చిత్రం - గడ్డం గ్యాంగ్, తారాగణం - రాజశేఖర్, షీనా, అచ్చు, ‘సత్యం’ రాజేశ్, నాగబాబు, నరేశ్, సీత, నోయల్, పాటలు - రామజోగయ్యశాస్త్రి, బాలాదిత్య, సంగీతం - అచ్చు, సమర్పణ - జీవితా రాజశేఖర్, నిర్మాతలు - శివాని, శివాత్మిక, దర్శకత్వం -సంతోష్ పీటర్ జయకుమార్ .............................. కొన్ని సినిమాలకు కొన్ని విషయాలు కలిసొస్తుంటాయి. రిలీజ్ టైమ్ మొదలు ఆ కథకు లభించిన పాత్రధారులు, వాళ్ళకున్న (లేదా లేని) ఇమేజ్‌లు, ఆ సినిమా తీసిన భాషా సమాజంలోని పరిస్థితులు - ఇలా సవాలక్ష కారణాలు ఒక సినిమా విజయవంతం కావడానికి! కానీ, అవేవీ గుర్తించకుండా ఒక భాషలో హిట్టయిన కథ కదా అని మరోభాషకు యథాతథంగా దించేస్తే... అప్పుడు ఆ కథ, రీమేక్ సినిమా పరిస్థితి నీళ్ళలో నుంచి బయటపడ్డ చేపపిల్లే! తమిళంలో గత ఏడాది ఘనవిజయం సాధించిన ‘సూదుకవ్వం’ అనే చిన్న బడ్జెట్ ప్రయత్నాన్ని ఇప్పుడు తెలుగులో హీరో రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’గా అందించడం చూశాక, ఈ ఆలోచనలన్నీ మరోసారి మదిలో మెదిలితే తప్పు లేదు. కథేమిటంటే... హైదరాబాద్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ కమ్ రూమ్మేట్లు (‘సత్యం’ రాజేశ్, నటుడి అవతారం కూడా ఎత్తిన సంగీత దర్శకుడు అచ్చు). సొంత ఊళ్ళో సినీతార అనుష్కకు గుడి కట్టి, అందరితో తిట్లు తిని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన మిత్రుడు సురేశ్ (అచ్చు) దగ్గరకు వచ్చేస్తాడు మరో మిత్రుడు. ఉద్యోగాలు పోగొట్టుకున్న ఇద్దరు, ఈ మూడోవాడితో కలసి తిరుగుతున్న టైమ్‌లో అనుకోకుండా వాళ్ళకు ‘గడ్డం’ దాస్ (రాజశేఖర్) తారసపడతాడు. భౌతికంగా లేని మరదలు షాలూ (షీనా)ను పక్కనే ఉందని ఊహించుకుంటూ గడిపే దాస్ చిన్న చిన్న కిడ్నాప్‌లు చేసి, డబ్బులు వసూలు చేసుకోవడం ద్వారా గడిపేస్తుంటాడు. అలా అందరూ ఒక గ్యాంగ్‌గా తయారవుతారు. ఆ సమయంలో పారిశ్రామికవేత్త (కాదంబరి కిరణ్‌కుమార్) దగ్గర నుంచి వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది. నిజాయతీపరుడైన ఆర్థిక మంత్రి ధర్మరాజు (నరేశ్) కుమారుడు సత్య హరిశ్చంద్ర (ర్యాప్ గాయకుడు నోయల్)ను కిడ్నాప్ చేస్తే 2 కోట్లిస్తామని! ఆ ప్లాన్‌కు ఒప్పుకొన్న గ్యాంగ్ మంత్రి దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేస్తుంది. తీరా ఆ డబ్బు అందుకున్నాక మంత్రి గారి కొడుకే డబ్బు మీద ఆశతో ఆ గ్యాంగ్‌ను మోసగించి, డబ్బుతో పారిపోతాడు. అక్కడకు చిత్ర ప్రథమార్ధం అయిపోతుంది. ఆ తరువాత గడ్డం గ్యాంగ్ ఎదుర్కొన్న సమస్యలేమిటి, ఈ కిడ్నాప్ కథలోని లోతులు తెలుసుకోవడానికి రాజకీయ - పోలీసు పెద్దలు ప్రత్యేకించి దింపిన గుంతకల్ ఎస్.ఐ. గబ్బర్ సింగ్ (తమిళ మాతృకలో చేసిన తమిళ నటుడే ఇందులోనూ చేశాడు) ఏం చేశాడు, అసలు గడ్డం దాస్ ఈ కిడ్నాప్‌లన్నీ దేని కోసం చేస్తున్నాడు లాంటి ప్రశ్నలన్నీ ద్వితీయార్ధం చివరి దాకా కూర్చుంటే తీరుతాయి. ఎలా చేశారంటే... హీరో రాజశేఖర్‌కు ఇది చాలా విభిన్నమైన పాత్ర. దానికి తగ్గట్లుగా ఆయన తన ఇమేజ్‌నూ, స్టైల్‌నూ మార్చుకొని మరీ సినిమా చేశారు. కానీ, అసలు స్క్రిప్టులోనే ఆ పాత్ర చిత్రణ, దాని స్వరూప స్వభావాలేవీ నిర్దుష్టంగా లేకపోవడంతో, ఇంత శ్రమపడినా ఆశించిన ఫలితం దక్కడం కష్టమే! అయినా ఆయన కష్టాన్ని గుర్తించక తప్పదు. మామూలు హీరో ఇమేజ్‌కు భిన్నంగా ఈ ప్రయత్నం చేసిన రాజశేఖర్ తన కెరీర్‌పై పునరాలోచించుకోవాలి. రాగల రోజుల్లో పూర్తిస్థాయి క్యారెక్టర్ యాక్టర్‌గా ఆయన మారితే, అటు ఇండస్ట్రీకీ, ఇటు ఎదిగొస్తున్న ఇద్దరమ్మాయిల (శివాని, శివాత్మిక) తండ్రిగా ఆయనకూ మరింత ఉపయోగం ఉంటుంది. షీనా చేసిన పాత్ర నిడివి చిన్నది. ఉన్నంతలో నరేశ్ ఫరవాలేదనిపిస్తారు. ఎస్.ఐ. గబ్బర్ సింగ్‌గా నటించిన తమిళ నటుడు మాతృకలో లాగానే, రీమేక్‌లోనూ నోరు విప్పకుండా, కనీసం ఒక్కటైనా డైలాగ్ లేకుండానే సీరియస్‌గా సాగే పాత్రను పండించారు. ముమైత్ ఖాన్ ఒక ఐటమ్ సాంగ్‌లో నర్తిస్తుంది. అచ్చు సంగీతం అక్కడక్కడి మెరుపులతో సరిపెడుతుంది. దర్శకుడి గురించి గట్టిగా చెప్పుకోవడానికీ ఏమీ లేదు. ఇంతకీ ఎలా ఉందంటే... ఫస్టాఫ్ చాలా నిదానంగా, పాత్రల పరిచయంతోనే అయిపోతుంది. చక్కటి మలుపుతో... ఇంటర్వెల్. సెకండాఫ్ కొంత ఆసక్తిగా, చకచకా నడుస్తుంది కానీ, చివరకు వచ్చేసరికి అదొక్క పాజిటివ్ సరిపోకపోవచ్చు. నిజం చెప్పాలంటే, ఈ సినిమా ఒక అతుకుల బొంత. ఏ సీనుకు ఆ సీను నడవడమే తప్ప, ఒక కథ, దానికి బలమైన పాత్రలు, వాటి మధ్య అంతస్సంఘర్షణ లాంటివేమైనా ఆశిస్తే తప్పు ప్రేక్షకులది. నరేశ్ తన బావమరిది అయిన డి.జి.పి. పాత్రధారి ‘వైజాగ్’ ప్రసాద్‌ను ఆదేశించే తీరుచూస్తే, కథలో నరేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రా, లేక హోమ్ మంత్రా అని సందేహం కలుగుతుంది. సినిమా సెకండాఫ్ అంతా మినిస్టర్ నుంచి గడ్డం గ్యాంగ్ వసూలు చేసిన రూ. 2 కోట్ల డబ్బు చుట్టూ ప్రధానంగా నడుస్తుంది. మరి, సదరు కిడ్నాప్ చేస్తే నమ్మినబంటు ఇస్తానన్న రెండు కోట్ల గురించి ఆ సీన్‌లో తప్ప, మళ్ళీ సినిమాలో ఎక్కడా రాదు. ఆ సీన్‌లో అలా చెప్పించామన్న సంగతి దర్శక, రచయితలు కూడా కన్వీనియంట్‌గా మర్చిపోయారు. అలాగే, ఇంతకీ హీరో గారి షాలూ ఉన్నట్లా, పోయినట్లా, ఎదురుగా లేని ఆమెను హీరో ఊహించుకుంటూ మాట్లాడడానికి కారణం ఏమిటి లాంటి అనేక సందేహాలు సినిమా చూస్తున్నప్పటి నుంచి సగటు ప్రేక్షకుణ్ణి వేధిస్తుంటాయి. కానీ, వాటన్నిటినీ సహిస్తూ, భరిస్తూ సినిమా పూర్తిగా చూసేయాల్సిందే! తీరా చూసినా, ఆ సందేహాలకు మరికొన్ని చేరేవే తప్ప, ఆరేవీ తీరేవీ కాదు. వీటన్నిటి ఫలితంగా సినిమా చూస్తుంటే, ప్రేక్షకులు కథతో, పాత్రలతో కలసి ప్రయాణించలేకపోతారు. ఈ ‘గడ్డం గ్యాంగ్’కు ఉన్న అతి పెద్ద నెగిటివ్ అదే!
0 వ్యాఖ్యలు:
Post a Comment