జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, February 27, 2015

రామానాయుడు గారు ఆ కథలో వేలుపెట్టనన్నారు! - నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి

నాయుడు గారు ఆ కథలో వేలుపెట్టనన్నారు!
 ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మరణించారంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. సినిమా రంగంలో దుక్కిపాటి మధుసూదనరావు గారి తరువాత మళ్ళీ రామానాయుడు గారికి ‘నవలా చిత్రాల నిర్మాత’గా చాలా పేరుండేది. పాఠకాదరణ పొందిన నవలలను వెండితెరకెక్కించడానికి రామానాయుడు గారు ఎప్పుడూ ముందుండేవారు. అలా నవలల నుంచి ఆయన సినిమాలుగా తీసినవి చాలానే ఉన్నాయి. అప్పటి ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన మొదలు ఇప్పటి బలభద్రపాత్రుని రమణి లాంటి ఎంతోమంది రచనలు ఆయన ద్వారా వెండితెరకెక్కాయి. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ప్రేమనగర్’ లాంటి పెద్ద కమర్షియల్ హిట్ సైతం నవలే కదా! ఇక, నా నవలల్ని కూడా ఆయన చలనచిత్రాలుగా నిర్మించారు. అందులో ప్రధానంగా అందరికీ గుర్తుండిపోయేవి - ‘జీవనతరంగాలు’, ‘సెక్రటరీ’, ‘అగ్నిపూలు’.
 
 సినిమాకు పనికొచ్చే మంచి కథల కోసం వెతికే స్వభావం వల్ల నాయుడు గారికి నవలల మీద, నవలా రచయితల మీద చాలా మర్యాద ఉండేది. నవలలు ఆయన బాగా చదివేవారు. నవలను సినిమాకు ఎంచుకొనేటప్పుడు ఆ కథల గురించి బాగా చర్చించేవారు. మరికొంతమందికి కూడా ఆ నవలలు ఇచ్చి, చదివించేవారు. ఫలానా నవల సినిమాకు ఒదుగుతుందా, లేదా అని జాగ్రత్తగా జడ్జి చేసేవారు. అన్ని చర్చలు చేసి, సదరు నవలను సినిమాకు ఎంచుకున్న తరువాత తెరపైన ఆ నవలకు పూర్తి న్యాయం చేసేవారు. అవసరమైతేనే సినిమాకు తగ్గట్లుగా కథలో కొద్ది మార్పులు చేసేవారు. నా ‘అగ్నిపూలు’కు అలానే కొన్ని మార్పులు చేశారు. అయితే, అప్పటికే ఆ నవలను చదివి, ఆ పాత్రలతో అనుబంధం పెంచుకున్న మహిళా ప్రేక్షకులను సినిమాతోనూ ఒప్పించి, మెప్పించారు.
 
 ఆయన తీసిన నా నవలా చిత్రాల్లో నా వరకు నాకు బాగా నచ్చినది - ‘జీవనతరంగాలు’ (1973). అప్పట్లో సీరియల్‌కు అలాంటి పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. కానీ, నేను ఆ పేరు మీద పట్టుబట్టాను. తరువాత సినిమాగా తీస్తున్నప్పుడు నాయుడు గారు సాధారణంగా సినిమాలకు పెట్టే పేర్లకు భిన్నంగా ‘జీవన తరంగాలు’ అనే టైటిలే ఉంచారు. ఆ నవలను సినిమాగా తీస్తున్నప్పుడు ఆయన కథలో సినిమా కోసం మార్పులేమీ చేయలేదు. ‘అద్భుతమైన నవల. ఆ కథలో వేలు పెట్టను’ అని చెప్పారు. అలాగే చేశారు. పైగా, ‘జీవన తరంగాలు’ అనే పేరుకు తగ్గట్లే కథలో సందర్భోచితంగా ఒక పాట రాయించి పెట్టారు. ఆత్రేయ గారు రాసిన ‘ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...’ అనే పాట అప్పుడూ, ఇప్పుడూ ‘ఎవర్‌గ్రీన్’గా నిలిచిపోవడం విశేషం.
 
 ఆయన చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. ఏదైనా నవల బాగుందంటే ఆ రచయితతో మాట్లాడి, నిజాయతీగా డబ్బులు చెల్లించి హక్కులు తీసుకొనేవారు. అప్పట్లో నవలలు రాసేవారందరూ తమ నవలల హక్కులను రామానాయుడు గారు తీసుకుంటే బాగుండేదని ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. పాఠకులు ఆదరించిన కథలను సినిమాగా తీయడం వల్ల ప్రేక్షకులను మెప్పించడం సులభమవుతుందని ఆయన నమ్మకం. నా నవల ‘అభిశాపం’ అంటే ఆయనకు చాలా ఇష్టం.
 
 ఆ నవల హక్కులు కూడా తీసుకున్నారు. ఆ నవలను సినిమాగా తీయాలనుకుంటున్నట్లు ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా! కానీ, ఎందుకనో ఆయన కోరిక నెరవేరలేదు. అలాంటి అభిరుచి గల నిర్మాత ఇప్పుడు భౌతికంగా కనుమరుగవడం నవలాప్రియులకు కూడా బాధాకరం. ఏమైనా, మంచి సినిమాలు అందించిన వ్యక్తిగా, మరీ ముఖ్యంగా నవలా చిత్రాల నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఆయనకు సుస్థిరమైన స్థానం ఉంది. ఆ రకంగా స్త్రీ ప్రేక్షక హృదయాలలో ఆయనకూ, ఆయన నవలా చిత్రాలకూ ప్రత్యేకమైన గుర్తింపు మిగిలింది.


- సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 20th Feb 2015, Friday)
....................................

0 వ్యాఖ్యలు: