సినీ జీవిత పయనం సుదీర్ఘంగా సాగింది. 'మనం' ఆయన నటించిన 256వ సినిమా! 
ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కెరీర్‌లో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. సాంఘికాలు చేశారు, మెప్పించారు. పౌరాణికాల్లో మెరిశారు. చారిత్రక పాత్రల్లో విమర్శకుల ప్రశంసలు పొందారు. అయితే, కెరీర్‌ తొలి రోజుల్లో జానపద హీరోగా అనిపించుకున్న అక్కినేని, ఆపైన దీర్ఘకాలంలో అది తనకు విజయసూత్రం కాదని గ్రహించి, సాంఘికాల వైపు మళ్ళడం విశేషం. చివరి దాకా సాంఘికాలకూ, అందులోనూ ప్రేమ కథలకూ, విషాదాంత ప్రేమకథలకూ తనదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు.

ఆయన కెరీర్‌ను గమనిస్తే... తొలి పూర్తి తెలుగు టాకీ కన్నా ఏడేళ్ళ పై చిలుకు పెద్దవాడైన అక్కినేని 'ధర్మపత్ని' (1941)లో బాలానందం పిల్లల్లో ఒకడిగా ఓ పాటలో కనిపించి, తెరంగేట్రం చేశారు. ఆ పైన ఆశించిన అవకాశాలు రాక రంగస్థలికే పరిమితమయ్యారు. దర్శక - నిర్మాత ఘంటసాల బలరామయ్య చలవతో 'శ్రీసీతారామ జననము' (1944)తో హీరో అయ్యారు. 'ముగ్గురు మరాఠీలు', 'రత్నమాల' తరువాత 'బాలరాజు' (1948)తో హీరోగా నిలబడ్డారు. 'కీలుగుఱ్ఱం', 'లైలా మజ్ను' లాంటి విజయాలు, 'శ్రీలక్ష్మమ్మ కథ' లాంటి పోటాపోటీ చిత్రాల తరువాత జానపద హీరోగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దాంతో, పునస్సమీక్షించుకొని, 'సంసారం'తో సాంఘిక చిత్రాల బాట పట్టారు. 
భరణీ వారి చిత్రాల్లో భానుమతికి జోడీ అయ్యారు. 'ప్రేమ' (తమిళంలో 'కాదల్‌') తదితర చిత్రాలతో, ఆ పైన 'దేవదాసు' (1953)తో ప్రణయ కథానాయకుడిగా తెలుగు, తమిళ దేశ ప్రజల నీరాజనాలు అందుకున్నారు. 'చక్రపాణి' (1954), 'మిస్సమ్మ' ('55) లాంటి వినోదాత్మకాలూ, 'విప్రనారాయణ' ('54) లాంటి భక్తి చిత్రాలు, 'అర్ధాంగి', 'రోజులు మారాయి', 'దొంగరాముడు' లాంటి సాంఘికాలు వరుస విజయాలిచ్చాయి. 'మాయా బజార్‌', అరవంలోనే కాక తెలుగులోనూ వచ్చిన పార్‌ట్లీ కలర్‌ 'అల్లావుద్దీన్‌', తెలుగు నుంచి తమిళ, హిందీ భాషలకు అనువాదమైన 'భూకైలాస్‌'తో అక్కినేని కీర్తి ఎల్లలు దాటింది. 'మాంగల్య బలం' (1959), 'జయభేరి' ('59), 'శాంతి నివాసం' ('60), 'మహాకవి కాళిదాసు' ('60) లాంటి విభిన్న చిత్రాలు ఆయన ప్రతిభకు గీటురాళ్ళయ్యాయి. ''వద్దని వారించినా'' భానుమతి తీసిన 'బాటసారి' ('61) అక్కినేని మాటల్లోనే చెప్పాలంటే, ఆయన ''కెరీర్‌లో మరపురాని కళాఖండం.''

1960 -'71 మధ్య 'ఇద్దరు మిత్రులు', 'ఆరాధన', 'మూగమనసులు', 'అమరశిల్పి జక్కన', 'ప్రేమ్‌నగర్‌', 'దసరా బుల్లోడు' లాంటి వైవిధ్య చిత్రాలు బంగారం పండించాయి. ఆ పై 'అందాల రాముడు' (1973), 'మహాకవి క్షేత్రయ్య' ('76) రజత నందులు సాధించాయి. ఆ పైన 'దేవదాసు' స్ఫూర్తి ఉన్న 'ప్రేమాభిషేకం' ప్లాటినమ్‌ జూబ్లీ విషాదాంత హీరోగా అక్కినేని కీర్తికి కలికితురాయి. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులెన్నో అందుకున్న 'మేఘసందేశం' ('82)ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిన కళాఖండం.
 క్రమంగా పెద్ద తరహా పాత్రలకు మళ్ళిన అక్కినేని 'బహుదూరపు బాటసారి', 'సూత్రధారులు', 'సీతారామయ్య గారి మనవరాలు' ('91), ఉత్తమ నటుణ్ణి చేసిన 'బంగారు కుటుంబం' ('94) తరువాత రాశి తగ్గించారు. అడపా దడపా 'చుక్కల్లో చంద్రుడు', 'శ్రీరామదాసు' లాంటి సినిమాల్లో కనిపించారు. బాపు - రమణల 'శ్రీరామరాజ్యం' ఏయన్నార్‌ నటించగా విడుదలైన ఆఖరి చిత్రం. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న 'మనం'లో ఆయన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తయింది. ఆపరేషన్‌ అయి వచ్చాక, అక్కినేని ముందుజాగ్రత్తగా తన పాత్రకు డబ్బింగ్‌ కూడా చెప్పేశారు. ఈ ఏడాది రానున్న ఆ సినిమాతో ఈ బహుదూరపు బాటసారి సినీ జీవితం ముగిసిపోవడం సినీ ప్రియులకు విషాదమే! 

అక్కినేని బాక్సాఫీస్‌ ప్రస్థానం
ఎనిమిది దశాబ్దాలుగా నట రంగంలో ఉంటూ, అందులో ఏడు దశాబ్దాల పైగా సినీ రంగంలో కొనసాగిన ఏకైక భారతీయ నటుడు అక్కినేనే! ఇన్నేళ్ళు నటనను కొనసాగించిన మరో వ్యక్తి దేశవిదేశాల్లోనూ మరెవరూ ఉండి ఉండకపోవచ్చు. మొత్తం 256 చిత్రాల్లో కెరీర్‌ తొలినాళ్ళలో, చివరి రోజుల్లో పోషించిన సహాయక పాత్రల లాంటివి వదిలేస్తే, దాదాపు 210 దాకా చిత్రాల్లో ఆయనే హీరో. ఈ సినిమాల్లో సుమారు 70 పైచిలుకు చిత్రాలు థియేటర్‌ మారకుండా, నేరుగా శతదినోత్సవాలు జరుపుకొన్నవే.

ఇక, థియేటర్లు మారి (షిఫ్టింగ్‌తో) వంద పైచిలుకు సినిమాలు వంద రోజుల ఉత్సవాలు చేసుకున్నాయి. భారతదేశంలో ఎన్టీయార్‌, తమిళ నటుడు ఎమ్జీయార్‌ తరువాత ఇన్ని శతదినోత్సవ చిత్రాలున్న నటుడు అక్కినేనే! ఆయన నటించిన 'దేవదాసు' చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 70 ఎం.ఎం.లో ఉదయం ఆటలతో రీ-రిలీజులో 104 రోజులు ఆడి, సంచలనం రేపింది. 
అక్కినేని చిత్రాల్లో స్ట్రెయిట్‌గా సిల్వర్‌ జూబ్లీ జరుపుకొన్న చిత్రాలు పది దాకా ఉన్నాయి (రోజులు మారాయి, సువర్ణ సుందరి, మాయాబజార్‌, పెళ్ళి కానుక, గుండమ్మ కథ, ఇద్దరు మిత్రులు, మూగమనసులు, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం). షిఫ్టింగులతో సిల్వర్‌ జూబ్లీ చేసుకున్న చిత్రాల్లో 'బాలరాజు' నుంచి 'సీతారామయ్య గారి మనవరాలు' దాకా దాదాపు 11 ఉన్నాయి. 
ఇక, 'దసరా బుల్లోడు', ప్రేమాభిషేకం', 'ఏడంతస్తుల మేడ' చిత్రాలు ద్విశతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. వాటిలో మొదటి రెండు చిత్రాలు ఇంకా ముందుకు సాగి, ఏడాది పాటు ఆడి రికార్డు సృష్టించాయి. ఇక, ట్రాజెడీ హీరోగా ఏయన్నార్‌కు ఉన్న పేరును నిలబెట్టిన 'ప్రేమాభిషేకం' మరింత సక్సెస్‌ సాధించి, ఏకంగా 75 వారాలు ఆడి ప్లాటినమ్‌ జూబ్లీ చేసుకుంది. ఇన్ని విజయాలతో ఏయన్నార్‌ తన స్థానాన్ని అభిమానుల మదిలో సుస్థిరం చేసుకున్నారు.

- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Thursday, Page No. 8)
............................................................

0 వ్యాఖ్యలు: