జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 10, 2013

దిగ్భ్రాంతిలో తెలుగు చిత్ర సీమ


    నటుడు శ్రీహరి ఆకస్మిక మరణం తెలుగు చలన చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ పలువురు నటులు, దర్శక, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. దర్శక సంఘంతో సహా అనేక సంఘాలు శ్రీహరి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపాయి. నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లతో సహా పలువురు ఈ ఆకస్మిక సంఘటన పట్ల దిగ్భ్రాంతినీ, విచారాన్నీ ప్రకటించారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక, శ్రీహరి భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంటుందని సినీ వర్గాలు తెలిపాయి. 

పరిశ్రమకు ఆస్తిలాంటివాడు: చిరంజీవి
''శ్రీహరి మా కుటుంబానికి ఎంతో ఆప్తుడు. నాకు సోదర సమానుడు. మా ఇద్దరి మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వస్తే.. శ్రీహరి నాతోనే ఉండేవారు. మా కాంబినేషన్‌లో 'ముఠామేస్త్రీ, బావగారు బాగున్నారా..' మొదలైన ఎన్నో చిత్రాలు వచ్చాయి. తొలుత చిన్న చిన్న పాత్రలు వేసినా... తన స్వయం ప్రతిభతో తెలుగు చిత్రసీమలో ఒక ప్రముఖ స్థానాన్ని శ్రీహరి సంపాదించుకోగలిగాడు. అతని ప్రతిభకు అద్దంపట్టే చిత్రాలు ఎన్నో ఉన్నాయి. నా తరువాత మా అబ్బాయి రామ్‌చరణ్‌తో 'మగధీర'లో, ఇటీవల విడుదలైన 'తుఫాన్‌'లో శ్రీహరి తన ప్రతిభా పాటవాలతో అందరి మన్ననలను పొందారు. ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తున్న శ్రీహరి తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్తి లాంటివాడు. అలాంటి విలక్షణ నటుడి అకాల మృతి.. తెలుగు చిత్రరంగానికి తీరని లోటు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా.''

గుండె మెలిపెడుతోంది: హీరో జూనియర్‌ ఎన్టీయార్‌
''రియల్‌ స్టార్‌ శ్రీహరి గారి మరణం చిత్రసీమకే కాదు... వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో తీరని లోటు. ఆయన హఠాన్మరణం నన్ను వ్యక్తిగతంగా ఎంతగానో కలచివేసింది. 'బృందావనం' లాంటి చిత్రాల్లో ఆయనతో కలసి నటించిన సంగతులు నాకు ఇప్పటికీ మనసులో మెదులుతున్నాయి. అలాంటి ఆత్మీయుడు ఇక లేరు అన్న విషయం గుండెను మెలిపెడుతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ, ఆయన కుటుంబానికి ఆత్మస్థయిర్యం చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.'' 

కోలుకుంటాడనుకున్నా: నటుడు కోటశ్రీనివాసరావు
''చెన్నైలో షూటింగ్‌లో ఉన్నాను. ఇంతలో శ్రీహరి చనిపోయారన్న వార్త తెలిసింది. ఆశ్చర్యానికి గురయ్యాను. ఆరోగ్యం బాగా లేదని విన్నాను. అయితే, త్వరగా కోలుకుంటాడని అనుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మంచి మనిషిని కోల్పోయాను. ఆయనకు అకాలమరణం రావడం దురదృష్టకరం.''

మంచి వ్యక్తిత్వం ఆయనది: రచయితలు పరుచూరి బ్రదర్స్‌
''శ్రీహరి హీరో కాక మునుపే మేము రచన చేసిన 'ధర్మక్షేత్రం'లో విలన్‌గా నటించాడు. ఆ తర్వాత వరుసగా మేం రాసిన చిత్రాలైన 'ప్రేమించుకుందాం రా', 'ప్రేమంటే ఇదేరా', 'కలిసుందాంరా' చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలను పోషించారు. ఆ పాత్రలే ఆయనను ఓ ఇమేజ్‌తో హీరోగా మార్చేశాయి. అవి అత్యద్భుతమైన పాత్రలు. విలన్‌ కాకపోయినా... భయపెట్టేపాత్రలవి. వాటిని చక్కగా పోషించాడు. అతను వ్యక్తిగతంగా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశాడు. యాభై లోపే ఆయన అనారోగ్యంతోనే చనిపోవడం బాధ కలిగించింది. ఆమె భార్య శాంతి కూడా సినిమా కుటుంబానికి చెందినదే. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం.''

మంచి మిత్రుణ్ణి కోల్పోయా: నటుడు, నిర్మాత డాక్టర్‌ మాదాల రవి
''శ్రీహరి మరణవార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మంచి మిత్రుడు. గొప్ప నటుడు. చాలా కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎక్కినవాడు. అందరితో కలివిడిగా ఉండేవాడు. సినిమారంగంలోకి రాకముందే అతనితో నాకు పరిచయం. మంచి స్నేహం ఉండేది. మా మామ గారైన మహేంద్ర గారు నిర్మించిన చిత్రాలైన 'పోలీస్‌', 'దేవా'లతోనే హీరోగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి అతనితో మంచి స్నేహముంది. ఆయన ఆరోగ్యం గురించి తెలిసిందే. అనుకోకుండా లివర్‌ సంబంధమైన వ్యాధితో రెండేళ్ళుగా బాధపడుతున్నారు. అవసరమైన చికిత్సను నాగార్జున గాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ దగ్గర తీసుకున్నారు. సంపూర్ణ ఆర్యోగం కలిగే దాకా షూటింగ్‌లకు వెళ్ళకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అప్పట్లోనే సూచించాం. 'లివర్‌ సిరోసిస్‌' వల్ల రక్తస్రావం జరుగుతుంది. ఫైట్స్‌ చేయడం వల్ల బ్లీడింగ్‌ అవుతుండేది .రెండుసార్లు ఇలా జరిగితే ఇది ప్రమాదమని హెచ్చరించాం. సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్‌మెంట్‌ చేశాం. దానికి త గిన విధంగా జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. ముంబరులో షూటింగ్‌కు వెళ్ళారని తెలిసింది. అక్కడ ఇలాంటి దుర్ఘటన జరగడం బాధ కలిగించింది. ఓ మంచి మిత్రుణ్ణి కోల్పోయాను.''

దర్శకుల సంఘం సంతాపం
నటుడు శ్రీహరి మృతిపట్ల తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మరణం ఎందరో దర్శకులకు తీరని మనోవేదనకు గురిచేసిందని దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్‌, ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలో విడుదలకానున్న తమ చిత్రం 'శివకేశవ్‌'లో ఆయన నటన అద్భుతమని చిత్ర నిర్మాత నాగరాజు పేర్కొంటూ... వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ఫిలింఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, ఫైటర్స్‌ అసోసియేషన్‌తోపాటు ఇతర శాఖలకు చెందినవారంతా శ్రీహరి మృతికి సంతాపాన్ని ప్రకటించారు. 
(ప్రజాశక్తి దినపత్రిక, 10 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
...........................................

0 వ్యాఖ్యలు: