జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, February 19, 2015

కృషిని నమ్మిన... కూలీ నెం.1 - దగ్గుబాటి రామానాయుడు

నగర చిత్రపటంపై చెరగని ముద్ర

తళుకు బెళుకుల సినిమా రంగంలోకి ఎందరో వస్తుంటారు.. మరెందరో కనుమరుగైపోతుంటారు. కానీ అతి కొద్దిమందే ఆ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి, ఆఖరు క్షణం వరకు దాని బాగోగుల కోసం తపిస్తారు. అజాతశత్రువుగా, అందరికీ తలలో నాలుకగా పేరు తెచ్చుకుంటారు. సమకాలీన తెలుగు సినిమా రంగంలో ఆ గౌరవం దక్కించుకున్న వ్యక్తి... దగ్గుబాటి రామానాయుడు. సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయినీ తిరిగి సినిమా రంగానికే వెచ్చించిన కొద్దిమంది సిసలైన సినిమా వ్యక్తుల్లో రామానాయుడు ఒకరు. మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినా వ్యక్తిగత పరిశ్రమ, శ్రద్ధ, పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చనేదానికి ఆయనే ఉదాహరణ.

నిర్మాతగా, స్టూడియో అధినేతగా, సినీపంపిణీదారుగా, ప్రదర్శకుడిగా, సేవాకార్యక్రమ నిరతుడిగా, రాజకీయ నాయకుడిగా అనేక కోణాలున్న రామానాయుడు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. సినీ రంగానికి ఎంతో సేవ చేసిన ఆయన మృతి చెందడంతో.. సినీలోకం, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.  జీవిత గమనం తొలి నుంచీ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆయన పుట్టింది ప్రకాశం జిల్లా కారంచేడులో.. 1936 జూన్ 6న రైతు దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు.. నిండా మూడేళ్ళయినా రాకముందే కన్నతల్లిని కోల్పో యి, మారుటి తల్లి ప్రేమలో పెరిగారాయన. ఒంగోలులోని సమీప బంధువు డాక్టర్ బి.వి. ఎల్. సూర్యనారాయణ ఇంట్లో కొన్నాళ్లు ఉండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా చదువుకున్నారు. సూర్యనారాయణలా తానూ డాక్టర్ కావాలని రామానాయుడు అనుకున్నారు. కానీ విధి మరో రకంగా మలుపు తిప్పింది. మద్రాసులోని లయోలా కాలేజ్‌లో చేరినా.. చదువు అంతగా సాగలేదు. మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి తర్వాత సొంతంగా వ్యవసాయంలోకీ దిగారు. కారంచేడులో జరిగిన అక్కినేని ‘నమ్మినబంటు’ చిత్రం షూటింగ్‌తో తొలిసారిగా ఒక సీన్‌లో కనిపించి, వెండి తెరకెక్కారు.
 
చిత్ర నిర్మాణంలోకి...

వ్యవసాయం, రైస్‌మిల్లు వ్యాపారం తరువాత 1960లో మద్రాసుకు వెళ్లి, మిత్రులతో కలసి ఇటుకల వ్యాపారం చేయాలనుకున్నారు. అటు నుంచి రియల్ ఎస్టేట్ వైపు మారారు. మద్రాసులోని ‘ఆంధ్రా క్లబ్’లో సినిమావాళ్ళ పరిచయాలతో గుత్తా రామినీడు దర్శకత్వంలోని ‘అనురాగం’ చిత్రానికి భాగస్వామిగా చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. ఆ సినిమా నష్టాలు తెచ్చినా... ఆ చిత్ర నిర్మాణంలో ప్రతి విషయం దగ్గరుండి గమనించడం, తానూ స్వయంగా పనిచేయడం ఆయనకు మంచి అనుభవమైంది. ఆ తరువాత 1963లో సురేశ్ సంస్థను స్థాపించి, డి.వి.నరసరాజు స్క్రిప్టుతో ఎన్టీఆర్ హీరోగా ‘రాముడు - భీముడు’ (1964) చిత్రం ద్వారా సొంతంగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నిర్మాత నాగిరెడ్డి గారి ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘విజయా’తో కలసి ‘విజయ-సురేశ్ కంబైన్స్’ పతాకంపై కొన్ని చిత్రాలు తీశారు. కొన్ని విజయాల తరువాత పరాజయాలూ ఎదుర్కొన్నారు. అయితే ‘ప్రేమ్‌నగర్’ చిత్రం నుంచి మళ్ళీ పుంజుకున్న రామానాయుడు.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
 
నటనపై ఎంతో మక్కువ

తన ప్రస్థానంలో భాగంగా రామానాయుడు హైదరాబాద్‌లో సినీ స్టూడియోను నిర్మించారు. స్క్రిప్టుతో వచ్చి, సినిమా రీళ్ళతో బయటకు వెళ్ళేలా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని నానక్‌రామ్‌గూడలో ‘రామానాయుడు సినీ విలేజ్’నూ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోనూ స్టూడియో కట్టి, విస్తరించారు. ఇక చిత్ర నిర్మాతగా ఉంటూనే... తన నటనాభిరుచిని కొనసాగించారు. తాను నిర్మించిన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో పాత్రధారిగా చటుక్కున కనిపించి, మాయమయ్యేవారు. ‘తానా’ వారి కోసం ప్రత్యేకంగా 1993లో ‘ఆంధ్ర వైభవం’ పేరిట చారిత్రక చిత్రాన్ని నిర్మించి... అందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించి, తన మక్కువ తీర్చుకున్నారు. టీనేజర్ల ఆత్మహత్యలపై ఇతర నిర్మాతలు తీసిన జాతీయ అవార్డు చిత్రం ‘హోప్’(2006)లో సైతం కీలక పాత్ర పోషించారు.
 
రూపాయి నోటు మీద ఉన్న భాషలన్నింటా..

ప్రతిభావంతులైన హీరోయిన్లనూ, సంగీత, సినీ దర్శకులనూ పరిచయం చేసిన అరుదైన రికార్డు రామానాయుడుదే. తమిళంలో శివాజీ గణేశన్ (ప్రేమ్‌నగర్‌కు రీమేకైన ‘వసంత మాళిగై’) రజనీకాంత్ (తనికాట్టు రాజా) లాంటి వారితో, హిందీలో రాజేశ్‌ఖన్నా (ప్రేమ్‌నగర్), జితేంద్ర (తోఫా, మక్సద్), అనిల్‌కపూర్ (ఇన్‌సాఫ్ కీ ఆవాజ్) లాంటి హీరోలతో చిత్రాలు తీశారు. తన కుమారుడు వెంకటేశ్ హీరోగా హిందీలోనూ (తెలుగు చంటి రీమేక్ ‘అనారీ’, ‘తఖ్‌దీర్‌వాలా’) సినిమాలు నిర్మించారు. రూపాయి నోటు మీద ఉన్న భాషలన్నిటిలో సినిమాలు తీయాలన్న లక్ష్యాన్ని చేరుకొని... దక్షిణాది, ఉత్తరాది భాషలతో కలిపి మొత్తం 13 భాషల్లో దాదాపు 150 సినిమాలు నిర్మించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కారు. అలాగే జాతీయ అవార్డు అందుకొనే చిత్రాలు తీయాలనే సంకల్పంతో తెలుగులో ‘హరివిల్లు’ (2003), బెంగాలీలో రితుపర్ణ ఘోష్‌తో ‘అసుఖ్’ (1999) చిత్రాల లాంటి ప్రయత్నాలు చేశారు. పెట్టుబడి పోయినా ‘అసుఖ్’ సినిమాతో జాతీయ అవార్డు సాధించారు.
 
మల్టీస్టారర్లతో సంచలనం

ఆ రోజుల్లో ప్రసిద్ధ నవలల ఆధారంగా చిత్రాలు తీసి ‘నవలా చిత్రాల’ నిర్మాతగా కూడా రామానాయుడు పేరు తెచ్చుకున్నారు. ‘ప్రేమ్‌నగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’, ‘సెక్రటరీ’ లాంటివి అందుకు ఉదాహరణ. అప్పటి తెలుగు తెర అగ్రహీరోలైన కృష్ణ-శోభన్‌బాబుతో ‘ముందడుగు’, ‘మండే గుండెలు’ లాంటి మల్టీస్టారర్లు నిర్మించి సంచలనం రేపారు. కమలహాసన్‌తో ‘ఇంద్రుడు-చంద్రుడు’, వెంకటేశ్‌తో ‘బొబ్బిలిరాజా’, హరీశ్-మాలాశ్రీతో ‘ప్రేమఖైదీ’, అంధబాలిక జీవితం ఆధారంగా హీరోయిన్ లయ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ‘ప్రేమించు’ లాంటివి విశేష ఆదరణ పొందాయి.
 

 
అవార్డులు.. రివార్డులు

రామానాయుడు 1996లో తిరుపతి వెంకటేశ్వర వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 1998లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, 1999 గిన్నిస్ బుక్‌లో పేరు నమోదైంది. దాదాసాహెబ్ ఫాల్కే (2009), పద్మభూషణ్ (2013) అవార్డ్‌లు అందుకున్నారు.
 
నిష్కల్మష వ్యక్తిత్వం

తండ్రి వ్యవసాయం, పెదనాన్న వ్యాపార దక్షత రెండింటినీ రామానాయుడు పుణికిపుచ్చుకున్నారు. వ్యవసాయం, సిని మాలు ఇలా ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానం అందుకోవడమే లక్ష్యంగా కృషి చేసేవారు. రామానాయుడు స్థాపించిన సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఇటీవలే ఐదు దశాబ్దాలు (1964 - 2014) పూర్తయ్యాయి. పల్లెటూరి మూలాలున్న ఆయనలో చివరి క్షణం వరకు ఆ పల్లెటూరి భోళాతనం, నిష్కల్మష హృదయం తొణికిసలాడేవి. పేరు ప్రతిష్ఠలు, కోట్ల సం పాదనతో ఎంత ఎత్తుకు ఎదిగినా... దాన్ని తలకెక్కించుకోకుండా, కాళ్ళు నేల మీద పెట్టుకొని నడవడం ఆయనకే సొంతం.
 
సమాజ సేవలోనూ పెద్ద చెయ్యే..

సినిమా పరిశ్రమలోని వ్యక్తులకుకానీ, వ్యవస్థకు కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సహాయం, సేవ, సాంత్వనతో ముందుండడం రామానాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. 1991లోనే తన పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. 1997లో వృద్ధాశ్రమం నెలకొల్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు.
 
ఒంటికి పడని రాజకీయాలు..

జీవితంలో తనకు నచ్చనివి ‘అబద్ధాలు ఆడడం, రాజకీయాలు’ అని తరచూ చెప్పే రామానాయుడు... ఒక దశలో మిత్రుల బలవంతం మీద రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. అయితే రాజకీయ వాతావరణం ఒంటబట్టని ఆయన ఒక పర్యాయమే ఎంపీగా పరిమితమయ్యారు. రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో సినిమా  వ్యాపారంలోనూ నష్టాలు చవిచూసినట్లు ఆయన స్వయంగా చెబుతుండేవారు.

ఆ కోరిక తీరనే లేదు

సినిమాకు దర్శకత్వం వహించడం, కుటుంబంలోని హీరోలైన వెంకటేశ్, రానా, నాగచైతన్యలతో కలసి తాను కూడా నటించే ఓ చిత్రం నిర్మించడం రామానాయుడు కోరికలు. కానీ అవి తీరకుండానే ఆయన కన్నుమూశారు.
.........................................................
జీవనతరంగాలు..
పూర్తి పేరు: దగ్గుబాటి రామానాయుడు
తల్లితండ్రులు: దగ్గుబాటి వెంకటేశ్వర్లు,లక్ష్మీదేవమ్మ
పుట్టినతేదీ - 1936 జూన్ 6
స్వస్థలం - ప్రకాశం జిల్లా కారంచేడు
సతీమణి - రాజేశ్వరి
సంతానం - సురేశ్‌బాబు, వెంకటేశ్, లక్ష్మి
తొలి చిత్రం - భాగస్వాములతో కలసి తీసిన ‘అనురాగం’ (1963)
సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించింది - 1963లో
సురేశ్ పతాకంపై తొలి చిత్రం - ఎన్టీఆర్‌తో ‘రాముడు భీముడు’ (1964)
నిర్మించిన చిత్రాల సంఖ్య -దాదాపు 150 (తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడం, ఒరియా, అస్సామీ, మలయాళం, పంజాబీ, భోజ్‌పురి, ఇంగ్లీషు భాషా చిత్రాలతో కలిపి). రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీశారు.
కుమారుడు వెంకటేశ్‌ను హీరోను చేసింది ‘కలియుగ పాండవులు’ చిత్రంతో..
1989లో రామానాయుడు స్టూడియోను స్థాపించారు.
1991లో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
నానక్‌రామ్‌గూడలో ‘రామానాయుడు సినీ విలేజ్’ ఏర్పాటు - 1994
‘శాంతినికేతన్’ సీరియల్‌తో 1999లో టీవీ రంగంలోకి అడుగిడారు.
బాపట్ల నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక - 1999

వెంకన్నపైనే నమ్మకం..
మెడలో వెంకటేశ్వరస్వామి లాకెట్ ధరించడం, రాహుకాలంలో కీలకమైన పనులేవీ చేయకపోవడం రామానాయుడు అలవాటు.
 
ఈ సినిమాలే..
ఆయన ఉన్నతికి కారణమైన సినిమాలు.. ఎన్టీఆర్‌తో ‘రాముడు - భీముడు’, అక్కినేనితో ‘ప్రేమ్‌నగర్’ వీటితోనే రికార్డులు సృష్టించారు.

వినయమే విజయ రహస్యం..

వైఫల్యం ఎదురైతే ధైర్యంగా ఉండాలని,  విజయం వస్తే మరింతగా ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.  
 
ఏ రంగంలో ఉన్నా నంబర్‌వన్‌గా నిలవడం రామానాయుడు లక్ష్యం.

...............................................................
నేడు తెలుగు చిత్రపరిశ్రమ, థియేటర్ల బంద్

రామానాయుడు మృతికి సంతాపంగా గురువారం తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు. సినిమాల షూటింగ్‌లతోపాటు అన్ని విభాగాలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు కూడా గురువారం మూసి ఉంచనున్నట్లు దాసరి నారాయణ రావు తెలిపారు.
..............................................

..:: రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 19th Feb 2014, Thursday)
....................................

0 వ్యాఖ్యలు: