సందర్భం - సినీ గీత రచయిత వేటూరి జయంతి రేపు... (Jan 29th)
ఆశువుగా పద్యాలు చెప్పగల అవధాన కవుల్లా, చాటుపద్య కవుల్లా సంగీత దర్శకులిచ్చిన సినీ బాణీలకు అప్పటికప్పుడు పాటలల్లగల పద్య స్ఫూర్తికి వేటూరి సుందర రామమూర్తి పెట్టింది పేరు. ‘అలలు కదిలినా పాటే - ఆకు మెదిలినా పాటే’ అని ఆయనే అన్నట్టు వేటూరి రాయ(లే)ని పాట లేదు. ఎలాంటి పాటనాయినా అవలీలగా రాయగలిగిన వేటూరి తెలుగులో ఇంతవరకు ఎక్కువ పాటలు రాసిన పాటసిరి. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకు జాతీయ బహుమతి అందుకొన్న (అ)ద్వితీయ సినీ కవి.
శంకరాభరణం, సాగర సంగమం, భక్తకన్నప్ప, భైరవ ద్వీపం, ఆనందభైరవి వంటి చిత్రాల్లో పాండిత్యస్ఫోరకమైన పాటలు రాసినందుకే కాదు -వ్యాపార చిత్రాల్లో కూడా ఆశువుగా అద్భుతమైన పాటల్ని రాసినందుకు ఆయనను అభినందించాలి. స్వరపద మైత్రి మీద ఆయనకు గల అవగాహనకు, అధికారానికి ఆశ్చర్యపోవాలి.
‘ఇంద్ర’ చిత్రానికి పాటలు రాసే సందర్భంలో కారులో ప్రయాణిస్తూ...
‘అమ్మడు అప్పచి, నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టే వచ్చి పెట్టింది పేచి’
అనే పల్లవిని రాసుకోమని తన సహాయకునికి చెప్పి దారిలో ‘బావార్చి’ హోటల్‌ను చూసి...
‘బావరో బావర్చి, తినిపించరా మిర్చి
వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి’
అంటూ అనూహ్యమైన పదాల్ని పేర్చి, కూర్చి ఆ పల్లవిని కొనసాగించడం ఆయనకే చెల్లు.
అలాగే ‘రెండు జెళ్ల సీత’లో...
‘మాగాయే మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి...’
అంటూ పేరడీని పేల్చి శ్రోతల్ని ముగ్ధుల్ని చెయ్యడం వేటూరికి మాత్రమే తెలిసిన విద్య. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్టు వేటూరి సినిమా పాటకు ఎల్లలు లేవు. తెలుగులో నేరుగా తీసిన చిత్రాల్లోని పాటలులాగే... ఎంపిక చేసుకొని పరిమితంగా రాసిన డబ్బింగ్ చిత్రాల్లోని పాటలు కూడా అధికశాతం ప్రాచుర్యాన్ని పొంది వేటూరికి పేరు తెచ్చాయి. అయితే వేటూరి అనువాద గీతాల పట్ల అంత శ్రద్ధ చూపలేదని, మాతృకలకు న్యాయం చెయ్యలేదని కొందరు విమర్శకులు అభిప్రాయ పడ్డారు. వారి ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.
వేటూరి ఏక కలాధిపత్యంగా తెలుగు చిత్రసీమను ఏలి తీరికలేని కాలంలో కూడా మణిరత్నం వంటి దర్శకులనూ, ఎ.ఆర్. రెహమాన్ వంటి సంగీత దర్శకులనూ కాదనలేక పరిమితమైన డబ్బింగ్ చిత్రాలకు మాత్రమే వేటూరి పాటల్ని రాశారు. అయినా తెలుగులో ఆరు వందలకు పైగా అనువాద చిత్రాలకు రచన చేసి అత్యధిక ప్రాచుర్యాన్ని పొందిన డబ్బింగ్ పాటలనందించిన రాజశ్రీ తర్వాత కేవలం యాభైలోపు డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాసి ఎక్కువ ‘హిట్స్’ను సాధించిన ఘనత వేటూరికే దక్కుతుంది. ఉదాహరణగా...
1 శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా (ఇద్దరు)
2 కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే (బొంబాయి)
3 ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా (దశావతారం)
4 సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా (యువ)
5 కలలైపోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు (సఖి)
6 నిదరే కల ఐనది, కలయే నిజమైనది
బతుకే జతఐనది, జతయే అతనన్నది (సూర్య సన్‌ఆఫ్ కృష్ణన్)
7 ప్రేమించే ప్రేమవో, ఊరించే ఊహవో (నువ్వు-నేను-ప్రేమ)
ఇంకా ‘మెరుపు కలలు’, ‘రాగమాలిక’, ‘తెనాలి’, ‘వల్లభ’, ‘వేసవి’, ‘యముడు’, ‘అమృత’, ‘ఆరు’ వంటి ఎక్కువ తమిళ చిత్రానువాదాలకు, గురు (హిందీలో గురుకాంత్), దేవరాగం (మలయాళం) వంటి ఇతర భాషా చిత్రానువాదాలకు వేటూరి ఎన్నో ‘హిట్ సాంగ్స్’ రాశారు. ఆయన పాటలు రాసిన చివరి చిత్రం ‘విలన్’ కూడా తమిళం నుంచి డబ్ చేసిందే! ‘‘అనువాద గీతాన్ని వీలైనంత వరకు మాతృకలోని భావాలకు దగ్గరగానే రాయడానికి నేను ప్రయత్నిస్తాను. వీలుకాని సందర్భంలో మాత్రమే ఒరిజినల్ కవి ఆత్మను కచ్చితంగా ఆవిష్కరించలేకపోతాను’’ అన్నారు. వేటూరి చెప్పినట్టు ఆయన అనువాద గీతాల ధోరణి ఉందో లేదో సోదాహరణంగా పరిశీలిద్దాం.
యువతీ యువకుల మధ్య గల సున్నితమైన ప్రేమను కథాంశంగా స్వీకరించి తమిళంలో నిర్మించిన ‘అలైపాయుదే’ చిత్రాన్ని ఆ మూలంలో వైరముత్తు పాటల్ని సమకూర్చగా, తెలుగుసేత ‘సఖి’కి వేటూరి యువతరానికి గిలిగింతలు పెట్టే పాటల్ని రాశారు. వాటిల్లో...
‘స్నేహితుడా, స్నేహితుడా, రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకొన్న స్నేహితుడా...’
అనేది ఒకటి. ఇది...
‘స్నేగిదనే స్నేగిదనే రగసియ స్నేగిదనే
చిన్న చిన్న దాయ్ కోరిక్కైగళ్ సెలిక్కొదు స్నేగిదనే...’
అని మూలానికి దగ్గరగా ప్రారంభించి, మొదటి చరణంలో ‘చిన్న చిన్న హద్దు మీరవచ్చునోయ్’ అని ఆయనే రాసినట్టు చరణాల్లో కొంత స్వేచ్ఛను తీసుకున్నారు.
‘వారణం అయిరమే’ అనే తమిళ చిత్రంలో...
నెంజిక్కుళ్ పెయ్ దిడం మామళై
నీరుక్కళ్ మూళ్గిడుం తామరై...
అనే జనరంజకమైన గీతానికి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ తెలుగు చిత్రంలో వేటూరి -
‘నాలోన పొంగెను నర్మద, నీళ్లల్లో మురిసెను తామర
అంతట్లో మారెను రుతువిలా, పిల్లా నీవల్ల...’
అంటూ మూలంలోని భావానికి కొంత ఎడంగా రాశారు. ‘గుండెల్లో గొప్పవాన కురిసింది. తామర నీళ్లల్లో మునుగుతోంది. ఉన్నట్టుండి వాతావరణం మారుతోంది. పిల్లా ఆ నేరం నీ మీదే పడుతుంది’ అని మాతృకకు అర్థం.
వేటూరి అనువాద గీతాల్లో సాహిత్యపరంగా మకుటాయమైనది ‘రాగమాలిక’ చిత్రంలోని...
‘పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ, తావిగా నన్నుండి పోనీ’
అనేది. మూలం ‘కాదల్’ ఓవియమ్’లోని...
పూవిల్ వండు - కూజమ్ కండు
పూవుమ్ కణ్‌గళ్ మూజుమ్...
(పూవులోని తుమ్మెద రావడాన్ని చూసి పువ్వు కళ్లు మూసుకుంటుంది) అనే గీతం. చిత్రంలో నాయకుడు సంగీత నిధి అయిన అంధుడు గనుక తమిళగీతం సందర్భోచితంగా నడిచింది.ఏతావాతా వేటూరి అనువాద గీతాల్లో ‘లిప్ సింక్’కి ప్రాధాన్యమిస్తూ అవకాశం దొరికినప్పుడు తన భాషాపటిమను ప్రదర్శించేవారని పై ఉదాహరణల్ని బట్టి తెలుస్తోంది. నేపథ్య గీతాలను అనువదించేటప్పుడు ఆయన విజృంభించి అనేక ప్రయోగాలు చేసేవారనడానికి...
‘నిదరే కల ఐనది, కలయే నిజమైనది
బ్రతుకే జతఐనది, జతయే అతనన్నది
మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు
మొదలాయె కథయిలా... (సూర్య సన్నాఫ్ కృష్ణన్)
వంటి పాటలు నిదర్శనం. చివరిగా వేటూరి అనువాద గీతాల మీద ఉన్న విమర్శలు కొన్నిటిని చూద్దాం...
‘ఉయిరే ఉయిరే వందు ఎన్నోడు కలందువిడు
ఉయిరే ఉయిరే ఎన్నై ఉన్నోడు కలందు విడు...’
అనే తమిళ గీతానికి ‘బొంబాయి’ తెలుగు చిత్రంలో వేటూరి...
‘ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకూ
కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకూ...’
అంటూ రాసిన పల్లవిలో ‘ఉరికే చిలకా’కు బదులు ‘ఎగిరే చిలకా’అని ఉండాలని కొందరి విమర్శలు. చిలక ఉరకడమేమిటని వారి అధిక్షేపణ!
అలాగే ‘మెరుపు కలలు’ చిత్రంలో ‘తంగత్తామర మగళే’ అనే దాన్ని వేటూరి ‘తల్లో తామర మడిచే’ అని అనువదించారు. ‘తల్లో తామర తురమడం ఉంటుంది కాని మడవడం ఉంటుందా?’ అని విమర్శకుల సందేహం. ఆ మాటకొస్తే తలలో తామరలంత పెద్దపూలను తురుముతారా?
‘బొంబాయి’ చిత్రంలోని పాటలో ‘కన్నానులే’ అనే పదానికి ‘కలయికలు ఏనాడు ఆగవులే’ అనే దానికీ అన్వయం ఉందా అనేది మరో ప్రశ్న.
‘మెరుపు కలలు’ చిత్రంలోని ‘వెన్నెలవే వెన్నెలవే’ పాటలో మూలంలో ఉన్నట్టుగా సందర్భశుద్ధి లేకుండా నేల విడిచి సాము చేశారన్నది మరో ఆరోపణ!
ఇలాంటి రంధ్రాన్వేషణలకు సమాధానాలు చూపించవచ్చుగానీ, ఈ రకమైన దృష్టితో లోపాల్ని వెదికితే - అనువాదగీతాలే కాదు; ఎన్నో స్ట్రయిట్ పిక్చర్స్‌లోని ప్రాచుర్యం పొందిన గీతాలు కూడా నిలవవు. అటు నేరుగా తీసిన చిత్రాల్లోనైనా, ఇటు డబ్బింగ్ చిత్రాల్లోనైనా - వేటూరి పాటల్లో ప్రధానంగా కనిపించేవి శబ్దసౌందర్యం, భాషా సంపద, అపూర్వ ప్రయోగాలు ఆపైన అందరికీ అర్థం కాని అధివాస్తవికత. అందువల్ల వేటూరి అనువాద గీతాలకు న్యాయం చెయ్యలేదనడం సరికాదు. తెలుగులో వేళ్ల మీద లెక్కపెట్టదగిన అనువాద సినీ గేయ కవులలో వేటూరి స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు.
-by Paidipala
(Published in 'Sakshi' daily, 28th Jan 2015, Wednesday)
...............................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment