సంగీత, నాట్య శిక్షణ అందించే ప్రాంగణం నర్తనశాలః ఈ సినిమా కథలో ప్రధాన వేదిక. ప్రధాన ఘట్టాలకు వేదిక కాబట్టే సినిమాకు అదే పేరు పెట్టారు. కళలకు నిలయమైన ఆ పేరుకు తగ్గట్లే, ఈ చిత్రం ఆల్‌టైమ్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. సముద్రాల సీనియర్ సాహిత్యం, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం, ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి. సుశీల, ఎస్. జానకి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగుళూరు లతల గానం ఈ చిత్ర గీతాలకు చిరంజీవిత్వం సంపాదించిపెట్టాయి. ఈ సినిమాలోని ప్రతి పాటా ఓ తీపి జ్ఞాపకం రేపే తేనెల ఊటే!
ఇంద్రలోకంలో అర్జునుణ్ణి చూస్తూ ఊర్వశి పాడే 'నరవరా ఓ కురువరా!...' పాట, అందులో ఎన్టీయార్, పద్మినీ ప్రియదర్శిని అభినయం ఎవరూ మర్చిపోలేరు. అలాగే, సైరంధ్రిగా కాలం అజ్ఞాతవాసం గడుపుతున్న ద్రౌపది (సావిత్రి) పరకాంత మోజులో పడ్డ కీచకుణ్ణి (ఎస్వీ రంగారావు) బుట్టలో వేసుకొని మట్టుపెట్టేందుకు పన్నాగం పన్నే సమయంలో వచ్చే 'దరికి రాబోకు రాబోకు రాజా...' నిత్యనూతన గీతం. ''నీకీ నాడే మంగళమౌరా...'' అంటూ అందులో వాడిన నర్మగర్భమైన పదాలు, వాటిని సంగీత వరుసకు తగ్గట్లు విరిచి, పాడించిన విధానం గుర్తుండిపోతుంది.
ఇక, 'సఖియా వివరించవే...', ఉత్తర - అభిమన్యు (ఎల్. విజయలక్ష్మి, శోభన్‌బాబు)లపై చిత్రీకరించిన శ్రీశ్రీ రచన 'ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే...' విన్న కొద్దీ వినాలనిపించే పాటలే.
విరాట రాజు కుమార్తె ఉత్తరకు బృహన్నల నృత్యం నేర్పే ఘట్టంలో వచ్చే 'సలలిత రాగ సుధారస సారం...'లో సంగీతం, సాహిత్యం, నాట్యం పోటీపడతాయి. బాలమురళి, బెంగుళూరు లత గాత్రంలో, ఎన్టీయార్, ఎల్. విజయలక్ష్మి మీద చిత్రీకరించిన ఈ నృత్య గీతం ఆల్‌టైమ్ హిట్.
దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తూ, సైరంధ్రి పాడే 'జననీ శివకామినీ...' పాట పి.సుశీల గొంతులో భక్తిభావనను కురిపిస్తుంది. గడచిన యాభై ఏళ్ళుగా తెలుగు నాట పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళలో మంగళ హారతి పాట అంటే అత్యధికులు ఈ పాటే పాడుతుండడం రికార్డులకెక్కని రికార్డు. ఇలా సంగీతం, సాహిత్యం, సాంకేతిక నైపుణ్యం, సలక్షణమైన అభినయం - వీటన్నిటి సమష్టి కృషి కాబట్టే 'నర్తనశాల' అయిదు పదుల ఏళ్ళ తరువాత కూడా ఇవాళ్టికీ జనం మదిలో చిరస్థాయిగా నిలిచింది.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం ' స్నేహ', 6 అక్టోబర్ 2013, పేజీ నం. 14లో ప్రచురితం)
...............................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment