స్వయంగా చిత్ర నిర్మాణ, పంపిణీ వసతులు, అనుభవం, సొంతంగా టీవీ చానల్ - అన్నీ ఉన్న ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, మరో టీవీ చానల్ గ్రూప్ అండదండలున్న చిత్ర నిర్మాణ సంస్థతో కలసి ఒక చిత్ర నిర్మాణం చేపట్టిందంటే...! ఆ చిత్ర కథకూ, సినిమాకూ ఏదో ఒక విశేషం ఉండే ఉండాలి. 'ఉషాకిరణ్ ఫిల్మ్స్, అలాగే 'జెమినీ' టీవీ కీలక బాధ్యులకు చెందిన 'ఆనంది ఆర్ట్స్' - రెండూ కలసి సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా కాబట్టి, 'బీరువా' చిత్రంపై ఆసక్తి నెలకొంది. దానికి తోడు టీవీ చానల్స్‌లో వచ్చిన 'బీరువా' ట్రైలర్లు మరింత ఉత్సుకత పెంచాయి. మరి ఇంతకీ హాలులోకొచ్చిన 'బీరువా' లో ఏమున్నట్లు?
కథేమిటంటే...
ఒక ఇంట్లో కొన్న బీరువాలో ఒక వ్యక్తి బయటకొస్తాడు. బీరువాలో మనిషి ఉండడమని ఆశ్చర్యపోతుండే సరికి, బీరువాలో నుంచి ఊడిపడ్డ సదరు హీరో గారు తన ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు. అనగనగా ఒకబ్బాయి. పేరు సంజు (సందీప్ కిషన్). ఇంట్లో అమ్మా నాన్న (అనితా చౌదరి, నరేశ్)ల మాట వినకుండా గాలికి తిరిగే రకం. అతను చేసే ప్రతి పనితో వాళ్ళ నాన్నకు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంటుంది. సదరు తండ్రి సూర్యనారాయణ (నరేశ్)ని ఒకడు నమ్మించి, ఒకడు మోసం చేస్తాడు.
ఆ రూ. 40 కోట్లు తిరిగి పొందడానికి విజయవాడలోని బడా రౌడీ కమ్ రాజకీయవాది ఆదికేశవులు నాయుడు (ముఖేశ్‌రుషి)ని ఆశ్రయిస్తాడు - తండ్రి. తీరా ఆ ఆదికేశవులు కూతురు స్వాతి(సురభి)నే హీరో ప్రేమిస్తుంటాడు. మొదట్లో హీరోను హీరోయిన్ దూరం పెట్టినా, ఆ 40 కోట్ల వ్యవహారం ఆదికేశవులు సెటిల్ చేసే సమయానికి, వాళ్ళ ప్రేమ పిందె పండవుతుంది. హీరో, హీరోయిన్లిద్దరూ కలసి పరారవుతారు. కొడుకు తెచ్చిన కొత్త సమస్యతో తండ్రికి షాక్‌కు గురవుతాడు. అక్కడికి ఫస్టాఫ్ అయిపోతుంది.
ఇక, సెకండాఫ్ అంతా - ఆదికేశవులు బారి నుంచి తప్పించుకోవడానికి హీరో హీరోయిన్లు పడే కష్టాలు, హీరో తెలివిగా వ్యవహరించి, హీరోయిన్‌ను కాపాడడం. చివరకు హీరోయిన్ తండ్రి తన తప్పు తెలుసుకొని, 'అమ్మాయికి కావాల్సింది శాసించే రూలర్ కాదు, ప్రేమించే ఫాదర్' అని గ్రహించి, వారిద్దరికీ పెళ్ళి చేస్తాడు.
ఎలా నటించారంటే... 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' లాంటి విజయాలు తెచ్చిన ధీమాతోనో ఏమో యువ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు పాత్రకు, కథకు అవసరమైన పరిధికి దాటి మరీ నటిస్తున్నారు. అదొక కొత్త రకం ఈజ్‌గా బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. అయితే, అది భ్రమే తప్ప, నిజం కాదని ఆయన త్వరగా గ్రహిస్తే దీర్ఘకాల కెరీర్‌కు బాగుంటుంది. ఆ 'అతి' ని పక్కనపెడితే, మిగిలిన అంశాల్లో అతనికి మార్కులు పడతాయి. ఇక, కథానాయిక సురభి పెద్దగా నటించడానికి అవకాశమున్న సీన్లు స్క్రిప్టులో పెద్ద లేవు.
కాకపోతే, మిగిలిన మసాలాలకు ఆమె పనికొచ్చింది. మిగిలిన ముఖేశ్ రుషి, నరేశ్ లాంటి వారందరూ సీజన్డ్ ఆర్టిస్టులే. ఈ చిత్రానికి ప్రధానమైన బలం - ‘షకలక’ శంకర్, సప్తగిరి లాంటి కొత్తతరం కమెడియన్లే. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర మాండలికంలో తోటి నటీనటుల్ని సైతం కెమేరా ముందు తేలిపోయేలా చేసిన 'షకలక' శంకర్‌కు బాగా మార్కులు పడతాయి. త్వరలోనే ఆయన మరింత పెద్ద స్థాయికి ఎదిగే సూచనలున్నాయి.
ఇంతకీ, ఎలా ఉందంటే... చండశాసనుడైన హీరోయిన్ తండ్రిని ఎదిరించి, హీరోయిన్‌ను హీరో ప్రేమించడం... వారిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరగడం... చివరకు తండ్రికి అతని తప్పు తెలిసేలా చేసి, హీరో హీరోయిన్లు ఏకం కావడం - ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. అయితే, ఆ కథలో కీలకమైన మరో పాత్రధారిగా బీరువాను పెట్టుకొని, తద్వారా కథ నడపడమనేది కొత్తే! కాకపోతే, ఇలాంటి వాటికి కథ కన్నా కథనం బలంగా ఉండాలి. ఈ సినిమాలో అదే బలహీనంగా ఉంది. ఫస్టాఫే అంతంత మాత్రంగా సాగితే, పూర్తిగా బీరువా చుట్టూ తిరుగుతూ, కథనం మీద ఆధారపడాల్సిన సెకండాఫ్ విషయం లేక విసుగనిపిస్తుంది.
అయితేనేం, ఈ సినిమాకు ఛాయాగ్రహణం ఎస్సెట్. ఛోటా కె. నాయుడు (కెమేరా) లాంటి సీనియర్ల ప్రతిభ మామూలు ఎప్పుడూ చూసే రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్.ఎఫ్.సి)ని సైతం తెరపై నిండుగా, కనువిందుగా చూపింది. మామూలు దృశ్యాలను కూడా అందంగా, ఆకర్షణీయంగా చూపడంలో డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) ద్వారా అద్దిన రంగులూ బాగా ఉపకరించాయి. అలాంటి కొన్ని అంశాలు సరుకు కొద్దిగానే ఉన్న ఈ 'బీరువా'కు శ్రీరామరక్ష. మునుపటి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' లాంటి వినోదం ఆశించకుండా, కథతో సంబంధం లేకుండా కాసేపు అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్లతో నవ్వుకుందామంటే, రెండు గంటల పైచిలుకు మాత్రమే ఉన్న ఈ నిడివి తక్కువ సినిమా ఓ కాలక్షేపం.
0 వ్యాఖ్యలు:
Post a Comment