జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, February 14, 2015

దయాగాడి దండయాత్ర! (సినిమా రివ్యూ: టెంపర్)

దయాగాడి దండయాత్ర!

..............................................
చిత్రం - టెంపర్, తారాగణం - జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణమురళి, ప్రకాశ్‌రాజ్, కథ - వక్కంతం వంశీ, సంగీతం - అనూప్ రూబెన్స్, పాటలు - విశ్వ, కందికొండ, భాస్కరభట్ల, కళ - బ్రహ్మ కడలి, కెమేరా - శామ్ కె. నాయుడు, నేపథ్య సంగీతం - మణిశర్మ, యాక్షన్ - విజయ్, ఎడిటింగ్ - ఎస్.ఆర్. శేఖర్, నిర్మాత - బండ్ల గణేశ్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం - పూరీ జగన్నాథ్
............................................
నీతి నిజాయతీలకు మారుపేరైన సిన్సియర్ పోలీసాఫీసర్ల కథలు తీయడం ఒకప్పటి బాక్సాఫీస్ ఫార్ములా. అవి ‘కొండవీటి సింహం’ నాటి రోజులు. అవినీతిపరుడైన పోలీసు అధికారి... దానికి ఓ రీజనింగ్... అనుకోకుండా జీవితంలో ఊహించనిది ఎదురుకావడం... అక్కడ నుంచి మారిన మనిషిగా న్యాయం పక్షం నిలవడం... ఇదీ ఇవాళ్టి సినిమా బాక్సాఫీస్ ఫార్ములా. పదేళ్లక్రితమే వచ్చిన తమిళ ‘సామి’ (తెలుగులో బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహా’కు మాతృక), హిందీ ‘దబంగ్’ (తెలుగులో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’కు మాతృక), ఇటీవలి రవితేజ ‘పవర్’, మొన్ననే వచ్చిన కల్యాణరామ్ ‘పటాస్’ దాకా అన్నీ ఇలాంటి కథలే. సరిగ్గా పూరి జగన్నాథ్, చిన్న ఎన్టీఆర్‌లను కథకుడు వక్కంతం వంశీ ఒప్పించి, ‘టెంపర్’గా తీయించింది కూడా ఇలాంటి కథే. కాకపోతే, దానికి పూరి స్టైల్ కథాకథనం, చిన్న ఎన్టీఆర్ మార్కు ధాటి డైలాగులు అదనపు హంగులు. ఆ కథేమిటో... ‘టెంపర్’ లూజ్ కాకుండా తెలుసుకుందాం.

కథేమిటంటే...
అనాథగా పెరిగిన దయ (జూనియర్ ఎన్టీఆర్)కు చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని కోరిక. పోలీసైతే తప్పు చేసినవాళ్ళందరి నుంచి డబ్బులు దండుకుంటూ హాయిగా జీవితం గడిపేయవచ్చని అతని ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్లే డిగ్రీ కొనుక్కొని మరీ ఎస్.ఐ అవుతాడు దయ. చెప్పినమాట వింటూ, తన వ్యాపారాలకు అడ్డు రాని పోలీసు కావాలంటూ విశాఖలోని స్మగ్లింగ్ లీడర్ ‘వాల్తేర్’ వాసు (ప్రకాశ్‌రాజ్), తన మిత్రుడైన మంత్రి గారి (జయప్రకాశ్‌రెడ్డి) సాయం తీసుకుంటాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న దయను విశాఖకు రప్పిస్తాడు మంత్రి. తెలివిగా అవినీతి చేస్తూ, వాల్తేర్ వాసుకు మిత్రుడిగా మెలుగుతుంటాడు ఎస్.ఐ. దయ. పోలీస్ స్టేషన్‌లోని నారాయణమూర్తి (పోసాని కృష్ణమురళి) లాంటి వాళ్ళు వ్యతిరేకించినా, పట్టించుకోడు. సాక్షాత్తూ విలన్ తమ్ముళ్ళను నలుగురినీ వదిలేస్తాడు. ‘పెట్ క్రాస్’ను నడుపుతున్న యానిమల్ లవర్ శాన్వి (కాజల్ అగర్వాల్) ప్రేమలో పడతాడు. విలన్లు వెంటపడి, చంపాలని చూస్తున్న ఒక అమ్మాయిని తన ప్రేమికురాలి కోరిక మేరకు హీరో రక్షిస్తాడు. పెద్ద విలన్‌తోనే తగాదా పడతాడు. ఆ అమ్మాయి ఎవరన్న సస్పెన్స్ దగ్గర ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్‌లో ఆ అమ్మాయి కథ బయటకొస్తుంది. న్యూయార్క్‌లో పనిచేస్తున్న ఆ అమ్మాయి తన తల్లి (పవిత్రా లోకేశ్)తో కలసి చెల్లి కోసం వెతుకుతుంటుంది. తల్లేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ, ఆ అమ్మాయిని విలన్ తమ్ముళ్ళు చెరబట్టి, 40 రోజుల పాటు బంధించి, లైంగిక దాడులకు దిగి, అదంతా తమకు తామే వీడియోలో చిత్రీకరిస్తారు. చివరకు ఆమెను చంపేస్తారు. చనిపోయే ముందు చెల్లెలు చేసిన ఫోన్‌కాల్‌తో ఆ వీడియో సీడీని దక్కించుకుంటుంది అక్క. తన చెల్లికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ ఆ అక్క చేసిన వేడుకోలుతో హీరోలో మథనం మొదలవుతుంది. ఆ తరువాత విలన్ గ్యాంగ్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఆ సీడీ ఏమైంది? చివరకు ఏం జరిగిందన్నది మిగతా సినిమా.

ఎలా చేశారంటే...
‘‘పేరు ‘దయ’. నాకు లేనిదే ‘దయ’ ’’ అనే ఎస్.ఐ. పాత్రలో చిన్న ఎన్టీఆర్ చలాకీగా ఉన్నారు. యువ హీరోల్లో తనకు మాత్రమే పరిమితమైన స్పష్టమైన వాచకంతో పేరాల కొద్దీ డైలాగులు ఉఫ్‌మని ఊదేశారు. కాజల్ అగర్వాల్ పాటలకు పరిమితమైన పాత్ర. ప్రకాశ్‌రాజ్‌కు ఇలాంటి విలన్ పాత్రలు కొత్తేమీ కాదు. అయితే, ఈ పాత్ర బేలగా హీరోకు లొంగిపోవడం మినహా చేసిందేమీ లేకపోవడంతో హీరో వర్సెస్ విలన్ అనే బలమైన పోరాటం లేకుండా పోయింది. అలీ, సప్తగిరి రెండు సీన్ల కామెడీకి పరిమితమయ్యారు. ఇక, సినిమాలో ఒక సన్నివేశంలో బైక్ నడుపుతూ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక డైలాగ్ వేషంలో కనిపించారు. ఇక, సీనియర్ నటి రమాప్రభ హీరోయిన్‌కు అమ్మమ్మగా అంధురాలి పాత్రలో మెరిశారు.

పాటలు పదే పదే వినాలనిపించేలా లేకపోవడం అనూప్ సంగీతంలోని లోపం. మరో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్ దృశ్యాలు సగటు తెలుగు సినిమాలో లాగానే ‘హీరోచితం’గా ఉన్నాయి. కెమేరా వర్క్ బాగుంది. చిన్న ఎన్టీఆర్‌కు నందమూరి వంశాభిమానుల ఆశీస్సుల కోసం తాత పెద్ద ఎన్టీఆర్ (‘కొండవీటి సింహం’), తండ్రి హరికృష్ణ (‘సీతయ్య’), బాబాయ్ బాలకృష్ణ (‘రౌడీ ఇన్‌స్పెక్టర్’)ల సినిమాల్లోని దృశ్యాలు సినిమా మొదలైన కాసేపటికే తెర మీదకొస్తాయి. ఇక, సెకండాఫ్‌లో ‘నీ తాత టెంపర్... నీ అబ్బ టెంపర్...’ అంటూ ఏకంగా ఒక బృందగీతం కూడా పెట్టారు.

ఎలా ఉందంటే...
సముద్రపుటొడ్డున రక్తం ఓడుతూ పడి ఉన్న కథానాయకుడు దయ (జూనియర్ ఎన్టీఆర్) నేపథ్యంలో నుంచి తన జరిగిన కథను చెబుతుండగా సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ కొంత విసుగనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ, గమనం క్రమంగా చిక్కబడతాయి. హీరో మారే ఘట్టం, కోర్టులో సీన్, ఊహకందని యాంటీ క్లైమాక్స్ లాంటి వాటితో సినిమా ముగింపు ముందు ఒక అరగంట పట్టుగా సాగుతుంది.

రివెంజ్ ఫార్ములాతో, వినోదం తక్కువ పాళ్ళున్న ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లూ ఉన్నాయి, ఎడిటింగ్ కత్తెరకు కొంత పదును పెట్టి, స్క్రిప్టు మీద మరింత నియంత్రణతో వ్యవహరిస్తే బాగుండేది. ‘నే పనికి మాలిన వెధవను... హే భగవాన్...’ పాట లాంటివి కథనానికి అడ్డుపడ్డాయి. చెల్లి కోసం ఒక పక్క తల్లి పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతున్నా, అక్క మాత్రం చెల్లికి జరిగిన అన్యాయాన్నీ, ఆమె బలైపోయిన విధానాన్నీ తల్లికి చెప్పలేదనుకోవాలేమో! హీరోయిన్ కోరిక మేరకు ఆ అమ్మాయిని కాపాడాలని రంగంలోకి దిగిన హీరో మొదటెక్కడా మారినట్లు కనిపించడు. తీరా అమెరికా విమానం ఎక్కబోతూ ఆ అమ్మాయి వచ్చి అన్న మాటలతో మారినట్లు క్రమంగా చూపించారు. అది కొంత మేరకు అర్థం చేసుకోదగినదే. అయితే, తీరా క్లైమాక్స్‌లో జైలులో జరిగే సంఘటనలు, మరో గంటలో ఉరి వ్యవహారమంతా అయిపోతుందనగా న్యూయార్క్ నుంచి లైవ్ టెలికాస్ట్‌లు వగైరా లాజిక్‌కూ, సహజత్వానికీ దూరంగా ఉన్నాయనిపిస్తాయి. కాకపోతే, సినిమా అనుకొని సరిపెట్టుకోవడం మినహా ఏమీ చేయలేం.

ఫస్టాఫ్ చూశాక పెదవి విరిచిన ప్రేక్షకుడు సెకండాఫ్‌లో హీరోలోని మార్పు సీన్, ఊహకందని చివరి కోర్టు సీన్ లాంటివి చూసి కొంత మేరకు పాజిటివ్ టాక్‌లోకి మారతాడు. ఒక పాటలో సిక్స్ ప్యాక్‌తో, కొన్నిచోట్ల బొద్దుగా సన్నివేశానికో రకంగా కనిపించిన చిన్న ఎన్టీఆర్‌లో ఉత్సాహం, ఊపు మాత్రం తగ్గలేదని పాటలు, డ్యాన్స్‌లు చెప్పకనే చెబుతాయి. అప్పుడెప్పుడో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘రాఖీ’ని గుర్తుచేస్తూ, ఈసారి పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’లో హాస్యం, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు లేకపోవడం ఇబ్బందికరం. అయితే, దాదాపు ఏకపాత్రాభినయం లాగా చిన్న ఎన్టీఆర్ గబగబా మాట్లాడేస్తూ, గట్టిగా చెప్పే డైలాగులు సగటు జనం మాటెలా ఉన్నా అభిమానులకు నచ్చవచ్చు.

మొత్తం మీద, చాలాకాలంగా సరైన హిట్ కోసం తపిస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో చిన్న ఎన్టీఆర్‌లు కసితో చేసిన చిత్రంగా ‘టెంపర్’ మిగులుతుంది. అమ్మాయిలను ‘అది’, ‘ఇది’ అంటూ సంబోధించినా, ‘ఫ్లూటిస్ట్’..., ‘కుక్కల క్రాసింగ్’ లాంటి డైలాగులున్నా... (చాలా డైలాగులు సెన్సార్ కట్ అయ్యాయి) చివరాఖరుకు ఈ సినిమా నిర్భయ కేసు లాంటి వాటి నేపథ్యం, మహిళలపై హింసకు వ్యతిరేకత లాంటి సామాజిక అంశాలపై తీసిన చిత్రంగా చలామణీ అవుతుంది. అయితే, ఒకటే షరతు... సగటు తెలుగు సినిమాలు చూడడం అందరికీ అలవాటే కాబట్టి, అతిగా ఊహించుకొని ఈ సినిమాకు వెళ్ళి, ‘టెంపర్’ లూజ్ అయితే, దానికి హీరో, దర్శక, నిర్మాతల బాధ్యతేమీ లేదు. పూరి మార్కు డైలాగుల ఒరవడిలోనే చెప్పాలంటే....  (ఈ) ‘సినిమా ఎవణ్ణీ వదిలిపెట్టదు. అన్ని సరదాలూ తీర్చేస్తది!’

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' internet, 13th Feb 2015, Friday)
...........................

0 వ్యాఖ్యలు: