- ఆత్మహత్యలు... అనుమానాస్పద మరణాలు...
యువతరం హీరో ఉదయ్ కిరణ్ అనుమానాస్పద ఆత్మహత్యా ఉదంతంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సామాన్యులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీహరి, ఏ.వి.ఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉదయ్ కిరణ్ - ఇలా వరుసగా నాలుగు నెలల్లో నలుగురు తెలుగు సినీ ప్రముఖులు మరణించడం తెలుగు సినీ ప్రియులకు తీరని లోటే! పైగా, పలువురు నటీమణులు, దర్శకులు గురుదత్ లాంటి సినీ రంగ ప్రముఖులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు గతంలో జరిగినా, ఒక అగ్ర హీరో ఆత్మహత్యకు దిగడం మాత్రం మన చిత్ర సీమలో ఇదే తొలిసారి.
ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, వృత్తి జీవితంలోని ఒడుదొడుకులు, వరుస వైఫల్యాలు, వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు, మానసికంగా కుంగుబాటుకు లోనవడం లాంటి అనేక కారణాలు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతున్నాయి. వెండితెరపై పెను సమస్యలనూ, పెద్ద పెద్ద ప్రతినాయకులనూ ధైర్యంగా ఎదుర్కొని, విజయం సాధించిన నాయికా నాయకులు నిజజీవితంలో మాత్రం పిరికిగా మారి, ప్రాణాలు తీసుకోవడం పెను విషాదం. ఎంతోమంది అందాల తారలు నిజజీవితంలో అత్యంత దయనీయంగా అసువులు బాశారు.
హాలీవుడ్ తార మార్లిన్ మన్రో దగ్గర నుంచి మన తెలుగమ్మాయి సిల్క్ స్మిత దాకా ఎంతోమంది అలా ఆత్మహత్యను ఆశ్రయించినవారే! వృత్తి జీవిత, వ్యక్తిగత సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఆత్మహత్యలో వెతుక్కున్నారు. బాలీవుడ్ యువ నటి నఫీసా జియా ఖాన్ కూడా ఉదయ్ కిరణ్ లాగానే, గత ఏడాది ఉరి పోసుకొని చనిపోయారు. పాతికేళ్ళ ఈ అమ్మాయి గడచిన జూన్ మొదటి వారంలో ఓ పక్కన ప్రేమలో వైఫల్యంతో పాటు, సినిమా కెరీర్‌లోని ఒడుదొడుకులతో తన జీవితాన్ని అంతం చేసుకున్నారు. తొలి చిత్రంలోనే అమితాబ్ తో ('నిశ్శబ్ద్' - 2007) నటించి, ఆ పైన ఆమిర్ ఖాన్ లాంటివాళ్ళ సినిమాల్లోనూ కనిపించిన ఈ యువ నటికి 2010లో విడుదలైన వినోద ప్రధాన చిత్రం 'హౌస్‌ఫుల్' తరువాత సినిమా అవకాశాలు రాలేదు. మరోపక్క సినీ కుటుంబానికే చెందిన సూరజ్ పంచోలీతో ప్రేమ బంధం తెగిపోయింది. నిజానికి, అస్తుబిస్తుగా సాగే సినీ జీవితం కన్నా ఇంటీరియర్ డెకరేటర్‌గా స్థిరపడాలని కూడా తన తల్లితో చెప్పారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ తెలుగు సినిమాలోని పాత్ర కోసం ఆడిషన్‌కు కూడా హాజరైనప్పటికీ, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. వీటన్నిటితో నిరాశా నిస్పృహలకు లోనైన జియా చివరకు ప్రాణాలు తీసుకున్నారు. 1990ల ద్వితీయార్ధంలో బాల నటిగా ఓ చిన్న చిత్రంలో పని చేసిన ఆ యువ నటి జీవితం కేవలం మూడే సినిమాలతో అంతమైపోయింది.
దక్షిణాది సినీ సీమను తన అందం, ఆకర్షణలతో ఓ ఊపు ఊపేసిన సిల్క్ స్మిత (అసలు పేరు విజయలక్ష్మి) సైతం పద్ధెనిమిదేళ్ళ క్రితం వ్యక్తిగత వైఫల్యాలు, ఆర్థిక కారణాలతో తాగుడుకు బానిసై, ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 400 చిత్రాల్లో నటించి, ఎంతోమందిని ఆకట్టుకున్న స్మిత జీవితం అలా ముగిసిపోయింది.
అంతకన్నా ముందుకు వెళితే, కె. బాలచందర్ దర్శకత్వంలోని 'అంతులేని కథ'తో పాటు తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించి, 'ఫటాఫట్' అనే సినీ మేనరిజమ్‌తో 'ఫటాఫట్' జయలక్ష్మిగా పేరు తెచ్చుకున్న నటి కూడా 1980లో ఓ ప్రేమ వ్యవహారంలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకున్నారు. తమిళ సినీ, రాజకీయ ప్రముఖుడు ఎం.జి.ఆర్. సోదరుడైన చక్రపాణి కుమారుణ్ణి ఆమె ప్రేమించారు. పెళ్ళికి అతను తాత్సారం చేయడంతో బాధపడి, 'ఫటాఫట్' జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు.
కన్నడ చిత్రాల ద్వారా ఎంతో ప్రాచుర్యం సంపాదించిన నటి కల్పన కూడా జీవిత రంగస్థలం నుంచి హఠాత్తుగా పక్కకు తప్పుకున్నారు. నటిగా ఎంతో పేరు, డబ్బు సంపాదించి, అవార్డులు కూడా సాధించిన కల్పన ఆ వైభవం తగ్గాక నిరాశలో కూరుకుపోయారు. జీవితం గడపడానికి, చివరకు రంగస్థల నటిగా కూడా వ్యవహరించాల్సి వచ్చింది. కానీ, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు చుట్టుముట్టి, చివరకు 1979 మేలో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయి.
తమిళ చిత్రం 'పసి' ద్వారా 17 ఏళ్ళకే జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించిన మలయాళ అమ్మాయి శోభ (అసలు పేరు మహాలక్ష్మి) కూడా బలవంతపు మరణానికే దిగింది. బాల నటిగా మొదలై, దక్షిణాది భాషల్లోని చిత్రాల్లో నటించిన ఆమె ఉరిపోసుకున్నారు. దర్శక - ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్రతో సాన్నిహిత్యం ఆమె మరణానికి కారణమని వార్తలు వచ్చాయి. ఆమెది ఆత్మహత్యేనా, లేక హత్యా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.
అదే పద్ధతిలో అనుమానాలు రేపిన మరో సినీ మరణం - తెలుగు నటి ప్రత్యూషది. ఓ సామాన్య ఉపాధ్యాయురాలి కుమార్తె అయిన ప్రత్యూషది కూడా ప్రేమకథతో ముడిపడిన బలవన్మరణమే! మరో సామాజిక వర్గానికి చెందిన సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించిన వర్ధమాన తార ప్రత్యూష 2000 ఫిబ్రవరిలో అనూహ్య పరిస్థితుల మధ్య అర్ధంతరంగా జీవితం చాలించారు. ప్రేమికుడు సిద్ధార్థ్, ఆమె కలసి విషం తాగారని వార్తలు వచ్చినా, సిద్ధార్థ్ బతకడం, ప్రత్యూష మృతదేహం ముఖం మీద గోళ్ళ గాట్లు లాంటివి ఉండడం, కేర్ ఆస్పత్రి వర్గాలు అప్పట్లో వ్యవహరించిన తీరు లాంటివన్నీ అనుమానాలను పెంచాయి.
ఉత్తరాది విషయానికి వస్తే, అందాల తార పర్వీన్ బాబీ సైతం 2004లో అన్నపానీయాలు మానేసి, ప్రాణాలు తీసుకున్నారు. తెలుగులో 'బొబ్బిలి రాజా' లాంటి చిత్రాలతో అందరినీ ఆకర్షించిన దివ్యభారతి కేవలం 19 ఏళ్ళ వయస్సులోనే 1993 ఏప్రిల్‌లో ముంబరులోని తన అయిదంతస్థుల అపార్ట్‌మెంట్ మీద నుంచి కిందకు దూకి మరణించారు. ఆమె మరణం వెనుక కారణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది.
ఇవాళ ఉదయ్ కిరణ్ మరణం మీద కూడా అనుమానపు మేఘాలు అలముకొన్నాయి. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు అతను కాదనేది కొందరు సన్నిహితుల వాదన. మరోపక్క అతనికేమీ ఆర్థిక ఇబ్బందులు లేవనీ, పెళ్ళి చేసుకొని కూడా పట్టుమని పధ్నాలుగు నెలలే అయిందనీ, కాబట్టి ఈ మరణం అనుమానాస్పదంగా ఉందనీ మరికొందరు అంటున్నారు. ఏమైనా, సినీ పరిశ్రమ వర్గాలు మాత్రం ''సినిమా రంగంలో పోటీ అంతా ఇంతా కాదు. ఇక్కడ కెరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు అవకాశాలు, పారితోషికాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. కానీ, ఒక్కసారి కెరీర్‌లో వెనకబడితే మాత్రం ఎవరూ పట్టించుకోరు. వాళ్ళను దాటుకొని, ముందుకు వెళ్ళిపోవడానికి కొన్ని వందల మంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అది గ్రహించకుండా, సినిమాయే జీవితమనీ, ఈ ఆదాయం, ఆకర్షణ, పేరుప్రతిష్ఠలు శాశ్వతమనీ భ్రమ పడితే మాత్రం ఇబ్బందే!'' అని వెండితెర వెలుగు జిలుగుల వెనుక ఉన్న నీలినీడల్ని విశ్లేషిస్తున్నాయి.
పంథొమ్మిదేళ్ళ చిన్న వయస్సుకే 'చిత్రం' సినిమాతో హీరో అయి, వరుసగా విజయాలు సాధించి, చిన్నతనంలోనే పెద్ద పేరు సంపాదించుకొన్న ఉదయ్ కిరణ్ బహుశా ఆ వాస్తవాన్ని గ్రహించలేదేమో! సోమవారం నిమ్స్' ఆసుపత్రి మార్చ్యురీలో చాలాసేపు బంధువుల రాక కోసం ఏకాకిగా ఎదురుచూసిన ఆయన మృతదేహం మాట్లాడలేదు కాబట్టి, ఆ సంగతులు తెలిసే అవకాశం లేదు!
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 7th Jan 2014, Tuesday, page no. 8)
...................................................................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment