జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 22, 2013

ఆలోచన రేపే నిజ జీవిత కథ - 'షాహిద్‌' (సినిమా సమీక్ష)


       ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో ఓ పక్క రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలతో పాటు, మరోపక్క భిన్నమైన కథలు, కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు వరుసగా వస్తున్నాయి. చిన్న బడ్జెట్‌లో, సహజత్వానికి దగ్గరగా రూపొందిస్తున్న ఈ నవీన ధోరణి చిత్రాలు ముందుగా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్నాయి. అక్కడ విమర్శకుల ప్రశంసలందుకొని గుర్తింపు తెచ్చుకున్న తరువాత, ఇక్కడ ఏదో ఒక ప్రసిద్ధ చిత్ర వ్యాపార సంస్థలు ముందుకొచ్చి, ఆ చిత్రాల మార్కెటింగ్‌లో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. అలా ఆ చిన్న చిత్రాలను కూడా విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్‌తో జనం ముందుకు తెస్తున్నాయి. 'షిప్‌ ఆఫ్‌ థెసియస్‌', 'లంచ్‌ బాక్స్‌' లాంటి ఇటీవలి చిత్రాలు కొన్ని అలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవే. అదే కోవలో అక్టోబర్‌ 18న దేశవ్యాప్తంగా విడుదల కానున్న హిందీ చిత్రం - 'షాహిద్‌'.  

పోలీసులు కేసు పెట్టినంత మాత్రాన, సదరు కేసులో కోర్టు తీర్పు రాక ముందే మీడియా చిలవలు పలవలు చేసినంత మాత్రాన ఎవరైనా తీవ్రవాది అయిపోతారా? దేశంలో జరుగుతున్న విద్రోహ కార్యకలాపాలన్నిటికీ ఒక వర్గం వారినే ఎందుకు తప్పుబడుతున్నారు? నమోదవుతున్న కేసుల్లో నిజంగా దోషులు ఎవరు? ఎందరు? మన చుట్టూ సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి మౌలికమైన ప్రశ్నలెన్నో మనకు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు మన మధ్యే బతికిన ఓ మనిషి జీవితాన్ని తీసుకొని, దాన్ని తెరకెక్కిస్తూ ఈ ప్రశ్నలపై అందరినీ ఆలోచింపజేసే ప్రయత్నమే - 'షాహిద్‌' చిత్రం.
 బొంబాయికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు, వృత్తి రీత్యా వకీలు అయిన షాహిద్‌ ఆజ్మీ (1977 - 2010) నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్ర కథను అల్లుకున్నారు. గుర్తు తెలియని దుండగుల చేతుల్లో తన కార్యాలయంలోనే కాల్పులకు గురై, 2010 ఫిబ్రవరి 11న ఆయన ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదంపై పోరాటం విషయంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ చివరకు క్రూరమైన పోలీసు రాజ్యంగా మారినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ పోరాడారాయన. నిరుపేదలు, కనీసం తమ మీద వచ్చిన కేసులపై పోరాటానికి డబ్బులిచ్చి వకీలును కూడా పెట్టుకోలేని కడుదీనులైన వందలాది ముస్లిమ్‌ల తరఫున ఆయన నిలిచారు. తీవ్రవాదులుగా ముద్ర పడిన పలువురు అమాయకుల పక్షాన వాదిస్తూ, ఏడేళ్ళలో 17 మందిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. చివరకు ఆ కృషిలోనే కేవలం 31 ఏళ్ళ వయస్సుకే ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ముంబరులో బాంబు పేలుళ్ళకూ, దాడులకూ పాల్పడిన దేశద్రోహులైన వ్యక్తుల పక్షాన ఆయన నిలిచారన్న అపవాదులూ వచ్చాయి. 

ఏమైనా, నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిందితులే తప్ప, దోషులు కాదనీ, అనుమానంతో ప్రతి ఒక్కరిపై అనవసరంగా తీవ్రవాదులనే ముద్ర వేయరాదనీ ప్రాథమికమైన సూత్రాలను పట్టుకొని నడిచిన ఉద్యమకారుడు ఆయన. ఈ 'షాహిద్‌' చిత్రం కూడా ఆయన జీవిత ఘట్టాలను ఒక్కొక్కటిగా తెర మీదకు తెచ్చింది. తేదీలు, జరిగిన సంఘటనల వివరాలను తెలిపే టైటిల్‌ కార్డులతో కథకు ఓ చారిత్రక సాధికారికతను అద్దే ప్రయత్నం చేసింది. కథానాయకుడు చిన్నప్పుడు తీవ్రవాదిగా మారడానికి ప్రయత్నించడం, ఆ తరువాత ఆ వలలో నుంచి బయటకు వచ్చేసినా కఠినమైన తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసులో ఇరుక్కోవడం, ఆ పైన మానవ హక్కుల పరిరక్షణ కోసం లాయర్‌గా ప్రయత్నించడం - ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఆయన జీవితాన్ని వీలైనంత వరకు నిజ జీవిత ఘటనల నుంచి తీసుకొని, అవసరాన్ని బట్టి కొంత కల్పన జోడించి, కాస్తంత నాటకీయంగా కూడా చూపారీ సినిమాలో!  
ఇప్పటికే ఈ చిత్రాన్ని 'టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - 2012' (టి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌. 2012)లో వరల్డ్‌ ప్రీమియర్‌గా వేశారు. అలాగే, న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో, చికాగో సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సెంటర్‌ పీస్‌గా ప్రదర్శించారు. అలాంటి పలు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపును అందుకున్న ఈ చిత్రం వెండితెరపై రెండు గంటల పైచిలుకు సాగే మంచి ప్రయత్నం. 'కై పో చే' చిత్రం ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న రాజ్‌ కుమార్‌ యాదవ్‌ ఈ చిత్రంలోని టైటిల్‌ రోల్‌ను చక్కగా పోషించారు. అలాగే, అతను ఇష్టపడి, పెళ్ళాడిన మరియమ్‌ పాత్రలో ప్రబ్లీన్‌ సంధ్య, అతని తల్లిగా బల్జీందర్‌ కౌర్‌, ప్రాసిక్యూషన్‌ లాయర్‌గా విపిన్‌ శర్మ - ఆ యా పాత్రలను వీలైనంత సహజత్వంతో తెరపై పండించారు.

పాటలు, నృత్యాల లాంటి రొటీన్‌ సినిమాటిక్‌ హంగామాలేవీ లేని ఈ చిత్రం సందర్భోచితమైన నేపథ్య సంగీతంతోనే ఆద్యంతం నడుస్తుంది. రొటీన్‌గా సాగే మెలోడ్రమాటిక్‌ కోర్టు సన్నివేశాలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు సహజమైన కోర్టు వాతావరణం, డైలాగులతో సహజత్వాన్ని పరిచయం చేస్తుంది. ప్రథమార్ధం వరకు కొంత డాక్యుమెంటరీ శైలిలో నిదానంగా నడిచినా, ద్వితీయార్ధానికి వచ్చే సరికి సినిమా వేగం అందుకుంది. భార్యాభర్తల పాత్రల మధ్య మానసిక సంఘర్షణ, కోర్టులో వాదోపవాదాలు, కథానాయకుడి కోసం దుండగుల అన్వేషణ లాంటి దృశ్యాలు, వాటిని కెమేరాలో చిత్రీకరించిన విధానం చిత్రంలో భావోద్వేగాన్ని పెంచాయి. 
అక్కడక్కడా కొంత సినీ నాటకీయతను సంతరించుకున్నా, ఆసక్తిని పెంచి, సినిమాను నలుగురూ మెచ్చేలా చేశాయి. రచనతో పాటు, ఛాయాగ్రహణం, కూర్పు లాంటి సాంకేతిక శాఖల పనితనం సినిమాలో కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో 'పాన్‌సింగ్‌ తోమార్‌', 'భాగ్‌ మిల్ఖా భాగ్‌' లాంటి జీవిత కథా చిత్రాలను తీస్తూ, ఆకర్షిస్తున్న హిందీ చిత్రసీమ దానికి కొనసాగింపుగా 'బయో పిక్స్‌' కోవలో తీసిన తాజా సినిమా ఇది.

'స్పాట్‌ బారు' అనే విభాగం కింద విలక్షణమైన, చిన్న బడ్జెట్‌ కథా చిత్రాలను అందిస్తున్న 'యు' టి.వి. సంస్థ అదే విభాగంలో ఈ 'షాహిద్‌'ను అందించింది. అయితే, ఇప్పటికే ఆ విభాగం కింద 'యు' టి.వి. అందించిన గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా అంత గొప్పగా అనిపించదు. సినిమా వ్యాకరణానికి కొద్దిగా భిన్నంగా, 'సోనీ' టీవీలోని ప్రసిద్ధ టీవీ షో 'పోలీస్‌ పాట్రోల్‌' తరహాలో, సీరియల్‌ నిర్మాణ వ్యాకరణంతో నడుస్తుంది. చిన్నప్పుడే మతఘర్షణల్ని చూసిన హీరో తీవ్రవాదం వైపు ఆకర్షితుడు కావడానికి కానీ, ఆ వల నుంచి బయటపడడానికి కానీ నమ్మదగిన సరైన కారణాలను తెరపై చూపించలేదు. పైగా, ప్రధానంగా కథానాయకుడి దృష్టి కోణం నుంచే కథ నడవడంతో, ప్రతి వాస్తవానికీ ఉండే మిగిలిన కోణాలను చూపెట్టలేకపోయింది. 

ఏమైనా, 'షాహిద్‌' ఓ అద్భుతమైన సినిమా కాకపోవచ్చు కానీ, ఓ అందమైన ప్రయత్నం. చుట్టూ ఉన్న సమాజంలో మన మధ్య తిరిగిన ఓ మామూలు మనిషి జీవితానికి సెల్యులాయిడ్‌ చిత్రీకరణగా ఆలోచింపజేసే సత్ప్రయత్నం. ప్రతి ముస్లిమ్‌నూ తీవ్రవాదిగా చూసే చాలామంది ఆలోచనా ధోరణిలోని అపసవ్యతను ఎండగట్టే సెల్యులాయిడ్‌ ప్రయత్నం. రొడ్డకొట్టుడు కమర్షియల్‌ చిత్రాల కలకలానికి దూరంగా, మనసుంటే మంచి సినిమాలు ఎలా తీయవచ్చన్న దానికి కళ్ళెదుట నిదర్శనం. 

కొసమెరుపు: వరుసగా అయిదారు ఫ్లాపులిచ్చిన దర్శకుడు హన్సల్‌ మెహతా ఆ అపజయాల్ని లెక్కచేయకుండా ఇలాంటి కథను ఎంచుకోవడం గొప్పే! అతనన్ని ఫ్లాపుల్లో ఉన్నా సరే, ఈ కథనూ, అతని దర్శకత్వాన్నీ ప్రోత్సహించడం హిందీ చిత్రసీమ ఘనత. మరి, పదుల కోట్ల ఖర్చుతో రొటీన్‌ చిత్రాలు తీసే మన నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఇలాంటివి చూసైనా ఏమైనా కొద్దిగా నేర్చుకుంటారంటారా?
రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 17 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................................

0 వ్యాఖ్యలు: