జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, February 3, 2015

సౌండ్ తక్కువైనా... పేలిన ‘పటాస్’ (సినిమా రివ్యూ ‘పటాస్’)

సౌండ్ తక్కువైనా... పేలిన ‘పటాస్’
సినిమా రివ్యూ - పటాస్

చిత్రం - పటాస్, తారాగణం - కల్యాణరామ్, శ్రుతీసోధీ, సాయికుమార్, సంగీతం - సాయి కార్తీక్, కెమేరా - సర్వేష్ మురారి, కళ- ఎన్. కిరణ్‌కుమార్, ఫైట్స్- వెంకట్, కూర్పు - తమ్మిరాజు, నిర్మాత - కల్యాణరామ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - అనిల్ రావిపూడి


చాలా రోజులుగా సరైన విజయం కోసం తపిస్తున్న నటుడు, నిర్మాత నందమూరి కల్యాణరామ్. ‘ఓం - 3డి’ లాంటి చిత్రాలతో ఆర్థికంగానూ నష్టపడ్డ ఈ యువ కథానాయకుడు ఈసారి పక్కా పోలీస్ స్టోరీ ద్వారా పూర్తి మాస్ మసాలా చిత్రం అందించేందుకు చేసిన ప్రయత్నం - ‘పటాస్’. నిజానికి, కొత్త ఏడాది మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రమిది. వ్యక్తిగత, వ్యాపార కారణాల రీత్యా ఎట్టకేలకు ఈ వారం విడుదలైంది. మరి, ఆలస్యంగా ఒత్తి వెలిగిన ఈ ‘పటాస్’ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు పేలింది?

కథ ఏమిటంటే...
హైదరాబాద్‌లో రౌడీయిజాన్నీ, రాజకీయాన్నీ కలగలిపి పదిహేనేళ్ళ పైగా చక్రం తిప్పుతున్న వ్యక్తి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు జి.కె. (ఆశుతోష్ రాణా). అతను తన రాజకీయ వారసుడిగా తమ్ముడు నానిని తీసుకురావాలని భావిస్తుంటాడు. ఊళ్లో వాళ్లు చేసే అక్రమాలు, అన్యాయాలను నిజాయతీపరుడైన డి.జి.పి. మురళీకృష్ణ (సాయికుమార్) కూడా అడ్డుకోలేకపోతుంటాడు. ఆ సమయంలో ఝార్ఖండ్‌లో ఒక రాజకీయ నాయకుణ్ణి తీవ్రవాదుల బారి నుంచి కాపాడి, అందుకు ప్రతిగా ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ కావాలని పట్టుబట్టి హైదరాబాద్‌కు వస్తాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ.సి.పి) కల్యాణ్ (కల్యాణరామ్). తీరా ఈ పోలీసాఫీసర్ ఆ రౌడీల మీద కాకుండా, సదరు డి.జి.పి. మీద కక్షతో, పగ తీర్చుకొనే విధంగా ప్రవర్తిస్తుంటాడు. అవినీతికీ అండగా నిలుస్తుంటాడు. ఎందుకలా చేస్తున్నాడన్నది కాసేపు సస్పెన్స్.

అలాగని హీరో మరీ చెడ్డవాడేమీ కాదు. అనుకోకుండా పరిచయమైన ఒక మూగ, చెవుడు అమ్మాయి కావ్యను సొంత చెల్లెలిలాగా ఆదరిస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక యువతిని జి.కె. తమ్ముడు నాని, బృందం దారుణంగా హత్య చేస్తుంది. ఆ హంతకులకు కూడా హీరో అండగా నిలవబోతే, తీరా ఆ చనిపోయింది - కావ్యేననీ, దుండగుల అత్యాచారం నుంచి ఒక సాఫ్ట్‌వేర్ యువతిని కాపాడబోయి చివరకు తాను బలైందనీ తెలుస్తుంది. అప్పుడు డి.జి.పి. చేసిన హితబోధతో హీరో మారతాడు. నిజాయతీగా ఆ కేసులో నిందితులను బోనెక్కించడానికి ప్రయత్నిస్తాడు.
మరి, ఇంతకీ డి.జి.పీ.కీ, హీరోకూ మధ్య అనుబంధం ఏమిటి? ఆయనపై హీరోకు ఎందుకంత కోపం అనేది సినిమా మధ్యలో ఒక ఫ్లాష్‌బ్యాక్. మబ్బులు విడిపోయి, హీరో కూడా మంచి వైపు నిలబడి పోరాటానికి సిద్ధపడ్డాక, విలన్ ముఠాను ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు, చివరకు వారందరినీ ఎలా శిక్షించాడన్నది మిగతా సినిమా.

 ఎలా చేశారంటే...
ఒక పూర్తి మాస్ పోలీసాఫీసర్‌గా కల్యాణరామ్ తన పరిధుల మేరకు బాగానే చేశారు. ఆటపాటల్లోనూ తన సత్తా చూపే ప్రయత్నం చేశారు. ఇక, హీరోయిన్ వెంటపడి ప్రేమించే జర్నలిస్ట్‌గా శ్రుతీ సోధీ ఫరవాలేదు. మరికొంత అభినయం, అందం ఉన్న హీరోయినైతే సినిమాకు కలిసొచ్చేదేమో అని ప్రేక్షకులకు అనిపిస్తే తప్పు పట్టలేం. హీరో చిన్నప్పుడే ద్వేషించిన తండ్రి పాత్ర - సాయికుమార్‌ది. వయసుతో పాటు వచ్చిపడుతున్న శారీరక మార్పులను మినహాయిస్తే, హావభావాల్లో, డైలాగ్ డెలివరీలో సాయికుమార్ తన మార్కు నటన చూపారు. పాత్ర, పాత్రచిత్రణలు పాతవే అయినా, విలన్‌గా ఆశుతోష్ రాణా వెరైటీగా అనిపిస్తారు. తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన కేంద్ర మంత్రి జె.పి. రెడ్డిగా జయప్రకాశ్‌రెడ్డి కనిపించేది కాసేపే అయినా నవ్విస్తారు.

సాయి కార్తీక్ సంగీతం ఓ.కె. సెట్టింగులు, గ్రాఫిక్స్ విషయంలో బడ్జెట్ పరిమితులు కనిపిస్తున్నా, ఉన్నంతలో తెరపై నిండుగా చూపడానికి ఛాయాగ్రాహకుడు సర్వేష్ మురారి బాగానే శ్రమించారు. ఎడిటింగ్, ఫైట్స్ వగైరాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.

ఎలా ఉందంటే...
నిజానికి, రెండు గంటల 20 నిమిషాల పైచిలుకు ఈ సినిమా కథ మరీ కొత్తదేమీ కాదు. ఒకప్పుడు పూర్తి నిజాయతీపరులైన పోలీసుల కథలు చూశాం. ఇటీవలి కాలంలో అవినీతికి అండగా నిలిచి, ఆఖరుకు నీతి కోసం పోరాడిన మంచి మనిషిగా మారే ‘బ్యాడ్ కాప్’ స్టోరీలు తరచూ వస్తున్నాయి. తమిళంలో విక్రమ్ నటించిన ‘సామి’, తెలుగులో దానికి రీమేక్‌గా బాలకృష్ణ చేసిన ‘లక్ష్మీ నరసింహ’ - ఇలా గడచిన 2000 - 2010 దశాబ్దిలోనే ఇలాంటి కథలు వచ్చాయి. వాటికి కొనసాగింపుగానా అన్నట్లు హిందీలో సల్మాన్‌ఖాన్ ‘దబంగ్’, దానికి తెలుగు అనుసరణగా పవన్‌కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’లూ చూసి ఆదరించాం. ఆ తానులోని ముక్కగా వచ్చిన కథ - ఈ ‘పటాస్’.
ప్రథమార్ధానికే ప్రధాన భాగం కథంతా అవుతుంది. కథ ఫస్టాఫ్ ముగిసేసరికే అర్థమవుతుంది కాబట్టి, ఇక మిగిలిందల్లా ఆ లక్ష్యాన్ని హీరో ఎలా సాధించాడన్నదే! అందుకే, ద్వితీయార్ధమల్లా విలన్ - హీరోల మధ్య పోరాటం... ఎవరికి వారు తమది పైచేయి అని నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నాలు. మధ్య మధ్యలో డ్యాన్సులు, పాటలు వచ్చిపోతుంటాయి. ఇక, సినిమాలో లోపాలూ ఉన్నాయి. లాజిక్‌లకు అందని విషయాలూ అనేకం. తన మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొడుకు గురించి డి.జి.పి. ఎక్కడా పట్టించుకున్నట్లు కనపడదు. అలాగే, చేతికి రాఖీ కట్టిన చెల్లెలు కాని చెల్లెలు కావ్య దారుణంగా హత్యకు గురైతే, ఇంత పెద్ద ఏ.సి.పి. అయిన హీరోకు అదెందుకు తెలీదని మనం అడక్కూడదు.

అయితే, ఇన్ని లోపాల మధ్య కూడా చకచకా సాగే స్క్రీన్‌ప్లేతో, కాలం గడిచిపోతుంటుంది. కామెడీ కూడా అందుకు దోహదమైంది. ‘108’ వాహనం లాగా, హీరో తనను ఎదిరించిన వారి కోసం పెట్టిన ‘801’ - దేహశుద్ధి వాహనం, దానికి ‘పార్థాయ ప్రతిబోధితామ్...’ అంటూ ఘంటసాల గొంతులోని భగవద్గీత శ్లోకం నేపథ్య సంగీతం హాలులో బాగానే నవ్విస్తాయి. శ్రీనివాసరెడ్డి కామెడీ కూడా. ఇక,  బాలకృష్ణ హిట్ సినిమా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’లోని భువనచంద్ర రచన ‘అరె వో సాంబా...’ పాటను రీమిక్స్ చేయడం నందమూరి అభిమానులకు నచ్చే విషయం.
సరిగ్గా ఎమ్మెస్ నారాయణ చనిపోయిన శుక్రవారం ఉదయమే విడుదలైన ఈ సినిమాలో సినిమా పిచ్చోడైన ఎన్.ఆర్.ఐ.గా, తానే దర్శక, నిర్మాత, హీరో సినిమాలు తీసుకొనే ‘సునామీ స్టార్ సుభాష్’గా ఎమ్మెస్ రకరకాల గెటప్పుల్లో కనిపిస్తారు. కాసేపు నవ్విస్తారు. రచయితగా మొదలైన అనిల్ రావిపూడికి దర్శకుడిగా ఇది తొలి ప్రయత్నం. ఆ పరిమితులను అర్థం చేసుకొని అభినందించవచ్చు. భవిష్యత్ ప్రయత్నాల్లో మరింత బిగువుగా ఉండేలా కథను అల్లుకొని, కథనాన్ని చూసుకోవాలని ఆశించవచ్చు. మొత్తం మీద, కాలక్షేప వినోదం, మాస్‌కు నచ్చే విలన్ వర్సెస్ హీరో పోలీసు కథ, పరిశ్రమలో... ప్రేక్షకుల్లో... కల్యాణరామ్ మంచితనం పట్ల నెలకొన్న సానుభూతి, సానుకూలత లాంటివన్నీ ఈ ‘పటాస్’కు కలిసొచ్చే అంశాలు. ఆ మేరకు పాజిటివ్ టాక్‌తో శబ్దం తక్కువైనా, బాక్సాఫీస్ వద్ద సేఫ్ బెట్‌గా ‘పటాస్’ పేలిందని అనుకోవచ్చు.

 - రెంటాల జయదేవ  (Published in 'Sakshi' Web edition, 25th Jan 2015, Sunday)
..........................................

0 వ్యాఖ్యలు: