- నేపథ్య గాయని ఎస్. జానకి సంతాపం
పాత తరం రంగస్థల, సినీ నటుడు, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి చెల్లెలి భర్త అయిన వి. నాగరాజారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున 4.40 గంటల ప్రాంతంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూకాభినయ తారగా దేశ, విదేశాల్లో తెలుగు వారి ఖ్యాతిని వ్యాపింపజేసిన కీర్తిశేషులు 'ఫన్ డాక్టర్' చంద్రశేఖరం రెండో కుమారుడే నాగరాజారావు.
నేపథ్య గాయని ఎస్. జానకి చెల్లెల్ని వివాహమాడిన ఆయన రంగస్థలంపై ఎన్నో పాత్రలను రక్తికట్టించారు. ముఖ్యంగా, రచయిత - నటుడు రావి కొండలరావు రాసిన చాలా నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆ నాటకాలను రక్తి కట్టించడంలో కీలక భూమిక వహించారు. చాలా ఏళ్ళుగా చెన్నైలో ఉంటున్న ఆయన కొద్ది సినిమాల్లో కూడా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్టీయార్ 'నర్తనశాల' (1963)లో సహదేవుడి పాత్ర పోషించింది ఆయనే. అలాగే, బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రంగుల రాట్నం' చిత్రంలో నటి విజయనిర్మలకు జోడీగా తెరపై కనిపించారు.
చెన్నైలోని తెలుగువారి సినీ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ తప్పనిసరిగా హాజరయ్యే నాగరాజారావు స్థానికులకు ఎంతో సన్నిహితులు. ఆయన మరణంతో గాయని జానకి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కేరళ నుంచి వచ్చిన ఎస్. జానకి, నాగరాజారావుతో కలసి నటించిన సినీ నటి శారద తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. సీనియర్ సినీ నటుడు విజ్జిబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు మాధవపెద్ది మూర్తితో సహా పలువురు సన్నిహితులు, స్నేహితులు నాగరాజారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నాగరాజారావు భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు జరిపారు.
(Published in 'Praja Sakti' daily, 22 Jan 2014, Wednesday, Page No.8)
........................................
0 వ్యాఖ్యలు:
Post a Comment