సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. షూట్‌లు, రీషూట్‌లు, పెరిగిన పని రోజులు, పెరిగిపోయిన వ్యయం మధ్య ఎట్టకేలకు హీరో మహేశ్‌బాబు, దర్శకుడు సుకుమార్‌ల '1' తయారై, విడుదలైంది. 'ఈరోస్ ఇంటర్నేషనల్' సంస్థ కూడా జత కలసిన ఈ చిత్రం వ్యాపారం కూడా భారీ స్థాయిలోనే జరిగింది. వీటన్నిటితో పెరిగిన అంచనాల మధ్య ఈ సినిమాకు వెళితే, ఆశలు, అంచనాలు తలకిందులవుతాయి. కథలో కన్నా కథనంలో కన్‌ఫ్యూజన్ మరింత ఎక్కువైన చిత్రంగా ఈ '1' ప్రేక్షకులకు చాలారోజులు గుర్తుండిపోతుంది. 'దూకుడు', 'బిజినెస్‌మేన్', క్రితం సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' - ఇలా వరుస విజయాలతో జోరు మీద ఉన్న హీరో మహేశ్‌బాబు ఈ సారి కొంత భిన్నమైన దోవ తొక్కారు. మామూలు రివెంజ్ ఫార్ములాకే, గుర్తుపెట్టుకొనే సామర్థ్యం తక్కువున్న (మరోమాటలో మతిమరుపు అనవచ్చేమో) కథానాయకుడి పాత్రను కలిపి, దర్శకుడు సుకుమార్ వండిన కథను ఎంచుకున్నారు. కథానాయక పాత్రకు మతిమరుపు లాంటిది (సినిమాలో దాన్ని 'ఇంటిగ్రేషన్ డిజార్జర్' అన్నారు) ఉంది అనగానే, అందరికీ హాలీవుడ్ చిత్రం 'బార్న్ ఐడెంటిటీ' లాంటివి గుర్తుకొస్తాయి. నిన్న మొన్నటి 'గజని' దాకా ఇలాంటి పాయింట్‌తో మనకు చాలానే సినిమాలు వచ్చాయి. అయితే, ఆ హాలీవుడ్ సినిమాలోని ఆ పాయింట్ వరకు మాత్రం తీసుకొని అల్లుకొన్న కథ ఈ '1 - నేనొక్కడినే'! కథగా చెప్పాలంటే, గౌతమ్ (మహేశ్‌బాబు) ఓ రాక్ సంగీత గాయకుడు. ఈ రాక్‌స్టార్‌కు ఓ భయంకరమైన గతం. అది అతణ్ణి పీడకలలా వెంటాడుతూ ఉంటుంది. తన అమ్మా నాన్నను ముగ్గురు విలన్లు చంపేసినట్లు కల గనే హీరో, ఆ ముగ్గురినీ చంపాలని భావిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఊహల్లోనే ఆ ముగ్గురినీ చంపేసినట్లు భ్రమలకు లోనవుతుంటాడు. అయితే, అతనివన్నీ వట్టి భ్రమలేననీ, నిజానికి అతనికి తల్లితండ్రులు హత్యకు గురికావడమనేది కూడా భ్రమేననీ డాక్టర్‌తో సహా చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా అంటూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఆ రాక్‌స్టార్‌కు దగ్గరవుతుంది - టీవీ రిపోర్టర్ సమీర (కృతీ సనన్). అతడి వెంటపడుతూ అతణ్ణి ప్రేమలో పడేస్తుంది. ఆ క్రమంలో హీరోయిన్‌ను చంపడానికి ఎవరో వెంటాడుతున్నట్లు హీరో గుర్తిస్తాడు. అదే సమయంలో తన కలలో ఎప్పుడూ వచ్చే ఓ విలన్ ఎదురైతే, అతను తన భ్రమ అనుకుంటూనే కాల్చి చంపేస్తాడు. తీరా అది నిజమని తెలుసుకుంటాడు. అక్కడికి చిత్ర ప్రథమార్ధం అయిపోతుంది. ఇక, ద్వితీయార్ధానికి వచ్చేసరికి మిగిలిన విలన్ల కోసం హీరో వెతుకులాట! ఆ క్రమంలో అతను లండన్‌కు వెళ్ళడం! అక్కడ ఏం జరిగింది, హీరోయిన్‌ను చంపడానికి ప్రయత్నించినదెవరు, ఇరవై ఏళ్ళ క్రితం హీరో తల్లితండ్రుల్ని విలన్లు ఎందుకు చంపారు లాంటివన్నీ మిగతా కథ. విలన్ చనిపోయాక కూడా ఇంకా సహనంగా థియేటర్‌లో కూర్చోగలిగితే, తన పాత జ్ఞాపకాలను హీరో ఎలా గుర్తించాడన్నది ఆఖరు పది నిమిషాల సీన్. రొటీన్ కథలు, సినిమాలు చూసి విసిగిపోయిన వాళ్ళకు ఇది కొంత కొత్తగా అనిపించవచ్చు. అమ్మా నాన్నల్ని చంపినవాళ్ళ మీద హీరో పగ తీర్చుకోవడమనే మామూలు ప్రతీకార ఫార్ములా కథను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించారని అనుకోవచ్చు. కథను ఎత్తుకోవడమే హీరోకు ఓ చిన్న సమస్య ఉంది... నిజమేదో, భ్రమ ఏదో తెలియని స్థితిలో అతను బతుకుతుంటాడని తెర మీద చూపించేసరికి ప్రేక్షకుడు మొదట కొద్దిగా షాక్‌కు గురవుతాడు. కానీ, ఆ తరువాత వరుసగా వాస్తవానికీ, ఊహకూ మధ్య హీరో పడే గందరగోళం హాలులోని ప్రేక్షకులకు కూడా విస్తరిస్తుంది. చివరకు మొత్తం విషయాన్ని తెర మీద చూపించిన తీరు గందరగోళంగా ఉందని ప్రేక్షకులు భావిస్తే, ఆ తప్పు దర్శక, రచయితలదే! నిజం చెప్పాలంటే, దర్శకుడు సుకుమార్ కొంత భిన్నంగా ఆలోచిస్తారు. సైకాలజీకి సంబంధించిన కథాంశాలను బాగానే ఎంచుకుంటారని పేరు. గతంలో ఆయన రూపొందించిన 'ఆర్య', 'జగడం', 'ఆర్య2', '100 % లవ్' లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఆ పేరుకు తగ్గట్లే ఈ '1' కథ ఉంది. కానీ, ఈ ''సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్''ను ఊహ, నిజాల మధ్య ఊగిసలాటగా తెర కెక్కించిన తీరు సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందన్నది సందేహం. ఈ చిత్ర కథలో అర్థం కాని విషయాలు కూడా బోలెడున్నాయి. హీరో రాక్‌స్టార్ అని చెబుతారు కానీ, అతనేదో మాఫియా గ్యాంగును ఎదుర్కొనే ధీరుడిలా గన్లు పట్టుకొని తిరుగుతుంటాడు. అలాగే, హీరో తల్లితండ్రులను చంపడానికి విలన్లు లండన్ నుంచి గోవాకు వచ్చారెందుకో అర్థం కాదు. లండన్‌లో చంపేసినా, వారిని అడ్డుకొనేదెవరు! ఇక, ఇరవై ఏళ్ళ క్రితం తప్పించుకున్న హీరో గురించి విలన్లు వెతకరెందుకో తెలీదు. అలాగే, కథ మొత్తానికీ గోల్డెన్ రైస్ వరి వంగడం కీలకమైనప్పుడు, దాని కోసం విలన్లు చేసిన ప్రయత్నమూ లేదు. ఇవన్నీ ప్రేక్షకులకు తెలియని అసంతృప్తినే మిగులుస్తాయి. హీరో తల్లితండ్రులెవరనే సస్పెన్స్ చివరి ఘట్టం దాకా కొనసాగించిన దర్శకుడు ఆ పాత్రల్లో ప్రముఖులనో, లేదంటే కనీసం మహేశ్‌తోనే ఆ తండ్రి పాత్ర కూడా వేయించేస్తేనో ప్రేక్షకులకు కాస్తంత థ్రిల్ అయినా ఉండేది. అవేవీ లేకపోవడంతో, ఆఖరి అమ్మా నాన్నల సెంటిమెంట్ ఘట్టమూ తేలిపోయింది. ఈ సినిమాలో కనిపించే, కథను నడిపించే పాత్రలు తక్కువే. దాంతో, ఎక్కువ సేపు తెరపై మహేశ్‌బాబే ఉంటాడు. కొత్త లుక్ కోసం ఆయన కష్టపడ్డారు. రాక్‌స్టార్‌గా చూడడానికి స్టయిలిష్‌గా బాగున్నారు కూడా! తెలుగుతెరకు తొలి పరిచయమైన కృతీ సనన్ కురచ దుస్తుల్లో కనిపించిందే తప్ప, అభినయంలో కానీ, ఆకర్షణలో కానీ తనదైన ముద్ర వేయలేకపోయింది. సినిమాలో వచ్చే కెల్లీ దోర్జీ ('డాన్' తదితర చిత్రాల ఫేమ్), నాజర్ లాంటి వారు తమ పాత్ర మేరకు నటించారు. పోసాని కృష్ణ మురళి కాసేపు కారు డ్రైవర్‌గా కనిపిస్తారు. మహేశ్ కుమారుడు గౌతమ్ కృష్ణ చిన్నప్పటి మహేశ్ పాత్రలో కనిపించడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.
సాంకేతిక నిపుణుల సంగతికొస్తే, సాధారణంగా తానే కథ రాసుకొనే సుకుమార్ ఈ చిత్రానికి ఆ బాధ్యత మరొకరి మీద పెట్టారు. పైపెచ్చు, ఓ అరడజనుకు పైగా రచయితలు రచనలో వేలు పెట్టారు. వెరసి, సినిమాలో లాజిక్‌లు తక్కువ, కన్‌ఫ్యూజన్ ఎక్కువ అయ్యాయి. ఒకటీ అరా చోట్ల మాటలు అలరించాయి. పాటలన్నీ తానే రాసిన చంద్రబోస్ పాత్ర వ్యక్తిత్వానికీ, సందర్భానికీ తగ్గట్లుగా రచన చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో 'హు ఆర్ యూ...' పాట, అలాగే 'ఔ తుజొ మౌకొత్తా' (కొంకిణి భాషలో ఐ లవ్ యూ అని అర్థం) అంటూ వచ్చే 'హలో రాక్‌స్టార్ అయామ్ యువర్ ఏంజల్...' పాట వినేందుకు బాగున్నాయి. 'ఐటమ్ సాంగ్'లకు పేరున్న సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో ఈసారి 'జానీ జానీ ఎస్ పాపా... నాకు రైమ్స్ రావప్పా...' అనే ప్రత్యేక నృత్య గీతం చిత్రీకరించారు. అయితే, అది ఆకట్టుకోవడం అనుమానమే. కెమేరామన్ రత్న వేలు గతంలో తానే చేసిన అత్యుత్తమ స్థాయి పనితీరును ప్రదర్శించకపోయినా, ఉన్నంతలో బాగానే పనితనం చూపారు. అయితే, డ్యాన్సులకు పేరున్న ప్రేమ్ రక్షిత్ ఈ సినిమాలోని పాటలన్నిటికీ కొరియోగ్రఫీ చేశారు కానీ, మహేశ్ ప్రాథమికంగా వేసే డ్రిల్లు స్టెప్పుల నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. హిందీ 'ధూమ్' చిత్రాల సిరీస్ ప్రభావం కనిపించే పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలు ఫరవాలేదనిపిస్తాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారానే ఇప్పటి ఈ ఇమేజ్‌నూ, భారీ విజయాలనూ సొంతం చేసుకున్న మహేశ్‌బాబు ఆ వర్గానికి దూరంగా ఉండే కథతో '1' సినిమా చేయడం విచిత్రం. పైపెచ్చు, స్వతహాగా అందగాడు, మంచి నటుడే అయినా హీరోగా ఇప్పటికే దశాబ్దిన్నర కాలం గడిపిన మహేశ్‌బాబు తన భావ ప్రకటనలో ఒక గిరి గీసుకొని ఉండిపోతున్న భావన కలుగుతోంది. ఆ గూటి నుంచి ఆయన బయటపడడం మంచిది. వెరసి, ఎంత సంక్రాంతి సెలవుల్లో వచ్చినప్పటికీ, '1' చిత్రం మహేశ్‌బాబు కెరీర్‌లో మరో 'బాబీ', 'నాని', 'వంశీ' అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. కొసమెరుపు: కథలోని బోలెడు ట్విస్టులు, గందరగోళం దాదాపు మూడు గంటలు భరించి హాలులో నుంచి బయటకొస్తున్న యువ ప్రేక్షకులు, మిత్రులు పలకరించినా సరే కణతలు నొక్కుకుంటూ, 'హు ఆర్ యూ' అని అడగడం ఈ సినిమాపై జనం తీర్పుకు పరాకాష్ఠ! - రెంటాల జయదేవ (ప్రజాశక్తి దినపత్రిక, 11 జనవరి 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం) ................................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment