(ఇది 10 టి.వి.లో ప్రసారమైన రివ్యూ)
న్యూ ఇయర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ పండగ రోజు. ఈ రోజుకు సినీ ప్రియులైతే తమకు నచ్చిన, కొత్త సినిమాలు చూడాలనుకుంటారు. తెలుగు ప్రేక్షకులైతే ఆ ఆసక్తి ఇంకా ఎక్కువ. దీనిలో భాగంగానే ఈ 2014 కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ప్రేక్షకులు ముందుకు రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి 'బిస్కెట్'.
అరవింద కృష్ణ, డింపుల్ చోపాడే జంటగా.. అనిల్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ బుధవారం విడుదలైంది. లవ్, క్రైమ్, కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన 'బిస్కెట్'.. ప్రేక్షకులకు బిస్కెట్ ను తినిపించిందా.. ? లేక బిస్కెట్ తో గాలం వేసిందా.. ? అనేది చూద్దాం..
కథ విషయానికి వస్తే:.. ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే కుర్రాడు 'అరవింద్ కృష్ణ'. అన్ని సినిమాల్లాగే హీరోయిన్ 'డింపుల్ చొపాడే'తో లవ్ లో పడతాడు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలుస్తుంది. అయితే అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగే దాకా పెళ్లి చేయనంటారు. మరోవైపు అరవింద్ బాస్ 'అజయ్', ఇతను చేసే పనులకు గాను తను క్రెడిట్ కొట్టేస్తుంటాడు. చివరకు కుట్ర చేసి అరవింద్ కు ప్రమోషన్ రాకుండా చేస్తాడు. ఈ పరిస్థితుల్లోనే అరవింద్ అనుకోకుండా ఓ క్రైమ్ లో ఇరుక్కుంటాడు. ఇక డింపుల్ తో పెళ్లి తంటాలు పడుతున్న హీరో...క్రైమ్ నుంచి ఎలా తప్పించుకున్నాడు..? కోరుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా..? లేదా..? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ:..
కథలో బలం లేని సినిమాలకు స్ర్కీన్ ప్లే బాగుండాలి. కానీ కథా, స్క్రీన్ ప్లే రెండూ బాగోలేకపోతే.. అది ఈ 'బిస్కెట్' లా తయారవుతుంది. కామెడీ, క్రైమ్ కలిసిన కథతో దర్శకుడు అనిల్ గోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. అలీ, వెన్నెల కిషోర్, ఎంఎస్, తాగుబోతు రమేష్ వంటి కామెడియన్లను పోస్టర్లపై చూసి కామెడీ సూపర్ అనుకొనే సినిమాకెళ్లే ఆడియెన్స్ కు ఈ సినిమా నిరాశకు గురిచేయడం ఖాయం. దర్శకుడు బిస్కెట్ సినిమాను లవ్, కామెడీ, క్రైమ్ తో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. తెరపై ఏ ఒక్క విభాగాన్ని సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయాడు. దీనికి తోడు కుళ్లు జోకులతో ప్రేక్షకులకు బోర్ తెప్పించాడు. చాలా సీన్లు కనీసం చూడ్డానికి కూడా ఆర్హతలేనివిగా ఉంటాయి. సినిమాకు ఉపయోగం లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి.
ఇక హీరో హీరోయిన్లు అరవింద్ కృష్ణ, డింపుల్ చొపాడే నటన ఆటలో అరటిపండులా తయారైంది. సెకండాఫ్ లో అలీ చేసిన ఒకట్రెండు సీన్లు తప్ప సినిమాలో ఎక్కడా నవ్వు రాదు. ఇక మర్డర్ సీన్లను ట్విస్టుగా పెట్టడం సెట్ కాలేదు. ఈ క్రైమ్ నుంచి హీరో తప్పించుకునే సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. సాంకేతిక నిపుణుల ప్రతిభ అంతంత మాత్రమే. సంగీతంలో మొదటి పాట ఓకే. సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. మిగతా క్రాఫ్టులు పెద్దగా ఆకట్టుకునేలా లేవు.
ప్లస్ లు: అలీ కామెడీ, మ్యూజిక్.
మైనస్ లు: దర్శకుడు, స్ర్కీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్, ఆర్టిస్టులు.
ఈ సినిమా వల్ల నష్టపోయింది హీరో అరవింద్ కృష్ణ. ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటున్నాడనే పేరొస్తున్న ఈ సమయంలో బిస్కెట్ లాంటి సినిమాలకు అతడు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరగా ఒక్క మాట బిస్కెట్ తింటే ఎనర్జీ వస్తుంది...కానీ బిస్కెట్ సినిమా చూస్తే తలనొప్పితో నీరసం రావడం ఖాయం. సినిమా చూశాక దర్శకుడు ప్రేక్షకులకు పెద్ద బిస్కెట్ వేశాడని అర్థమవుతుంది.
ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్-1/5.
....................................
0 వ్యాఖ్యలు:
Post a Comment