జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 26, 2013

పరమ రొటీన్‌ కథనంతో 'భాయ్' (సినిమా సమీక్ష)   హాంగ్‌కాంగ్‌లోనో, బ్యాంకాక్‌లోనో మాఫియా ముఠాలు, మన రాజధాని దాకా విస్తరించిన ఆ ముఠా నేతల వ్యవహారాలు, అందులో హీరో పాత్ర, కథా నేపథ్యం హైదరాబాద్‌ నుంచి అక్కడికో, లేదంటే అక్కడ నుంచి ఇక్కడికో మారడం - ఇలాంటి సినిమాలు చూసి చూసీ సగటు తెలుగు ప్రేక్షకుడి తల ఇప్పటికే బొప్పి కట్టేసింది. కానీ, మన దర్శక, నిర్మాతలు, హీరోలు మాత్రం పదే పదే ఇలాంటి కథలనే వండి, వెండితెరపై వడ్డించడం మానలేదు. కొత్త సినిమా చూద్దామని వెళ్ళిన ప్రేక్షకులకు ఈ శుక్రవారం తాజాగా కట్టిన తలబొ (నొ)ప్పి - 'భాయ్' చిత్రం. 
......................................................................................
చిత్రం-భాయ్, తారాగణం - నాగార్జున, రిచా గంగోపాధ్యాయ. ఆశిష్ విద్యార్థి, సోనూ సూద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, కెమేరా - సమీర్ రెడ్డి, నిర్మాత - నాగార్జున అక్కినేని, దర్శకత్వం- వీరభద్రం చౌదరి
.........................................................................................
    అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం 2007 డిసెంబర్‌లో విడుదలైన 'డాన'్‌ చిత్రం తరువాత హీరో నాగార్జునకు మళ్ళీ సరైన వాణిజ్య విజయం లేదు. ఆ తరువాత వచ్చిన 'కేడి', 'కింగ్‌', 'రగడ', 'రాజన్న', 'శిరిడిసాయి', 'ఢమరుకం', ఈ ఏడాది సమ్మర్‌ రిలీజ్‌ 'గ్రీకు వీరుడు' దాకా వరుసగా వైఫల్యాలే ఆయనను పలకరించాయి. ఫలితంగా ఆయన యాక్షన్‌ నేపథ్యంలో ఉండే ఓ వినోదాత్మక కథను ఈసారి ఎంచుకున్నారు. 'అల్లరి' నరేశ్‌తో 'అహ నా పెళ్ళంట!', సునీల్‌తో 'పూలరంగడు'తో వరుసగా రెండు విజయాలను అందుకున్న దర్శకుడు వీరభద్రమ్‌ తనకు విజయాన్ని అందిస్తారని నమ్ముకున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై, తానే నిర్మాతగా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారితో చేతులు కలిపి మరీ 'భాయ్'ను నిర్మించారు. కానీ, దాదాపుగా ఏడేళ్ళుగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు దర్శకుడు వీరభద్రమ్‌ చెప్పిన ఈ కథ సరిగ్గా ఆనాటి కథాచిత్రాల దశలోనే ఆగిపోయింది. లోతుగా చూస్తే, ఇంకా వెనక్కి కూడా వెళ్ళిందేమో అనిపిస్తుంది. 

హాంకాంగ్‌లో డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి) మాఫియా డాన్‌. అతనికి ఇద్దరు కొడుకులున్నా, భాయ్ (నాగార్జున) అంటే గురి. హైదరాబాద్‌లో తమ మాఫియా ముఠా సభ్యులను ఎవరో పోలీసు అధికారి గుట్టుచప్పుడు కాకుండా తుద ముట్టిస్తుండడంతో, అతని అడ్డు తొలగించడానికి భాయ్ ును అక్కడకు పంపుతాడు డేవిడ్‌. తీరా అక్కడకు వెళ్ళిన హీరోకు ఆ పోలీసు అధికారి (ప్రసన్న) ఎవరన్నది తెలుస్తుంది. దాంతో, చంపకుండా అతణ్ణే కాపాడడం మొదలుపెడతాడు. ఇంతకీ ఆ పోలీసు అధికారికీ, హీరోకూ సంబంధం ఏమిటి, చివరకు ఏమైందన్నది మిగతా సినిమా. 

మొదట కాసేపు'స్టైలిష్' అనిపించిన ఈ సినిమా ఆ వెంటనే బిగి తగ్గిపోతుంది. కానీ, ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంటర్వెల్‌ పడుతుంది. ద్వితీయార్ధం బాగుంటుందని భావిస్తే, తీరా అది కాస్తా రొటీన్‌ పెళ్ళింటి వినోదం ఫక్కీలో సా...గుతుంది. బలమైన విలన్‌ కానీ, హీరో పాత్రకు క్లిష్టమైన లక్ష్యం కానీ, దాన్ని చేరుకొనేందుకు పెద్దగా శ్రమ కానీ లేకపోవడంతో సినిమా విసుగనిపిస్తుంది. 

పెరిగిన జుట్టుతో మాఫియా గెటప్‌, పిల్లి గడ్డంతో పాత బస్తీ 'భాయ్' గెటప్‌, చెల్లి పెళ్ళికని మామూలు గెటప్‌లతో మూడు విధాలుగా నాగార్జున తెరపై కనిపించారు. 'మాస్‌', 'డాన్‌', అతిథి పాత్రలో కనిపించిన 'స్టైలిష్' చిత్రాల శైలిని గుర్తుచేసే ఆహార్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించిన నాగార్జున, ఫ్యాన్స్‌ విషయంలోనే ఆ మేరకు సక్సెస్‌ అయ్యారనిపిస్తుంది. యాభయ్యో పడిలో ఉన్న నాగ్‌ సినిమాలో వీలున్నప్పుడల్లా కళ్ళను కనిపించనివ్వకుండా చలవ కళ్ళద్దాలతో మేనేజ్‌ చేశారు. ఉన్నంతలో అందంగా, హుందాగా అనిపించారు. మునుపటి మోకాలి శస్త్రచికిత్స లాంటి వాటి ఫలితాలు కెమేరా ముందు కనపడిపోతున్నా, కష్టపడి స్టెప్పులు వేశారు. ఎగరడాలు, దూకడాలు లేకుండానే సై ్టలిష్‌గా ఫైట్లు చేశారు. అయితే, వీరభద్రమ్‌ కథలో కానీ, కథనంలో కానీ దమ్ము లేకపోవడంతో ఇవేవీ పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. 

సహజంగా పొడగరి, అందగత్తె అయిన రిచా గంగోపాధ్యాయ నాగ్‌ సరసన చూడడానికి బాగున్నారు. కానీ, ఆమె పాత్ర పాటలకే పరిమితమైంది. పూల తోటల పెంపకదారైన హీరోయిన్‌ను కాస్తా ఒక్కోసారి సాఫ్ట్‌ ఇంజనీర్‌ అని భ్రమింపజేసేలా చూపెట్టారు. హీరో చెల్లెలి ఆఫీసుకు వెళ్ళి, ఆమె గొడవ పడే సన్నివేశం లాంటివి అందుకు ఉదాహరణ. వరుసగా పెళ్ళి చూపులకు హాజరయ్యే హీరోయిన్‌ తీరా హీరోను ఎంపిక చేసుకున్న తీరూ పొసగలేదు.

 ఈ సినిమాలో రెండు సీన్లకు పరిమితమవుతూ కామ్నా జెఠ్మలానీ, అలానే సినిమా మొదట్లో నథాలియా, మమతా మోహన్‌దాస్‌ గొంతులో వినిపించే చివరి పాటలో హంసానందిని ('మిర్చి'లో ఐటమ్‌ సాంగ్‌ గుర్తుందిగా!) ప్రత్యేక నృత్య గీతాల్లో కనిపిస్తారు. హీరో చెల్లెలు గీత పాత్రలో నటించిన అమ్మాయి అందం, అభినయం లేకపోగా, అవసరమైన అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్‌కూ ఉపయోగపడలేదు. 

ఈ సినిమాలో ఒకరూ, ఇద్దరూ కాదు - తెర నిండుగా ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. హీరో తండ్రిగా నాగినీడు, హీరోయిన్‌ తండ్రిగా దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్‌లు మరీ రొటీన్‌ భావప్రకటనలతో నడిపించారు. హీరోయిన్‌ బామ్మ పాత్రలో సీనియర్‌ నటి గీతాంజలి ఒక డైలాగ్‌తో కనిపిస్తే, హౌమ్‌ మంత్రి భార్య పాత్రలో హేమ కనీసం డైలాగైనా లేకుండా అర నిమిషంలో మెరిసిమాయమవుతారు. ఈ చిత్రంలో కామెడీ ఆర్టిసులకూ కొదవ లేదు. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు, 'థర్టీ ఇయర్స్‌' పృథ్వి, ధన్‌రాజ్‌, రఘు, 'సత్యం' రాజేశ్‌ - ఇలా ఎందరెందరో కనిపిస్తారు. కానీ, ఏం లాభం! తెరపై పండిన నవ్వులు మాత్రం చాలా తక్కువ. 'రూలర్‌...' అన్న హిట్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ వినిపిస్తుండగా, ఉన్నంతలో కొద్దో గొప్పో నవ్వించిందల్లా - ఎమ్మెస్‌ నారాయణ, అరిగిపోయిన ఆయన తాగుబోతు కామెడీ మాత్రమే.

నిజానికి, మాఫియా నేపథ్యం సంగతి కాసేపు పక్కనబెడితే, అన్నకు తమ్ముడు, చెల్లెలు పట్ల ఉండే అనుబంధమనే బలమైన సెంటిమెంట్‌ దర్శకుడు తీసుకున్న ఇతివృత్తంలో ఉంది. కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అన్నాచెల్లెళ్ళ మధ్య కానీ ఆ బంధాన్ని పటిష్ఠం చేస్తూ, ప్రేక్షకులను ఆ భావోద్వేగానికి గురి చేసే ఘట్టాలు, సన్నివేశాలు అల్లుకోలేకపోయారు. దాంతో, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం అన్నీ, అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా మాఫియా డాన్‌గా ఉంటున్న హీరో, మళ్ళీ తన వాళ్ళ కోసం కష్టపడడం అర్థం కాని విషయం. అసలు ఈ సినిమాలో హీరో గురించి విలన్‌ చెప్పే విధానం చూసినా, అతని పరిచయ సన్నివేశం చూసినా అతనే ఓ మాఫియా డాన్‌ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ కాసేపైన తరువాతేమో హీరో కేవలం పెద్ద డాన్‌ డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి)కు నమ్మకస్థుడైన బంటు అంటారు. అలాగే, మౌత్‌ ఆర్గాన్‌ వాయించడమనే చిన్న దృశ్యం ద్వారా హీరోయే తన అన్నయ్య అని చిన్నప్పటి నుంచి అతనికి దూరంగా ఉన్న చెల్లెలు గుర్తుపట్టడం లాంటివి పూర్తిగా సినిమాటిక్‌గా ఉన్నాయి. కనీసం అన్నాచెల్లెళ్ళ అనుబంధానికీ, ఆ మౌత్‌ ఆర్గాన్‌కూ మధ్య లింకును చూపే బలమైన ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ అయినా పెట్టలేదు. 

ప్లస్‌ పాయింట్లుగా చెప్పాలంటే, ఈ సినిమాలో హీరో నోట ఎప్పటికప్పుడు వినిపించే సరికొత్త పంచ్‌ డైలాగులు. ఇవి కొంత వరకు మాస్‌ ప్రేక్షకులనూ, అభిమానులనూ ఆకట్టుకొనేలా ఉన్నాయి. అయితే, ఒక దశకు వచ్చేసరికి ప్రతి సీన్‌లో, దాదాపు ప్రతి పాత్రా ఏదో ఒక రకమైన పంచ్‌ను పలికించాలనుకొనేసరికి, మోతాదు మించిపోయిందని అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాను ఓ స్థాయికైనా నిలబెట్టింది. 'బి హెచ్‌ ఏ ఐ - భారు.. చీకటి పడితే ప్లేబాయ్..' అనే టైటిల్‌ సాంగ్‌, 'రామ సక్కనోడు...' అనే యుగళ గీతం అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. కానీ, సినిమా తొలి గంటలోనే మూడు పాటలు వచ్చేసరికి, హాలులో నుంచి చిన్నగా ప్రేక్షకులు బయటకు వెళ్ళక తప్పలేదు.

కనువిందుగా దృశ్యాలను చూపించడంలో కెమేరా వర్క్‌ బాగానే ఉంది. లొకేషన్లు, ఖరీదైన సెట్లు, భారీ తారాగణంతో 'భాయ్'లో చిత్ర నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఎడిటింగ్‌లోని లోటుపాట్లు, అసలు కథా కథనంలోనే ఉన్న బలహీనతలు ఈ సానుకూల అంశాలను కప్పెట్టేశాయి. ఇంత భారీ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడి అనుభవ రాహిత్యం, కథ, కథన లోపాలు శాపమయ్యాయి. మునుపటి రెండు చిత్రాల్లో కనీసం శ్లాప్‌స్టిక్‌ కామెడీతో అయినా గట్టెక్కినా వీరభద్రం, ఈ చిత్రంలో ఆ పాటి వినోదమూ అందించలేకపోయారు! తెలుగు తెరపె ఇప్పటికే తెగ వాడేసిన ద్వితీయార్ధపు శ్రీను వైట్ల మార్కు పెళ్ళి ఇంటి వాతావరణపు సీన్లూ పండించ లేకపోయారు. వెరసి, రెండుంబావు గంటల రొటీన్‌ సినిమాగా 'భారు'ను మిగిల్చారు. 

కొసమెరుపు: సోలో హీరోగా కెరీర్‌ చివరకు వచ్చేసినట్లు ఇటీవల తానే స్వయంగా ఒప్పుకున్న నాగార్జున బహుశా ఈ 'భాయ్'తో ఆ రకం చిత్రాలకు దాదాపు బై... బై... చెప్పేసినట్లేనా?         

-  రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 26 అక్టోబర్ 2013, శనివారం నాటి సంచిక, పేజీ నం. 8లో ప్రచురితం)
....................................................

Tuesday, October 22, 2013

ఆలోచన రేపే నిజ జీవిత కథ - 'షాహిద్‌' (సినిమా సమీక్ష)


       ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో ఓ పక్క రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలతో పాటు, మరోపక్క భిన్నమైన కథలు, కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు వరుసగా వస్తున్నాయి. చిన్న బడ్జెట్‌లో, సహజత్వానికి దగ్గరగా రూపొందిస్తున్న ఈ నవీన ధోరణి చిత్రాలు ముందుగా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్నాయి. అక్కడ విమర్శకుల ప్రశంసలందుకొని గుర్తింపు తెచ్చుకున్న తరువాత, ఇక్కడ ఏదో ఒక ప్రసిద్ధ చిత్ర వ్యాపార సంస్థలు ముందుకొచ్చి, ఆ చిత్రాల మార్కెటింగ్‌లో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. అలా ఆ చిన్న చిత్రాలను కూడా విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్‌తో జనం ముందుకు తెస్తున్నాయి. 'షిప్‌ ఆఫ్‌ థెసియస్‌', 'లంచ్‌ బాక్స్‌' లాంటి ఇటీవలి చిత్రాలు కొన్ని అలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవే. అదే కోవలో అక్టోబర్‌ 18న దేశవ్యాప్తంగా విడుదల కానున్న హిందీ చిత్రం - 'షాహిద్‌'.  

పోలీసులు కేసు పెట్టినంత మాత్రాన, సదరు కేసులో కోర్టు తీర్పు రాక ముందే మీడియా చిలవలు పలవలు చేసినంత మాత్రాన ఎవరైనా తీవ్రవాది అయిపోతారా? దేశంలో జరుగుతున్న విద్రోహ కార్యకలాపాలన్నిటికీ ఒక వర్గం వారినే ఎందుకు తప్పుబడుతున్నారు? నమోదవుతున్న కేసుల్లో నిజంగా దోషులు ఎవరు? ఎందరు? మన చుట్టూ సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి మౌలికమైన ప్రశ్నలెన్నో మనకు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు మన మధ్యే బతికిన ఓ మనిషి జీవితాన్ని తీసుకొని, దాన్ని తెరకెక్కిస్తూ ఈ ప్రశ్నలపై అందరినీ ఆలోచింపజేసే ప్రయత్నమే - 'షాహిద్‌' చిత్రం.
 బొంబాయికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు, వృత్తి రీత్యా వకీలు అయిన షాహిద్‌ ఆజ్మీ (1977 - 2010) నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్ర కథను అల్లుకున్నారు. గుర్తు తెలియని దుండగుల చేతుల్లో తన కార్యాలయంలోనే కాల్పులకు గురై, 2010 ఫిబ్రవరి 11న ఆయన ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదంపై పోరాటం విషయంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ చివరకు క్రూరమైన పోలీసు రాజ్యంగా మారినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ పోరాడారాయన. నిరుపేదలు, కనీసం తమ మీద వచ్చిన కేసులపై పోరాటానికి డబ్బులిచ్చి వకీలును కూడా పెట్టుకోలేని కడుదీనులైన వందలాది ముస్లిమ్‌ల తరఫున ఆయన నిలిచారు. తీవ్రవాదులుగా ముద్ర పడిన పలువురు అమాయకుల పక్షాన వాదిస్తూ, ఏడేళ్ళలో 17 మందిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. చివరకు ఆ కృషిలోనే కేవలం 31 ఏళ్ళ వయస్సుకే ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ముంబరులో బాంబు పేలుళ్ళకూ, దాడులకూ పాల్పడిన దేశద్రోహులైన వ్యక్తుల పక్షాన ఆయన నిలిచారన్న అపవాదులూ వచ్చాయి. 

ఏమైనా, నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిందితులే తప్ప, దోషులు కాదనీ, అనుమానంతో ప్రతి ఒక్కరిపై అనవసరంగా తీవ్రవాదులనే ముద్ర వేయరాదనీ ప్రాథమికమైన సూత్రాలను పట్టుకొని నడిచిన ఉద్యమకారుడు ఆయన. ఈ 'షాహిద్‌' చిత్రం కూడా ఆయన జీవిత ఘట్టాలను ఒక్కొక్కటిగా తెర మీదకు తెచ్చింది. తేదీలు, జరిగిన సంఘటనల వివరాలను తెలిపే టైటిల్‌ కార్డులతో కథకు ఓ చారిత్రక సాధికారికతను అద్దే ప్రయత్నం చేసింది. కథానాయకుడు చిన్నప్పుడు తీవ్రవాదిగా మారడానికి ప్రయత్నించడం, ఆ తరువాత ఆ వలలో నుంచి బయటకు వచ్చేసినా కఠినమైన తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసులో ఇరుక్కోవడం, ఆ పైన మానవ హక్కుల పరిరక్షణ కోసం లాయర్‌గా ప్రయత్నించడం - ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఆయన జీవితాన్ని వీలైనంత వరకు నిజ జీవిత ఘటనల నుంచి తీసుకొని, అవసరాన్ని బట్టి కొంత కల్పన జోడించి, కాస్తంత నాటకీయంగా కూడా చూపారీ సినిమాలో!  
ఇప్పటికే ఈ చిత్రాన్ని 'టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - 2012' (టి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌. 2012)లో వరల్డ్‌ ప్రీమియర్‌గా వేశారు. అలాగే, న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో, చికాగో సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సెంటర్‌ పీస్‌గా ప్రదర్శించారు. అలాంటి పలు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపును అందుకున్న ఈ చిత్రం వెండితెరపై రెండు గంటల పైచిలుకు సాగే మంచి ప్రయత్నం. 'కై పో చే' చిత్రం ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న రాజ్‌ కుమార్‌ యాదవ్‌ ఈ చిత్రంలోని టైటిల్‌ రోల్‌ను చక్కగా పోషించారు. అలాగే, అతను ఇష్టపడి, పెళ్ళాడిన మరియమ్‌ పాత్రలో ప్రబ్లీన్‌ సంధ్య, అతని తల్లిగా బల్జీందర్‌ కౌర్‌, ప్రాసిక్యూషన్‌ లాయర్‌గా విపిన్‌ శర్మ - ఆ యా పాత్రలను వీలైనంత సహజత్వంతో తెరపై పండించారు.

పాటలు, నృత్యాల లాంటి రొటీన్‌ సినిమాటిక్‌ హంగామాలేవీ లేని ఈ చిత్రం సందర్భోచితమైన నేపథ్య సంగీతంతోనే ఆద్యంతం నడుస్తుంది. రొటీన్‌గా సాగే మెలోడ్రమాటిక్‌ కోర్టు సన్నివేశాలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు సహజమైన కోర్టు వాతావరణం, డైలాగులతో సహజత్వాన్ని పరిచయం చేస్తుంది. ప్రథమార్ధం వరకు కొంత డాక్యుమెంటరీ శైలిలో నిదానంగా నడిచినా, ద్వితీయార్ధానికి వచ్చే సరికి సినిమా వేగం అందుకుంది. భార్యాభర్తల పాత్రల మధ్య మానసిక సంఘర్షణ, కోర్టులో వాదోపవాదాలు, కథానాయకుడి కోసం దుండగుల అన్వేషణ లాంటి దృశ్యాలు, వాటిని కెమేరాలో చిత్రీకరించిన విధానం చిత్రంలో భావోద్వేగాన్ని పెంచాయి. 
అక్కడక్కడా కొంత సినీ నాటకీయతను సంతరించుకున్నా, ఆసక్తిని పెంచి, సినిమాను నలుగురూ మెచ్చేలా చేశాయి. రచనతో పాటు, ఛాయాగ్రహణం, కూర్పు లాంటి సాంకేతిక శాఖల పనితనం సినిమాలో కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో 'పాన్‌సింగ్‌ తోమార్‌', 'భాగ్‌ మిల్ఖా భాగ్‌' లాంటి జీవిత కథా చిత్రాలను తీస్తూ, ఆకర్షిస్తున్న హిందీ చిత్రసీమ దానికి కొనసాగింపుగా 'బయో పిక్స్‌' కోవలో తీసిన తాజా సినిమా ఇది.

'స్పాట్‌ బారు' అనే విభాగం కింద విలక్షణమైన, చిన్న బడ్జెట్‌ కథా చిత్రాలను అందిస్తున్న 'యు' టి.వి. సంస్థ అదే విభాగంలో ఈ 'షాహిద్‌'ను అందించింది. అయితే, ఇప్పటికే ఆ విభాగం కింద 'యు' టి.వి. అందించిన గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా అంత గొప్పగా అనిపించదు. సినిమా వ్యాకరణానికి కొద్దిగా భిన్నంగా, 'సోనీ' టీవీలోని ప్రసిద్ధ టీవీ షో 'పోలీస్‌ పాట్రోల్‌' తరహాలో, సీరియల్‌ నిర్మాణ వ్యాకరణంతో నడుస్తుంది. చిన్నప్పుడే మతఘర్షణల్ని చూసిన హీరో తీవ్రవాదం వైపు ఆకర్షితుడు కావడానికి కానీ, ఆ వల నుంచి బయటపడడానికి కానీ నమ్మదగిన సరైన కారణాలను తెరపై చూపించలేదు. పైగా, ప్రధానంగా కథానాయకుడి దృష్టి కోణం నుంచే కథ నడవడంతో, ప్రతి వాస్తవానికీ ఉండే మిగిలిన కోణాలను చూపెట్టలేకపోయింది. 

ఏమైనా, 'షాహిద్‌' ఓ అద్భుతమైన సినిమా కాకపోవచ్చు కానీ, ఓ అందమైన ప్రయత్నం. చుట్టూ ఉన్న సమాజంలో మన మధ్య తిరిగిన ఓ మామూలు మనిషి జీవితానికి సెల్యులాయిడ్‌ చిత్రీకరణగా ఆలోచింపజేసే సత్ప్రయత్నం. ప్రతి ముస్లిమ్‌నూ తీవ్రవాదిగా చూసే చాలామంది ఆలోచనా ధోరణిలోని అపసవ్యతను ఎండగట్టే సెల్యులాయిడ్‌ ప్రయత్నం. రొడ్డకొట్టుడు కమర్షియల్‌ చిత్రాల కలకలానికి దూరంగా, మనసుంటే మంచి సినిమాలు ఎలా తీయవచ్చన్న దానికి కళ్ళెదుట నిదర్శనం. 

కొసమెరుపు: వరుసగా అయిదారు ఫ్లాపులిచ్చిన దర్శకుడు హన్సల్‌ మెహతా ఆ అపజయాల్ని లెక్కచేయకుండా ఇలాంటి కథను ఎంచుకోవడం గొప్పే! అతనన్ని ఫ్లాపుల్లో ఉన్నా సరే, ఈ కథనూ, అతని దర్శకత్వాన్నీ ప్రోత్సహించడం హిందీ చిత్రసీమ ఘనత. మరి, పదుల కోట్ల ఖర్చుతో రొటీన్‌ చిత్రాలు తీసే మన నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఇలాంటివి చూసైనా ఏమైనా కొద్దిగా నేర్చుకుంటారంటారా?
రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 17 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................................

Sunday, October 20, 2013

''నాకు క్యాన్సర్‌! నన్ను ఆశీర్వదించండి!'' - అక్కినేని నాగేశ్వరరావు సంచలనాత్మక ప్రకటన


- సానుభూతి వద్దు ! వచ్చి ఇబ్బంది పెట్టద్దు!
- క్యాన్సర్‌ విజేతలెందరో ఉన్నారు!
- ఆఖరి క్షణం వరకు నటిస్తా! 

అక్కినేని అంతరంగ ఆవిష్కరణ

ట్రాజెడీ చిత్రాల రొమాంటిక్‌ కథానాయకుడిగా అశేష అభిమానుల్ని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు తనకు క్యాన్సర్‌ వచ్చిందన్న విషయాన్ని ప్రకటించడంలో మొక్కవోని ధైర్యం చూపి, హీరోగా నిలవడం విశేషం. ''సుస్తీ చేసిందని చాలామంది బయటకు చెప్పుకోరు. కానీ, అపోహలకూ, తావివ్వకుండా, నేను ఈ విషయాన్ని నలుగురికీ చెప్పాలనుకున్నా. నా మీద ప్రేమ, అక్కరతోనైనా ఎవరెవరో ఫోన్లు చేసి డొంకతిరుగుడుగా విషయం అడగడం, దానికి తప్పించుకు తిరుగుతూ నేనేదో జవాబివ్వడం నాకిష్టం లేకపోయింది. అందుకే, నేనే ఈ విషయాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాను'' అని ఆయన చెప్పుకొచ్చారు. 

''జీవితంలో మనందరం నటిస్తాం. కానీ, కెమేరా ముందే తప్ప, జీవితంలో నాటకమాడే ప్రవృత్తి నాకు లేదు. అందుకే, ఈ విషయం ఇప్పటికే కొందరు డాక్టర్ల ద్వారా, ఇతరుల ద్వారా తెలిసినవాళ్ళు నా మీద ప్రేమతో నన్ను నేరుగా అడగడానికీ, నేను వాళ్ళకు చెప్పడానికీ ఇబ్బంది పడుతున్నాం. ఏవేవో అబద్ధాలు చెప్పే ఇబ్బంది వాళ్ళకూ, నాకూ లేకుండా ఉండాలనే ఇప్పుడీ విషయం బయటపెడుతున్నా'' అన్నారు. ''అబద్ధం మాట్లాడడానికి తెలివితేటలు కావాలి. కానీ, నిజం మాట్లాడడానికి ధైర్యం కావాలి. నాకూ, నా పిల్లలకూ ధైర్యం ఉంది. ...అందుకే, మా కుటుంబమంతా కలసి కూర్చొని, నిర్ణయించుకొని మరీ ఈ సంగతి అందరితో చెప్పాలనుకున్నాం. ఎవరూ చెప్పుకోని అనారోగ్యం గురించి కూడా నేను చెప్పేస్తున్నాను'' అని అక్కినేని వ్యాఖ్యానించారు.

   ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడూ, న్యూయార్క్‌ వాసీ అయిన డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుతో తన అనారోగ్యం విషయమై మాట్లాడినట్లు అక్కినేని వెల్లడించారు. ''దత్తాత్రేయుడుతో మాట్లాడాను. ఆయనకు ఈ వివరాలన్నీ చెప్పాం. 'వాటి గురించి బాధపడకండి. అవేమీ చేయవు' అని ఆయన అన్నారు'' అని ఈ సీనియర్‌ నటుడు వివరించారు. సినిమా కెరీర్‌ తొలి రోజుల్లో, పెళ్ళి కాని వయసులో 1948లో తనపై వచ్చిన అపవాదులతో బాధపడి తాను రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతులను ఆయన చెప్పారు. ''అయితే, చనిపోయి అందరి అపవాదులనూ నిజం చేసే కన్నా, బతికి సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను'' అని అక్కినేని తెలిపారు. ''...బ్రతికి జీవితాన్ని సాధించు... చనిపోయి కలకాలం జీవించు..'' అంటూ అప్పట్లో తాను తొలిసారిగా రాసిన 'అ ఆలు' (అక్కినేని ఆలోచనలు)లోని మొదటి ఖండికను గుర్తు చేశారు.

నన్నెవరూ కలవద్దు! అడగద్దు!
   ఈ అనారోగ్యం విషయంలో మీడియా ఉన్న విషయం చెప్పి, బాధపడే మిత్రులకూ, అభిమానులకూ సాంత్వన కలిగించాలని ఆయన అభ్యర్థించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఒక్క రోజు బాధపడినా, వాళ్ళు సతమతపడకుండా, తనను సతమత పెట్టకుండా ఉంటారని అక్కినేని అభిప్రాయపడ్డారు. ''నా అభిమానులెవరూ బాధపడద్దు. నన్ను బాధపెట్టవద్దు. నన్ను కలవద్దు. నాకు పదే పదే ఈ అనారోగ్యం గురించి గుర్తు చేసి, రోజూ ఇబ్బందులు పెట్టద్దు'' అని చెప్పారు. ''ఇది చంపే జబ్బు కాదు. ఈ జబ్బుతో బతుకుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. నాకు ఏమీ బాధలు లేవు. ఏ నొప్పీ లేదు. రెండు సార్లు గుండె జబ్బు వచ్చి, ఇంత కాలం నేను బతకడమే అదృష్టం. కాబట్టి, ఎక్కడున్నా మీ ఆశీస్సులిస్తే, అవే నాకు ఆరోగ్యం అందిస్తాయి. దూరంగా ఉండే మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అని మీడియా ద్వారా అభిమానులను ఆయన అభ్యర్థించారు.


అంతా సినిమాతల్లి దయ!
   పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'ధర్మపత్ని' (1941) చిత్రం షూటింగ్‌ నిమిత్తం కొల్హాపూర్‌లోని శాలినీ సినీ స్టూడియోకు వెళ్ళి, తొలిసారిగా కెమేరా ముందు నటించిన 1940 నాటి నుంచి ఇప్పటికి 74 ఏళ్ళుగా సాగుతున్న తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని ఏయన్నార్‌ తన ప్రసంగంలో నెమరువేసుకున్నారు. అలాగే, నాటకాలు వేసి తెనాలి నుంచి గుడివాడ వెళుతుండగా రైల్వేస్టేషన్‌లో తనను చూసి, 'శ్రీసీతారామ జననము' (1944) చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక - నిర్మాత కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్యను స్మరించుకున్నారు. 1944 మే 8న మద్రాసులోని నంబర్‌ 10 - ఆలివర్‌ రోడ్డు నివాసంలో కాలుపెట్టినప్పటి నుంచి వివిధ మనస్తత్త్వాలున్న పాత్రలు ధరించి, అభిమానుల్ని సంపాదించుకున్న తీరును తలుచుకున్నారు.

   కుమారులు, కూతురు నాగ సుశీల నిర్మాతలైతే, కుమారుడితో పాటు మనుమలు నటులయ్యారనీ, మనుమలు, మనుమరాళ్ళు స్టూడియో నిర్వహణ చూసుకుంటున్నారనీ అంటూ, ''నేను, మా కుటుంబం సినిమాలకు అంకితమయ్యాం. మాకిన్ని పేరు ప్రతిష్ఠలు సినిమాతల్లి వల్లే వచ్చాయి. కేంద్రం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులూ వచ్చాయి. ఇవన్నీ వస్తాయని నేను ఊహించలేదు. 90 ఏళ్ళ జీవితంలో 74 ఏళ్ళుగా సినీ రంగంలో పని చేయడం, ఇప్పటికీ పనిచేస్తూ ఉండడం ఓ పెద్ద రికార్డు'' అని ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో అందరి కన్నా సీనియర్‌ హీరో అయిన అక్కినేని ఆనందం వ్యక్తం చేశారు.

ఆరోగ్యంలో మూడో రికార్డ్‌కు సిద్ధం!
   తాజా అనారోగ్యం బయట పెట్టిన అక్కినేని, తన పాత అనారోగ్యాలు, వాటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును కూడా చెప్పుకొచ్చారు. గతంలో రెండుసార్లు గుండె పోటు నుంచి గట్టెక్కి, అనుకున్న దాని కన్నా దీర్ఘకాలం ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డులే అన్నారు. ''1974లో హై కొలెస్ట్రాల్‌ వల్ల గుండె పోటు వచ్చింది. దాంతో, 1974 అక్టోబర్‌ 18న నా గుండెకు ఆపరేషన్‌ చేశారు. అప్పటికి ఆ ఆపరేషన్‌ కొత్త. ఆ ప్రక్రియ వచ్చి ఏడేళ్ళే అయింది. అయినా, ఆ పరేషన్‌ చేశారు. ఓ పధ్నాలుగేళ్ళు ఫరవాలేదన్నారు. ఆ తరువాత 1988లో మళ్ళీ హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. కానీ, డాక్టర్లు నా గుండె ఆపరేషన్‌కు చేయదగిన స్థితిలో లేదన్నారు. 'కావాలంటే ఆపరేట్‌ చేస్తాం. కానీ, ఆయన బతకకపోవచ్చు' అని చెప్పారు. మా పిల్లలు అధైర్యపడినా నేను ధైర్యంగా ఉన్నాను. అప్పటి నుంచి మందులేమీ లేవు, డయలేటర్స్‌ వాడుతున్నా. అది జరిగి పాతికేళ్ళు అయింది. ఇదంతా నా మనోబలం, మీ లాంటి ప్రేక్షకుల అభిమానం, ఆశీర్వాదబలంతో సాధ్యమైంది'' అని ఆయన చెప్పారు.
   ఇప్పుడు తన జీవితంలో ఎదురైన ఈ మూడో అనారోగ్య విషమ పరీక్షను మనోబలంతో ఎదుర్కోవడానికి అక్కినేని సిద్ధమైనట్లు కనిపించింది. ''నా జీవితంలో ఇప్పుడిది ఓ కొత్త మలుపు... ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో నాకు తెలియదు. క్యాన్సర్‌ వస్తే చాలు, ఆ మనిషి చనిపోతాడన్నట్లు సినిమాల్లో మేము ఎంతో నాటకీయంగా మార్చి చూపిస్తుంటాం. అలాంటి చాలా సినిమాల్లో నేనూ నటించాను. ఆ అభిప్రాయం ప్రజలకు కలిగించాను. కానీ, ఇప్పుడు క్యాన్సర్‌ వస్తే బతకరన్న పాత మాట మారిపోయింది. ఎందరో క్యాన్సర్‌ను జయించారు'' అని మొన్న సెప్టెంబర్‌ 20న 90వ ఏట అడుగుపెట్టిన ఏయన్నార్‌ వ్యాఖ్యానించారు.
   ఇప్పటికే పలువురు డాక్టర్లతో క్యాన్సర్‌ గురించి చర్చించినట్లు చెప్పిన ఈ సీనియర్‌ నటుడు, ''చిన్న వయస్సులో క్యాన్సర్‌ వస్తే అప్పుడు ఆ కణాలు బలంగా, వేగంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఈ 90 ఏళ్ళ వయస్సులో నా బోటివాడికి వస్తే, ఆ కణాలు కూడా నా వయస్సుకు తగ్గట్లే నిదానంగా ఉంటాయి. కాబట్టి, ఇదేదో మృత్యువు దరికి చేరిన ఆఖరు దశ అనుకోకూడదు. ప్రజలందరి ఆశీర్వాదబలం తోడైతే, దీన్ని కూడా ఎదుర్కొని, ఆరోగ్యం విషయంలో మూడో రికార్డు సృష్టించే అవకాశం నాకు వచ్చింది'' అని అన్నారు.

నా టార్గెట్‌ 96! మీ ఆశీస్సులుంటే 'సెంచరీ'!!
   కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవాపురంలో 1924లో వెంకట రత్నం, పున్నమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించిన ఏయన్నార్‌ తన కుటుంబంలోని వాళ్ళది సామాన్యంగా దీర్ఘాయుష్షు అంటూ చెప్పుకొచ్చారు. ''మా కుటుంబంలో అందరి కన్నా ఎక్కువ కాలం 96 ఏళ్ళు బతికింది మా అమ్మ. కాబట్టి, 96 ఏళ్ళు బతుకుతానని నాకెప్పుడూ గట్టి నమ్మకం. అది నా టార్గెట్‌'' అన్నారు. ''ప్రజలందరూ అభిమానిస్తే, ఆశీర్వదిస్తే, సహకరిస్తే 96 ఏళ్ళు దాటి, సెంచరీ కొడతా'' అని ఆశాభావం వ్యక్తం చేశారు. 
   క్యాన్సర్‌ వచ్చిన ఎంతోమంది ఆ తరువాత కూడా ధైర్యంగా, హాయిగా చాలాకాలం బతికారంటూ, నీలం సంజీవరెడ్డి, భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ లాంటి వాళ్ళ ఉదంతాలను అక్కినేని గుర్తు చేశారు. ''సంజీవరెడ్డి గారు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఒకసారి మామూలుగా వైద్యపరీక్షలు చేయించుకుంటే, క్యాన్సర్‌ ఉన్నట్లు అనుకోకుండా బయటపడింది. ఆ తరువాత ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఏడేళ్ళ పాటు హాయిగా జీవించారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు'' అంటూ ప్రస్తుతం తనకు ప్రేరణ అయిన క్యాన్సర్‌ విజేతల కథలను ఆయన ప్రస్తావించారు. పైగా, ''మా కుటుంబంలో మేమెవరమూ దు:ఖంతో, మనస్తాపంతో ఈ విషయం గురించి కలత చెందడం లేదు'' అని కూడా చెప్పుకొచ్చారు.

మంచి పాత్రలొస్తే చేస్తా..
   తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో తన ప్రత్యేకమైన, ఖరీదైన తెల్లకారులో విలేఖరుల సమావేశం జరిగే స్థలానికి వచ్చిన ఏయన్నార్‌కు ఆయన కుమారులు వెరకట్‌ అక్కినేని, నాగార్జున అక్కినేనితో సహా కుమార్తెలు, మనుమలు, మనుమరాళ్ళు - ఇలా కుటుంబమంతా స్వయంగా ఎదురేగి, స్వాగతం పలికారు. నాగార్జున చేయి అందించగా, నిర్ణీత స్థానానికి వచ్చిన కూర్చున్న ఏయన్నార్‌ దాదాపు 25 నిమిషాల పాటు తన మనసులోని మాటలను పత్రికల వారి ఎదుట పంచుకున్నారు.
   
విలేఖరుల ముందుకు ఆయనొక్కరే రాగా, మిగిలిన కుటుంబం, పరివారమంతా కాస్త ఎడంగా, దూరంగా నిల్చొని, అందరితో పాటు ఆయన మాటలు విన్నారు. ఏయన్నార్‌ తాను చెప్పదలుచుకున్నది చెప్పిన తరువాత, ఇక ప్రత్యేకించి ప్రశ్నలేమీ వద్దంటూ, మీడియా ప్రశ్నోత్తరాల ఘట్టాన్ని సున్నితంగా తోసిపుచ్చారు. ''మాట్లాడడానికి ఏముంది! క్యాన్సర్‌ గురించి మీ కన్నా నాకే ఎక్కువ తెలుసు'' అని వ్యాఖ్యానించారు. అయితే, ''ఆఖరు ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాను. అయితే, ఏ పాత్ర పడితే ఆ పాత్ర పోషించను. చిన్న పాత్రలైనా, నా వయస్సుకు తగిన మంచి పాత్రలైతే చేస్తాను'' అని వివరణ మాత్రం ఇచ్చారు. ''ఎందుకంటే, పని చేయడంలో నాకు సంతోషం ఉంటుంది. అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది'' అని అక్కినేని అందులోని అంతరార్థాన్ని చెబుతూ, ముగించారు.

ఉదయం నుంచే హంగామా
   శనివారం ఉదయం 9 గంటలకు ఏయన్నార్‌ అందరినీ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నారనీ, అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నారనీ శుక్రవారం సాయంత్రమే మీడియా అంతటికీ సమాచారమిచ్చారు. దాంతో, శనివారం ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో 'మనం' సినిమా చిత్రీకరణ జరుగుతున్న ఇంటి సెట్‌ బయట టీవీ చానళ్ళ ప్రత్యక్ష ప్రసార వాహనాలన్నీ బారులు తీరాయి. అక్కినేని ఏం చెబుతారన్నది అంచనాకు అందకపోవడంతో, దాదాపు నూట పాతిక మందికి పైగా మీడియా సిబ్బంది చర్చించుకోవడం కనిపించింది. ఏయన్నార్‌ తన మనసులో మాట చెప్పడం మొదలుపెట్టేసరికి, విలేఖరులు, చాలా మంది సినీ, స్టూడియో సిబ్బంది నిశ్శబ్దంగా అక్కినేని మాటలు వింటూ, రాసుకుంటూ, కెమేరాలో చిత్రీకరిస్తూ కనిపించారు. అక్కినేని ఎలాంటి తొట్రుపాటూ, భావోద్వేగాలూ లేకుండా నింపాదిగా తన అనారోగ్యం సంగతిని వెల్లడించారు. 

   ముందుగా తన నట, ఆరోగ్య జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆయన ఆనక అసలు విషయాన్ని నిబ్బరంగా ప్రకటించారు. మాట్లాడుతున్నంత సేపూ అక్కినేని ఏ మాత్రం భావోద్వేగాలకు లోను కాలేదు. వేసిన షామియానా, కుర్చీలు చాలకపోవడంతో, పలువురు మీడియా ప్రతినిధులే కాక, అక్కినేని కుటుంబ సభ్యులైన వెంకట్‌, నాగార్జున, అమల, నాగ చైతన్య, నాగసుశీల, తదితరులంతా సూర్య ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా పక్కనే ఎండలోనే నిల్చొని మరీ, బరువెక్కిన గుండెలతో అక్కినేని ప్రసంగాన్ని విన్నారు.
బయట ఇతరుల ద్వారా చూచాయగా విషయం తెలుసుకొని, ఎవరికి వారు తోచినట్లు వ్యాఖ్యానాలు చేసుకోకుండా ఉండేందుకు తానే ఈ విషయం మీడియా ద్వారా ప్రకటిస్తున్నట్లు అక్కినేని తన మాటల్లో చెప్పారు. 

నిజానికి, రెండు, మూడేళ్ళ క్రితం కూడా ఒకసారి అక్కినేని ఆరోగ్యంపై సినీ ఆంతరంగిక వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు మాత్రం సాక్షాత్తూ అక్కినేనే మీడియా ముందుకు వచ్చి, తన తాజా అనారోగ్యం గురించి నాటకీయంగా వెల్లడించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ''పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజుకు పోవాల్సిందే!'' అంటూనే ''మనోబలంతో పాటు, అభిమానుల ఆశీర్వాదఫలంతో నిండు నూరేళ్ళ తరువాత ఇలాగే మీడియా ఎదుట మాట్లాడాల''న్న ఆకాంక్షను అక్కినేని వెలిబుచ్చారు. అది నెరవేరాలనే సినీ అభిమానులందరి కోరిక!

- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 20 అక్టోబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................

''క్యాన్సర్‌.. ఎదుర్కొంటా'' - అక్కినేని నాగేశ్వరరావు


   సినీ ప్రియులైన అభిమానులకూ, ప్రేక్షకులకూ అక్కినేని నాగేశ్వరరావు అనగానే ఒక 'దేవదాసు', ఒక 'ప్రేమ్‌నగర్‌', ఒక 'ప్రేమాభిషేకం' - లాంటి ఎన్నెన్నో చిత్రాల్లో విలాసాన్నీ, విషాదాన్నీ ఏకకాలంలో పలికించిన ఓ అభినయ విశారదుడు గుర్తుకొస్తారు. ఓ ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉందంటూ శనివారం నాడు ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకంగా జర్నలిస్టులందరినీ పిలిపించి మరీ మీడియా సమావేశం నిర్వహించి నప్పుడు అప్రయత్నంగా విలేఖ రులందరికీ అలాంటి చిత్రాల తాలూకు సన్నివేశాలు, అభినయం గుర్తొచ్చాయి. ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్‌ వచ్చినట్లు వెల్లడైందంటూ బాంబు లాంటి వార్తను శనివారం ఉదయం అందరి ఎదుటా ఏయన్నార్‌ స్వయంగా బయటపెట్టారు. ఏయన్నార్‌ చేయబోయే ముఖ్యమైన ప్రకటన ఏమై ఉంటుందన్న దానిపై అప్పటి దాకా రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ వచ్చిన పత్రికా ప్రతినిధులకు ఇది ఊహించని వార్త అయింది. 
''అక్టోబర్‌ 8న కడుపులో నొప్పిగా అనిపించింది. దాంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నా. కేర్‌ ఆసుపత్రిలో, 'నిమ్స్‌'లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి అనేక రకాల పరీక్షలు వారం రోజుల పాటు చేశారు. ఎక్కడో నా శరీరంలో క్యాన్సర్‌ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు'' అని అక్కినేని వివరించారు. అయితే, క్యాన్సర్‌ వచ్చిందని ఖంగారు పడాల్సిన పనేమీ లేదనీ, క్యాన్సర్‌ వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవించినవాళ్ళు ఎందరో ఉన్నారనీ, దేశదేశాల్లోని అభిమానుల ఆశీస్సులుంటే, తన మనోబలంతో సంతోషంగా మరింత కాలం బతుకుతాననీ అన్నారు.
- రెంటాల జయదేవ 
..........................................

Friday, October 18, 2013

జీవన సమరంలో అసామాన్య విజేత రావూరి భరద్వాజ కన్నుమూత

- జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరణంతో చిన్నబోయిన తెలుగు సాహితీ లోకం 

- అవార్డు ప్రకటించిన సరిగ్గా ఆరు నెలలకు, అవార్డందుకున్న వారం రోజులకే మరణం


ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ కన్నుమూశారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అక్టోబర్ 18 శుక్రవారం నాడు రాత్రి 8.35 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 

మనదేశంలో సాహిత్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారంగా పేరందుకున్న జ్ఞాన్‌పీఠ్‌ ఆయనను వరించినట్లు ఇవాళ్టికి సరిగ్గా ఆరు నెలల క్రితం ఏప్రిల్‌ 17న ప్రకటన వెలువడింది. మొన్న అక్టోబర్‌ 11న శుక్రవారం నాడు ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయన ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బుతో సహా వివిధ అనారోగ్యాలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో 48వ జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న సరిగ్గా వారం రోజులకే తన 87వ ఏట శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. 

కన్నుమూయడానికి సరిగ్గా వారం రోజుల క్రితం జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకుంటూ...
పదిహేడో ఏట నుంచి రచన చేయడం ప్రారంభించిన ఆయన గడచిన 70 ఏళ్ళుగా విస్తారంగా సాహితీ సృజన సాగిస్తూ వచ్చారు. ఈ ఏడు దశాబ్దాల విశిష్ట సాహిత్య సేవలను గుర్తించి, వాటన్నిటి సమష్టి ఫలంగా 2012వ సంవత్సరానికి గాను ఆయనను జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు ఎంపిక కమిటీ పేర్కొంది. (మొదట ప్రచారం జరిగినట్లు, చాలామంది పొరబడుతున్నట్లు ఆయనకు కేవలం 'పాకుడు రాళ్ళు' నవలకు గాను ఆ అవార్డు ఇవ్వలేదు). 

తెలుగు సాహిత్యంలో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, ఆధునిక కవి సి. నారాయణరెడ్డి తరువాత ఈ ప్రసిద్ధ అవార్డును అందుకున్న మూడో వ్యక్తి - భరద్వాజ. అదే సమయంలో తెలుగునాట కథ, నవలా సాహిత్యం ద్వారా ఈ అవార్డును సాధించిన తొలి రచయిత మాత్రం ఆయనే! 

కేవలం ఏడో తరగతి వరకే చదువుకొని, సాహిత్యంలో ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం, తన రచనల మీద ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగే దశకు చేరడం భరద్వాజ విశిష్టత. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, ఒకప్పుడు పిడికెడు అన్నం, జానెడు వస్త్రం కోసం నానా అగచాట్లూ పడిన ఓ సామాన్య వ్యక్తి ఆయన. అక్కడ నుంచి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ, స్వయంకృషితో పైకి వచ్చారు. అందుకే, ఆయన రచనల్లో ప్రధానంగా అట్టడుగు వర్గాల జీవితాన్నీ, వారి జీవన సమరాన్నీ ప్రతిఫలించారు. 

అప్పటి హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన పరిటాల జాగీర్‌లోని మోగులూరు గ్రామంలో (ఇప్పుడు కృష్ణాజిల్లాలో ఉంది) 1927 జూలై 5న ఆయన జన్మించారు. తండ్రి పేరు కోటయ్య. తల్లి పేరు మల్లికాంబ. గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో పెరిగారు. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా పనిచేశారు. పశువులను కాశారు. పనివాడిగా రంపం లాగారు. తుత్తులు ఊదే కూలీగా, ఇంటింటికీ పత్రికలు వేసే పేపర్‌ బాయ్‌గానూ కష్టపడ్డారు. 

పదిహేడో ఏట నుంచి చనిపోయే ముందు కొన్నేళ్ళ వరకు ఆయన అవిశ్రాంతంగా రచనలు చేశారు. 1946 ఆగస్టు ఆఖరువారం 'ప్రజామిత్ర' పత్రికలో అచ్చయిన 'విమల' ప్రచురితమైన ఆయన తొలి కథ. ఇక, అచ్చయిన ఆయన తొలి పుస్తకం - 'రాగిణి' (1950). అప్పటి నుంచి ఆయన ఎన్నో కథలు, నవలలు రాశారు. ధనికొండ హనుమంతరావు లాంటి రచయితల ప్రోత్సాహం, ప్రోద్బలంతో పైకి వచ్చిన ఆయన సినిమా జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1956 నుంచి దినచర్యను డైరీలో రాసే అలవాటున్న ఆయన జర్నలిస్టుగా తాను చూసిన పలువురు సినిమా వ్యక్తుల జీవితంలోని చీకటి వెలుగులను ఆధారంగా చేసుకొని, 'పాకుడు రాళ్ళు' నవల రాశారు. ఆ నవలతో పాటు 'కాదంబరి' లాంటి ఆయన రచనలు సుప్రసిద్ధం.  


అలాగే, సమాజంలోని వివిధ వృత్తులకు చెందిన సామాన్యుల జీవిత చిత్రాలను కలం చిత్రాలుగా మలిచి, ఆయన రాసిన ఫీచర్‌ 'జీవన సమరం' ఓ పెద్ద సంచలనం. అప్పటికీ, ఇప్పటికీ బడుగు జీవుల బతుకు చిత్రానికి ఓ సాహితీ రికార్డు. విద్యార్హతలతో సంబంధం లేని ఆయన ప్రతిభ  ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించి పెట్టింది. చాలాకాలం ఆకాశవాణి - హైదరాబాద్‌ కేంద్రంలో పనిచేసిన ఆయన తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఉద్యోగ విరమణ చేశారు. 

ఆయనకు 1968లోనూ, 1983లోనూ మొత్తం రెండు సార్లు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే, 1987లో 'సోవియట్‌ ల్యాండ్‌ - నెహ్రూ' అవార్డు, అదే ఏడాది భారతీయ భాషా పరిషత్‌ వారి అవార్డు వరించాయి. ఇంకా ఎన్నో అవార్డులందుకున్న రావూరిని మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చి, గౌరవించాయి. ఆయన రచనలపై నాలుగు యూనివర్సిటీల్లో పిహెచ్‌.డి. స్థాయి పరిశోధనలు, అయిదు యూనివర్సిటీల్లో ఎం.ఫిల్‌ స్థాయి పరిశోధనలు జరిగాయి. 

ఇక, ఆయన రచనలు అనేకం ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోకి అనువాదమయ్యాయి. బాలసాహిత్యంలోనూ విశేష కృషి చేసి, ఇటీవలే జ్ఞానపీఠంతో తెలుగు సాహితీకారులను గర్వించేలా చేసిన రావూరి మృతితో తెలుగు సాహితీ లోకం చిన్నబోయింది. పలువురు రాజకీయ, సాహితీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. 

..................................

ప్రేక్షకుల మీదకే... 'దూసుకెళ్తా' (సినిమా సమీక్ష)  గడచిన పదేళ్ళ కెరీర్‌లో 'డీ' అనే సూపర్‌ హిట్టు, 'దేనికైనా రెడీ' అనే మరో సక్సెస్‌లు మాత్రమే సాధించిన హీరో మంచు విష్ణువర్ధన్‌ బాబు. గత ఏడాది రిలీజైన 'దేనికైనా రెడీ' విజయవంతమైనా, ఆ చిత్రాన్ని బోలెడన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఆ వివాదాస్పద విజయం తరువాత విష్ణు చేసిన మరో ప్రయత్నం ఈ 'దూసుకెళ్తా'. వినోదం నిండిన ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆయన తండ్రి మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, వినోదం పంచాల్సిన ఈ చిత్రం  ఆ లక్ష్యాన్ని సాధించకపోవడమే వింత!
.............................................................
చిత్రం - దూసుకెళ్తా, తారాగణం - మంచు విష్ణు, లావణ్యా త్రిపాఠీ, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, మాస్టర్ భరత్, నాగినీడు, సంగీతం - మణిశర్మ, పాటలు - రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, స్క్రీన్ ప్లే - వీరు పోట్ల, గోపి మోహన్, కెమేరా - సర్వేష్ మురారి, కూర్పు - మార్తాండ్ కె. వెంకటేశ్, నిర్మాత - ఎం. మోహన్ బాబు, కథ, మాటలు, దర్శకత్వం - వీరు పోట్ల
............................................................

కథా రచయితగా 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!' లాంటి చిత్రాల ద్వారా క్రేజ్‌ సంపాదించుకున్న వ్యక్తి - వీరు పోట్ల. ఆ విజయాల తరువాత దర్శకుడిగా మారిన వీరు ఇప్పటికే 'బిందాస్‌' అనే హిట్‌, 'రగడ' అనే యావరేజ్‌ చిత్రాలు చేశారు. కొద్దికాలం విరామం తరువాత, మునుపటి గ్రాఫ్‌లో నుంచి పైకి ఎదిగేందుకు రాసుకొన్న కథ, తీసిన సినిమా 'దూసుకెళ్తా'. సర్వసాధారణంగా తన సినిమాల్లో అనుసరించిన పద్ధతిలోనే ఇందులోనూ ఆయన చిన్న పిల్లల కథతో మొదలుపెట్టి, ఆ చిన్న పిల్లలే పెద్దయ్యాక కథానాయకుడు, కథానాయిక- అంటూ అలవాటైన రీతిలో కథ నడిపారు. 
తిరుపతి దగ్గర ఓ పల్లెటూళ్ళో పలుకుబడి, ఆస్తిపాస్తులున్నఓ కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద పిచ్చేశ్వరరావు (కోట శ్రీనివాసరావు). ఆ ఇంటి వారసుడు (రావు రమేశ్‌) ఓ కులాంతర వివాహం చేసుకుంటాడు. చిన్ని (బేబీ యానీ) అనే ఓ కూతురినీ కంటాడు. ఆ ఊళ్ళోని మరో ఇంటి అబ్బాయి చిన్నా. ఆ పిల్లలిద్దరికీ స్నేహం. ఇంతలో చిన్నినీ, ఆమె తల్లినీ ఇంట్లో నుంచి పంపేస్తారు. మరో సంఘటనతో చిన్నా కుటుంబం కూడా ఆ ఊరి నుంచి పరారై పోవాల్సి వస్తుంది. పెరిగి పెద్దయిన చిన్నాయే చిత్ర కథానాయకుడు (మంచు విష్ణు). అలాగే, ఊళ్ళో నుంచి వెళ్ళిపోయిన చిన్ని కాస్తా చదువుకొని డాక్టర్‌ అలేఖ్య ('అందాల రాక్షసి' ఫేమ్‌ లావణ్యా త్రిపాఠీ) అవుతుంది. 
వాళ్ళిద్దరూ అనుకోకుండా కలుస్తారు. ఆమెను ప్రేమించిన హీరో, ఆ క్రమంలో ఆమెను చంపడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాడు. ఆమెను చంపాలనుకుంటున్నది సాక్షాత్తూ ఆమె తాత తరఫు బంధువులేనని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయిని తీసుకొని, ఆ ఊరే వెళ్ళి వాళ్ళను ఎలా మార్చాడన్నది మిగతా కథ. ఆస్తులు, అంతస్థులు ఎన్ని ఉన్నా, మనుషులకు కావాల్సింది మంచితనం, అనుబంధం, ఆప్యాయత అని సినిమా చివరాఖరుకు సందేశం ఇస్తుంది. 
మొదలైన కాసేపు బాగానే ఉందనిపించే ఈ చిత్రం క్రమంగా పట్టు సడలిపోతుంది. కథ హైదరాబాద్‌ నుంచి పల్లెటూరికి మారాక కనీసం ద్వితీయార్ధమైనా బాగుంటుందేమో అనిపించినా, ఆ తరువాత ఆ ఆశా సన్నగిల్లుతుంది. హీరోనూ, అతని కుటుంబాన్నీ వెతుకుతూ, ఓ రాజకీయ నేత పాద యాత్రలు జరపడం లాంటి అర్థం పర్థం లేని సీన్లతో ఈ సినిమా ఓ నిర్దిష్టమైన రీతిలో నడవదు. అసలు కథలో బోలడెన్ని పిల్ల కథలు, పిట్టకథలు, సన్నివేశాలు వచ్చి వెళుతుంటాయి. అందులో ప్రభావశీలంగా ఉన్నవి తక్కువ. ఇంకా చెప్పాలంటే, అసలు కథకు పెద్దగా పనికొచ్చేవి అంత కన్నా తక్కువ. 
సినిమాలో పిల్లల కథ వస్తుంది. ఆ తరువాత హీరోను ఓ టీవీ చానల్‌ ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌ అన్నట్లు కాసేపు చూపించారు. ఆ వెంటనే అతనేదో ప్రేమ కోసం అమ్మాయి వెంట పడుతున్నాడన్నారు. యాక్సిడెంటైన తనను కాపాడిన ఆ అమ్మాయిని తాను కాపాడుతున్నాడని చూపారు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రియుణ్ణీ కలపాలని చూశాడంటారు. సెకండాఫ్‌కు వచ్చేసరికి, అదే హీరో ఆ అమ్మాయినీ, ఆమె కుటుంబాన్నీ కలపడానికి చూశాడన్నారు. వెరసి, ఎప్పటికప్పుడు హీరో పాత్ర లక్ష్యం, లక్షణం మారిపోతూ ఉంటుంది. దీంతో, కథ ఇష్టారాజ్యంగా అటూ ఇటూ వంకర టింకరలు తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. 
ఇక, ఊళ్ళోని పొలాలతో సహా, ఆస్తి అంతా తాత (నాగినీడు) తన మనుమరాలైన కథానాయిక పేరు మీద రాస్తాడు. కాబట్టి, ఆమెను చంపడానికి విలన్లు ప్రయత్నించారని చూపుతారు. ఆ చంపడం వల్ల ఆ పొలాలు, ఆస్తి వాళ్ళ పేరు మీదకు రావు కదా! ఇవన్నీ ఇలా ఉంటే, పచ్చి విలన్‌ అయిన కోట శ్రీనివాసరావు సెకండాఫ్‌లో అలా మారిపోవడం కానీ, అతని కొడుకైన మంత్రి ఢిల్లీశ్వర్‌ (కొత్త నటుడు పంకజ్‌ త్రిపాఠీ) లాంటి పాత్రల్లో పరివర్తన కానీ ఎక్కడా కన్విన్సింగ్‌గా అనిపించదు. 


ప్రేక్షకులు ఈ సినిమాలో ఏ పాత్ర ఎవరికి తల్లో, తండ్రో, బాబాయో చెప్పగలిగితే, వాళ్ళకు కచ్చితంగా బహుమతులు ఇవ్వవచ్చు. తెర నిండా అన్ని పాత్రలు, అంతమంది పాత్రధారులు ఉన్నారు. కానీ, ఆ పాత్రలన్నీ ఆ యా సీన్లను ఫరవాలేదనిపించినవే తప్ప, సినిమాను పండించినవి కావు. ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం, ముగించిన తీరు కూడా అంతంత మాత్రమే! 
పదేళ్ళ తరువాత కూడా ఇప్పటికీ అభినయం, డైలాగ్‌ డెలివరీ మెరుగుపరుచుకోవాల్సిన స్థితిలోనే ఉన్న మంచు విష్ణు ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్ల విషయంలో బాగా శ్రమించారు. అది తెరపై కనిపిస్తుంది. ఇక, అందం, అభినయం రెండూ లేని హీరోయిన్‌తో సినిమాకు ఒరిగిందేమీ లేదు. భార్యా బిడ్డల్ని పోగొట్టుకొని తాగుబోతుగా మారిన పాత్రలో రావు రమేశ్‌ కొత్తగా కనిపిస్తారు. కోట శ్రీనివాసరావు తదితరులు తమకు అలవాటైన రీతిలో నటించి, పాత్రల్ని పోషించేశారు. ఇక, సినిమాలో బ్రహ్మానందం, ఆలీ, 'వెన్నెల' కిశోర్‌ , రఘుబాబు, మాస్టర్‌ భరత్‌ - ఇలా చాలామంది వినోదం పండించడానికి ఉన్నా, తెరపై పండిన వినోదం మటుకు తక్కువే! 
సినిమాకు రవితేజతో వాయిస్‌ ఓవర్‌ చెప్పించడం, టైటిల్‌ సాంగ్‌లోని సాకీలో మంచు లక్ష్మీ ప్రసన్నతో గెస్ట్‌ అప్పీయరెన్స్‌ వేయించడం లాంటివన్నీ సినిమాకు అవసరం లేకపోయినా, అద్దుకున్న అదనపు హంగులు. మొదలైన వాయిస్‌ ఓవర్‌ కూడా అర్ధంతరంగానే ముగిసిపోవడంతో ఆశించిన ప్రయోజనం కూడా సిద్ధించ లేదు. టైటిల్‌ సాంగ్‌తో పాటు మరొక్కటి మినహా మిగిలిన పాటలేవీ గుర్తుండని ఈ చిత్రంలో ఉన్నంతలో చెప్పుకోదగ్గవి - ఛాయాగ్రహణం, థాయిలాండ్‌కు చెందిన ఫైట్‌ మాస్టర్‌ కిచ లాంటి వాళ్ళు కంపోజ్‌ చేసిన ఫైట్లు లాంటి ఒకటి రెండు మాత్రమే. 

మొత్తం మీద, టైటిల్‌లో ఉన్న వాడి వేడి సినిమాలో, అందులోనూ ప్రత్యేకించి కథనంలో అసలే లేవు. హిందీ చిత్రం 'తేజాబ్‌' ను తెలుగు తెరపై 'వర్షం' చిత్రకథగా, కాజల్‌ - సల్మాన్‌ ఖాన్‌ నటించిన మరో హిందీ చిత్రాన్ని తెలుగు తెరకు కావాల్సినట్లు మలుచుకొని 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రకథగా అందించిన వీరు పోట్ల దర్శకుడిగా మారినా రాతకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లున్నారు. కానీ, మదగజం లాంటి మహారచయితకు కూడా అంకుశం లాంటి నిర్మాతలు లేకపోతే, సీన్లు ఎంతగా పెరిగిపోతాయో తెలుసుకోవడానికి ఈ సినిమాయే నిదర్శనం. 
అందుకే, కథలో కానీ, కథనంలో కానీ పట్టు లేకుండా సీన్ల వెంట సీన్లుగా సినిమా ఏకంగా రెండుగంటల నలభై నిమిషాల పైచిలుకు నడుస్తుంది. ఇప్పటికే చూసేసిన అనేక సినిమాలు, సన్నివేశాలతో విసుగనిపిస్తుంది. ఏమైనా, ఇటీవల తెలుగులో దర్శకులుగా మారిన రచయితలందరూ దాదాపుగా ఒకటే రకమైన కథలతో, ఎప్పుడూ వైవిధ్య రహితంగా సినిమాలు తీయడం విచిత్రం. అలాంటి వాటిలో ఒకటిగా 'దూసుకెళ్తా' మిగిలిపోయింది. 

కొసమెరుపు: హాలులో నుంచి బయటకు వస్తూ, ఓ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు తన స్నేహితుడితో ఫోన్‌లో - ''వచ్చేటప్పుడు 'దూసుకెళ్తా' అని వచ్చినా, తీరా సినిమా అయ్యాక మాత్రం ఎవరైనా 'మోసుకెళ్ళా'ల్సిందే!'' అనడం వినిపించింది. అంటే, సినిమా దూసుకెళ్ళింది అక్షరాలా హాలుకొచ్చిన ప్రేక్షకుల మీద నుంచా!? -

- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 18 అక్టోబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 8లో ప్రచురితం)
..............................................................

Thursday, October 17, 2013

మహేశ్‌బాబు కొత్త చిత్రం...కొరటాల శివ దర్శకత్వంలో... 'యు' టి.వి.తో!

    హీరో మహేశ్‌బాబు తరువాత సినిమా ఏమిటి? దీనికి సంబంధించి ఇటీవల రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే, ఆ ఊహాగానాలకు ఇప్పుడు తెరపడింది. సెట్స్‌ మీద ఉన్న '1', 'ఆగడు' కాకుండా మూడో సినిమాకు ఆయన పచ్చ జెండా ఊపారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'యు' టి.వి.తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని 'ప్రజాశక్తి'కి తెలిసింది. 

'మిర్చి' చిత్ర ఫేమ్‌ అయిన దర్శక - రచయిత కొరటాల శివ దర్శకత్వంలో ఆ చిత్రం తెర కెక్కనుంది. వచ్చే ఏడాది జూలై - సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. మరో రెండు, మూడు రోజుల్లో 'యు' టి.వి. కార్పొరేట్‌ కార్యాలయం అధికారికంగా ఈ సంగతిని ప్రకటించనుంది.

నిజానికి, మహేశ్‌ హీరోగా ఓ పక్క సుకుమార్‌ దర్శకత్వంలో తయారవుతున్న '1 (నేనొక్కడినే)' చిత్రం ఇప్పటికే సుదీర్ఘ కాలంగా షూటింగ్‌లోనే ఉంది. ఆ చిత్రంతో పాటు మరో పక్క శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రానికి కూడా మహేశ్‌ సర్వవిధాలా సన్నద్ధమయ్యారు. కానీ, ఈ రెండు చిత్రాల్లో ఏదీ ఈ ఏడాది విడుదలయ్యే సూచనలు లేవు. దాంతో, ఈ ఏడాది మొదట్లో రిలీజైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తప్ప ఇప్పటి దాకా మరో సినిమాయే విడుదల కాని మహేశ్‌ ప్రేక్షకుల నుంచి అనుకోకుండా సుదీర్ఘ విరామం తీసుకున్నట్లయింది. అప్రమత్తమైన మహేశ్‌ ఇక పైన ఇలాంటి పొరపాటు పడకుండా ఉండాలని తగిన జాగ్రత్త తీసుకుంటున్నారు. అందుకే, ఆయన సెట్స్‌ మీద రెండు సినిమాలు ఉండగానే, ముచ్చటగా ఈ మూడో సినిమాకు కమిటైపోయారు. మరి, కొరటాల శివ - కార్పొరేట్‌ సంస్థ 'యు' టి.వి.ల కాంబినేషన్‌లో మహేశ్‌ ఏం చేస్తారో వేచి చూడాలి.

(Published in 'Praja Sakti' daily, 17th Oct 2013, Thursday, Page no.8)
...........................................................

‘‘తెలుగు సినిమా ఇంకా ఎంతో వెనుకబడే ఉంది!’’ - దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

- నా ఓటు ‘లంచ్‌ బాక్స్‌’కే! మెజారిటీ నిర్ణయం గుజరాతీ చిత్రానికి!
 - వందేళ్ళలో మనం కనిపెట్టిన టెక్నాలజీ ఏంటి?
 - అంతర్జాతీయ విపణిలో విస్తరణలోనూ మన సినిమా వెనుకే!

(దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌తో ‘ప్రజాశక్తి’ ప్రత్యేక ఇంటర్వ్యూ) 


ఆయన బెంగాలీ. కానీ, ఆయన తొలి చిత్రం ` తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ దర్శకుడు అటుపైన జాతీయ, అంతర్జాతీయ సినీ వేదికపై తన సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ దర్శకుడైన ఆయన మన ‘మా భూమి’ చిత్ర ఫేమ్‌ గౌతమ్‌ ఘోష్‌. విదేశీ చలనచిత్ర విభాగంలో ఆస్కార్‌ అవార్డుకు తుది భారతీయ ఎంట్రీగా తాజాగా గుజరాతీ చిత్రం ‘ది గుడ్‌ రోడ్‌’ను ఎంపిక చేసిన జ్యూరీకి ఆయనే చైర్మన్‌. హిందీ చిత్రం ‘లంచ్‌ బాక్స్‌’ బదులు ఆ సినిమా ఎంపిక వివాదాలకి దారి తీసింది. తాజాగా చెన్నైలో నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాలకు వచ్చి, రాష్ట్రపతి నుంచి భారతీయ సినీ ప్రముఖుల్లో ఒకరిగా సత్కారం అందుకున్న గౌతమ్‌ ఘోష్‌తో ‘ప్రజాశక్తి’ జరిపిన ప్రత్యేక భేటీ...

ప్రశ్న: తెలుగు సినిమా ప్రమాణాలు బాగా లేవని మీరు చేసిన కామెంట్‌పై వివరణ ఇస్తారా?

జవాబు: చూడండి. తాజాగా ఆస్కార్‌లో విదేశీ చలనచిత్ర విభాగంలో భారతీయ ఎంట్రీని ఎంపిక చేసిన జ్యూరీకి నేను అధ్యక్షఁణ్ణి. సినిమాల స్క్రీనింగ్‌లో వచ్చిన వివిధ భాషా చిత్రాలను ఇతర సభ్యులతో కలసి చూశాను. అలా తెలుగు ఎంట్రీలను కూడా చూడడం జరిగింది. అప్పుడు నాకు కలిగిన అభిప్రాయాన్నే చెప్పాను. 

ప్రశ్న: ఇతర భాషా చిత్రాలను కూడా చూసి ఉంటారు కదా! కానీ, తెలుగు మీదే...

జవాబు: (సగంలోనే అందుకుంటూ...) అవును మిగిలిన భాషలవీ చూశాను. అయితే దురదృష్టవశాత్తూ, తెలుగులో వచ్చిన ఎంట్రీలు మలయాళ, తమిళ, మరాఠీ, గుజరాతీ చిత్రాలతో ఏ మాత్రం పోటీపడేలా లేవు. నిజానికి, తెలుగన్నా, ఆ భాషా చిత్రాలన్నా నా మనసులో ప్రత్యేక స్థానం, అమితమైన సానుభూతి ఉన్నాయి. నా తొలి సినిమాయే తెలుగు సినిమా కదా! ఎంట్రీలుగా వచ్చిన తెలుగు చిత్రాలను చూస్తే, కొన్ని మటుకు సాంకేతికంగా బాగున్నాయి. ఎంచుకున్న ఇతివృత్తాలూ బాగానే ఉన్నాయి. కానీ, వాటిని తెరపై చూపించిన విధానం ఇంకా ఎంతో మెరుగుపడాలి. ఇతర దక్షిణాది భాషా చిత్రాలతో పోలిస్తే, తెలుగు సినిమాలు చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పడానికి విచారిస్తున్నాను.

ప్రశ్న: తెలుగులో ‘మిథునం’ లాంటి కొన్ని సినిమాలు మీరు చూసి ఉంటారు కదా! 

జవాబు: అదే చెబుతున్నా. కొన్ని ఇతివృత్తాలు బాగున్నాయి. అందమైన కథలను తెరపై చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ చిత్రాన్ని ఇష్టపడ్డారు కూడా! కానీ, ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే, వాటికి దీటుగా ఈ చిత్రాల ప్రమాణాలు లేవు. వాటితో పోటీలో ఇవి పై స్థాయికి చేరలేదు. తమిళం నుంచి కమలహాసన్‌ ‘విశ్వరూపం’, మలయాళం నుంచి ‘సెల్యులాయిడ్‌’, గుజరాతీ నుంచి ‘ది గుడ్‌ రోడ్‌’, హిందీ నుంచి ‘లంచ్‌ బాక్స్‌’ ఇలా  చాలానే చూశాం. ‘విశ్వరూపం’, ‘సెల్యులాయిడ్‌’ లాంటివి బాగున్నా, తుది దశకు చేరలేకపోయాయి.

ప్రశ్న: తెలుగు, తదితర భాషా చిత్రాలను మీరు రెగ్యులర్‌గా చూస్తుంటారా?

జవాబు: దురదృష్టవశాత్తూ, కలకత్తాలో ఇవి విడుదల కావు. అందుకని అన్నీ రెగ్యులర్‌గా చూడడం కుద రదు. కాకపోతే, ఇండియన్‌ పనోరమా, ఇతర చలనచిత్రోత్సవాలకు వచ్చినప్పుడు చూడడం జరుగుతోంది. కాబట్టి, ఆ యా ప్రాంతీయ భాషా ఫిల్మ్‌ ఛాంబర్లు తమ ప్రాంతం నుంచి ఎంతో మంచి చిత్రాలను, నిష్పక్షపాతంగా ఎంపిక చేసి, వాటినే ఎంట్రీలుగా పంపాలి. అయితే, ఆస్కార్‌తో సహా అనేక వాటికి ఇక్కడకు ఎంట్రీలుగా రాని మంచి చిత్రాలు కూడా కొన్ని ఉండి ఉండవచ్చు.

ప్రశ్న: మరి, అలాంటి సినిమాలను మిస్సయ్యే అవకాశం ఉంది కదా!

జవాబు: అందుకనే, నేను, దర్శకుడు అదూర్‌ గోపాలకృష్ణన్‌, ఇంకా కొందరం ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అభ్యర్థన పెట్టాం. 1980లు, ’90లలో దూరదర్శన్‌లో ఆదివారం మధ్యాహ్నవేళల్లో ఒక్కో వారం ఒక్కో భాషలోని ఉత్తమ చిత్రాలను ప్రసారం చేసేవారు. ఆ పద్ధతిని మళ్ళీ ప్రవేశపెట్టాలని కోరాం. అందుకు అంగీకరించారు. అది త్వరలోనే మళ్ళీ మొదలవుతోంది. 


ప్రశ్న: అందరూ ‘లంచ్‌ బాక్స్‌’ మీద ఆశలు పెట్టుకుంటే, అది ఎంపిక కాలేదే!

జవాబు: ‘లంచ్‌ బాక్స్‌’ నాకు ఎంతో నచ్చింది. నేనైతే అదే అనుకున్నాను. ‘ది గుడ్‌ రోడ్‌’ కూడా నాకు నచ్చింది. ఇక, శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ - వింగ్లిష్‌’, బెంగాలీ చిత్రం ‘శబ్ద్‌’ లాంటివి కూడా పోటీ పడ్డాయి. తుది దశలో ‘లంచ్‌ బాక్స్‌’, ‘ది గుడ్‌ రోడ్‌’లు పోటీలో నిలిచాయి. చివరకు ‘ది గుడ్‌ రోడ్‌’ను జ్యూరీ ఎంపిక చేసింది. నేను వ్యక్తిగతంగా ‘లంచ్‌ బాక్స్‌’ వైపు మొగ్గినా, జ్యూరీ అంటే నేనొక్కణ్ణే కాదు కదా! మరో 15 మంది సభ్యులున్నారు. చివరకు మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం జరుగుతుంది. ఇదీ అలానే జరిగింది. ఏమైనా, ‘లంచ్‌ బాక్స్‌’ ఓ విలక్షణమైన చిత్రం. 

ప్రశ్న: ఆస్కార్‌ బరిలో రేపు ‘లంచ్‌ బాక్స్‌’తో పోలిస్తే, ‘ది గుడ్‌ రోడ్‌’కు ఉన్న ప్రతికూలతలు ఏంటి?


జవాబు: ‘లంచ్‌ బాక్స్‌’ గనక ఎంట్రీగా వెళ్ళి ఉంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే, ఇప్పటికే అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఆ సినిమాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలాగే, ‘సోనీ పిక్చర్స్‌ క్లాసిక్స్‌’ లాంటి అంతర్జాతీయ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌, మంచి తారాగణం దానికి ఉంది. కాబట్టి, ఆస్కార్‌ జ్యూరీకి సులభంగా నచ్చజెప్పవచ్చు. ఎవరికీ తమ సినిమా గురించి పెద్దగా తెలియదు కాబట్టి, ‘ది గుడ్‌ రోడ్‌’ చిత్ర నిర్మాతలు అంతర్జాతీయంగా అందరి దృష్టీ తమపై పడేలా చేసుకొనేందుకు చాలా శ్రమపడాల్సి ఉంటుంది. రాణ్‌ ఆఫ్‌ కచ్‌లోని వ్యక్తుల జీవితాలు, బాల్యంలోనే వేశ్యా వృత్తి లాంటి భారతీయ అంశాలెన్నో ఉన్న ఈ సినిమా కూడా ఎంతో బాగుంది. ‘లంచ్‌బాక్స్‌’ తరువాత ఎంట్రీల్లో ఇది రెండో ఉత్తమ చిత్రమని నా అభిప్రాయం. భావోద్వేగభరితమైన అంశాలెన్నో ఉన్నా, ఆస్కార్‌ బరిలో విజేతగా నిలవాలంటే సినిమాను మార్కెట్‌ చేసుకోవడం కూడా చాలా అవసరం. పైగా, జ్ఞాన్‌ కొరీ తీసిన ఈ చిత్రం మన దేశంలో రెండే వారాలు ఆడిందన్న సంగతి మర్చిపోకూడదు. ఏమైనా, మనది ఎంతో పెద్ద సినీ పరిశ్రమ కాబట్టి, థాయిలాండ్‌, శ్రీలంక, కొరియా లాంటి దేశాల లాగా మనమూ ఒకే ఎంట్రీ పంపితే ఎలా? ఆస్కార్‌ లాంటి అవార్డులకు మనం మరిన్ని ఎంట్రీలు పంపేందుకు ‘ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌.ఎఫ్‌.ఐ) కృషి చేసి, ఒప్పించాలి. ఒక్క సినిమానే పంపాలనే సరికి, ‘లంచ్‌ బాక్స్‌’ లాంటి మంచి చిత్రాలు ఆఖరు నిమిషంలో మిస్సయ్యే అవకాశం ఉంది. 

ప్రశ్న: కానీ, ఇంత పెద్ద భారతీయ సినిమా పరిస్థితి అంతర్జాతీయ విపణిలో ఏమిటంటారు?

జవాబు: ఇవాళ మన భారతీయ సినిమాలు దేశ, విదేశాలకు విస్తరించాయి. ముందుగా హిందీ సినిమాలు, ఆ తరువాత తమిళ, తెలుగు చిత్రాలు ఇప్పటికీ విదేశాల్లో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు మాత్రం ఇంకా అందులో వెనుకబడే ఉన్నాయి. అవి కూడా ఆ బాట పట్టాలి. ముఖ్యంగా, బెంగాలీ సినిమాలు తమ మార్కెట్‌ పరిధిని ఇంకా విస్తరించుకోవాల్సి ఉంది. ఆ మధ్య 2010లో నేను ‘మన్‌ ఔర్‌ మానుష్‌’ అనే చిత్రాన్ని సహ భాగస్వామ్యంలో తీశా. అలాంటివి ఇంకా రావాల్సి ఉంది. 

ప్రశ్న: నూరేళ్ళ పండుగ జరుపుకొంటున్న మన సినిమా మార్కెట్‌ సరే! నాణ్యత మాటేమిటి?

జవాబు: సంఖ్యా పరంగా చూస్తే, ఇవాళ భారతీయ సినిమా రంగం అత్యధిక సంఖ్యలో సినిమాలు తీస్తోంది. అయితే, రాశి ఉన్నా, వాసి మాత్రం అంతంత మాత్రమే. మన కన్నా అతి చిన్న సినీ పరిశ్రమ అయినా, ఇరాన్‌ సినీ పరిశ్రమలో మన సినిమాల కన్నా, ఎంతో మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ విషయంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 

ప్రశ్న: కానీ, టెక్నాలజీ పరంగా మనం ముందుకు పోయినట్లున్నాం! 

జవాబు: (కాస్త ఆవేదనగా...) మనం రకరకాల విదేశీ టెక్నాలజీలను బాగా వాడుకుంటున్నాం. సినిమాలు తీస్తున్నాం. కానీ, ఈ వంద ఏళ్ళలో, ఇంత పెద్ద సినీ పరిశ్రమగా మన వంతుగా టెక్నాలజీకి కొత్తగా అందించినది ఏమిటి చెప్పండి! కెమేరాలో కానీ, సౌండ్‌ టెక్నాలజీలో కానీ మనం ఏదైనా ఒక్క కొత్త పరిజ్ఞానం కనిపెట్టామా! లేదే! వాళ్ళెవరో కనిపెట్టినవి వాడుకుంటున్నాం. స్వతంత్రంగా మనం కనిపెట్టినవి ఏమీ లేవు. ఇది చాలా విచారకరం. ఇప్పటికైనా, మనం ఆ కృషి చేయాలి. 

ప్రశ్న: మనం ఇన్ని సినిమాలు తీస్తున్నాం. కానీ, వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకుంటున్నామా? ఈ నూరు వసంతాల వేళ అయినా ఏదైనా చేయాలి కదా!

జవాబు: అవును. మన దగ్గర సినిమాలు, వాటి నెగటివ్‌ల పరిరక్షణ మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఇన్ని భాషలు, ప్రాంతాల్లో ఏటా కొన్ని వందల చిత్రాలు తీస్తుంటే, ఒకే ఒక్క నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ ఎలా సరిపోతుంది! ఇప్పటికే మన విలువైన చిత్రాల నెగటివ్‌లు ఎన్నో నాశనమైపోయాయి. మరెన్నో ఆఖరు దశకు చేరుకున్నాయి. ఇప్పటికైనా, నిద్ర మేల్కొని, వాటిని కాపాడాలి. ఇందు కోసం ప్రతి రాష్ట్రంలో ఒక ఫిల్మ్‌ ఆర్కైవ్‌ పెట్టాలి. ఆ యా భాషల చిత్రాలను అక్కడ పరిరక్షించాలి. డిజిటల్‌ పద్ధతిలో పాత చిత్రాలను పునరుద్ధరించడం కూడా పెద్దయెత్తున చేయాలి. నా సినిమాలను రెంటినీ ఇప్పటికే డిజిటల్‌ రిస్టొరేషన్‌ చేశారు. ‘మా భూమి’ చిత్రాన్ని కూడా నిర్మాత, దర్శకుడు బి. నరసింగరావు డిజిటల్‌గా పునరుద్ధరించే పనిలో ఉన్నారు. అయితే, దీనికి ఎంతో కృషి చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు సరిపోవు. ఆ పని చేయకపోతే, మన మూకీ చిత్రాల కాపీల లాగే, మన అపారమైన సినీ సంస్కృతి, వారసత్వం భావితరాలకు అందకుండా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.  

ప్రశ్న: ఆఖరుగా, తెలుగు సినీ దర్శక, నిర్మాతలకు మీరిచ్చే సలహా?

జవాబు: తెలుగు సినీ రూపకర్తలు ఇప్పటికైనా మూసధోరణిలో నుంచి బయటకు రావాలి. మెరుగైన నాణ్యతతో కూడిన సినిమాలను అందించడానికి కృషి చేయాలి. తెలుగు ప్రాంతానికీ, భాషకూ ఎంతో గొప్ప సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. వాటిని ఆసరాగా తీసుకొని, మెరుగైన ఇతివృత్తాలతో, మెరుగైన చిత్రీకరణతో ముందుకు రావాలి. 

- చెన్నై నుంచి రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 26 Sept 2013, Thursday, Page No.8)
...........................................................

Wednesday, October 16, 2013

''నా పాత్రకు బ్రహ్మలు ఆ అయిదుగురు!'' - ఎన్‌.టి.రామారావునర్తనశాలలో బృహన్నల పాత్రపోషణపై సాక్షాత్తూ ఎన్టీయార్ యాభై ఏళ్ళ క్రితం చెప్పిన మనసులో మాట...

సాహసోపేతంగా బృహన్నల పాత్ర పోషించిన హీరో  పెద్ద ఎన్టీయార్‌ 'నర్తనశాల' ఇవాల్టితో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 1963 అక్టోబరు 11న దసరా కానుకగా ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించి, జాతీయ అవార్డుకు కూడా ఎంపికైంది. ఆ సందర్భంలో, తన మనసులో మాటను పత్రికా ముఖంగా పెద్ద ఎన్‌.టి.రామారావు పంచుకున్నారు. క్లిష్టమైన ఆ పాత్రపోషణ జనామోదం పొందడంలో తెరపై కనిపించే తన కృషితో పాటు తెర వెనుక ఉన్న మహానుభావుల శ్రమను ప్రత్యేకంగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ క్రితం ఆయన చెప్పిన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు నేటి పాఠకుల కోసం...

చిత్ర విజయంతో సిద్ధించిన ప్రతిష్ఠలో ప్రథమ తాంబూలం మా (దర్శకుడు) కమలాకర కామేశ్వరరావుగారిది. ఊహాతీతమైనది 'బృహన్నల' పాత్ర. ...భారతం రచించిన ఆ మహాకవే - 'ఇదీ' అని గుర్తుపెట్టి, వర్ణించి, విమర్శించి, రూపొందించని పాత్ర - బృహన్నల. (నిర్మాత) శ్రీమతి లక్ష్మీరాజ్యం గారు నన్నీ పాత్ర ధరించమన్న ప్పుడే నాకు దిగ్భ్రమ కలిగింది. 'ఇది పరిహాసమా' అన్నాను. ఆమె, 'కాదండీ! నిష్కల్మషంగా నేననుకున్నాను - మీరు ఆ పాత్రకు జీవం పోయగలరని! కనుక మీరు బృహన్నల పాత్ర ధరిస్తేనే నేనీ చిత్రం తీస్తాను. లేకపోతే లేదు' అన్నారు. రెండు రోజుల వ్యవధి కోరాను - నా నిర్ణయం తేల్చిచెప్పడానికి! 

ఒకే మథన - వేయాలా? వేయకూడదా? ఏదైనా చిత్రంలో రెండు, మూడొందల అడుగుల ఆడవేషం ధరించాల్సిన అవసరం కలిగితేనే నా మీద నాకు జుగుప్స వేసి, భయం కలుగుతుందే! మరి ఈ 13 వేల అడుగుల దీర్ఘంగా సాగిన పాత్ర నిర్వహణ ఎలా? విజయం సిద్ధించు కొనేదెలా? పైగా ఆ పాత్ర నిర్వహణతో ఆనాడు భారత వీరుడైన అర్జునుడు విజయంగా నడిపిన అజ్ఞాతవాస కథ - ఈనాడు ఈ నా పాత్ర ధారణతో అపజయమైతే? ఇవి నాలో చెలరేగిన భయాందోళ నలు. ఒక పక్క పేరుప్రతిష్ఠలు, మరోపక్క 'మీరే తగినవాళ్ళు. మీరు బృహన్నల వేష ధారణ చేయకపోతే చిత్రం ఆపుచేస్తామ'నే నిర్మాత మాటలు. ఏమిటి గత్యంతరం?

సరే! ఆనాటి కొక దృఢసంకల్పానికి వచ్చాను. (నిర్మాతలు) శ్రీ శ్రీధర్‌, శ్రీమతి లక్ష్మీరాజ్యం గార్లతో నా నిర్ణయం చెప్పాను - ''సరే! మీకీ సంకల్పం ఎలా కలిగిందో నాకు తెలియదు. నాకీ పరీక్ష ఎందుకు వచ్చిందో తెలియదు. నేను నటించిన శతాధిక చిత్ర నటనానుభం అండగా ఉంచుకొని, తప్పకుండా వేషధారణ చేస్తాను'' అని మాటిచ్చాను. 

ఇక ఆ నాటి నుంచి చిత్ర నిర్మాణం ఆఖరు వరకూ కొనసాగిన నా దీక్షలో నాకు అనుక్షణం అండగా నిలిచి, నా ఆవేశానికి అపశ్రుతి రానీయకుండా, నా భావాలకు రూపకల్పన చేసి, నాలో ఆ పాత్ర ఈనాడు రూపొందించుకున్న ఘనతకు కారణభూతులైనవారు అయిదుగురు (పంచ బ్రహ్మలు). 

రచయిత: ఇల్లాలుకు మాంగల్యం, ఇంటికి దీపం ఎంత జీవమో, అలాగే పాత్రకు ప్రాణం సంభాషణ. ..సందర్భ సన్నివేశాలకు అవసరమైన ఆవేశంతో, భావంతో, అందరికీ అర్థమయ్యేలా బృహన్నల మనోజ్ఞ ప్రవృత్తిని తెలియ జేసేది - సముద్రాల వారి సరస సంభాషణా చాతురి. ఇది వారి రసమయ సృష్టి. 

కళా దర్శకుడు: కవివర్యుల మానస వీధుల్లోని మూర్తికి ఆకృతి కల్పించి, అలంకరణ సల్పి, సజీవంగా ప్రేక్షకుల ప్రత్యక్ష సన్నిధిని ఈ పాత్రను నిలిపిన చాతురీ ధురీణుడు, ఊహోపాసనా శిల్పి - టి.వి.ఎస్‌. శర్మ గారు. 

అలంకరణ, వేషధారణ: కళాదర్శకుని కుంచె జాలులో రూపం కల్పించుకొని, లావణ్యతనూ, భావాన్నీ ముఖకమలం మీద రంగులతో లాలనగా అద్ది, నేనా? పాత్రా? అన్న విధంగా నా మీద ముద్ర వేసి, ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన కళాస్రష్ట - మేకప్‌ చీఫ్‌ హరిబాబు గారు.

చిత్రగ్రాహకుడు: పాత్రానుగుణ్యమైన రూపకల్పనకు, జ్యోతులతో నీరాజనం ఇచ్చి, చూపరులకు నయనానందంగా, సుజన కళాపోషకుల సన్నిధిని - నన్నీ స్థానంలో నిల్పిన చాతురీ ధురీణుడైన ఛాయాగ్రాహకుడు - ఎం.ఏ. రెహమాన్‌ గారు. మగ కాని మగటిమి, ఆడతనం చాటున తొణికిసలాడే ధీరోదాత్తత, చీకటి వెలుగుల సయ్యాటలలో చిద్విలాసంగా చిత్రించి, నాకు పరమార్థం దక్కించిన చిత్రకారుడు- ఈ కెమేరా శిల్పి. 

నృత్య దర్శకుడు: శాపప్రభావంతో రూపం మారినప్పుడు అధ్యాపకుడై, విరటుని 'నర్తనశాల'ను పునీతం చేసిన నాటి నాట్యాచార్యుడు (బృహన్నల) ఎక్కడీ నేటి నేనెక్కడీ (ఆ నాట్య విలాస ప్రదర్శనలో నాకు) ఏ కాస్త అయినా పరమార్థం దక్కితే, అది పారంపర్యంగా దేశానికి గురువులుగా నాట్యకళామ తల్లికి నీరాజనం పట్టే 'కూచిపూడి' వారి సాంగత్యం వల్లనే! ఆ ఘనతంతా వెంపటి వారి సత్యం గారిది!

నా పాత్ర నా అభిమానులనూ, కళాప్రియులనూ రంజింపజేసిందంటే - ఇందరి కళాకారుల అశేష ప్రజ్ఞా విశేషాలు దానికి బాసటగా నిలిచాయి గనకనే! 
ఇక, ఆ పాత్ర నిర్వహణలో నా ప్రజ్ఞ ఎంత ఉన్నదన్నది నా కన్నా కళాపోషకులైన ప్రజానీకానికే తెలుసు. వారి మన్ననలే నా భాగ్యం. వారి ఆనందమే నా ఆకాంక్ష. వారి తృప్తే నా ఆశయం.
సేకరణ - రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 11 అక్టోబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 8లో ప్రచురితం)
........................................................................

Saturday, October 12, 2013

హాలులో...ఆద్యంతం హింస - 'రామయ్యా వస్తావయ్యా!'  ఇవాళ పెద్ద హీరోలతో ఓ తెలుగు సినిమా అంటే దాదాపు 30 -40 కోట్ల రూపాయల సాహసం. అంత భారీ మొత్తంతో చేస్తున్న రిస్కు కాబట్టి, మిగిలినవాటి కన్నా ఇలాంటి చిత్రాల్లో కచ్చితంగా నటీనటుల అభినయ ప్రతిభకు ఆసరాగా నిలిచే మంచి కథ, కథనం, అత్యున్నత శ్రేణి ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌, వాటన్నిటినీ సమన్వయపరిచే అపూర్వమైన దర్శకత్వం - లాంటి  కొన్ని తప్పనిసరి. 

కానీ, వీటిల్లో అత్యధిక భాగం కలికానికైనా కనిపించకుండా సినిమా తీస్తే అది ఏమవుతుంది? ఫలితం మాటెలా ఉన్నా, అసలు ప్రయత్నమే పచ్చి దుస్సాహసం అవుతుంది. ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు, 'గబ్బర్‌ సింగ్‌' చిత్ర ఫేమ్‌ హరీశ్‌శంకర్‌తో కలసి చిన్న ఎన్టీయార్‌ హీరోగా చేసిన అలాంటి తాజా దుస్సాహసం - 'రామయ్యా వస్తావయ్యా!'


టైటిల్‌ ఎంతో సాఫ్ట్‌గా అనిపించినా తెర నిండా బోలెడంత హింసను పరిచేసిన సినిమా ఇది. కథగా చెప్పాలంటే, హీరో ఓ కాలేజీ స్టూడెంట్‌. ఏం చదువుతుంటాడో తెలియదు కానీ, ఎప్పుడూ ఓ నలుగురు స్నేహితుల్ని వెంటేసుకొని కబుర్లతో కాలక్షేపం చేస్తుంటాడు. మరో కాలేజీ విద్యార్థిని అక్షర (సమంత)ను చూసి ప్రేమ ముగ్గులో దింపుతాడు. ఆమె ద్వారా ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ శత్రువుల నుంచి హత్యాయత్నాలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ తండ్రి మొసళ్ళపాడు నాగభూషణం (ముఖేశ్‌ ఋషి)ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లే చేస్తూ అతణ్ణి చంపేస్తాడు. హీరో అలా ఎందుకు చేశాడన్న ఆసక్తికరమైన మలుపు దగ్గర 'వెయింట్‌ అండ్‌ సీ' అంటూ విరామం వస్తుంది. 

ఇక ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే హీరో పగ ప్రతీకారాల కథ మొదలవుతుంది. అది ఓ గంట నడుస్తుంది. ఆదిత్యపురం అనే గ్రామం. ఆ గ్రామంలో అమ్ములు (శ్రుతీహాసన్‌) అనే అమ్మాయి. ఆ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆమె ఆశయం.ఆమెకు హీరో ఎలా దగ్గరయ్యాడు, ఆ తరువాత ఆమెకు ఏమైంది, హీరో ఎందుకు పగతో రగిలిపోయాడన్నది ఆ కథలో తెలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ అయిన తరువాత శత్రుశేషాన్ని హీరో ఎలా అడ్డు తొలగించాడన్నది పతాక సన్నివేశం. 

'రామయ్యా వస్తావయ్యా!' అనే ఈ టైటిల్‌ చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రమనో, ఆ రకమైన కోవకు చెందిన సకుటుంబ వినోదమనో వెళితే, ప్రేక్షకులు తీవ్రమైన నిరాశకు గురవుతారు. సినిమా పూర్తిగా చూశాక, నిరాశకే కాదు అసంతృప్తికీ, అంతకు మించిన ఆవేశానికీ లోనవుతారు. ప్రాథమికంగా ఇది పగ, ప్రతీకారాల ఫార్ములా కథ. ఇలాంటి కథలు ఇప్పటికే ఎన్నో వచ్చేశాయి. ఆ మధ్య వచ్చిన 'బన్నీ' లాంటివి తాజా ఉదాహరణ. మళ్ళీ అలాంటి కథనే, 'గజిని' చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ హీరోయిన్‌ లాంటి అంశాలతో వండి వడ్డించారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. సినిమా నిండా నరుక్కోవడాలు, చంపుకోవడాలతో రెండు మ్ముప్పావు గంటల్లో ఎక్కువగా హింసనే పండించారు. 

ఈ సినిమాకు పేరు మటుకు పెట్టేసుకొని, కొన్ని సోకాల్డ్‌ పంచ్‌ డైలాగులు, సీన్లు రాసేసుకొన్నట్లున్నారు. వాటన్నిటినీ గుదిగుచ్చి, ఇదే సినిమా అన్నట్లు అందించారు. కథకూ, సినిమాకూ సంబంధం లేకపోవడం  చాలదన్నట్లు, ఈ సినిమాలో హీరో పేరు రాము, నందు ఇలా రకరకాలుగా వినబడుతూ ఉంటుంది. ఇక, టీజర్లలో వినిపించిన 'బుడ్డోడు...', 'పందాలు గుర్రాల మీద ఆడాలి. సింహాల మీద కాదు...' తరహా పంచ్‌లన్నీ సమయం, సందర్భం లేకుండా, సినిమాలో ఇరికించినట్లుండి, అసహనం కలిగిస్తాయి. అలాగే, 'దాన వీర శూర కర్ణ'లోని పెద్ద ఎన్టీయార్‌ సుప్రసిద్ధ సుదీర్ఘ సంభాషణ 'ఆచార్య దేవా! ఏమంటివేమంటివి...' అనే డైలాగ్‌ను కూడా సందర్భం లేని చోట చిన్న ఎన్టీయార్‌కు పెట్టారు. శక్తిమంతమైన ఓ మర ఫిరంగిని కూడా అనవసరంగా తుస్సుమనిపించేశారు. ఆ గెటప్పు కూడా అంతంత మాత్రమే! 

ఇక, కథలో లోపాల సంగతికొస్తే, హత్యాప్రయత్నం జరిగిన తరువాత ముఖేశ్‌ ఋషి ఇంట్లోని వాళ్ళు 'మేము ఎవరికీ ఏ పాపం చేయలేదు. మా మీద ఎవరికి ఇంత ద్వేషం? మమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేడా?' అని ఆక్రోశిస్తారు. కట్‌ చేస్తే, ఆ వెంటనే 'ఉన్నాను. నేనున్నాను' అంటూ సినిమాలో తొలిసారిగా తెరపైకి వస్తాడు చిన్న ఎన్టీయార్‌. అసలు ముఖేశ్‌ ఋషికే బద్ధశత్రువుగా తేలే హీరోను అలా అసంబద్ధంగా, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ఇంట్రడక్షన్‌ సీన్‌లో చూపారో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. 

అలాగే, ఓ పథకం ప్రకారం హీరోయిన్‌ను ప్రేమ ముగ్గులో దింపుతాడు హీరో. కానీ, అదేదో యాదృచ్ఛికంగా, ప్రకృతి సహకారంతో జరిగిపోయినట్లు చూపారు. ఇక, హీరోయిన్‌ వెంట బామ్మగా బేబీ షామిలి అన్న పేరుతో సీనియర్‌ నటి రోహిణీ హట్టంగడి కనిపిస్తుంది. ఆమెతో చేయించిన ముతకరకం ముసలి రొమాన్స్‌ ఓ జుగుప్స. ఆమెతో ఎలాంటి అభినయం చేయించారు, ఎలాంటి డైలాగులు చెప్పించారు లాంటి సంగతులు పక్కనబెట్టేసినా, ఆమె తాను పెద్ద ఎన్టీయార్‌ను చూసి ప్రేమలో పడి, పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయానంటుంది! మరి, ఆమె హీరోయిన్లకు బామ్మ ఏమిటో, ఎలాగో అన్నదీ స్పష్టత లేదు. పాటలే సినిమా భవితవ్యాన్ని తేల్చి వేస్తున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఈ సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండేలా లేకపోవడం, రీరికార్డింగ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉండడం విచిత్రం. హీరో, శ్రుతీహాసన్‌ల మీద వచ్చే 'నేనెప్పుడైన అనుకున్నానా...' పాట ఒక్కటే సాహిత్యపరంగా, సంగీతపరంగా ఫరవాలేదనిపిస్తుంది. మిగతా పాటల సాహిత్యమూ పెద్ద గుర్తుండేలానో, గొప్పగానో లేదు. ఎప్పటిలానే స్టెప్పులు బాగానే వేసిన ఎన్టీయార్‌ ఓ పాటలో సైకిల్‌ను పుచ్చుకొని దాన్ని లాగుతూ, స్టెప్‌ వేశారు. అది చూస్తే, నర్మగర్భ రాజకీయ సూచనలేవో సంకేతించినట్లు అనిపిస్తుంది. ఆర్టిస్టుల మేకప్పు, గడ్డాలు, లుక్కుల దగ్గర నుంచి కంటిన్యుటీల దాకా పలు లోపాలు కనిపించేసే ఈ చిత్రంలో ఎడిటింగ్‌ కూడా నాసిరకంగానే ఉండడం విచిత్రం. సరిగ్గా కట్‌ చేస్తే, సినిమా నిడివి కనీసం మరో 20 నుంచి 30 నిమిషాలు తగ్గేదేమో!

ఎన్టీయార్‌ చాలా కొత్తగా, తెర మీద చూడడానికి అందంగా బాగున్నారు. ప్రత్యేకమైన గెటప్‌ల గందరగోళం లేనప్పుడు ఇలాంటి యూత్‌ఫుల్‌ లుక్‌తో, తాజాగా కనిపించడం ఆయన కెరీర్‌కు ఉపయోగపడే అంశం. ఈ సినిమాకు కూడా అది కొంత చెప్పుకోదగ్గ అంశం. అయితే, అదే సమయంలో ఫైట్లకూ, ఎమోషన్లు పండించడానికీ, ఆఖరుకు కామెడీ కూడా హీరో నెత్తినే పడేస్తే, అది అందరు హీరోలకూ కుదరని పని ఈ చిత్రంలో తేలిపోయింది. 'బృందావనం', 'అదుర్స్‌' లాంటి చిత్రాలతో పోల్చేటంత కాకపోయినా, ఉన్నంతలో ఈ సినిమాలో తెరపై దృశ్యాలను అందంగా చూపారు సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె. నాయుడు. అతని పనితనం సినిమాకు ఓ ప్లస్. 

చిత్రం ఏమిటంటే, ఇంతటి అసమగ్ర ప్రయత్నానికి తెర వెనుక కష్టపడిన వాళ్ళ జాబితా సుదీర్ఘమైనది. ఒకరు రచనా సహకారం, ఇద్దరు స్క్రీన్‌ప్లే రచయితలు, ముగ్గురు స్టంట్‌ మాస్టర్లు, నలుగురు పాటల రచయితలు, అయిదుగురు డ్యాన్స్‌ డైరెక్టర్లు - ఇక టైటిల్స్‌లో కనిపించని ఎందరో పని చేసి కూడా ఇంత భారీ చిత్రాన్ని ఇలా అవకతవక ఖంగాళీగా రూపొందించారంటే, తప్పెవరిదనాలి? ముప్పెవరికి అనాలి? 

ఇప్పటికే, 'దమ్ము', 'బాద్‌షా' లాంటి వరుస ఎదురుదెబ్బలతో, రాజకీయంగా, కుటుంబపరంగా తెచ్చుకున్న ఇబ్బందులతో ప్రేక్షక వర్గాన్ని కూడా దూరం చేసుకొని సతమతమవుతున్న చిన్న ఎన్టీయార్‌ ఇప్పటికైనా ఆగి ఆలోచించుకోవడం మంచిది. హీరో కల్యాణరామ్‌కు హిట్‌ ఇచ్చారని దర్శకుడు సురేందర్‌ రెడ్డితో 'అశోక్‌', అలాగే అతనే రవితేజకు 
 'కిక్ ' ఇచ్చాడని ఆ వెంటనే  'ఊసరవెల్లి ', బాలకృష్ణకు 'సింహ' లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారని బోయపాటి శ్రీనుతో 'దమ్ము', ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను 'గబ్బర్‌సింగ్‌'గా చూపారని హరీశ్‌ శంకర్‌తో ఈ చిత్రం - ఇలా చేస్తున్నారు చిన్న ఎన్టీయార్. కానీ, వాటి వల్ల ఆయనకు దక్కిన ఒక్క హిట్టూ లేదు. 

ఆయన ఇప్పటికైనా హిట్‌ దర్శకుల వెంటపడడం మానేసి, ప్రతిభనూ, తనకున్న సానుకూల అంశాలనూ నమ్ముకొని, కొత్త కథలను ఆశ్రయిస్తే, కొత్త దర్శకులకు అవకాశమిస్తే బాగుంటుంది. లేదంటే, ప్రేక్షకుడి వంక చూస్తూ, 'హిట్‌ ఎప్పుడిస్తావయ్యా!' అని ఎదురుచూడడమే మిగులుతుంది!

కొసమెరుపు: సినిమా చూసి బయటకు వచ్చేస్తూ ఓ యువ ప్రేక్షకుడు, 'బాబోయ్! ఇది - మరో 'శక్తి' సినిమా! తెర నిండా హింసలో 'దమ్ము- పార్ట్‌ 2' అని వ్యాఖ్యానించారు. అలాగే, 'రామయ్యా వస్తావయ్యా... అయిపోయింది. ఇక, నెక్స్‌ ్ట 'ఎవడు'?' అని ముక్తాయించారు. 

- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 12 అక్టోబర్ 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.........................................................