జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, February 17, 2015

ఎప్పటికీ ఎగిరే సంగీత పతాకం రజనీకాంతరావు (by పన్నాల సుబ్రహ్మణ్య భట్టు)

- పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ప్రముఖ సంగీత, సాహిత్య, కళా విమర్శకులు


ఎప్పటికీ ఎగిరే సంగీత పతాకం

దక్షిణదేశ సంగీతాకాశంలో రజనీకాంతరావు గారు ఒక విశిష్టమైన పతాకం ప్రతిష్ఠించారు. అది అలా ఎగురుతూ ఉండటాన్ని తానే స్వయంగా చూడగల్గిన అదృష్టవంతులు. తనే ఇప్పటికీ తన పాటలూ, చరణాలూ, ఒక్కొక్కసారి పూర్తి పాఠం సంగీతపు వరుసలతో సహా పాడటం ఈ వంద సంవత్సరాల వేడుకల సమయంలో ఆయనను దర్శించేవారికి ఒక విందు.

డెబ్బయ్ ఏళ్ళ ఆధునిక కవులు, 80 ఏళ్ళ అమెరికా తల్లులు వచ్చి ఆయన పాటలు ఆయన దగ్గరే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే, ఆయన కూడా గొంతు కలపడం వచ్చిన వారికి ఎంతో ఆత్మీయమైన అనుభూతినిస్తుంది. పదేళ్ళ క్రితం వరకూ ఆయన దగ్గరకు వచ్చిన మిత్రులు గంటల తరబడి ఆయన పాటలు ఆయన చేత పాడించుకొని కదలలేక, కదలలేక వెళ్ళేవారు. ఆయనను గంభీరమైన ప్రశ్నలతోటి,చిలిపి ప్రశ్నలతోటి విసిగించే నాలాటి వాళ్ళ సంగతి సరేసరి. ‘‘ఆ ‘విశ్వయానం’లో చివరన ‘మార్వా’ రాగంలో ఓలేటి చేత పాడించేందుకూ, అంత గొప్పగా వచ్చిన జంత్రగాత్ర వాద్యమేళనానికీ సరిపోయిందా? ‘మార్వా’ రాగం ఎందుకూ’’ అంటే, ‘‘ఎందుకుండరాదు? వై నాట్’’అని సమాధానం ఇచ్చారు. ఇంకొకసారి నేను ‘మీరు సినిమా పరిశ్రమను వదిలేయడం మీకు వ్యక్తిగతంగా నష్టం కలిగించినదండీ!’’ అన్నాను. ‘‘ఇలా మిగిలేవాణ్ణి కాదులే! దుర్గాబాయి గారు కూడా అనేది’’ అని నవ్వుతూ తేల్చేవారు.
 ప్రముఖ దర్శక - నిర్మాత బి.యన్. రెడ్డిగారు తమ రికార్డింగ్ స్టూడియోను కట్టించిన కొత్తలో ఈయను తీసుకెళ్ళి ‘ఇదిగో స్టూడియో’ అన్నారట! కానీ ఆయన తర్వాత సినీమాకు ఆయనను సంగీతం సమకూర్చమనలేదు. ‘‘బాధపడ్డారా?’’ అన్నాను. ‘‘లేదు. సాలూరి రాజేశ్వరరావు నా కంటే సీనియర్. బాగా చేశాడు’’ అన్నారు. జీవితంలో అంతటి కపటం లేనితనం, తనకు సంక్రమించిన దాని పట్ల తృప్తి, వివాదాలకు దూరంగా ఉండడం - ఆయన సహజ గుణాలు.

ఒక పెద్ద కవి గారికి కోపం వచ్చింది. ఆ కోపానికి ఈయన కారణం కాదు. కానీ ఈయనే అని ఆ కవి గారి చెవిలో ఒక ఆప్తుడు ఊదాడు. ఈయన మేలు కోరే పెద్దమనిషి పెద్ద కవి గారికి రజని గార్ని క్షమాపణ చెప్పి సర్దుకోమన్నాడు. ఈయన క్షమాపణ చెప్పలేదు. మేలుకోరిన పెద్దమనిషి మీద కోపం తెచ్చుకోలేదు. ఇది చెప్పి నాకు హితవు చెప్పారు - ‘‘నువ్వు చేయనిదానికి కూడా నీ మీద నిందలు వేస్తారు. తెలుసుకో’’ అని! పిఠాపురంలో తండ్రిగారి నుండి వచ్చిన ఇల్లు అవసరం లేకపోయినా అమ్మివేశారు. ఆయనకి ఇష్టం లేదు. భార్య సుభద్రమ్మ గారికీ ఇష్టం లేదు. ‘‘ఏమిటండీ! అమ్మడం ఎందుకండీ’’ అంటే ప్రాప్తం ఉండాలి కదా అని ‘లైటు’ తీసుకున్నారు.
 చాలామందికి తెలుసు ఆయన జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రవీణులని. నేను తేలికగా ‘‘ఎన్ని చెప్పండి... మీ పిల్లల్ని మీ స్థాయిలో చదివించలేదండి. మీరు అప్పుడే వాల్తేరులో ఆనర్సు చదివినవారు. ఏమిటిది?’’ - అంటూ చనువు తీసుకుని ఒకసారి నిరాశ వ్యక్తం చేశాను. ‘‘ఏం? చీకూచింతా లేని ఆరోగ్యమైన జీవితం సాగిస్తారు. అంతకంటే కావాల్సింది ఏమిటి?’’ అని సమాధానమిచ్చారు.
  ఎంతటి సాధారణమైన అసాధారణ జీవితం ఆయన గడిపారో చెప్పే ప్రయత్నంలో అందరికీ తెలిసిన ఆయన సంగీతమయ ప్రపంచం గురించి వివరించలేదు. ఆయన సంగీత పతాకం రచించిన దశాబ్దాలు దర్శించలేదు.

ఆయన ఒక చిత్రమైన స్వయంభువు. ఎవరిదీ - చివరికి తండ్రి గారిది కూడా ప్రభావం పడకుండా దారి ఎంచుకున్న కాల్పనిక ఉద్యమకాల రచయిత. ఆయన పాటల్లో ఎవరి ప్రభావం లేకుండా, ఆ కాలంలో 1940-’90ల మధ్య వ్రాయడం దాదాపు అసాధ్యం. ఆఖరికి రవీంద్రుడి ప్రభావం కూడా లేదు. ఊహల ఆంతర్య కల్పనల విస్తృతీ పరిమితమైన కాలంలో కూడా, సుదూర తీరాలకు మీ మనసును తీసుకుపోయే భావాలతో పాటలు రాశారు. ఆ పాటలకు సంగీతం సమకూర్చారు. ఏవో వరుసలు కట్టడం కాదు, ఆయన సంగీతంలో ఉన్నది. సంగీత కల్పనలో కూడా లోతైన, మనసైన, సొగసైన, ఆశ్చర్యం కల్గించే పోకడలు నిలుపుకోగల పద, భావ, ఆలోచనా శక్తిని నింపారు. ఆ పతాకం అవిశ్రాంతంగా ఎగరడానికి, రెపరెపలాడుతూ ‘ఆచంద్రార్కమూ’ ఉండడానికి ఆయనే పాడగలిగారు. ఆయన పాటలో పాఠం- పల్లవి,అనుపల్లవుల బంధాల నుండి ముక్తి పొంది అనిర్వచనీయమైన ఏదో ఆధారంతో, మాంసంతో, ఆభరణాలతో, తేజంతో దర్శనమిస్తూనే ఉంటుంది. ఎక్కడో వెండి తీగలా ఒకొక్కసారి పాట అంతా పదసిద్ధ సంభారాలో, ‘చరణ’ మంజీరాలో, నిష్ర్కమణ గీత శకలాలో వేరే లోకాల్లోకి మిమ్మల్ని లాక్కుపోతాయి. స్మృతిగీతాలైనా, సంవాద గీతాలైనా చివరికి దేశభక్తి గీతాలయినా - ఆ అలంకార శయ్య పరిమళ ద్రవ్యంగా మత్తు కలిగిస్తుంది. ఇక ఆ సంగీతపు పూత వెనుకనున్న రసాయన మేళనం ఎవరికి వారు పరిశోధించుకోవలసినదే. లేకపోతే బాలమురళి నుండి సూరిబాబు దాకా ఆయన సంగీత కూర్పుకి ఎందుకు పరవశులవుతారు? పాటలకు ఆయన సమకూర్చిన ఆరంభ వాద్యగోష్ఠి నుండి చరణాంతర సంగీత తీర్మానాలకు, నాటకీయ పరికల్పనలకు ముగ్ధులు కానివారు లేరు.

రవీంద్రుని గీతాలకు తెలుగు అనువాదం, సంగీతం రజని సమకూర్చినట్లు పట్టుగా ఏ ఇతర భారతీయ భాషలలోనూ వచ్చి ఉండవు. అందుకే కేంద్ర సంగీత అకాడెమీ తరఫున రవీంద్రుడి 150వ జయంతికి పురస్కారం లభించింది. అలాటి పాటల బెంగాలీ సంగీతమూ, చిక్కటి అనువాదమూ ఒక్కరే సమకూర్చే అవకాశం ఇతర భాషారచయితలకు ఉండదు కదూ! ‘‘చిత్తమెచట భయశూన్యమో... గృహప్రాచీరము తన ప్రాంగణ తలమును దివారాత్ర మృత్తికాధూళిలో క్షుద్ర ఖండములు చేయదో’’ అంటూ రవీంద్రుడి సంగీత వరుస కట్టడం - మామూలు వారికి సాధ్యం కాని పని.

మరో అసాధ్యమైనదీ ఎవరూ చేయలేనిదీ ఒకటి ఉంది. రామాయణ అవతరణ గాథను వాద్యగోష్ఠిలో ‘ఆదికావ్యావతరణం’ అని వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతోటి ఆరంభించి ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. అలాగే శివుడి కోపంతో మన్మథుడు దహనం కావటం - ‘కామదహనం’గా స్వరపరిచారు.

గొంతుకలు లేని, కేవలం వాద్యగోష్ఠిలో సాగే విషయాత్మక సంగీత రచనలకు దారుఢ్యాన్నీ, పుష్టినీ, విషయనిష్ఠనీ సమకూర్చిన భారతీయ వాద్యబృంద సంగీత రచయితలలో రజని ఒకరు. ఎక్కువ సంఖ్యలో ఈ గోష్ఠులు నిర్వహించే అవకాశం ఆయనకు రాలేదు కానీ, రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, ఈమని శంకరశాస్త్రి, అనిల్ బిస్వాస్‌ల సరసన ఆయనది గౌరవనీయమైన స్థానం. కీర్తనలు పాడుకుంటూ అదే కర్ణాటక సంగీత, హిందూస్థానీ సంగీత పారమ్యం అని భావించే శ్రోతల సముద్రంలో ఈ ఆర్కెస్ట్రా అనే విషయాత్మక సంగీత కల్పనాపటిమ మరుగున పడిపోయింది. నాలుగు దశాబ్దాలుగా 1940ల నుంచి ’80ల దాకా సాగిన వాద్యగోష్ఠి కల్పనలలో రజని గారిది ప్రత్యేక పీఠం. రాగం తెచ్చే లయాత్మక సమ్యగ్‌దృష్టికి, ఆ రాగ స్వరాల జాడలు విసిరే లోచూపులకు ఆయన సంగీత రచనలు బంగారం గీటు చూపుతాయి. భారతీయ సంగీత పరిణామ చరిత్రను వీక్షించడంలోనూ, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలోని ధాన్యరాశులను ఎగురవేయడంలోనూ, లలిత సంగీత నిర్మాణ ఫలకాలను స్థాపించడంలోనూ ఏడు దశాబ్దాల విరామమెరుగని సేవ ఆయనది. అందుకే ఆయనకంత పేరు. అందుకే ఆయన వేరుదారులు ఈ నేలలో బలంగా పాదుకొన్నాయి. పూర్ణ జీవితంలో సంపూర్ణ తృప్తితో జీవిస్తూ ఉండడం ఆయనకే పట్టిన అదృష్టం.

http://img.sakshi.net/images/cms/2015-01/81422469119_Unknown.jpg







(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
...........................

0 వ్యాఖ్యలు: