గడచిన పదేళ్ళ కెరీర్‌లో 'డీ' అనే సూపర్ హిట్టు, 'దేనికైనా రెడీ' అనే మరో సక్సెస్‌లు మాత్రమే సాధించిన హీరో మంచు విష్ణువర్ధన్ బాబు. గత ఏడాది రిలీజైన 'దేనికైనా రెడీ' విజయవంతమైనా, ఆ చిత్రాన్ని బోలెడన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఆ వివాదాస్పద విజయం తరువాత విష్ణు చేసిన మరో ప్రయత్నం ఈ 'దూసుకెళ్తా'. వినోదం నిండిన ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆయన తండ్రి మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, వినోదం పంచాల్సిన ఈ చిత్రం ఆ లక్ష్యాన్ని సాధించకపోవడమే వింత!
.............................................................
చిత్రం - దూసుకెళ్తా, తారాగణం - మంచు విష్ణు, లావణ్యా త్రిపాఠీ, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, మాస్టర్ భరత్, నాగినీడు, సంగీతం - మణిశర్మ, పాటలు - రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, స్క్రీన్ ప్లే - వీరు పోట్ల, గోపి మోహన్, కెమేరా - సర్వేష్ మురారి, కూర్పు - మార్తాండ్ కె. వెంకటేశ్, నిర్మాత - ఎం. మోహన్ బాబు, కథ, మాటలు, దర్శకత్వం - వీరు పోట్ల
............................................................
కథా రచయితగా 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!' లాంటి చిత్రాల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి - వీరు పోట్ల. ఆ విజయాల తరువాత దర్శకుడిగా మారిన వీరు ఇప్పటికే 'బిందాస్' అనే హిట్, 'రగడ' అనే యావరేజ్ చిత్రాలు చేశారు. కొద్దికాలం విరామం తరువాత, మునుపటి గ్రాఫ్‌లో నుంచి పైకి ఎదిగేందుకు రాసుకొన్న కథ, తీసిన సినిమా 'దూసుకెళ్తా'. సర్వసాధారణంగా తన సినిమాల్లో అనుసరించిన పద్ధతిలోనే ఇందులోనూ ఆయన చిన్న పిల్లల కథతో మొదలుపెట్టి, ఆ చిన్న పిల్లలే పెద్దయ్యాక కథానాయకుడు, కథానాయిక- అంటూ అలవాటైన రీతిలో కథ నడిపారు.
తిరుపతి దగ్గర ఓ పల్లెటూళ్ళో పలుకుబడి, ఆస్తిపాస్తులున్నఓ కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద పిచ్చేశ్వరరావు (కోట శ్రీనివాసరావు). ఆ ఇంటి వారసుడు (రావు రమేశ్) ఓ కులాంతర వివాహం చేసుకుంటాడు. చిన్ని (బేబీ యానీ) అనే ఓ కూతురినీ కంటాడు. ఆ ఊళ్ళోని మరో ఇంటి అబ్బాయి చిన్నా. ఆ పిల్లలిద్దరికీ స్నేహం. ఇంతలో చిన్నినీ, ఆమె తల్లినీ ఇంట్లో నుంచి పంపేస్తారు. మరో సంఘటనతో చిన్నా కుటుంబం కూడా ఆ ఊరి నుంచి పరారై పోవాల్సి వస్తుంది. పెరిగి పెద్దయిన చిన్నాయే చిత్ర కథానాయకుడు (మంచు విష్ణు). అలాగే, ఊళ్ళో నుంచి వెళ్ళిపోయిన చిన్ని కాస్తా చదువుకొని డాక్టర్ అలేఖ్య ('అందాల రాక్షసి' ఫేమ్ లావణ్యా త్రిపాఠీ) అవుతుంది.
వాళ్ళిద్దరూ అనుకోకుండా కలుస్తారు. ఆమెను ప్రేమించిన హీరో, ఆ క్రమంలో ఆమెను చంపడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాడు. ఆమెను చంపాలనుకుంటున్నది సాక్షాత్తూ ఆమె తాత తరఫు బంధువులేనని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయిని తీసుకొని, ఆ ఊరే వెళ్ళి వాళ్ళను ఎలా మార్చాడన్నది మిగతా కథ. ఆస్తులు, అంతస్థులు ఎన్ని ఉన్నా, మనుషులకు కావాల్సింది మంచితనం, అనుబంధం, ఆప్యాయత అని సినిమా చివరాఖరుకు సందేశం ఇస్తుంది.
మొదలైన కాసేపు బాగానే ఉందనిపించే ఈ చిత్రం క్రమంగా పట్టు సడలిపోతుంది. కథ హైదరాబాద్ నుంచి పల్లెటూరికి మారాక కనీసం ద్వితీయార్ధమైనా బాగుంటుందేమో అనిపించినా, ఆ తరువాత ఆ ఆశా సన్నగిల్లుతుంది. హీరోనూ, అతని కుటుంబాన్నీ వెతుకుతూ, ఓ రాజకీయ నేత పాద యాత్రలు జరపడం లాంటి అర్థం పర్థం లేని సీన్లతో ఈ సినిమా ఓ నిర్దిష్టమైన రీతిలో నడవదు. అసలు కథలో బోలడెన్ని పిల్ల కథలు, పిట్టకథలు, సన్నివేశాలు వచ్చి వెళుతుంటాయి. అందులో ప్రభావశీలంగా ఉన్నవి తక్కువ. ఇంకా చెప్పాలంటే, అసలు కథకు పెద్దగా పనికొచ్చేవి అంత కన్నా తక్కువ.
సినిమాలో పిల్లల కథ వస్తుంది. ఆ తరువాత హీరోను ఓ టీవీ చానల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అన్నట్లు కాసేపు చూపించారు. ఆ వెంటనే అతనేదో ప్రేమ కోసం అమ్మాయి వెంట పడుతున్నాడన్నారు. యాక్సిడెంటైన తనను కాపాడిన ఆ అమ్మాయిని తాను కాపాడుతున్నాడని చూపారు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రియుణ్ణీ కలపాలని చూశాడంటారు. సెకండాఫ్‌కు వచ్చేసరికి, అదే హీరో ఆ అమ్మాయినీ, ఆమె కుటుంబాన్నీ కలపడానికి చూశాడన్నారు. వెరసి, ఎప్పటికప్పుడు హీరో పాత్ర లక్ష్యం, లక్షణం మారిపోతూ ఉంటుంది. దీంతో, కథ ఇష్టారాజ్యంగా అటూ ఇటూ వంకర టింకరలు తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.
ఇక, ఊళ్ళోని పొలాలతో సహా, ఆస్తి అంతా తాత (నాగినీడు) తన మనుమరాలైన కథానాయిక పేరు మీద రాస్తాడు. కాబట్టి, ఆమెను చంపడానికి విలన్లు ప్రయత్నించారని చూపుతారు. ఆ చంపడం వల్ల ఆ పొలాలు, ఆస్తి వాళ్ళ పేరు మీదకు రావు కదా! ఇవన్నీ ఇలా ఉంటే, పచ్చి విలన్ అయిన కోట శ్రీనివాసరావు సెకండాఫ్‌లో అలా మారిపోవడం కానీ, అతని కొడుకైన మంత్రి ఢిల్లీశ్వర్ (కొత్త నటుడు పంకజ్ త్రిపాఠీ) లాంటి పాత్రల్లో పరివర్తన కానీ ఎక్కడా కన్విన్సింగ్‌గా అనిపించదు.
ప్రేక్షకులు ఈ సినిమాలో ఏ పాత్ర ఎవరికి తల్లో, తండ్రో, బాబాయో చెప్పగలిగితే, వాళ్ళకు కచ్చితంగా బహుమతులు ఇవ్వవచ్చు. తెర నిండా అన్ని పాత్రలు, అంతమంది పాత్రధారులు ఉన్నారు. కానీ, ఆ పాత్రలన్నీ ఆ యా సీన్లను ఫరవాలేదనిపించినవే తప్ప, సినిమాను పండించినవి కావు. ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం, ముగించిన తీరు కూడా అంతంత మాత్రమే!
పదేళ్ళ తరువాత కూడా ఇప్పటికీ అభినయం, డైలాగ్ డెలివరీ మెరుగుపరుచుకోవాల్సిన స్థితిలోనే ఉన్న మంచు విష్ణు ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్ల విషయంలో బాగా శ్రమించారు. అది తెరపై కనిపిస్తుంది. ఇక, అందం, అభినయం రెండూ లేని హీరోయిన్‌తో సినిమాకు ఒరిగిందేమీ లేదు. భార్యా బిడ్డల్ని పోగొట్టుకొని తాగుబోతుగా మారిన పాత్రలో రావు రమేశ్ కొత్తగా కనిపిస్తారు. కోట శ్రీనివాసరావు తదితరులు తమకు అలవాటైన రీతిలో నటించి, పాత్రల్ని పోషించేశారు. ఇక, సినిమాలో బ్రహ్మానందం, ఆలీ, 'వెన్నెల' కిశోర్ , రఘుబాబు, మాస్టర్ భరత్ - ఇలా చాలామంది వినోదం పండించడానికి ఉన్నా, తెరపై పండిన వినోదం మటుకు తక్కువే!
సినిమాకు రవితేజతో వాయిస్ ఓవర్ చెప్పించడం, టైటిల్ సాంగ్‌లోని సాకీలో మంచు లక్ష్మీ ప్రసన్నతో గెస్ట్ అప్పీయరెన్స్ వేయించడం లాంటివన్నీ సినిమాకు అవసరం లేకపోయినా, అద్దుకున్న అదనపు హంగులు. మొదలైన వాయిస్ ఓవర్ కూడా అర్ధంతరంగానే ముగిసిపోవడంతో ఆశించిన ప్రయోజనం కూడా సిద్ధించ లేదు. టైటిల్ సాంగ్‌తో పాటు మరొక్కటి మినహా మిగిలిన పాటలేవీ గుర్తుండని ఈ చిత్రంలో ఉన్నంతలో చెప్పుకోదగ్గవి - ఛాయాగ్రహణం, థాయిలాండ్‌కు చెందిన ఫైట్ మాస్టర్ కిచ లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన ఫైట్లు లాంటి ఒకటి రెండు మాత్రమే.
మొత్తం మీద, టైటిల్‌లో ఉన్న వాడి వేడి సినిమాలో, అందులోనూ ప్రత్యేకించి కథనంలో అసలే లేవు. హిందీ చిత్రం 'తేజాబ్' ను తెలుగు తెరపై 'వర్షం' చిత్రకథగా, కాజల్ - సల్మాన్ ఖాన్ నటించిన మరో హిందీ చిత్రాన్ని తెలుగు తెరకు కావాల్సినట్లు మలుచుకొని 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రకథగా అందించిన వీరు పోట్ల దర్శకుడిగా మారినా రాతకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లున్నారు. కానీ, మదగజం లాంటి మహారచయితకు కూడా అంకుశం లాంటి నిర్మాతలు లేకపోతే, సీన్లు ఎంతగా పెరిగిపోతాయో తెలుసుకోవడానికి ఈ సినిమాయే నిదర్శనం.
మొత్తం మీద, టైటిల్‌లో ఉన్న వాడి వేడి సినిమాలో, అందులోనూ ప్రత్యేకించి కథనంలో అసలే లేవు. హిందీ చిత్రం 'తేజాబ్' ను తెలుగు తెరపై 'వర్షం' చిత్రకథగా, కాజల్ - సల్మాన్ ఖాన్ నటించిన మరో హిందీ చిత్రాన్ని తెలుగు తెరకు కావాల్సినట్లు మలుచుకొని 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రకథగా అందించిన వీరు పోట్ల దర్శకుడిగా మారినా రాతకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లున్నారు. కానీ, మదగజం లాంటి మహారచయితకు కూడా అంకుశం లాంటి నిర్మాతలు లేకపోతే, సీన్లు ఎంతగా పెరిగిపోతాయో తెలుసుకోవడానికి ఈ సినిమాయే నిదర్శనం.
అందుకే, కథలో కానీ, కథనంలో కానీ పట్టు లేకుండా సీన్ల వెంట సీన్లుగా సినిమా ఏకంగా రెండుగంటల నలభై నిమిషాల పైచిలుకు నడుస్తుంది. ఇప్పటికే చూసేసిన అనేక సినిమాలు, సన్నివేశాలతో విసుగనిపిస్తుంది. ఏమైనా, ఇటీవల తెలుగులో దర్శకులుగా మారిన రచయితలందరూ దాదాపుగా ఒకటే రకమైన కథలతో, ఎప్పుడూ వైవిధ్య రహితంగా సినిమాలు తీయడం విచిత్రం. అలాంటి వాటిలో ఒకటిగా 'దూసుకెళ్తా' మిగిలిపోయింది.
కొసమెరుపు: హాలులో నుంచి బయటకు వస్తూ, ఓ సాఫ్ట్‌వేర్ కుర్రాడు తన స్నేహితుడితో ఫోన్‌లో - ''వచ్చేటప్పుడు 'దూసుకెళ్తా' అని వచ్చినా, తీరా సినిమా అయ్యాక మాత్రం ఎవరైనా 'మోసుకెళ్ళా'ల్సిందే!'' అనడం వినిపించింది. అంటే, సినిమా దూసుకెళ్ళింది అక్షరాలా హాలుకొచ్చిన ప్రేక్షకుల మీద నుంచా!? -
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 18 అక్టోబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 8లో ప్రచురితం)
..............................................................
1 వ్యాఖ్యలు:
దూసుకెళ్తా అపజయం పొందితే దర్శకుడంటాడు ఇక మూసుకెళ్తా అని!
Post a Comment