కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంతరావు గారు కళారంగంలో ఏ ప్రక్రియను స్పృశించినా దాని పారం (అంతు) చూడకుండా వదలరు. భారతీయ సంగీతం గురించి, ముఖ్యంగా కర్ణాటక సంగీతం గురించి, మరీ ముఖ్యంగా ఆంధ్ర వాగ్గేయకారుల గురించి ఆయన చేసినంతటి లోతైన పరిశోధన మరెవ్వరూ చేయలేదు. ఆయన రచించిన ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ ఇప్పటికీ అత్యంత ప్రామాణికమైనది. ఇక సృజనాత్మక సంగీతంలో రజని గారు స్పృశించని బాణీ లేదేమోననిపిస్తుంది. రవీంద్ర సంగీతం, బెంగాలీ కీర్తన్, బావుల్ గీతాల ఫణితులు, మరాఠీ భావగీత్, పర్షియన్, అరేబియన్ ఫణితులు, శ్పానిష్ జానపద (ఫ్లెమెంకో) ఫణితులు - అన్నీ ఆయన సంగీతంలోకి చొరబడ్డాయి. వాటిని ఆయన సందర్భ ఔచిత్యంతోనే ఉపయోగించుకున్నారు. లలిత సంగీతమైనా, సినిమా సంగీతమైనా, యక్షగానాల శాస్త్రీయ సంగీతమైనా ఆయన సంగీత రచనలన్నింటిలోనూ ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుగులో ‘లలిత సంగీతం’ అంటున్నదానికి ఆయనే వైతాళికుడు. సుమారుగా 1940 ప్రాంతం నుండి 1990 దాకా ఒక అర్ధశతాబ్ది కాలంలో ఆయన రచించి, స్వరపరచిన గీతాలన్నీ అజరామరాలే. అవన్నీ తర్వాతి తరాల లలిత సంగీత స్రష్టలను అంతో ఇంతో ప్రభావితం చేసినవే. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు రజనీకాంతరావు గారు. 1920 జనవరి 29న నిడదవోలులో ఆయన జన్మించారు.
1941 ఫిబ్రవరిలో - 21 సంవత్సరాల వయస్సులో రజని గారి మొదటి రేడియో సంగీత నాటకం ‘చండీదాసు’ ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయింది. అప్పటి నుండే ఆయన కళాజీవితం ప్రారంభమయింది. 1941 నుంచే రజనిగారు - తన పేరు ప్రకటించుకొనే అవకాశం లేకపోయినా అడపా తడపా సినిమా సంగీతం కూడా చేస్తూ వచ్చారు. అలా నిడుమోలు జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘తారుమారు - భలేపెళ్ళి’ అనే జంట హాస్యచిత్రాలకు రజనిగారు పాటలు రాశారు. వీటి స్వరాలూ ఆయనవే. అప్పటికే (1942) ఆయన రేడియో ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో ఉన్నవారు ఇతర సంస్థలకు పని చేయరాదనే నిబంధన ఉండేది. రేడియో అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకొని, అనుమతి సంపాదించుకోగలిగితేనే సినిమాలకు పని చేయవచ్చు. కాని, ఆ పని అంత తేలిక కాదు.
సినిమాల కోసం ఆయన రాసిన పాటలు, వాటి స్వరరచనలు రాశిలో కాకపోయినా వాసిలో గొప్పవే. అన్నీ కాకపోయినా వాటిలో కొన్నైనా ఇప్పటికీ దొరుకుతాయి. గ్రామఫోన్ రికార్డుల ద్వారా వెలువడిన 1940 దశకంనాటి ప్రైవేటు పాటలు - రాజేశ్వరరావు, బాలసరస్వతి, భానుమతి, సూర్యకుమారి, వరలక్ష్మి పాడినవి - కూడా చాలా వరకు దొరుకుతాయి. కాని, రేడియో కోసం చేసిన సంగీతం చాలావరకు చెరిగిపోయినట్లే! దొరికినంత మటుకైనా రజనిగారి సంగీతాన్ని మళ్ళీ సీడీల మీదకు తెచ్చి సంగీత ప్రియులకు అందించడం అవసరం.
- నండూరి పార్థసారథి (ఈ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, సంగీత విమర్శకుడు)
0 వ్యాఖ్యలు:
Post a Comment