సినిమా సిద్ధమైపోయి అయిదారు నెలలు దాటినా, విడుదల కోసం సుదీర్ఘంగా నిరీక్షించిన చిత్రం 'ఎవడు' ఎట్టకేలకు విడుదలైంది. అదీ సంక్రాంతి సందర్భంగా జనం ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రమైన ఈ సినిమా ఆ తరహా చిత్రాల అభిమానుల్ని అలరించవచ్చు. ఎడతెగని వాయిదాలతో అంచనాలు తగ్గడం, పండుగ సెలవులు కలసి రావడం, చూడదగ్గ ఇతర సినిమాలు లేకపోవడంతో కొద్దో గొప్పో కాసులు కూడా కురిపించవచ్చు. కానీ, దర్శక, నిర్మాతలు ''నెక్ట్స్ జనరేషన్‌కు తీసుకువెళ్ళే చిత్రం''గా చెప్పుకొన్న ఈ సినిమాలో అసలు ఏమంత
విషయం ఉందన్నది ప్రశ్న?
విషయం ఉందన్నది ప్రశ్న?
విశాఖపట్నంలో సత్య (అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ప్రేమికులు. తీరా ఆమె మీద విలన్ వీరూ భారు (రాహుల్ దేవ్) ఆశపడతాడు. ఎదిరించి బస్సులో హైదరాబాద్‌కు పారిపోతున్న వారిద్దరిపై విలన్ బృందం దాడి చేస్తుంది. ఆ బస్సును కాల్చేస్తుంది. దీప్తి చనిపోయినా, కొనఊపిరితో సత్య బతుకుతాడు. డాక్టర్ శైలజ (జయసుధ) అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసి, బతికిస్తుంది. అలా మారిన ముఖంగా సత్య కాస్తా రామ్ (రామ్‌చరణ్) అవుతాడు. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆస్పత్రి నుంచి వెళ్ళిపోయి, తన ప్రియురాలిని చంపిన విలన్లు నలుగురినీ వరుసగా, తెలివిగా చంపేస్తాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఎవరో తెలియనివాళ్ళు హీరోను చంపడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ పగ తన మీద కాదనీ, తన ముఖంతో ఉన్న వ్యక్తితో అనీ హీరో గ్రహిస్తాడు. అక్కడికి ఫస్టాఫ్.
మారిన తన ముఖానికి కారణమైన డాక్టర్ (జయసుధ) దగ్గరకు వెళతాడు. మరణించిన తన కుమారుడు చరణ్ (రామ్ చరణ్) ముఖాన్నే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తనకు ఆమె పెట్టినట్లు హీరో గ్రహిస్తాడు. ఆమె అలా ఎందుకు చేసింది, అసలు ఆమె కుమారుడు ఎలా మరణించాడు, అతనికీ - హైదరాబాద్‌లోని విలన్లు ధర్మ (సాయికుమార్) తదితరులకూ గొడవేమిటన్నది ఫ్లాష్‌బ్యాక్. ఆ కథంతా తెలుసుకున్న హీరో తానే ఆ డాక్టర్‌కు కొడుకుగా ఏ లక్ష్యం పూర్తి చేశాడన్నది మిగిలిన సినిమా.
ముఖాలు మారడమంటూ తీసుకున్న బేసిక్ పాయింట్ వరకు మన సినిమాల్లో కొత్తదే! ఆ మధ్య వచ్చిన 'బన్నీ అండ్ ఛెర్రీ'లో ఈ పాయింట్‌నే మరో రకంగా వాడారు. ఈ రెండింటికీ ఆ పాయింట్ వరకు మాతృక మాత్రం హాలీవుడ్ చిత్రం 'ఫేస్ ఆఫ్'. ఇక, ఆ పాయింట్‌ను 'ఎవడు'లో కథగా తయారు చేసుకొని, తెరపై చూపించిన విధానం మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. ఇందులోని కొన్ని ఘట్టాలు చిన్న ఎన్టీయార్ 'ఆంధ్రావాలా' మొదలు రామ్ చరణే నటించిన 'రచ్చ', నిరుటి 'నాయక్' దాకా అనేక పాత సినిమాలను గుర్తుచేసేస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో తరువాతి సన్నివేశం ఏమిటన్నది ప్రేక్షకుడు ఊహించేయగలుగుతుంటాడు.
మొదట కాసేపు బానే ఉందనిపించినా, హీరో మొదటి హత్య చేసిన తరువాత రెండో హత్య దగ్గర నుంచి ఫస్టాఫ్ మరీ చప్పబడిపోయింది. పైగా, ఫస్టాఫ్‌కే నలుగురు విలన్లనూ హీరో చంపేసేయడంతో సినిమానే అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ ముందు ఓ చిన్న పాటి ట్విస్టుతో రెండో కథకూ, సెకండాఫ్‌కు బీజం వేస్తాడు. సెకండాఫ్ అంతా ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్. భూబకాసురులైన రాజకీయ నేతలు, గూండాల నుంచి సామాన్యులను కాపాడే హీరో కథగా అదీ రొటీనే అయినా, ఉన్నంతలో కొంత ఫరవాలేదనిపిస్తుంది. దాంతో, ఆకలి మీద హాలుకు వెళ్ళిన ప్రేక్షకులు పచ్చడి మెతుకులతో బయటపడ్డ ఫీలింగ్ మిగులుతుంది.
అయితే, 'మెగా' కుటుంబ అభిమానులకు ఈ చిత్రం ఒక రకంగా పండగే. ఎందుకంటే, ఇందులో ఒక పక్క రామ్‌చరణ్ తేజ్, మరోపక్క అల్లు అర్జున్ - ఇద్దరూ తెరపై కనిపిస్తారు. ఒక సన్నివేశంలో ఇద్దరూ ఏకకాలంలో కనిపిస్తారు. ఆ విధంగా ఇది మల్టీ స్టారర్ చిత్రం అనుకోవచ్చు. అల్లు అర్జున్ కనిపించిన కాసేపూ బాగా చేశారు. సినిమా అంతా యాక్షనే కాబట్టి, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ఆద్యంతం తనకు అలవాటైన కోపపు ముఖం, ఒకే భావావేశంతో రామ్‌చరణ్ అయిందనిపించారు. హాస్య, ప్రేమ సన్నివేశాల్లో చేసింది తక్కువే!
ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అతిథి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించేది సినిమా మొదట్లో పది, పదిహేను నిమిషాలే. ఎమీ జాక్సన్ పాత్ర ఫస్టాఫ్‌కే పరిమితం. ఆమె నటించిందీ లేదు, నటించడానికీ ఆ పాత్రలో అంతకన్నా ఏమీ లేదు. మూడో హీరోయిన్ శ్రుతీ హాసన్ పరిస్థితీ అంతే! కాకపోతే, మూడు నాలుగు పాటల్లో డ్యాన్స్ చేయడం తప్ప!
చాలా రోజుల తరువాత జయసుధ కథకు కీలకమైన డాక్టర్ శైలజ పాత్ర పోషించారు. అనుభవజ్ఞురాలైన నటి కాబట్టి, ఉన్న కొద్ది సీన్లలోనూ, మంచి డైలాగులతో పాత్రను పండించారు. 'సామాన్యుడు', 'ప్రస్థానం' లాంటి చిత్రాలు చేసిన సాయికుమార్‌కు వాటికి కొనసాగింపుగా దక్కిన పాత్ర - ఇందులోని మెయిన్ విలన్ పాత్ర. వాచికం, ఆంగికాలతో ఆ పాత్రను ఆయన పండించారు. కనిపించేది చాలా కొద్ది సేపే అయినా నెల్లూరు మాండలికం డైలాగుల్లో కోట శ్రీనివాసరావు ఆకట్టుకుంటారు. ద్వితీయార్ధంలో హీరో ఫ్రెండ్ (శశాంక్)కు తండ్రి పాత్రలో రచయిత - నటుడు ఎల్బీ శ్రీరామ్ కనిపించారు. సెకండాఫ్‌లోని కీలక పాత్రల్లో అది ఒకటి. చాలా చిత్రాల్లో వచ్చిన తరహా పాత్రే అయినా, దాన్ని ఆయన జనరంజకంగా పోషించారు.
రామ్ చరణ్ తేజ్ చిత్రానికి తొలిసారిగా సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ అద్భుతాలైతే చేయలేకపోయారు కానీ, రెండు మూడు పాటల్లో జనాన్ని ఆకట్టుకున్నారు. 'నీ జతగా నేనుండాలి! నీ ఎదలో నే నిండాలి! నీ కథగా నేనే మారాలి...' పాట రచన, బాణీ కూడా చెవికి ఇంపుగా ఉన్నాయి. తెరపై చూడసొంపుగా కూడా ఉన్న పాట ఇది. అలాగే, సినిమా మొదట్లో వచ్చే నేపథ్య గీతం 'చెలియా చెలియా...', హీరో హీరోయిన్ల యుగళ గీతం 'నిన్ను చూస్తే చాలు బుగ్గల్లోన...' బాగున్నాయి. నేపథ్య సంగీతం, ముఖ్యంగా సెకండాఫ్‌లో విలన్ వర్సెస్ హీరో లాంటి చోట్ల బాగుంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే 'ఫ్రీడమ్...' పాటతో సహా మరో రెండింటిలో రామ్‌చరణ్ కష్టపడి వేసిన స్టెప్పులు అలరిస్తాయి.
సినిమాలో కామెడీ దాదాపు లేదనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లలో మాత్రం కనిపించే బ్రహ్మానందం వల్ల ఆయన సినిమాల జాబితాలో మరో నంబర్ చేరిందేమో తప్ప, ప్రేక్షకులకు దక్కిన వినోదం తక్కువ. ఇక, సెకండాఫ్‌లో వచ్చే 'వెన్నెల' కిశోర్, విలన్ దెబ్బకు మధ్యలోనే చనిపోయే శశాంక్ లాంటివాళ్ళది కామెడీ అని దర్శక, రచయితలు అనుకొని ఉంటే, నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఒకటి, రెండు చోట్ల మంచి డైలాగులు వినిపించాయి. అయితే, స్త్రీలను 'అది', 'ఇది' అని ప్రస్తావించడం లాంటి అమర్యాదకర ధోరణి ఈ సినిమాలోనూ కొనసాగింది. అలసామాన్య గృహిణి పాత్రలకు కూడా 'కుమ్మేద్దాం కొడుకుల్ని!', 'ఏం పీకలేవు', లాంటి డైలాగులు పెట్టడం వర్తమాన తెలుగు సినీ సంభాషణల స్థాయికీ, అవి సమాజంపై చూపబోయే ప్రభావానికీ ప్రతీకలు.
కెమేరా (సి.రామ్‌ప్రసాద్), కళ (ఆనంద్‌సాయి), యాక్షన్ (పీటర్‌హెయిన్) విభాగాల పనితనం బాగానే ఉపకరించిన ఈ సినిమాలో సులభంగా కొన్ని సీన్లు కట్ చేసుకొని ఉండాల్సింది. ఆ మేరకు ఎడిటింగ్ కత్తెరకు పదునుపెడితే, (ఎడిటిర్-మార్తాండ్ కె.వెంకటేష్) ఈ 'రెండు కథల ఒక సినిమా' కనీసం ఓ పావుగంట ముందే జనాన్ని వదిలిపెట్టి ఉండేది.
'ఏ' సర్టిఫికెట్ దక్కిన 'ఎవడు'లో నరుక్కోవడాలు, చంపుకోవడాలు చాలా ఎక్కువే! ఫస్టాఫ్‌లో ప్రియురాలిని చావుకు కారణమైన విలన్లను నలుగురినీ హతమారుస్తానని రామ్‌చరణ్ తేజ్ ముఖంలో ఉన్న హీరో (కథానుసారమైతే అల్లు అర్జున్ అనుకోవాలి) బయలు దేరతాడు. అయితే, ఆ చంపడాల పరంపర ఆ నాలుగుతో ఆగదు... సినిమా కాసేపయ్యాక ఆ నాలుగు కాస్తా ఏడెనిమిది దాటుతుంది.... ఇక సెకండాఫ్ నడుస్తున్న కొద్దీ చేతివేళ్ళు సరిపోనంత మంది చచ్చిపోతుంటారు. విసుగొచ్చి ఇక ప్రేక్షకులే లెక్కపెట్టడం మానేస్తారు.
ఈ సినిమాలో మిస్సయిన లాజిక్కులు చెబితే ఆ జాబితా ఓ కొండవీటి చాంతాడంత అవుతుంది. సినిమాలో రామ్‌చరణ్ చనిపోయినట్లు చూపించి, ముఖం కాలిపోయి కొనఊపిరితో కొట్టుకుంటున్న అల్లు అర్జున్‌కు ఆ ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అతికించినట్లు చెబుతారు. చనిపోయిన వాడి ముఖాన్ని ఈ బతికున్నవాడికి పెట్టడం ఎలా అని అడకండి! అలాగే, చేసింది ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి, అల్లు అర్జున్‌కు రామ్ చరణ్ ముఖం రావడం వరకు ఓ.కె. కానీ, అల్లు అర్జున్ కంఠస్వరం కూడా రామ్‌చరణ్‌ది ఎలా మారిపోయిందని సగటు ప్రేక్షకులు ఎవరైనా అంటే, దానికి జవాబు దొరకదు.
అలాగే, ఈ సినిమాలో పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లోవి! ఎమీ జాక్సన్ పాత్ర అర్ధంతరంగా కనుమరుగై పోతుంది. అలాగే, బ్రహ్మానందం పాత్ర కూడా! ఫస్టాఫ్‌లో హత్యల రహస్యాన్ని ఛేదించడానికి తెగ తాపత్రయపడినట్లు కనిపించే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మురళీ శర్మ) పాత్ర కూడా ఇంటర్వెల్ తరువాత కనపడితే ఒట్టు. వైజాగ్‌లో అన్ని హత్యలు చేసి కనిపించకుండా పోయినవాడి గురించి పోలీసులు పట్టించుకోలేదను కోవాలేమో!
ఇక కథలో దర్శక, రచయితలు అనుకున్నదే తడవుగా ఏదైనా జరిగిపోతుంటుంది. ఫస్టాఫ్‌లో విలన్లను ఆటపట్టిస్తూ, హతమార్చే హీరో తమ పక్కనే ఉండి, తమకే సమాచారం ఇస్తున్నా విలన్లకు కానీ, పోలీసులకు కానీ ఆవగింజంతైనా అనుమానం రాదెందుకో! 'ఇది సినిమా! అందులోనూ తెలుగు సినిమా!' అని ప్రేక్షకులు తమకు తామే సర్దిచెప్పుకుంటూ, సరిపెట్టుకోవాల్సిందే!
వెరసి, సకుటుంబంగా జరుపుకొనే సంక్రాంతి సెలవులకు వచ్చినా, ఈ రొటీన్ మాస్ యాక్షన్ సినిమా వినోదం మిస్సయి, వెండితెరపై మితిమీరిన హింసతో కుటుంబ ప్రేక్షకులకు దూరం చేసుకుంది. అభిమాన, మాస్ జనాలకు మాత్రం ఫరవాలేదనిపిస్తుంది. యావరేజ్‌కు పిసరంత పైన నిలుస్తుంది.
వెరసి, సకుటుంబంగా జరుపుకొనే సంక్రాంతి సెలవులకు వచ్చినా, ఈ రొటీన్ మాస్ యాక్షన్ సినిమా వినోదం మిస్సయి, వెండితెరపై మితిమీరిన హింసతో కుటుంబ ప్రేక్షకులకు దూరం చేసుకుంది. అభిమాన, మాస్ జనాలకు మాత్రం ఫరవాలేదనిపిస్తుంది. యావరేజ్‌కు పిసరంత పైన నిలుస్తుంది.
కొసమెరుపు: ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ మరో సినిమా ... ఇలా ఒకే టికెట్‌పై రెండు సినిమా కథలు చూపించారని హాలులోనే ప్రేక్షకులు కామెంట్లు చేసేశారు. ఒక టికెట్‌పై రెండు సినిమాలు చూపించడం గొప్పే కదా అంటారా! నిజమే కానీ, తీరా చూస్తే ఆ రెండూ ఇప్పటికే సవాలక్ష సార్లు చూసేసిన సినిమా (కథ)లు కావడమే 'ఎవడు'లోని అసలు ట్విస్టు!
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 13th Jan 2014, Monday, Page No. 8)
.........................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment