జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 10, 2013

శ్రీహరికి ఈ సంగతి ముందే తెలుసా?



      స్వతహాగా జిమ్నాస్ట్‌, బాడీ బిల్డర్‌ కావడంతో ఆరోగ్యవిషయంలో శ్రీహరి తగు జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన ఇంటిలోనే ప్రత్యేకమైన జిమ్‌ ఉండేది. అయితే, ఆయన మద్యపానం, పాన్‌పరాగ్‌ లాంటి అలవాట్లను మానుకోలేకపోయారు. 'బావా' అంటూ ఆప్యాయంగా భర్తను పిలిచే శాంతి, ఆహార, ఆరోగ్య విషయాల్లో ఆయన బాగోగులను దగ్గరుండి చూసుకొనేవారు. ముంబరులో ఈ దుర్ఘటన సమయంలోనూ భార్య శాంతి ఆయన వెన్నంటే ఉన్నారు. 

నిజానికి, శ్రీహరి తాను నటుడిగా రిటైర్‌ అవుతానన్నట్లు నెలన్నర క్రితం ఆగస్టు 15న తన పుట్టినరోజు నాడు ప్రకటించారు. అంటే ముందుగానే ఆయనకు తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ కొత్త దర్శకునితో 'బలశాలి' అనే చిత్రం చేయనున్నట్లు ప్రకటించి, ఆ వెంటనే... 'నేను బలహీనంగా ఉండడంతో ఈ టైటిల్‌కు సరిపోనా?' అంటూ తనకు తానే పేర్కొన్నారు. 

అలాగే, ఇటీవల ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ, ''ఇప్పటివరకు చాలా పాత్రలు పోషించాను. నటుడిగా తృప్తి కల్గింది. నేను హీరోగా చేస్తున్నానంటే.. వందమందికి పని దొరుకుతుంది. ఆ కుటుంబాలు బాగుపడతాయి. అందుకే నటిస్తూ వచ్చాను'' అని చెప్పారు. అలా ఎంతోమందికి పని కల్పించి, కష్టాల్లో ఉన్న దర్శక, నిర్మాతలెందరికో అండగా నిలిచిన శ్రీహరి హఠాత్తుగా మరణించి, ఎందరినో అమితమైన దు:ఖంలో ముంచేశారు.
(ప్రజాశక్తి దినపత్రిక, 10 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
...........................................

2 వ్యాఖ్యలు:

Unknown said...

శ్రీహరికి తాను చనిపోతానని ముందే తెలుసు!మద్యపానం,పాన్ పరాగ్ మానేసేటట్లు అతని భార్య శాంతి కూడా చేయలేకపోయింది!మహా బలశాలి కాలేయం అతని మద్యపాన బానిసత్వానికి ఆహుతి ఐపోయింది!ఇంకొక ఇరవై ఏళ్ళు బతికుంటే ఎందరెందరు ఆర్థులకో ఆర్ధిక సహాయం చేసి ఆదుకునేవాడు!

సుజాత వేల్పూరి said...

సిగరెట్లు, మద్యపానం లాంటి అలవాట్లు కాకుండానే ఉండాలి గానీ , ఒకసారి పట్టుకున్నాక మానిపించడం భార్యకు కాదు కదా బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. మానాలనే తపన ఆ వ్యక్తికి ఉండి, తనంతట తాను ప్రయత్నిస్తే ఏదైనా ఫలితం ఉంటుందేమో

ఇవన్నీ గ్రహించేసరికి జీవిత కాలం లేటు కూడా కావొచ్చు! ఇప్పుడు శ్రీహరి విషయంలో అదే జరిగింది ! ప్చ్..ఎంత మంచి నటుడు, ఎంత త్వరగా చావు !!!!