జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, January 17, 2014

ఆరున్నర దశాబ్దాల సినీ ఆణిముత్యం నటి అంజలీదేవి

ఆరున్నర దశాబ్దాల పైచిలుకుగా తెలుగు వారి ఇంటింటా సుపరిచితురాలైన తొలినాళ్ళ నటీమణి అంజలీదేవి. ఆమె జీవితం, సినీ జీవితం ఊహించని ఎన్నో మలుపులతో సాగింది. 1928 October 28 సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె సినీ జీవితపు శిఖరాలను చూశారు. నిర్మాతగా నమ్మినవారి చేతుల్లో మోసపోయినప్పుడు ఈ రంగంలోని అగాధాల అంచులను కూడా తాకారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇతోధికంగా పాల్గొన్నారు. నటిగా, నిర్మాతగా బాక్సాఫీస్‌ హిట్లు అందించారు. భారీ ఫ్లాపులతో నష్టాలూ చవిచూశారు. ఎంతో సీనియర్‌ నటి అయినా, ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ 'పద్మ' పురస్కారమూ దక్కకుండానే కన్నుమూశారు. 

స్టేజీ నుంచి సినిమాకు...
అంజలీ దేవి నట జీవితాన్ని గమనిస్తే, ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఆమె బాల నటిగా రంగస్థలంపై ఓనమాలు దిద్దుకున్నారు. కాకినాడలోని ప్రసిద్ధ 'యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌' ఆర్గనైజర్‌ అయిన సంగీత దర్శకుడు, రచయిత ఆదినారాయణరావు ఆమెను నటిగా, నాట్యరాణిగా తీర్చిదిద్దారు. తల్లీ, తండ్రీ, గురువు, స్నేహితుడు - అన్నీ తానే అయిన ఆయన పట్ల అంజలీదేవికి ఆరాధనా భావం పెరగడంతో, అనంతరం 1942లో వారు పెళ్ళి చేసుకున్నారు. 

మొదట పలు ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించక చివరకు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని 'గొల్లభామ' (1947) చిత్రం ద్వారా అంజలీదేవి సినీ రంగ ప్రవేశం జరిగింది. ఓ నాటక ప్రదర్శనలో అంజలీదేవి అభినయం చూసిన ఆయన ఆమెకు సినిమా అవకాశమిచ్చారు. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే, కొన్ని వందల చిత్రాల్లో అమ్మ పాత్రలకూ, సాత్త్వికమైన పాత్రలనూ పోషించిన అంజలీదేవి మొదట్లో అందానికీ, ఆకర్షణకు ప్రాధాన్యమున్న వ్యాంప్‌ పాత్రలతో సినీ జీవితం ఆరంభించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తొలి చిత్రం విడుదల కాకుండానే ఆమెకు ఏకంగా నాలుగు సినిమాల్లో అవకాశం రావడం విచిత్రం. 'గొల్లభామ'లో మోహినిగా, అక్కినేని నటించిన 'బాలరాజు' (1948)లో అందగత్తెగా, 'కీలుగుఱ్ఱం' (1949)లో రాక్షస కన్యగా ఆమె ప్రేక్షకుల మనస్సు దోచారు.

మంచి పాత్రలతో మారిన ఇమేజ్‌
అంజలీదేవికి ఉన్న తొలి రోజుల నాటి వ్యాంప్‌ ఇమేజ్‌ను మార్చిన సినిమా ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో అక్కినేనితో నటించిన 'శ్రీలక్ష్మమ్మ కథ' (1950). అనంతరం ఆమె సీత, సుమతి, రుక్మిణి లాంటి పవిత్రమైన పాత్రలు చేశారు. పుల్లయ్య దర్శకత్వంలోనే ఎన్టీయార్‌ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతాదేవిగా నటించిన 'లవకుశ' ఆమెకు పెద్ద ఇమేజ్‌ను సంపాదించి పెట్టింది. 'తెలుగింటి సీతమ్మ'గా పేరు తెచ్చింది. 'భక్త ప్రహ్లాద', 'భక్త తుకారామ్‌', 'బడి పంతులు' లాంటి చిత్రాలు ఆమెను తెలుగువారు తమ ఇంటి మనిషిగా గుర్తు పెట్టుకొనేలా చేశాయి. కథానాయిక నుంచి క్రమంగా తల్లి పాత్రలకు ఆమె మారారు. అందరికీ ఆత్మీయంగా మెలిగారు. 

చిరస్మరణీయ చిత్రాల నిర్మాత 
సినీ పరిశ్రమలోకి వచ్చిన మూడేళ్ళకే అంజలీదేవి నిర్మాత అయ్యారు. అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు, అక్కినేని, మేకప్‌మ్యాన్‌ గోవిందరావు భాగస్వాములుగా అశ్వినీ పిక్చర్స్‌ పతాకంపై 'మాయలమారి' చిత్రాన్ని నిర్మించారు. కానీ, తరువాత ఆ చిత్ర నిర్మాణ సంస్థ మూతపడింది. అటుపైన అంజలి దంపతులు 1953లో 'అంజలీ పిక్చర్స్‌' పేరిట స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ పతాకంపై తీసిన 'పరదేశి' సినిమా ద్వారా తమిళ నటుడు శివాజీ గణేశన్‌ను తెలుగు వారికి పరిచయం చేశారు. ఆ కృతజ్ఞతతో ఆయన తరువాతి రోజుల్లో ఆమె నిర్మించిన 'భక్త తుకారామ్‌'లో ఛత్రపతి శివాజీ మహారాజుగా అతిథి పాత్రలో ఉచితంగా నటించారు. 

సొంత నిర్మాణ సంస్థపై ఆ దంపతులు దాదాపు పాతిక పైగా చిత్రాలు నిర్మించారు. 'అనార్కలి', బాక్సాఫీస్‌ బంపర్‌ హిట్‌ 'సువర్ణ సుందరి', 'స్వర్ణ మంజరి', 'సతీ సుమతి', 'సతీ సక్కుబాయి', 'భక్త తుకారామ్‌', 'మహాకవి క్షేత్రయ్య', 'చండీప్రియ' తదితర చిత్రాలు వారి నిర్మాణంలో వచ్చినవే. 

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వారు చిత్ర నిర్మాణం చేశారు. తమిళంలో ఎమ్జీయార్‌, శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ లాంటి స్టార్ల సరసన నటించిన అంజలీదేవి యాభయ్యో దశకంలో ఓ అరడజను హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌. ఎన్టీ రామారావు హిందీలో నటించిన ఏకైక సాంఘిక చిత్రం 'నయా ఆద్మీ'లో ఆమే హీరోయిన్‌. 'ఉస్తాద్‌', 'ఏక్‌ థీ రాజా', 'లడ్కీ', 'దేవ్‌తా' లాంటివి ఆమె నటించిన మరికొన్ని హిందీ చిత్రాలు. 





ఆత్మీయ పాత్రల అమ్మ

అప్పట్లో రోజూ రెండు కాల్షీట్లతో, రోజుకు పదహారు గంటలు పని చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఆమె. కథానాయిక నుంచి క్యారెక్టర్‌ వేషాలకు మారిన తరువాత వదినగా, అమ్మగా అంజలీదేవి నటించిన సినిమాలకు లెక్కలేదు. బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలోని 'రంగుల రాట్నం', ఎన్టీయార్‌తో 'బడి పంతులు' (దర్శకుడు పి.సి. రెడ్డి), ఎస్వీ రంగారావుతో 'తాత - మనవడు' (దర్శకుడు దాసరి నారాయణరావు), కాంచన నటించిన 'కల్యాణ మండపం' (దర్శకుడు వి. మధుసూదనరావు) లాంటివి ఆమె నటజీవితంలో మేలిముత్యాలయ్యాయి. 

నిజానికి, వంద సినిమాలు పూర్తయ్యాక ఒక దశలో ఆమె సినీ జీవితం నుంచి రిటైరై పోవాలని కూడా అనుకున్నారు. ఆ ఆలోచనతో కొత్త చిత్రాలు అంగీకరించడం కూడా ఆపారు. కానీ, అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ వారి దాడులతో చిక్కుల్లో పడ్డారు. మరోపక్క నటి వైజయంతిమాలతో హిందీలో తీసిన 'ఫూలోంకా సేజ్‌' చిత్రంలో ఫైనాన్షియర్లు మోసం చేయడంతో ఆస్తులన్నీ కోర్టు స్వాధీనమయ్యాయి. అయినా, అటు తమిళ చిత్ర సీమ, ఇటు తెలుగు సినీ సీమ ఆమెను ఆదరించడంతో మళ్ళీ పుంజుకున్నారు. 

చిత్ర నిర్మాణ రంగంలో దెబ్బతిన్న సమయంలో 1963లో సీనియర్‌ నటుడు చిత్తూరు వి. నాగయ్య ద్వారా సత్యసాయిబాబాకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయనకు భక్తురాలిగా మారిన ఆమె చెన్నైలో తమ ఇంటిని ఆనుకొనే ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆయన ఆశ్రమం 'సుందరం' నిర్మాణానికి రాసి ఇచ్చేశారు. 'షిర్డీ సాయి - పత్రి సాయి దివ్యకథ' అనే సీరియల్‌ను కూడా స్వయంగా నటిస్తూ, నిర్మించారు. 

తోటి తారలతో అనుబంధం
సౌతిండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు 1950 - 51లో ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ గౌరవం దక్కిన తొలి మహిళ అంజలీదేవే! అలాగే, దక్షిణ భారత చలనచిత్ర కళాకారుల సంఘం (నడిగర సంగంగా సుప్రసిద్ధం)కి 1959లో అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. తెలుగు సినీ రంగంలో తొలినాళ్ళ గ్లామర్‌ తార అయిన అంజలీదేవికి తాను ఏకలవ్య శిష్యురాలినని తరువాతి తరం నటి సావిత్రి చెప్పేవారు. 'గొల్లభామ' చిత్రంలో అంజలీదేవి చేసిన నృత్యాలను ఆమె సభా వేదికలపై చూస్తూ ఉండేవారు. సావిత్రితో పాటు ఆ నాటి నటీమణులైన జమున, 'షావుకారు' జానకి, కృష్ణకుమారి, తరువాత సినీ రంగానికి వచ్చిన కాంచన, శారద లాంటి వారందరూ ఆమె అంటే ఇప్పటికీ అపరిమితమైన ప్రేమాభిమానాలు. 

చెన్నైలో ఒకే ప్రాంతంలో దగ్గరి ఇళ్ళు కావడంతో నటి - నిర్మాత సి. కృష్ణవేణితో అంజలిది ప్రత్యేక అనుబంధం. ఆ మధ్య మరణించిన నటి టి.జి. కమలాదేవితో కలసి చిత్తూరు వి. నాగయ్య మెమోరియల్‌ అవార్డు పేరిట ఏటా చెన్నైలో అవార్డులు అందిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తూ వచ్చారు. అలాగే, తొలితరం సినీ జర్నలిస్టు కీర్తిశేషులు ఇంటూరి వెంకటేశ్వరరావు మీద గౌరవంతో, ఏటా ఓ ఉత్తమ సినీ జర్నలిస్టుకు సత్కారం చేసే కార్యక్రమంలో విధిగా పాల్గొనేవారు. 

సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక తరహాలు నాలుగింటిలోనూ పేరు తెచ్చుకోవడం, తెలుగులో లాగానే తమిళంలోనూ సుపరిచిత నటిగా వెలగడం అంజలీదేవి నటజీవితంలోని విశేషం. 1946వ సంవత్సరం భోగి పండుగ రోజున అంజలీదేవి, ఆదినారాయణరావు దంపతులు మద్రాసులో దిగారు. సరిగ్గా అరవై ఏడేళ్ళ తరువాత అదే భోగి రోజున మధ్యాహ్నం అంజలీదేవి అదే చెన్నపట్నంలో కన్నుమూయడం. కాకతాళీయం. ఒక విశిష్ట నటిగా, నిర్మాతగానే కాక, తరువాతి తరం తారలెందరికో మార్గనిర్దేశనం చేసిన వ్యక్తిగా, మనసున్న మంచి మనిషిగా అంజలీదేవి చిరకాలం గుర్తుంటారు. 

- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 14th Jan 2014, Tuesday, Page No.10)
...............................................................

0 వ్యాఖ్యలు: