జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 1, 2013

కన్నడ సినీ ప్రముఖులకు సత్కారం - ప్రేక్షకులు లేక బోసిపోయిన ప్రాంగణం



దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఎస్‌.ఐ. ఎఫ్‌. సి.సి), తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న నూరేళ్ళ భారతీయ సినిమా వేడుకల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం కన్నడ సినిమా వేడుకలు జరిగాయి. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌లోని వేదికపై జరిగిన ఈ కార్యక్రమంలో కన్నడ సినీ సీమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సుదీర్ఘ కాలంగా కన్నడ సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న పలువురు సినిమా వారిని సత్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ, నృత్య దర్శకుడు సుందరం మాస్టర్‌, గాయకుడు రాజన్‌ కృష్ణన్‌, గాయని డి.కె. సుమిత్ర, కెమేరామన్‌ బి.ఎస్‌. బసవరాజు, లైట్‌మన్‌ స్థాయి నుంచి కెమేరామన్‌గా ఎదిగిన జె. కృష్ణ, సౌండ్‌ ఇంజనీర్‌ ఎన్‌. ఆర్ముగం, మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎన్‌.ఎస్‌. కేశవ తదితరులు సన్మానాలను అందుకున్నవారిలో ఉన్నారు.
ఎన్‌.టి.ఆర్‌, ఏ.ఎన్‌.ఆర్‌, ఎం.జి.ఆర్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌ - ఇలా నాలుగు ప్రాంతీయ భాషల్లోనూ ప్రముఖ హీరోలకు డూప్‌గా నటించిన ప్రముఖ ఫైట్‌మాస్టర్‌ నంజుండ నాగరాజును ఈ కార్యక్రమంలో సత్కరించడం విశేషం. ఆద్యంతం ప్రధానంగా కన్నడ భాషలోనే మాటలు, ప్రసంగాలు జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రంగం నుంచి హాజరు అంతంత మాత్రంగానే ఉండడం గమనార ్హం. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినవారి కన్నా స్థానికంగా ఉన్న కన్నడిగులు, హౌటల్‌ వ్యాపారంలో ఉన్నవారు ఎక్కువగా హాజరైనట్లు సమాచారం. ఇక, మొదటి రోజు సాయంత్రం ప్రారంభోత్సవానికి ఉన్న హడావిడి ఈ కార్యక్రమానికి కనిపించలేదు. ప్రేక్షకులు తక్కువ సంఖ్యలో హాజరవడంతో, గ్యాలరీలు జనం లేక వెలవెలబోయాయి.
అయితే, కన్నడ హీరో రమేశ్‌ అరవింద్‌తో సహా పలువురు కన్నడ తారలు తమ భాషా చిత్రాల్లోని ప్రసిద్ధ సినీ గీతాలకు వేదికపై నర్తించారు. అలాగే, కన్నడంలో కొన్ని హాస్య కదంబాలను కూడా ప్రదర్శించారు. తెలుగు, కన్నడాల్లో ప్రసిద్ధురాలైన నటి జయంతితో పాటు, కన్నడనాట కూడా సినిమాలతో అనుబంధమున్న తమిళ సినీ ప్రముఖులు దర్శకుడు పి. వాసు, హీరో కమలహాసన్‌, దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌లు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు.
- రెంటాల జయదేవ
................................................

0 వ్యాఖ్యలు: