జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, February 28, 2015

వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది! - పొత్తూరి వెంకటేశ్వరరావు


- పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పత్రికా సంపాదకులు, రచయిత

వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!
 బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రాయడానికీ, చెప్పడానికీ నాకున్న అర్హత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు సంగీతం రాదు. అయితే, సంగీతాన్నీ, మంచి పాటనూ ఆస్వాదించడం వచ్చు. నేను టీనేజ్‌లో ఉండగా విన్న ఒక సినిమా గీతం ఆయన పట్ల నాకు ఆరాధనను పెంచింది. అది - ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట. ఆయన స్వరకల్పన చేసిన ఆ పాట తలుచుకుంటే, ఇవాళ్టికీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ పాటకు ముందుగా వచ్చే ఆ ‘హమ్మింగ్’ లాంటిది భానుమతి పాడిన తీరు, ఆ రకంగా దానికి వరుస కట్టిన రజనీ గారి ప్రావీణ్యం ఇప్పటికీ నిత్యనూతనమే. ఆ రకంగా ఆ రోజుల నుంచే నేను ఆయన సంగీతానికీ, పాటకూ అభిమానిని. ఆ తరువాత జర్నలిజమ్‌లోకి వచ్చాక బెజవాడకు వెళ్ళినప్పుడు జర్నలిస్టు మిత్రులు నండూరి రామమోహనరావు, సి. రాఘవాచారి, ఉషశ్రీ లాంటి వారితో కలుస్తుండేవాణ్ణి. అలా రజనీగారిని కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. పైగా అప్పట్లో నేను ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో పనిచేసేవాణ్ణి. అందువల్ల కొంత వెసులుబాటు ఉండేది.

 రజనీ గారిని ఎప్పుడు కలిసినా, కేవలం పది నిమిషాలే మాట్లాడుకున్నా సరే, అందులోనూ సంగీతం వినిపించకుండా, మాట్లాడేవారు కాదు. సామాన్య సంభాషణల్లో కూడా అలా సంగీతాన్ని ప్రస్తావించడం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. నిజం చెప్పాలంటే, సంగీతం లేని రజనీని ఊహించలేమంటే నమ్మండి. మనకున్న కళాకారుల్లో, సాహిత్యవేత్తల్లో ఇటు సంగీతం, అటు సాహిత్యం - రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంత వరకు రజనీ ఒక్కరే! ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే, సంగీత, సాహిత్యాల్లో అంతటి మహానుభావుడు - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు.

 రజనీ గారిలో మరో గొప్పదనం - ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో కూడా సౌందర్యాన్నీ, కవిత్వాన్నీ చూసే విభిన్నమైన చూపు. పశువులు, పక్షుల అరుపులో కూడా సంగీతం చూశారాయన. అందుకు ఆయన చేసిన సంగీత రూపకం ‘కొండ నుంచి కడలి దాకా’ ఒక ఉదాహరణ. కీచురాళ్ళ చప్పుడులోనూ సౌందర్యం, సంగీతం, శ్రావ్యతను చూడడం రజనీ ప్రత్యేకత. 1970లలో అనుకుంటా... ఆ సంగీత రూపకానికి గాను ఆయనకు జపాన్ వాళ్ళదనుకుంటా... అవార్డు కూడా వచ్చింది.

 ఇక్కడ నాకు ఎదురైన ఒక స్వీయానుభవం ప్రస్తావించాలి. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన మా ఇంట్లోని కుక్కకు కూడా సంగీతం వచ్చు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకొకసారి వినిపించండి అన్నాను. సరే అన్నారు. వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ పెంపుడు కుక్కను పక్కనపెట్టుకొని, ‘సా’ అని రాగం తీశారు. గమ్మత్తుగా అది కూడా ‘సా’ అంటూ ఆ ఫక్కీలోనే అంది. అలాగే, ‘రి’. ఎక్కడా ఎగుడుదిగుళ్ళు లేకుండా రజనీ గారి ఇంటి పెంపుడు కుక్క ‘సరిగమ పదనిస’లు అన్నీ పలికినట్లు నాకు అనిపించింది. పాటలైతే పాడలేదు కానీ, ఆ కుక్క స్వరాలు పలుకుతున్నట్లు గ్రహించాను. ఆ వెంటనే ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ఆ ‘సంగీతం పాడే కుక్క’ గురించి ప్రత్యేకంగా ఒక ఫీచర్ రాసి, ప్రచురించాను. ‘ఏ గూటి చిలక ఆ గూడి పలుకు’ అని మనకో జాతీయం ఉంది. సరిగ్గా అలాగే, ఇక్కడ సంగీతపు గూటి కుక్క, ఆ గూటిలోని సంగీతాన్నే పలికిందన్నమాట.

 ఇవాళ ఒక్కసారి తెలుగునాట సంగీత పరిణామక్రమాన్ని సింహావలోకనం చేసుకుంటే, శాస్త్రీయ సంగీతం కాస్తా లలితసంగీతంగా రూపం మార్చుకొని, ప్రవర్తిల్లడం ఒక పరిణామ దశ. ఆ పరిణామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రితో సహా కొందరు సాహిత్యకారులు, సంగీతజ్ఞుల పాత్ర ఉంది. వారితో పాటు రజనీ గారిది కూడా లలిత సంగీతావిర్భావంలో ఒక ముఖ్యపాత్ర. అలాగే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం డెరైక్టర్‌గా కూడా ఆయన నూతన పథగామి అయ్యారు. ఆకాశవాణిలో మామూలు స్థాయిలో మొదలైన ఆయన కేంద్ర సంచాలకుడి స్థాయి వరకు ఎదిగారు. సాధారణంగా ఆ స్థాయికి వచ్చాక, చాలామంది మునుపు చేసినవారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక మూసలో వెళ్ళిపోతుంటారు. కానీ, రజనీ గారు అలా కాదు.  వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ‘భక్తి రంజని’ లాంటివెన్నో రజని గారి కంట్రిబ్యూషనే! అలాగే, యువకులు, కొత్తవాళ్ళలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. అలా ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఆయన ఒరవడి పెట్టారు. ఇతరులకు కూడా ఆ విషయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
 వ్యక్తిగతంగా చూస్తే, వయసులో నా కన్నా రజనీ గారు చాలా పెద్ద. అయినా, నన్నెప్పుడూ ఆయన స్నేహదృష్టితో చూసేవారు. ఆయన, రచయిత మహీధర రామమోహనరావు, నేను కలిసి, సరదాగా మాట్లాడుకున్న క్షణాలు, ఫోటోలు దిగిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే! ఆయనకు వయసు మీద పడ్డాక ఎప్పుడైనా కలిసినప్పుడు, ‘కులాసాగా ఉన్నారా’ అని నేను అడిగితే, ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పడానికి బదులుగా కావాలని - ‘నేను... పొత్తూరి వెంకటేశ్వరరావును’ అంటూ ఉంటారు. నేను వెంటనే, ‘అవును. మరి నేనేమో బాలాంత్రపు రజనీకాంతరావును’ అని నమస్కరిస్తుంటా. ఆ మాటతో ఇద్దరం హాయిగా నవ్వుకుంటాం. నిండు చంద్రుడి లాంటి ఆయన నవ్వుకు మరో వసంతం నిండుతున్నందుకు ఆనందిస్తున్నాను. స్నేహసంగీతం పరిమళించే ఈ శతాయువు తెలుగు లలిత సంగీత ప్రపంచంలో చిరాయువు!

(సంభాషణ - రెంటాల జయదేవ)

http://img.sakshi.net/images/cms/2015-01/51422468787_Unknown.jpg





.....................................

Friday, February 27, 2015

రామానాయుడు గారు ఆ కథలో వేలుపెట్టనన్నారు! - నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి

నాయుడు గారు ఆ కథలో వేలుపెట్టనన్నారు!
 ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మరణించారంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. సినిమా రంగంలో దుక్కిపాటి మధుసూదనరావు గారి తరువాత మళ్ళీ రామానాయుడు గారికి ‘నవలా చిత్రాల నిర్మాత’గా చాలా పేరుండేది. పాఠకాదరణ పొందిన నవలలను వెండితెరకెక్కించడానికి రామానాయుడు గారు ఎప్పుడూ ముందుండేవారు. అలా నవలల నుంచి ఆయన సినిమాలుగా తీసినవి చాలానే ఉన్నాయి. అప్పటి ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన మొదలు ఇప్పటి బలభద్రపాత్రుని రమణి లాంటి ఎంతోమంది రచనలు ఆయన ద్వారా వెండితెరకెక్కాయి. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ప్రేమనగర్’ లాంటి పెద్ద కమర్షియల్ హిట్ సైతం నవలే కదా! ఇక, నా నవలల్ని కూడా ఆయన చలనచిత్రాలుగా నిర్మించారు. అందులో ప్రధానంగా అందరికీ గుర్తుండిపోయేవి - ‘జీవనతరంగాలు’, ‘సెక్రటరీ’, ‘అగ్నిపూలు’.
 
 సినిమాకు పనికొచ్చే మంచి కథల కోసం వెతికే స్వభావం వల్ల నాయుడు గారికి నవలల మీద, నవలా రచయితల మీద చాలా మర్యాద ఉండేది. నవలలు ఆయన బాగా చదివేవారు. నవలను సినిమాకు ఎంచుకొనేటప్పుడు ఆ కథల గురించి బాగా చర్చించేవారు. మరికొంతమందికి కూడా ఆ నవలలు ఇచ్చి, చదివించేవారు. ఫలానా నవల సినిమాకు ఒదుగుతుందా, లేదా అని జాగ్రత్తగా జడ్జి చేసేవారు. అన్ని చర్చలు చేసి, సదరు నవలను సినిమాకు ఎంచుకున్న తరువాత తెరపైన ఆ నవలకు పూర్తి న్యాయం చేసేవారు. అవసరమైతేనే సినిమాకు తగ్గట్లుగా కథలో కొద్ది మార్పులు చేసేవారు. నా ‘అగ్నిపూలు’కు అలానే కొన్ని మార్పులు చేశారు. అయితే, అప్పటికే ఆ నవలను చదివి, ఆ పాత్రలతో అనుబంధం పెంచుకున్న మహిళా ప్రేక్షకులను సినిమాతోనూ ఒప్పించి, మెప్పించారు.
 
 ఆయన తీసిన నా నవలా చిత్రాల్లో నా వరకు నాకు బాగా నచ్చినది - ‘జీవనతరంగాలు’ (1973). అప్పట్లో సీరియల్‌కు అలాంటి పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. కానీ, నేను ఆ పేరు మీద పట్టుబట్టాను. తరువాత సినిమాగా తీస్తున్నప్పుడు నాయుడు గారు సాధారణంగా సినిమాలకు పెట్టే పేర్లకు భిన్నంగా ‘జీవన తరంగాలు’ అనే టైటిలే ఉంచారు. ఆ నవలను సినిమాగా తీస్తున్నప్పుడు ఆయన కథలో సినిమా కోసం మార్పులేమీ చేయలేదు. ‘అద్భుతమైన నవల. ఆ కథలో వేలు పెట్టను’ అని చెప్పారు. అలాగే చేశారు. పైగా, ‘జీవన తరంగాలు’ అనే పేరుకు తగ్గట్లే కథలో సందర్భోచితంగా ఒక పాట రాయించి పెట్టారు. ఆత్రేయ గారు రాసిన ‘ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...’ అనే పాట అప్పుడూ, ఇప్పుడూ ‘ఎవర్‌గ్రీన్’గా నిలిచిపోవడం విశేషం.
 
 ఆయన చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. ఏదైనా నవల బాగుందంటే ఆ రచయితతో మాట్లాడి, నిజాయతీగా డబ్బులు చెల్లించి హక్కులు తీసుకొనేవారు. అప్పట్లో నవలలు రాసేవారందరూ తమ నవలల హక్కులను రామానాయుడు గారు తీసుకుంటే బాగుండేదని ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. పాఠకులు ఆదరించిన కథలను సినిమాగా తీయడం వల్ల ప్రేక్షకులను మెప్పించడం సులభమవుతుందని ఆయన నమ్మకం. నా నవల ‘అభిశాపం’ అంటే ఆయనకు చాలా ఇష్టం.
 
 ఆ నవల హక్కులు కూడా తీసుకున్నారు. ఆ నవలను సినిమాగా తీయాలనుకుంటున్నట్లు ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా! కానీ, ఎందుకనో ఆయన కోరిక నెరవేరలేదు. అలాంటి అభిరుచి గల నిర్మాత ఇప్పుడు భౌతికంగా కనుమరుగవడం నవలాప్రియులకు కూడా బాధాకరం. ఏమైనా, మంచి సినిమాలు అందించిన వ్యక్తిగా, మరీ ముఖ్యంగా నవలా చిత్రాల నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఆయనకు సుస్థిరమైన స్థానం ఉంది. ఆ రకంగా స్త్రీ ప్రేక్షక హృదయాలలో ఆయనకూ, ఆయన నవలా చిత్రాలకూ ప్రత్యేకమైన గుర్తింపు మిగిలింది.


- సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 20th Feb 2015, Friday)
....................................

ఇదంతా నాయుడు గారి కుటుంబమే!

అయిదు దశాబ్దాల పైచిలుకు సినిమా కెరీర్‌లో రామానాయుడు ద్వారా తొలి సినీ అవకాశం పొందిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు చాలా మందే ఉన్నారు. ‘ప్రతిభ ఉంది, పనికొస్తార’ని అనుకుంటే, కొత్తవాళ్ళకు అవకాశమివ్వడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. అలాగే, ‘అవకాశమిస్తాన’ంటూ ఒకసారి మాట ఇస్తే, ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా, నష్టమైనా భరించేవారు. నాయుడి గారి సినీ కుటుంబం నుంచి పరిశ్రమకు దక్కిన ప్రతిభావంతులలో కొందరు...


హీరోలు: దాదాపు అరడజను మంది. వారిలో కొందరు - వెంకటేశ్ (‘కలియుగ పాండవులు’), డి. రాజా (‘గురుబ్రహ్మ’) , హరీశ్ (‘ప్రేమఖైదీ’), శ్రీనివాసవర్మ (‘సర్పయాగం’), ఆర్యన్ రాజేశ్ (‘హాయ్’).

హీరోయిన్లు: 11 మంది. వారిలో కొందరు - ఎల్. విజయలక్ష్మి (‘రాముడు - భీముడు’లో రెండో హీరోయిన్), దివ్యభారతి (‘బొబ్బిలి రాజా’), ప్రేమ (‘ధర్మచక్రం’), కరిష్మా కపూర్ (‘ప్రేమఖైదీ’ హిందీ), టబు (‘కూలీ నెం.1’), సంఘవి (‘తాజ్‌మహల్’), మోనికా బేడీ (‘తాజ్‌మహల్’), అంజలా ఝవేరీ (‘ప్రేమించుకుందాం రా’), నిఖిత (‘హాయ్’), కత్రినా కైఫ్ (‘మల్లీశ్వరి’)

గీత రచయిత: చంద్రబోస్
సంగీత దర్శకులు: నలుగురు (అరుణ్ అమీన్, మణిశర్మ, ఈశ్వర్, మహేశ్)
 
దర్శకులు: 22 మంది. వారిలో కొందరు - జి.వి.ఆర్. శేషగిరిరావు (‘పాప కోసం’), కె.బాపయ్య (‘ద్రోహి’), బోయిన సుబ్బారావు (‘సావాసగాళ్ళు’), నగేశ్ (‘మొరటోడు’), వి.సి. గుహనాథన్ (‘కక్ష’), కె. మురళీమోహన్‌రావు (‘సంఘర్షణ’) , బి. గోపాల్ (‘ప్రతిధ్వని’), వై.నాగేశ్వరరావు (‘రాము’), సురేశ్‌కృష్ణ (‘ప్రేమ’), పరుచూరి బ్రదర్స్ (‘శ్రీకట్నలీలలు’), ఏ.వి.ఎస్ (‘సూపర్ హీరోస్’), జయంత్ సి. పరాన్జీ (‘ప్రేమించుకుందాం...రా’), తిరుపతి స్వామి (‘గణేష్’), చంద్రమహేశ్ (‘ప్రేయసి రావే’), ఉదయ శంకర్ (‘కలిసుందాం... రా’), వై. కాశీవిశ్వనాథ్ (‘నువ్వు లేక నేను లేను’), రవి బాబు (‘అల్లరి’), యోగేశ్ ఈశ్వర్ (‘ఆఘాజ్’), విజయేంద్రప్రసాద్ (‘శ్రీకృష్ణ 2006’). 

(Published in 'Sakshi' daily, 19th Feb 2015, Thursday)
........................................

Thursday, February 26, 2015

నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!! - నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి


 ఒక విషయాన్ని నమ్మడం వేరు. నమ్మినదాన్నే ఆచరిస్తూ, ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం వేరు. మాటలో, మనిషిలో ముక్కుబద్దలయ్యేంత సూటిదనమున్న మనిషి అంటే... ఇవాళ తెర మీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. పేకాటకు బానిసై, కుటుంబాన్ని పోషించుకునేందుకు జేబులో 50 రూపాయలు లేక కన్నతండ్రి (పోసాని సుబ్బారావు) పురుగుల మందు తాగి చనిపోతే, బంధువుల నిరాదరణ మధ్య ధైర్యంగా ఒంటరి పోరాటం చేసిన కన్నతల్లి (శేషమ్మ) నుంచి నిజాయతీనీ, పోరాటతత్త్వాన్నీ పుణికిపుచ్చుకున్న పోసాని జీవితమే ఒక సినిమా.
 

నాకు మిత్రులూ లేరు! శత్రువులూ  లేరు!!


 అష్టకష్టాలు పడి, పరుచూరి బ్రదర్స్ వద్ద సహాయకుడిగా మొదలై... కొద్దికాలంలోనే రచయితగా వంద సినిమాలు చేసి, దర్శకుడిగానూ హిట్లు తీసి, నటుడిగా ఇవాళ బిజీగా మారిన కథ - పోసానిది. ‘గోపాల గోపాల’లో కామెడీ విలన్ కావచ్చు, తాజా ‘టెంపర్’లో నిజాయతీపరుడైన పోలీసు కావచ్చు... ఏ పాత్రనైనా పండించడం ఆయన  ప్రత్యేకత. వరుసగా వచ్చిపడుతున్న అభినందనలు, వస్తున్న అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా... ఇవాళ్టికీ సాదాసీదా డ్యుయల్ సిమ్ బేసిక్ మోడల్ నోకియా ఫోన్‌లో సంభాషిస్తూ, విజయం తలకెక్కించుకోకుండా నేల మీద నడుస్తున్న పోసానితో జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలు...
 
 ‘టెంపర్’లో పోషించిన పోలీసు నారాయణమూర్తి పాత్రకు చాలా పేరొచ్చినట్లుంది!
 నిజమే. అది చాలా నిజాయతీపరుడైన పోలీసు పాత్ర. ఆ పాత్రను తీర్చిదిద్దిన రచయిత వక్కంతం వంశీకీ, తూటాల లాంటి మాటలు రాసిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌కూ, సపోర్ట్ చేసిన చిన్న ఎన్టీఆర్‌కూ నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ‘టెంపర్’లోని పోలీసు మూర్తి పాత్ర చూసి, అందులో నేను చెప్పే డైలాగులు, సెల్యూట్ కొట్టే సీన్ గురించి కొన్ని వందల ఫోన్లు వచ్చాయి. కొత్త ఉత్సాహం వచ్చింది.  
 
   పోలీసు పాత్రలు కెరీర్‌లో మీకు పేరు తెచ్చినట్లున్నాయి!
 పోలీసు పాత్రలు నాకు వ్యక్తిగతంగా పెద్దగా నచ్చవు. కానీ, రచయితగా శ్రీకారం చుట్టిన ‘పోలీస్ బ్రదర్స్’ నాటి నుంచి వెన్నంటి ఉన్నాయి. మొన్నటి ‘వేదం’ మీదుగా ఇవాళ్టి ‘టెంపర్’ వరకు నేను చేసిన పోలీసు పాత్రలన్నీ పేరు తెచ్చాయి. ఎన్ని పోలీసు పాత్రలొస్తున్నాయంటే, వాటి కోసం రెండు జతల పోలీసు డ్రెస్సులు, బూట్లు కొనుక్కుని, ఇంట్లో పెట్టుకున్నా
 
  ప్రస్తుతం ఫలానా తరహా పాత్ర పోషించాలని ఏమైనా...?
 చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటిస్తూ వచ్చాను. నేను హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా చేయగలను. పరిశ్రమలో ఇంతమంది ఆర్టిస్టుల మధ్య నాకంటూ స్థానం దొరకడం అదృష్టం. నన్ను పిలిస్తే, ఎలాంటి పాత్రయినా చేస్తా. పూర్తి విషాదభరిత పాత్ర పోషించాలని ఉంది.
 
 రచయితగా, నటుడిగా, దర్శకుడిగా... మీ విజయరహస్యం?
 ఏమీ లేదు. ఇచ్చిన పని నిజాయతీగా చేయడం. నిక్కచ్చిగా నా దోవన నేను వెళ్ళడం! నేనెప్పుడూ ఫైల్ పుచ్చుకొని రైటర్‌గానో, స్క్రిప్టు పట్టుకొని దర్శకుడిగానో, పోర్ట్‌ఫోలియో పట్టుకొని నటుడిగానో అవకాశాల కోసం తిరగలేదు. అయినా సరే, పరిశ్రమ నాకు ఈ మూడు శాఖల్లో నన్ను ఆదరించింది, అభిమానించింది. ఆశీర్వదించింది. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. పరుచూరి బ్రదర్స్ దగ్గర 1500 రూపాయలకు అసిస్టెంట్‌గా పని చేసిన నేను ఇవాళ నా కుటుంబ అవసరాలకు మించి, సంపాదించా. రేపు నేనున్నా, లేకపోయినా నా భార్యాబిడ్డలకు నెలకు నిర్ణీత ఆదాయం ఉండేలా చూడాలని నా భావన.
 
 కానీ, మీరు డబ్బు దగ్గర స్ట్రిక్ట్ అనీ, మెంటల్ అనీ...?
 చూడండి. నిర్మాతకూ, నాకూ స్నేహాలు, బంధుత్వాలు ఏముంటాయి! నాతో పని ఉంటే, నా దగ్గరకొస్తారు. లేకపోతే రారు. మరి, నేను చేసిన నటనకూ, రాసిన స్క్రిప్టుకూ డబ్బులు అడగడం కూడా తప్పేనా? నన్ను అడిగిన పని సవ్యంగా పూర్తిచేసి ఇచ్చేశాక, ముందుగా ఒప్పందం చేసుకున్న డబ్బులు ఇవ్వాలి కదా! రాసినదానికీ, నటించిన దానికే కదా అడుగుతున్నాను. రాయాల్సిన దానికీ, చేయాల్సిన దానికి కాదు కదా! అలా అడిగితే తిక్క అనీ, మెంటల్ అనీ, వివాదాస్పదుడనీ అనుకొంటే, వాళ్ళ ఇష్టం. ఇన్నేళ్ళ చరిత్రలో రచయితగా నేను ఆలస్యం చేయలేదు. నటుడిగా షూటింగ్‌కు నిమిషమన్నా ఆలస్యంగా వెళ్ళలేదు. కావాలంటే, ఎవరినైనా అడగండి. టైమ్‌కు రాకపోతే ఆర్టిస్టును తప్పుపడతాం, మరి, టైమ్‌కు పారితోషికం ఇవ్వకపోతే నిర్మాతను తప్పుపట్టకూడదా? నేను సినీ రంగానికి వచ్చింది డబ్బు సంపాదించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికే! ఎవరినో ఉద్ధరించడానికి కాదు! అందుకే, నాకిక్కడ స్నేహితులెవరూ లేరు. ఉన్నదల్లా గౌరవార్హులు, పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులే!
 
  పరిశ్రమలో పెద్దలతో కూడా మీరు తగాదా పడ్డ సందర్భాలున్నాయిగా?
 (కాస్త స్వరం పెంచి...) అవును. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గౌరవం, మర్యాద ఉంటాయి. అందుకే, నా విషయంలో ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా, ప్రవర్తించినా తగాదా పడ్డా. పత్రికలు నా గురించి తప్పు వార్తలు రాస్తే, వాటినీ వదిలిపెట్టలేదు. నా వాదనలోని నిజం, నా మనస్తత్వం తెలుసు కాబట్టే, వాళ్ళెవరూ తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇక్కడ నాకెవరూ శత్రువులు లేరు. నేనెవరికీ శత్రువునూ కాదు.
 
   స్నేహితులు, శత్రువుల మాటెలా ఉన్నా, మీ శిష్యులు చాలామంది దర్శక, రచయితలుగా ఉన్నట్లున్నారు?
 (నవ్వేస్తూ...) అవును. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ, నివాస్, సంపత్ నంది, ఆకుల శివ, బి.వి.ఎస్. రవి, కల్యాణకృష్ణ - ఇలా పాతిక మంది దాకా ఉన్నారు. అది నా అదృష్టం. అటు నా గురువులు పరుచూరి బ్రదర్స్ రాస్తున్న సినిమాలకూ, ఇటు నా శిష్యులు తీస్తున్న సినిమాలకూ కూడా పనిచేస్తున్నా.
 
   మీరెందుకు చాలా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉంటారు?
 చిన్నప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాణ్ణి. కానీ, జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు, తిండికీ - చదువుకూ పడిన నానా ఇబ్బందుల వల్ల క్రమంగా రెబల్‌గా మారా. బతకడం కోసం... టమోటాలు వేసే బుట్టలు కుట్టాను. గుంటూరు నాజ్ థియేటర్ టికెట్ కౌంటర్‌లో నేల టికెట్లు అమ్మా. చిట్‌ఫండ్ కంపెనీలో పని చేశా. ఎం.ఏ, ఎం.ఫిల్ చదివి, తెలుగులో పిహెచ్.డి. చేస్తూ, మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర శిష్యుడిగా చేరి, బాయ్‌లాగా అన్ని పనులూ చేశాను. గురువుల ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణతో ఇంతవాణ్ణి అయ్యా. నిజానికి, నేను స్వతహాగా భయస్థుణ్ణి. కానీ, నన్ను రెచ్చగొడితే ఆ భయం పోయి, తిరగబడతా!
 
  కఠినంగా కనిపిస్తారు కానీ, సున్నితమనస్కులని తెలిసినవాళ్ళ మాట!
 (గంభీరంగా మారి...) ఇవాళ్టికీ టీవీలో, సినిమాలో ఒక విషాద ఘట్టం వచ్చినా తట్టుకోలేను. మొన్న టీవీలో ‘శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’ సినిమా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నా.
 
   మీకు దేవుడి మీద నమ్మకం, భక్తి...
 (మధ్యలోనే అందుకుంటూ...) అపారమైన నమ్మకం, భక్తి. అయితే, మూఢనమ్మకాలు లేవు. ఫలానా రూమ్‌లో కూర్చొంటేనే రాయగలను లాంటివి లేవు. ఒక చాప, దిండు వేసి, ఈ గదిలో కూర్చొని, రాయమన్నా రాసేస్తా. ఈ ఇంట్లోనే ఉంటూ నేను హిట్లూ తీశా, ఫ్లాపులూ ఇచ్చా. కాబట్టి, మన బుర్రకు వాస్తు ఏమిటి? (నవ్వులు...) నేను నమ్మేదల్లా మంచి, చెడు - ఈ రెండిటినే!
 
 మళ్ళీ సినిమా రచన, దర్శకత్వం చేస్తారా?
 ఎందుకు చేయను! చేస్తా! దేవుడి దయ వల్ల ప్రస్తుతం నటనతో పూర్తిగా బిజీగా ఉన్నా. ఒకవేళ ఎప్పుడైనా కొద్దిగా గ్యాప్ వస్తే, అప్పుడు తప్పకుండా రచన, దర్శకత్వాలు చేస్తా. ప్రస్తుతానికి మత్తుమందిచ్చి, వాటిని నిద్రపుచ్చుతున్నా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిద్ర లేపుతా.
 
   మీ ‘ఐ లవ్ యు రాజా’ ఊతపదం ఇవాళ తెలుగు నాట అందరి నోటా వినిపిస్తున్నట్లుందే?
 (నవ్వేస్తూ...) ‘మా’ టి.విలో జరిగిన ఒక పిల్లల టాలెంట్ షోలో నేను ఒక జడ్జీని. అక్కడకు వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా, నొప్పించకుండా, ప్రోత్సహించేలా మాట్లాడడం కోసం, ‘వచ్చేసారి ఇంకా బాగా చెయ్యి నాన్నా’ అని చెబుతూ, ‘ఐ లవ్ యు రాజా’ అనేవాణ్ణి. అది బాగా పాపులర్ అయింది. దాంతో, పిల్లలు కూడా నన్ను ‘లవ్ యు రాజా’ అనసాగారు. అది అలా తెలుగు నాట అంతటా పాపులర్ అయింది. తరువాత సినిమాలో పెట్టా! అక్కడా బ్రహ్మాండంగా ఆ డైలాగ్ పేలింది. అప్పటి నుంచి దేశమంతటా ఈ ‘ఐ లవ్ యు రాజా’ మాట అందరూ వాడుతున్నారు. ఆ మధ్య ‘రేసుగుర్రం’ సినిమాలో హీరో అల్లు అర్జున్‌తో పాటు నేనూ అనే ‘దేవుడా’ అనే ఊతపదం, అలాగే ‘అత్తారిం టికి దారేది’లోని ‘ఏసునాథా’ అనే మాట - ఇవన్నీ బాగా పాపులరయ్యా యి. నటుడిగా మరింత మందికి దగ్గర చేశాయి.
 
 రాజకీయ పార్టీలు చాలా మారినట్లున్నారు?
 లేదు. నేను సభ్యత్వం తీసుకున్న ఒకే పార్టీ - అప్పట్లో చిరంజీవి గారి ‘ప్రజారాజ్యం పార్టీ’. ఆ పార్టీ తరఫున చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేశా. కులం కార్డు వాడకుండా, డబ్బు, మద్యం పంచకుండా ప్రచారం చేశా. ఎలా గెలుస్తాం చెప్పండి. రాజకీయాల్లో పనికిరానని వచ్చేశా. ఉన్నంతలో మంచివాళ్ళకు ఓటేయడం మినహా ఇప్పుడు ఏ పార్టీలో లేను.

  మీ ఇద్దరు పిల్లలేం చేస్తున్నారు?

 వాళ్ళకు సినిమాల్లోకి రావాలని కోరిక. నాకేమో ఇష్టం లేదు. అయినా, నా భావాలను వాళ్ళ మీద రుద్దలేదు. వాళ్ళకి
 ష్టమైన వైపే వెళ్ళమన్నా. కాకపోతే, ఏ పని చేసినా ప్రవర్తన బాగుండాలని చెబుతూ వచ్చా. మా పెద్దవాడు ఉజ్జ్వల్ డిగ్రీ ఫైనలియర్. వాడు నా కన్నా బాగా రాస్తాడు, రచయిత, దర్శకుడు కావాలని వాడి కోరిక. రెండోవాడు ప్రజ్వల్ ప్లస్ 2 పాసయ్యాడు. సినీ కోర్సు చేయడానికి అమెరికా వెళ్ళాడు. టెక్నిక్ చదువుకొని, అక్కడే స్థిరపడాలని వాడి ఆశ.
 
 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 25th Feb 2015, Wednesday)
......................................

Saturday, February 21, 2015

హైదరాబాద్ నగర చిత్రపటంపై చెరగని ముద్ర - నిర్మాత డి.రామానాయుడు

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడికీ, హైదరాబాద్ నగరానికీ బలమైన అనుబంధం ఉంది. సినిమా కెరీర్ ప్రథమార్ధమంతా మద్రాసులో, ద్వితీయార్ధమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మార్పును వేగవంతం చేసిన వారిలో రామానాయుడు ఒకరు. జూబ్లీహిల్స్‌లో ఆయన నిర్మించిన రామానాయుడు స్టూడియో ఇవాళ తెలుగు చిత్ర నిర్మాణానికి ఒక ల్యాండ్‌మార్క్. ఆ తరువాత హైదరాబాద్ శివార్లలో నానక్‌రామ్‌గూడ దగ్గర ‘రామానాయుడు సినీ విలేజ్’తో స్టూడియోను విస్తరించారు.

 ..:: రెంటాల జయదేవ 
నగర చిత్రపటంపై చెరగని ముద్ర

జూబ్లీహిల్స్‌లో స్టూడియో నిర్మాణానికి ఆయన నడుంకట్టిన తొలిరోజుల్లో జూబ్లీహిల్స్‌లోని ఆ స్థలం కొండలు, గుట్టలతో జనావాసాలకు దూరంగా ఉండేది. ఆ సంగతులను ఆయనే ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ.. ‘భవనం వెంట్రామిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు స్టూడియోల నిర్మాణానికి పద్మాలయా వారికీ (హీరో కృష్ణ), నాకూ స్థలం కేటాయించారు. రెండు పెద్ద రాళ్ళ గుట్టలు ఇచ్చేసి, స్టూడియో కట్టమంటారేమిటని నవ్వుకున్నారు అందరూ’ అని రామానాయుడు అనేవారు. అయితే, మట్టిని బంగారంగా మార్చిన హైదరాబాద్‌లోని స్టూడియో అంటేనే రామానాయుడుకు ప్రత్యేక అభిమానం.

భవిష్యత్‌ను ఊహించి...

ఇవాళ సినిమా వాళ్ళందరికీ చిరునామాగా మారిన ఫిల్మ్‌నగర్ కూడా రామానాయుడు హస్తవాసితో అభివృద్ధి అయ్యిందే. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ పెట్టి, ఇళ్ళస్థలాలు ఇచ్చినా 1980లలో బతిమలాడినా ఎవరూ సభ్యత్వం తీసుకొనేవారు కాదు. ఆ సమయంలో సీనియర్ నిర్మాత డి.వి.ఎస్. రాజు సలహా మేరకు రామానాయుడు తన పేరుపై, తన పిల్లలు సురేష్‌బాబు, వెంకటేశ్ పేర్లపై మూడు సభ్యత్వాలు తీసుకున్నారు. అప్పట్లో అక్కడ ‘ప్రతాప్ ఆర్ట్స్’ రాఘవలాంటి ఒకరిద్దరి ఇళ్ళే ఉండేవి.

తరువాత అక్కడ ఇల్లు కట్టింది రామానాయుడే. అక్కడే సురేష్‌బాబు స్థలంలో ‘సురేష్ గెస్ట్‌హౌస్’ నిర్మించారు. హైదరాబాద్‌లో తాను నిర్మిస్తున్న తెలుగు, హిందీ సినిమాలకు మద్రాసు, బొంబాయి నుంచి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆ గెస్ట్‌హౌస్‌లోనే విడిది అని షరతు పెట్టారు. లక్షల రూపాయల స్టార్‌హోటళ్ళ ఖర్చును ఆదా చేసి, నిర్మాణ వ్యయాన్ని నియంత్రణలో ఉంచి, సిసలైన నిర్మాత అనిపించుకున్నారు. అనిల్‌కపూర్, రేఖ, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, టబు, దివ్యభారతి లాంటి అప్పటి టాప్ స్టార్లంతా ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో బిజీ కూడలిగా మారిన ఆ గెస్ట్‌హౌస్‌లో ఉన్నవారే!

రాళ్లల్లో.. గుట్టల్లో...

రామానాయుడు స్టూడియో నిర్మాణం కాక ముందే అక్కడ చిత్ర నిర్మాణం మొదలైంది. వెంకటేశ్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) చిత్రాన్ని నిర్మిస్తూ, జూబ్లీహిల్స్‌లోని స్టూడియో స్థలంలో రాళ్ళగుట్ట మీద పెద్ద కాలనీ సెట్ వేయించారు రామానాయుడు. ఆ స్టూడియో స్థలంలో జరిగిన తొలి షూటింగ్ అదే. ఆ సినిమా తెచ్చిన లాభాలు, ఆ తరువాత వచ్చిన హిట్లే ఆ రాళ్ళ గుట్టలో సుందరమైన స్టూడియో వెలిసేందుకు దోహదపడ్డాయని రామానాయుడు చెబుతుండేవారు.

1990ల దశకంలో సూపర్‌హిట్ల ద్వారా సంపాదించిన సొమ్మంతా స్టూడియో నిర్మాణానికే వెచ్చించారాయన. ల్యాబ్, రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్, ప్రివ్యూ థియేటర్ల లాంటి సమస్త సదుపాయాలతో తన కలల సౌధం నిర్మించారు. మునుపటి రాళ్ళగుట్టతో ఆ స్టూడియోను పోల్చి చూసినప్పుడల్లా తన మనసు సంతోషంతో నిండిపోతుందని రామానాయుడు ఎప్పుడూ చెబుతుండేవారు. స్టూడియో మీద, ఆ పరిసరాల మీద ఆయనకు ఎంత ప్రేమంటే... ప్రతిరోజూ ఆయన స్టూడియోకు వెళ్లి ఆ పరిసరాలను కళ్ళారా చూడాల్సిందే, స్టూడియో వ్యవహారాలు కనుక్కోవాల్సిందే!

చివరకు క్యాన్సర్‌తో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నా సాయంత్రం కాసేపు స్టూడియోకు వచ్చి వెళ్ళేవారంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు పూర్తిగా షిఫ్టయ్యే సమయానికి రామానాయుడు స్టూడియో, నానక్‌రామ్ గూడ సినీ విలేజ్‌లతో నగర చిత్రపటంపై సినిమా రంగ ప్రాథమిక వసతులను స్థిరీకరించిన దార్శనికుడిగా రామానాయుడు నిలిచిపోతారు.

(Published in 'Sakshi' daily, Hyderabad City Plus, 19th Feb 2014, Thursaday)
...............................................

సెంటిమెంట్ల చిన్నయ్య - రామానాయుడు

సెంటిమెంట్ల చిన్నయ్య
వెండితెర మీదే కాదు... వ్యక్తిగతంగానూ రామానాయుడికి సెంటిమెంట్ ఎక్కువ. అవతలి వారి కష్టాన్ని తన కష్టంగా తీసుకొనే భావోద్వేగ తత్త్వం మొదలు ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తాల కోసం వేచి చూసే నమ్మకాల దాకా అన్నీ ఉన్న పాత తరం పల్లెటూరి పెద్దమనిషి తనం ఆయనది. రామానాయుడి చిత్రమైన అలవాట్లు, నమ్మకాలలో కొన్ని...

- రామానాయుడు చాలా సెన్సిటివ్. కృత్రిమమైన ప్రవర్తనలు ఎక్కువగా కనిపించే ఈ గ్లామర్ ప్రపంచంలో ఇన్ని దశాబ్దాలుగా ఉంటున్నా, ఆయన గుండెలోని తడి ఇంకిపోలేదు. మనసును బాధించే విషయాలు విన్నా, సంఘటనలు చూసినా ఆయన తట్టుకోలేరు. అప్రయత్నంగానే ఆయనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి.

- రామానాయుడికి సెంటిమెంట్లు ఎక్కువ. నిర్మాతగా మద్రాసులో తొలిరోజులు గడిపిన రామానాయుడికి రాహుకాలాలు, వారాలు, వర్జ్యాల పట్టింపులున్నాయి. రాహుకాలంలో ఆయన కథలు వినరు. కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. అలాగే, మంగళవారాలు ప్రయాణం చేయకపోవడమనేది ఆయనకున్న మరో నమ్మకం.

 - అందుకే, ఏ పని చెయ్యాలన్నా పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించుకుంటారు. అలాగని, గాలిలో దీపం పెట్టి, దేవుడా... అంతా నీదే భారమనే తరహా వ్యక్తి కాదాయన. మంచి ముహూర్తంలో పని ప్రారంభించడం వరకే కానీ, ఆ తరువాత కూడా చేసే పని నిజాయతీగా, నిబద్ధతతో చేస్తారు.

- రామానాయుడికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఇంటి ఆరాధ్యదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. వెంకన్నంటే ఆయనకు అపారమైన గురి. అందుకే, నిర్మాతగా తాను తీసిన ఏ సినిమా అయినా సరే విడుదల కన్నా ముందే రీలు పెట్టెలు తీసుకువెళ్ళి, తిరుమల వెంకన్న దగ్గర పూజలు చేయించడం రామానాయుడి అలవాటు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలంగా ఉన్న 1960ల నాటి నుంచి రిలీజ్ రోజున విజయవాడకు వచ్చి, జనం మధ్య కూర్చొని సినిమా చూడడం, ప్రేక్షకుల నాడి గమనించడం ఆయన చాలా కాలం కొనసాగించిన సెంటిమెంట్.

- అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామానాయుడు స్టూడియోస్ కట్టాక, స్టూడియో ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగానే మొదట్లోనే ఎత్తై గుట్ట మీద దేవుడి గుడి కట్టించారాయన. రోజూ ఉదయం స్టూడియోకు వస్తూనే, ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం చేసుకొన్న తరువాతనే ఆఫీసులోకి అడుగుపెట్టడం ఆయన నిత్యకృత్యం.  

 -  హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోనూ స్టూడియో కట్టాక, రోజూ సాయంత్రం వేళ అక్కడకు కారులో వెళ్ళడం, కాసేపు కాలక్షేపం చేసి, అక్కడ ఖాళీ జాగాలో పండించిన కూరగాయలు వగైరా చూసి రావడం ఆయనకు అలవాటు.

 - అలాగే, ‘నాయుడి గారి హస్తవాసి చాలా మంచిది’ అని సినీ పరిశ్రమలో ఒక నమ్మకం. అలాగే, దర్శకుడు దాసరిది కూడా! అందుకే, ఆయన చేతుల మీదుగా డబ్బు తీసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన తన వద్దకు వచ్చి, శుభాకాంక్షలు చెప్పే సినీ టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికీ వంద రూపాయల నోటు ఇవ్వడం రామానాయుడు అలవాటు. ఆయన చేతి మీదుగా ఏడాది తొలిరోజు డబ్బు తీసుకుంటే, ఆ ఏడాది పొడుగూతా ప్రతి రోజూ సంపాదన ఉంటుందని చాలామంది నమ్మకం. రామానాయుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ 2015 జనవరి 1న కూడా ఆ నమ్మకం, అలవాటు అలాగే కొనసాగింది. రెండు గంటల పాటు స్టూడియోకు వచ్చి కూర్చున్న రామానాయుడు ఆ ఆనవాయితీని కొనసాగించారు.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 19th Feb 2014, Thursday)
...................................

Thursday, February 19, 2015

కృషిని నమ్మిన... కూలీ నెం.1 - దగ్గుబాటి రామానాయుడు

నగర చిత్రపటంపై చెరగని ముద్ర

తళుకు బెళుకుల సినిమా రంగంలోకి ఎందరో వస్తుంటారు.. మరెందరో కనుమరుగైపోతుంటారు. కానీ అతి కొద్దిమందే ఆ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి, ఆఖరు క్షణం వరకు దాని బాగోగుల కోసం తపిస్తారు. అజాతశత్రువుగా, అందరికీ తలలో నాలుకగా పేరు తెచ్చుకుంటారు. సమకాలీన తెలుగు సినిమా రంగంలో ఆ గౌరవం దక్కించుకున్న వ్యక్తి... దగ్గుబాటి రామానాయుడు. సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయినీ తిరిగి సినిమా రంగానికే వెచ్చించిన కొద్దిమంది సిసలైన సినిమా వ్యక్తుల్లో రామానాయుడు ఒకరు. మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినా వ్యక్తిగత పరిశ్రమ, శ్రద్ధ, పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చనేదానికి ఆయనే ఉదాహరణ.

నిర్మాతగా, స్టూడియో అధినేతగా, సినీపంపిణీదారుగా, ప్రదర్శకుడిగా, సేవాకార్యక్రమ నిరతుడిగా, రాజకీయ నాయకుడిగా అనేక కోణాలున్న రామానాయుడు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. సినీ రంగానికి ఎంతో సేవ చేసిన ఆయన మృతి చెందడంతో.. సినీలోకం, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.  జీవిత గమనం తొలి నుంచీ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆయన పుట్టింది ప్రకాశం జిల్లా కారంచేడులో.. 1936 జూన్ 6న రైతు దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు.. నిండా మూడేళ్ళయినా రాకముందే కన్నతల్లిని కోల్పో యి, మారుటి తల్లి ప్రేమలో పెరిగారాయన. ఒంగోలులోని సమీప బంధువు డాక్టర్ బి.వి. ఎల్. సూర్యనారాయణ ఇంట్లో కొన్నాళ్లు ఉండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా చదువుకున్నారు. సూర్యనారాయణలా తానూ డాక్టర్ కావాలని రామానాయుడు అనుకున్నారు. కానీ విధి మరో రకంగా మలుపు తిప్పింది. మద్రాసులోని లయోలా కాలేజ్‌లో చేరినా.. చదువు అంతగా సాగలేదు. మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి తర్వాత సొంతంగా వ్యవసాయంలోకీ దిగారు. కారంచేడులో జరిగిన అక్కినేని ‘నమ్మినబంటు’ చిత్రం షూటింగ్‌తో తొలిసారిగా ఒక సీన్‌లో కనిపించి, వెండి తెరకెక్కారు.
 
చిత్ర నిర్మాణంలోకి...

వ్యవసాయం, రైస్‌మిల్లు వ్యాపారం తరువాత 1960లో మద్రాసుకు వెళ్లి, మిత్రులతో కలసి ఇటుకల వ్యాపారం చేయాలనుకున్నారు. అటు నుంచి రియల్ ఎస్టేట్ వైపు మారారు. మద్రాసులోని ‘ఆంధ్రా క్లబ్’లో సినిమావాళ్ళ పరిచయాలతో గుత్తా రామినీడు దర్శకత్వంలోని ‘అనురాగం’ చిత్రానికి భాగస్వామిగా చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. ఆ సినిమా నష్టాలు తెచ్చినా... ఆ చిత్ర నిర్మాణంలో ప్రతి విషయం దగ్గరుండి గమనించడం, తానూ స్వయంగా పనిచేయడం ఆయనకు మంచి అనుభవమైంది. ఆ తరువాత 1963లో సురేశ్ సంస్థను స్థాపించి, డి.వి.నరసరాజు స్క్రిప్టుతో ఎన్టీఆర్ హీరోగా ‘రాముడు - భీముడు’ (1964) చిత్రం ద్వారా సొంతంగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నిర్మాత నాగిరెడ్డి గారి ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘విజయా’తో కలసి ‘విజయ-సురేశ్ కంబైన్స్’ పతాకంపై కొన్ని చిత్రాలు తీశారు. కొన్ని విజయాల తరువాత పరాజయాలూ ఎదుర్కొన్నారు. అయితే ‘ప్రేమ్‌నగర్’ చిత్రం నుంచి మళ్ళీ పుంజుకున్న రామానాయుడు.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
 
నటనపై ఎంతో మక్కువ

తన ప్రస్థానంలో భాగంగా రామానాయుడు హైదరాబాద్‌లో సినీ స్టూడియోను నిర్మించారు. స్క్రిప్టుతో వచ్చి, సినిమా రీళ్ళతో బయటకు వెళ్ళేలా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని నానక్‌రామ్‌గూడలో ‘రామానాయుడు సినీ విలేజ్’నూ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోనూ స్టూడియో కట్టి, విస్తరించారు. ఇక చిత్ర నిర్మాతగా ఉంటూనే... తన నటనాభిరుచిని కొనసాగించారు. తాను నిర్మించిన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో పాత్రధారిగా చటుక్కున కనిపించి, మాయమయ్యేవారు. ‘తానా’ వారి కోసం ప్రత్యేకంగా 1993లో ‘ఆంధ్ర వైభవం’ పేరిట చారిత్రక చిత్రాన్ని నిర్మించి... అందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించి, తన మక్కువ తీర్చుకున్నారు. టీనేజర్ల ఆత్మహత్యలపై ఇతర నిర్మాతలు తీసిన జాతీయ అవార్డు చిత్రం ‘హోప్’(2006)లో సైతం కీలక పాత్ర పోషించారు.
 
రూపాయి నోటు మీద ఉన్న భాషలన్నింటా..

ప్రతిభావంతులైన హీరోయిన్లనూ, సంగీత, సినీ దర్శకులనూ పరిచయం చేసిన అరుదైన రికార్డు రామానాయుడుదే. తమిళంలో శివాజీ గణేశన్ (ప్రేమ్‌నగర్‌కు రీమేకైన ‘వసంత మాళిగై’) రజనీకాంత్ (తనికాట్టు రాజా) లాంటి వారితో, హిందీలో రాజేశ్‌ఖన్నా (ప్రేమ్‌నగర్), జితేంద్ర (తోఫా, మక్సద్), అనిల్‌కపూర్ (ఇన్‌సాఫ్ కీ ఆవాజ్) లాంటి హీరోలతో చిత్రాలు తీశారు. తన కుమారుడు వెంకటేశ్ హీరోగా హిందీలోనూ (తెలుగు చంటి రీమేక్ ‘అనారీ’, ‘తఖ్‌దీర్‌వాలా’) సినిమాలు నిర్మించారు. రూపాయి నోటు మీద ఉన్న భాషలన్నిటిలో సినిమాలు తీయాలన్న లక్ష్యాన్ని చేరుకొని... దక్షిణాది, ఉత్తరాది భాషలతో కలిపి మొత్తం 13 భాషల్లో దాదాపు 150 సినిమాలు నిర్మించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కారు. అలాగే జాతీయ అవార్డు అందుకొనే చిత్రాలు తీయాలనే సంకల్పంతో తెలుగులో ‘హరివిల్లు’ (2003), బెంగాలీలో రితుపర్ణ ఘోష్‌తో ‘అసుఖ్’ (1999) చిత్రాల లాంటి ప్రయత్నాలు చేశారు. పెట్టుబడి పోయినా ‘అసుఖ్’ సినిమాతో జాతీయ అవార్డు సాధించారు.
 
మల్టీస్టారర్లతో సంచలనం

ఆ రోజుల్లో ప్రసిద్ధ నవలల ఆధారంగా చిత్రాలు తీసి ‘నవలా చిత్రాల’ నిర్మాతగా కూడా రామానాయుడు పేరు తెచ్చుకున్నారు. ‘ప్రేమ్‌నగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’, ‘సెక్రటరీ’ లాంటివి అందుకు ఉదాహరణ. అప్పటి తెలుగు తెర అగ్రహీరోలైన కృష్ణ-శోభన్‌బాబుతో ‘ముందడుగు’, ‘మండే గుండెలు’ లాంటి మల్టీస్టారర్లు నిర్మించి సంచలనం రేపారు. కమలహాసన్‌తో ‘ఇంద్రుడు-చంద్రుడు’, వెంకటేశ్‌తో ‘బొబ్బిలిరాజా’, హరీశ్-మాలాశ్రీతో ‘ప్రేమఖైదీ’, అంధబాలిక జీవితం ఆధారంగా హీరోయిన్ లయ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ‘ప్రేమించు’ లాంటివి విశేష ఆదరణ పొందాయి.
 

 
అవార్డులు.. రివార్డులు

రామానాయుడు 1996లో తిరుపతి వెంకటేశ్వర వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 1998లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, 1999 గిన్నిస్ బుక్‌లో పేరు నమోదైంది. దాదాసాహెబ్ ఫాల్కే (2009), పద్మభూషణ్ (2013) అవార్డ్‌లు అందుకున్నారు.
 
నిష్కల్మష వ్యక్తిత్వం

తండ్రి వ్యవసాయం, పెదనాన్న వ్యాపార దక్షత రెండింటినీ రామానాయుడు పుణికిపుచ్చుకున్నారు. వ్యవసాయం, సిని మాలు ఇలా ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానం అందుకోవడమే లక్ష్యంగా కృషి చేసేవారు. రామానాయుడు స్థాపించిన సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఇటీవలే ఐదు దశాబ్దాలు (1964 - 2014) పూర్తయ్యాయి. పల్లెటూరి మూలాలున్న ఆయనలో చివరి క్షణం వరకు ఆ పల్లెటూరి భోళాతనం, నిష్కల్మష హృదయం తొణికిసలాడేవి. పేరు ప్రతిష్ఠలు, కోట్ల సం పాదనతో ఎంత ఎత్తుకు ఎదిగినా... దాన్ని తలకెక్కించుకోకుండా, కాళ్ళు నేల మీద పెట్టుకొని నడవడం ఆయనకే సొంతం.
 
సమాజ సేవలోనూ పెద్ద చెయ్యే..

సినిమా పరిశ్రమలోని వ్యక్తులకుకానీ, వ్యవస్థకు కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సహాయం, సేవ, సాంత్వనతో ముందుండడం రామానాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. 1991లోనే తన పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. 1997లో వృద్ధాశ్రమం నెలకొల్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు.
 
ఒంటికి పడని రాజకీయాలు..

జీవితంలో తనకు నచ్చనివి ‘అబద్ధాలు ఆడడం, రాజకీయాలు’ అని తరచూ చెప్పే రామానాయుడు... ఒక దశలో మిత్రుల బలవంతం మీద రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. అయితే రాజకీయ వాతావరణం ఒంటబట్టని ఆయన ఒక పర్యాయమే ఎంపీగా పరిమితమయ్యారు. రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో సినిమా  వ్యాపారంలోనూ నష్టాలు చవిచూసినట్లు ఆయన స్వయంగా చెబుతుండేవారు.

ఆ కోరిక తీరనే లేదు

సినిమాకు దర్శకత్వం వహించడం, కుటుంబంలోని హీరోలైన వెంకటేశ్, రానా, నాగచైతన్యలతో కలసి తాను కూడా నటించే ఓ చిత్రం నిర్మించడం రామానాయుడు కోరికలు. కానీ అవి తీరకుండానే ఆయన కన్నుమూశారు.
.........................................................
జీవనతరంగాలు..
పూర్తి పేరు: దగ్గుబాటి రామానాయుడు
తల్లితండ్రులు: దగ్గుబాటి వెంకటేశ్వర్లు,లక్ష్మీదేవమ్మ
పుట్టినతేదీ - 1936 జూన్ 6
స్వస్థలం - ప్రకాశం జిల్లా కారంచేడు
సతీమణి - రాజేశ్వరి
సంతానం - సురేశ్‌బాబు, వెంకటేశ్, లక్ష్మి
తొలి చిత్రం - భాగస్వాములతో కలసి తీసిన ‘అనురాగం’ (1963)
సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించింది - 1963లో
సురేశ్ పతాకంపై తొలి చిత్రం - ఎన్టీఆర్‌తో ‘రాముడు భీముడు’ (1964)
నిర్మించిన చిత్రాల సంఖ్య -దాదాపు 150 (తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడం, ఒరియా, అస్సామీ, మలయాళం, పంజాబీ, భోజ్‌పురి, ఇంగ్లీషు భాషా చిత్రాలతో కలిపి). రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీశారు.
కుమారుడు వెంకటేశ్‌ను హీరోను చేసింది ‘కలియుగ పాండవులు’ చిత్రంతో..
1989లో రామానాయుడు స్టూడియోను స్థాపించారు.
1991లో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
నానక్‌రామ్‌గూడలో ‘రామానాయుడు సినీ విలేజ్’ ఏర్పాటు - 1994
‘శాంతినికేతన్’ సీరియల్‌తో 1999లో టీవీ రంగంలోకి అడుగిడారు.
బాపట్ల నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక - 1999

వెంకన్నపైనే నమ్మకం..
మెడలో వెంకటేశ్వరస్వామి లాకెట్ ధరించడం, రాహుకాలంలో కీలకమైన పనులేవీ చేయకపోవడం రామానాయుడు అలవాటు.
 
ఈ సినిమాలే..
ఆయన ఉన్నతికి కారణమైన సినిమాలు.. ఎన్టీఆర్‌తో ‘రాముడు - భీముడు’, అక్కినేనితో ‘ప్రేమ్‌నగర్’ వీటితోనే రికార్డులు సృష్టించారు.

వినయమే విజయ రహస్యం..

వైఫల్యం ఎదురైతే ధైర్యంగా ఉండాలని,  విజయం వస్తే మరింతగా ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.  
 
ఏ రంగంలో ఉన్నా నంబర్‌వన్‌గా నిలవడం రామానాయుడు లక్ష్యం.

...............................................................
నేడు తెలుగు చిత్రపరిశ్రమ, థియేటర్ల బంద్

రామానాయుడు మృతికి సంతాపంగా గురువారం తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు. సినిమాల షూటింగ్‌లతోపాటు అన్ని విభాగాలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు కూడా గురువారం మూసి ఉంచనున్నట్లు దాసరి నారాయణ రావు తెలిపారు.
..............................................

..:: రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 19th Feb 2014, Thursday)
....................................

మూవీ మొఘల్ ఇకలేరు

  • ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు కన్నుమూత
  •  కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి
  •  సందర్శనార్థం నేడు ఉదయం 9 నుంచి రామానాయుడు స్టూడియోలో పార్థివ దేహం... మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడే అంత్యక్రియలు
  •  నివాళులు అర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
  •  సంతాపంగా నేడు సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేత
  •  13 భాషల్లో 150 చిత్రాలకుపైగా నిర్మాణం... గిన్నిస్‌కు ఎక్కిన అజాత శత్రువు
  •  సినీ రంగంలో కృషికి దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ భూషణ్ పురస్కారాలు


సాక్షి, హైదరాబాద్: మూవీ మొఘల్.. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (78) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఆయన స్వగృహంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా రామానాయుడు కేన్సర్‌తో బాధపడుతున్నారు. దాదాపు పదమూడేళ్ల కిందే అమెరికాలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ కేన్సర్ మళ్లీ ముదరడంతో ఇటీవల బెంగళూర్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో... ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న రామానాయుడును ప్రత్యేక వాహనంలో ఫిలింనగర్ వెంచర్-2లోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఇంటికి చేరిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూశారు. రామానాయుడు కన్నుమూసిన విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ, అభిమానులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుని, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్, టి.సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ, రాజశేఖర్, అల్లు అర్జున్, జగపతిబాబు, ఆర్.నారాయణమూర్తి తదితరులు విచ్చేసి రామానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోకు తరలించనున్నట్లు ఆయన కుమారుడు, సినీ హీరో వెంకటేష్ తెలిపారు. స్ట్టూడియో ఆవరణలోనే మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రామానాయుడు మృతికి సంతాపంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని షూటింగ్‌లతో పాటు థియేటర్లు సెలవు పాటించనున్నట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పారు.
 
(Published in 'Sakshi' daily, 19th Feb 2014, Thursday)
..............................

Tuesday, February 17, 2015

ఎప్పటికీ ఎగిరే సంగీత పతాకం రజనీకాంతరావు (by పన్నాల సుబ్రహ్మణ్య భట్టు)

- పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ప్రముఖ సంగీత, సాహిత్య, కళా విమర్శకులు


ఎప్పటికీ ఎగిరే సంగీత పతాకం

దక్షిణదేశ సంగీతాకాశంలో రజనీకాంతరావు గారు ఒక విశిష్టమైన పతాకం ప్రతిష్ఠించారు. అది అలా ఎగురుతూ ఉండటాన్ని తానే స్వయంగా చూడగల్గిన అదృష్టవంతులు. తనే ఇప్పటికీ తన పాటలూ, చరణాలూ, ఒక్కొక్కసారి పూర్తి పాఠం సంగీతపు వరుసలతో సహా పాడటం ఈ వంద సంవత్సరాల వేడుకల సమయంలో ఆయనను దర్శించేవారికి ఒక విందు.

డెబ్బయ్ ఏళ్ళ ఆధునిక కవులు, 80 ఏళ్ళ అమెరికా తల్లులు వచ్చి ఆయన పాటలు ఆయన దగ్గరే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే, ఆయన కూడా గొంతు కలపడం వచ్చిన వారికి ఎంతో ఆత్మీయమైన అనుభూతినిస్తుంది. పదేళ్ళ క్రితం వరకూ ఆయన దగ్గరకు వచ్చిన మిత్రులు గంటల తరబడి ఆయన పాటలు ఆయన చేత పాడించుకొని కదలలేక, కదలలేక వెళ్ళేవారు. ఆయనను గంభీరమైన ప్రశ్నలతోటి,చిలిపి ప్రశ్నలతోటి విసిగించే నాలాటి వాళ్ళ సంగతి సరేసరి. ‘‘ఆ ‘విశ్వయానం’లో చివరన ‘మార్వా’ రాగంలో ఓలేటి చేత పాడించేందుకూ, అంత గొప్పగా వచ్చిన జంత్రగాత్ర వాద్యమేళనానికీ సరిపోయిందా? ‘మార్వా’ రాగం ఎందుకూ’’ అంటే, ‘‘ఎందుకుండరాదు? వై నాట్’’అని సమాధానం ఇచ్చారు. ఇంకొకసారి నేను ‘మీరు సినిమా పరిశ్రమను వదిలేయడం మీకు వ్యక్తిగతంగా నష్టం కలిగించినదండీ!’’ అన్నాను. ‘‘ఇలా మిగిలేవాణ్ణి కాదులే! దుర్గాబాయి గారు కూడా అనేది’’ అని నవ్వుతూ తేల్చేవారు.
 ప్రముఖ దర్శక - నిర్మాత బి.యన్. రెడ్డిగారు తమ రికార్డింగ్ స్టూడియోను కట్టించిన కొత్తలో ఈయను తీసుకెళ్ళి ‘ఇదిగో స్టూడియో’ అన్నారట! కానీ ఆయన తర్వాత సినీమాకు ఆయనను సంగీతం సమకూర్చమనలేదు. ‘‘బాధపడ్డారా?’’ అన్నాను. ‘‘లేదు. సాలూరి రాజేశ్వరరావు నా కంటే సీనియర్. బాగా చేశాడు’’ అన్నారు. జీవితంలో అంతటి కపటం లేనితనం, తనకు సంక్రమించిన దాని పట్ల తృప్తి, వివాదాలకు దూరంగా ఉండడం - ఆయన సహజ గుణాలు.

ఒక పెద్ద కవి గారికి కోపం వచ్చింది. ఆ కోపానికి ఈయన కారణం కాదు. కానీ ఈయనే అని ఆ కవి గారి చెవిలో ఒక ఆప్తుడు ఊదాడు. ఈయన మేలు కోరే పెద్దమనిషి పెద్ద కవి గారికి రజని గార్ని క్షమాపణ చెప్పి సర్దుకోమన్నాడు. ఈయన క్షమాపణ చెప్పలేదు. మేలుకోరిన పెద్దమనిషి మీద కోపం తెచ్చుకోలేదు. ఇది చెప్పి నాకు హితవు చెప్పారు - ‘‘నువ్వు చేయనిదానికి కూడా నీ మీద నిందలు వేస్తారు. తెలుసుకో’’ అని! పిఠాపురంలో తండ్రిగారి నుండి వచ్చిన ఇల్లు అవసరం లేకపోయినా అమ్మివేశారు. ఆయనకి ఇష్టం లేదు. భార్య సుభద్రమ్మ గారికీ ఇష్టం లేదు. ‘‘ఏమిటండీ! అమ్మడం ఎందుకండీ’’ అంటే ప్రాప్తం ఉండాలి కదా అని ‘లైటు’ తీసుకున్నారు.
 చాలామందికి తెలుసు ఆయన జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రవీణులని. నేను తేలికగా ‘‘ఎన్ని చెప్పండి... మీ పిల్లల్ని మీ స్థాయిలో చదివించలేదండి. మీరు అప్పుడే వాల్తేరులో ఆనర్సు చదివినవారు. ఏమిటిది?’’ - అంటూ చనువు తీసుకుని ఒకసారి నిరాశ వ్యక్తం చేశాను. ‘‘ఏం? చీకూచింతా లేని ఆరోగ్యమైన జీవితం సాగిస్తారు. అంతకంటే కావాల్సింది ఏమిటి?’’ అని సమాధానమిచ్చారు.
  ఎంతటి సాధారణమైన అసాధారణ జీవితం ఆయన గడిపారో చెప్పే ప్రయత్నంలో అందరికీ తెలిసిన ఆయన సంగీతమయ ప్రపంచం గురించి వివరించలేదు. ఆయన సంగీత పతాకం రచించిన దశాబ్దాలు దర్శించలేదు.

ఆయన ఒక చిత్రమైన స్వయంభువు. ఎవరిదీ - చివరికి తండ్రి గారిది కూడా ప్రభావం పడకుండా దారి ఎంచుకున్న కాల్పనిక ఉద్యమకాల రచయిత. ఆయన పాటల్లో ఎవరి ప్రభావం లేకుండా, ఆ కాలంలో 1940-’90ల మధ్య వ్రాయడం దాదాపు అసాధ్యం. ఆఖరికి రవీంద్రుడి ప్రభావం కూడా లేదు. ఊహల ఆంతర్య కల్పనల విస్తృతీ పరిమితమైన కాలంలో కూడా, సుదూర తీరాలకు మీ మనసును తీసుకుపోయే భావాలతో పాటలు రాశారు. ఆ పాటలకు సంగీతం సమకూర్చారు. ఏవో వరుసలు కట్టడం కాదు, ఆయన సంగీతంలో ఉన్నది. సంగీత కల్పనలో కూడా లోతైన, మనసైన, సొగసైన, ఆశ్చర్యం కల్గించే పోకడలు నిలుపుకోగల పద, భావ, ఆలోచనా శక్తిని నింపారు. ఆ పతాకం అవిశ్రాంతంగా ఎగరడానికి, రెపరెపలాడుతూ ‘ఆచంద్రార్కమూ’ ఉండడానికి ఆయనే పాడగలిగారు. ఆయన పాటలో పాఠం- పల్లవి,అనుపల్లవుల బంధాల నుండి ముక్తి పొంది అనిర్వచనీయమైన ఏదో ఆధారంతో, మాంసంతో, ఆభరణాలతో, తేజంతో దర్శనమిస్తూనే ఉంటుంది. ఎక్కడో వెండి తీగలా ఒకొక్కసారి పాట అంతా పదసిద్ధ సంభారాలో, ‘చరణ’ మంజీరాలో, నిష్ర్కమణ గీత శకలాలో వేరే లోకాల్లోకి మిమ్మల్ని లాక్కుపోతాయి. స్మృతిగీతాలైనా, సంవాద గీతాలైనా చివరికి దేశభక్తి గీతాలయినా - ఆ అలంకార శయ్య పరిమళ ద్రవ్యంగా మత్తు కలిగిస్తుంది. ఇక ఆ సంగీతపు పూత వెనుకనున్న రసాయన మేళనం ఎవరికి వారు పరిశోధించుకోవలసినదే. లేకపోతే బాలమురళి నుండి సూరిబాబు దాకా ఆయన సంగీత కూర్పుకి ఎందుకు పరవశులవుతారు? పాటలకు ఆయన సమకూర్చిన ఆరంభ వాద్యగోష్ఠి నుండి చరణాంతర సంగీత తీర్మానాలకు, నాటకీయ పరికల్పనలకు ముగ్ధులు కానివారు లేరు.

రవీంద్రుని గీతాలకు తెలుగు అనువాదం, సంగీతం రజని సమకూర్చినట్లు పట్టుగా ఏ ఇతర భారతీయ భాషలలోనూ వచ్చి ఉండవు. అందుకే కేంద్ర సంగీత అకాడెమీ తరఫున రవీంద్రుడి 150వ జయంతికి పురస్కారం లభించింది. అలాటి పాటల బెంగాలీ సంగీతమూ, చిక్కటి అనువాదమూ ఒక్కరే సమకూర్చే అవకాశం ఇతర భాషారచయితలకు ఉండదు కదూ! ‘‘చిత్తమెచట భయశూన్యమో... గృహప్రాచీరము తన ప్రాంగణ తలమును దివారాత్ర మృత్తికాధూళిలో క్షుద్ర ఖండములు చేయదో’’ అంటూ రవీంద్రుడి సంగీత వరుస కట్టడం - మామూలు వారికి సాధ్యం కాని పని.

మరో అసాధ్యమైనదీ ఎవరూ చేయలేనిదీ ఒకటి ఉంది. రామాయణ అవతరణ గాథను వాద్యగోష్ఠిలో ‘ఆదికావ్యావతరణం’ అని వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతోటి ఆరంభించి ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. అలాగే శివుడి కోపంతో మన్మథుడు దహనం కావటం - ‘కామదహనం’గా స్వరపరిచారు.

గొంతుకలు లేని, కేవలం వాద్యగోష్ఠిలో సాగే విషయాత్మక సంగీత రచనలకు దారుఢ్యాన్నీ, పుష్టినీ, విషయనిష్ఠనీ సమకూర్చిన భారతీయ వాద్యబృంద సంగీత రచయితలలో రజని ఒకరు. ఎక్కువ సంఖ్యలో ఈ గోష్ఠులు నిర్వహించే అవకాశం ఆయనకు రాలేదు కానీ, రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, ఈమని శంకరశాస్త్రి, అనిల్ బిస్వాస్‌ల సరసన ఆయనది గౌరవనీయమైన స్థానం. కీర్తనలు పాడుకుంటూ అదే కర్ణాటక సంగీత, హిందూస్థానీ సంగీత పారమ్యం అని భావించే శ్రోతల సముద్రంలో ఈ ఆర్కెస్ట్రా అనే విషయాత్మక సంగీత కల్పనాపటిమ మరుగున పడిపోయింది. నాలుగు దశాబ్దాలుగా 1940ల నుంచి ’80ల దాకా సాగిన వాద్యగోష్ఠి కల్పనలలో రజని గారిది ప్రత్యేక పీఠం. రాగం తెచ్చే లయాత్మక సమ్యగ్‌దృష్టికి, ఆ రాగ స్వరాల జాడలు విసిరే లోచూపులకు ఆయన సంగీత రచనలు బంగారం గీటు చూపుతాయి. భారతీయ సంగీత పరిణామ చరిత్రను వీక్షించడంలోనూ, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలోని ధాన్యరాశులను ఎగురవేయడంలోనూ, లలిత సంగీత నిర్మాణ ఫలకాలను స్థాపించడంలోనూ ఏడు దశాబ్దాల విరామమెరుగని సేవ ఆయనది. అందుకే ఆయనకంత పేరు. అందుకే ఆయన వేరుదారులు ఈ నేలలో బలంగా పాదుకొన్నాయి. పూర్ణ జీవితంలో సంపూర్ణ తృప్తితో జీవిస్తూ ఉండడం ఆయనకే పట్టిన అదృష్టం.

http://img.sakshi.net/images/cms/2015-01/81422469119_Unknown.jpg







(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
...........................

కవే గాయకుడవడం అదృష్టం - వింజమూరి అనసూయ

- వింజమూరి అనసూయ, సుప్రసిద్ధ జానపద సంగీత గాయని

కవే గాయకుడవడం అదృష్టం

ఎనభై నాలుగేళ్ల స్నేహం రజనీ అన్నయ్యతో! నాకంటే ఒక ఏడాది పెద్దవాడనుకుంటాను. బాలాంత్రపు వారి కుటుంబం అంతా నాకు ఆప్తులే. వెంకట్రావు బాబయ్యగారు, పార్వతీశం మామయ్యగారు (వేంకట పార్వతీశ కవులు) నాకు సన్నిహితులు. బాలాంత్రపు నళినీ అన్నయ్య మా అందరికీ పెద్దన్నయ్య. నాగరాజు బావ, చెల్లాయి, సుభద్ర, శశాంక అందరూ నాకు కావలసిన వాళ్లే.
 పిఠాపురం నాకెందుకిష్టం అంటే, ఊరంతా నా వాళ్లే. దివాను గారి బంగళాల కెదురుగా ఉండే సందులో మొదటింట్లో (రంగనాయకులు గారిల్లు) మామయ్య కృష్ణశాస్త్రి ఉండేవాడు. సందు తిరగగానే మెయిన్ రోడ్డు మీద ఎడం పక్క మొదటిల్లు వెంకట్రావు బాబయ్యగారిది. దానికెదురుగా అవతల పక్కనున్న ఇల్లు పార్వతీశం మామయ్య గారిది. ఎడం పక్క వీరిళ్లయితే, కుడి పక్కన రంగనాయకులు లైబ్రరీ. నా చిన్నతనంలో వేంకట పార్వతీశ కవుల బెంగాలీ అనువాద నవలలు అన్నీ అక్కడే చదివాను.

నా చిన్నతనం సగం కాకినాడలోనూ, సగం పిఠాపురంలోనూ గడిచింది. మామయ్యకు చాలాకాలం పిల్లలు లేరు. నేను మామయ్య గారాల చిన్నతల్లిని (నన్నలాగే పిలిచేవాడు). శనివారాలు, ఆది వారాలు వచ్చాయంటే కాకినాడ నుంచి నన్ను పిఠాపురం తీసుకొచ్చేవాడు. తర్వాత రజనీ అన్నయ్యా వాళ్లు కూడా కాకినాడకు మకాం మర్చారు. అప్పుడు తరచూ కలుసుకునేవాళ్లం. అప్పటికే నేను పెట్టిన ట్యూన్స్‌లో లలిత సంగీత కచేరీలు చేస్తున్నాను. రజనీ అన్నయ్య తను రాసిన ట్యూన్స్ పెట్టిన ‘చండీదాస్’ పాటలు వినిపించడానికి వచ్చేవారు.

అప్పటి మా నాన్నగారి పద్ధతి ప్రకారం, రాత్రి 9 అయితే పిల్లలు చదువు ఆపి, దీపాలార్పి పడుకోవలసిందే. అప్పటికి మామయ్య కుటుంబం కూడా పిఠాపురం నుంచి మా ఇంటికి వచ్చేశారు. హాల్లో ముసలాళ్లూ, పిల్లలం పడుకునేవాళ్లం. రజనీ అన్నయ్య ఆ టైమ్‌కి వచ్చేవాడు తీరుబడిగా. ‘‘ప్రభ గారూ!’’ అని అన్నయ్యను పిలిచేవాడు. తలుపు తీసినా, లైట్ వేసినా పెద్దవాళ్లు దెబ్బలాడతారు. అందుచేత అన్నయ్యా, నేనూ కిటికీ దగ్గరే కూర్చునే వాళ్లం. కిటికీ అవతల ప్రక్క నిలబడి, చిన్న గొంతుతో తన పాటలు పాడి వినిపించేవాడు. ఇందులో ‘రామి’ (హీరోయిన్) కేరక్టరు పాటలు అనసూయ పాడాలని నిర్ణయంచుకుని రాసి, ట్యూన్ పెట్టాననే వాడు. నేనా రోజుల్లో మామయ్య రాసిన ‘వసంతోత్సవం’ సంగీత నాటికకు ట్యూన్స్ పెడుతున్నాను.

 మొదటిసారి ‘వసంతోత్సవం’ మద్రాసు రేడియోలో ప్రసారమైనప్పుడు, మామయ్య కుటుంబం, మా కుటుంబం, ప్రయాగ నరసింహశాస్త్రి, రజనీ అన్నయ్య, గాడేపల్లి సుందరమ్మ - అందరం పెళ్లివారు లాగ కాకినాడ నుంచి మద్రాసుకు వెళ్లాం. అప్పుడు రజనీ అన్నయ్య ‘వసంతుడు’, ప్రయాగ నరసింహశాస్త్రి అన్నయ్య ‘మలయ మారుతం’, గాడేపల్లి సుందరమ్మ ‘వేణువు’, నా చెల్లెలు వింజమూరి సీత - ‘కోయిల’, నేను - ‘తుమ్మెద’, బాలమ్మ, సుగంధి - ‘పువ్వులు’గా పాడాం.

ఈనాటి వాగ్గేయ కారులలో రజనీ అన్నయ్య ఒకడు. కవే గాయకుడవడం ఎంతో అదృష్టం. తన భావాలకు తగిన సంగీతం కూర్చవచ్చు. త్యాగరాజు అందుచేతే అంత గొప్ప గాయకుడు కూడా అయ్యాడేమో! బాలాంత్రపు రజనీకాంతరావు కవి, గాయకుడు కూడాను. అనేకమైన లలిత సంగీతం ప్రోగ్రాములు, రేడియో ప్రోగ్రాములూ నేను రజనీ అన్నయ్యా కలిసి పాడినవి ఉన్నాయి. మేము పరస్పర అభిమాన సంఘాల వాళ్లం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మేము సమకాలికులం, సమ భావికులం, సమ గాయకులం.


http://img.sakshi.net/images/cms/2015-01/51422468435_Unknown.jpg





..................................

Saturday, February 14, 2015

దయాగాడి దండయాత్ర! (సినిమా రివ్యూ: టెంపర్)

దయాగాడి దండయాత్ర!

..............................................
చిత్రం - టెంపర్, తారాగణం - జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణమురళి, ప్రకాశ్‌రాజ్, కథ - వక్కంతం వంశీ, సంగీతం - అనూప్ రూబెన్స్, పాటలు - విశ్వ, కందికొండ, భాస్కరభట్ల, కళ - బ్రహ్మ కడలి, కెమేరా - శామ్ కె. నాయుడు, నేపథ్య సంగీతం - మణిశర్మ, యాక్షన్ - విజయ్, ఎడిటింగ్ - ఎస్.ఆర్. శేఖర్, నిర్మాత - బండ్ల గణేశ్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం - పూరీ జగన్నాథ్
............................................
నీతి నిజాయతీలకు మారుపేరైన సిన్సియర్ పోలీసాఫీసర్ల కథలు తీయడం ఒకప్పటి బాక్సాఫీస్ ఫార్ములా. అవి ‘కొండవీటి సింహం’ నాటి రోజులు. అవినీతిపరుడైన పోలీసు అధికారి... దానికి ఓ రీజనింగ్... అనుకోకుండా జీవితంలో ఊహించనిది ఎదురుకావడం... అక్కడ నుంచి మారిన మనిషిగా న్యాయం పక్షం నిలవడం... ఇదీ ఇవాళ్టి సినిమా బాక్సాఫీస్ ఫార్ములా. పదేళ్లక్రితమే వచ్చిన తమిళ ‘సామి’ (తెలుగులో బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహా’కు మాతృక), హిందీ ‘దబంగ్’ (తెలుగులో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’కు మాతృక), ఇటీవలి రవితేజ ‘పవర్’, మొన్ననే వచ్చిన కల్యాణరామ్ ‘పటాస్’ దాకా అన్నీ ఇలాంటి కథలే. సరిగ్గా పూరి జగన్నాథ్, చిన్న ఎన్టీఆర్‌లను కథకుడు వక్కంతం వంశీ ఒప్పించి, ‘టెంపర్’గా తీయించింది కూడా ఇలాంటి కథే. కాకపోతే, దానికి పూరి స్టైల్ కథాకథనం, చిన్న ఎన్టీఆర్ మార్కు ధాటి డైలాగులు అదనపు హంగులు. ఆ కథేమిటో... ‘టెంపర్’ లూజ్ కాకుండా తెలుసుకుందాం.

కథేమిటంటే...
అనాథగా పెరిగిన దయ (జూనియర్ ఎన్టీఆర్)కు చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని కోరిక. పోలీసైతే తప్పు చేసినవాళ్ళందరి నుంచి డబ్బులు దండుకుంటూ హాయిగా జీవితం గడిపేయవచ్చని అతని ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్లే డిగ్రీ కొనుక్కొని మరీ ఎస్.ఐ అవుతాడు దయ. చెప్పినమాట వింటూ, తన వ్యాపారాలకు అడ్డు రాని పోలీసు కావాలంటూ విశాఖలోని స్మగ్లింగ్ లీడర్ ‘వాల్తేర్’ వాసు (ప్రకాశ్‌రాజ్), తన మిత్రుడైన మంత్రి గారి (జయప్రకాశ్‌రెడ్డి) సాయం తీసుకుంటాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న దయను విశాఖకు రప్పిస్తాడు మంత్రి. తెలివిగా అవినీతి చేస్తూ, వాల్తేర్ వాసుకు మిత్రుడిగా మెలుగుతుంటాడు ఎస్.ఐ. దయ. పోలీస్ స్టేషన్‌లోని నారాయణమూర్తి (పోసాని కృష్ణమురళి) లాంటి వాళ్ళు వ్యతిరేకించినా, పట్టించుకోడు. సాక్షాత్తూ విలన్ తమ్ముళ్ళను నలుగురినీ వదిలేస్తాడు. ‘పెట్ క్రాస్’ను నడుపుతున్న యానిమల్ లవర్ శాన్వి (కాజల్ అగర్వాల్) ప్రేమలో పడతాడు. విలన్లు వెంటపడి, చంపాలని చూస్తున్న ఒక అమ్మాయిని తన ప్రేమికురాలి కోరిక మేరకు హీరో రక్షిస్తాడు. పెద్ద విలన్‌తోనే తగాదా పడతాడు. ఆ అమ్మాయి ఎవరన్న సస్పెన్స్ దగ్గర ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్‌లో ఆ అమ్మాయి కథ బయటకొస్తుంది. న్యూయార్క్‌లో పనిచేస్తున్న ఆ అమ్మాయి తన తల్లి (పవిత్రా లోకేశ్)తో కలసి చెల్లి కోసం వెతుకుతుంటుంది. తల్లేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ, ఆ అమ్మాయిని విలన్ తమ్ముళ్ళు చెరబట్టి, 40 రోజుల పాటు బంధించి, లైంగిక దాడులకు దిగి, అదంతా తమకు తామే వీడియోలో చిత్రీకరిస్తారు. చివరకు ఆమెను చంపేస్తారు. చనిపోయే ముందు చెల్లెలు చేసిన ఫోన్‌కాల్‌తో ఆ వీడియో సీడీని దక్కించుకుంటుంది అక్క. తన చెల్లికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ ఆ అక్క చేసిన వేడుకోలుతో హీరోలో మథనం మొదలవుతుంది. ఆ తరువాత విలన్ గ్యాంగ్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఆ సీడీ ఏమైంది? చివరకు ఏం జరిగిందన్నది మిగతా సినిమా.

ఎలా చేశారంటే...
‘‘పేరు ‘దయ’. నాకు లేనిదే ‘దయ’ ’’ అనే ఎస్.ఐ. పాత్రలో చిన్న ఎన్టీఆర్ చలాకీగా ఉన్నారు. యువ హీరోల్లో తనకు మాత్రమే పరిమితమైన స్పష్టమైన వాచకంతో పేరాల కొద్దీ డైలాగులు ఉఫ్‌మని ఊదేశారు. కాజల్ అగర్వాల్ పాటలకు పరిమితమైన పాత్ర. ప్రకాశ్‌రాజ్‌కు ఇలాంటి విలన్ పాత్రలు కొత్తేమీ కాదు. అయితే, ఈ పాత్ర బేలగా హీరోకు లొంగిపోవడం మినహా చేసిందేమీ లేకపోవడంతో హీరో వర్సెస్ విలన్ అనే బలమైన పోరాటం లేకుండా పోయింది. అలీ, సప్తగిరి రెండు సీన్ల కామెడీకి పరిమితమయ్యారు. ఇక, సినిమాలో ఒక సన్నివేశంలో బైక్ నడుపుతూ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక డైలాగ్ వేషంలో కనిపించారు. ఇక, సీనియర్ నటి రమాప్రభ హీరోయిన్‌కు అమ్మమ్మగా అంధురాలి పాత్రలో మెరిశారు.

పాటలు పదే పదే వినాలనిపించేలా లేకపోవడం అనూప్ సంగీతంలోని లోపం. మరో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్ దృశ్యాలు సగటు తెలుగు సినిమాలో లాగానే ‘హీరోచితం’గా ఉన్నాయి. కెమేరా వర్క్ బాగుంది. చిన్న ఎన్టీఆర్‌కు నందమూరి వంశాభిమానుల ఆశీస్సుల కోసం తాత పెద్ద ఎన్టీఆర్ (‘కొండవీటి సింహం’), తండ్రి హరికృష్ణ (‘సీతయ్య’), బాబాయ్ బాలకృష్ణ (‘రౌడీ ఇన్‌స్పెక్టర్’)ల సినిమాల్లోని దృశ్యాలు సినిమా మొదలైన కాసేపటికే తెర మీదకొస్తాయి. ఇక, సెకండాఫ్‌లో ‘నీ తాత టెంపర్... నీ అబ్బ టెంపర్...’ అంటూ ఏకంగా ఒక బృందగీతం కూడా పెట్టారు.

ఎలా ఉందంటే...
సముద్రపుటొడ్డున రక్తం ఓడుతూ పడి ఉన్న కథానాయకుడు దయ (జూనియర్ ఎన్టీఆర్) నేపథ్యంలో నుంచి తన జరిగిన కథను చెబుతుండగా సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ కొంత విసుగనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ, గమనం క్రమంగా చిక్కబడతాయి. హీరో మారే ఘట్టం, కోర్టులో సీన్, ఊహకందని యాంటీ క్లైమాక్స్ లాంటి వాటితో సినిమా ముగింపు ముందు ఒక అరగంట పట్టుగా సాగుతుంది.

రివెంజ్ ఫార్ములాతో, వినోదం తక్కువ పాళ్ళున్న ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లూ ఉన్నాయి, ఎడిటింగ్ కత్తెరకు కొంత పదును పెట్టి, స్క్రిప్టు మీద మరింత నియంత్రణతో వ్యవహరిస్తే బాగుండేది. ‘నే పనికి మాలిన వెధవను... హే భగవాన్...’ పాట లాంటివి కథనానికి అడ్డుపడ్డాయి. చెల్లి కోసం ఒక పక్క తల్లి పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతున్నా, అక్క మాత్రం చెల్లికి జరిగిన అన్యాయాన్నీ, ఆమె బలైపోయిన విధానాన్నీ తల్లికి చెప్పలేదనుకోవాలేమో! హీరోయిన్ కోరిక మేరకు ఆ అమ్మాయిని కాపాడాలని రంగంలోకి దిగిన హీరో మొదటెక్కడా మారినట్లు కనిపించడు. తీరా అమెరికా విమానం ఎక్కబోతూ ఆ అమ్మాయి వచ్చి అన్న మాటలతో మారినట్లు క్రమంగా చూపించారు. అది కొంత మేరకు అర్థం చేసుకోదగినదే. అయితే, తీరా క్లైమాక్స్‌లో జైలులో జరిగే సంఘటనలు, మరో గంటలో ఉరి వ్యవహారమంతా అయిపోతుందనగా న్యూయార్క్ నుంచి లైవ్ టెలికాస్ట్‌లు వగైరా లాజిక్‌కూ, సహజత్వానికీ దూరంగా ఉన్నాయనిపిస్తాయి. కాకపోతే, సినిమా అనుకొని సరిపెట్టుకోవడం మినహా ఏమీ చేయలేం.

ఫస్టాఫ్ చూశాక పెదవి విరిచిన ప్రేక్షకుడు సెకండాఫ్‌లో హీరోలోని మార్పు సీన్, ఊహకందని చివరి కోర్టు సీన్ లాంటివి చూసి కొంత మేరకు పాజిటివ్ టాక్‌లోకి మారతాడు. ఒక పాటలో సిక్స్ ప్యాక్‌తో, కొన్నిచోట్ల బొద్దుగా సన్నివేశానికో రకంగా కనిపించిన చిన్న ఎన్టీఆర్‌లో ఉత్సాహం, ఊపు మాత్రం తగ్గలేదని పాటలు, డ్యాన్స్‌లు చెప్పకనే చెబుతాయి. అప్పుడెప్పుడో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘రాఖీ’ని గుర్తుచేస్తూ, ఈసారి పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’లో హాస్యం, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు లేకపోవడం ఇబ్బందికరం. అయితే, దాదాపు ఏకపాత్రాభినయం లాగా చిన్న ఎన్టీఆర్ గబగబా మాట్లాడేస్తూ, గట్టిగా చెప్పే డైలాగులు సగటు జనం మాటెలా ఉన్నా అభిమానులకు నచ్చవచ్చు.

మొత్తం మీద, చాలాకాలంగా సరైన హిట్ కోసం తపిస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో చిన్న ఎన్టీఆర్‌లు కసితో చేసిన చిత్రంగా ‘టెంపర్’ మిగులుతుంది. అమ్మాయిలను ‘అది’, ‘ఇది’ అంటూ సంబోధించినా, ‘ఫ్లూటిస్ట్’..., ‘కుక్కల క్రాసింగ్’ లాంటి డైలాగులున్నా... (చాలా డైలాగులు సెన్సార్ కట్ అయ్యాయి) చివరాఖరుకు ఈ సినిమా నిర్భయ కేసు లాంటి వాటి నేపథ్యం, మహిళలపై హింసకు వ్యతిరేకత లాంటి సామాజిక అంశాలపై తీసిన చిత్రంగా చలామణీ అవుతుంది. అయితే, ఒకటే షరతు... సగటు తెలుగు సినిమాలు చూడడం అందరికీ అలవాటే కాబట్టి, అతిగా ఊహించుకొని ఈ సినిమాకు వెళ్ళి, ‘టెంపర్’ లూజ్ అయితే, దానికి హీరో, దర్శక, నిర్మాతల బాధ్యతేమీ లేదు. పూరి మార్కు డైలాగుల ఒరవడిలోనే చెప్పాలంటే....  (ఈ) ‘సినిమా ఎవణ్ణీ వదిలిపెట్టదు. అన్ని సరదాలూ తీర్చేస్తది!’

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' internet, 13th Feb 2015, Friday)
...........................

Friday, February 13, 2015

రజనీగంధం - నండూరి పార్థసారథి

రజనీగంధం
కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంతరావు గారు కళారంగంలో ఏ ప్రక్రియను స్పృశించినా దాని పారం (అంతు) చూడకుండా వదలరు. భారతీయ సంగీతం గురించి, ముఖ్యంగా కర్ణాటక సంగీతం గురించి, మరీ ముఖ్యంగా ఆంధ్ర వాగ్గేయకారుల గురించి ఆయన చేసినంతటి లోతైన పరిశోధన మరెవ్వరూ చేయలేదు. ఆయన రచించిన ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ ఇప్పటికీ అత్యంత ప్రామాణికమైనది.
 ఇక సృజనాత్మక సంగీతంలో రజని గారు స్పృశించని బాణీ లేదేమోననిపిస్తుంది. రవీంద్ర సంగీతం, బెంగాలీ కీర్తన్, బావుల్ గీతాల ఫణితులు, మరాఠీ భావగీత్, పర్షియన్, అరేబియన్ ఫణితులు, శ్పానిష్ జానపద (ఫ్లెమెంకో) ఫణితులు - అన్నీ ఆయన సంగీతంలోకి చొరబడ్డాయి. వాటిని ఆయన సందర్భ ఔచిత్యంతోనే ఉపయోగించుకున్నారు. లలిత సంగీతమైనా, సినిమా సంగీతమైనా, యక్షగానాల శాస్త్రీయ సంగీతమైనా ఆయన సంగీత రచనలన్నింటిలోనూ ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుగులో ‘లలిత సంగీతం’ అంటున్నదానికి ఆయనే వైతాళికుడు. సుమారుగా 1940 ప్రాంతం నుండి 1990 దాకా ఒక అర్ధశతాబ్ది కాలంలో ఆయన రచించి, స్వరపరచిన గీతాలన్నీ అజరామరాలే. అవన్నీ తర్వాతి తరాల లలిత సంగీత స్రష్టలను అంతో ఇంతో ప్రభావితం చేసినవే.
 వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు రజనీకాంతరావు గారు. 1920 జనవరి 29న నిడదవోలులో ఆయన జన్మించారు.

1941 ఫిబ్రవరిలో - 21 సంవత్సరాల వయస్సులో రజని గారి మొదటి రేడియో సంగీత నాటకం ‘చండీదాసు’ ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయింది. అప్పటి నుండే ఆయన కళాజీవితం ప్రారంభమయింది. 1941 నుంచే రజనిగారు - తన పేరు ప్రకటించుకొనే అవకాశం లేకపోయినా  అడపా తడపా సినిమా సంగీతం కూడా చేస్తూ వచ్చారు. అలా నిడుమోలు జగన్నాథ్  దర్శకత్వం వహించిన ‘తారుమారు - భలేపెళ్ళి’ అనే జంట హాస్యచిత్రాలకు రజనిగారు పాటలు రాశారు. వీటి స్వరాలూ ఆయనవే. అప్పటికే (1942) ఆయన రేడియో ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో ఉన్నవారు ఇతర సంస్థలకు పని చేయరాదనే నిబంధన ఉండేది. రేడియో అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకొని, అనుమతి సంపాదించుకోగలిగితేనే సినిమాలకు పని చేయవచ్చు. కాని, ఆ పని అంత తేలిక కాదు.

సినిమాల కోసం ఆయన రాసిన పాటలు, వాటి స్వరరచనలు రాశిలో కాకపోయినా వాసిలో గొప్పవే. అన్నీ కాకపోయినా వాటిలో కొన్నైనా ఇప్పటికీ దొరుకుతాయి. గ్రామఫోన్ రికార్డుల ద్వారా వెలువడిన 1940 దశకంనాటి ప్రైవేటు పాటలు - రాజేశ్వరరావు, బాలసరస్వతి, భానుమతి, సూర్యకుమారి, వరలక్ష్మి పాడినవి - కూడా చాలా వరకు దొరుకుతాయి. కాని, రేడియో కోసం చేసిన సంగీతం చాలావరకు చెరిగిపోయినట్లే! దొరికినంత మటుకైనా రజనిగారి సంగీతాన్ని మళ్ళీ సీడీల మీదకు తెచ్చి సంగీత ప్రియులకు అందించడం అవసరం.

నండూరి పార్థసారథి
(ఈ వ్యాసకర్త  సీనియర్ జర్నలిస్టు, సంగీత విమర్శకుడు)

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
......................................